ఉదయగిరి

ఉదయగిరి

నెల్లూరు జిల్లా కేంద్రానికి ఉత్తరాన వంద కి.మీ దూరంలో ఉంటుంది ఉదయగిరి పట్టణం. పొద్దుపొద్దునే భానుడి లేత కిరణాలు ఇక్కడి గిరి శిఖరాన శిలలపై పడి బంగారం వర్ణంలో మెరుస్తుండటంతో దీనికి ‘ఉదయగిరి’ అనే పేరొచ్చిందని చెబుతారు. సముద్ర మట్టానికి 1025 మీటర్ల ఎత్తుండే ఈ కొండ మీద కోట ఉంటుంది. ఉదయగిరి దుర్గాన్ని పల్లవులు, చోళులు, కాకతీయులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, ఆంగ్లేయులు పాలించారు. శ్రీకృష్ణదేవరా యలు కళింగ దండయాత్రను 1513లో ఉదయగిరి దుర్గం ముట్టడితో మొదలు పెట్టాడు. అప్పుడిది గజపతుల అధీనంలో ఉంది. శత్రుదుర్భేద్యమైన ఈ కోటను వశపర్చుకునేందుకు రాయలుకు 18 నెలలు పట్టింది. ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలు ఇది వారి ఏలుబడిలో ఉంది. రాయల కాలంలో కట్టించిన శ్రీరంగనాయక స్వామి, కృష్ణాలయాలు, కల్యాణ మండపం నేటికీ అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారుతుంటాయి. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం ఉదయగిరి నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. 

 - షేక్‌ మహమ్మద్‌ ఖాజ, ఉదయగిరి