చుళుక మణిక రహస్యములు!

చుళుక మణిక రహస్యములు!

ఒకప్పటి రోజుల్లో అర్ధరాత్రి తోటకు వెళ్లాడంటే.. అది భగ్నప్రేమ. సాయంత్రం అందులో షికారు చేస్తే అది తొలిప్రేమ. మధ్యాహ్నం అక్కడ సేదదీరితే కొంటెప్రేమ. చద్దన్నం మూటకట్టుకుని ఠీవిగా కదిలాడంటే అది పవిత్రప్రేమ. 
      కానీ భుక్తాగ్రేసరులారా.. అపానశమన ఉపాయులారా.. కోడి కూతకు ముందే తోటకు వెళ్లడమనేది ఏ ప్రేమాకాదు.. అదొక జ్వాలా తుంబుగ రహస్యం! ఆ చుళుక మణిక శాప రహస్యాలు తెలుసుకోవాలంటే నలుపు తెలుపు రోజుల్లోకి నడవాల్సిందే. ఇవేవో క్షుద్ర మంత్రాల్లో పదాలని అనుకోకండి.    కేవలం చెంబుకు పర్యాయపదాలు మాత్రమే! ఇక శౌచాలయ పోరాటాల గురించి సావధానంగా వినండి..
      పూర్వం ఊరంతా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, ఇతర పనులన్నీ చేసుకున్నాక సూరీణ్ని నిద్రలేపేవారు. కోడిపుంజులకు పెద్దగా పని ఉండేది కాదు. అవి కూస్తేనే తెల్లారే రోజులు కావవి. వేకువ జామును కలలు కనేందుకు వాడుకునే సౌకర్యం ఆ రోజుల్లో లేనే లేదు. చీకట్లో లేచి తీరాల్సిందే. ఏదో ఒక యాత్రా విశేషాన్ని గుర్తుచేసుకుంటూ తెలిసిన దారిలో అడుగులు తడబడకుండా వేసుకుంటూ నడవాల్సిందే. ఆనాడు కుక్షి కూజితాలే ప్రమాద ఘంటారావాలు. 
      అసలు రాత్రిళ్లు ఎన్ని కుంభాలు లాఘవంగా లాగించినా, తప్పనిసరిగా వేకువజామున ఒక పథికుడై సాగిపోవాల్సిందే. తన సరావముతో సరాగము పాడి తీరాల్సిందే. తోటి బాటసారులతో మాట కలిపి రాబోవు విపత్తులకు సహాయకారులుగా ఒప్పందాలు చేసుకోవాల్సిందే. అవేంటో చెబుతా..
అరివీర భయంకర హుంకారములు సలపగల ధీశాలురూ, మేఘనాదమునకు సమానముగా సింహనాదములు చేయగల శూరశిఖామణులూ సలిలసహితగురిగధారులై స్నేహభావముతో నడుచుచున్నవేళ.. ఒక చిన్న చీమ విపత్తును తీసుకురాగలదు. ఆ బారినుంచి తప్పించుకోవాలంటే వారి ఒప్పందములు రక్షణనిస్తాయి. అమాయకంగా ఏకాక్షి అయినవాళ్లను ఏ లోకపాలకుడూ రక్షించలేడు. ఇక్కడ నలుగురితో కలిసి నడవాల్సిందే. అవసరం అయినప్పుడు నాలుగు చుక్కలు పంచుకోవాల్సిందే.
      మట్టిచెంబుల కాలంలో ఎంత స్నేహపూరిత వాతావరణం ఉండేదో.. ఎవరి ముంతకైనా చిల్లుపడినా, పగిలినా అరెర్రె అంటూ ఓదార్చి తలా చేతనైనంత నీటిని మిగిల్చి అందించేవారు. చీమో దోమో కుట్టినపుడు అనుకోకుండా చెయ్యి తగిలి నీరొలికిపోతే.. వినపడని ఆర్తనాదాన్ని అర్థం చేసుకునే ఆప్తమిత్రులు బోలెడుమంది ఉండేవారు. వాగుల ఒడ్డునున్న ఊళ్లలో ఈ బాంధవ్యాలు తక్కువనే చెప్పాలి. విలువ తెలిసిన మనుషులున్న కాలమది. వైరం అసలు ఉండేదే కాదు. ఉంటే.. ఆ కొట్లాటల్లో ఇద్దరికీ నష్టమే. మట్టి చెంబు ఉన్నవాడు మరీ జాగ్రత్తగా ఉండేవాడు. ఇత్తడి చీముంతలు ఉన్నవాళ్లు ఎగిరెగిరిపడేవారు. అయినా.. రెండింటిలోనూ నీరు ఉండటం ముఖ్యం. కాబట్టి తగాదాలు పడే మనస్తత్వం ఆ రోజుల్లో ఉండేది కాదు. సర్దుకుపోయేవారు... సరదా కబుర్లు చెప్పుకుంటూ. 
      ఉదర దంభోళి కేళీ విలాసంలో ఉద్ధండులూ, మలయసమీరపు మాయావులూ, కబంధ ప్రబంధాసురులూ చేసే కంజరమంజీరాలు గ్రామాన్నంతటినీ కొన్ని ఘడియలు బిడియపడేలా చేసేవి. అలా ఊరి చివర తోటల్లో సంభారపు సమ్మోదములు సూర్యోదయానికి మునుపే తెరదించుకునేవి. 
ఈ తోటకు పోయేందుకు ఉన్న నియమావళిలోని సూత్రీకరణ ప్రకృతే నేర్పేది. సఫల విఫల యత్నాలనుంచి బాల్యావస్థ బలపడేది. క్రమంగా ఒక నిర్దిష్ట ప్రామాణికతను జీర్ణాశయం అలవర్చుకుని దిశానిర్దేశం చేసేది. మిత్రులెవరో శత్రువులెవరో ఎరిగి నడుచుకోమని మనసు, ఉదరం ఒకటై చెప్పేవి.
      చిన్ననాటి అల్లర్లు ముగిశాక మరింత జాగరూకత అవసరమై మనిషిలోని జీవక్రియ రాటుదేలేది. అప్పటినుంచి అన్ని కోణాలలోనూ చూడగల నేర్పు మనిషికి అలవాటు అయ్యేది. పచ్చని తుప్పలనూ డొంకలనూ ఏపుగా ఎదిగిన చెట్లనూ తనవాళ్లుగా నమ్ముకోవడం మొదలయ్యేది. వాటి చెంతనే విజ్ఞుడై కూర్చుని తర్క వితర్కాలను చేయడం మొదలయ్యేది. ఎన్నెన్నో ఆలోచనలకు ఆదిమూలం అదే స్థలం అనే నమ్మిక బలపడేది. ఆకులెక్కువున్న చోట అరికాలికి మంచిదనీ, అరవకుండ కదలకుండ కూర్చొనుటే కూరిమనీ, అపాయాన్ని వెరవకుండ సాహసాన్ని చూపమనీ, ఉదయాలను హృదయాలను మెలకువతో గెలవమనీ.. ఎన్నెన్ని నీతులను ఉపదేశించుకునేవాడో. 
      ఊరన్నాక బద్ధకిష్టులు ఉండకపోరు. ఒకరో ఇద్దరో దిష్టి చెంబులని అనుకోవాలి. వాళ్లు చిన్న పిల్లాడిని తోడు తీసుకుని బారెడు పొద్దెక్కాక రంగవల్లికలను లంఘిస్తూ పరుగు తీసేవారు. వెనకాలే పిల్లాడి చేతికి చెంబిచ్చి.. అదేదో ఆ పిల్లాడి కోసం వెళ్తున్నట్లు రంగు పూసే ప్రయత్నం చేసేవారు.       అయినా మహానుభావుల ముంత గుట్టు ఎవరికి తెలియని విషయం? కొందరు మొహానికి తుండు చుట్టేసేవారు. నత్త తలను గుల్లలోనికి లాక్కున్నట్టు, తాబేలు డిప్పలోనికి లాక్కున్నట్టు తలకాయను మెడకాయ లోపలికి వంచేసి తెగసిగ్గు ప్రదర్శిస్తూ పరుగెత్తేవారు. కొందరికి ఆ క్షణంలో పరుగు రాదు. పరుగులాంటి నడకా రాదు. వాళ్లు నడుస్తూ ఉంటే రంగవల్లికలు ఒకటే ఘోష! ఆడవాళ్ల ఇబ్బందులు ఇన్నన్నీ చెప్పలేం. కానీ, ప్రతి ఊరికీ వారికోసం ఒక ప్రాంతం దానికదే కేటాయించబడి ఉండేది. అక్కడ గానీ ఏ మగాడైనా మత్తులో పడి అడుగుపెట్టాడా.. లొత్తలు పడ్డ ఇత్తడి ముంతల దెబ్బలకు వాడి మొహం పచ్చడయ్యేది. ఇంకొంతమంది ఇంటికి రాగానే మళ్లీ రాగాలాపన మొదలయ్యేది. ఏంట్రా బాబూ ఈ బాలారిష్టాలు తీరలేదు.. అనుకుని నక్కి నక్కి ఊరు చివరికి చేరుకోవడం గనక చూస్తే.. వాడెవడో అపరాధ పరిశోధకుడని అనుకునే ప్రమాదం ఉంది.
      మరో సంగతి.. తాయిలం ఇచ్చి తోడు పిలుచుకున్న పిల్లాడు ఉన్న పళంగా బెదిరింపులకు పాల్పడి డబ్బు గుంజే సందర్భాలూ ఉంటాయి. వాడి చేతిలో చెంబు పైకెత్తి ‘ఒంపేస్తా..’ అంటే.. ‘చంపేస్తా’ అన్నట్టు వినిపిస్తుంది. ఎంత పిస్తా అయినా ఆ పరిస్థితిలో తలొగ్గాల్సిందే. పిల్లల సంపాదనల్లో దీన్ని నల్లధనం అనకుండా చల్లధనం అనాలేమో.
      కాలక్రమంలో చిల్లులుపడ్డ ముంతలు కారకుండా సబ్బు, తారు వంటివి పూసుకుని కంటికి రెప్పలా చూసుకునేవారు. పందొమ్మిది వందల డెబ్బయి దశకంలో ఎప్పుడైతే పెప్సీ కోకాకోలా థమ్సప్‌ లాంటివి ప్లాస్టిక్‌ సీసాల్లో వచ్చి సందడి చేశాయో.. ఇక అప్పటినుంచి మట్టిముంతలు మూలపడ్డాయి. ఇత్తడి ముంతలు ఇంటివెనకే ఉండిపోయాయి. చూరులో ప్లాస్టిక్‌ సీసా మూతతో సహా ముద్దుగా దాక్కుని ఉండేది. దాని మెడకో తాడుకట్టి, మణికట్టుకు దోపుకుని యుద్ధానికెళ్లే మహరాజులా బయల్దేరడం మొదలైంది. సైనికుడి ఆకారం బట్టి సీసాల పరిమాణాలూ రావడంతో ఎన్నో హృదయాలు ఆ సీసాల్లో సేదదీరాయి. 
      తెలివి మీరినవాడు ఆలస్యంగా లేచినా, ఓ చిన్న సీసాను బ్యాగీ ప్యాంటు జేబుల్లో పెట్టుకుని వెళ్లడం మొదలుపెట్టాడు. మిత్రదళంలో ఉంటే ఎప్పుడు పిలిచినా వారితో వెళ్లాల్సిందే. లేకపోతే రానివారికి అవసరం పడ్డప్పుడు నీటి సాయం ఇంకెప్పుడూ అందదని బెదిరించేవారు. ఇక ఇంటింటికీ శౌచాలయాలు వెలశాక ఈ రణరంగ విన్యాసాలు ఏకాంత శాంతిచర్చల సభల్లా మారిపోయాయి. పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల పురోగతి కనిపించాలని ఆశించాడు మనిషి. కలరా, అతిసారం వంటి వ్యాధులు రాకుండా సెప్టిక్‌ ట్యాంకులు ఇంటింటా నిర్మించుకోవడం మంచిదే. 
      ఏదేమైనా... ‘వానపడితే గట్టుమీద కాలు ఎక్కడ వెయ్యకూడదు? చెట్టుకింద చీకట్లో చోటెలా వెదకాలి? కానరాని కార్చిచ్చునూ, భయపెట్టే భాస్వర కణికలనూ జయించి అడుగేయడం ఎలా? ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు? ఉదరవిజేత కాగానే చేతిలోని చుట్టముక్క ఎక్కడ పెట్టాలి?       వామహస్తలాఘవము ఎలా ప్రదర్శించాలి..?’ అనే విషయాలు నూడుల్సు తినే ఈ తరానికి ఏమని వివరించగలం? ఏడైనా లేవడానికి ఏడుస్తూ నసిగే బద్ధకపు తరానికి ఏం చెప్పగలం? 

- సురా
(నవంబరు 19 వరల్డ్‌ టాయిలెట్‌ డే సందర్భంగా..)