మెదక్‌

మెదక్‌

తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రం మెదక్‌. సన్నని వరిధాన్యాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున పండించడం వల్ల దీనికి ‘మెతుకు’ సీమ అనే పేరొచ్చింది. ఇందులోని ‘త’కారం ఉచ్చరణలో క్రమంగా ‘ద’కారంగా మారి ‘మెదుకు’ సీమగా, రానురాను ‘మెదక్‌’గా రూపాంతరం చెందినట్లు అర్థమవుతుంది. ప్రాచీన కాలంలో దీన్ని ‘పులాక రాష్ట్రం’ అని, బహమనీ రాజుల పాలనకు ముందు ‘సదాపూర్‌ మెదక్‌’ అని పిలిచేవారు. గోల్కొండ రాజుల కాలంలో ఇది ‘గుల్షణాబాద్‌’గా మారింది. అనంతరం వచ్చిన నిజాం రాజులు దీన్ని ‘మెతుకు’ దుర్గంగా మార్చారు. శాతవాహనుల కాలం నుంచి ఈ ప్రాంతం రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొంది. కాకతీయుల కాలంలో ఉచ్ఛస్థితిని అందుకుంది. సుమారు 12, 13 శతాబ్దాల్లో ఇక్కడ నిర్మించిన దుర్గం ఇప్పటికీ నిలిచి ఉంది. ఇక్కడి చర్చి ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. దీన్ని సౌత్‌ ఇండియా చర్చిగా పిలుస్తారు. ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రా చరిత్రలో ఈ ప్రాంతం గురించి పేర్కొన్నారు.

- రవి, మెదక్‌