తస్మాత్‌ జాగ్రత్త

  • 2255 Views
  • 27Likes
  • Like
  • Article Share

    పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)

  • సినీ నటుడు
  • హైదరాబాదు
  • 9849142361
పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)

ప్రకాశరావుది టైమ్‌ టేబుల్‌ మైండు... భార్యదీ అదే తీరు..
పిల్లాడు గోపీని ఆ కాలపట్టికలోనే పెంచుతుంటారు..
పిల్లల్ని స్వేచ్ఛగా ప్రేమగా పెంచాలన్న విషయం గుర్తించరు.
అలాంటి వారికి ఒకరోజు పిల్లాడి పెంపకం విషయంలో ’కల‘వరింత రేగింది...
ఉదయం
కాఫీ తాగుతూ పేపరు చదువుతున్న ప్రకాశరావుని ‘ఆ వార్త’ కంగారు పెట్టింది. కలవర పెట్టింది. కంట్లో కారమైంది. మళ్లీ మళ్లీ చదివాడు. ‘ఈ వార్త కొడుకు గోపీ చదివితే వాడిలో ఎలాంటి భావాలు నాటుకుంటాయో. అసలే చిన్నవయసు. ఇప్పుడిప్పుడే సొంతభావాలు మొలకెత్తుతున్న మనసు ఎలా స్పందిస్తుందో?’ అని భయపడిపోయాడు. ఆ పేపరు కొడుకు కంటపడకుండా దాచేశాడు.
      తనొక్కడే ఎందుకు టెన్షన్‌ పడాలని, అర్ధాంగి చెవిలో కూడా ఆ వార్త ఊది అర్ధభాగం టెన్షన్‌ తగ్గించుకున్నాడు.
      ‘‘నాన్నా! టైంటేబుల్‌ ప్రకారం ఉదయం ఏడు గంటలకు పేపరు చదవాలి కదా? పేపరింకా రాలేదా?’’ అన్నాడు గోపి అటూఇటూ చూస్తూ.
      ‘‘పేపరు కావాల్ట దొరగారికి పేపరు... ముందు దీనికి సమాధానం చెప్పు. తెల్లారగట్ట ఐదు గంటలకు ఎందుకు లేవలేదు?’’ సమాధానం చెప్పేలోపే  కుర్చీలోంచి లేచొచ్చి కొడుకు నెత్తిమీద ఒక్కటిచ్చాడు ప్రకాశరావు.
      ‘‘అలారం కొట్టకపోతే నాదా తప్పు?’’ ఏడుస్తూనే భయం భయంగా సమాధానం చెప్పాడు గోపి. ‘‘ఇంట్లో దొంగపడితే మొరగని పెంపుడు కుక్కని కొట్టాలా? దొరికిన దొంగని కొట్టాలా?’’ అంటూ మరొకటి పీకాడు కొడుకుని, పేపర్లో వార్త సంగతి మర్చిపోయి.
      ‘‘పాచి మొహంతో నాన్నగార్నే  ఎదిరిస్తావా? మొద్దు వెధవా!’’ అంటూ పిర్ర మీద ఒక్కటిచ్చింది గోపీ వాళ్లమ్మ సత్యవతమ్మ.
      ‘‘నీళ్లు లేకపోతే మొహం కడుక్కోలేదు అదీ నా తప్పేనా?’’, ఇన్‌స్టాల్‌మెంటు మీద ఏడుస్తూ ముక్కెగరేశాడు గోపి.
      ‘‘ముందుచూపు ఉండాల్రా. రాత్రే నీళ్లు పట్టుకొని ఉంచుకోవాలి. వెధవ పేపరు తర్వాత చదువుదువు గాని, ముందెళ్లి మొహం కడుక్కుని తగలడు వెధవా’’ అంటూ చెవి మెలిపెట్టబోయి ఆగింది.
పెళ్లాం పేపరు విషయం ఎత్తేసరికి ఉలిక్కిపడ్డాడు ప్రకాశరావు. 
      ‘‘నువ్వు గొప్పవాడివి అవ్వాలని మా తపన. క్రమశిక్షణను శిక్ష అనుకోకు. నీ ఏడోక్లాసు చచ్చు తెలివి మా మీద చూపించకు. నోరు ముసుకుని టైంటేబుల్‌ ప్రకారం బుద్ధిగా పనులు చెయ్యి. లేకపోతే చెంప ఛెళ్లుమంటుంద’’ంటూ చెయ్యెత్తబోయి ‘వార్త’ గుర్తొచ్చి ఆగిపోయాడు.
రోజూ ఆ ఇంట్లో జరిగే ప్రత్యక్ష ప్రసారాన్ని, పక్కింటివాళ్లూ పక్కవాటా వాళ్లూ, కాణీ ఖర్చు లేకుండా ఛానల్‌ మార్చకుండా చూస్తూ ఆనందిస్తూనే ఉంటారు.
      పొద్దున లేచిన్నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని పనులు, గోపీ గదిలో గోడకు దీనంగా ఉరేసిన టైంటేబుల్‌ ప్రకారం తు.చ. తప్పకుండా జరగాల్సిందే. తేడా వచ్చిందో వాడికి తన్నులు తప్పవు.
      మొక్కు తీర్చుకునేందుకు, మొక్కుబడిగా సత్యనారాయణ వ్రతం చేసిన భక్తుడిలా, సాధ్యమైనంత వరకు దెబ్బలు తగలకుండా టైంటేబుల్‌ ప్రకారం చేసుకుపోతూనే ఉంటాడు పాపం గోపి.
      ఎప్పుడూ మనస్ఫూర్తిగా, ఏ పనీ ఆనందంగా ఆస్వాదిస్తూ గోపిని చెయ్యనివ్వలేదు వాడి అమ్మానాన్న.
      రోజంతా పేపర్లో వార్త ప్రకాశరావు మనసులో సునామీ సృష్టించింది. రాత్రి గోపి నిద్రపోయాక, రహస్యంగా దాచిన పేపరు తీసి దానిలోని వార్తని మళ్లీమళ్లీ చదివాడు.
      ‘నార్వేలో కన్న కొడుకుని కొట్టిన తల్లిదండ్రులకి కారాగార శిక్ష’, అంతే పేపరు చింపేశాడు. చెత్తబుట్టలో పడేయబోయి, గోపి వాటిని అతికించి ఎక్కడ చదువుతాడోనని, చింపిన పేపర్ని వాడి కంట పడకుండా ఎక్కడ దాచాలో తెలియక, ప్రస్తుతానికి తన దిండు గలీబులో దాచాడు. పడుకునేందుకు ప్రయత్నించాడు. ఉహు... చిరిగిన కాగితాలు మనసును చిందర వందర చేస్తూంటే, ఎప్పుడో అర్ధరాత్రి మాగన్నుగా కునుకుపట్టింది ప్రకాశరావుకి.
      భారతదేశ రాజకీయాల్లోనూ, రాజ్యాంగంలోనూ, మోదీగారి ప్రభుత్వంలోనూ ఎన్నో మార్పులొచ్చాయి.
      ‘‘మా అమ్మా నాన్నా నన్ను కారణం లేకుండా కొడుతున్నారు. ఉత్తి పుణ్యాన తిడుతున్నారు’’, అంటూ గోపీ ఓ రోజు పోలీసులకు ఫోన్‌ చేశాడు. దొరికిందిరా కేసు, నిండిందిరా జేబు, అనుకుంటూ హుషారుగా పోలీసులు ప్రకాశరావు ఇంటికొచ్చారు. ఎంత లంచమిచ్చినా పుచ్చుకోకుండా (ఇంకా ఎక్కువ వస్తుందన్న ధీమాతో) ప్రకాశరావుని, సత్యవతిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లారు. పకడ్బందీగా ఎఫ్‌ఐఆర్‌ తయారు చేశారు.
      దంపతులు ఎంత మొత్తుకున్నా వినకుండా, జడ్జిగారు వారం రోజులు వాళ్లని పోలీసు కస్టడీలో ఉంచి ఇంటరాగేట్‌ చెయ్యడానికి అనుమతిచ్చారు.
      లాయరు సలహా మీద బెయిల్‌కి అప్లై చేస్తూ, గోపీ ‘ఎక్సెన్‌ట్రిక్‌’ అని మెడికల్‌ సర్టిఫికెట్‌ జతపరిచారు మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ప్రకాశరావు.
      ఎప్పుడూ నాయకుల నోట్లో నాలుకలా ఉండబట్టే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అయ్యారు అనంతపద్మనాభస్వామి. అలాంటాయన చేతుల్లో పడింది గోపీ కేసు. ఇంకేం, రెచ్చిపోయి, తన వాదనతో కోడిగుడ్డుకి ఈకలు పీకారాయన. మోకాలి జుట్టుకి, గెడ్డం వెంట్రుకలకు ముడిపెట్టినట్టు, పిల్లల మనస్తత్వాలకు, ఫ్రాయిడ్‌ సిద్ధాంతాలకు లింకుపెట్టి మరీ విశ్లేషించి గోపీ కేసుని వాదించారు పి.పి. స్వామి.
      ‘‘డాక్టరుకు లంచమిచ్చి గోపీది ఎక్సెన్‌ట్రిక్‌- అదే అతిప్రవర్తన అని దొంగ సర్టిఫికెట్‌ సృష్టించారు. పిల్లల్ని మానసికంగా, శారీరకంగా హింసించే తల్లిదండ్రులు హిరణ్యకశిపునికి వారసులు’’ అంటూ పేపర్లో వేసుకునే భాషతో ఫొటోలకు అందంగా ఉండే పోజులతో వాదించారు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్వామి.
      పి.పి. స్వామిగారి వాదనలో ఏదో కొసమెరుపు తొంగి చూసింది జడ్జిగారి మనసులో. అంతే, ఆలస్యం చెయ్యకుండా ‘డాక్టర్‌గారి సర్టిఫికెట్‌ ఫేక్‌’ అని పి.పి.గారు బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఆ గుద్దుకి ముగ్ధుడై, ‘‘గోపీని వారం రోజులపాటు పి.పి. గారింట్లో ఉంచుకొని ప్రత్యక్షంగా గోపీ ప్రవర్తన అబ్జర్వ్‌ చేసి కోర్టువారికి రిపోర్టు చేయాల్సిందిగా కోరడమైంది. దీన్ని ప్రత్యేక కేసుగా, భావితరాలకు మోడల్‌ కేసుగా ట్రీట్‌ చేస్తూ, ఈ వారం రోజులు, గోపి సమస్త ఖర్చులు కోర్టువారే భరిస్తారని తెలియజేయడమైనది’’ అంటూ తన ఆసనంలోంచి ఆయాసంగా నడుస్తూ ‘తాంబూలాలు ఇచ్చాం ఇక తన్నుకు చావండి’ అన్న రీతిలో జడ్జిగారు వెళ్లిపోయారు.
      ‘చోటెక్కడా లేనట్టు పిడుగొచ్చి నా గోచీలో పడిందేమిట్రా భగవంతుడా!’ అనుకుంటూ తప్పనిసరై గోపీని తీసుకుని ఇంటికెళ్లారు పి.పి.పద్మనాభస్వామి.
      ‘‘ఈ అబ్బాయి పేరు గోపి. ఓ వారం రోజులు మనింట్లోనే ఉంటాడు’’, అన్నారు పి.పి. స్వామి భార్య ఝాన్సీతో.
      స్వామిగారి శూలం (శీలం స్త్రీలింగం, శూలం పురుషలింగం అన్నారు మా తెలుగు మాస్టారు పెళ్లాం మీద కోపమొచ్చి) మీదా, లీలలపైనా లీలగా అనుమానం ఉన్నావిడ కాబట్టి, గోపీలో పి.పి.గారి పోలికలున్నాయా అని రంధ్రాన్వేషణ మొదలెట్టింది మిస్సెస్‌ స్వామి.
      ఆవిడ ముఖ కవళికలు గ్రహించి, అనుమానం పెనుభూతం కాకముందే ‘‘వీడి అమ్మానాన్నా జైల్లో ఉన్నారు. వీణ్ని మన ఇంట్లో ఉంచుకోమని కోర్టు ఆర్డర్‌. ప్రస్తుతం వీడు ప్రభుత్వ ఆస్తి. వీడి విషయంలో తేడాపాడాలొచ్చాయో నా నవరంధ్రాలు మూసుకుపోతాయి జాగ్రత్త’’ అంటూ ఒత్తి వెలిగించకుండానే ఆవిడ అనుమానపు బాంబుని తుస్సుమనిపించారు స్వామి.
      తన ప్రతీ పనిని పి.పి.స్వామి గారు శ్రద్ధగా పరిశీలించడం, వెంటనే డైరీలో రాసుకోవడం గమనించాడు గోపి.
      స్వామిగారి ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ లేకపోతే ఆయనకు బీపీ పెరిగిపోతుంది. అప్పుడు బీపీ టాబ్లెట్స్‌ పెట్టినచోట లేకపోతే అదేమిటో షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయి.
      కాఫీ తాగి, డైరీ రాయడం అలవాటు ఆయనకు.
      డైరీ కోసం టేబుల్‌ మీద వెతికారు. కనిపించలేదు. బెడ్‌రూంలో వెతికారు, అక్కడా లేదు. డైరీ గురించి కూర్చోకుండా, నుంచోకుండా, కూచిపూడి మొదలెట్టారు. బీపీ పెరుగుతా, పెరుగుతా... అని బెదిరించడం మొదలెట్టింది. ఆయన విన్యాసాలు చూసి ‘‘ఎక్కడ పెట్టారో అక్కడే వెతకొచ్చుగా’’, అంది సన్నాయి నొక్కులు నొక్కుతూ స్వామి గారి భార్య.
      ఆవిడ నట్టువాంగానికి ఒళ్లు మండి ‘‘ఎక్కడ పెట్టానో అక్కడ ఉండి ఛస్తేగా?’’ అంటూ భంగిమ మార్చి తాండవంలో తైతక్కలు ఆడబోతూంటే ‘‘డైరీ డైనింగ్‌ టేబుల్‌ మీద ఉందంకుల్‌’’, అంటూ గోపీ తీసుకొచ్చి ఇచ్చాడు.
      స్వామిగారు డైరీ తిరగేస్తూంటే దానిలో ఆయన రాసిన పేజీలు రాయని పేజీలతో గమ్‌సాయంతో గమ్మత్తుగా సరస సల్లాపాలాడి మమేకమై విడిపోవడానికి ఇష్టపడలేదు. డైరీ డైనింగ్‌టేబుల్‌ మీదికి ఎలా వెళ్లింది? గమ్‌తో చేతులు ఎలా కలిపిందని భార్యాభర్తలిద్దరూ తెగని రాజకీయ సమస్యలా, తేల్చుకోలేక తన్నుకున్నారు.
      మర్నాడు...
      ‘‘ఏమిటోనండీ గోపీగాడు పాతవైర్లతో, ప్లగ్గులతో ఏవో పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు’’, అంటూ గోపీ ప్రోగ్రెస్‌ రిపోర్టిచ్చింది స్వామిగారి భార్య.
      ‘‘ఆ వైర్లు ఏ ప్లగ్గులో పడితే ఆ ప్లగ్గులో పెట్టకుండా చూడు. వాడికి షాక్‌ కొడితే కోర్టులో నా ఫ్యూ(ఫీ)జ్‌ పోతుంది’’ అన్నారు స్వామి భయపడుతూ.
      మార్నింగ్‌ వాక్‌కి వెళ్లొచ్చి స్వామిగారు కాలింగ్‌ బెల్‌ నొక్కారు. ఠపీమని షాక్‌ కొట్టింది ఆయనకు.
      ‘‘బెల్లుని బాగు చేయించలేకపోయావా?’’ భార్యని ఇంటరాగేట్‌ చేస్తూ, షాక్‌ తిన్న చేతిని ఊదుకుంటూ అడిగారు స్వామిగారు.
      ‘‘పొద్దున్నే పనిమనిషికి కొట్టని షాక్‌ మీకెలా కొట్టింది?’’ కూపీలాగడం మీ దగ్గరే నేర్చుకున్నా అన్నట్టు పోజు పెట్టింది ఆవిడ.
      ‘‘వెళ్లి దాన్ని అడుగు?’’ చిరాగ్గా అన్నారు స్వామి.
      ‘‘ఎవర్ని అడగాలి? పనిమనిషినా, కాలింగ్‌ బెల్నా?’’ లౌక్యం హాస్యంతో మేళవించింది మిసెస్‌ స్వామి.
      ఇద్దరూ టీవీలో ‘అభిప్రాయ వేదిక’ కార్యక్రమంలోలా ఒకరిమాట ఒకరు వినకుండా ‘షాక్‌’ గురించి వాదించుకున్నారు.
      పి.పి.స్వామి పేపరు చదవడానికి కళ్లజోడు పెట్టుకున్నారు. ఒక కన్ను గీతలు గీతలుగా కనబడేసరికి కంగారు పడ్డారు. వేళ్లతో కళ్లజోడు సున్నితంగా తుడవబోతే కళ్లజోడు అద్దం నాయకుల స్వార్థానికి బలైన రాష్ట్రంలా రెండు ముక్కలై చేతిలోకొచ్చింది.
      ‘‘ఎలా పగిలింది?’’ పి.పి. స్వామి కోర్టులో ముద్దాయిని అడిగినట్టు భార్యను అడిగారు.
      ‘‘ఆ అద్దాన్ని నీ ఆయుష్‌ మూడింది పైకిరా అన్నట్టున్నాడు పైవాడు. ఆచరణలో పెట్టినట్టున్నాడు గోపి. దానికీ నేనే బాధ్యురాల్నా?’’ అంటూ సాక్ష్యం చెప్పడం అలవాటైన కోర్టు పక్షిలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందావిడ.
      ఈ విషయంలో ఇద్దరూ మళ్లీ తారస్థాయిలో జుగల్‌బందీ మొదలెట్టారు. ఇదంతా గమనిస్తున్న గోపి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.
      ఆ నవ్వు చూసి దంపతులు, తమ సంగీత కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేకిచ్చి సీబీఐ వాళ్లలా గోపీని నిశితంగా గమనించడానికి నిశ్చయించుకున్నారు.
      ఎలాగూ తన సంగతి ఓపెన్‌ సీక్రెట్‌ అయిందని డైరెక్ట్‌ యాక్షన్‌లోకి దిగాడు గోపి.
      పి.పి. స్వామి గారి సెల్‌ రింగయింది.
      ‘‘గుడ్‌న్యూస్‌. మన క్లబ్‌ సెక్రటరీ కూతురు పెద్దమనిషయిందట. మూడు గంటలకి రెడీగా ఉండవే. ఇద్దరం కలిసి వెళ్దాం.’’
స్వామి గార్ని ఆ కాల్‌ కంగారు పెట్టింది. తనని ‘ఒసే గిసే’ అనే ఆ ఒసే ఎవరు? ఆడవాళ్ల ఫంక్షన్‌కి ఎందుకు రమ్మంటుంది. అంటే... అంటే ఎవరో తనని ఆట పటిస్తున్నారు. వెంటనే బీపీ టాబ్లెట్‌ వేసుకుని, ఏ యాక్ట్‌ కింద కేసు పెట్టాలా అని తెగ ఆలోచనలో పడ్డారు.
      ఇంతలో స్వామిగారి భార్య సెల్‌ మోగింది. ‘‘పి.పి. సాబ్‌ పార్టీని మా ఇంట్లో దింపా సార్‌. హోటల్లో దింపడం అంటే మన జుట్టు మనమే మీడియావాళ్లకి అందించడంలాంటిది. మా ఇల్లు అన్నిటికీ సదుపాయంగా ఉంటుంది. చీకటి పడగానే వచ్చేయండి’’, అంటూ ఫోన్‌ పెట్టేశాడు ఆగంతకుడు.
      ‘పార్టీ’ అంటే స్త్రీ లింగమా? పురుష లింగమా? గూగుల్లో శోధించాలి. ఈ ‘పార్టీ’ వివరాలెలా సేకరించాలి?’’ అనుకుంటూ ఆలోచనలో పడింది స్వామిగారి భార్య.
      వాళ్లిద్దర్నీ క్లోజప్‌లో చూస్తూ ‘‘అంకుల్‌ మీ సెల్‌లో సిమ్‌కార్డ్‌ ఆంటీ సెల్‌లోకి, ఆంటీ సిమ్‌కార్డ్‌ మీ సెల్‌లోకి మారిస్తే ఒకరి ఫోన్‌కాల్స్‌ ఇంకొకరికి వస్తాయా?’’ అని అమాయకంగా అడిగాడు గోపి.
      ‘ఏడిపించడంలో, విసిగించడంలో, అల్లరి చెయ్యడంలో ఇన్ని రకాలున్నాయా? ఇంకా ఎన్ని మిగిలాయో’ అనుకుంటూ సూర్యరాయాంధ్ర నిఘంటువుని చూడ్డం మొదలెట్టారు ఆ దంపతులు ఐకమత్యంతో.
      రోజులు లెక్కెట్టుకోవడమంటే ఏంటో మొదటిసారి అర్థమైంది స్వామి గారికి. ఆ రోజుతో గోపి, స్వామి గారింటికొచ్చి ఏడు రోజులు. అజ్ఞాతవాసం పూర్తయింది.
      రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పిండివంటలతో ఆబగా ఎప్పుడు భోజనం చేద్దామా అన్నట్టుంది స్వామిగారి పరిస్థితి. కోర్టుకి వెళ్లడానికి హుషారుగా తయారవుతూ తన తెల్లకోటు మీద వేసుకునే నల్లగౌను కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. ఇంట్లో ఎంత వెతికినా కనిపించలేదు.
      ‘‘ఝాన్సీ! ఝాన్సీ! నా గౌనేదే?’’ అంటూ అసహనంగా అరిచారు స్వామి.
      ‘‘నేనేం వేసుకోలేదు. నాకు తెలియదు.’’
      ‘‘బాబ్బాబు కోర్టుకి టైం అవుతోందే, కాస్త వెతికిపెట్టవే.’’
      ‘‘అంకుల్‌! పొద్దునే ఓ ముష్టిది చంటి పిల్లనెత్తుకొని ఇంటి ముందుకు వచ్చింది. పాపం ఆ పసిపిల్లకి ఒంటిమీద బట్టలేదు. చలికి వణికిపోతోంది. పిల్లకి ఓ గౌను దానం చెయ్యండమ్మా అని అరుస్తుంటే, నేనే ఇంట్లో ఏ గౌనూ కనబడకపోతే హేంగర్‌కున్న నల్లగౌను దానికిచ్చా. తప్పా?’’ అన్నాడు అమాయకంగా గోపి.
      తప్పంటే, వాడికి మళ్లీ ఏ తప్పుడాలోచన తన్నుకొస్తుందో అని తమాయించుకుని ‘‘తప్పులేదు నాయనా! మంచి పనిచేశావు’’ అంటూ కొత్తగౌను కొనుక్కుని, గోపిని తీసుకొని కోర్టుకెళ్లారు, పి.పి. అనంతపద్మనాభస్వామి.
      ‘‘మహాప్రభో! గోపీగాడు సామాన్యుడు కాడు. వాడి అతితెలివి అమోఘం. వాడి బ్రెయిన్‌ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో పెట్టాలి. వాడు ఇంకా కొన్నాళ్లు మా ఇంట్లో ఉంటే మా ఆవిడ నాకు విడాకులివ్వడం ఖాయం. డాక్టర్‌ సర్టిఫికేట్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ కరెక్ట్‌. మీరే నన్ను వాడి బారినుంచి రక్షించాలి’’, అంటూ లోపాయికారిగా జడ్జిగారి కాళ్లు, ఆయన ఛాంబర్‌లో, ఆయనకి మాత్రమే తెలిసేలా పట్టుకున్నారు పి.పి. స్వామి.
      కోర్టులో జడ్జిగారు గోపీతో ‘‘నువ్వు బాగా అల్లరి చేస్తావట. అతిగా ప్రవర్తిస్తావట. నిజమేనా? కరెక్ట్‌గా సమాధానం చెబితే, దాన్ని నేను నమ్మితే, నిజాయతీ అయిన నిర్ణయానికి వస్తా’’ అన్నారు.
      ‘‘జడ్జిగారూ! నమస్కారం. మా అమ్మానాన్నలు ఎప్పుడూ నా గురించే దెబ్బలాడుకుంటారు. మా ఇల్లో చేపల బజారు. నా పనులన్నీ మా అమ్మానాన్నల ఇష్టప్రకారమే జరగాలి. వాళ్లు తయారుచేసిన టైం ప్రకారం నేను నడుచుకోవాలి. వాళ్లు నన్ను కొట్టకుండా ఉండాలనే పోలీసులకు ఫోన్‌ చేశా. డాక్టర్‌ గారి సర్టిఫికేట్‌ కరెక్ట్‌ అంటే మా అమ్మానాన్నలకి శిక్ష పడదని స్వామి అంకుల్‌ ఇంట్లో కావాలనే బాగా అల్లరి చేశా. నిజంగా నేను గుడ్‌బాయ్‌ని. కావాలంటే మా టీచర్లని అడగండి. ఈ సారికి మా అమ్మానాన్నలను వదిలేయండి ప్లీజ్‌...’’ అంటూ గోపీ కళ్లమ్మట నీళ్లెట్టుకున్నాడు.
      ‘‘పిల్లల్ని కనడం ప్రకృతి ధర్మం. కానీ వాళ్లని స్వేచ్ఛగా, మంచీచెడూ తెలియపరుస్తూ, ప్రేమగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. ఇది మొదటితప్పుగా భావించి గోపీ తల్లిదండ్రుల్ని, గోపీ అభ్యర్థన మీద శిక్ష వేయకుండా విడిచిపెట్టడమైనది’’, అంటూ జడ్జిమెంటు రీసౌండు వచ్చేలా చదివారు జడ్జిగారు.
      ‘‘థాంక్యూ జడ్జిగారూ! థాంక్యూ! మా గోపీని ఇక నుంచి తిట్టం, కొట్టం’’ అంటూ గట్టిగా అరిచిన ప్రకాశరావు పలవరింతలకి, గోపీ రూమ్‌లో గోడ మీద ఉన్న టైంటేబుల్‌ చిరిగి కిందపడింది. కల చెదిరింది. కళ్లు తెరిచి ‘భారతదేశంలో పుట్టినందుకు బతికిపోయాన్రా భగవంతుడా! అదే నార్వేలో పుట్టుంటే నా గతి శ్రీకృష్ణ జన్మస్థానమే’ అనుకుంటూ గోపీ మంచంకేసి ప్రేమగా అడుగేశాడు ప్రకాశరావు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


చోరకర్మం

చోరకర్మం

రమాదేవి జాస్తి


ఎందరో మహానుభావులు!

ఎందరో మహానుభావులు!

కె.ఎల్‌.సూర్య


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్లbal bharatam