రాయచోటి

రాయచోటి

వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ఓ మండల కేంద్రం రాయచోటి. క్రీ.శ.8వ శతాబ్దం నాటి వీరభద్రాలయం ఇక్కడ చాలా ప్రసిద్ధి పొందింది. రాజరాజ చోళుడు, కాకతీయ గణపతిదేవుడు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఎందరో రాజులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామికి వీరఖడ్గాలు సమర్పించారట. అందుకే ఇక్కడి వీరభద్రుడు రాచరాయునిగా వినుతికెక్కాడు. ఈ స్వామి కొలువై ఉన్న ప్రాంతం కాబట్టి దీన్ని రాచవీడుగా పిలిచేవారు. కాలక్రమంలో ఈ రాచవీడు ‘రాయచోటి’గా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ రాయచోటి చుట్టుపక్కల పల్లె ప్రజలు దీన్ని ‘రాసీడు’ అని, కర్ణాటక భక్తులు ‘రాచోటు’ అని పిలుస్తుంటారు. ఏటా మార్చిలో 11 రోజుల పాటు ఇక్కడ వీరభద్రస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కొన్ని శాసనాల్లో రాయచోటిని ‘మహారాజ వాటిక’గా, తమిళంలో ‘మహారాప్పాడి’గా పేర్కొన్నట్లు కనిపిస్తుంది. కాలక్రమంలో ఇది వికృతరూపం పొంది ‘మార్ధవాడి’గా కొన్ని శాసనాలకు ఎక్కినట్లు తెలుస్తోంది.  

- సి.నీరజ, హైదరాబాదు