జీవితం ఓ టీ20

జీవితం ఓ టీ20

ప్రతి నూతన సంవత్సర తొలి దినాన్నీ టీ20 ప్రపంచకప్‌ వేడుకల స్థాయిలో చేసుకోవడం పాత విషయమే. వేడుకల్లో జ్ఞాపకాలను గ్రీటింగులనీ, చాటింగులనీ, మీటింగులనీ పోగేసుకుని గత ఏడాది జీవితపు టోర్నీలో ఏమి పెకలించారో పనిగట్టుకుని ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది... దుష్యంతుడి చేతిలో పెట్టిన మనిషి మెదడు ఎంత చరిత్ర లిఖించగలదో అని! టాసు గెలిచినంత మాత్రాన మ్యాచు గెలిచినట్టా? అమాయకపు ముగ్ధ వంటి నూతన సంవత్సర తాపసికన్యతో జనవరి వేడుకల్లో మద్యమాంసాల సాక్షిగా.. గుడిగంటల సాక్షిగా.. గ్రీటింగు కార్డుల సాక్షిగా.. డైరీ ప్రమాణాల సాక్షిగా ఎన్ని బాసలు చేసి ఏమార్చినారో గుర్తుకు రాదుగాక రాదు. దుష్యంతుడి చేతికి అప్పగించిన మెదళ్లకు మళ్లీ అంతా గుర్తొచ్చేది డిసెంబరు చివరిరోజునే. ఈ కావ్య ప్రబోధాలు కొత్త ఏడాదికి అనవసరం అనిపించినా కాళిదాసు ఉపమానాలు మాత్రం చరవాణిలో వండిన సందేశాల ఉప్మాల్లో జీడిపప్పుల్లా, ఫోర్లూ సిక్సర్లూ తగిలినప్పుడు ఉల్లాసినుల నృత్యహేలలా తెగ వేస్తారు. 
     సంవత్సర ప్రణాళికలు కొందరికి ఊహల్లో.. ఇంకొందరికి కాగితాల మీదా ఉంటాయి. మరికొందరు మేధావులు తమ ప్రణాళికలను పక్కవాళ్ల బుర్రల్లో దాచిపెడతారు. వాళ్లు నెత్తీనోరూ కొట్టుకుంటూ వీళ్లకు పదే పదే గుర్తుచేస్తూ ఉంటారన్నమాట. ఎలా అంటారా.. చిన్నప్పుడు ‘అ ఆ లు నేర్చేస్తా.. అన్నం తినడం నేర్చేస్తా..’ అంటూ అమ్మబుర్రలో ప్రణాళిక పడేస్తారు. ఇక చదువుకునేటప్పుడు ‘ఈ ఏడాది స్టేట్‌ ఫస్టు వస్తా’నంటూ ఎరుపురంగు ఇంకుపెన్నుతో నాన్నబుర్రలో రాస్తారు. ఇక తర్వాత ప్రేమికులు ‘అందనంత ఎత్తుకు ఎదుగుతా.. అంబానీ ఇంటిపక్కనే నేనూ కడతా..’ అని చెక్కి వాళ్ల బుర్రల్లో పడేస్తారు. ఏతావాతా తేలిందేంటంటే.. జరగాల్సింది జరక్కమానదు.. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని చెప్పి గంధర్వుల బుర్రల్ని కూడా వాడుకునే జనం ఎక్కువ అని!
      అంతా మిథ్య అని అరిస్టాటిల్‌ అరిచి చెప్పినా, కృష్ణమూర్తి కొలిచి చెప్పినా మనిషి ఏనాడు విన్నాడూ? వాడి గోల వాడిది. తప్పు చిత్తంలో పాకడానికి ఈ చలిమాసం చేసే మోసం కూడా లేకపోలేదు. జనవరి మాసం పేస్‌బౌలింగుతో తెచ్చిన వరి పరిపరి విధాలా ఆనందాన్ని పంచుతుందని ఊహించుకుంటూ కొత్త ఏడాదిని ఆరంభించే పల్లె వాసుల లెక్క ఒకటి. ఇక పట్నవాసులు స్పిన్‌బౌలింగు లాంటి కొత్త కొనుగోళ్లలోని ఎరలను చూసి పరవశించడం మరోటి. వచ్చే సంపాదన బ్యాటింగ్‌ అనుకుంటే.. ఇలాంటి బౌలింగులు ఎదుర్కోడానికి చాలా సాధన చేయాలి. టీ20 క్రికెట్టు బ్యాట్స్‌మన్‌ ఆట. బౌలర్లకు కష్టాలు ఎక్కువ. కానీ జీవితమనే టీ20 విధివిలాసాలనే బౌలర్ల ఆట. సగటు మనిషి బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. రేట్లు పెరిగి బౌన్సర్లు పడితే మూతి పగులుతుందోసారి. అప్పులు పెరిగి 90డిగ్రీలు బంతి స్పిన్‌ అవుతూ వికెట్‌ విరుగుతుందింకోసారి.  
      ‘జీవితం టీ20 మ్యాచ్‌ అయినచో జనవరి ‘పవర్‌ప్లే’ మాసము వంటిది’ అని చెప్పినా ఎవడు వింటాడు? నిజానికి క్రికెట్‌లో తాత్వికత అర్థం చేసుకుంటే జీవితాలు బాగుపడతాయి. ఆట అంటే ఆడేయటం కాదు. ఆడించడం కూడా. దీన్ని క్రీడానిఘంటు ప్రమాణాల ప్రకారం తత్వశాస్త్రంలోకి తర్జుమా చేస్తే ‘సంసారం అంటే బతకడం కాదు.. బతికించడం కూడా..’ అని చెప్పాలి.
      పదకొండు మంది ఆడే టీ20 ఆటను ఆరంభించడం ఓ కళ. పన్నెండు మాసాలు నిండాల్సిన కొత్త ఏడాదికి ప్రణాళికలు వేయడం అంతకన్నా గొప్ప! చాలా ఏకాగ్రత కావాలి.
      అర్జునుడికి పిట్ట కన్నే కనిపించినట్టు లక్ష్యం మాత్రమే ఆటలో కనపడాలి. టీ20లో ఆ పిట్ట కన్ను బంతి. జీవితంలో అది కొనాల్సిన వస్తువు ధర. ఒక చీర 1000 రూపాయలకు కొనాలనుకుని ఆట ఆడాలి. పక్కనున్న పట్టు చీరలు.. వాటి చుట్టూ నగలూ.. పైపెచ్చు అలంకరణలు చూడకూడదు. సామాన్యజీవికి షాపింగ్‌మాల్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన మైదానం! చీరను 800కే కొనగలిగితే ఫోర్‌! 500కి కొంటే సిక్స్‌! అదీ ఆటంటే... మైదానానికి తగినట్టు ఆట ఉండాలి. కొత్త ఏడాది ఆఫర్లను చూసి ఏ మైదానంలోనైనా ఆడేస్తాం అనుకోవడం పొరపాటు. 
      జనవరిలో నూతన సంవత్సర వేడుకల నెపంతో సంక్రాంతి ఓవర్లు కూడా ఆడాల్సి రావచ్చు. మంచిదే. పంచెకట్టుకుని పించ్‌ హిట్టింగు కొట్టకతప్పదు. పర్సు ఖాళీ అయిపోయి వికెట్టు పడినా సరే.. తర్వాత అప్పు చేసి వచ్చి బ్యాటింగు జోరు తగ్గించకుండా ఆ నెలలో పవర్‌ప్లే కొనసాగించక తప్పదు.
      అప్పులపాలైనప్పుడు ఆచి తూచి డిఫెన్సు ఆడాలి. అలాగని టెస్టు మ్యాచు తాత్వికత పనికిరాదు. ఒక బంతికి ఏదోలా అడ్డుకుని బాధపడినా, తర్వాతి రెండు బంతులకు సింగిళ్లయినా తియ్యాలి. ఉగాదివరకూ ఇలా నెట్టుకుని నెట్టురన్‌రేటు కాపాడుకోవాలన్నది గావస్కర్‌ సిద్ధాంతం.
      మధ్యలోని నెలల ఓవర్లలో ఎలా ఆడినా మళ్లీ రెండో పవర్‌ప్లే తీసుకోవాలి. దసరా, దీపావళీ బౌలర్లు కాచుకుని ఉంటారు. జనవరి తరహాలోనే ఇక్కడ కూడా ఆడాల్సి వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. టీ20లో బ్యాటింగుకూ బౌలింగుకూ ప్రత్యేక నిపుణులు ఉంటారు. ఒకరో ఇద్దరో ఆల్‌రౌండర్లు ఉంటారు. 20 ఓవర్లు అంతా కలిసి ఆడతారు. కానీ జీవితపు టీ20లో పన్నెండు నెలల ఓవర్లూ ఆడాల్సింది ఒక్కడే. పరిస్థితుల బట్టి జీవుడు అపర హిట్టర్‌లా మారొచ్చు. డిఫెన్సురాని అయోమయుడిలానూ అవ్వొచ్చు. 
      ఇక జీవుడు వేసే బౌలింగు గురించి చెప్పాలి. ఈ ఆటలో ప్రత్యర్థులు పెళ్లాం, పిల్లలు, ఇంటి ఓనరు, కేబుల్‌వాడు, పాలవాడు.. ఇలా ఉంటారు. రోహిత్‌శర్మ, క్రిస్‌గేల్‌ లాంటి వాళ్లకు బౌలింగు వేయడం అంటే పేద్ద షాపింగ్‌ మాల్‌కి ప్రేయసితోనో పెళ్లాంతోనో వెళ్లడం కింద లెక్కే! 
      పిల్లలు చేసే అల్లరి ఓవర్‌త్రో కాకుండా చురుగ్గా ఫీల్డింగు కాచుకోవాలి. వైడు బంతులు వేసినా పరవాలేదు కానీ నోబాల్స్‌ వేసి ఫ్రీ హిట్లు కొట్టించుకునే పరిస్థితులు కుటుంబంలో ఎవరితోనూ తెచ్చుకోకూడదు. 
      ఆటలో అన్ని బంతుల్నీ సిక్సర్లు కొట్టలేం. అలా అని అసలు బౌండరీయే కొట్టకుండా ఆటాడమని కాదు.. మరీ కాళిదాసు దుష్యంతుడిలా ప్రమాణాలూ ప్రణాళికలూ అన్నీ మరిచిపోయి జిడ్డు ఆట ఆడుతూ ఈ సంవత్సరాన్ని మమ అనిపించొద్దని చెబుతున్నా. 
      చివరగా రాహుల్‌ ద్రవిడ్‌లా చెప్పేది ఒకటే. ఈ కొత్త ఏడాది జీవితాన్ని చక్కగా ఆడండి. వేడుకల్లో తాగి తందనాలాడి రనౌట్‌ కావద్దు. 

- సురా