ఫేస్‌ బుక్కు బామ్మ

  • 2494 Views
  • 66Likes
  • Like
  • Article Share

    కె.కె.భాగ్యశ్రీ

  • విజయనగరం, kkbhagyasree@gmail.com
  • 9440296076
కె.కె.భాగ్యశ్రీ

మనవరాలివల్ల ఫేస్‌బుక్‌ మత్తెక్కుతుంది మీనాక్షమ్మకి. పిల్లలతోపాటూ ఈవిడ కూడానా.. అని వాపోతారు గంగాధరం, సరోజిని. పిల్ల పెళ్లి ఎలారా దేవుడా అని అనుకునేంతలో.. ఆ మీనాక్షమ్మ వెతకబోయిన పిల్లిని చంకలోనే గమ్మత్తుగ ఎలా చూపిందంటే...
‘‘పొద్దస్తమానం
గదిలో తలుపులేసుకుని ఆ కంప్యూటరీ పెట్టెముందు ఏం చేస్తార్రా?’’ అబ్బురంగా అడిగింది మీనాక్షమ్మ కాలేజీనుంచి వచ్చిరాగానే కాళ్లయినా కడుక్కోకుండా సిస్టమ్‌ ముందు ఆసీనుడైన మనవడు సుదీప్‌ని.
      ‘‘అబ్బా! నానమ్మా... ఇంటికి రాగానే ఏంటే నీనస!’’ అప్పటికే సిస్టమ్‌లో నెట్‌ ఆన్‌ చేసి ఫేస్‌బుక్‌ లాగిన్‌ అవుతున్న సుదీప్‌ విసుగ్గా నుదురు చిట్లించాడు.
      ‘‘మగపిల్లాడు.. వాడినంటున్నారుకాని, మీ ముద్దుల మనవరాలు మాత్రం తక్కువతిందా! వాళ్ల నాన్నతో పోట్లాడి మరీ... అదేదో ఆండ్రాయిడ్‌ ఫోనట... కొనిపించుకుని, ఆకలిదప్పులు మరిచి దానితోనే గడుపుతోందిగా!’’ అత్తగారు తన కొడుకును విమర్శించడం సహించలేని సరోజిని అక్కసుగా దెప్పిపొడిచింది.
      ‘‘బాగుంది! ఉరుము ఉరిమి మంగలంమీద పడిందనీ... మధ్యలో దాన్నాడిపోసుకుంటావెందుకు?’’ తన పేరు పెట్టుకుందన్న ఒకే ఒక్క కారణం చేత మనవరాలేంచేసినా ముచ్చటపడే మీనాక్షమ్మ   వెనకేసుకొచ్చింది. అక్కడే సోఫాలో కూర్చుని సెల్‌ ఫేస్‌బుక్‌లో ఛాట్‌ చేస్తున్న మీనా తనని సపోర్ట్‌ చేసినందుకు నాయనమ్మవైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది.
      ‘‘అలా మీరిద్దరూ వాళ్లిద్దరినీ సమర్థించుకు రండి... కొన్నాళ్లుపోతే ఇద్దరూ ఆ ఫేస్‌బుక్‌ వ్యసనానికి బానిసలైపోయి దేనికీ పనికిరాకుండా పోతారు’’.. ఏదో వారపత్రిక చదువుతున్న గంగాధర్‌ అందరినీ ఉద్దేశించి ఉమ్మడిగా కేకలేశాడు. 
      అత్తాకోడళ్లిద్దరూ ఏకమైపోయి అతడివైపు కోపంగా చూశారు. సరోజిని గొణుక్కుంటూ వంటింట్లోకి నడిచింది.
మీనాక్షమ్మ మనవరాలి పక్కనే మెల్లగా కూర్చుంటూ ‘‘నాన్న అన్నాడని కాదు గానీ, అస్తమానం ఆ ‘పాసుబుక్కో’ ఏదో.. అందులో దూరిపోయి ఉండిపోకమ్మా! చదువు మనకి ముఖ్యం కదా!’’ అంది అనునయంగా.
      ‘‘హయ్యో.. పాస్‌బుక్‌ కాదు నానమ్మా.. ఫేస్‌బుక్‌..’’
      ‘‘ఏదో ఒకటిలేవే అమ్మాయ్‌! ఇంతకీ ‘ఫేస్‌బుక్కు’ అంటే ఏంటే?’’ ఆత్రంగా అడిగింది మీనాక్షమ్మ. 
      ‘‘అదో సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ నానమ్మా... అందులోంచి మనం ప్రపంచం నలుమూలల్లో ఉన్నవాళ్లెవరితోనైనా స్నేహం చేయవచ్చు. అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు ఒకరికొకరు పరస్పరం పంచుకోవచ్చన్నమాట..’’ ఓపికగా వివరించింది మీనా.
      ఆశ్చర్యంతో బుగ్గన వేలేసుకుంటూ ‘‘అవునా! ఎన్ని కనిపెట్టారీ మనుషులు! అందుకే కాబోలు... ఆమధ్యన మాఫ్రెండ్‌ మంగతాయారు లేదూ... అది అడిగింది... ‘ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ ఉందా!’ అని, జడ్డి ముఖందాన్ని అప్పుడర్థమవలేదు’’ అంది మీనాక్షమ్మ కళ్లలో విస్మయాన్ని కురిపిస్తూ.
      మీనా ఓసారి నానమ్మ వైపు చూసి ‘‘ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కావాలంటే నువ్వుకూడా ఓ అకౌంట్‌ తెరవచ్చు’’ అంది.
      ‘‘సరిపోయింది! ఉన్న మీ ఇద్దరితోటే చస్తూ ఉంటే మా అమ్మని కూడా ఈ వ్యసనానికి బానిస చేస్తారటే?’’ గుడ్లురిమి గయ్‌ మన్నాడు గంగాధర్‌.
      ‘‘అయినా... ఫేస్‌బుక్‌ ఉన్నది మా యూత్‌ కోసమేకానీ, నీలాంటి ముసలాళ్లకోసం కాదు.’’ ఇందాక తనని తిట్టిందన్న అక్కసును మనసులో ఉంచుకున్న సుదీప్‌ ఎద్దేవా చేశాడు.
      ‘‘వాడిమాటలేమీ పట్టించుకోకు నాన్నమ్మా... నువ్వు నాపార్టీ అని వాడికి కుళ్లు. నువ్వు మా అందరికన్నా యూత్‌. నీకు అకౌంట్‌ నేను ఓపెన్‌ చేసి పెడతాగా’’ ఊరడించింది మీనా.
      ‘‘నువ్వు ఓపెన్‌ చేస్తావు సరే! నాకు దాన్నెలా ఉపయోగించాలో తెలియాలిగా!’’ సందేహం వ్యక్తం చేసింది మీనాక్షమ్మ.
      ‘‘ఇదేమన్నా బ్రహ్మవిద్యా! నాలుగు రోజులు నేర్చుకుంటే అదే అలవాటైపోతుంది. నీకు ఇంగ్లిష్‌ చదవడం వచ్చుకదా!’’ చెప్పింది మీనా.
      ‘‘ ఆఁ...భేషుగ్గా. నేను సెకండ్‌ ఫారం ఫస్టులో పాసయ్యాను తెలుసా!’’ గర్వంగా చెప్పింది మీనాక్షమ్మ.
      ‘‘ఆఁ.. అడుగునుంచి ఫస్టు.. పాపం!’’ వెక్కిరించాడు సుదీప్‌.
      ‘‘చూడ్రా అబ్బాయ్‌... నీకొడుకు నన్నెలా హేళన చేస్తున్నాడో!’’ మనవడి మీద కొడుక్కి ఫిర్యాదు చేసింది మీనాక్షమ్మ.
      ‘‘ఏంట్రా అది! పెద్దంతరం చిన్నంతరం లేకుండా’’ అంటూ కొడుకుని మందలించి, ‘‘అయినా వాళ్లనని ఏం లాభం అమ్మా... వాళ్లకి అతిచనువిచ్చి నెత్తినెక్కించుకున్నది నువ్వు. అందుకే వాళ్లు నిన్ను ఖాతరు చేయటం లేదు’’ అన్నాడు గంగాధర్‌ తప్పంతా తల్లిదే అన్నట్లు.
      ‘‘సరిపోయింది సంబడం. అటుతిరిగి, ఇటుతిరిగి నామీదకే వచ్చింది...’’ మూతి ముడిచింది మీనాక్షమ్మ. 
      ‘‘నాన్నమాటలకేంగాని... ఇలారా. ఫేస్‌బుక్‌లో నీకు అకౌంట్‌ ఓపెన్‌ చేసి ప్రొఫైల్‌ క్రియేట్‌ చేస్తాను’’ అంటూ దగ్గరగా కూర్చోబెట్టుకొని వివరాలడిగింది మీనా.
తరువాత తన సెల్‌ఫోన్‌ ఆవిడ చేతికిచ్చి ‘‘పాస్‌వర్డ్‌ టైప్‌ చేయి నానమ్మా’’ అంది.
      ‘‘పాస్‌వర్డా? అంటే?’’ అయోమయంగా అడిగింది మీనాక్షమ్మ.
      ‘‘అంటే... నువ్వు ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అవాలంటే నీ పాస్‌వర్డ్‌ ఇక్కడ టైప్‌ చేయాలన్నమాట. అలా చేస్తేకాని, నీ అకౌంట్‌ ఓపెన్‌ అవదు. వేరే ఎవరూ కూడా దీన్ని మిస్‌యూజ్‌ చేయకుండా సేఫ్టీ కోసమన్నమాట’’ విసుక్కోకుండా నానమ్మ సందేహాలను తీర్చసాగింది మీనా.
      ‘‘ఏదో ఒకటి... నువ్వే టైప్‌ చేయి’’ మీనాక్షమ్మ చెప్పింది కాస్త విసుగ్గా. 
      ‘‘అలా వద్దు నానమ్మా... మన పాస్‌వర్డ్‌  ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. అది చాలా రహస్యం..’’ అంది మీనా.
       ఆఖరికి మనవరాలి సూచనల ప్రకారం ‘శ్రీరామ’ అంటూ పాస్‌వర్డ్‌ కొట్టింది మీనాక్షమ్మ.
      ‘‘అయిపోయింది నానమ్మా... పాస్‌వర్డ్‌ మాత్రం గుర్తుంచుకో. లేకపోతే లాగిన్‌ అవాలంటే కష్టం’’ హెచ్చరించింది మీనా. 
      అలాగేనని తలూపుతూ.. ‘వెర్రి కుదిరింది, రోకలి తలకి చుట్టమన్నాడట... వెనకటికెవడో!’ అంటూ తనలోతానే గొణుక్కుంది.

* * *

      అదేదో సినిమాలో బ్రహ్మానందం చిన్న హింటిస్తే చెలరేగిపోయాడన్నట్లు  మనవరాలు కాస్త అలవాటు చేస్తే అల్లుకుపోయింది మీనాక్షమ్మ. తాను  దాచుకున్న డబ్బులు అన్నీ పెట్టి టచ్‌ స్క్రీన్‌ సెల్‌ఫోన్‌ ఒకటి కొనిపించుకుంది. దానిలో ఎడాపెడా ఫేస్‌బుక్‌ వాడటం మొదలెట్టింది. ఇదివరకు పొద్దున్నే నిద్రలేచి కోడలికి వంటగదిలో సాయపడుతూ కృష్ణా, రామా అనుకుంటూ కాలం గడిపే ఆమెకి ఫేస్‌బుక్‌ తోడిదే లోకమైంది.
      పొద్దున్నే దినవారీ కార్యక్రమాలు, పూజాదికాలు ముగించుకుని ఆ ఫేస్‌బుక్‌ తెరుచుకుని కూర్చుంటోంది. ఎప్పటికప్పుడు తన స్టేటస్‌ అప్‌డేట్‌ చేస్తూ, కొత్త పోస్టులు పెడుతూ బోలెడంతమంది స్నేహితులని సంపాదించుకుని తలమునకలుగా ఉంటోంది.
      అంతేకాదు... కొత్తగా పచ్చళ్లు పెట్టినా, గుమ్మడి వడియాలు పెట్టినా, జంతికలు పిండినా, సున్నుండలు చేసినా, దేవాలయాలకి పురాణ కాలక్షేపాలకి వెళ్లినా అన్నింటినీ ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి బోలెడన్ని లైక్‌లు, కామెంట్‌లు సంపాదించుకుంటోంది.
మీనాక్షమ్మకి ఫేస్‌బుక్‌లో ఉన్న స్నేహితుల సంఖ్య అక్షరాలా... రెండువేల రెండువందల నలభై ఆరు మందే పాపం! 
      ‘‘ఇంకో రెండువందల యాభైనాలుగు మంది కూడితే రౌండ్‌ ఫిగరైపోతుందే మీనా’’ అంటూ వాపోతూ ఉంటుంది మీనాక్షమ్మ.
      అత్తగారి వైఖరి అసహనాన్ని కలిగించినా పెద్దామెని మందలించలేక విసుక్కుంటూ ఊరుకునేది సరోజిని.
      గంగాధర్‌ మాత్రం అప్పుడప్పుడు తల్లిని మందలిస్తాడు సున్నితంగా. అయినా మీనాక్షమ్మ పట్టించుకోదు. తన ఎదుగుదలని కొడుకు కోడలు సహించలేకపోతున్నారని తనని తాను సమాధాన పరుచుకుంటుంది.
      ఓరోజు సుదీప్‌ కాలేజ్‌ నుంచి వస్తూనే రంకెలేయడం ప్రారంభించాడు.
      ‘‘ముసలిదానికి ఫేస్‌బుక్‌ ఎందుకంటే వినిపించుకోలేదు నువ్వు... ఇప్పుడు చూడు ఏం చేసిందో!’’ అన్నాడు ఏడుపు ముఖంతో.
      ‘‘ఏం జరిగిందిరా?’’ అనునయంగా కొడుకును ప్రశ్నించింది సరోజిని. 
      ‘‘రాన్రాను నానమ్మ ఆగడాలకి అంతూపొంతూ లేకుండా పోతోంది. ఎప్పుడో చిన్నప్పుడు నేను నీళ్ల తొట్టి దగ్గర స్నానమాడుతున్న ఫొటోని నా అనుమతి లేకుండా ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేసి పారేసింది. నా ఖర్మకొద్దీ నా ఫ్రెండ్సందరూ ఈవిడగారి ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్నారు. ఇక చూస్కో... అందరూ ఆ ఫొటో చూసి అడ్డదిడ్డమైన కామెంట్స్‌ పెట్టారు.’’ ఇక ఏడవడమొక్కటే మిగిలిన చందాన చెప్పాడు సుదీప్‌.
      ‘‘ఏంటత్తయ్యా ఇది? పిల్లాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో...’’ అడిగింది సరోజిని.
       ‘‘నా మనవడి బాల్య స్మృతులని నా స్నేహితులకి పరిచయం చేయాలనుకున్నా.. తప్పా?’’ ఎదురు ప్రశ్నించింది మీనాక్షమ్మ.
      ‘‘అయితే మాత్రం.. అలాంటి ఫొటోలా పెట్టేదీ?’’ గగ్గోలుపెట్టాడు సుదీప్‌.
      ‘‘పోనీలేరా... ఏదో తెలియక చేశాను. ఈసారి నిన్నడిగే పెడతానులే...’’ రాజీకొచ్చింది మీనాక్షమ్మ.
      గుర్రుగా చూశాడు సుదీప్‌. నానమ్మని చూస్తే మంటగా ఉన్నా, ఆమె చురుకుదŸనానికి ముచ్చటపడ్డాడో క్షణం. 
      ఇదివరకైతే కోడలు ఏదైనా పనిమీద బయటకు పోవాల్సి వచ్చినా, ఏపెళ్లికో పేరంటానికో వెళ్లినా తనని పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేసి పోతుందని గగ్గోలుపెట్టే ఆవిడ, ఇప్పుడు ఎటైనా వెళ్లిరమ్మని ఉదారంగా దగ్గరుండి మరీ సాగనంపుతోంది.
      తననెన్ని విధాలుగా కనిపెట్టినా ఇంకా ఏదో లోటైందని కుక్కమీదా పిల్లిమీదా పెట్టి కోడల్ని సాధించుకు తినే మీనాక్షమ్మ ఇప్పుడా ఊసే ఎరగనట్లుగా పరమ సాధుజీవిగా మారిపోయింది. ఇదంతా ఫేస్‌బుక్‌ వేసిన మంత్రమే అని వేరే చెప్పనక్కరలేదు. ఆ ఫేస్‌బుక్‌ మాయలో పడిన ఆవిడకి ఇప్పుడిలాంటివన్నీ అతి చిన్న, సామాన్య విషయాల్లా కనిపిస్తున్నాయి.
      అంతేకాదు... ఉత్తరాంధ్రలో ఉండే ఫేస్‌బుక్‌ మిత్రులందరూ విశాఖలో మీట్‌ పెట్టుకుంటే, కొత్త ఉత్సాహం తెచ్చుకుని మరీ విశాఖ వెళ్లి అందరినీ కలిసి హాయిగా గడిపొచ్చింది.
      ఏదైనా అవసరం పడి వీధిచివరనున్న కిరాణాకొట్టుకు వెళ్లిరమ్మంటే మోకాళ్లనొప్పులని, అడుగుదీసి అడుగేయలేకుండా ఉన్నానని కుంటిసాకులు  చెప్పే అత్తగారు తన శరీరస్థితి మరచి కుర్రపిల్లలా ఎగురుకుంటూ వెళ్లడం సరోజినికి విచిత్రంగా అనిపిస్తోంది.
      అత్తగారు ఫేస్‌బుక్‌ మత్తులో పడి ఈలోకాన్ని మరచిపోవడం సరోజినికి కాస్త చోద్యంగా అనిపించినా మునుపటిలా ఆవిడ ప్రతి విషయానికీ తనమీద దండెత్తడం మానేసి కూల్‌గా ప్రవర్తించడం మాత్రం తెగ నచ్చేసింది.
      మొత్తానికి  ఫేస్‌బుక్‌లో మీనాక్షమ్మ జీవితం మూడు లైకులు, ఆరు కామెంట్స్‌గా వర్ధిల్లుతోంది.
      ‘‘ఏమిటో సరోజా... పిల్లకెన్ని సంబంధాలు చూసినా కుదరడంలేదు. అందరూ బి.టెక్‌.లూ, ఎమ్‌.టెక్‌.లూ, ఎం.బి.ఏ.లు, ఎం.సి.ఏలు చేసిన పిల్లలే కావాలంటున్నారు. మనపిల్లేమో కనీసం బి.టెక్‌. కూడా చదవలేదు.’’ విచారంగా అన్నాడు గంగాధర్‌
      ‘‘అవును... ఇంజినీరింగ్‌లో చేరవే అమ్మా... అని చెవినిల్లు కట్టుకుని పోరితే వినకుండా తెలుగు సాహిత్యంలో ఎమ్మేచేస్తానంటూ పట్టుబట్టి మరీ అదే చదివింది. ఈ కాలం మగపిల్లలు తమతో సమానమైన చదువు చదివిన అమ్మాయిలకే ప్రిఫరెన్స్‌ ఇస్తున్నారు...’’ కూతురి చదువు ఆమె పెళ్లికి ఎంతమాత్రం సహకరించడం లేదన్న బెంగ కనిపించింది సరోజిని మాటల్లో.
      ‘‘ఇదీ మరీ బాగుంది... చదువు నాకోసం, నా విజ్ఞానం కోసం... పెళ్లి కోసం కాదు. రానీ ఎవడైతే వాడే అవుతాడు... లేకపోతే ఇలానే ఉంటాను. అంతమాత్రాన భూప్రపంచం తలకిందులైపోదులే...’’ తల్లి దెప్పుళ్లు భరించలేనట్లుగా ఉక్రోషంగా అంది మీనా.
      ‘‘ఏంట్రా... మీగోలా!’’ అడిగింది మీనాక్షమ్మ ‘ముఖపుస్తకం’ అదే... ఫేస్‌బుక్‌లోంచి తల బయటికి పెట్టి. 
      ‘‘మేమెప్పటినుంచో మొత్తుకుంటూంటే మీకిప్పటికి కాని తెలివిరాలేదు పాపం! కుర్రపిల్లలకన్నా కనాకష్టంగా ఆ ఫేస్‌బుక్‌లో మునిగి తేలుతున్నారు మరీ!’’ అవకాశం దొరికింది కదాని వ్యంగ్యబాణాలు వేసింది సరోజిని.
      ‘‘అబ్బ... నన్ను దెప్పిపొడిచే ఏ ఛాన్సూ కూడ నువ్వు వదులుకోవు కదా! సరేలే... విషయం చెప్పు’’ అంది మీనాక్షమ్మ.
      గంగాధర్‌ క్లుప్తంగా సంగతి చెప్పాడు.
మీనాక్షమ్మ తేలికగా ఓ నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వు చూసి ‘‘ఇంత జటిలమైన సమస్యతో తామంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే ఈవిడింత కులాసాగా ఎలా నవ్వగలుగుతోందో! కొంపదీసి ఈ ఫేస్‌ బుక్‌కి అడిక్ట్‌ అయి పిచ్చిగాని ఎక్కలేదుకదా!’’ సందేహించింది సరోజిని.
      ‘‘ఏంటమ్మా... నవ్వుతావు! మీనా పెళ్లి గురించి మాకు చాలా దిగులుగా ఉంది తెలుసా!’’ ముఖం చిన్నబుచ్చుకున్నాడు గంగాధర్‌.
      ‘‘వెర్రిసన్నాసీ...ఎందుకురా దిగులు? మన మీనాకేమన్నా కన్నొంకరా, కాలొంకరా... అందాల రాకుమారుడు రెక్కల గుర్రం మీదెక్కి మీనాను ఎగరేసుకుపోతాడు చూడు’’ అంటూ కొడుకును ఊరడించింది. 
      ‘‘నో డౌట్‌... ఈవిడకి పిచ్చి ముదిరిపోయింది’’ నిర్ధారణకి వచ్చేసింది సరోజిని. గంగాధర్‌ మాత్రం తల్లి ఇచ్చిన హమీతో కాస్త కుదుటపట్టాడు.

* * *

      ‘‘ఒరే అబ్బాయ్‌! రేపు ఆఫీస్‌కి సెలవు పెట్టు... మీనా నువ్వు కూడా ఎక్కడికీ వెళ్లకు...’’ చెప్పింది మీనాక్షమ్మ ఆనాటి ఉదయం.
      ‘‘ఎందుకమ్మా?’’ అడిగాడు గంగాధర్‌.
      ‘‘ఏంలేదురా అబ్బాయ్‌... నా ఫేస్‌బుక్‌ ఫ్రెండొకరు మనింటికి  వస్తున్నారు’’ చెప్పింది మీనాక్షమ్మ.
      ‘‘నీ ఫ్రెండ్స్‌ వస్తే నేనెందుకు ఇంట్లో ఉండటం!’’ ఎదురు ప్రశ్న వేసింది మీనా.
      ‘‘నా బంగారుతల్లి కదూ! నా మాట వినమ్మా...’’ బతిమాలింది మీనాక్షమ్మ.
      మెత్తబడింది మీనా. మరునాడు ఉదయం నుంచీ ఇంట్లో హడావుడి మొదలైంది. కోడలికి చెప్పి ఇల్లంతా చక్కగా సర్దించింది. ఫలహారాలు, పళ్లరసాలు సిద్ధం చేయించింది. మీనాని చక్కగా ముస్తాబు అవమని చెప్పింది. 
      ‘‘ముక్కు మొహం తెలియని ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ కోసం ఇంత హంగామా చెయ్యాలా! విడ్డూరం కాకపోతేనూ...’’ ఆవిడ పడుతున్న హైరానా చూసి ముక్కున వేలేసుకుంది సరోజిని.
      అతిథులు రానే వచ్చారు. సాదర స్వాగతాలు, ఆప్యాయత నిండిన పలకరింపులూ పూర్తయ్యాయి. 
      ‘‘నమస్తే, నాపేరు నరేంద్ర. ఈయన మా నాన్నగారు రాఘవరావుగారు. ఇతడు మా అబ్బాయి ప్రవీణ్‌. ఆముదాలవలసలో పాలిటెక్నిక్‌ కాలేజ్‌ లెక్చరర్‌. ఈమె నా భార్య కుముద. మా అమ్మాయి పల్లవి’’ అంటూ తననీ తన కుటుంబాన్నీ పరిచయం చేసుకున్నాడతడు.
      ప్రతి నమస్కారం చేశాడు గంగాధర్‌.
      ‘‘మీ అమ్మగారి ఫేస్‌బుక్‌ పరిచయాన్ని బేస్‌గా తీసుకుని మీ ఇంటికి వచ్చేశామేంటా! అని మీరాశ్చర్య పోతున్నారని నాకు తెలుసు. కానీ, మేం రావడం వెనుక కారణం ఇంకోటి ఉంది’’ చిరునవ్వుతో చెప్పాడు నరేంద్ర.
      ‘‘అంతగా ఆశ్చర్యపోకండి. మీరు మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకుని మా మనవడికి మీ అమ్మాయిని అడగడానికి వచ్చాం’’ ఈ సారి రాఘవరావు చెప్పాడు.
      గంగాధర్‌ మరింత అచ్చెరువొందాడు ఆయన మాటలకి. ఇదెవరి నిర్వాకమో అర్థమైందతడికి.
      ‘‘అమ్మా ఓసారిలా లోపలికిరా...’’ సాధ్యమైనంత మృదువుగా మీనాక్షమ్మని పిలిచి లోపలికి తీసుకెళ్లాడు. 
      ‘‘నీ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ని ఇంటికి పిలిచి ఆదరించడం వరకు ఓకే. కాని వాళ్లెవరో, ఏంటో తెలియకుండా ఈ పెళ్లి చూపులేంటమ్మా?’’ ప్రశ్నించాడు గంగాధర్‌ ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అణచుకుంటూ.
      మీనాక్షమ్మ ఏమాత్రం చలించకుండా తనదైన శైలిలో చిరునవ్వొకటి విసురుతూ ‘‘అందుకే నిన్ను వెర్రిసన్నాసి అనేది మరి! ఎవరికో సంబంధం చూస్తేనే ముందు వెనకలు, మంచిచెడ్డలు అన్నీ విచారిస్తామే! అలాంటిది నా మనవరాలి విషయంలో అంత అజాగ్రత్తగా ఉంటానా! ఆ రాఘవరావు నాకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ అవడానికి పూర్వమే మా మంగతాయారుకి దగ్గరి బంధువు. మొన్నామధ్యన నేను, అది ఛాటింగ్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు మీనా పెళ్లి ప్రస్తావన వచ్చింది.
      అప్పుడు మంగతాయారు ఈ సంబంధం గురించి చెప్పి మనకన్ని విధాలా అనుకూలమైన సంబంధం అని నన్ను ముందుకు తోసింది. కుర్రాడికి చదువుకున్న అమ్మాయి కావాలి.. కానీ, ఎక్కడో దూరప్రాంతాల్లో ఉద్యోగంచేసే అమ్మాయి అక్కరలేదన్నాడట.
      తాను ఒక్కడే కొడుకు కాబట్టి తల్లిదండ్రులను విడిచి ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదట. ఆరకంగా చూస్తే అతడు మీనాకి తగిన వరుడనిపించింది. పైగా పిల్ల మన కంటి ముందే ఉంటుంది. ఏమంటావు?...అంది మీనాక్షమ్మ కళ్లజోడు సవరించుకుంటూ. 
      ఇంకేమంటాడు! తల్లి ఫేస్‌బుక్‌ వ్యసనం ఇంత శుభంగా పరిణమిస్తుందని అతడసలు అనుకోలేదు. ఎగిరిగంతులేశాడు సంతోషంతో కిందా మీదా పడుతూ.
      ఆ తరువాత అన్నీ చకచకా జరిగిపోయాయి. పిల్లా పిల్లాడూ ఒకరికొకరు నచ్చడంతో, పెద్దలూ పరస్పరం ఆమోదించారు. రెండు నెలల్లో మీనా, ప్రవీణ్‌ల కల్యాణం అంగరంగవైభోగంగా జరిగిపోయింది. పెళ్లికి చుట్టుపక్కల ఉన్న మీనాక్షమ్మ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ కూడా విచ్చేసి వధూవరులనాశీర్వదించారు. 
      మనవరాలి పెళ్లి ఫొటోలని ఫేస్‌బుక్‌లో పెడుతున్న అత్తగారిని మురిపెంగా చూసింది సరోజిని.

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ఎందరో మహానుభావులు!

ఎందరో మహానుభావులు!

కె.ఎల్‌.సూర్య


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్లbal bharatam