ప్రేమోదయం

  • 2933 Views
  • 330Likes
  • Like
  • Article Share

    సురా

రోజులెప్పుడూ ఒకేలా ఉండవు...
      పొద్దున్నే ఆరింటికి పలచగా ఒకట్రెండు పొరల ఎండ చల్లగాలిని నావైపు నెడుతూ నెడుతూ వెనక్కి తిరగమని చెబుతోంది. అక్కడ అప్పుడే విచ్చుకుంటున్న ఓ ముద్ద మందారం తనని అప్పుడే చూడొద్దంటూ పక్కకి తిరగమంటోంది. ఆ రాత్రే రాలిన పారిజాతాలు తమపై పాదం మోపొద్దంటూ పరిమళాల లేఖను పంపి జవాబుకోసం ఎదురుచూస్తున్నాయి. కువకువలాడే గువ్వపిట్టలేవో రెండు భుజాన వాలి పలకరిస్తున్నాయి. పక్కనున్న రెండు పచ్చని చెట్లు వెచ్చని కబుర్ల కోసం తలవాల్చి తమ రెమ్మలను ఆడిస్తున్నాయి. వాటంగా పారుతున్న ఏరు దారి మళ్లించుకుని సన్నటి ఒక పాయని మెల్లగా నా గుండెల్లోంచి జారవేసి తన దారిన పోతోంది. తుషార వర్ణంలో ఓ పరికిణీ అల్లంత ఎత్తునుంచి జలపాతపు లయతో నా కళ్లలో మిలమిలల నురుగులు పూయిస్తోంది.
      ఉన్నట్టుండి నేను చేరబడ్డ చెట్టుకి శాపవిమోచనమై వసంతబాలగా మారిపోయి తన నయనాకాశపు దోసిలిలోకి నన్ను విసిరేసినట్లయింది.
      ఒక మెరుపులో సప్తవర్ణాలు.. ఆమె అంతర్ధానమైపోతోందా అన్నట్లు మిరుమిట్లుగొలుపుతూ లావణ్యశోభ....
      ఎవరామె..?
      అమాంతంగా ప్రేమించాలనీ.. ఆసాంతం సౌందర్యాన్ని ఆస్వాదించాలనీ అనిపిస్తోంది.
      నక్షత్రాలు నివ్వెర పడుతున్నాయి.
      జాబిలి తారల చాటుకెళ్లింది.
      ఋతువులు ఆమెను అభిషేకిస్తున్నాయి.
      సూర్యుడు తొలి కౌగిలింతల్లో ఉదయించాలన్నంత కోమలమైపోతున్నాడు.
      ఎవరీ ముగ్ధాంగ...!?
      ఎవరీ ముగ్ధాంగ...!?
      శీతపవనాన్ని అడిగా.. యక్షుడికి సాయం చేసి తన ప్రియురాలికి మేఘసందేశం అందించాడు కదా అని.
      నిరాకరించాడు.
      ‘ఆమె నీ ఎదురుగానే అటు వెళ్తోందిగా.. ఎదురుగా మాటాడలేకపోతే ఓ ప్రేమలేఖ రాసుకోరాదా’ అని సలహా ఇస్తూ ఓ గంధర్వ కన్య చిరుచెమటను కావలించుకునేందుకు గ్రీష్మంవైపు పోయాడు.
      ఎంత అన్యాయం..!
      యక్షునికో నీతీ.. నాకో నీతా..?
      యక్షుడు వివాహితుడు. నేను ఉత్తర కౌమారాన మనోకేళిలో జతలేని అభాగ్యుణ్ని..! అయ్యో..! నాలాంటి వాళ్లకు సహాయపడితే ఆ శీతపవనుడు సశరీరుడయ్యే అవకాశం ఉండేదేమో? ఆలోచించలేకపోయాడు. సరే.. ఆమెకు ప్రేమలేఖ రాయాలన్న ఆలోచనా బాగానే ఉంది.
      వనరాజుని అడిగా.. ప్రేమలేఖ రాసేందుకు సుగంధాలను వెదజల్లే హరితపత్రమొకటి ఇవ్వమని.
      నవ్వాడు. సరేనన్నాడు.
      ‘అదిగో.. అక్కడ అశోక వృక్షం కనిపిస్తోందా.. దాని దగ్గరికి వెళ్లి దోసిలి పట్టి ప్రార్థించు’ అన్నాడు.
      ‘అశోక వృక్షమా.. ? రావణుణ్ని చూసీ చూసీ అదీ రాక్షసమైందేమోనని అనుమానంగా ఉంది. ఎవరో ఒక కోమలి కాళ్లకు గజ్జెలుగట్టి పాదాలకు పారాణి పూసుకుని ఆ పాదంతో తన్నితేగానీ ఆ అశోక వృక్షం పుష్పించదట. అంత మొరటు మనసు దానిది. దాని పత్రంమీద ప్రేమలేఖ ఎలా రాయనూ?’
      ‘హ్హ హ్హ.. నీ ఆవేదన సరైనదేలే.. అయితే నీకు నచ్చిన పత్రాన్నే ఎంచుకోవచ్చు’
      ‘అలా అన్నారు బావుంది. విరహ వేదన ప్రకృతి పురుషులైన మీకు తెలియందికాదు.. కృతజ్ఞుణ్ని’
      ‘ఆగాగు.. ఇంకొక్క మాట’
      ‘ఏంటది?’
      ‘ముందు నీ ప్రేమ నీలో వ్యక్తం చేసుకో. ఏం లిఖించాలనుకుంటున్నావో ముందే ఒకసారి మననం చేసుకో. నీ అక్షరాల కొమ్మలకి పారిజాతాలు పూస్తేనే నీ ప్రేమ నిజమైనది. అలా జరిగితే ఆ అక్షరాలను అందుకోవాలని ఈ వనమంతా నీ చుట్టూ తిరుగుతుంది. అప్పుడు నీకు నచ్చిన పత్రంమీద ఆ ప్రేమలేఖ రాద్దూగాని.. సరేనా..?’
      ‘అయ్యో.. నావల్ల అయ్యే పనేనా అదీ?’
      ‘నీలో ప్రేమ లేదా మరి?’
      ‘ఉంది ఉంది.. కానీ చిన్న భయం.. నా కావ్యనాయికకి వరూధినిలాంటి మనసుంటే నాకీగతి వచ్చేది కాదేమో. అరుణ కిరణాలు తాకి ఆవిరవుతున్న విరహ లేపనాన్ని కాస్త తన హృదయాన నింపుకొని అమృత స్పర్శనందించి నాలో మమేకమయ్యేది కదా..’
      ‘అయితే మరేం చేస్తావు? నీ ప్రేమని ఎలా గెలుచుకుంటావు?’
      ‘ఏమో.. ఆమె నడిచిన దారులన్నీ శ్రీరాగాన్ని సాధన చేస్తూ వెతుకుతాను. నిద్రలేని నా కనుల ముందు ఆమె నిలిచే వరకూ కొన్ని స్వప్నాలనైనా వరమివ్వమని ఆమె అడుగుజాడల్ని వేడుకుంటాను’
      ‘చాలా జాలిగా ఉందయ్యా నిన్ను చూస్తుంటే. పోనీ ఆ తోటలోకెళ్లి పువ్వులను ఓసారి అడిగి చూడరాదూ నీ మనోహరి జాడ’
      ‘సరే అడిగి చూస్తాను’
      తోటంతా ఒకటే సందడి. ఆమె తాకిన కొమ్మలమీద తుమ్మెదలు కమ్మని శృతినందిస్తూ మత్తుగా వాలి ఉన్నాయి. మోడువారిన వృక్షాలు, నేలకొరిగిన వృక్షాలూ ఆమె సౌందర్య యశస్సుకి మళ్లీ మేలుకొన్నట్టున్నాయి. నడిచే దారేదీ కనపడనీయకుండా కొత్త శ్వాసల వర్ణాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దూరదూరంగా గాలిలో నిశ్చలంగా పూలు రేకుల రంగులు లిప్తకోసారి మార్చుకుంటున్నాయి, మాయామాళవం ఆరోహణలు ఆలపిస్తూ చిన్న చిన్న రాళ్లూ, అవరోహణలు ఆలపిస్తూ కాస్త పెద్ద రాళ్లూ, సంగీత రస మథనంలో తోట. ఓ చిన్ని గడ్డి పూవును పట్టుకున్నా..
      ‘ఓ తేజో కుసుమమా.. నీకు నా మానసచోరిణి పరిచయముందా?’
      మూడురంగులు నామీద విదిలిస్తూ   ‘నువ్వు ఎవరికోసం వచ్చావో తెలుసు గానీ నీకు ఓ విషయం తెలియదనుకుంటా. నేనో బండరాయిని. ఆమె స్పర్శకి ఇలా పుష్పమైపోయా. అదిగో అక్కడ కనిపిస్తున్న బండరాళ్లన్నీ పూలు. ఆమె సిగను చేరలేక అలా అయిపోయాయి. ఇక్కడినుంచి మేం బయటికి రాలేంకదా.. ఆమె గమనం మాకు పూర్తిగా తెలియదు.’
      మరి ఎవరినడగాలి? ఎక్కడని వెతకాలి?
      నా ప్రేమా.. నా ప్రేయసి..
      నేను తనలో ఉన్నానా? లేక నా తలపుల్లో నేను బందీ అయ్యానా? ఊహా సముద్రంలో మనసు ముక్కలుచెక్కలై మునకలాట.. 
      ప్రేమా మోహం ప్రేమా మోహం ప్రేమా మోహం... బడబానలాన్ని నాలో నింపుకొంటూ ఆమె కోసం అన్వేషణ.. యవ్వనాకర్షణ మంత్రానికి దిక్కులన్నీ ఏకమై రసధృవానికి చేరువై నడి స్వప్నంలో చిక్కుకున్న నా స్వరం నుంచి మంద్రంగా ప్రేమాలాపన...
      స్వప్నం ముగిసింది..
      నూరు శరదృతు పున్నముల నిరీక్షణలో ఒలికిపోయిన కాస్తంత వెన్నెలను దోసిటకెత్తుకుంటూ ఏకాంతంగా నేను..
      సమయమింకా ఆరే..!
      అవును.. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు..!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam