నాటకాలాయనింట్లో పాము

  • 1468 Views
  • 19Likes
  • Like
  • Article Share

    చంద్రశేఖర్‌ ఇండ్ల

  • పరిశోధక విద్యార్థి, కేంద్రీయ విశ్వవిద్యాలయం
  • హైదరాబాదు.
  • 9912416123
చంద్రశేఖర్‌ ఇండ్ల

పుట్టలో ఉంటే పాలు పోస్తారు... పుట్ట బయటకు వస్తే కొట్టి చంపుతారు... ఏంటో ఈ మనుషులు... ఓ పాము వ్యథ! తప్పుడు వేషాలేసే వాళ్లకు మొక్కుతారు. కళ కోసం రంగుపూసుకునే వాళ్లను గేలి చేస్తారు... ఏంటో    ఈ మనుషులు... ఓ నాటకాలాయన కథ!! ఆ వ్యథ... ఈ కథ... కలిస్తే...!? 
‘‘ఛీ
ఈ మనుషులేంటోయ్‌ సాటి జీవాలని కొంచెం కూడా అర్థం చేసుకోరు. వాళ్లకు ఆనందం పొంగినా బలయ్యేది మేమే, వాళ్లకి కోపం వచ్చినా బలయ్యేది మేమే. ఇదేం న్యాయం? నిన్ననే కదా నాగులచవితని చెప్పి వద్దు వద్దు అన్నా వినకుండా నా పుట్టనూ, పొట్టనూ పాలతో నింపారు. ఇంతలోనే ఈ ఖర్మేంటీ?’’ అనుకుందా పాము పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చెమట తుడుచుకుంటూ.
      ‘‘అయినా నేను చేసిన తప్పేంటోయ్‌? నిండిన నా పొట్ట బరువు తగ్గించుకోడానికి పుట్ట విడిచి బయటకు రావడం తప్పా? అయినా స్థలాన్ని బట్టి మర్యాదిచ్చే మనుషులు మీరేం మనుషులోయ్‌. రాయి గుడిబయట ఉంటే గుండ్రాయి, లోపలుంటే బొడ్రాయా? బయట ఉంటే బోడిలింగం లోపలుంటే శివలింగమా? అడిగేవారు లేరనేగా మనుషుల దగ్గర ఇన్ని అన్యాయాలు. అయ్యో భగవంతుడా నాకెందుకయ్యా ఇలాంటి రాతరాశావు. సాగరమథనంలో సురాసురుల మధ్య నలిగిపోయేలా! ఇంకోసారి బాలకృష్ణుని పాదాల కింద చితికిపోయేలా! ఇప్పుడు ఈ పాపిష్ఠోళ్ల కర్రల కింద పచ్చడిపచ్చడి అయ్యేలా. ఇది దారుణం కదా? మాకు నోరులేదనేగా - మనసులోనైనా నిన్ను తిట్టలేదనేగా? చూస్తా.. ఈ గండం గట్టెక్కనియ్‌ నీ అంతు తేలుస్తా’’ అని మంగమ్మ శపథం చేసుకొంది మనసులోనే.
      ‘‘చూడు ఈ దరిద్రుడు ఎంత శ్రద్ధగా వెతుకు తున్నాడో నన్ను చంపడానికి... వీడి చింపిరి గెడ్డం వీడూనూ... వీడి పెళ్లాం పక్కింటోడితో పోయి పదేళ్లయ్యిందని మా అమ్మ చెప్పింది, అప్పుడే ఇలా వెతికుంటే ఎప్పుడో దొరికేది. ఒరేయ్‌ వెతికింది చాల్లేగానీ ఇంటికి పోరారేయ్‌... రెండో పెళ్లాన్నయినా దక్కించుకోరా దరిద్రపు సచ్చినోడ. ఒరేయ్‌ ఇంకో మాట నేను పుట్టలో ఉన్నప్పుడు మర్యాదిచ్చారన్న ఒకే ఒక్క కారణంతో మీ పిల్లలు ఎన్నోసార్లు నా పుట్టమీదున్న తాటిచెట్లు ఎక్కుతున్నా చూస్తూ ఊరుకున్నాను గానీ, బుస్‌మని ఒక్క బుస కూడా విడవలేదు. అందుకిదా మీరిచ్చే గౌరవం. మీరిచ్చే బహుమానం... పోండ్రా విశ్వాసం మాలినోళ్లారా’’ అని తిట్లు లంకించుకుంది. 
      కారుతున్న చెమటని చెట్ల ఆకులతో తుడుచుకుంటు, తోకతో గాలి విసురుకుంటూ... నెమ్మదిగా ఆకుల మధ్యలోంచి బయటికి చూసింది. భయంవల్లనో చావు దగ్గరపడటం వల్లనో ప్రతి ఒక్కరూ యముడిలాగానే కనిపిస్తున్నారా పాముకి. గుండె గతుక్కుమంది అంతమంది యముళ్లను ఒక్కసారే చూసేసరికి. కళ్లు మూసుకుంది. చుట్టూతా మనుషులు తెగ గాలిస్తున్నారు. పెద్దపెద్ద కర్రలు పట్టుకొని, ఒకరిని చూసి ఒకరు జనాలు గుంపులు కడుతున్నారు. వందల కళ్లు పాము కోసమే వెతుకుతున్నాయి. గుబురుగా ఉన్న చెట్లలో ఉండటంవల్ల ఇంతసేపు బతికి బుస విడవగలిగింది. 
      ‘‘ఒరేయ్‌ నువ్వు నిజంగా పాముని చూశావట్రా’’ అన్నాడొకడు గుంపులోంచి. 
      ‘‘మామా నేనెప్పుడయినా అబద్ధమాట్టం చూశావా, అబద్ధపు మాటలు సెప్పేవాడినయితే జనమంతా నన్నే ఎందుకు అరిచ్ఛంద్రుడు అని పిలుత్తారు సెప్పు’’ అన్నాడు హరిశ్చంద్రుడు అనబడే నిజాయతీపరుడు. 
      ‘‘ఎంత పొడుగుందేందిరా అరిచ్చంద్రా’’ అడిగాడు ఇంకొకడు ఇంకో గుంపులోంచి. 
      ‘‘దీనెమ్మ సరిగ్గా నీ సేతిలో కర్రంత పొడుగుంది మామా’’. 
      ‘‘నాయాల్లార అదెప్పుడో పోయుంటుందిలేరా, ఇక ఇళ్లకు పోకూడదా నా కర్ర నాకిచ్చి’’ అన్నాడు గోడమీద కూర్చుని ఇదంతా గమనిస్తున్న నాటకాలాయన.
      ‘‘ఊరుకోరోయ్‌ ఇక్కడ పిల్లా జెల్లా తిరుగుతుంటారు, వాళ్లకేమైనా అయితే ఎవురికి నష్టం. ఇద్దరు పిల్లలు కల్లోణ్ని నాక్కద నష్టం, నీకేం ఎన్నయినా సెప్తావ్‌. పిల్లలా జెల్లలా; పెళ్లీ పెటాకులు లేకుండా నాటకాలంటూ తిరుగుతుంటావ్‌ నీకేం నాయనా!’’ అన్నాడు హరిశ్చంద్రుడు. 
      నాటకాలాయన ఇంట్లోకెళ్లి మందు బాటిల్‌ ఓపెన్‌ చేశాడు.
      పక్కనే ఏదో అలికిడి అయినట్లుంటే... ప్రాణాలు విడిచేసి కొసప్రాణంతో కళ్లు తెరిచింది పాము పరిగెత్తడానికి సిద్ధమవుతూ... పక్కనే గజగజ వణుకుతూ ఓ ఉడుతపిల్ల బిక్కుబిక్కుమని పామువైపు చూస్తోంది. పాముకు చిర్రెత్తుకొచ్చింది. హరిశ్చంద్రుడి చేతిలో కర్ర తీసుకుని ఉడతని ల్లాగి ల్లాగి కొట్టాలనిపించింది పాముకి. ఇంతలో పోయిన ప్రాణం తిరిగొచ్చి మళ్లీ పాములో కలిసిపోయింది. 
      ‘‘థూ... థూ... ఎంత భయపడ్డాను’’ అని తోకతో గుండెల మీద బాదుకుంది. ‘‘ఓయ్‌! అలా వణక్కు.. నీ భయానికి ఆకులు కదులుతున్నాయ్‌. అది చూసి వాళ్లు ఇటు రాగలరు’’ అంది పాము బుస్సు భాషలో. 
      ‘‘నన్ను కాపాడవూ’’ అంది ఉడుత తన భాషలో. 
      పాముకి ఫక్కున నవ్వొచ్చింది కానీ పగలబడి నవ్వితే ప్రాణం పోద్దని గమ్మున ఊరుకుంది. ‘‘డోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లుంది నీ వాలకం. నన్ను కాపాడేదెవరు? నిన్ను కాపాడేదెవరు? అయినా నీకెందుకు భయం? వాళ్లు వెతుకుతోంది నా కోసం’’ అని నెమ్మదిగా చెప్పింది పాము. 
      ‘‘నేను జనాల్లో బతికినదాన్ని. వాళ్ల సంగతి నాకు బాగా తెలుసు. దొరికినోణ్నే దొంగగా భావించే గొప్ప సంస్కృతి వాళ్లల్లో ఉంది. అందుకే నా భయం’’ అంది ఉడుత వణికిపోతూ.
      ‘‘అది సరే అలా వణక్కు. నీ వల్ల ఆకులు కదులుతున్నాయ్‌’’ అంది పాము. వణుకు తగ్గలేదు ఉడుతకి. 
      ‘‘వణకొద్దన్నానా?!’’ అంది పాము. వణక్కుండా ఉండలేకపోయింది ఉడుత. కోపంతో ఉడుత మీదికి దూకింది పాము. భయంతో పరుగు లంకించుకుంది ఉడుత.
      ‘‘అదిగోరా పాము’’ అన్నాడు హరిశ్చంద్రుడు ఉడుత వెంట పరిగెడుతూ. హరిశ్చంద్రుడు సెప్తే అది రైటే అనుకొని జనమంతా అటుకేసి పరిగెత్తారు. హమ్మయ్యా! అనుకొని పాము నిమిషానికి నూటఎనభై కిలోమీటర్ల వేగంతో పక్కనే ఉన్న నాటకాలాయనింట్లో దూరింది.

*  *  *

      పది వేషాలేసి విష్ణుమూర్తి ఇతిహాసాల్లో హీరో అయిపోయాడు. ‘‘ఇదిగో పుట్టినప్పట్నుంచి వేషాలేస్తున్న నేను కూడా విష్ణుమూర్తి అంతటోణ్నే’’ అని తనకు తానే గొప్ప గొప్ప బిరుదులిచ్చుకున్న కళాకారుడు. మనిషికి మనసుకు మధ్య గొప్ప ఐక్యత కుదుర్చుకున్న మహానుభావుడు. సంఘం ముద్దుగా అతన్ని ‘గులాకారుడు’ అంటుంది. ఇంకా ముద్దొస్తే ‘పనీపాట లేనోడు’ అంటుంది. ఈయన నాటకం వేస్తుంటే అందరూ స్టేజి ముందుండి చూస్తుంటారు, వాళ్లమ్మా నాన్నలు మాత్రం స్వర్గంలోంచి చూస్తుంటారు. దీవిస్తారో తానుపడే కష్టాలకు ఏడుస్తారో ఎవ్వరికీ తెలియదు. ఎన్ని కష్టాలు; సతీసావిత్రి నాటకంలో యమధర్మరాజులా, భర్త ప్రాణాలు తిరిగి ఇస్తున్నప్పుడు, తండ్రి పాముకాటుతో ఆ యమధర్మరాజుతో వెళ్లిపోయాడు. భర్త ప్రాణాల కోసం యమధర్మరాజు వెంట పరిగెత్తింది అమ్మకూడా. ఇద్దరూ తిరిగిరాలేదు. పద్దెనిమిదేళ్లకే ఒంటరివాడయ్యాడు. మాయాబజార్‌ నాటకంలో శశిరేఖను చేపట్టిన విజయుడైనా అత్తకూతురి విషయంలో మామతో మొఖమ్మీద ఉమ్మించుకొని పెళ్లికి దూరమయ్యాడు. ‘‘నాటకాలేసుకు బతికే నాకొడుక్కి నా కూతురినిస్తానా?’’ ‘‘ఏం ఇవ్వకూడదా’’ ఎందరో అడగాలనుకున్నారు. ‘‘ఈ లోకంలో ఎవరికెవరండీ? అందరికీ ఆ భగవంతుడే’’ అని వేదాంతాలు మాట్లాడారు.
      అమ్మ, నాన్న, పెళ్లి, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఏవీ అతనికి గుర్తుకురావు సిగరెట్టు ముట్టించి మందు మూతతీస్తే!
      చప్పట్లు, దండలు, సన్మానాలు, శాలువాలు, బిరుదులు, ఆనందాలు అతణ్ని ఎంతో ఎత్తులో నిలబెట్టాయి. కానీ ఆనందం అనేది ఒక్క నాటకాలలోనే దొరికే వస్తువైతే నాటాకాలాయన ఇప్పటికే ఒక స్థాయిలో ఉండేవాడు. కానీ ఆనందం రకరకాలుగా దొరకటం మొదలెట్టింది. దొరికిన ఆనందాన్ని ఏ మాత్రం విడిచి పెట్టకుండా అనుభవించడం మొదలెట్టారు ప్రజలు. ఆకలేస్తే అన్నం తింటారు, బోరుకొడితే బారుకెళ్తారు, మూడొస్తే ముద్దులెట్టుకుంటారు. కారులో షికారుకి, చిరాకేస్తే సినిమాకి, తిరగడానికి పార్కుకి, ఎగరడానికి పబ్బుకు, సరదాగా క్లబ్బుకి, ఇవన్నీ కుదరకపోతే చావడానికి ట్యాంకుబండ్‌కి.
      ఈ క్రమంలో నాటకాన్ని నామమాత్రంగా చూడ్డం మొదలెట్టారు, అది జనాల్ని ఆకర్షించలేకపోతోందని ఆరోపిస్తున్నారు. దాని అభివృద్ధికి వ్యాసాలు రాస్తున్నారు. యువత నాటకాల్లోకి రావడం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. నాటకాన్ని నాలుగు గదులకు పరిమితం చేశారు. క్రమక్రమంగా నాటకాలాయన బూటకాలాయనగా మారిపోయాడు. కళ కళ కోసం కాదు... ప్రజల కోసం అని నమ్మి, జనం రాకపోయినా నాలుగు రోడ్ల కూడలిలో పగటి వేషగాడిగా మారిపోయాడు. 

* * *

      పాము - నాటాకాలాయన ఇద్దరూ ఒకర్నొకరు చూసుకున్నారు. ఇద్దరూ ఒంటరివాళ్లే. ఈసారి పాముకు పరిగెత్తాలనిపించలేదు, పారిపోవాలనిపించ లేదు, భయం అసలే లేదు, నాటకాలాయనకూ అంతే. నాటకానికి భాష అవసరం లేదని నమ్మే నాటకాలాయనికి పాము భాష, బాధ బాగా అర్థమయ్యాయి. పాలు పోస్తున్నారన్న విశ్వాసంతో మనుషుల్ని ప్రేమించడం నేర్చుకున్న పాముకి నాటకాలాయన బాగా నచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, బాగా కలిసిపోయారు పాము- పరమశివుడిలా. కాలం పరుగులెత్తింది గంగలా.

* * *

      ఈ రోజుకి నాటకాలాయనది పరమశివుడి వేషం. రబ్బరు పాముకు బదులు నిజమైన పామును ధరించాడు. మనిషి భుజాలమీద ఎక్కినందుకు పాము విపరీతంగా సంబరపడింది. మైకులోంచి వినపడుతున్న ఓపెన్‌ గంగ్నమ్‌స్టైల్‌ పాటకు స్టెప్పులేసింది. ఇద్దరూ బయల్దేరారు బతుకుదెరువుకు. 
      ‘‘ఓయ్‌ నాటకాలాయనో’’ అని పిలిచాడు హరిశ్చంద్రుడు. పాముకి పాస్‌ పడింది వాడి గొంతు వినేసరికి. ‘‘ఏమోయ్‌ నాటకాలాయనా ఇది పరమశివుడి వేషమా? పాములు పట్టేవాడి వేషమా?’’ అని పకపక నవ్వుతున్నాడు దగ్గరికొస్తూ. ‘‘ఓరి దీనెమ్మ! ఇది నిజం పామేరోయ్‌...’’ అని ఒక్క గంతు వెనక్కి వేశాడు పామును తాకబోయి. పాముకి ఆపుకోలేనంత నవ్వొచ్చింది. 
      ‘‘మనుషులకి పాములంటే భయమే! చేతిలో కర్రలున్నంతసేపే వాళ్ల ధైర్యం’’ అనుకుంది మనసులో. 
      ‘‘నోర్మూసుకొని పోరా హరిశ్చంద్రుడా. నేనే ఏసమేత్తే నీకెందుకు’’ అన్నాడు నాటకాలాయన. 
      ‘‘దీనెమ్మ సరిగ్గా ఇలాంటి పామేరా నెల కిందట నేనక్కడ చూసింది’’ అన్నాడు హరిశ్చంద్రుడు. తీక్షణంగా పరిశీలిస్తూ. 
      ‘‘అయితే ఇప్పుడేం చేద్దాంరా పాం కావాల్నా ఏంది?’’ అని పామును తియ్యబోయాడు నాటాకాలాయన. పరిగెత్తాడు హరిశ్చంద్రుడు. హమ్మయ్యా! అనుకుంది పాము. నాటకాలాయన నడుస్తున్న టైం చూసి అతనికి అనుమానం రాకుండా బుగ్గపై ముద్దు పెట్టింది.
      ఇద్దరికీ ఒళ్లంతా చెమటలు. శివుడిలా ఎగిరినందుకు నాటకాలాయనకి, అతని భుజాలమీద కూర్చున్నందుకు పాముకి. చిల్లరసంచి బరువెక్కింది. పాము పరధ్యానంగా ఉన్న టైం చూసి తోకపై ముద్దుపెట్టాడు నాటకాలాయన. 
      సరిగ్గా అప్పుడే ‘‘హలో వెయిట్‌ వెయిట్‌’’ అని పిలిచింది ఒక తెల్లమ్మాయ్‌ చేతిలో కెమెరాతో. పాముకి పరమానందం గా ఉంది ఆ అమ్మాయిని చూస్తుంటే.
      ‘‘కెన్‌ ఐ హ్యావ్‌ ఎ ఫొటో’’ అంది తెల్లమ్మాయ్‌ నాటకాలాయనతో. ఫొటో అనే మాట తప్ప ఏమీ అర్థం కాలేదు నాటకాలాయనకి. ‘‘యా ఫొటో ఫొటో’’ అన్నాడు. రెండు ఫొటోలు తీసుకుంది. పాము పడగ విప్పి పోజులిచ్చిన విషయం నాటకాలాయనకు తెలియదు. ‘‘కెన్‌ ఐ టచ్‌ ద స్నేక్‌’’ అని పాము నడుంపై తన తెల్లని, చల్లని చెయ్యి వేసింది. ‘‘స్‌...స్‌...హబ్బా’’ అని నిట్టూర్చింది కళ్లుమూసుకొని పాము. నాటకాలాయన తెల్లమ్మాయ్‌ ముందు కొంచెంసేపు డాన్స్‌ చేశాడు. పాము కూడా తన్మయత్వంతో తెగ ఎగిరేసింది. బుసలు కొట్టింది. నానా హంగామా చేసింది. ‘‘నైస్‌ డ్యాన్స్‌’’ అని అయిదొందలు ఇచ్చింది నాటకాలాయనకి. ఈ అమ్మాయిది చాలా పెద్ద హృదయం అనుకుంది పాము తెల్లమ్మాయిని తేరిపారచూస్తూ. ‘‘బై’’ చెప్పేసి బస్సెక్కింది తెల్లమ్మాయ్‌. 
      ‘‘నన్నెందుకు తెల్లబ్బాయ్‌గా పుట్టించలేదురా దేవుడా!’’ అని బాధపడింది పాము. ఇంటికెళ్లారు. పాముకి చాలా ఆనందమేసింది మొదటిసారి డబ్బు సంపాదించి దర్జాగా పాలు తాగుతు న్నందుకు. నాటకాలాయన మీద కొంచెం కోపమూ వచ్చింది మందు తాగుతున్నం దుకు. పొట్ట నిండి పాము, మత్తెక్కి మనిషి కళ్లు మూసుకున్నారు. పాము కలలో తెల్లమ్మాయ్, నాటకాలాయన కళ్లలో నిద్ర.

* * *

      పాముకి ఒళ్లు చేసింది, నాటకాలాయన నునుపు తేలాడు. నాటకాలాయన డ్యాన్స్‌ చేస్తూనే ఉన్నాడు... పాము నిర్జీవంగా కూర్చుంది భుజలమీద. ఈ మధ్య నాటకాలాయన మీద పాముకు విపరీతమైన కోపం వస్తోంది. అతని పద్ధతి దానికే మాత్రం నచ్చడంలేదు. ‘‘సంపాయించేది తాగడానికేనా’’ అని దానిలో అది కుమిలి పోయింది. పగలంతా ఒళ్లు పులిసిపోయేలా ఎగరడం, రాత్రంతా ఒళ్లు మరచిపోయేలా తాగడం. పాము గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఆ రోజు మధ్యాహ్నం వచ్చిన డబ్బులతో ఫుల్లుగా తాగాడు, వాగాడు, తూగాడు, దగ్గాడు, కక్కాడు, కక్కుతూనే ఉన్నాడు. దానిమీదే పడుకున్నాడు. కనీసం అరగ్లాసు పాలయినా పోయలేదు పాముకి. ఆకలికి అలమటించింది. ఇన్నాళ్లూ నాటకాలాయన కోసం తప్పితే తనకోసం బతకటం మరచిపోయింది. అడగటానికి పాముకు నోరులేదు, అర్థం చేసుకొనే హృదయం ఇప్పుడు నాటకాలాయనకూ లేదు.
      విసిగిపోయింది, వేసారిపోయింది, నాటకాలాయన పేగులు బయటికొచ్చేలా దగ్గుతుంటే చూడలేకపోయింది. ఇంట్లోంచి  వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది, నాటకాలాయన కాళ్లకు నమస్కారం చేసింది, ఇక నాకు విడాకులు కావాలంది. నీతో కలిసి బతకలేనంది, కన్నీళ్లు పెట్టుకుంది. భారంగా బయటికి కదిలింది పాము. నాటకాలాయన గుండెలు పగిలిపోయేలా దగ్గుతున్నాడు. ఇన్నాళ్లూ తోడునీడగా ఉన్న నాటకాలాయన్ని వదిలి గడపదాటింది. దానికి మనసు మనసులో లేదు. ఎటు వెళుతోందో తెలియదు, ఎటు వెళ్లాలో తెలియదు, వెళ్తూనే ఉంది... నాటకాలాయన దగ్గుతూ ఉన్నాడు. ఇంతలో ‘‘పాం పాము పాము’’ అంటూ పెద్దగా అరిచాడు హరిశ్చంద్రుడు. సరిగ్గా తలమీద పిడుగుపడినట్టు పడిందో కర్ర. పాము కళ్లు బైర్లుకమ్మాయి, బయటి కొచ్చాయి. పాము తల పచ్చడయ్యింది. అందరూ కలిసి కసికసిగా కొడుతున్నారు. దాని కష్టాలెవరికి పడతాయ్, దాని కన్నీళ్లెవరికి పడతాయి, ఎందుకు చంపుతున్నారో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. కొట్టారు, చంపారు, మంటల్లో కాల్చారు. హాయిగా అందరూ ఇళ్లకు వెళ్లారు.
      స్వర్గంలోంచి కిందికి చూసింది పాము. నాటకాలాయన ఇంటిచుట్టూ జనం. ఈ రోజు నాటకాలాయన చావు వేషం వేశాడు. కానీ నాటకాలాయన చావు, వేషం కాదు. నిజం. 
      ముందుకు కదిలింది. ఎదురుగా నాటకాలాయన. క్షమించమన్నాడు, కాళ్లమీద పడ్డాడు. కళ్లు మూసుకున్నాడు, కళ్లల్లో నీళ్లు... పాము పాదాలమీద. అక్కడ, ఆకాశంలో, అనంత వాయువుల్లో ఇద్దరూ కలిసిపోయారు పాము - పరమశివుడిలా.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam