కొత్త పలక

  • 3144 Views
  • 860Likes
  • Like
  • Article Share

    కుప్పిలి సుదర్శన్‌

  • పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
  • 9493290290
కుప్పిలి సుదర్శన్‌

తాను చెయ్యలేని లెక్కకు సరైన జవాబిస్తాడు తిప్పడు... అంతే.. తన సామాజిక స్థాయి గుర్తుకొస్తుంది రామకృష్ణకు. ఆ ఆభిజాత్యం తిప్పడి తలమీద పలక దెబ్బ అవుతుంది. నెత్తుటితో తడచిన ఆ పలక పదిహేనేళ్ల తర్వాత రామకృష్ణను ఏమని ప్రశ్నించింది?
‘ఠ్ఠాఖ్ఖ్‌’మని
నా చేతిలోని పసుపు రాసిన కొత్త కట్లపలక తిప్పడి నెత్తిమీది నించి మెడలోకి దిగింది.
      ‘హ్హమ్మా’ అంటూ వాడు నెత్తిమీద దెబ్బ తగిలిన చోట చెయ్యి నొక్కి పట్టుకుని గోడవార పడ్డాడు.
      పలక పెంకులు తిప్పడి రక్తంతో అక్షరాభ్యాసం చేయిస్తున్నాయి. తరగతి గదిలో మిగతా పిల్లలు జడుసుకుని ఒక్క ఉదుటున పారిపోయారు. పటంలో గాంధీజీ మాత్రం ఓపికగా నవ్వుతూనే కనిపించారు ఎప్పట్లాగే.
      ఆడి మెడలో ఎర్రబడుతున్న పలక కట్టు పట్టుకుని ఉండటం ఇష్టం లేక విసురుగా బయటికి లాగి కిటీకీలోంచి కనిపిస్తున్న వేప మొక్క మీదికి కసిగా గిరాటేశాను. చటుక్కున ఓ కొమ్మ దాన్నందుకుంది.
      కొద్ది క్షణాల తర్వాత నల్లగా కమ్మిన మేఘాలను పెద్ద గాలి తోసెయ్యగానే తట్టుకోలేనంత ఎండ చుర్రున ఒళ్లంతా ఒకేసారి వాత వేసినట్లు నాలో భయం మొదలైంది. పుస్తకాల సంచి బడిలోనే వదిలేసి చెరువు గట్టు వైపునుంచి చెరుగ్గుడ్లోనికి పారిపోయాను.
      కాసేపు అటూ ఇటూ తిరిగి, కలకత్తా పలక పుల్లలాగ అరిగి, దొరికినదేదో తిని, సాంబయ్యగారి మావిడితోట్లో చెట్టుకింద చారబడి ‘తిప్పడికి ఎందుకు కొట్టావని’ ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో అని ఆలోచించాను.
      నా పలక మీద రాసింది ఉమ్మితో తుడిచాడు. ఎవరి ఉమ్ము? నా ఉమ్ము కాదు. తిప్పడి ఉమ్ము! వాడు మిగతా వాళ్లని ముట్టడమే తప్పంటారు. అలాంటిది నా పలక, నా కొత్త పలక మీద వాడి ఉమ్మా? తిడతారు.. అందరూ వాడినే తిడతారు.. నాకేం కాదు.. ఎవరన్నా అడిగితే ఇలాగే చెప్పాలి అనుకుంటూనే కాస్త నిద్రలోకి జారుకున్నాను.
      నిజానికి జరిగిందేమిటీ?
      నాకు రాని లెక్క వాడికొచ్చేసింది.
      మా పంతులుగారు నా కొత్త పలక వాడి చేతబెట్టి, వాడిని ప్రశ్నిస్తూ నా లెక్క సరిచేయించారు. ‘ఇదిరా రామకృష్ణా ఇలా చెయ్యాలిరా’ అంటూ తిప్పడికేసి చూపు తప్పించకుండా చూసి ‘శభాష్‌’ అన్నారు.
      అందరూ నాకేసి జాలిగా నవ్వేరు.
      తిప్పడేమన్నా గొప్పోడా?
      నాకు ఆడు చెప్పొచ్చేంతా?
      ఆడికి ఆ లెఖ్ఖ ఎలా వొచ్చిందోగానీ వచ్చేసింది.
      ‘వరుసకి ఆరు కొబ్బరి చెట్లుంటే మూడు వరుసలకి ఎన్ని చెట్లుంటాయి?’
తొమ్మిదని నేను రాస్తే, వాడు పద్దెనిమిదని మా బామ్మ పురాణాల లెక్క చూపించాడు.
      అదే సరన్నారు మా పంతులుగారు. శభాష్‌ అని కూడా... అవును మరి రోజూ పంతులుగారు తిప్పడి వీధికి వెళ్లి, వాడితోపాటూ మరో ఇద్దరిని కూడా వెంటబెట్టు కొస్తారుగా.. వాళ్లను ముట్టుకుంటారు కూడా.. అందుకే అలా అనుండవచ్చు.
      అయినా తిప్పడికి లెక్కలు రానేరావు... రాకూడదు... నా కన్నా ముందు అస్సలు రాడానికి వీల్లేదు.
      మరెలా లెఖ్ఖ వేశాడూ?
      మిరియాల కషాయం పలమారినట్లు అనిపించింది. ఉన్నఫళంగా తిప్పడి మీద మా మావయ్యంత కోపం వచ్చిపడింది.
      ‘‘ఏరా రామకృష్ణా.. ఏమిట్రా నీ చదువూ? పుస్తకాలకి కుక్క చెవులొచ్చాయ్‌ తప్ప లెఖ్ఖలు ఒంటబట్టట్లేదు. మీ మావయ్యగారితో చెప్పాలా ఏం? తిప్పడిపాటి బుద్ధి లేదూ?’’ అంటూ పంతులుగారు కళ్లజోడు సర్దుకుంటుంటే మిరపకాయ నమిలి నీళ్లు వెతుక్కున్నట్లు జవాబు ఇవ్వడానికి నాకు చెమట్లుపోశాయ్‌.
      చెప్పు తెగి పందెంలో నేను ఆగిపోయినట్లూ, మిగతా పిల్లలందరూ పరుగెత్తుకు పోతున్నట్లూ మధ్యాహ్నం దాకా గడిచింది.
      ఎవరు నవ్వినా తిప్పడు నవ్వినట్లే కనిపించింది.
      బడిగంట కొడతారనగా తిప్పడు ‘‘కిష్నబాబు.. కిష్నబాబూ.. సంచీ సర్దుకోవా...’’ అంటూ దగ్గరకు రాగానే తలపై పలక బద్దలుగొట్టేశాను!

* * * 

      ఈ పని నా వయసుకి మించిన రాక్షసత్వమని చాలాకాలం తర్వాతకిగానీ తెలిసిరాలేదు. నాలాంటి వాళ్ల ‘దోతరపు’ పనులు వాడిలాంటి వాళ్లమీద ఎన్నాళ్లనుంచో?
      నాకన్నా తెలివైన వాళ్లతో ఆ లెక్క సరిచేయిస్తే ఇలా చేసేవాడిని కాదేమో. తిప్పడు గనుకే ఇలా చేశానేమో.
      తిప్పడి ఇల్లు ఎక్కడా? మా ఇంటికి వెనకవైపే చాలా దూరంగా. తిప్పడిని ముట్టకూడదు అంటారు. అయినా అప్పుడప్పుడూ నాకు నచ్చితే ఆడితో ఆడతాను. నేనే గెలవాలి. వాడు గెలిచేలా ఉంటే, ఆట నేనే ఆపేసేవాడిని. ఇంకొంత మందితో ఆటలాడితే నా వంతు పులుసు కాయడానికి నేను వాడికిచ్చే జీడి కోసం వాడి చేతి మండలు ఎప్పుడూ బండల్లా అడ్డుపడటానికి సిద్ధంగా ఉంటాయి.
      వాడొక బెరడుగట్టిన లేత మొక్క!
      వాడెప్పుడూ తెల్లారగనే పందుంపుల్ల తోముకుంటూ చెరువుకెళ్లి స్నానం చేస్తాడు. చిరిగిన నిక్కరు మొలతాడుకి దోపుకుని, గుండీల్లేని చొక్కాకి రెండు పిన్నీసులతో ఊరుకో అని సర్దిచెప్పినట్లు తొడుక్కుని వస్తాడు. వాడికి ఒకదానితో ఒకటి చిరగడానికి పోటీ పడుతున్నట్లు రెండే రెండు జతల బట్టలున్నాయి. బడికి వచ్చేముందు చల్దన్నం ఉంటే తింటాడు, లేకపోతే దిబ్బమ్మగారి పెరట్లో జాంచెట్టు కాయలు కోసుకుని గాబరాగా వస్తాడు.
      తల దువ్వడు.. నూనె రాయడు.. చెప్పులెయ్యడు.. ఎప్పుడో తప్ప..
      వాడికి ఒకే పుస్తకం ఉంది, వాళ్లమ్మ చీరలాగ...
      దానిలో మహాఉంటే నాలుగో ఐదో కాగితాలుంటాయి, వాళ్లింట్లో వంటపాత్రల్లాగ...
      పెద్ద పలకలో ఓ పావు ముక్క వాడి దగ్గరుంది, గాలికి గడ్డి కొట్టుకుపోగా మిగిలిన వాళ్లింటి పైకప్పులాగ...
      పంతులుగారు ఏదైనా రాయమన్నప్పుడు పుల్లకోసం అందరి దగ్గరకీ తిరుగుతాడు, కూలి కోసం తిరిగే వాళ్ల నాన్నలాగ..
      తరగతి గదిలో తనకి తెలీకుండానే చివరి వరసకి కూడా కాస్త దూరంగా కూర్చుంటాడు, ఊళ్లో వాళ్లిల్లులాగ...!
      కాండ్రించి చేతిలో ఉమ్మి దానితో పలకమీద రాసింది చెరపటం నాక్కూడా నేర్పించాడు.. కానీ పంతులుగారికి తెలీకుండా చెరపాలన్నాడు.. వరప్రసాదుగాడు ‘తప్పురా సరస్వతీ దేవి’ అన్నాడుగానీ తిప్పడు ‘సరస్వతీ దేవి బొమ్మ లేదు కదా, పర్లే’దన్నాడు.

* * *

      మావిడి రెమ్మ మీద పడటంతో మెలకువొచ్చింది.
      ‘ఈపాటికి ఆటల గంట కొట్టేసుంటారు. బడిలో సంచి వదిలేశాను. ఖాళీ చేతుల్తో ఇంటికెళ్తే.. అమ్మో.. కుదిరేపని కాదు. తిప్పడు పంతులుగారితో ఏంచెప్పాడో ఏంటో. పంతులుగారు కోపంతో కొడతారేమో. అయినా తప్పదు. సంచి ఎలాగో తెచ్చుకోవాలి. కొత్త పలక పోతే పోయె. ఎలాగూ పాత పలక ఇంట్లో ఉంది కనక ఫర్వాలే..’ అనుకుంటూ వెనక గోడ గెంతి బడిలోకి చేరుకున్నాను.
      నేనింకా లోపలికి వెళ్లనేలేదు. ‘దబ్‌’మని తిప్పడు కూడా వెనక గోడనించే కిందికి దూకాడు. నన్ను చూస్తూనే ‘‘కిష్నబాబు.. సంచీ ఒగ్గేసి ఎటెల్లిపేవు? పంతులుగారు రాజ్జలచ్మికి సూడమన్నారు..’’ అంటూ నా దగ్గరకి వచ్చేడు.
      నేనదేమీ పట్టించుకోకుండా ‘‘ఒరే తిప్పా.. నేను నిన్ను కొట్టేనని పంతులుగారికి చెప్పేవా?’’ ఆదుర్దాగా అడిగా.
      ‘‘బలేటోలే బాబూ.. నేనెందుకు సెప్తాను? మీ కొత్త పలక నా నెత్తిమీద ఇరిగిందని మల్లీ నన్నే తంతారుకదా. నేనే ఇరిపేనంటారు అందరున్నూ. అందుకే సెప్పలే..’’ అంటూ చీమిడి ఎగేస్తూ చిన్న నవ్వు నవ్వేడు.
      నాకు పరీక్షలో పాసుమార్కు వచ్చినంత హాయిగా అనిపించింది.
      ‘‘మరి నువ్వెక్కడికెళ్లావు ఇప్పుడు?’’
      ‘‘అదా.. నెత్తికి బొక్కపడినాదని నెత్తురు కడుక్కోడానికెల్లేను. సెర్లో సానం సేసి, బుస్కోటు తడుపుకోని, బొక్కకాడ పొయిబుగ్గి అంటించుకుని ఎవులూ సూడకుండా ఇట్నిండొచ్చేను..’’ అంటూ తలొంచి దెబ్బ చూపించేడు.
      తేలిక పడ్డాను. తటాలున నాకింకో అనుమానమొచ్చింది.
      ‘‘అవున్రా.. నాకు రాని లెక్క నీకెలావొచ్చిందీ?’’ అజమాయిషీతో ప్రశ్నించేను వాడి దెబ్బని అప్పుడే మర్చిపోతూ.
      ‘‘హ్హిహ్హి.. ఏటి కిష్నబాబు.. మీ ఇంటెనకాల పెరట్లో కొబ్బరిసెట్లు నెక్కే కదా పంతులుగోరు అడిగేరూ..’’ అంటూ వాడూ దెబ్బని మర్చిపోయి నావైపు చూశాడు.
      ‘‘అంటే?’’ ఆశ్చర్యంగా తిప్పడివైపు చూస్తుండిపోయాను ఏంటా లెక్కా అన్నట్టు.
      ‘‘మీ పెరట్లో కొబ్బరి సెట్లు ఎన్నున్నాయి?’’
      ‘‘పద్దెనిమిది’’
      ‘‘ఎన్నొరసలు?’’
      ‘‘మూడు’’
      ‘‘వొరసకెన్ని?’’
      ‘‘ఆరు’’
      ‘‘ఆఁ.. పంతులుగోరి నెక్క అదేకదా... అందికే నాకు తెలిసిపోనాది. మా ఇంటికాడనిండి రోజూ సూసేదే ఆ నెక్క. ఇంకో నెక్క అడిగితే నేను సెప్పేటోడినా?’’ అంటూ పక్కనే ఉన్న రాయిమీద కూర్చుండిపోయాడు.
      ‘‘అంటే మా ఇంటి వల్లే నీకు లెక్కొచ్చిందన్నమాట. పంతులుగారికి ఈ విషయం తెలీదన్నమాట. సరేలే.. నా సంచి పట్టుకురా.. ఇంటికి పోవాలి.. నేనిక్కడే ఉంటా..’’ అంటూ తిప్పడికేమీ గొప్పతనం రాలేదని లోలోన       తీర్మానించుకున్నాను.
      తిప్పడు ఎలాగో సంచి తెచ్చాడు.
      పంతులుగారు పిల్లలందరినీ ఇంటికి పంపేసినట్లుంది. నా గురించి ఎవరిని అడిగేరో ఏంటో.. అనుకుంటూ నేనింటికి వెళ్లిపోయాను.

* * *

      ఆ రాత్రి నేను అమ్మమ్మ ఒళ్లో ఉన్నప్పుడు.. ‘‘అయ్యా! మీ వాడికి కొంచెం భయం చెప్పండి. ఈ రోజు ఒక పిల్లవాడికి రక్తం కారేలా పలకతో తలమీద కొట్టేడు. పిల్లవాడి భవిష్యత్‌కి ఇది శుభం కాదు. వాడిని ఇంటి దగ్గరే మీరు కాస్త మందలించండి..’’ అంటూ పంతులుగారు మా మావయ్యతో మాట్లాడటం వినిపించింది.
      ‘‘సరే.. మీరిక వెళ్లవచ్చు’’ ఒక్కమాటే మావయ్య నోట వచ్చింది.
      పంతులుగారు వెళ్లిపోయారు. నా వైపు చూడనేలేదు.
      మావయ్య ఏం మాట్లాడినా పదో ఎక్కంలా అందరికీ తొందరగా అర్థమైపోతుందట..! అందుకేనేమో అందరూ ఏం చెప్పినా ‘చిత్తం.. సరేనండీ’ అంటారు.
      ఆ మర్నాటి నుంచీ వారం పాటు పండుగ సెలవులు కావడంతో పంతులుగారికి నా విషయం ఎవరు చెప్పారన్నది నేను ఆలోచించలేదు. పంతులుగారు నన్నేమడుగుతారో అనుకున్నా, కానీ సెలవుల్లో ఊరెళ్లిన పంతులుగారు సెలవులైన వారందాకా మరి కనపడలేదు. మరి బడికి రానన్నారట!
      తర్వాత అమ్మనీ, నన్నూ నాన్న పట్నం తీసుకుపోయారు.

* * *

      పట్నంలో అభ్యుదయ భావాల నడుమ సాధారణ జీవనంలోకి నాన్న నన్ను నడిపించారు.
      కాలం రాసుకున్న ఆత్మకథను కొన్నేళ్లపాటు చదివాను.
      పదిహేనేళ్ల తర్వాత పట్నవాసం ముగించుకుని అమ్మ బలవంతంతో మళ్లీ ఊరొచ్చి చూస్తే...
      వేప మొక్క కొమ్మకి ఊయలూగిన నా పలక కట్టుకి పక్కనుంచి పుట్టిన రావి మొక్క కొమ్మ ఎప్పుడు జోలపాడిందో తెలీదు.
      ఆ రెండు మొక్కలూ పెద్దవయ్యాక వాటి కొమ్మల మధ్య ఎప్పుడు ఆ పలక కట్టు రెండు కొసలు కనపడేలా సమాధైందో తెలీదు.
      ఆ చెట్ల కింద దేవుడి బొమ్మలు పెట్టి పసుపూ-కుంకుమలు చల్లి ఎప్పుడు పూజలు మొదలెట్టారో తెలీదు.
      బడేమైందీ?.. లేదు
      బడికేమైందీ?... తెలీదు
      మా మావయ్య ఊరి ప్రెసిడెంటుగా ముప్ఫైయేళ్ల నుంచీ ఎలా ఉండగలిగాడో అర్థమయ్యేదాకా పంతులుగారు బడినీ-ఊరునీ వదిలేసి ఎక్కడికి పోయారో అర్థం కాలేదు, తిప్పడలా పశువులు కాస్తూ ఆనందంగా ఉన్నానని చెప్పడమూ అర్థం కాలేదు..!
      ‘ఎంత జ్ఞానం సంపాదించావు రామకృష్ణా’ అంటూ ఆ పలక కట్లు మా పంతులుగారి గొంతుతో చెట్ల కొమ్మల సమాధి నుంచి ప్రశ్నిస్తున్నాయి.
      ఆ ప్రశ్నకి మరో కొత్త పలక మీద సమాధానం రాయాలనీ, ఆ సమాధానం తిప్పడికి చూపించాలనీ ఊరి చివరికి బయలుదేరాను..!
      నేను మనస్ఫూర్తిగా కొత్త పలకపై లెక్క తప్పుగా వేయగానే మా పంతులుగారు చిరునవ్వుతో నా భుజం మీద చెయ్యి వేశారు.
      తప్పుడు లెక్క చెరపడానికి తిప్పడు అరచేతిలో థూ..థూ అని ఊసుకుంటూ ముందుకొచ్చాడు.
      రావిచెట్టూ-వేపచెట్టులా పంతులుగారూ-తిప్పడూ.
      కొమ్మల్లాంటి వారి చేతుల మధ్య కొత్త పలకపై మళ్లీ నా విద్యాభ్యాసం మొదలైంది..

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


చోరకర్మం

చోరకర్మం

రమాదేవి జాస్తి


ఎందరో మహానుభావులు!

ఎందరో మహానుభావులు!

కె.ఎల్‌.సూర్య


తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ)


ఫేస్‌ బుక్కు బామ్మ

ఫేస్‌ బుక్కు బామ్మ

కె.కె.భాగ్యశ్రీ


తమ్ముడీయం

తమ్ముడీయం

కవితశ్రీ


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్లbal bharatam