కొత్తేడాది.. మూడు భాషల ముగ్గు!

కొత్తేడాది.. మూడు భాషల ముగ్గు!

డిసెంబరు 30న కాగితం ముక్క పట్టుకోని హిందీ అయివోరు కాడికి పోగానే అంజిగాడికి డౌటొచ్చేది, ఈసారిగూడా ఈడు హిందీలో జనవరి శుభాకాంక్షలు రాపిస్తన్నాడని. హిందీలో ఎప్పుడూ మేము వీకే. పోయినేడాది రాసిచ్చింది ఈసారికి గుర్తుండదు. నేను పక్కకొచ్చిన కాసేపటికి వాడుగూడా కాగితం ముక్క తీసుకొని పోయేవోడు, నాకు పోటీగా. తర్వాత రత్తయ్య కొట్లో ఎంక్వయిరీ చేసేవోడు, రవిగాడు ఏ రంగులు కొన్నాడు, ఎంత కొన్నాడని. వాడెంత పోటీ అయినా నా ట్రిక్కులు నావే. ‘‘ఒరే అంజిగా. మా అమ్మ రాత్రే జనవరి శుభాకాంక్షలు రాసేసుద్దంట’’ అని ఎన్టీ రామారావు మాదిరి నటిస్తా చెప్పేవోణ్ని. మా ఊరు మొత్తంలో మూడు భాషల్లో జనవరి శుభాకాంక్షలు మా ఇద్దరి ఇంటిముందే కనిపించేది. మిగిలిన అందరూ ఇంగ్లీషులో రాసేవోళ్లే. 
      జనవరి ఫస్టున పొద్దుపొద్దున్నే వాకిళ్లలో కళ్లాపి చల్లి, శుభాకాంక్షలు రాసి, రంగులు దిద్దటానికి చాలా సమయం పట్టుద్దిగా. వేళ్లు కొంగర్లుబోయే ఆ చలిని భరించలేక ఊళ్లో చానామంది ముందురోజు రాత్రే ఆ తతంగం ముగించేవోళ్లు. నేను మాత్రం అలా ఒప్పుకునేవోణ్నిగాదు. ‘‘ఓమా, రాత్రే ముగ్గులు పెడితే పిల్లులు, బరిగొడ్లు తొక్కుతయ్యి, కుక్కలు పొర్లాడతయ్యి. పొద్దున్నే లెగిసేతలికి మన ముగ్గు అందంగా కనపడొద్దా. మా అమ్మగదా’’ అని బతిమాలుకునేది. అంత బతిమాలి, నేను లేస్తానా? ‘‘రేయ్‌... లెగుస్తావా.. ముకం మీద కళ్లాపి కొట్టాలా? పొద్దుపొద్దునే లెగిసేవోళ్లాగా రాత్రి ముగ్గు ఎయ్యనియ్యకపోతివి. మల్లా ఒక బాసలో సాలదంట.. మూడు బాసల్లో రాయాలంట.. మూడు బాసలు’’ పొద్దుపొద్దున్నే అక్షింతలు తప్పేయిగాదు నాకు. ‘‘ఓమా... తిట్టబాకే. ఈరోజు తిట్టిచ్చుకుంటే సమ్మచ్చరమంతా తిట్లు పడతానే ఉంటయ్యంట’’ అంటా, ఉసూరుమంటా, రగ్గు తొడుగుని వదిలించుకోని లెగుస్తానా, అంతే.. చలి పులిలా మీదకి దూకేది. అమ్మ కళ్లాపి చల్లే లోపల అంజిగాడి ఇంటి ముందు చూద్దామని రెండో బజారుకి పొయ్యేది. ఆయాలకే వాడు తపస్సు చేస్తున్న మాదిరి రంగులు దిద్దుతా ఉండేవోడు. అమ్మ దొంగనాయాలా, నా ట్రిక్కు కనిపెట్టావుగా! అని తిట్టుకుంటా ఎనక్కొచ్చేది. ఇక జానెడు పుల్ల తీసుకోని పిల్ల పికాసో అవతారం ఎత్తేది నేను. నేల మీద జాగర్తగా, ఒద్దిగ్గా పుల్లను ఆడిస్తా మొదట ఇంగ్లీషులో, తర్వాత తెలుగులో, ఆ తర్వాత హిందీలో శుభాకాంక్షల అక్షరాలు గీసేవోణ్ని. ఇంగ్లీషులో అయితే ‘వెల్‌కమ్, గుడ్‌బై’ అనీ రాసేవోణ్ని. ‘‘నడుములు పోతన్నాయిరా దేవుడో... ఈడి పైత్యం తగలెయ్యో’’ అని గొణుక్కుంటా అమ్మ ఆ గీతల్లో ముగ్గులేసేది. ఆనక అక్షరం అక్షరానికి మార్చిమార్చి రంగులు దిద్దేలేకి ఏడు అయిపొయ్యేది. ‘‘ఇప్పుడొచ్చి తొక్కవా కుక్కలు, బరిగొడ్లు? కర్ర తీసుకొని ఆడే కూసో’’ అని ఓ ఎటకారం ఇసిరేది అమ్మ. తర్వాత అంజిగాడి ఇంటికెళ్లి, ‘‘బలే ఏశావురా రంగులు’’ అని పైకి అన్నా, మనసులో తెగ తిట్టుకునేది. ఆనక తలకబోసుకోని, కొత్త గుడ్డలు కట్టుకోని బేబీ షామిలీ, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ గ్రీటింగులు పట్టుకోని ఊరిమీద పడేది. 
      జనవరి ఫస్టు ముందు రోజు సాయంత్రం పక్కింటి నాగేంద్రమ్మ, ఆ పక్కింటి పార్వతి కోసం మాటిమాటికీ వాకిలిసాయ చూస్తావుండేవాణ్ని. వాళ్లకి పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు. కాగితం ముక్క పట్టుకొచ్చి నాకాడ ఇంగ్లీషులో శుభాకాంక్షలు రాపిచ్చుకునేవోళ్లు. అలా రాసిస్తంటే ఎంత గర్వంగా ఉండేదో. ‘‘అయ్యా... పుల్లతో ఆ గీతలేదో నువ్వే గియ్యగూడదంటరా’’ అనీ అడిగేవోళ్లు. అమ్మా... అట్ట నేనేరాస్తే వాళ్ల అక్షరాలుగూడా అందంగా ఉంటయ్యిగా! ఒక్కోసారి మూడో బజారు త్రివేణితోటి గీతలు గీపిచ్చుకునేవోళ్లు. ఇక ఆ సమ్మచ్చరమంతా వాళ్లతో కటీఫ్‌. వాళ్లు ఇటు మాట్లాడిస్తంటే, అటు చూస్తా పొయ్యేది. ఏమైనా ఆ రోజులే వేరులే! ఇప్పుడో, నగరంలో ముగ్గులు దిద్దే జాగా లేక పొద్దున్నే ఫోను తీసుకొని అక్షరాలు టైపు చేస్తా కూర్చుంటా. అప్పుడెప్పుడో నేను రాసిచ్చిన మూడు భాషల శుభాకాంక్షల కాగితం దాసిపెట్టుకోని, ‘‘అయ్యా, మూడు బాసల్లో రాయలేక మన తెలుగులోనే రాశానయ్యా, ఊరు మొత్తంలో మనదే పెసలు’’ అంటది అమ్మ. నా మనసు గతాన్ని నెమరేసుకోని పులకించిపోద్ది. 

- మన్నం వేణుబాబు