చెన్నుడి రసికత

  • 1694 Views
  • 41Likes
  • Like
  • Article Share

    కల్లూరు రాఘవేంద్రరావు

  • హిందూపురం
  • 9493271620
కల్లూరు రాఘవేంద్రరావు

కట్టెలు కొట్టుకుని జీవికను సంపాదించుకునే  చెన్నుడు రసజ్ఞుడు రాయల కొలువులోనే మనుచరిత్ర మర్మం చెప్పిన మాటకారి అతను నిండు వర్షాకాలంలో ఎండు కట్టెలు అల్లసానివారింట్లో చెప్పకుండా వేస్తాడు విషయం కనిపెట్టిన పెద్దన చెన్నుడికిచ్చిన వరమేంటి..? దాని ప్రశస్తేంటి..? 
‘‘మామా!
ఇదేం సోద్యం? సంబరమాయెలే- కష్టపడి కొండ నుంచి మోపులు మోసుకొచ్చేది- ఆ బాపనయ్య కోసమా!’’ అంది మల్లి చెన్నుడితో కోపంగా.
      ‘‘అదికాదే! ఆ సామి ఎంత గొప్పోడో నీకేం తెలుసు? ఎంత మంచి కవిత్వం సెబుతాడో. అందుకే ఆయప్పను అందరూ పెద్దన్నగానే మర్యాదిస్తారు’’ అన్నాడు చెన్నుడు కట్టెలమోపు మల్లి నెత్తికెత్తుతూ.
      ‘‘ఏం కవిత్వమో ఏమో! అదంతా నాకెందుకు? ఈ రెండు మోపులు రాచీధిలో అమ్ముకుంటే నాలుగు కాసులు ఎక్కువొస్తాయి కదా!’’ అంది మల్లి రుసరుసలాడుతూ.
      ‘‘మల్లీ! ఓ యిసయం తెలుసుకోవె. మనట్లా పేదోళ్లు వాళ్లకేమిస్తారే? బంగారు కడియాలా, మడి మాన్యాలా, మణి మాణిక్యాలా! ఆ పెద్దన్న రాయల కొలువులో గండపెండరం తొడిగించుకొన్నాడే! పల్లకిలో కూకోబెట్టి రాయలే ఆయప్పను మోసి ఊరంతా మెరవణి చేసినాడు, తెలుసా!’’ అన్నాడు చెన్నుడు.
      కట్టెలమోపులెత్తుకొని ఇద్దరూ మెల్లమెల్లగా ఆయాసపడుతూ కొండ దిగుతాంటే, అలసిపోయిన సూర్యుడు కూడ పడమట బరువుగా దిగిపోతున్నాడు.
      ఆ రోజు వరుసగా కురుస్తున్న వర్షానికి  ఆ జలధారలు చిన్నచిన్న జలపాతాలై పైనుంచి అందంగా దూకుతున్నాయి. చెన్నుడు మోపుదింపి ఆ ప్రకృతి దృశ్యాలను చూసి మురిసిపోతూ, ‘‘మల్లీ! ఈ ఆకాశం, నేల, నీళ్లు, ఈ కొండలు నల్లమబ్బులు చూస్తూంటే పెద్దన్నగారు రాయలసభలో సదివిన మనుచరిత్రే గుర్తుకొస్తాందే! దాంట్లో చెప్పిన ఆ మంచుకొండలు కూడ ఇట్లే ఉన్నాయే’’ అన్నాడు చెన్నుడు.
      మల్లికూడ ఇంకో గుండుమీద మోపును ఆసరాగా ఆనించి, ‘‘అంతా కండ్లక్కట్టినట్లే సెబుతావు మామ! నీ మాట్లే ఇనాలనిపిస్తుంది. సెప్పు, సెప్పు’’ అంటూ మరింత ఉత్సాహంగా చెవులు రిక్కించింది.
      ‘‘మల్లీ! ఈ పెనుకొండ విజయనగర పెభువుల రెండో రాజధాని. ఇక్కడ చల్లగా ఉంటుందని ఎండాకాలంలో సేద తీర్చుకోను వస్తారు. వాళ్లు వచ్చినప్పుడల్లా మందీ మార్బలంతో వస్తారు. కవి పండితులు వస్తారు. కవిత్వం వినిపిస్తారు. రాయలు వాళ్లతో పొద్దుగడుపుతారు. గగనమహల్‌ అప్పుడు నిండి పోతుందనుకో! ఆ సభకు మనలాంటోళ్లుకూడ ఎళ్లుతా ఉంటారే...!’’ వివరాలన్నీ పూసగుచ్చాడు చెన్నుడు.
      ‘‘నువ్వెప్పుడైనా ఎల్లావా మామా!’’  అడిగింది మల్లి.
      ‘‘నేనెల్లకేం! పతిసారి ఎళతా! ఓసారి ఈ పెద్దన్నగారు సభలో మనుచరిత్ర సదివితే - ఆ పద్యాలు విని సంబరపడిపోయి- నేను లేచి... ‘కవీశ్వరా! మీ పద్యాలు మద్దెల దరువులు, ఆ మంచుకొండల్లో పారే ఏటి గలగలలు- గజ్జెల గలగలలే. ఆ మంచుకొండలోని కన్య- మన ఘనగిరి కన్య. ఆ అమాయకపు బాపనయ్య- మనూరి సోమిదేవమ్మ మొగుడే!’ అని గట్టిగా చెప్పేపాటికి- ఇంక సూస్కో నాయనా! ఆ సభలో నవ్వులే నవ్వులు. ఆకాశం పగిలేంతగా చప్పట్లు’’ అన్నాడు చెన్నుడు తలచుట్టను మరోసారి గట్టిగా చుట్టుకొని కట్టెలమోపును ఎత్తుకొంటూ.
      మల్లికూడ తలచుట్టను సర్దుకొని గుండుమీద నిలిపిన మోపును నెత్తిపైకి ఎత్తుకొంటూ- ‘‘భలే సెప్పినావు మామా! ఈ మాటకేనా రాయలు మురిసి సభలో తన సేతి కడియం తీసి నీకిచ్చింది. ఇంత తెలివి నీకేడిది? ఎనకజన్మలో కవై ఉంటావు’’... హాస్యమాడింది మల్లి.
      ‘‘ఏమో! ఎనకజన్మకత ఎవరికి తెలుస్తాది? అచ్చరం ముక్కరాని నాలాంటోడి మాటకు మెచ్చి సభలో రాయలు తాను తొడుక్కొన్న కంకణమిచ్చి పొగిడినాడంటే- ఆయనెంత గొప్ప రసికుడో సూడు. ఏమైనా- ఓ మంచిమాటక్కూడా విలువుందే మల్లీ. ఓసారి నువ్వు భువన విజయానికి రావే! ఆ పద్యం నీ సొగసుకు మురిసి నీ ఎంటపడుతుంది’’ అంటూ నవ్వుతూ మల్లి పిరుదు మీద తన ఎడమచేత్తో ఒక్కటిచ్చాడు.
      ‘‘అబ్బో! సంబరమాయగాని- ఆగొడ్లి బద్రం. యాడన్నా జారిడిసేవు. అదే మన జీవితం. కవిత్వం కాదు’’ అంది మల్లి ముసిముసిగా.
      ‘‘ఇదిగో! నా బంగారు గొడ్లి’’ అంటూ చూపబోతున్న చెన్నుడి అడుగులు ఆ కొండ చరియల్లో తడబడుతూంటే- మల్లి తన కుడిచేతిని ఊతగా ఇచ్చింది. ‘‘మామా! మాడాలు ముసురుకొంటావుండిని. గెక్కున గుడిసె సేరుకొందాం పదా!’’ అంటూ మల్లి గబగబా అడుగులు వేస్తూంటే- చెన్నుడు అనుసరించాడు.

* * *

      పెద్ద దీపపుసెమ్మె ముందు కూర్చొని తాళపత్రాల మీద పద్యాలు రాసుకొంటున్న పెద్దనగారిని చూసి, ఆయన భార్య, ‘‘ఏమండీ!  మను చరిత్ర పక్కనబెట్టి, కాస్త మనచరిత్రను చెవికెక్కించు కుంటారా?’’ అంది నిష్ఠురంగా - దీపపు సెమ్మెలోని ఒత్తిని పుల్లతో ఎగదోస్తు.
      ఆమాటతో పెద్దన తలెత్తి చూశాడు. ఎదుట నిలిచిన సతీమణి కళ్లలో ఏదో గుబులు! ఘంటం పక్కన బెట్టి, ‘‘ఏమిటి? ఏదో మనచరిత్ర అని ఒత్తి పలికావే!’’ సంశయంగా అడిగాడు పెద్దన.
      ‘‘నాలుగు రోజులుగా రాత్రిళ్లు ఓ శబ్దం మన పెరట్లో వినబడుతోంది కదా! అదేమిటో ఆలోచించారా?’’ అందామె.
      ‘‘వింటూనే ఉన్నా. నాకూ అర్థం కావడం లేదు. వెళ్లి చూద్దామంటే- కుండపోతగా వాన. చిమ్మచీకటి. దొంగలేమో అనుకుందామా అంటే- భటులు రాత్రిపూట కాపలా కాస్తూనే ఉన్నారు. కానీ ఓ కట్టెలమోపు మాత్రం రోజూ పెరట్లో కనిపిస్తూనే ఉంది. ఇంతకు ఆ శబ్దం కట్టెలమోపుదేనా!’’ ఆశ్చర్యాన్ని ప్రకటించారు కవీశ్వరులు.
      ‘‘కట్టెలమోపు ఎందుకు వేస్తున్నారో? ఆశ్చర్యంగా లేదూ!...’’ 
      ‘‘మోయలేక పెరట్లో పడేస్తున్నారేమో!’’ అన్నాడు పెద్దన. ‘‘అదే నిజమైతే, దాన్ని తీసుకెళ్లడానికి పొద్దున్నే ఎవరైనా రావాలిగా! ఏదీ ఎవరూ రారే’’ అందావిడ.
      ‘‘వేసినవి వేసినట్లే ఉన్నాయి. ఎండుపుల్లే దొరకని ఈకాలంలో అవి బాగా ఉపయోగపడుతున్నాయి! అంతా మన మంచికే అనుకొంటే సరి’’ అన్నారు పెద్దనగారు.
      ‘‘అనుకొంటూ సందేహంగా కాలం గడపడమెందుకు? ఈ రోజు గమనిస్తే పోలా!’’ అంది ఆమె. 
      మొత్తానికి ఓ నిశ్చయానికొచ్చారు. ఆ రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధపడ్డారు. పెరట్లోని పెద్ద వేపచెట్టు కింద చేరారు. ఓపిగ్గా- చెవులు పెద్దవి చేసుకొని, కళ్లు విప్పార్చి, మౌనంగా, ప్రతీక్షణం నిరీక్షిస్తూ రెప్ప వేయకుండా నిలబడిపోయారు.
      ఇంతలో ‘దప్పు’మని శబ్దం...
      ‘‘ఎవడ్రా- అది, పట్టుకోండి- పట్టుకోండి అంటూ గట్టిగా అరిచాడు పెద్దన. ఆయనతోబాటు ఆమె కూడా కేకలుపెట్టింది. పెరటిగోడకు ఆవల ఉన్న చెన్నుడికి ఆ కేకలు చెవినిపడగానే భయం వేసింది.
      ‘‘సామీ! దండాలు. నేను చెన్నుడు. ఇదిగో లోపలికొస్తున్నా...’’ అంటూ మెల్లమెల్లగా అడుగులేసుకుంటూ లోనికొచ్చాడు. మల్లి భర్తను అనుసరించింది. ఆకాశంలో మెరిసిన మెరుపుతీగ వెలుగులో చెన్నుణ్ని గుర్తుపట్టాడు పెద్దన.
      ‘‘నీవేనా ఈ పని చేస్తున్నది?’’ అన్నాడు కోపంగా పెద్దన. ‘‘అవును సామి! ఈకాలంలో ఎండుపుల్ల దొరక్క అవస్థ పడతారేమోనని నేనే రోజూ ఏస్తున్నా’’ అన్నాడు చెన్నుడు చేతులు కట్టుకొని వినయంగా నిలబడి.
‘‘మాకు తెలియకుండా పెరట్లో వేయడమేమిటి? నీ జీవనం నడవొద్దూ’’! అంది పెద్దనగారి భార్య.
      ‘‘నేను, నా మల్లి రోజు చెరో మోపు తెస్తాం. ఒకటి అమ్ముకొంటాం. ఇంకోటి మీకేస్తాం. పుణ్యం కట్టుకొందామని’’. అన్నాడు చెన్నుడు.
      ‘‘సామీ! నా పెనిమిటికి మీ పద్యాలంటే ఎంతిష్టమో! ఎప్పుడూ మీ సంగతే సెబుతా ఉంటాడు. మీలాంటి గొప్పోల్ల కవిత్వానికి ఇంతకంటే మేమిచ్చేదేముంటుంది?’’ అంది మల్లి. పెద్దన భార్యవైపు తిరిగి, ‘‘ఈ చెన్నుడు మంచి రసికుడే! మొన్నటి గగన మహల్‌ సభలో రాయలు తన ముంజేతి కంకణాన్ని వీడికి తొడిగాడు’’ అన్నాడు.
      ‘‘అమ్మగారూ! అదంతా కవిరాజుల సలువే! ఎప్పుడూ మీలాంటోళ్ల సుట్టూతా తిరిగినా. అందుకే మాకు అబ్బింది. పూల వాసన దారానికి కూడా అబ్బుతుంది కదా’’ మురిసిపోతూ అన్నాడు చెన్నుడు.
      ‘‘భేష్‌! మంచిమాట చెప్పావు. నూరేండ్లు పిల్లాపాపలతో వర్ధిల్లండి’’ ఆశీర్వదించాడు పెద్దన.
       ‘‘అయ్యా! ఆ భాగ్యం మాకులేదు. దేవుడు మా కోరిక తీర్చలేదు. ఆ కొండ మీదున్న నరసింహసామికి ఎన్ని మొక్కులు మొక్కినామో! మన ఊరి వాకిలి ఆంజనేయసామికి ఎన్ని టెంకాయలు కొట్టినామో! ఎన్ని వేల చుట్లు ఆ రామాలయం, శివాలయాల చుట్టు తిరిగినామో! ఎన్ని నోములు ఉపాసాలు చేసిందో మా మల్లి. ఫలితం లేకుండా పోయింది సామి’’ అన్నాడు చెన్నుడు.
      ‘‘నాయనా! నీవు ఈ వర్షాకాలంలో మాకు చేసిన సహాయం చాలా గొప్పది. నీ రుణం ఉంచుకోవడం భావ్యం కాదు. ఏమివ్వాలో చెప్పు’’ అంటూ గట్టిగా అడిగాడు పెద్దన. 
      ‘‘అయ్యా! మీకు తెలియంది కాదు. ఏడు రకాలైన సంతానాల్లో కావ్యం పొందడం కూడా ఒకటంటారు. నాకు ఆ కోరికుంది. నా పేరు మీద ఒక పొత్తం రాయండి స్వామి’’ అన్నాడు చెన్నుడు వినయంగా.
      ‘‘మంచి కోరికే! ఇదిగో ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. మీ ఇంటిపేరు...’’ 
      ‘‘గువ్వల చెన్నుడు’’
      ‘‘అయితే ఇంకేం- ఇదిగో విను...
      గుడికూలును, నుయిపూడును
      వడి నీళ్లన్‌ చెఱువు తెగును, వనమునుఖిలమౌ
      చెడనిది పద్యం బొక్కటి
      కుడియెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా! అంటూ ఆశువుగా రాగయుక్తంగా వినిపించారు పెద్దన. అది విన్న మల్లీ చెన్నుళ్లు మురిసిపోయారు.
      ‘‘సామీ వేయిద]ండాలు. ఈ పద్యం రాసిపెట్టండి. ముందోళ్లకు గురుతుగా ఉంటుంది’’ అంటూ వాళ్లిద్దరూ అల్లసాని దంపతుల ముందు సాగిలబడ్డారు.
      ‘‘చెన్నా! నా పద్యభావం కూడా అదే! ముందు ముందు ఈ మకుటంతో ఓ శతకమే వెలుగు చూస్తుందిలే. పొద్దుపోయింది. ఇల్లు చేరుకోండి’’ అంటూ పెద్దన దంపతులు మరోసారి దీవించారు.

* * *

      అది రాయలవారి ఏకాంత మందిరం. మహామంత్రి తిమ్మరుసుతో రాయలు ఏదో చర్చిస్తున్న సమయం. ఇంతలో భటుడు ప్రవేశించి, వేగులరాకను ప్రభువులకు విన్నవించాడు. ఆజ్ఞ అయింది. లోనికి ప్రవేశించిన వేగు, ‘‘ప్రభువులకు వందనాలు. నిన్నటి రాత్రి ఓ ఆగంతకుడి దగ్గర ఈ విలువైన ముంజేతి కంకణం లభించింది’’ అంటూ తిమ్మరుసు చేతికి అందించాడు.
      ఆ ఆగంతకుణ్ని ప్రవేశపెట్టమని సైగ చేశాడు రాయలు. ఆగంతకుడు హాజరయ్యాడు.
అప్పాజీ ఆ కంకణాన్ని తదేకంగా చూసిన తర్వాత, రాయలవారి కుడిచేతివంక ఓసారి దృష్టి సారించి పరీక్షగా చూశారు. రాయల చేతికి కంకణం లేదు. దాంతో, ‘‘ఎవరు నీవు? ఎక్కడిదీ కంకణం?’’ అంటూ కళ్ల్లెర్రజేసి గద్దించాడు తిమ్మరుసు.
      ఆగంతకుడు గజగజ వణికిపోతున్నాడు. భయంతో నోరు పెగలడం లేదు. మాటలు తడబడుతున్నాయి.
      ‘‘నోరు పెగల్చు- లేకుంటే ఉరిశిక్షే’’ మరోసారి గద్దించాడు తిమ్మరుసు. తన కంకణం గురించి ఆలోచనలో పడ్డ రాయలను ఉద్దేశించి తిమ్మరుసు- ‘‘ప్రభూ! మిమ్మల్నే! ఇది మీరు ధరించేది కదా! ఈ చోరుడు దీన్నెలా తస్కరించి ఉంటాడో? ఆశ్చర్యంగా ఉంది. ఆలోచించండి’’ అంటూ సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడా ఆగంతకుడు, ‘‘ప్రభూ! నేను దొంగను కాను. ఓ పేద బ్రాహ్మణుణ్ని. నన్ను నమ్మండి. ఇది ప్రభువుల వారిదని నేనెరుగను. ఈ ఘనగిరి పొలిమేరల్లో గుడిసెలో కాపురమున్న కట్టెలు కొట్టే దంపతులు నాకిచ్చారు. వాడి పేరు చెన్నుడు’’ అని గట్టిగా రోదిస్తూ చెప్పాడు ఆ బ్రాహ్మణుడు.
      ఆ పేరు వినగానే రాయలు ఉలికిపడి, ‘‘చెన్నుడా! ఎవరు? ఆ రసికావతంసుడా!’’ అన్నాడు రాయలు, ఏదో జ్ఞాపకానికొచ్చి.
      ‘‘అవును ప్రభూ! ఆ చెన్నుడే! నా కుమార్తె పెళ్లికి సహాయం కోరి రాయలవారి దర్శన భాగ్యం కల్పించమని తెనాలి రామకృష్ణుల వారిని కోరాను. కవిత్వ వాసనే లేనివారికి అవకాశం దొరకడం కష్టమన్నారు వారు. నాకో చిన్న పద్యం నేర్పి, ఓ గుడిసె చూపించి, అక్కడికెళ్లి వల్లిస్తే కనీసం నీ ఇంటి శుభకార్యానికి కావాల్సిన కట్టెలన్నా దొరుకుతాయని సలహా ఇచ్చాడు’’ అన్నాడు బ్రాహ్మణుడు. 
      ‘‘ఏమిటా పద్యం- చెప్పండి’’ ఆసక్తిగా అడిగాడు రాయలు. ఆ బ్రాహ్మణుడు...
కలవిద్యలెన్నియైనను
కులవిద్యకు దీటురావు - కుంభినిలోనన్‌
వెలకాంత లెందరైనను
కులకాంతకు దీటురారు గువ్వలచెన్నా! అని పాడగానే, చెన్నుడి భార్య మురిసిపోతూ, ‘‘మొగోళ్లకు మంచి చురుకు ముట్టించారు సామీ! చాల సంతోషమైంది’’ అంటూ లోనికెళ్లి కంకణం తీసుకొచ్చి చెన్నుడికి ఇచ్చింది ప్రభూ! వాడు మరింత సంబరపడిపోతూ దాన్ని నా చేతిలో పెడుతూ... ‘‘మీ పద్యానికిది సరితూగుతుందో లేదో సామీ! అంటూ సాగిలబడ్డాడు’’ అని పూసగుచ్చినట్లు చెప్పాడు. అది విన్న రాయలు, అప్పాజీ లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుతూ,
      ‘‘సరే! ఈ కంకణంతోబాటు- ఈ బంగారు కాసులు కూడ తీసుకెళ్లు. కుమార్తె వివాహం ఘనంగా జరిపించు’’ అంటూ బహుమతి ప్రదానం చేశారు రాయలు. బ్రాహ్మణుడు నిండు సంతోషంతో రాయలకు వందనాలు చేసి బయటపడ్డాడు. అప్పుడు అప్పాజీ రాయల వంక తిరిగి, ‘‘ప్రభూ! మీ పాలనలోని ప్రజలకు ఇంట్లో క్షామమున్నా- ఒంట్లో రసజ్ఞతకు క్షామం లేదని నిరూపించారు. పెద్దనగారన్నది అక్షరసత్యం. ‘ఇచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ!’- ఆ ‘కొమ్మ’కున్న కవితా చేవ ఎంత ఘనమైనదో! కాకపోతే ఆ మల్లి మురిసి కంకణాన్నే ఇచ్చేస్తుందా! ఇక ఆ రసికావతంసులు మీ పద్యానికేం కానుకిస్తారో’’ అన్న అప్పాజి మాటకు నవ్వుతూ, ‘‘చూద్దాం’’ అన్నాడు రాయలు.

* * *

      ఊరి బయట దూరంగా ఓ గుడిసెలో చిన్న దివ్వెకాంతి ప్రకాశిస్తోంది. ఇద్దరు బాటసారులు అటువైపు వెళుతూ, ఆ గుడిసె దగ్గరికి వెళ్లి తలుపు తట్టారు.
      ‘‘ఎవరూ?’’ అంటూ తలుపు తీశాడు చెన్నుడు. వారి వేషాలు చూసి, ‘‘భట్రాజులా’’ అన్నాడు. ‘‘కాదు, కవి రాజులం’’ అన్నాడో బాటసారి గర్వంగా మీసం తిప్పుతూ. ఆ మాట వినగానే చెన్నుడికి ఆవేశమొచ్చింది.
      ‘‘రండి కవులారా! రండి!  ఈ అరుగు మీద కూకోండి’’ అంటూ తలపాగా తీసి అరుగు శుభ్రం చేశాడు చెన్నుడు.
      ‘‘పొద్దుగాని పొద్దులో వచ్చినారు సామి! ఏం పనిమీదో’’ అంది మల్లి వినయంగా.
      ‘‘మా కవిత్వంతో నిన్ను మెప్పించ వచ్చినాము’’ అన్నాడు మరో బాటసారి- చేతికర్రకున్న పొన్నుమీద చేతులు బరువుగా మోపుతూ.
      ‘‘అంతకంటేనా! చెప్పండయ్యా’’ అంటూ ఉత్సాహాన్ని చూపాడు చెన్నుడు. అప్పుడు నల్లగుబురు మీసాల బాటసారి పద్యం ఇలా ఎత్తుకొన్నాడు.
కలిమిగలనాడె మనుజుడు
విలసిత సత్కీర్తిచేత వెలయగ వలదా!
కలయేమి యెల్లకాలము
కులగిరులా కదలకున్న గువ్వలచెన్నా! అంటూ ఆశువుగా రాగయుక్తంగా పాడేసరికి చెన్నుడు మురిసిపోయి, ‘‘సామి దండాలు! మంచిమాట చెప్పినారు. నా మల్లి ఈ నీతిని ఇప్పుడే సెప్పింది. సంపద ఎన్నాళ్లుంటుందని. కీర్తిగొప్పదని. నాపేర పద్యం చెప్పినారు. నేనేమిస్తాను? రాజులైతే అగ్రహారాలే ఇస్తారు. మా రాయలవారైతే బంగారుతో ముంచెత్తుతాడు. నా దగ్గర ఉన్న ఒక్క కంకణం వేరేవాళ్లకు ఇచ్చేశాను.  ఇప్పుడేం చేయాలి?’’ అనుకుంటూ... ఏదో ఆలోచించుకుంటూ గుడిసెలోకెళ్లాడు చెన్నుడు. నిమిషంలో బయటికొచ్చి, ‘‘అయ్యా! ఈ గొడ్డలి ఒక్కటుంది. ఇదే నా జీవనాధారం. దీన్ని ఇస్తున్నాను. ఇంతకంటే గొప్పది, విలువైంది ఏదీ నా గుడిసెలో లేదు’’? అంటూ సాగిలబడ్డాడు చెన్నుడు. మల్లి మౌనంగా పెనిమిటిని అనుసరించింది.
      ఆ బాటసారులు ఆశ్చర్యపోతూ, ‘‘చెన్నా! లే!’’ అంటూ లేపి
ధనమేల? రాజ్యమేలా?
వినయ వివేకములతోడి వితరణగలుగన్‌
అనుమానమేల? నాకం
టెను గువ్వల చెన్నుడొక్కడే కృతిపతియౌ! 
      అంటూ ఆశువుగా పలికి, తన మెడలోని అమూల్య రత్నహారాన్ని చెన్నుడి మెడలో వేస్తూ ‘‘సత్కృతిపతీ’’ అని సంబోధిస్తూ పైకి లేపి తలకు చుట్టుకొన్న పెద్ద తలపాగాను తీశాడు రాయలు. చెన్నుడు రాయలను గుర్తుపట్టి, ‘‘ప్రభూ! మీరా! వీరు అప్పాజీవారు కదా!’’ అన్నాడు. ‘‘అవును’’ అంటూ తిమ్మరుసు తన నిజరూపాన్ని చూపిస్తూ, ‘‘చెన్నా! నీవంటి రసికులున్నప్పుడే కవిత్వం మూడుపువ్వులూ ఆరుకాయలుగా వికసిస్తుంది. రాయల రాజ్యం కవితా సామ్రాజ్యంగా శోభిల్లుతుంది’’ అన్నారు వెంటనే రాయలు.
      ‘‘చెన్నా! నీపేరుతో ఈ శతకం ప్రసిద్ధి పొందుతుంది. ఆ పంపా మహాదేవి నీనోట తాండవిస్తుంది. నీకు కవిత్వం అబ్బుతుంది. నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. శుభం భూయాత్‌’’ అని ఆశీర్వదించి సెలవు తీసుకొన్నారు రాయలు. చెన్నుడు, మల్లి ఎంతో మురిసిపోయారు. 
      ఇంకేముంది... చెన్నుడి గుడిసెలోని ఆ చిరుదివ్వె దేదీప్యమానమైన సాహితీ కాంతులను వెదజల్లి, విజయనగర రాజుల కీర్తిని దశదిశల చాటింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam