‘శంకరాభరణం’లో డైలాగు..

‘శంకరాభరణం’లో డైలాగు..

బ్రోచేవారెవరురా అంటూ ఆర్ద్రంగా పాడాల్సిన ఖమాస్‌ రాగాన్ని ప్రయోగం పేరుతో ఖూనీ చేస్తున్న దాసుకి, మన సంగీత ఔన్నత్యం గురించి శంకరశాస్త్రి అరటిపండు ఒలిచినంత బాగా చెబుతాడు. ఈ సన్నివేశానికి జంధ్యాల రాసిన మాటలు జె.వి.సోమయాజులు గళంలో మారుమోగిపోయాయి.. మీరూ ఓసారి ‘శంకరాభరణం’లో దాసుకి చెప్పండీ డైలాగు..
      ‘‘అక్షరాలు నీ ఇష్టమొచ్చినట్లు విరిచేసి, భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం? దాసూ.. ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు. ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరోలా అంటాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన నాదం ఉంది. శ్రుతి ఉంది.. స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతీ అక్షరం వెనక ఆర్ద్రత నిండి ఉంది దాసూ. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెల్లుబికిన గీతమది. రాగమది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగాల పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని అపభ్రంశం చెయ్యకు’’ 

సేకరణ: లక్ష్మీరాజ్యం, కర్నూలు