చోరకర్మం

  • 2959 Views
  • 491Likes
  • Like
  • Article Share

    రమాదేవి జాస్తి

  • హైదరాబాదు
  • 04046005794
రమాదేవి జాస్తి

మనవడిని చోరకళాసామ్రాట్టు చేయాలని నాయనమ్మ తపన. అందుకు తగ్గట్టే కత్తెర కళాశాలలో కోవిదుడౌతాడు మనవడు. చోరీ చేశాకే ప్యారీ మరదలితో పెళ్లంటుంది నాయనమ్మ.. నవ్వులు పంచిన అతని చోరగ్రంథాన్ని తెరవండి మరి...
మన ‘
పూర్వజన్మ’ జ్ఞానం మనక్కాక, ఇతరులకు కలిగితే మనకది చచ్చేచావు అవుతుందని నాకు మా నాయనమ్మ వల్ల తెలిసొచ్చింది. మా తాత పోయిన పదకొండో రోజున నేను పుట్టానట. అది చాలనట్లు ఆ ముందురోజు రాత్రి మా తాత అలా వీధిలోంచి ఇంట్లోకి గాల్లో తేలుకుంటూ వచ్చి మా అమ్మ పొట్టలోకి మాయమవుతుండగా కలలో చూసిందట మా నాయనమ్మ. ఇంకేముందీ, ‘పూర్వజన్మలో ఆయనే ఈ జన్మలో నేను’ అన్న ఆవిడ నమ్మకం నాతోపాటే పెరిగి పెద్దదై, నా నెత్తిమీద కుంపటై కూర్చుంది. మా మేనత్త కూతురు ‘చంప’ని పెళ్లాడాలంటే, ‘కులవృత్తి’లో నా ప్రతిభను నిరూ పించుకుని తీరాల్సిందేనని నాయనమ్మ మెలిక పెట్టింది. నాకు గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఇప్పుడెలా..?
      మా తాతేమన్నా సామాన్యుడా! చెట్టెక్కి గూట్లోని గువ్వకి కూడా తెలియకుండా గుడ్లు కొట్టుకువచ్చే వాడట. ఖాళీ ఖాదీ సంచి భుజాన తగిలించుకుని ఊర్ల మీదికెళ్లి, మోయలేనన్ని బ్యాగులూ, సూట్‌కేసుల్తో టాక్సీలో తిరిగొచ్చేవాడట. చిన్నప్పట్నుంచీ ఆయన లీలలన్నీ కథలు కథలుగా చెప్పేది నాయనమ్మ. వృత్తిలో మెలకువలు నేర్చుకుని పైకి రావాలని నన్ను పక్క రాష్ట్రంలోని దొంగల బళ్లో చదివించారు. అక్కడ ‘పాఠాలు’ తప్ప ‘ప్రయోగాలు’ ఉండవు, పట్టుబడితే బడికే ప్రమాదమని. కాబట్టి నా ప్రావీణ్యం ఏ పాటిదో తెలుసుకోవాలని అందరికీ యమా ‘యిది’గా ఉంది.
      ‘కృష్ణాష్టమి’ మాకు ముఖ్యమైన పండుగ. ఆ వెన్నదొంగే సాక్షాత్తూ మా కులదైవం. ఆ రోజు మా నాయనమ్మ నాకు పట్టు ధోవతీ కట్టబెట్టి, నుదుట కస్తూరి తిలకం దిద్ది, ‘‘అచ్చం చీరలెత్తుకుపోయే చిన్ని కన్నయ్య మల్లె ఉన్నావురా’’, అంటూ బుగ్గలు పుణికి ముద్దులాడింది. ‘‘మీ తాతయితే ఏ చీరయినా నాకు నచ్చిందంటే చాలు, ఏ కొట్లోదైనా సరే, ఎవరి పెరట్లోదైనా సరే - ఏడో నిమిషంలో దాన్ని నా ఒంటిమీద చూడాల్సిందే’’, జ్ఞాపకం చేసుకుంది.
      ‘‘ఈ ఏడో నిమిషం లెక్కేంటి?’’ ఆశ్చర్యంగా అడిగాను.
      ‘‘ఓ అయిదు నిమిషాలు దాన్ని కొట్టుకురావడానికీ, మరో రెండు నిమిషాలు నేను కట్టుకురావడానికీ అన్నమాట’’, నాయనమ్మ ముసిముసి నవ్వులు నవ్వింది. ‘‘విజయదశమి దాకా విశ్రాంతి తీసుకో హాయిగా. దసరా నాడు ఆయుధపూజ చేసుకున్నాక రంగప్రవేశం చేద్దువుగాని. ఏం చేయాల్సిందీ ఆ రోజు చెప్తాను’’, అందా తరువాత.
      అన్నట్టుగానే ఆ రోజున నాతో బ్లేడు, చాకు, కత్తి వంటి ఆయుధాలకి పూజ చేయించింది. ఆ పైన నేను చేయాల్సిన ఘన కార్యాలేంటో సెలవిచ్చింది. మొదటి పరీక్షలో తనకి తెలియకుండా మెడలోని కంటెనికాని, చేతిమీది మురుగుని గాని తీయాలి. అది విఫలమైతే మరో మూడు ఛాన్సులుంటాయి, ఇదే మొదటిసారి పనిలోకి దిగడం కాబట్టి. బయటికెళ్లి ఏదో ఒకటి కొట్టుకొచ్చి తనకి చూపించాలి. దీపావళి రాత్రి వరకే నాకు గడువు. ఆ తరువాత ఏకంగా ఏ బ్యాంకునో, నగలషాపునో కొల్లగొట్టుకొచ్చినా కూడా ఫలితం ఉండదట.
      ‘‘ఈ కార్తీకంలోనే చంప పెళ్లి చేసేస్తాం. పరీక్షలో నెగ్గితే నీతో, లేదంటే ధన్‌గాడికిచ్చి. వాడిప్పటికే ఇంటిచుట్టూ తిరుగుతున్నాడు ఓట్లడుక్కునేవాడిలా. నిన్నొచ్చి ఇంటిల్లిపాది బట్టలూ ఉతికిపోయాడు, వాషింగ్‌ మిషన్‌ ఉందన్నా వినకుండా. మళ్లీ రేపు వస్తానన్నాడు’’, నింపాదిగా చెప్పింది నాయనమ్మ. ఎందుకూ, ఇస్త్రీ చేయడానికా? ఉడుక్కున్నాను లోపల్లోపల. వాడు నాలా ఏ బళ్లోనూ చదవకుండా డైరెక్టుగా ఫీల్డులో దిగిపోయి, మానులా ఎదిగిపోయాడు దొంగపీనుగ. భూమికి జానెడుంటాడు కానీ భూమ్మీదున్న తెలివితేటలన్నీ వాడికే పెట్టాడు దేవుడు. వాడి చూపు దేనిమీద పడితే అది మాయం. నవ్వో ఏడుపో తెలియని మొహం పెట్టి మరీ నొక్కేస్తాడు నిమిషంలో! వాడి కన్ను ఇప్పుడు ‘చంప’పై పడిందా? గుండె గుభేలుమంది.
      ‘‘మొదటిసారి కాబట్టి జీబ్రాగాడిని నీకు సాయంగా ఇస్తున్నా. నీ మీద మేమూ ఒక కన్నేసి ఉంచినట్లుంటుంది’’, నాయనమ్మ ఆర్డరేసి, మహారాణిలా ఠీవిగా లోపలికి తగలడింది.
      ఖర్మ! అసలు నేను పుట్టకముందే ఈ తాత ఎందుకు చచ్చూరుకున్నాడో కదా?! ఆయన పేరు నిలబెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు నా మీద పడి చచ్చింది. చారెడేసి కళ్లల్లో మెరుపులు మెరిపిస్తూ నన్నే చూస్తూ నిలబడి ఉంది చంప, నా చామంతిపూల గంప. నేను ఫెయిలైతే కూలుతుంది నా కొంప.
      ‘‘రారా బావా, మనమెళ్లి ప్లాన్లేసుకుందాం’’ అంటూ జీబ్రాగాడు ప్రేమగా నా భుజాల చుట్టూ చేతులేసి బయటికి నడిపించాడు. వాడు చంపకి అన్న, చిన్నప్పట్నుంచి చారల చొక్కాలే వేసుకు తిరుగుతాడని ఆ పేరు పడిపోయింది.
      ‘‘గుడ్‌లక్‌ బావా’’, చంప చెయ్యూపింది చిలకలా నవ్వుతూ.

* * *

      నాయనమ్మ మెళ్లో కంటె లేదా చేతిమీది మురుగు కొట్టేయడం ఎలా (పాపం, ఛాయిస్‌ కూడా ఇచ్చిచచ్చింది ముసలిది)? ఇది నా ముందున్న అగ్నిపరీక్ష. ఆలోచనలో పడ్డా.
      ‘‘బావా, అసలు దొంగతనమంటే రాత్రే చేయాలని రూలేం లేదుగా? మామ్మ మధ్యాహ్న భోజనం అయ్యాక మాంఛి నిద్రలో ఉన్నప్పుడు మన పని కానిచ్చేద్దాం, ఏమంటావ్‌?’’ అన్నాడు జీబ్రాగాడు.
      వాడు చెప్పినట్లుగానే, నాయనమ్మ గాఢ నిద్రలోకి వెళ్లాక మెల్లగా పక్కన కూచుని, మునివేళ్లతో చెయ్యి పట్టుకున్నా ‘మురుగు’ తీద్దామని.
      ‘‘అబ్బా, అదే చెయ్యి, అదే స్పర్శ. ఎన్నేళ్లయిందయ్యా నీ చెయ్యి ఇట్టా మెత్తగా తగిలి’’, అంత నిద్రలోనూ నాయనమ్మ మత్తుగా మూలిగింది. ఉలికిపడి చెయ్యి తీసేశాను. కొంచెంసేపు ఆగి ఈసారి కంటెకి మెడ వెనకున్న హుక్‌ తీద్దామని వేళ్లకొసల్తో తాకీ తాకకుండా ప్రయత్నించాను. జీబ్రాగాడు ఊపిరి బిగబట్టి చూస్తుండగా. ఈసారి కితకితలైనట్లు నాయనమ్మ మెడ కదిల్చి నా చెయ్యి చటుక్కున ఒత్తి పట్టుకుంటూ మళ్లీ మూలిగింది. ‘‘చెయ్యి పట్టుకుంటేనే ప్రాణం జివ్వుమంటే, అది సాలనట్టు మళ్లీ మెడ పట్టుకుంటావేందయ్యా? పండగపూట నన్నిట్టా అల్లరి సెయ్యాలని వచ్చావా ఏంటి, రాత్రికి రారాదా?’’ అంది, నన్ను చచ్చిపోయిన తాతయ్య అనుకుంటున్నది గావున్ను.
      బిక్కచచ్చిపోయి నేనుంటే, జీబ్రాగాడు నవ్వాపుకోలేక సతమతమైపోతున్నాడు. ఆ ఉక్కు పిడికిట్లోంచి చేయి విడిపించుకోవడం సాధ్యంకాక వాడివైపు రక్షించమన్నట్లు చూశాను. జీబ్రాగాడు మెల్లగా వచ్చి దుప్పటి కొసని మెలిపెట్టి నాయనమ్మ చెవిలో సుతారంగా తిప్పాడు, అంతే.. చెయ్యి మళ్లీ నా స్వాధీనమైంది. మురుగుకి, కంటెకి నీళ్లొదిలేసి, ‘బతుకు జీవుడా!’ అని గప్‌చిప్‌గా గదిలోంచి బయటపడ్డాం. అవిప్పుడు మా కంటినలుసులు. ఎదురుగా చంప - పెదవి విరుపుతో.
      ‘‘మామ్మకింకా పులుపు చావలేదురా బావా’’, అన్నాడు జీబ్రాగాడు బయటికొచ్చాక పగలబడి నవ్వుతూ.

* * *

      ‘‘బావా, సిటీబస్సులో పర్సులు కొట్టేయడమంటే మంచినీళ్లు తాగినంత ఈజీ అనుకో. నువ్వేం భయపడకుండా నా వెనకే బస్సెక్కు. ఆ తర్వాతేం చెయ్యాలో నువ్వు మీ బళ్లో చదూకొనే ఉంటావు కదా?!’’ అన్నాడు జీబ్రాగాడు.
      మా బళ్లో ఫీజులెక్కువని జీబ్రాగాడిని చేర్చలేదు. వాళ్ల నాన్న కొట్టుకొచ్చిన డబ్బంతా పేకాటలో తగలేస్తే ఏం మిగుల్తుంది గనక. ఏదో మా మేనత్త చేతివాటం మంచిది కాబట్టి, ఆ సంసారం అట్లట్లా నడుస్తోంది...
      నా చదువు గుర్తు చేయగానే జీబ్రాగాడికి నా తడాఖా చూపించాలనిపించింది. రద్దీగా ఉన్న బస్‌లో చొరబడ్డాం. కొందరు వెధవలు బట్టలు వారానికోసారి కూడా మార్చుకోరల్లే ఉంది. దానికితోడు ఇద్దరు ముగ్గురు, టీవీలో చూపించే ఆడవాళ్లు వెంటపడే సెంటేదో కొట్టుకు వచ్చినట్టున్నారు, ఒకటే కంపు ఎలుక చచ్చినట్టు. ఛీ, యాక్‌! దేవుడా, ఏదో జేబులో చెయ్యిపెట్టి ఎట్లాగో ఓ పర్సు నొక్కేసి మా నాయనమ్మ ముఖాన కొట్టేసి, చంప మెళ్లో తాళి కట్టెయ్యగలిగితే చాలు అనుకుంటూ, ముందుకు కదిలి ఒకడి జేబులోంచి కుడుములాంటి పర్సు దొరకబుచ్చుకుని జీబ్రాగాడూ నేనూ రన్నింగ్‌ బస్‌లోంచి కిందికి దూకేశాం. ఎవరన్నా వెంటాడుతారేమోనన్న భయంతో పక్క గల్లీలోకి తిరిగి ఓ అర కిలోమీటరు పరుగెత్తి అక్కడో చెట్టు కింద నిలబడ్డాం, ఆయాసపడ్తూ.
      ‘‘బ్భాహ్హా, స్సస్సస్స ఖ్సెస్సా?’’ రొప్పునాపుకుంటూ అడిగాడు జీబ్రాగాడు.
      నేను చిరునవ్వుతో బొటనవేలు పైకెత్తాను విజయ సూచకంగా. గర్వంగా పాంటు జేబులో చెయ్యి పెట్టాను, ఖాళీ. మళ్లీ మళ్లీ వెతికాను. ‘‘కుడుములాంటి పర్సు, నా చేత్తోనే తీశాను. నా జేబుకి బదులు పక్కవాడి జేబులో పెట్టేసినట్లున్నా’’
      ‘‘కుడుములాంటి పర్సా? చంపావురా బావా, అది నాదే. నా పర్స్‌ కొట్టేసి వేరేవాడి జేబులో పెట్టేశావా? నీ చదువు తగలెయ్యా! దాన్నిండా హీరోయిన్లు బికినీల్లో ఉన్న ఫొటోలు దాచుకున్నారా బావో..’’ జీబ్రాగాడు లబోదిబోమన్నాడు. తన పర్సుని తల్చుకుని తల్చుకుని కుమిలిపోతూనే, మరో ప్లాన్‌ ఆలోచించాడు నా కోసం.

* * *

      ఈసారి రైల్వేస్టేషన్‌కి వెళ్లాం. హఠాత్తుగా జీబ్రాగాడు నెమ్మదిగా కదుల్తోన్న రైలుకేసి చూస్తూ ఈలపాట పాడాడు ‘‘అమ్మాయి కిటికీ పక్కన కూర్చుందీ’’, అంటూ. నేనూ అట్లానే జవాబిచ్చాను, ‘‘కిటికీలోంచి ఏం కనబడుతోంది?’’
      ‘‘గంటకు డెబ్భైమైళ్ల వేగంతో, చెయినొచ్చి చేతిలో వాలిందీ’’, ఈసారి వాడు చిన్నగా, నాకు మాత్రమే వినబడేలా మాటల్లో పాడాడు.
      నాకర్థమైంది. డెబ్భయ్యేంటి, నూటడెబ్భై మైళ్ల వేగంతో అమిత లాఘవంగా చెయ్యి విసిరాను. సగం ముక్క మాత్రమే చేతిలోకి వచ్చింది. అంతలో ఆశ్చర్యకరంగా, ఆ గొలుసు తాలూకూ శాల్తీ చెయ్యి బయటికొచ్చి కిటికీలోంచి మిగిలిన సగం కూడా విసిరేసి ‘బై’ చెప్పి లోపలికి మాయమైంది, రైలు పరుగందుకుంది. జీబ్రాగాడు ఆ ముక్కని ఒడుపుగా పట్టి, ఒక్క చూపులోనే ‘‘బావా... ఇది నకిలీది.. అయినా మీ బడిలో కాకి బంగారం గుర్తు పట్టడం నేర్పలేదా? ఇదేనా మీకు చెప్పిన చదువూ..’’ అని ఆశ్చర్యపోయాడు ఊరుకోకుండా. నాకు చిన్నతనంగా అనిపించింది. ఇంత శ్రమా వృథా అయిపోయినందుకు, మళ్లీ ‘చంప’ నా చెయ్యి జారిపోయినందుకూ.
      ‘‘బావా.. ఈసారి రోడ్డు మీద పడి అదృష్టాన్ని పరీక్షించుకుందాం. ఇరవైనాలు గ్గంటలూ స్నాచింగులు చేసినా తరగనంత బంగారం మనవాళ్ల దగ్గరుంది. కాబట్టి, ఆ రూట్లో ట్రై చేద్దాం. దీపావళికింకా రెండు రోజులుందిగా?!’’ ధైర్యం చెప్పాడు జీబ్రాగాడు.
      ఇంటికొచ్చేప్పటికి ధన్‌గాడు ఏడుపులాంటి నవ్వుతో తప్పేళా మొహమే స్కుని ఇల్లంతా కడుగుతున్నాడు తళతళ్లా డేట్లు. నాయనమ్మ నట్టింట ఉయ్యాల బల్ల మీద ఊగుతోంది. మా ముఖాలు చూసి పసికట్టేసి, ‘‘చంపా, బావొచ్చాడు. పసుపునీళ్లు తెచ్చివ్వు, ముఖం కడుక్కుంటాడు’’ అంటూ కేక పెట్టింది లోపలికి.

* * *

      ‘‘బావా, గుడికెళ్లి వస్తున్నట్టుంది ముసల్ది. రోడ్డు మీదెవరూ లేరు. వెళ్లి పలకరించి, బురిడీ కొట్టిద్దాం పద!’’
      ‘‘అవును, చేతిలో కొబ్బరిచిప్ప కూడా ఉంది’’ అన్నాను, చుట్టూపరికించి చూస్తూ.
      ‘‘నీ బొంద, చూడమంది చిప్పను కాదు, అది పట్టుకున్న చేతుల్ని. చూడు ఆ గాజులెట్లా మిలమిలా మెరిసిపోతున్నాయో? మెడలో రెండు వరసల గొలుసు కూడా ఉంది..’’, జీబ్రాగాడు సంబరపడిపోయాడు. ఇద్దరం దగ్గరికెళ్లి, ‘‘గుడికెళ్లి వస్తున్నావా మామ్మా?’’ అంటూ ప్రేమగా పలకరించాం.
      ‘‘అవునయ్యా.. ఇవాళ కాస్త ఆలస్యం అయింది,’’ మామ్మ ఆగి మరీ జవాబు చెప్పింది. మా ముఖానున్న కుంకం బొట్లు మంచి ‘లుక్‌’ ఇచ్చినట్లున్నాయ్‌.
      ‘‘అయ్యో మామ్మా, ఇప్పుడే ఆ పక్కరోడ్డులో హత్య జరిగిందట. అక్కడంతా పోలీసులతో గోలగా ఉంది. అసలే పరిస్థితి బాగా లేదు. నువ్వేమో ఒంటిమీద ఇంత బంగారంతో ఉన్నావు. పోనీ, నీతోపాటు ఇంటి వరకూ వచ్చి దిగబెడతాంలే. ఎందుకైనా మంచిది, ఆ సొమ్ములు తీసి ఈ జేబు రుమాల్లో మూట కడదాం, ఇంటికెళ్లాక తీసుకుందూగాని’’, జీబ్రాగాడు ఆప్యాయంగా చెప్పాడు.
      ‘‘నా నాయనే, ఎంతమంచి పిల్లలయ్యా మీరు? పోలీసులంటేనే కాళ్లు వొణుకుతున్నాయ్‌. ఆ దేవుడే మిమ్మల్ని నా కోసం పంపినట్లున్నాడు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోనూ? ఇంద, ఈ ప్రసాదం నోట్లో వేసుకోండి’’ అంది. 
      ముసలమ్మ సంతోషంగా ఒలిచిచ్చిన నగల్ని జాగ్రత్తగా రుమాల్లో మూటకట్టి షర్ట్‌లో దోపేశాను. పెట్టిన ప్రసాదాన్ని ఇద్దరమూ భక్తిగా కళ్లకద్దుకుని మరీ నోట్లో వేసుకున్నాం. అంతలో ముసలమ్మ దగ్గర ‘సెల్‌’ మోగింది. ఇద్దరం ముఖాలు చూసుకున్నాం కలవరంగా. ముసలమ్మ, బొడ్డున దోపిన వక్కాకు సంచీలోంచి ‘సెల్‌’ తీసి లొడలొడ మాట్లాడింది, మేం ఊపిరి బిగబట్టి చూస్తుండగా.
      ‘‘ళచేళపళలు ళరెంళడు, ళనీళదే ళఆళలళస్యం.’’.. మాకు అదేం భాషో అర్థమై చావలేదు. నేను నేర్చుకున్న పది భాషల్లోనూ లేదిది. తీవ్రంగా ఆలోచిస్తుండగానే మా కళ్లు మసకలు కమ్ముకున్నాయి. తెలివొచ్చేప్పటికి మమ్మల్ని ఓ గదిలో పెట్టి తలుపులు గడియ వేసినట్లు అర్థమైంది. బయటొకడు కాపలా. కిటికీలోంచి జీబ్రాగాడు వాడిని పిలిచి ఏం జరిగిందీ తెల్సుకోడానికి ప్రయత్నించాడు. వాడు డబ్బుల కోసం వేళ్లాడించాడు. అప్పటికే మా జేబులు ఊడ్చేశారు. ఇంక డబ్బులెక్కడివీ మా దగ్గర? నేను అదే చెప్పబోతుండగా, జీబ్రాగాడు అటు తిరిగి సెకన్లో వందనోటు తీసి బయటి వాడి చేతిలో పెట్టాడు కిటికీలోంచి. తెల్లబోతూ అడిగా, ‘‘ఇదెక్కడ దాచావురా?’’ అని.
      ‘‘ఒరే బావా, ఇప్పుడా వివరాలు నీకు అవసరమా? చెప్పానంటే డోక్కొని చస్తావ్‌’’, కోప్పడ్డాడు జీబ్రాగాడు. కాపలావాడు నోటందుకుని నోరు విప్పాడు.
      మమ్మల్ని పట్టుకున్న ఇన్‌స్పెక్టరు ముసలమ్మ కొడుకు. ఇలా తల్లిని నగలతో ‘ఎర’గా వేసి మాలాంటి ఎంతో మందిని పట్టుకుని ‘ఎన్‌కౌంటర్‌’ చేసిపారేశాడట. మాకిచ్చిన ప్రసాదంలో మత్తుమందు కలిపారట. ముసలమ్మ, మాలాంటి వెర్రివెధవలు దగ్గరకు రాగానే కొడుక్కి ‘ఇన్ఫర్మేషన్‌’ ఇస్తుంది కోడ్‌ భాషలో. అది ‘ళ’ భాషట. తల్లీకొడుకులు కలసి తయారు చేసుకున్నారట దాన్ని. వింటూనే గుండెలు జారిపోయాయి మాకు. 
      ‘‘ఒక ఇన్‌స్పెక్టర్‌ ఇట్లా దొంగల్ని పట్టుకుని చంపేయడమేంటీ? ఇదేమన్నా సిన్మానా? మానవ హక్కుల సంఘాల వాళ్లు ఏం చేస్తున్నారు?’’ అంటూ మేం తుపాకీ గుళ్లలాంటి ప్రశ్నల్తో దడదడలాడించినా కాపలా వాడు తొణకలేదు.
      ‘‘మా సార్‌కి దొంగలంటే మహామంట. దానికి ఆయన మేనత్తే కారణం. అదో విషాదగాథ’’ అని తాపీగా చెప్పి ఊరుకున్నాడు.
      ‘‘అదేంటో చెప్పరా, ప్లీజ్‌’’ బతిమాలాడు జీబ్రాగాడు. వాడు సస్పెన్స్‌ని అస్సలు తట్టుకోలేడు.
      కాపలా వాడు వేళ్లాడించడం చూసి మా మాంత్రికుడు అటు తిరిగి మళ్లీ ఓ వందనోటు పైకిలాగి కిటికీలోంచి అందించాడు. దాంతో ఆ ‘గాథ’ తెలిసింది.
      ఇన్‌స్పెక్టర్‌ చిన్నప్పుడు, వాళ్ల మేనత్త పెళ్లికి ముందురోజు కాబోయే అత్తవారింట్లో దొంగలుపడి అంతా ఊడ్చుకెళ్లిపోయారంట. దాంతో పెళ్లి ఆగిపోయిన ఆవిడ, వీళ్లింట్లోనే ఉండి ఇన్‌స్పెక్టర్‌ గారి తల్లిని రాచిరంపాన పెట్టిందట చచ్చేవరకూ. ఆ దొంగతనమే తమ కష్టాలకి కారణమని ఇన్‌స్పెక్టర్‌గారి లాజిక్‌. అందుకే దొంగల మీద పగ. నమ్మిన బంటు లాంటి ఈ కాపలావాడి సహాయంతో రకరకాల ప్లాన్లేసి దొంగల్ని పట్టుకుని, జైల్లో పెట్టకుండా ఇట్లా రహస్యంగా బంధిస్తారట. ఆనక వాళ్లని ఏ శ్రీశైలం అడవుల్లో లైసెన్సు లేని తుపాకీతో కాల్చేసో, నోట్లో విషం పోసేసో, నీట్లో రాయికట్టి తోసేసో, రైలుపట్టాల మీద పడేసో చంపేస్తుంటాడన్న మాట. ఇప్పటికి తొంభై ఎనిమిది మందిట్లా చచ్చారు. మా ఇద్దరితో సెంచరీ అని సంబరంగా ఉన్నారట తల్లీకొడుకులు.
      విన్నాక ఒళ్లంతా చెమటలు పట్టినయ్‌. చచ్చిన మా తాతపేరు నిలబెట్టాలన్న మా నాయనమ్మని చంపి ఉప్పుపాతర వేయాలన్పించింది. దానికోసమైనా ముందు నేను బయటపడాలి కదా! ఈ కాపలా బంటుగాడు మంచి లంచగొండిలానే ఉన్నాడు. ‘‘ఇంకెక్కడన్నా డబ్బులు దాచావేమో, వాడికిచ్చెయ్యరా. మనల్ని వదిలేస్తాడు’’, జీబ్రాగాడితో గొణిగాను. ఈసారి వాడటు తిరక్కుండానే ‘రయ్‌’మని ఓ అయిదొందల నోటు పైకిలాగి గాల్లోకి ఊపుతూ ప్రాధేయపడ్డాడు, ‘‘మమ్మల్ని వదిలేస్తే ఈ ఆఖరినోటు నీకిచ్చేస్తాం. జన్మలో దొంగతనాలు చెయ్యం. బుద్ధిగా బతుకుతాం. మాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాం’’, నేనూ తలూపుతూ అయిదొందలు నోటున్న జీబ్రాగాడి చేతిని కిటికీలోంచి బయటికి నెట్టాను. 
      ‘‘మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. మొదటిసారంటున్నారు కాబట్టి వదిలేస్తున్నా. పిల్లలకి నా పేరొద్దులే. మా సారు పేరు సన్యాసిరావు. అది పెట్టుకోండి’’ అన్నాడు కాపలావాడు.
      మరు నిమిషంలో ఆ నోటు కాపలా వాడి చేతుల్లోకి వెళ్లడమూ, గడియ తీసిన తలుపుల్లోంచి మేము బయటికి దూకి పరుగందుకోవడమూ జరిగిపోయాయి.
      ‘‘ఛీ అదేం పేరు. నాకు నచ్చలా’’ జీబ్రాగాడు చిరాకుపడ్డాడు. ‘‘పేర్లూ, పిల్లలూ తరువాత. ముందిక్కడి నుంచి జంపవ్వరా పిచ్చెదవా..’’ పరిగెడుతూనే కోప్పడ్డాను.
      ‘‘వీడేం నమ్మిన బంటురా? అయిదొందలకి ఇద్దరినొదిలేశాడు. ఈ లెక్కన  ఎంతమందినొదిలేశాడో? లేకపోతే ఆ ఇన్‌స్పెక్టర్‌గాడి సెంచరీ ఎప్పుడో పూర్తయి ఉండేదేమో?!’’ జీబ్రాగాడు పరుగెడుతూనే వాగుతున్నాడు, వదిలేసినందుకు కొంచెం కూడా సంతోషించకుండా. అలుపు తీర్చుకోవడానికి అరనిమిషం ఆగామో, లేదో వెనక ఆకుల మీద గలగలమంటూ అడుగుల చప్పుడు వినిపించింది. దూరంగా ఇన్‌స్పెక్టర్‌ రివాల్వర్‌తో పరుగెత్తుకు వస్తున్నాడు, కాపలా వాడితో సహా.
      ‘‘బావా, బంటుగాడు నిజంగా నమ్మిన బంటుగాడేరోయ్, పరుగెత్తు’’, పొలికేక పెట్టి జీబ్రాగాడు పరుగు లంకించుకున్నాడు. పట్టుమని పదిగజాలు పరుగెత్తామో, లేదో వెనుకనుంచి వినిపించింది... ‘ఢాం!’

* * *

      ‘‘ఢాం! ఢాం!’’
      బయట దీపావళి టపాకాయల మోతలు కాబోలు వినిపిస్తూనే ఉన్నాయి. మంచం మీంచి కిందపడ్డానేమో, ఒళ్లంతా నొప్పులు. వచ్చింది కలని తెల్సినా, గుండె దడ ఇంకా తగ్గలేదు. భోజనం చేస్తున్నప్పుడు జీబ్రాగాడు చెప్పిన మూడోప్లాను విని వచ్చి, పగటి నిద్రకు పడ్డాను. ఈ కల వచ్చింది నన్ను మేలుకొలుపుతూ. కులవృత్తీ లేదు,    కుమ్మరమూ లేదు. ఇప్పుడు ఖాదీలూ, ఖాకీలూ, ఉద్యోగాలవాళ్లూ, ఊళ్లేలేవాళ్లూ ఇట్లా అందరూ రకరకాలుగా జనాన్ని బాహాటంగా దోచేసుకుంటుంటే ఇక మాకేముంది కనుక? బతికుంటే ఒక్క మిరపకాయని అడ్డంగా కోసి ఆరు బజ్జీలేసి అమ్ముకు బతకొచ్చు దర్జాగా. అంతేకాని అలవిమాలిన ఈ ‘చోరకర్మం’ నాకేల? చంప కోసం ఈ కంపలో పడలేను. ఇక్కడే ఉంటే    బలవంతంగా ఆ రొంపిలోకి దింపుతారు. అందుకే... 
      రాత్రి పది గంటలప్పుడు రహస్యంగా ఓ చిన్న బ్యాగుతో ఆటోలో ఎక్కి కూచున్న నాకు ఓ పక్క జీబ్రాగాడు, మరోపక్క చంపాను- ‘‘బావా, మాకూ ఈ జీవితం ఇష్టం లేదు. ముగ్గురం కలిసి ఎక్కడో ఒక చోట ఏదో పని చేసుకుని బతికేద్దాం. నువ్వు పరీక్షలు పాసైపోతావేమోనని హడలి చచ్చా తెలుసా’’, అంటూ రిలీఫ్‌గా భుజమ్మీద తలవాల్చింది చంప, నా చామంతిపూల గంప!

***

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


చోరకర్మం

చోరకర్మం

రమాదేవి జాస్తి


ఎందరో మహానుభావులు!

ఎందరో మహానుభావులు!

కె.ఎల్‌.సూర్య


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్లbal bharatam