అటకెక్కిన రచయిత

  • 2119 Views
  • 29Likes
  • Like
  • Article Share

    నారంశెట్టి ఉమామహేశ్వరరావు

  • పార్వతీపురం, విజయనగరం జిల్లా
  • 8328642583
నారంశెట్టి ఉమామహేశ్వరరావు

పవన్‌కి రచయిత అయిపోవాలని సకారణంగా కోరిక ఉదయిస్తుంది. సాధన కోసం లంకా దహనానికి సరితూగే ప్రయత్నాలు చేస్తాడు. పైత్యం పనసకాయంత అయ్యేలోగా ఓ కథ రాసి అచ్చు కోసం పిచ్చిగా ఎదురుచూస్తుంటాడు.. అతని కోరిక నెరవేరిందా..?
గాఢనిద్రలో
ఉన్న సుజాతకు హఠాత్తుగా మెలకువ రావడానికి కారణం తెలియలేదు. కళ్లు నులుముకుంటూ పక్కకు చూసింది.
      ‘‘కథ అచ్చవబోతోందోచ్‌...’’ అంటూ ‘కల’వరిస్తున్నాడు పవన్‌.
      ‘‘హనుమంతా! ఏమిటా కలవరింతలు? పక్కన నేనున్నానని మరచిపోయావా?’’ అంటూ మోచేత్తో పొడవగానే ఉలికిపడి లేచాడు పవన్‌. 
      అతనికేమీ అర్థం కాలేదు. ఆకాసేపటికి ‘కల’ గుర్తొచ్చింది. దాంతో మొహంలోకి వెలుగొచ్చింది. ‘‘కథ ప్రచురణకి తీసుకున్నట్టు ఉత్తరమొచ్చింది’’ చెప్పాడు సంతోషంగా.
      ‘‘ఇటివ్వండి చూస్తాను’’ ముందుకు చెయ్యిచాచి ఎగతాళిగా అడిగింది.
చుట్టూ చూసినా ఏం కనిపించక పోయేసరికి తిరిగి అడిగాడు ‘‘ఉత్తరం కన్పించదేం?’’
      ‘‘తమరే ఓ పేద్ద రచయితని, బస్తాల్లో ఉత్తరాలొస్తాయని రాత్రి సేవలు పెట్టింది తపాలశాఖ. అర్ధరాత్రి ఉత్తరమట! అదంతా ‘కల’ మహాను... భావా! పోస్టుమేన్‌కి పదో పరకో బక్షీస్‌ ఇవ్వలేకపోయారా?’’ ఎకసెక్కంగా అడిగింది సుజాత.
       ‘‘కలైతే తప్పేంటీ? సంతోషించు!’’ నోరు పెగల్చుకుని చెప్పాడు.
      ‘‘పగటి కలకీ సంతోషించాలా?’’ సుజాత గొంతులో చిరాకు.
      ‘‘పగటి కల కాదు రాత్రి కలే’’ గట్టిగా చెప్పాడు పవన్‌.
      ‘‘చూడమ్మా అంజీ! నెల క్రితం రాసిన కథ గురించేనా కలొచ్చింది?’’ ఎగతాళిగా అడిగింది సుజాత. చిరాకొస్తే భర్త అని కూడా చూడకుండా మర్యాదలు వదిలేసి ఆంజనేయుడి మారుపేర్లతో పిలవడం సుజాతకు అలవాటు.
      ‘‘అవును అదే’’ ఉత్సాహంగా చెప్పాడు సుజాత మొహంలో రంగులు మారడం చూడకుండా.
      ‘‘యాక్‌! తలచుకుంటే కడుపులో తిప్పుతోంది. కథంట కథ.. సోది ఆపేసి పడుకో’’ గొణిగింది సుజాత.
      ‘‘సుజీ’’ ప్రేమగా పిలిచాడు.
      ‘‘పావూ! నిద్ర రావట్లేదా’’ గోముగా అడిగింది. ముద్దొస్తే అలాగే పిలుస్తుంది. ఇందాకటి మాటలకు బాధపడ్డాడేమో అని స్వరంలో కోపం తగ్గించింది.
      ‘‘వేకువజామున వచ్చే కలలు నిజమవుతాయట. తెలుసా?’’ సంశయం ఉంచుకుంటే నిద్ర పట్టదని అన్నాడు. అంతే... అరికాలి మంట నెత్తికెక్కింది సుజాతకి. ఒక్కుదుటున లేచి కూర్చుని ‘‘వీరాంజనేయా! ఇది వేకువజామని ఎవరన్నారు? అర్ధరాత్రి పన్నెండు. గడియారం చూడు. నీకంతగా నిజం చేసుకోవాలనుంటే అలారం పెట్టి అప్పుడే ‘కల’గను. కాళ్లతో తన్ని చేతులతో పొడిస్తే ఈసారి సహించను. విరిచేసి పొయ్యిలో పెట్టేస్తాను’’ అనేసి అటు తిరిగి పడుకుంది.

* * * 

      సుజాత, పవన్‌ భార్యాభర్తలు. సుజాత పుట్టినప్పుడే పవన్‌కి పెళ్లామని పెద్దలన్నారు. ఆమె అందగత్తె అవడంతో తనను ప్రేమించమని విక్రమార్కుడి తమ్ముడిలా ప్రయత్నించాడు పవన్‌. చివరికి తన గురించి పడుతున్న తపనకు కరిగిపోయిన సుజాత ‘సరే’ అంది.

* * *

      ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన ఓ సభకి సహోద్యోగులతో వెళ్లాడు పవన్‌. అక్కడ తెలుగు భాషని రక్షిస్తామని, గొప్పతనాన్ని నిలబెడతామని, తెలుగులో మాట్లాడతామని, రాస్తామని, చదువుతామని, వింటామని, తింటామని.. చెప్పిన అబద్ధాలని అక్షర సత్యాలనుకుని తెలుగుకి తను కూడా ఏదైనా చేసెయ్యాలని కంకణం కట్టుకోవాలనుకున్నాడు. అది దొరక్క ఫ్రెండ్‌షిప్‌ బ్యాండు కట్టుకుని సరిపెట్టుకున్నాడు. అది వేరే సంగతి. అప్పటి నుంచి అతన్లో బీభత్సమైన మార్పొచ్చింది. ఆంగ్ల పత్రిక స్థానంలో తెలుగు దినపత్రిక, ఆంగ్ల ఛానెల్స్‌కు బదులుగా తెలుగు ఛానెల్స్‌కి మారాడు.
      రోజూ కాలేజీ నుంచి రాగానే ‘ఇహీ’ ఛానెల్లోని ‘పేడముద్దలు’, ‘ఇనుపతీగలు’ చూసేది సుజాత. రెండు వేల భాగాలు దాటినప్పటికీ ‘ఇంతకు ముందేం జరిగిందని’ అడక్కుండా ఓపికగా పవన్‌ చూస్తూంటే ఫారెక్స్‌ తింటున్న పసి ఆంజనేయుణ్ని చూస్తున్నట్టు అనిపించేది సుజాతకి.
      ‘‘నువ్వు తెలుగు ఛానెల్స్‌ చూస్తున్నావేం? నిన్న ఏదో సామెత కూడా చెప్పావు.. ఏంటదీ.. ఓసారి చెప్పవా?’’ గోముగా అడిగింది సుజాత. 
      ‘‘చూస్తే ఇంగ్లీషు ఛానెల్‌ చూడాలి, ఈదితే ఇంగ్లీషు ఛానెల్‌ ఈదాలి’’.
      ‘‘ఆంగ్ల మాధ్యమంలో చదివిన తమరు తెలుగుకి మారడంలో ఆంతర్యం...’’ కొంచెం గ్రాంథికం కలిపి నాటకీయంగా అడిగింది.
      ‘‘తెలుగులో.. అంటే అదే మన అమ్మభాషలో బ్రహ్మాండమైన జ్ఞానం సంపాదించేసి, రచనలు చేసేసి, జానెపీట ఎక్కాలని’’ తలెగరేస్తూ చెప్పాడు పవన్‌.
      ‘‘తెలివి తెల్లారినట్టుంది. తెలుగు ఛానెల్స్‌ చూస్తే తెలుగు వచ్చేస్తుందా? యాంకర్లు మాట్లాడే భాష వింటే, వచ్చింది కూడా మర్చిపోతావు’’ ఠక్కున అంది సుజాత.
      వినగానే విచారంగా ముఖం పెట్టేసి ‘‘అయితే జానెపీట ఎక్కలేనా?’’ నుదురు కొట్టుకుంటూ అడిగాడు. 
      ‘‘జానెపీట ఎక్కుతారా? గోడకి మేకు కొట్టాలా?’’ వెంటనే అడిగింది సుజాత.
      ‘‘మూడుకాళ్ల పీట కాదు. ముగ్గురు తెలుగు రచయితలెక్కిన జానెపీట’’ సరిదిద్దాడు పవన్‌.
      ‘‘నాయనా నీకో దండం. మీ తెలుగుకో దండం. జ్ఞానపీఠం మీకు ఇలా అర్థమయిందా? ముందు మీరు తెలుగు సరిగా నేర్చుకోండి’’ హితబోధ చేసింది సుజాత.
      ‘‘తెలుగు నేర్చుకోవడానికి నేనేం చెయ్యాలి? తెలుగు లెక్చరరు భర్తకి తెలుగు రాదంటే నీకే చిన్నతనం’’ ఆమెను చల్లబరచాలని కాకా పట్టాడు. బుట్టలో పడింది సుజాత.
      ‘‘పెద్దబాలశిక్ష చదివితే అక్షరాలు గుర్తొస్తాయి. పత్రికలు, కథల పుస్తకాలు చదివితే భాషపై పట్టు వస్తుంది. గొప్పవాళ్ల రచనలు చదివితే తెలుగు సాహిత్యం తెలుస్తుంది’’ అంటూ కొందరు గొప్ప రచయితల పేర్లు, రచనలు చెప్పింది. బుద్ధిగా విన్నాడు పవన్‌. 

* * *

      ఇంటిముందు ఆటో ఆగితే చుట్టాలొచ్చారనుకుని బయటికొచ్చింది సుజాత. ఆటోడ్రైవర్‌ సాయంతో పుస్తకాల కట్టలు దించుతున్నాడు పవన్‌. గత రోజు చెప్పిన పుస్తకాలన్నీ కొనుక్కొచ్చాడు. ఆరంభశూరత్వం తప్ప పూర్తిచెయ్యటం పవన్‌కి రాదని బాగా తెలుసు సుజాతకి. ‘‘పుస్తకాలు చదవమంటే గ్రంథాలయానికి వెళ్లాలి కానీ, ఇంతేసి డబ్బు తగలేస్తాడని అనుకోలేదు దేవుడో’’ అనుకుని గుండెలు బాదుకుంది.
      బడిపిల్లలు అసూయపడేంత శ్రద్ధగా అర్ధరాత్రి దాకా పుస్తకాల్ని సర్దాడు పవన్‌. టీవీ చూడటం మానేసి సమయమంతా గదిలో గడిపి పదిరోజులకు కథొకటి రాశాడు. బాగాలేదని ముఖం మీదే చెప్పింది సుజాత. ఆట పట్టించటానికేమో అనుకుని ‘పక్కలో బల్లెం’ పత్రిక్కి పంపాడు దాన్ని. ప్రచురణ గురించి కలలుకనడం మొదలుపెట్టాడు. 
      అదండీ సంగతి. 
      తొందరగా ఫలితం తేల్చని సంపాదకుణ్ని తిట్టుకుంటున్న సమయంలో ‘చావు కబురు చల్లగా చెప్పినట్టు’ తిరిగొచ్చిన కవరుని ఎండలో వచ్చి అందించాడు పోస్టుమాన్‌. ‘సంపాదకులకు అభిరుచి లేదు. కొత్త రచయితల్ని, కొత్తదనాన్ని ప్రోత్సహించరు’ తిట్టుకున్నాడు మనసులో.
మరునాడు పొద్దున్నే బజారుకి వెళ్లి రకరకాల రంగు డబ్బాలనీ, పెయింటర్లని వెంటబెట్టుకొచ్చాడు పవన్‌. సుజాత గతుక్కుమంది. ‘‘సంక్రాంతికే రంగులు వేయించాం. నాసిరకమైతే తొందరగా వెలిసిపోతాయని ఏడేళ్లు మన్నిక వచ్చే ‘సెభాషియన్‌’ పెయింటు వేయించాం. దానికి మొత్తం లక్షయింది. మళ్లీ ఇప్పుడీ రంగు డబ్బాలు దేనికి?’’ అడిగింది సుజాత. 
      ‘‘నీకన్నీ తొందరే. కొంచెం ఓపికపట్టు. పనయ్యాక చెబుతాను. ఎగిరి గంతేస్తావు’’ భుజాలెగరేసి చెప్పాడు పవన్‌.
      పుస్తకాల గదిలోని వస్తువులన్నీ బయటపడేసి దగ్గరుండి మరీ రంగులు వేయించాడు. నాలుగు గోడలకీ కలిపి పదిహేను రకాల రంగులు. ఒక్క రంగయితే బాగుణ్ను. ప్రతి గోడకీ పైభాగానో రంగు, మధ్యలో మరో రంగు, కిందో రెండు మూడు రంగులు. పైత్యం ప్రకోపించినట్లుంది. పైగా వాటి మీద పువ్వులు, సీతాకోక చిలుకలు, తువ్వాయిలు. అర్థం కాలేదు సుజాతకి. మౌనం వహించిన మునిలా ఉండిపోయాడు కానీ పనయ్యే వరకూ నోరు తెరవలేదు పవన్‌.
      ‘‘మనిషై పుట్టినవాడు బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అనుభవిస్తాడు. మొదటే పెద్దల కథ రాసి తప్పు చేశాను. అందుకే తిరిగొచ్చిందది. మొదట బాల్యం మీద రాయాలి. పిల్లలని రంగుల లోకంలో విహరింపజేసే కథలు, కలల ప్రపంచంలోకి నడిపించే రచనలు చెయ్యాలంటే రంగుల గోడలున్న గదిలో కూర్చుని రాయాలి. రంగుల కాగితాల మీద రాయాలి’’ రకరకాల రంగుల పెన్నులు చూపించి చెప్పాడు పవన్‌.
      పిల్ల(ల) భూతం పట్టినట్టు పుస్తకాలకీ, రంగులకీ డబ్బు తగలేసినందుకు పీకలదాకా కోపం వచ్చింది సుజాతకి.
      ‘‘పేరుకి తగ్గట్టు కోతిలానే ప్రవర్తిస్తున్నావు. పిల్లలని కలల లోకంలోకి తీసుకెళ్లాలంటే గోడలకీ, కుర్చీలకీ, రంగులు వెయ్యక్కరలేదు. కాగితాలు, పెన్నులు రంగువి వాడక్కర్లేదు. ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించి పసి మనసులకి రెక్కలు తొడిగి ఎక్కడికో తీసుకెళ్లాలని అర్థం’’ ఉక్రోషంగా అంది సుజాత. రాముడు మంచి బాలుడన్నట్లు తలూపాడు పవన్‌.
      ఆ వారమంతా బాల సాహిత్యం తెగ చదివాడు. ఆదివారం గదిలో దూరి తలుపేసుకుని, భోజనాల వేళకి కానీ బయటకు రాలేదు. అప్పుడు భీకర యుద్ధం చేసి విజయం వరించిన రాజులా గర్వంగా కన్పించాడు.
      ‘వంకర టింకర రచయితలు- అవలక్షణపు రచనలు’ వ్యాసం చదువుతోంది సుజాత. పవన్ని అనుమానంగా చూసింది. ఆకుపచ్చ కాగితం మీద ఎర్రని అక్షరాలతో రాసిన దాన్ని ఇచ్చాడు. 
      ‘‘రచనలకు శ్రీకారం చుట్టేశా! బాల గేయం రాసేశా! చదవమని తెచ్చేశా!’’ గేయ ఫక్కీలో చెప్పాడు.
      కొరకొరా నమిలేసేలా పవన్ని చూసి గేయాన్ని మనసులోనే చదివేసి మౌనంగా ఉండిపోయింది. గేయం నచ్చక మౌనంగా ఉందని అనుకోకుండా ఆత్రుతగా ‘‘ఎలా ఉంది?’’ అని అడిగాడు పవన్‌. కచ్చితంగా బాగుండి తీరుతుందన్న నమ్మకం అతనిది.
      ‘‘నీ మొహంలా ఉంది’’ అందామె. కోతిలా ఉందని పవన్‌కి అర్థమైంది.
      ‘‘మూడు రోజులు బాగా ఆలోచించి రాశా. నచ్చలేదా?’’ బేలగా అన్నాడు పవన్‌.
      ‘‘నచ్చలేదు. ఎన్ని రోజులు ఆలోచించావన్నది కాదు. రాసిందేదైనా సరే అది బాగుండాలంతే’’ అంది సుజాత.
      ‘‘ఎంతో కష్టపడ్డాను. ప్రాస కుదిరింది. పిల్లలకు అర్థమయ్యే పదాలే వాడా. ఎందుకు నచ్చలేదో చెప్పు’’ అన్నాడు పవన్‌.
      ‘‘ఇదో గేయం. మీరో కవి. ఏం దృష్టిలో పెట్టుకుని రాశారో చెప్పండి.’’ అంటూ తాచుపాములా సర్రున లేచింది సుజాత. పవన్‌ నుంచి జవాబు రాలేదు. అప్పుడు బయటికే చదివింది సుజాత.
      ‘‘ఉడుతా ఉడుతా... నిన్ను వలవేసి పడతా! ఉడుతా ఉడుతా... నిన్ను రాయితో కొడతా!
      ఉడుతా ఉడుతా... నిన్ను నీట్లోకి నెడతా! ఉడుతా ఉడుతా... నిన్ను తాడుతో కడతా!
      ఉడుతా ఉడుతా... నిన్ను బూతుల్తో తిడతా! ఉడుతా ఉడుతా... నీకు తొడపాశం పెడతా!..’’
      ఏంటిదీ.. తలకి కొబ్బరి నూనె రాయడం, ముఖానికి పసుపు రాయటమంత సులువనుకున్నారా గేయం రాయటం? అయినా ఉడుతతో తగువెందుకు మీకు?’’ అడిగింది ఆశ్చర్యంగా సుజాత.
      ‘‘ఉడుతతో తగువా?’’ ఆశ్చర్యపోయాడు పవన్‌.
      ‘‘అవును మీ ఆస్తి మొత్తం ఉడుత కాజేసినట్లు కోపంగా రాసినట్లుంది. దాన్ని ఎలా చిత్రహింసలు పెట్టాలో గేయ రూపంలో వర్ణించారు. పిల్లలకి ఇలాగేనా చెప్పేది’’ అంది సుజాత.
      ‘‘నేనేది రాసినా బాలేదనడం అలవాటేగా!’’ చిన్నబుచ్చుకుని గదిలోకి దూరాడు.
      కొన్నాళ్లకి పెయింటర్లని తీసుకొచ్చి గది గోడల రంగులు మార్పించాడు. రెండేరెండు లేత రంగులు వేయించి, వాటి మీద ప్రేమ చిహ్నాలు, ప్రేమ కవితలు, ఎగురుతున్న ప్రేమ పావురాల బొమ్మలు గీయించాడు. 
      ‘రచనల పిచ్చి పట్టినప్పటి నుంచి జీతంలో రూపాయి కూడా ఇంటికివ్వడం మానేసాడు. దీనికేం చెబుతాడో...’ అనుకుంది సుజాత.
      ‘‘పిల్లల కోసం రాయలేనని అర్థమైపోయింది. యువతరాన్నయినా మెప్పించాలి అనుకున్నాను. ఉత్తేజం పొందడానికి గోడల మీద రంగులు మార్పించాను. రచయితలు, దర్శకులైతే ఆలోచనల కోసం విదేశాలకు వెళతారు. కానీ నేను రూంలో రంగులు మాత్రమే మార్పించాను’’ సమర్థించుకున్నాడు పవన్‌.
      పదిహేన్రోజులు గదిలో గడిపి గులాబి రంగు కాగితం మీద రాసిందాన్ని తెచ్చి భార్యకు ఇచ్చాడు. ‘‘చెలీ! ప్రియ నిచ్చెలీ! చూస్తావా ప్రేమ కవిత! మారుస్తుందా తలరాత! ఇస్తుందా అందమైన భవిత!’’
      ‘నువ్వూ నేనూ ప్రేమించుకున్నాం/ మనిద్దరమూ ప్రేమించుకున్నాం/ మనలో మనం ప్రేమించుకున్నాం / ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాం / ఒకటై ఉండాలని ప్రేమించుకున్నాం / వద్దనకుండా ప్రేమించుకున్నాం/ ఒక్క మనసుతో ప్రేమించుకున్నాం/’... గబగబా చదివింది సుజాత. 
      ‘‘ప్రేమించుకున్నామన్న పదం ఎక్కువ సార్లు రాస్తే ప్రేమకవిత అయిపోతుందా?.. అభివ్యక్తి లేదు, భావవ్యక్తీకరణ లోపించింది. వచ్చిన పదమే మళ్లీ మళ్లీ వచ్చింది’’... బాగాలేదని కుండ బద్దలు కొట్టింది సుజాత.
      మూతి ముడుచుకుని మూలపడుకున్న పిల్లిలా ముఖంపెట్టి గదిలో దూరాడు పవన్‌. రాసింది లేకపోయినా రోజుకి పది దస్తాల తెల్లకాగితాలు ఖరాబు చెయ్యడం, పొద్దున్నే వీధి చివరున్న చెత్తడబ్బాలో పడేసి రావడం... కోరని వరంలా మారింది చెత్త సేకరించే వాళ్లకి. రెండో పక్కన రాసేందుకు వీలుగా పుస్తకాలు కుట్టి సెకండ్‌ హ్యాండు దుకాణాల్లో అమ్మేసి ధనవంతులయ్యారు. వీధిలో అదో తాజా వార్తయి కూర్చుంది.
      ఈసారి వారం కష్టపడి మరో కవిత రాశాడు పవన్‌.
      ‘చేను నూర్పులకు కల్లం/ కజ్జికాయలకు బెల్లం/ మసాలా టీకి అల్లం/ నీరు పారుటకు పల్లం!! / పప్పన్నంకి నెయ్యి/ గాజు తొడుగుటకు చెయ్యి/ శవము పాతుటకు గొయ్యి/ పదినోటుకి పైసలు వెయ్యి!! / ఉండాలోయ్‌ ఉండాలి!!’... చదివి ఫక్కున నవ్వింది సుజాత. ‘‘మీ మొహానికి సాహిత్యం, రచనలు సరిపోవు మానెయ్యండి’’ అంది. 
      ‘‘ఏది రాసినా బాగలేదంటావు. నువ్వొ క్కటి రాయగలవా’’ రెచ్చగొట్టాడు సుజాతని.
      ‘‘నేన్రాయగలనని ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా? కేవలం పాఠకురాలినే. రచయిత్రి ని కా(లే)ను. రాయడం ఓ గొప్ప కళ. సృజనాత్మకత, నూతన భావాలు, భాషమీద పట్టు ఉంటే తప్ప రచయితగా రాణించ లేరు. మీకవి లేవని నాకు బాగా తెలుసు. సమయం, డబ్బు వృథా తప్ప ప్రయోజనం లేదు. ఇవన్నీ మరిచిపోయి హాయిగా ఉద్యో గం చేసుకోండి’’ ఓపిగ్గా చెప్పింది సుజాత.

* * *

      మరికొన్నాళ్లకు రాత్రి పది దాటాక ఇంటికి రావడం మొదలెట్టాడు పవన్‌. కారణం చెప్పడు. ఆఫీసుకు ఫోను చేస్తే అయిదున్నరకే వెళుతున్నాడంటారు. ఒకసారి వాళ్ల ఆఫీసరుకే తన గోడు చెప్పుకుంది. ఊరడించి పవన్‌కి బుద్ధి చెబుతాడనుకుంటే... ఇష్టం వచ్చినట్టు సెలవులు పెడుతున్నాడని, వచ్చినప్పుడూ పని మానేసి పిచ్చి రాతలు రాస్తున్నాడని, పిచ్చి పుస్తకాలు మోసుకుంటూ తిరుగుతున్నాడనీ, పనుల మీద వచ్చే వాళ్లని, తోటి ఉద్యోగులను పట్టుకుని బలవంతంగా కథలు, కవితలు వినిపిస్తుంటే... మూర్ఛ, గుండెదడ, కాళ్లు చేతులు నీలుక్కుపోవడం, ఇంకా రకరకాల రోగాలతో వాళ్లు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆయనా గొల్లుమన్నాడు. 
      మూడు నెలలు ఓపిగ్గా ఎదురు చూసిన సుజాత మరింక ఆగలేకపోయింది. పవన్‌ ఫేంటూ, షర్టు జేబులు వెదికింది. తప్పుడు పనులు చేసినట్టు తేలలేదు... కానీ గుండెలు బాదుకోవడానికి సరిపడే అన్ని ఆధారాలూ దొరికాయి. సాహితీ సంస్థలకు అయిదేసి, పదేసి వేలు విరాళమిచ్చినట్లు చాలా రసీదులు కనిపించాయి. వాటిని చూపించి గట్టిగా నిలదీసింది.
      ‘‘ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. నేను పెద్ద రచయిత కావాలంటే అలాంటి రచయితల్తో ఆర్నెల్లు తిరగాలని పథకం వేశాను. నేనేంటో నిరూపించుకుని చెప్పాలనుకున్నాను. ఉత్తిపుణ్యానికే తిరగనివ్వరు కాబట్టి వాళ్ల సంస్థలకి విరాళమిచ్చాను. తప్పా? విజయం సాధించకుండా మూడు నెలలకే భంగం చేసేశావు’’ నిష్ఠురమాడాడు పవన్‌.
      మొగుడికి పట్టిన సాహిత్య పిచ్చిని వదిలించాలని ఎన్నో విధాల ప్రయత్నించింది. బతిమాలింది. ఆఖరికి కాళ్లు పట్టుకుంది. అయినా వినలేదు పవన్‌.
      చివరికి ఒక కథ రాసేసి ‘నేనెందుకు రాశాను’ మకుటంతో ‘గుడ్డిగుర్రం’ పత్రికకు పంపించాడు. ఆఫీసు చిరునామా రాసిన కవరు జతపరిచి చరవాణి సంఖ్య ఇచ్చాడు. స్పందన కోసం చూడటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఓ కవరు తెచ్చిచ్చాడు పోస్టుమాను. గబగబా చించి ఆత్రంగా చదివాడు పవన్‌.
      ‘‘మీ కథ ‘నేనెందుకు రాశాను’ చదివిన ముగ్గురు సహ సంపాదకులు పిచ్చివాళ్లయిపోయి ప్రముఖులు రాసిన సీరియల్స్‌ చించేసి గాలిపటాలు చేసి ఆడుకుంటున్నారు. ఇంకొకరికి బ్రెయిన్‌ హెమరేజ్‌ వచ్చి ఆసుపత్రిలో కొట్టుమిట్టాడు తున్నాడు. ఉత్తరం రాయటానికి గట్టివాడిని నేనొక్కడినే మిగిలాను. మీరెందుకు రాశారో మీకైనా తెలుసా కోతి పేరు పెట్టుకున్న కొత్త రచయితా? మా విన్నపమేంటంటే మీరు రచనలు చెయ్యొద్దు. చేసినా మాకు పంపొద్దు. తిప్పి పంపితే కథని మరొక పత్రికకి పంపుతారన్న భయంతో కాల్చి బూడిద చేశాను. చివరగా మీకో హెచ్చరిక. మీరు రచనలు చేస్తున్నారని తెలిస్తే మీమీద మీపై అధికారులకూ, పోలీసులకూ ఫిర్యాదు చేయడం ఖాయం’’.
      ఉత్తరం చదివిన పవన్‌ తేరుకోవడానికి గంట పట్టింది. అది మొదలు రచనలు చేస్తే ఒట్టు. రచనల కోసమే కాదు సంతకం చెయ్యడానికి పెన్ను తియ్యాలన్నా భయపడేవాడు. అతనిలో మార్పును చూసి సంతోషించింది సుజాత. అప్పుడప్పుడు నోటికి చెయ్యి అడ్డంపెట్టుకుని అటువైపు తిరిగి నవ్వుకునేది. ఆమె ఎందుకలా చేస్తుందో తెలీక జుత్తు పీక్కునేవాడు పవన్‌.
      ఇంతకీ జరిగిందేంటంటే... ‘గుడ్డిగుర్రం’ పత్రికాఫీసు వాళ్లు రచనలు తిప్పి పంపించే ముందు రచయితకి ఫోన్లో చెప్తారు. అలా చెప్పిన రోజు సెల్‌ఫోన్‌ ఇంట్లో వదిలేసి వెళ్లాడు పవన్‌. అతని ఖర్మకాలి సుజాత ఫోనెత్తడంతో అసలు విషయం తెలిసిపోయింది. తనకి తెలీకుండా కథ పంపించిన పవన్‌ ధైర్యానికి ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుంది. రచయితవ్వాలంటూ సంసారాన్ని ఎలా గుల్ల చేస్తున్నాడో చెప్పి ఏడ్చి, తన భర్తకు ఘాటుగా బుద్ధి చెప్పమని సంపాదకుడికి మొరపెట్టుకుంది. దాని ఫలితమే ఆ ఉత్తరం. 
అలా పవన్‌ రచనా జీవితం అటకెక్కిపోయింది. తెలుగు పాఠకులూ బతికిపోయారు...!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam