ఇల్లందకుంట

ఇల్లందకుంట

కరీంనగర్‌ జిల్లాలో ఒక మండల కేంద్రం ఇల్లందకుంట. త్రేతాయుగంలో రాముడు అరణ్యవాస సమయంలో ఇక్కడికి వచ్చాడట. అప్పుడే తన తండ్రి మరణ వార్త తెలుసుకొని ఇక్కడి ఇల్లంద చెట్టు గింజలతో శ్రాద్ధకర్మ నిర్వహించాడట. పైగా ఇక్కడి ఇల్లంద వృక్షం కింద శ్రీరాముడు వెలిశాడు కాబట్టి ఈ గ్రామానికి ‘ఇల్లందకుంట’ అనే పేరు వచ్చినట్లు చెబుతారు. ఇక్కడి సీతారామస్వామి ఆలయం అపర భద్రాద్రిగా ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయం బయట ఇల్లంద వృక్షాలు నేటికీ నిలిచి ఉన్నాయి. ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమికి భద్రాచలం తర్వాత ఇక్కడ సీతారాముల కల్యాణాన్ని దేవాదాయ శాఖ తరఫున వైభవంగా జరుపుతారు. ఈ ఆలయ ఉత్సవ మూర్తులకు పుట్టుమచ్చలు ఉండటం మరో ప్రత్యేకత. రోజూ ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఏటా ఇక్కడ పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి. దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వివాహం ఇక్కడే జరిగింది. 

- రావుల రాజేశం, ఇల్లందకుంట