మార్కాపురం

మార్కాపురం

ప్రకాశం జిల్లాలో ఒక మండల కేంద్రం మార్కాపురం. ఇక్కడ పుట్టలో వెలిసిన చెన్నకేశవస్వామికి మారిక అనే స్త్రీ రోజూ పాలు పోసేదట. ఒక రోజు స్వామి ప్రత్యక్షమై తనకొక ఆలయం నిర్మించాలని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులకు చెప్పి కోవెల కట్టించిందట. అందుకే, దీనికి ‘మారికాపురం’ అనే పేరొచ్చిందని, కాలక్రమంలో అది ‘మార్కాపురంగా’ మారిందని చెబుతారు. ‘మార్కాపురం’ గురించి ఇంకా పలు రకాల ఐతిహ్యాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి చెన్నకేశవ స్వామి ఆలయం ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. మార్కాపురం అంటేనే పలకల పరిశ్రమ ముందుగా గుర్తొస్తుంది. ఈ పరిశ్రమకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. అప్పట్లో మార్కాపురం పలకలు స్విట్జర్లాండ్, మలేసియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి. కాలక్రమంలో పలక ప్రభ తగ్గింది. 1967 వరకు మార్కాపురం కర్నూలు జిల్లాలో భాగంగా ఉండేది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోకి వచ్చి చేరింది.

- కె.ఎస్‌.ఎస్‌.ఎల్‌.మృదుల, మార్కాపురం