ఎందరో మహానుభావులు!

  • 2102 Views
  • 28Likes
  • Like
  • Article Share

    కె.ఎల్‌.సూర్య

  • హైదరాబాద్‌
  • 9393472410
కె.ఎల్‌.సూర్య

మన సూరిబాబు చచ్చుపుచ్చు పాటలు రాసే ఏడుకొండలకి వీరఫ్యాను.. ఎంత ఖర్చయినా అతణ్ని కలవాలన్నదే సూరిబాబు వెర్రి ఆశయం.. తన డబ్బింగ్‌ శ్రీమతికి తెలియకుండా డబ్బులు పోగేస్తాడు.. అయితే చివరికి ఏడుకొండల్ని కలిశాడా? ఎలంకాయని మింగాడా?
ఎప్పుడూ
తొమ్మిదింటికి కానీ ఇల్లు చేరుకోని సూరిబాబు... ఈరోజు ఏడుగంటలకే వెళ్లేందుకు హడావుడి పడుతున్నాడు. అదేమంత తేలిగ్గా జరగలేదు. మసాలా బండి ఊరిస్తున్న లాలాజలాన్ని తొక్కిపెట్టాడు. ఫోన్‌ని సైలెంట్‌ మోడ్‌లో పెట్టాడు. ఆఖరికి వీధి చివర వెంటపడిన కుక్కని కరిచినంత పని చేశాడు. ఇంతాచేసి ఇంటికి వెళ్తే ‘అసలు మొగుడు అంతరాత్మే’ ధారావాహికను ‘టీ’వీగా చూస్తున్న వాళ్లావిడ కనిపించింది.
      ‘‘చాలా సంతోషం. మీలో ఈ మార్పు రావడం. ఇంటికి వచ్చారు ఆఫీసు వదిలిన వెంటనే! ఇది ఆనందకరమైన సందర్భం. నేను చాలా సంతోషిస్తున్నాను.’’ అంటూ పలకరించింది వాళ్లావిడ. అనువాద ధారావాహికలు చూడ్డం మొదలుపెట్టాక, ఆవిడ సంభాషణలో కృతకమైన మార్పులన్నీ చోటు చేసుకున్నాయి. 
      సూరిబాబు ఆవిడ ఆప్యాయతనీ, దానికి అనువాదాన్నీ పట్టించుకోకుండా రిమోట్‌ లాక్కుని ఓ తెలుగు వార్తాఛానల్‌ పెట్టాడు. తను చూడాలనుకున్న కార్యక్రమం అప్పుడే మొదలవుతోంది. ఇవాళ తన అభిమాన గీత రచయిత ఏడుకొండలుకి ఘనసన్మానం. మతాషా ఆర్ట్స్‌ అనే సంస్థ ఏడుకొండలుని బంగారు కడియంతో సత్కరిస్తోంది. సామాన్యంగా ఏడుకొండలుకి ప్రచారం అంటే గిట్టదు. తను పాటలు రాసిన సినిమాల ప్రచారం కోసం కానీ, ముఖాముఖి కోసం కానీ ఏడుకొండలు అందుబాటులో ఉండనే ఉండడు. మరీ ఎప్పుడన్నా.. ఇలాంటి ఘనసన్మానాలకి మటుకు హాజరవుతుంటాడు.
      సన్మానాలు, పొగడ్తలూ ముగిసిన తరువాత ఏడుకొండలుని మాట్లాడాల్సిందిగా ఆహ్వానించాడు ప్రయోక్త. తను ఇంతవరకూ ఏడుకొండలు మాట్లాడ్డం చూడనే లేదు. ఇప్పుడు చూడాలి! ఏడుకొండలు ఒక్కసారి లేచి, శాలువాని సరిచేసుకున్నాడు.. ఎంత నిభాయించుకున్నా అతని చూపులు కాలికి తొడిగిన కడియాన్ని తాకుతున్నాయి. మైకుని చేరుకున్న ఏడుకొండలు ఏం మాట్లాడతాడా అని సభలో కాలం స్తంభించింది. సూరిబాబు చెగోడీని నముల్తున్నవాడల్లా ఆగిపోయాడు. ఏడుకొండలు కళ్లలో ఆనందబాష్పాలు కనిపించేసరికి కెమెరాని క్లోజప్‌ చేశారు. పెరిగిన ఉల్లిధరని విన్నవాడిలా అతని కళ్లలో నీళ్లు! కన్నీళ్లని దిగమింగాక ‘‘అందరికీ నమస్కారం! ఎందరో మహానుభావులు.. అందరికీ వందనం’’ అన్నాడు.
      ఇంకా ఏడుకొండలు ఏమన్నా చెబుతాడేమో అనుకునేలోపే ఆయన తిరిగి సుఖాసీనుడయ్యాడు. మాటలు ముగిశాయని తెలుసుకున్న ప్రేక్షకుల చప్పట్లు అలవాటుగా హోరెత్తాయి. ‘ఎంతటి నిర్లిప్తత, ఎంతటి నిగర్వం. త్యాగరాజుని ఉట్టంకించాక ఇంక చెప్పడానికి ఏం మిగుల్తుంది’ అంటూ ప్రయోక్త మళ్లీ పొగడ్తలను ప్రారంభించాడు. ఎప్పటికైనా ఏడుకొండలు నుంచి నాలుగు ముక్కలు విందామని ఆశపడిన సూరిబాబు నిరుత్సాహపడ్డాడు. చెగోడీ కాస్తా చేదుగా తోచింది.
      ‘‘చాలా సంతోషం. ఇంటికి వచ్చారు ఆఫీసు వదిలిన వెంటనే! మిరపకాయ బజ్జీలు చేశాను, ఈ సందర్భంలో నేను’’ అంటూ వాళ్లావిడ అనువాదాన్ని పట్టించుకోకుండా, సిగిరెట్‌ ముట్టించి రోడ్డుమీదికి వచ్చాడు.
రెండు సంవత్సరాల క్రితం తను ఏడుకొండలు పాటని తొలిసారి విన్నాడు. అప్పటి నుంచీ ఆయన రాసిన పాటలంటే తనకి ప్రాణం. తనే కాదు తెలుగువాళ్లెందరో ఆ పాటలకి వీరాభిమానులు. ఏడుకొండలు ‘కిర్రు కిర్రు... కిక్కు కిక్కు’ అనే యుగళగీతాన్ని రాస్తే తెలుగు నరుల నరాలన్నీ ఉడుకెత్తిపోయాయి. ‘పట్టుకుంటె పోయ్‌ పోయ్‌... ముట్టుకుంటె టోయ్‌ టోయ్‌’ అన్న శృంగార గీతానికి సినిమా రీళ్లు మెలికలు తిరిగిపోయాయి. ఇక ‘వచ్చేదంతా పోయేదే..’ తాత్విక గీతం వినగానే, ఒంటి మీద దుస్తుల్ని స్టీల్‌ సామాన్లవాడికి వేసేసి, బదులుగా ఓ చెంబు తీసుకుని కాశీకి బయల్దేరాలనిపించింది. ఆ పాటలన్నీ చచ్చుపుచ్చు పద విరుపులని పెదవి విరిచిన వాళ్లూ లేకపోలేదు. కానీ ఏడుకొండలు పాటల హోరు ముందు ఆ విమర్శలు వినిపించకుండా పోయాయి.

***

      ‘‘ప్చ్‌ లాభం లేదు! సినిమా పాత్రికేయుడిగా నాకు పాతికేళ్ల అనుభవం ఉంది. కానీ ఇప్పటివరకూ ఏడుకొండలుని కలవలేకపోయాను. అల్లుడివైనా నా కాళ్లు పట్టుకుంటున్నావు కాబట్టి... నాకున్న కొందరు పరిచయస్థుల ఫోన్‌ నెంబర్లని నీకు ఇస్తాను. వాళ్ల ద్వారా అతణ్ని కలవగలవేమో ప్రయత్నించు’’ అన్నాడు సూరిబాబు వాళ్ల మామ.
      ఆ నెంబర్లు పట్టుకుని సూరిబాబు చేసిన ప్రయత్నాలేవీ ఫలించనేలేదు. ‘అతనికి ఆత్మన్యూనత ఎక్కువ. అందుకే ఎవరిలోనూ కలవడు’ అని ఊహించాడు ఒకడు. ‘న్యూనతా లేదు నాణ్యతా లేదు. వాడొట్టి తాగుబోతు. ఆ మత్తులో ఏదో రాస్తుంటాడు’ అని సందేహించాడు మరొకడు. ‘తనకి ఎక్కడ దిష్టి తగుల్తుందో అని భయం. అందుకే నిరంతరం పూజా గదిలోనే ఉంటాడు’ అని మరొకరి ఉవాచ.
      ఏతావాతా అందరూ తేల్చిందేమిటంటే.. ఏడుకొండలు దర్శకులకి కూడా అందుబాటులో ఉండడు. కథనీ అందులో పాటలు రాయాల్సిన సన్నివేశాలనీ, సంగీతం ఉన్న సీడీని ఏడుకొండలుకి పంపితే, పాటల ప్రత్యుత్తరం వస్తుంది. తిరిగి భారీ చెక్కు పంపడంతో ఈ అనుబంధం ముగిసిపోతుంది. మిగతా విషయాలన్నీ అతని సహాయకుడు చూసుకుంటాడు.
      ఏడుకొండలుని కలవడం కష్టమని తెలిసిన కొద్దీ సూరిబాబు అభిమానం మరింత వెర్రెత్తిపోయింది. రక్తంతో తను రాసిన ఉత్తరాలకి కానీ, పంపిన పూలచెండులకి కానీ ఎలాంటి బదులూ లేకపోయే! ఏడుకొండలు ఇంటి గోడ దూకుదామా అని రెక్కీ కూడా నిర్వహించాడు కానీ, తన ప్రభుత్వోద్యోగం గుర్తుకువచ్చి ఊరుకున్నాడు. ఆ ఆదివారం..
      ‘నీలుగు పాపా.. వాలుగు చేపా.. నీళ్లోసుకుంటావా’ అనే ఏడుకొండలు గీతాన్ని వింటున్నాడు సూరిబాబు. ‘‘ఎంతో ఆనందం. ఇది మంచి సందర్భం.. శుభాకాంక్షలు మీకు’’ అంటూ వాళ్లావిడ మాటల్ని కూడా పట్టించుకోకుండా పాటల లోకంలో తేలిపోతున్నాడు. కళ్లు తెరిచేసరికి వాళ్ల మామయ్య...
      ‘‘చాలా ప్రయత్నించాను అల్లుడూ, తనకో లక్ష రూపాయలు ఇస్తేగానీ కలవడం కుదరదన్నాడు. అదికూడా ఉత్తరాల్లో నువ్వు చూపిస్తున్న అభిమానం గమనించడం వల్లే సుమా! ఇక ఏడుకొండలుని కలవాలన్న ఆశని వదులుకో’’ అంటూ ఓదార్చాడు మామయ్య. ఆ మాటలకి ‘‘నో!’’ అని రక్తపోటు హెచ్చేలా అరిచింది సూరిబాబు అంతరాత్మ. ఇలాంటి విషాద సందర్భాలలో తనకి మందు కొట్టే అలవాటు లేనందుకు మొదటిసారి బాధపడ్డాడు.
      రోజులు గడిచేకొద్దీ... లక్ష ఖర్చైనా కానీ ఏడుకొండలుని కలవాలని సూరిబాబు మనసు లాగసాగింది. తన భార్యకి తెలియకుండా కూడబెడుతున్న డబ్బు ఇప్పుడిప్పుడే లక్షని దాటుతోంది. ఆ శుక్రవారం తన మామయ్య చనిపోయాడని చెప్పి సెలవు తీసుకున్నాడు. ఆపై లక్ష రూపాయల్ని తీసుకుని ఏడుకొండలు ఇంటికి బయల్దేరాడు.
      సూరిబాబుని లోపలికి అనుమతించేందుకు చాలా తర్జనభర్జనలు జరిగాయి. లోపల ఏం జరిగినా గోప్యంగా ఉంచుతానని రాతపూర్వకంగా హామీని తీసుకున్నారు. ఎట్టకేలకు హాల్లోకి అనుమతి లభించింది. అక్కడ సోఫాలో కూర్చున్న సూరిబాబు గుండె గరీబ్‌రథ్‌లాగా దడదడా కొట్టుకుంది. డబ్బుదేముంది అశాశ్వతం.. కానీ తన లక్ష్యాన్ని ఈ రోజు సాధించబోతున్నాడు. తన దైవాన్ని కలవబోతున్నాడు. అతని కాళ్లు సన్నగా ఏం ఖర్మ లావుగానే వణికాయి. గదిలోని చలువ రాళ్లు ఏదో తెలియని భయాన్ని కలిగించాయి.
      ఆయన్ని దగ్గరగా చూస్తే ఎలా ఉంటుంది. కలిశాక ఏమేం ప్రశ్నలు అడగాలి. ఈ కలయిక ఎక్కడికి దారితీస్తుంది... ఇలాంటి సమస్యలెన్నో అతని శ్వాసని భారంగా మార్చాయి. లోపల్నుంచి అడుగుల చప్పుడు వినిపించి, వినయంగా లేచి కూర్చున్నాడు సూరిబాబు. తను ఆరాధనగా అంతర్జాలంలో చూసిన ఏడుకొండలు ఆకారం గదిలోకి వచ్చింది. 

***

      ‘‘ఎన్నప్పా విషయం’’ అడిగాడు ఏడుకొండలు గదిలోకి వస్తూనే చిరునవ్వుతో.
      ‘‘ఎదుమే ఇల్ల సామీ’’ అని తనకి తెలిసిన తమిళంలో జవాబు చెప్పి నాలుక్కర్చుకున్నాడు సూరిబాబు. ‘ఇదేంటి సంభాషణ తమిళంలో జరుగుతోంది’ అని ఏడుకొండలుని విభ్రాంతిగా చూశాడు.
      ‘‘నాకు తెలుంగు అంత సరీగా రాదు.. మాది కోయంబత్తూరు’’ అన్నాడు ఏడుకొండలు చెదరని చిరునవ్వుతో.
      ‘‘మరి పాటలు..’’
      ‘‘మా ఇంటి పక్కన ఓ తెలుంగు పయ్య ఉండేవాడు. అతను మాట్లాడుతుండగా కొంత పట్టుబడింది. వచ్చీరాని తెలుగులో నేను పాటలు రాయడం చూసి, అతనే నన్ను ఎడుతుకు వచ్చాడు. అనుకోకుండా ఇక్కడ నా పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి’’ అన్నాడు ముసిముసిగా.
      ఇంక ఏం మాట్లాడాలో సూరిబాబుకి తోచలేదు. ఆశలసౌధం కూలిపోవడం అంటే ఏంటో అనుభవానికి వచ్చింది. ఒక్కసారిగా వెల్లువెత్తిన నిరాశకి రక్తం చల్లబడిపోయింది. నిదానంగా లేచి బయల్దేరడానికి సిద్ధపడ్డాడు. సోఫాలో కూర్చున్న ఏడుకొండలు మొహంలో చిరునవ్వు అలాగే ఉంది. ఒక నాలుగు అడుగులు వేసి ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు. ‘‘చివరిగా ఒక్క ప్రశ్న.. మీరు రెండేళ్లుగా పాటలు రాస్తున్నారు కదా! మరి తెలుగుని ఎందుకని నేర్చుకోలేదు!’’
      దానికి ఏడుకొండలు వృత్తి రహస్యం చెబుతున్నంత ధీమాగా ‘‘తెలుగు బాగా వస్తే నా పాటలు ఇక్కడి జనానికి నచ్చవేమో అనిపించింది. కాకపోతే వార్తలు మటుకు వింటూ ఉంటాను. వాటిలో వాలుగు చేప లాంటి కొత్త పదాలు వినిపిస్తే... వాటిని నా పాటల్లో వాడుకుంటాను’’ అన్నాడు.
      ఏడుకొండలు మాటలు ముగిసేసరికి, సూరిబాబులోంచి ఓ నిట్టూర్పు వెలువడి ఆ చలువ రాళ్ల మీద ఘనీభవించిపోయింది. బయటికి వస్తూండగా నిలువెత్తు త్యాగరాజు పటం కనిపించింది ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనం’ అన్న మాటలూ గుర్తుకువచ్చాయి.
      ఉపసంహారంః కోయంబత్తూరుకి చెందిన ఏళుమలై, ఏడుకొండలుగా పేరు మార్చుకుని వచ్చీరాని తెలుగులో పాటలు రాస్తున్నాడని ఓ టీవీ ఛానల్‌ బయటపెట్టింది. ఆ దెబ్బతో అతని పాటలకి గిరాకీ మరింతగా పెరిగిపోయింది. ‘చాలా బాధాకరం. ఇలాగ బయటపడటం’ అంటూ సూరిబాబు భార్య అతణ్ని ఓదార్చింది. ఆవిడకి పాపం సూరిబాబు, ఏడుకొండలుని కలిసిన విషయం తెలియదు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


చోరకర్మం

చోరకర్మం

రమాదేవి జాస్తి


ఎందరో మహానుభావులు!

ఎందరో మహానుభావులు!

కె.ఎల్‌.సూర్య


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్లbal bharatam