టపాస్‌ దర్బార్‌

టపాస్‌ దర్బార్‌

రాజాధిరాజ రంగు మార్తాండ బొగ్గుజన రంజక గంధకపురాధీశ ఢాంఢాంఢాం అచ్చు హెచ్చు మెచ్చు చిచ్చుబుడ్డీ మహరాజులుంగారు వెలుగుతున్నారహో...
      నా తెలుగు ప్రజల టపాసులారా
      చీకట్లను తరిమేందుకు కవాతు చేస్తున్న సైనికులారా
      మీ కాంతిశీలతకు కృతజ్ఞతలు..
      నరక చతుర్దశి రానుంది.. మన కార్యాచరణ నిర్ణయించుకొనుటకే ఈ సమావేశం.
      హరేకృష్ణ హరేకృష్ణ
      మీకు తెలుసు...
      ఏంటి మహారాజా?
      ఎవరక్కడ ఈ సిసింద్రీ నోరు అదుపులో ఉంచండి. మంట అంటకుండానే మాటకి అడ్డు పడతాడు...
      హరేకృష్ణ మహారాజా
      ఆఁ.. మరేంలేదు.. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నరక చతుర్దశి దాటిన అమావాస్య రాత్రినాడు విశ్రాంతి తీసుకుని పరిపాలనా భారం మనకి అప్పగిస్తారు. అందుకు మనం సిద్ధంగా ఉండాలి. 
      హరేకృష్ణ మహారాజా.. మనం ప్రతి ఏటా నిర్వహించే బాధ్యతేగా..
      అవును.. అందుకే మనం ఒకసారి మన శక్తియుక్తులు, సాధకబాధకాలు మాట్లాడుకోవాలి. లోటుపాట్లు సరిచేసుకోవాలి...
      హరేకృష్ణ హరేకృష్ణ.. అవును మహారాజా.. మంచి ఆలోచన.. 
      చిచ్చుబుడ్డి మహారాజ్‌కీ జయహో... టపాసులు జయజయధ్వానాలు పలికాయి...
      ఆపండి చిటపటలు.. అసలు ఎవరు ఎవరికి మహారాజు? తనకుతాను మహారాజని చెప్పుకుంటే మీరంతా వొత్తులు పైకెత్తుకుని హరేకృష్ణ హరేకృష్ణ అనడమేనా? ఈ వంకాయబాంబు కన్నా ఏం గొప్ప ఆ చిచ్చుబుడ్డీ?.. సేనాని వంకాయబాంబు మాటలకు దర్బారు తుస్సుబోయింది.
      ఆఁ.. అదీ లెక్క.. ఢాంగాడివనిపించుకున్నావ్‌ వంకాయబాంబూ.. నీతో ఈ సిసింద్రీ ఉన్నాడు.. మాట్లాడండి మతాబులారా.. ఏంటి మీ మహారాజు గొప్ప? అసమర్థులకు చప్పట్లూ చిటపటలూ అనవసరం..
      హరేకృష్ణ హరేకృష్ణ.. వీళ్ల వొత్తుల చిత్తములు ఎప్పుడు మారిపోయాయో.. మహామంత్రి వెన్నముద్దగారూ ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి... ప్రమిద ప్రాధేయపడింది.
      నా వెలుగులు నచ్చకపోతే చెప్పండి టపాసులారా.. నేను కాంతికాంక్షతో సింహాసనం మీద కూర్చోలేదు. ఇక తప్పుకుంటాను.. చిచ్చుబుడ్డి మహారాజు చిన్నబోయారు.
      ప్రభూ.. ఎంత మాటా.. తాటాకు చప్పుళ్లకు భయపడటమా?
      ఏయ్‌ ముసలి వెన్నముద్దా.. చాలించు నీ గోరుముద్దలు. వంకాయ బాంబంటే ఏమనుకున్నావ్‌? వారికీ సిపాయి తాటిరేకు పటాకీలతో పోలికా..? సిసింద్రీ ఎగిరెగిరిపడ్డాడు.
      సరే.. మహారాజు అర్హతేగా మీకు తెలియాల్సింది. వినండి.. ఆత్మవిశ్వాసము నిండిన సురాకార శూరత్వము ఒక పాలున్నది. అందున సగపాలు అందరినీ ఆదరించు బీడున్నది. ఆ బీడున సగపాలు మనసులు గెలవగల గంధకమున్నది. అందున మరి సగపాలు సంక్షేమం కొరకు సహనం వహించు సున్నమున్నది.. ఆ సున్నమున సగపాలు ఆబాలగోపాలమును అక్కున చేర్చగల ఆముదమున్నది.. ఇంత ఏల కురుక్షేత్రానికి ముందు కన్నయ్య రాయబారం ఉన్నట్లే ఇతని శిరక్షేత్రానికి ముందు కూడా రాయబారమున్నది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న చిచ్చుబుడ్డి మహారాజుగారి గురించి ఠప్పున పేలి తప్పు చేశావు వంకాయబాంబూ... 
      వంకాయబాంబుకీ సిసింద్రీకీ కమ్మిన పొగ చెదిరిపోయింది.
      నన్ను క్షమించండి మహారాజా.. పటాసెక్కువై పొరపాటున వాగాను.. మీరే మాకు మహారాజు.. 
      అంత మాటెందుకు వంకాయ బాంబూ.. నీ వీరత్వం తక్కువేమీ కాదు. నువ్వెప్పుడూ మాకు ఆప్తుడవే.. 
      అచ్చు హెచ్చు మెచ్చు చిచ్చుబుడ్డీ మహారాజ్‌కీ జై.. వంకాయబాంబు టపాసులవైపు తిరిగి జైకొట్టాడు.
      సరే టపాసులారా.. ఇంతకీ గత ఏడాది మీకు ఎదురైన సమస్యలేంటో చెప్పండి. ఈ ఏడాది సరిదిద్దుకోవాలి కదా..
      హరేకృష్ణ హరేకృష్ణ.. పుల్లారావు నన్ను వెలిగించాక పుల్ల వీధి మధ్యలోనే పడేశాడు. అది తొక్కిన తిమ్మారావు కాలికి గాయమైంది మహారాజా.. కాకరపువ్వొత్తి కన్నీరు పెట్టుకుంది.
      కాల్చిన వెంటనే నిన్ను ఓ వారగా పెట్టి శాంతి జరపాలని ఆదేశిస్తాం. పుల్లారావు పద్ధతి మారకపోతే సగం కాలి ఆగిపో...
      మమ్మల్ని డుంబూగాడు ఇంట్లో వెలిగించాడు మహారాజా.. విష్ణుచక్రం భూచక్రం విన్నవించుకున్నాయి.
      మార్బుల్‌ మీద మరక పడిందని వాడి వీపున చేతి చక్రాలు తిప్పమని చెబుతాం. ఈ ఏడు అలా చెయ్యడు..
      ఆ ఉమాపతి నా పొట్టలో ఊదొత్తు పెట్టి ఎదురింట్లోకి పంపాడు మహారాజా.. ఉల్లిపిచ్చుక ఉసూరుమంది.
      ఈ ఏడు వెనక్కి తిరిగి ఉమాపతి ఇంట్లోకి వెళ్లు. వచ్చే ఏడాది ఊరవతలికి వెళతాడు..
      చిట్టిగాడు వాడి పుస్తకం మీద నన్ను వెలిగించాడు మహారాజా.. పాము మాత్ర పడగ విప్పింది.
      ఈసారి ప్రోగ్రెస్‌ కార్డు వాడమను.. తర్వాత వాడికే తెలిసొస్తుంది..
      హరేకృష్ణ హరేకృష్ణ.. హరేకృష్ణ హరేకృష్ణ.. టపాసులు జేజేలు పలికాయి.
      సీమటపాసుల్లారా, లక్ష్మీబాంబుల్లారా, అగాదీల్లారా, బర్మాల్లారా, తోలుజంగిడీల్లారా మీకు ఎలాంటి ఇబ్బందులూ లేవు కదా..
      లేవు మహారాజా.. మా జాగ్రత్తల్లో మేమున్నాం. చేత్తో పట్టుకుని ఏ చిత్తరంజన్‌ వెకిలిగా వెలిగించినా ఖబడ్దార్‌ అంటూ పేలుతున్నాం. ఒకరిద్దరు ఆకతాయిల చెవులు మూయించాం.. తర్వాత వీధుల్లో అందరూ జాగ్రత్తగా ఉన్నారు.
      శుభం.. సిసింద్రీ.. నువ్వేమీ మాట్లాడవేం..?
      ఏం చెప్పమంటారు మహారాజా.. పోయినేడు పిచ్చయ్య బాగా పటాసు దట్టించి వెలిగించాడు.. నేను కళ్లు తెరిచేలోగా వేరే రంగురంగుల ప్రపంచంలో ఉన్నాను. తర్వాత అర్థమైంది.. అది ఎదురింటి ఎల్లయ్య లుంగీ అని! 
      కంగారు పడకు సిసింద్రీ.. ఎల్లయ్యకు ఈ ఏడాది జీన్సుప్యాంటు వేయించమని ఆదేశిస్తాం.
      మహారాజా.. మహారాజా.. వెలుగు వెలుగు..
      ఏంజరిగింది అగ్గిపుల్లల్లారా..
      హరేకృష్ణ హరేకృష్ణ.. జువ్వ యువరాజులవారి జోరు ఎక్కువగా ఉంది. మూడింతల సురాకారం దట్టించుకుని ఊరవతల కలకలం సృష్టిస్తున్నారు.. 
      చీనా దేశపు గంగాళానికి నీళ్లు నింపి అలంకరించండి.. జువ్వ యువరాజులకు కల్యాణ ఘడియలు దాపురించాయి..!
      దర్బారు ముగిసింది..! దీపావళి మొదలైంది...!

- నవ్యశ్రీ ప్రవల్లిక