టెక్కలి

టెక్కలి

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి 1816 నుంచి 1832 వరకు పర్లాకిమిడి రాజు గణపతి పద్మనాభ దేవ్‌ ఏలుబడిలో ఉంది. ఆయన కుమారులు టెక్కలి సంస్థానాన్ని రెండుగా విభజించి టెక్కలి ఎస్టేట్‌ను గోవింద నాథ్‌ దేవ్‌, నందిగాం ఎస్టేట్‌ను కృష్ణ చంద్ర దేవ్‌ పంచుకున్నారు. గోవింద నాథ్‌ దేవ్‌ పర్లాకిమిడి వంశీయులతో తన కుమార్తె పట్టుమహాదేవి వివాహం జరిపించినప్పుడు పసుపు కుంకుమల కింద ఈ గ్రామాన్ని ధారాదత్తం చేశారు. ఒడియాలో ‘టిక్లి’ అంటే పసుపుకుంకుమ బుట్ట అని అర్థం. ఆ ‘టిక్లి’ కాలక్రమంలో ‘టెక్కలి’గా మారింది. పాత రికార్డులను పరిశీలిస్తే గతంలో దీని పేరు ‘రఘునాథపురం’ అని తెలుస్తోంది. గోవింద నాథ్‌ దేవ్‌ తన కుమార్తె పేరు మీద తవ్వించిన పట్టుమహాదేవి కోనేరు నేటికీ ఇక్కడి ప్రజలకు ఉపయోగపడుతోంది. ఒకప్పుడు ఉత్కళ రాజులు పాలించిన ఈ ప్రాంతంలో తెలుగు, ఒడియా ప్రజలు కలసి మెలసి జీవించారు. ఇక్కడి జగన్నాథ స్వామి ఆలయంలోని విగ్రహాలు పూరీలోని విగ్రహాల కన్నా పెద్దవి.

- పి.ఎ.పంతులు, టెక్కలి