యాడికి

యాడికి

అనంతపురం జిల్లాలో ఒక మండల కేంద్రం యాడికి. తాడిపత్రికి 25 కి.మీ. దూరంలో ఉంటుంది. గతంలో దీన్ని ‘వేడుకాపురం’ అని పిలిచేవారు. ఇక్కడ ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చినట్లు చెబుతారు. కాలక్రమంలో ఇది ‘యాడికి’గా మారిందని అంటారు. చేనేతకారులు ఇక్కడ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. యాడికి చెన్నకేశవస్వామి ఆలయం పురాతనమైంది. దీన్ని శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు కట్టించారు. ఏటా ఇక్కడ చెన్నకేశవుడు, లక్ష్మీదేవిల కల్యాణాన్ని వైభవంగా జరుపుతారు. దాదాపు రెండు లక్షల మంది దీనికి తరలివస్తారు. యాడికి మధ్యలోని కొండ మీద నాగభైరవస్వామి ఆలయం ఉంది. నాగులచవితికి ఊరంతా ఇక్కడ ఘనంగా పూజలు జరుపుతుంది. ఆ సమయంలో సాముగరిడీల వాళ్లు విన్యాసాలు ప్రదర్శిస్తారు. ఇక్కడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కూడా బ్రిటిష్‌ వాళ్ల కాలం నాటిది. యాడికి సమీపంలోని ఉప్పలపాడుకోన జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది.

- వై.ఎల్‌.వి.ప్రసాద్, యాడికి