మునిమడుగు

మునిమడుగు

ఇది అనంతపురం జిల్లా పెనుకొండకు సమీపంలో ఉన్న గ్రామం. ఈ ఊళ్లో వందేళ్ల కిందటి చెరువొకటి ఉంది. పూర్వం ఇది ఒక అగ్రహారమనీ, పాళెగాళ్ల పాలనలో ఉండేదనీ చెబుతారు. దీనికి రుజువుగా శిథిల కోట ఇప్పటికీ ఉంది. ఇప్పుడు చెరువు ఉన్న స్థలంలో ఒకప్పుడు ఊటమడుగులాంటి చిన్న చెరువు ఉండేదట! దానిలో ఎప్పుడూ నీరుండేదట. దాని ఒడ్డు మీద మునులు ఆశ్రమాలు నిర్మించుకొని వేదపాఠశాలను నిర్వహించేవాళ్లట! ఇదే ఈ ఊరికి మునిమడుగు అని పేరు రావడానికి కారణం అంటారు. ఈ గ్రామస్థులైన పాణ్యం వంశస్థులు తాతల నుంచి సంక్రమించిన ఇళ్లు శిథిలమైనందువల్ల, వాటిని తొలగించి ఆ స్థలంలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీనాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడికి కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు. 

 - మునిమడుగు రామకృష్ణశాస్త్రి, హైదరాబాదు