అన్నా! కూలీలేకము కావలెరా!!

అన్నా! కూలీలేకము కావలెరా!!

కూలీలందరు ఏకమైతే కూటికి తరుగేమిరా
కూలివాండ్లలోనే బలమీ కాలమందున నుండెరా
కూలివాండ్లమైన మనకు కులములెందుకురా తెలుపరా
కూలివాండ్లమైన మనము కలిసి ఉందము సోదరా! 
అన్నా! కూలీలేకము కావలెరా!! 
      ఎనిమిది చరణాల ఈ పాటకు తెలుగు సాహిత్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది తొలి తెలుగు శ్రామిక గీతం. ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు, ‘పలనాడు వెలలేని మాగాణిరా’ గీత రచయిత పులుపుల వెంకటశివయ్య ఈ పాట గురించి చెబుతూ ‘ఆంధ్రదేశంలోకెల్లా మొట్టమొదటి వర్గ విభేద ప్రాతిపదికమూ, వర్గపోరాట ప్రబోధాత్మకమూ అయిన గేయం ఇది’ అన్నారు. 1930వ దశకం మధ్యలో గుంటూరు కార్మికులతో కలిసి పనిచేస్తూ పెండ్యాల లోకనాథం దీన్ని రచించారు. ‘‘మనము గుడ్డలు నేసి యిస్తే వాళ్లు కట్టుకొంటిరి/ మనము ఇండ్లు కట్టి యిస్తే వాళ్లు కాపురముండిరి/ మనము పండిస్తేను పంట వాళ్లు అన్నము తింటిరి/ మనము కష్టము చేయుచుంటే వాళ్లు సుఖముగనుండిరి’’ అంటూ సాగే ఈ పాట స్ఫూర్తితో తర్వాత అనేక గీతాలు వచ్చాయి. కష్టజీవుల కన్నీళ్లకు కారణాలను గుర్తుచేస్తూ చైతన్యపరిచాయి. శ్రామికవర్గ ఐకమత్యానికి బాటలు వేశాయి. 

- కె.రాఘవయ్య, కారంపూడి