శిల్పి (కథాపారిజాతం)

  • 1300 Views
  • 22Likes
  • Like
  • Article Share

    అందె నారాయణస్వామి

అందె నారాయణస్వామి

చేనేతల తలరాతలు యంత్రాలపాలైనాక, ఉపాధి లేదు.. ఊపిరీ పోదు.. పస్తులుంటున్న అస్థిపంజరంలాంటి మగ్గానికి కడుపులోని పేగులే పడుగూ పేకలైనాక శివయ్య దంపతులకు బంగారు కలల స్వరాజ్యం ఏం మిగిల్చింది? 
శివయ్య,
అతని భార్య సీతమ్మ శుష్కించిన శరీరాలతో ఇంటి వసారాలో నేలమీద ఎదురుబళ్లుగా కూర్చున్నారు. ప్రక్కగా చాపమీద పెద్దపిల్ల నిద్రపోతున్నది. రెండవపిల్ల కూర్చుని యేడుస్తున్నది. కొంచెం అవతల రెండవ అస్థిపంజరంలా ఖాళీమగ్గం వేలాడుతున్నది. దగ్గరగా యితర పరికరాలు విశ్రాంతి తీసుకుంటున్నవి.
      ‘‘బిడ్డ అన్నం అన్నం అని యేడ్చియేడ్చి శోష వచ్చి నిద్రపోయింది’’ అన్నది సీతమ్మ.
      ‘‘సోలెడు గింజలు ఎక్కడైనా బదులుతెచ్చి పిల్లలకైనా వండి పెట్టకూడదు?’’ అన్నాడు శివయ్య.
      ‘‘ఇంకా యెవరిస్తారు? అవతలవాళ్లకో మానెడు. యివతల వాళ్లకో తవ్వెడు యివ్వవలసి వుంటిమాయె. ఇంకా ఏ మొఖం పెట్టుకొని వెళ్లి అడగమన్నారు?’’
      ‘‘ఏం చేస్తాం చెప్పు? మనం వుండగలం. ఎక్కడైనా తెచ్చి పిల్లల వరకైనా వండి పెట్టకపోతే వాళ్లేం వుండగలరు? రెండు రోజుల్లో షావుకారు మగ్గానికి పడుగుచూసి యిస్తానన్నాడు. ఇవాళా రేపు కళ్లు మూసుకుంటే ఎల్లుండి మజూరీ వస్తుంది.’’
      ‘‘ఆఁ- ఆయన యిచ్చేది నిజమే? యీ వారం రోజులబట్టి అట్లాగే చెపుతున్నాడు. ఇక గింజలు అప్పు తీసుకురావడం నావల్లకాదు బాబూ! అయినా మనం మాత్రం ఎన్నాళ్లని పస్తులు చెయ్యగలం? యింట్లో కంచం తప్పాళాలన్నీ ఆఖరై పోయినవయ్యా, మీరు ఎవరి దగ్గరకైనా వెళ్లి పడుగు సాధించుకుని రాకపోతే వీల్లేదు.’’
      ‘‘నేను వూరుకుంటున్నానంటావా? అందర్నీ అడిగి చూశాను. ఎవ్వరూ లేదన్నారు. అయినా యీ మందంలో యితర్లు ఎవరు మగ్గానికి పడుగిస్తారు, గిరాకిలో నేయించుకునేవాళ్లు యివ్వవలసిందే గాని!’’
      ‘‘గిరాకిలో నేయించుకుని లాభాలకి లాభాలు తిన్నవాళ్లు మాత్రం యిస్తున్నారా?’’
      ‘‘వాళ్లు మాత్రం యేం చేస్తారు? అటు శాల్తీ అమ్మకపోయే ఇటు నేయిస్తే దండగ వస్తూవుండే యెందాకని వాళ్లు మాత్రం నేయిస్తారు?’’
      ‘‘లాభం వచ్చినప్పుడు సంతోషంగా తిని దండగ వచ్చేటప్పుడు మనల్ని మాడుస్తారా?’’
      ‘‘ఏం చేస్తాం? వాళ్ళకు సరుకు విడుదల కావడం లేదు. మనం నేసే షావుకారు దగ్గిర నిల్వవున్న సరుకు చూస్తే కళ్లు తిరిగిపోయినై. సందు లేకుండా సరుకు యింటినిండా పేర్చారు. యింతకీ మిల్లుగుడ్డ వచ్చి మన గుడ్డను పడగొట్టింది. యీ కరవు మన ఒకళ్లకే కాదు. వూళ్లో రెండువేల మగ్గాలవాళ్లూ అంతా ఇలాగే అవస్థ పడుతున్నారు.’’
      చూర్లో నుంచి ఎలుకలు కొట్టివేసిన కార్డు ఒకటి కిందపడింది. దాన్ని శివయ్య చేత్తో తీసుకున్నాడు. ఆ కార్డు 1940లో మద్రాసు ఖాదీ కాన్ఫరెన్సు వాళ్లు అతనికి వ్రాసినది. అప్పుడు అతడు నేతలో గాంధీజీ విగ్రహాన్ని నేసి ఆ కాన్ఫరెన్సుకు పంపి బహుమతి పొంది వున్నాడు. శివయ్య గొప్ప శిల్పి. నేతలో కుట్టులేకుండా షరాయి చొక్కా మొదలైనవి చిత్రములైన పనులు ఎన్నో చెయ్యగలడు. అతడు జరీలతలు తీర్చినేసిన చీరె రాణులు సహాచూస్తే తలలూపి కట్టితీరవలసిందే. అటువంటి శిల్పాలకు ప్రోత్సాహం లేనందున శివయ్య అవి మానివేసి మామూలు బట్టలే నెయ్యడానికి పాల్పడ్డాడు. అందులోనూ అతనికి భుక్తి జరగడం లేదు. ఆ కార్డు చూసేసరికి వెనుకటి స్మృతులు గుర్తుకురాగా అతడు విచారంలో మునిగిపొయ్యాడు.
      రావు వచ్చాడు. అతన్ని చూడగానే సీతమ్మ లేచి యింట్లోకి వెళ్లిపోయింది. శివయ్య ‘‘నమస్కారం, రండి రావుగారూ!’’ అంటూ పీటతెచ్చి వెయ్యగా రావు కూర్చున్నాడు. రావు పట్టణ కాంగ్రెసు సంఘ అధ్యక్షుడు. గ్రామంలో పలుకుబడి వున్నవాడు.
      ‘‘ఇలా దయచేశారు! మా యోగక్షేమాలు విచారించడానికి వచ్చారా? తిండిలేక పిల్లలూ మేమూ అలమటించి పోతున్నాం’’ అన్నాడు శివయ్య.
      ‘‘అలాగా! పత్రికల్లో చూస్తూనే వున్నాం’’ అన్నాడు రావు.
      ‘‘మా అవస్థ చెప్పడానికి వీల్లేదు. వెనక నూలు దొరకక చాలినంత పనిలేక పస్తులు చేశాం. ఇప్పుడు ఎట్లాగో ఒకలా నూలు దొరుకుతున్నది గాని నేసినబట్ట ఖర్చుగాక మగ్గానికి పడుగు యిచ్చేవాళ్లు లేక యిపుడు పస్తులు వుంటున్నాం. నూలు దొరికినప్పుడూ దొరక్కపోయినప్పుడూ కూడా ఆఖరికి ఫలితం ఒకటే అయింది. మిల్లు బట్ట మా పరిశ్రమ కూలదోసింది’’ అన్నాడు శివయ్య.
      ‘‘అయితే యీమధ్య చీరెలు ధోవతులు ప్రభుత్వం వారు మీకు కేటాయించే ఆలోచనలో వున్నారని పత్రికల్లో చదివాం’’ అన్నాడు రావు.
      ‘‘ఏమి కేటాయించడమో యేమిటో! ప్రభుత్వము మిల్లులతో యే నిబంధనలనైనా ఏర్పరచుకోనివ్వండి. మొత్తంమీద మాకు పనిచూపి అన్నం బట్ట కలిగించడం ప్రభుత్వం విధి. స్వరాజ్యం స్వరాజ్యం అని బంగారు కలలు కన్నాం. అదివరకు బ్రిటిషువాళ్ల పాలనలో వున్నప్పుడు ఢక్కా మజిలీలు, చీరెను వుంగరములో దూర్చిన కథలు చెప్పుకొని పరాయి ప్రభుత్వము వల్ల యిటువంటి పరిశ్రమలన్నీ నాశనమై పోయాయని వాపొయ్యాం. ఇప్పుడు స్వంత ప్రభుత్వం వచ్చిమాత్రం యేం చేసింది? ఖద్దరు వస్త్రాలతో ప్రారంభమైన స్వరాజ్యోద్యమం, తీరా స్వరాజ్యం వచ్చిన తరువాత నేతగాళ్లకు తినడానికి తిండి లేకుండా పోయింది’’ చెపుతూ వుంటే అతని గుండెల్లో నుంచి ఆవేదన పొంగుకొస్తోంది.
      ‘‘అట్లా చూడండి, నా బిడ్డ అన్నం అన్నం అని ఏడ్చి శోషవచ్చి పడిపోయింది. మేమెందుకు యిట్లా పస్తులు వుండాలి? నేరాలు చేసి జైళ్లలో పడ్డవాళ్లను గూడా ప్రభుత్వం పస్తులు వుండనివ్వదే! మేము ఎందుకు పస్తులు చెయ్యవలసి వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నేనేం సోమరిపోతునా? పనివుంటే పిల్లలూ మేము తిని ఒకళ్లకు యింత పెట్టగలను’’ అన్నాడు శివయ్య.
      ‘‘అవును పాపం! మీ అవస్థ చూస్తే విచారం వేస్తున్నది. ప్రభుత్వం యేదో ఒకటి చేస్తుందిలే. సరేకాని, నూలు చిలప ఒకటి కావలసి వచ్చింది. కాస్తవుంటే చూద్దూ’’ అన్నాడు రావు.
      శివయ్య ఆవేదనతో ‘‘అందుకా తమరు దయచేసింది! గొంతుకు ఉరేసుకునేందుకైనా ఒక పోగులేదు. మీకు పుణ్యం వుంటుందిగాని మాకీ సహాయం చేసిపెడుదురూ. మీరంతా ప్రభుత్వం చేత మాకు చాలినంత పనైనా చూపించేటట్లు చేయండి. లేదా సునాయాసంగా చచ్చిపోయ్యేటందుకు మందైనా సప్లయి చేయించండి’’ అన్నాడు. అంతటితో రావు వెళ్లిపొయ్యాడు.
రాఘవయ్య వచ్చాడు. ఈయన శివయ్య తమ్ముడు. అక్కడకు పదికోసుల దూరంలో వున్న ఓ పల్లె వాళ్లది. లాంఛనం ప్రకారం కాళ్లకు నీళ్లివ్వగా రాఘవయ్య కాళ్లు కడుక్కుని కూర్చున్న తర్వాత యథాలాపంగా ‘‘అక్కడ మీ పరిస్థితులు యెట్లావున్నయిరా అబ్బాయి?’’ అని అడిగాడు.
      ‘‘ఏం చెప్పమన్నా వన్నయ్యా! అక్కడ మా సహకార సంఘంలో పడుగులు యివ్వడం మానివేశారు. సరుకు నిలవుండి పోయిందట. పనిలేక నానా అవస్థపడుతున్నాను. జరుగుబాటు లేక చాలామంది ఇతర గ్రామాలకు వెళ్లిపొయ్యారు. మేమూ మీ వూరు రావాలనుకుంటున్నాం. నిన్ను కనుక్కుపోదామని వచ్చాను’’ అన్నాడు రాఘవయ్య.
      ‘‘ఇక్కడ పరిస్థితులు అంతకంటే అధ్వాన్నంగానే వున్నవి. రోలువెళ్లి మద్దెలతో మొరపెట్టుకున్నట్టున్నది’’ అన్నాడు శివయ్య.
      తమ్ముడితో మాట్లాడుతున్న శివయ్యను యింట్లో నుంచి భార్య పిలవగా లేచి వెళ్లాడు. ‘‘పై మనిషి వున్నాడు కదా, ఆయనకు భోజనం యెట్లా?’’ అన్నది.
      ‘‘నేనూ అదే ఆలోచిస్తున్నాను’’ అన్నాడు భర్త.
      ‘‘షావుకారు దగ్గిర అవసరమని చెప్పి ఓ రూపాయి పట్టుకరాండి. పెద్దపిల్ల శోషవచ్చి పడిపోయింది. చిన్నది గోల చేస్తున్నది’’ అన్నది భార్య, బాధతో.
      ‘‘ఇదివరకే కొంత వాడుకున్నాం ఏమిస్తాడో యేమిటో. అయినా వెళ్లివస్తాను’’ అంటూ షావుకారు యింటికి వెళ్లాడు శివయ్య. అతడు మాస్టరు వీవరు. అరవై, డెబ్భై మగ్గాలు నేయిస్తాడు. శివయ్య వెళ్లేసరికి షావుకారూ మరి ఒక ఆసామీ ఘర్షణ పడుతున్నారు. ఆ ఆసామి నూలు షావుకారు. ‘‘నూలు తీసుకెళ్లి యిన్ని మాసాలైనా డబ్బు ఇవ్వవేం?’’ అని యిల్లెగిరిపొయ్యేటట్లు కేకలు వేస్తున్నాడు. ‘‘ఏం చెయ్యమన్నారు? సరుకు నిల్వ వుండిపోయింది. అమ్మగానే యిస్తా’’నని చెపుతున్నాడు షావుకారు.
అది చూసి శివయ్య అడక్కుండానే యిల్లు చేరుకున్నాడు. వచ్చిన చుట్టం పనిమీద ఎక్కడికో వెళ్లాడు. భర్తను చూడగానే ‘‘తెచ్చారా?’’ అని ఆశతో అడిగింది భార్య. ‘‘లేద’’ని బదులు చెప్పాడు శివయ్య.
      ఆమె కళ్లవెంట నీళ్లు కారుస్తూ ‘‘అయ్యో! యెట్లాగు చిన్నపిల్ల గూడా శోషవచ్చి పడిపోయింది. మీరు యిక్కడ వుండండి. ఎవరి కాళ్లయినా పట్టుకుని గింజలు తెస్తాను’’ అంటూ సీతమ్మ లేచి గబగబా వీధిలోకి వెళ్లిపోయింది.
      కాస్సేపటికి సీతమ్మ తిరిగి వచ్చింది. కొంగునవున్న మూట చూసి శివయ్య ‘‘గింజలు తెచ్చావు! అయితే త్వరగా వుడకెయ్యి’’ అన్నాడు.
      ఆమె కంపిత కంఠంతో ‘‘యేం వుడకెయ్యమన్నారు! గింజలు దొరకలేదు. మీకు చెప్పకుండా నేనో పనిచేశాను’’ అన్నది.
      ‘‘ఏం చేశావు యేమిటి?’’ అని ఆదుర్దాతో అడిగాడు శివయ్య.
      సీతమ్మ కళ్లవెంట నీళ్లు కారుస్తూ ‘‘యేం చెయ్యను. నాలుగిళ్లు మాదాకవళం అడిగి తెచ్చాను’’ అన్నది.
      శివయ్య తొట్రుపాటుతో ‘‘ఏమిటి, మాదాకవళమా? వీడు బ్రతికి వుండగానే మాదాకవళం అడుక్కొచ్చావా? వీడి శరీరం మంటలో కాలి భస్మం కాకముందే నువ్వు జోలి కట్టావా? అవును. నీ తప్పేముంది? వీడు బ్రతికి వుండీ చచ్చిన వాళ్లలో జమే అయ్యాడు’’ అని ఆక్రోశించాడు.

* * *

(సౌజన్యం: అందె బాబాప్రసాదు, మంగళగిరి)

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam