వర్షం కురిసిన సముద్రం

  • 2382 Views
  • 23Likes
  • Like
  • Article Share

    సత్యం మందపాటి

  • టెక్సాస్‌, అమెరికా satyam_mandapati@yahoo.com
సత్యం మందపాటి

తండ్రి కనపడటంలేదని కంగారుగా వెతుకుతుంటారు వర్ష, సాగర్‌ ఆయన్ని వెతికే క్రమంలో తన చిన్నప్పుడు అడిగిన ప్రశ్నలను గుర్తుచేసుకుంటాడు సాగర్‌. అప్పుడు తండ్రి చెప్పిన సమాధానాలు ఇప్పుడు అతని అన్వేషణకి ఎలా బాటలు వేశాయి?
మంచి
గాఢనిద్రలో ఉన్నాడేమో, అర్ధరాత్రి ఫోన్‌ మోగగానే ఉలిక్కిపడి నిద్రలేచాడు సాగర్‌.
      ఇండియా నుంచి ఫోన్‌. విశాఖపట్నం నుంచి అతని చెల్లెలు వర్ష.
      ‘‘ఏంటే... ఇంత రాత్రివేళ... ఇక్కడ చికాగోలో టైం ఎంతయిందో తెలుసా...?’’ అన్నాడు. ‘‘అన్నయ్యా.. పొద్దుటినించీ నాన్న కనిపించటం లేదు. భయంగా ఉంది’’ అంది వర్ష.
      ఆ మాటలకి ఒక్కసారిగా లేచి మంచం మీద కూర్చున్నాడు సాగర్‌. ‘‘అదేంటి.. అసలేమయింది?’’ అడిగాడు. సాగర్‌ మాటలకి పక్కనే పడుకున్న కవిత కూడా లేచి కూర్చుంది. వర్ష మాటలు కవితకు సన్నగా వినిపిస్తున్నాయి.
      ‘‘ఏముంది. రోజులాగానే నాన్నకి పొద్దున్న రెండు ఇడ్లీలు, కాఫీ ఇచ్చాను. అదవగానే అలవాటు ప్రకారం బీచ్‌ ఒడ్డున నడకకి బయల్దేరాడు. కానీ మరీ ఇంతసేపా? మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా అన్నం తింటాడు. ఇప్పుడు మూడైంది.  ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లకి చెప్పాను. వాళ్లు స్కూటర్ల మీద వెళ్లి వెతుకుతున్నారు. అసలే ఆకలికి ఆగలేడు. ఎక్కడున్నాడో’’ వర్ష ఏడుస్తోంది.
      ‘‘మన వాళ్లిళ్లకి ఏమైనా వెళ్లాడేమో...’’ అడిగాడు సాగర్‌ సాలోచనగా.
      ‘‘ఇందాకటినుంచీ నేను చేస్తున్న పని అదే. నాన్న ఇష్టపడే బంధుమిత్రులందరికీ ఫోన్‌ చేశాను. వాళ్లిళ్లకి రాలేదట. నాన్న రోజూ ప్రకాశరావుగారితో కలిసి వెళతారు నడకకి. ఆయనకీ ఫోన్‌ చేశాను. ఆయన ఇవాళ వాకింగుకి వెళ్లలేదట, ఒంట్లో నలతగా ఉందని’’
      ‘‘పోలీసులకి రిపోర్ట్‌ చేశావా?... బావగారేమన్నారు?’’
      ‘‘మా ఆయన ఆఫీసు పని మీద సింగపూరు వెళ్లి మూడు రోజులయింది. ఇంకో వారందాకా రాడు. ఫోన్‌ చేశాను. పలకలేదు. మెసేజ్‌ పంపించాడు ‘మీటింగులో ఉన్నాను, తర్వాత మాట్లాడుతా’ అని. పోలీసు రిపోర్ట్‌ ఇచ్చాను. ఎక్కడికన్నా హడావుడిగా వెళ్లారేమో, రాత్రికి కూడా రాకపోతే అప్పుడు చూద్దాం అన్నారు వాళ్లు...   నన్నేం చేయమంటావు?’’ అడిగింది వర్ష. 
      ఒక్క క్షణం ఆలోచించాడు సాగర్‌. ‘‘నాన్నంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. అయినా అడుగుతున్నాను. మీరిద్దరూ ఏమీ గొడవ పడలేదు కదూ’’ అడిగాడు.
      ‘‘ఛ... అదేం లేదు. అలాంటి గొడవలు ఎప్పుడూ జరగలేదు, జరగవు’’ 
      ‘‘అవును.. నాకు తెలుసు. పోనీ ఒక పని చేద్దాం. నాన్నకి 70 ఏళ్లన్నమాటే కానీ ఇప్పుడు అదొక పెద్ద వయసు కాదు. ఆరోగ్యంగా ఉన్నాడు కూడానూ. ఇవాళ రాత్రికో, రేపటికో తిరిగివస్తాడు. లేదా ఇంకెక్కడో ఉన్నా ఫోన్‌ చేస్తాడు. రేపటిదాకా చూసి నాకు మళ్లీ ఫోన్‌ చెయ్యి. భయపడొద్దు. అవసరమైతే వెంటనే ఇండియాకి వస్తా’’ అన్నాడు సాగర్‌.
      ‘‘అలాగే..’’ అంది వర్ష, కళ్లు తుడుచుకుంటూ.
      ‘‘ఉండు. కవిత మాట్లాడుతుందిట..’’ అంటూ కవితకి ఫోన్‌ అందించాడు సాగర్‌.
      కవిత ఓ పక్క వర్షకి ఫోన్‌లో ధైర్యం చెబుతుంటే, సాగర్‌ ఆలోచనలో పడ్డాడు. 
      నాన్న ఎక్కడికి వెళ్లి ఉంటాడు?  ఎవరింటికి వెళ్లినా చెప్పకుండా వెళ్లడు. అదీకాక తనూ, వర్ష ఆయన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఆయన ఉద్యోగం చేసింది తెలుగు మాష్టారే అయినా, ఇద్దరు పిల్లలకోసం ఎంతో కష్టపడి, పైకి తీసుకు వచ్చాడు. తను ఇండియాలో మెడిసిన్‌ చదివి, అమెరికా రావడానికి కూడా ఆయనే కారణం. తను పస్తులున్నా, పిల్లలకి ఏ లోటు రానియ్యలేదు. అలాగే వర్ష. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చదువుకొని అక్కడే రీసెర్చి ఉద్యోగం చేస్తోంది.
      బావ భాస్కర్‌ కూడా అంతే. అతనికి తల్లీ తండ్రీ చిన్నప్పుడే పోవడంతో, వీళ్లనే తల్లిదండ్రుల్లా చూసుకుంటాడు. తనే విశాఖలో బీచ్‌ ఒడ్డున చక్కటి ఇల్లు కట్టించి, అందర్నీ అక్కడే ఉండమన్నాడు. పదేళ్ల కిందట తల్లి చనిపోయాక, తండ్రి రోజూ ఒక వ్యాపకం పెట్టుకుని జీవితాన్ని ఆరోగ్యంగా వెళ్లదీస్తున్నాడు. అమెరికా వచ్చి ఉండమన్నా ఇష్టపడలేదు. అందుకే తను ప్రతి సంవత్సరం ఒకసారి ఇండియా వెళ్లి భార్య పిల్లలతో రెండు మూడు వారాలు గడిపి వస్తుంటాడు.
      మరి ఇలా ఎందుకు జరిగింది? అదే అర్థం కావటం లేదు!

* * *

      మర్నాడు ప్రతి రెండు మూడు గంటలకీ, ఇండియాకి ఫోన్‌ చేస్తునే ఉన్నాడు సాగర్‌.
      ‘‘ఇంకా ఏమీ తెలియలేదు. తెలిసిన కుర్రవాళ్లు ఓ అరడజను మంది అన్ని చోట్లా వెతుకుతున్నారు. పోలీసులూ చూస్తున్నామనే అన్నారు. ఎక్కడికెళ్లాడో ఏమిటో అర్థం కావడం లేదు’’ అంది వర్ష.
      సాగర్‌ ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ‘‘నేనివాళే బయల్దేరుతున్నాను. నువ్వు భయపడకు’’ అన్నాడు. 

* * *

      సాగర్‌ ఆరోజు సాయంత్రమే బయల్దేరినా, విశాఖపట్నం చేరేటప్పటికి ఇంకో రెండు రోజులు అయ్యింది.
      వర్ష కన్నీళ్లతో ఎదురొచ్చి, ‘‘నాన్న ఇంకా రాలేదురా, అన్నయ్యా!’’ అంది. 
      భాస్కర్‌ కూడా సింగపూర్‌ నుంచి అనుకున్న దానికన్నా తొందరగానే వచ్చేశాడు.
      నాన్న స్నేహితుడు ప్రకాశరావుగారూ అక్కడే ఉన్నారు.
      ‘‘మనవాళ్లు ఏదో అంటూ ఉంటారుగా బాబూ, అన్నీ తీరిపోయిన ఆ వయసులో సన్యాసం తీసుకుని అలా ఏ హిమాలయాలకో వెళ్లిపోయారనో, ఈ భవబంధాలు తెంపేసుకుని పారిపోయారనో! కానీ జగన్నాథం మాత్రం అలాంటివాడు కాదు. మేం రోజు బీచి ఒడ్డున నడిచేటప్పుడు ఇలాంటి విషయాలతో సహా ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయనకి పరంకన్నా, ఇహం అంటేనే ప్రేమ ఎక్కువ. దైవం కన్నా మనుషులంటేనే మక్కువ. మానవ సేవే మాధవ సేవ అని మనసా వాచా నమ్మిన మానవత్వమున్న మనిషి. మరి అలాంటివాడు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడో.. ఏమిటో..’’ ఆయనకీ అంతా అగమ్యగోచరంగానే ఉంది.
      ‘‘ఒకవేళ ఏదయినా అవసరపడినా, నాకూ వర్షకి చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు మామయ్యగారు. రోజూ నడకకి వెళ్తున్నా, నాలుగు సార్లు చెప్పిగానీ వెళ్లరు. నాకేమీ అంతుబట్టటం లేదు’’ అన్నాడు భాస్కర్‌.
      ‘‘ఎవరయినా డబ్బుల కోసం ఎత్తుకుపోయుంటారా? కిడ్నాప్‌ లాగా’’ అడిగింది వర్ష.
      ‘‘నేనలా అనుకోను. అదే నిజమైతే ఈపాటికి లక్షో, రెండు లక్షలో అడిగేవారుగా’’ సాగర్‌ అన్నాడు.
      భాస్కర్, సాగర్‌ ఇద్దరూ కలిసి పోలీసు స్టేషనుకి వెళ్లి విచారించారు. ఎన్ని సార్లు చెప్పినా, ఒకటే మాట, ‘ఇంకా వెతుకుతూనే  ఉన్నాం. మాకే సమాచారము రాలేదు, ఏదయినా తెలిస్తే వెంటనే చెబుతాం’ అని.
      ‘‘ఈ వయసులో సంసారాన్ని వదిలేసి, చాలామంది కాశీకి వెళ్లిపోతారు సార్‌. ఇలాటి కేసులు మేం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం!’’ అని కూడా అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
      ‘‘మా దగ్గర కొంతమంది కుర్రాళ్లున్నారు సార్‌! ఆయన ఫోటోలు కొన్ని, ఖర్చులకి ఓ పాతికవేలూ ఇవ్వండి. మేం ఆయన్ను వెతికి పెడతాం’’ అన్నాడు వాళ్ల ఇంటికి  ఎదురుగా ఉన్న టాక్సీల అద్దెకిచ్చే అతను.
      భాస్కర్‌ అన్నాడు, ‘‘ఆయన్ని వెంటనే తీసుకువస్తేనే ఇరవై వేలు. లేదా మీ ఖర్చులకి వెయ్యిస్తాను’’ అని ఒప్పించి, కొన్ని ఫొటోలు ఇచ్చాడు.
      ‘‘న్యూస్‌ పేపర్లో కూడా వేయిస్తున్నా’’ అన్నాడు భాస్కర్‌.
      ఆసుపత్రుల్లోనూ కనుక్కున్నారు. ఎక్కడైనా ఎవరైనా ఆయన్ని చేర్పించారేమోనని. అంతకన్నా ఇంకేం చేయాలో పాలుపోలేదు సాగర్‌కి.

* * *

      ఇంకొక రోజు కూడా గడిచింది. మర్నాడు మధ్యాహ్నం సాగర్‌ మనసు ఏమాత్రం బాగాలేకపోతే, ఒక్కడే నడుచుకుంటూ సముద్రం ఒడ్డుకి వెళ్లి, సముద్రాన్ని చూస్తూ ఇసుకలో కూర్చున్నాడు. చిన్నప్పటినుంచీ అతనికది అలవాటే. వైజాగ్‌ వచ్చినప్పుడల్లా అలా చేస్తూనే ఉంటాడు.
      ఎగిరెగిరి పడుతున్న అలలను చూస్తూ అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికి తెలియలేదు. అప్పుడే సన్నగా చినుకులు  మొదలయ్యాయి. లేచి కొంచెం ముందుకు వస్తుంటే అక్కడే ఒక కాఫీ షాపు కనబడింది. వెళ్లి కిటికీ దగ్గరగా కూర్చుని, కాఫీ తెమ్మని చెప్పాడు, ఈలోగా సాగర్‌ ఆలోచనలో పడ్డాడు.
      వాన ఎక్కువయింది. సముద్రపు నీటి మీద వర్షం చినుకులు పడుతూంటే తబలా వాయిస్తున్నట్టుంది.
వర్షం కురుస్తున్న సముద్రం. భూమి మీద ఎన్నో చోట్ల నీళ్లు లేక బాధపడుతున్నారు జనం. ఇక్కడ సముద్రంలో ఎంతో నీరు. అయినా సముద్రం మీద పెద్ద వాన. ఇంకా ఎంతో నీరు సముద్రంలో కలుస్తోంది, ధనవంతుల దగ్గరకే ఇంకా ఎక్కువ డబ్బు చేరుతున్నట్టు. అలా ఎందుకు అనుకోవాలి? సముద్రంలోని ఉప్పునీళ్లని మంచినీళ్లుగా మార్చడానికి ఇది ప్రకృతి చేస్తున్న ప్రయత్నమా! ఎంత వాన వస్తే సముద్రాలు మంచి నీళ్లనిస్తాయి?
      ఈలోగా సర్వర్‌ కాఫీ ఇచ్చి వెళ్లాడు.
      వాన నీళ్లు నేల పడి, అక్కణ్నుంచీ కాలువల్లోకి, నదుల్లోకి పారి, చివరికి సముద్రంలో కలిసి పోతాయంటారు. అంత శ్రమ లేకుండా, ఆకాశం నీళ్లని సముద్రంలోకి తిన్నగా పంపించేస్తుందా!?
      ఇలాంటి ప్రశ్నలు ఎన్నో చిన్నప్పుడు తండ్రిని అడిగేవాడు. సాగర్‌ ఆలోచనలు, తనకి పదేళ్ల వయసున్నపుడు తండ్రి చేయి పట్టుకుని సముద్రం ఒడ్డున నడిచిన రోజుల వైపు వెళ్లాయి. ఆ సంఘటనలు, ఇన్ని సంవత్సరాలయినా ఇంకా తన స్మృతిలో మెదులుతూనే ఉన్నాయి. అప్పుడాయన ఎన్నో మంచి విషయాలు చెబుతూ ఉండేవాడు. అవే తర్వాత తన జీవితపు విలువలుగా మారాయని సాగర్‌ ఎప్పుడూ అనుకుంటుంటాడు.
      అప్పుడూ ఓసారి ఇలానే సముద్రం మీద భారీ వర్షం పడింది. ‘‘నీళ్లు లేని చోట కరువుంటే, ఎన్నో నీళ్లున్న సముద్రం మీద మళ్లీ వర్షం ఎందుకు?’’ అని తండ్రిని అడిగాడు సాగర్‌.
      ఆయన చెప్పిన మాటలే, తనకి ఇందాక వచ్చిన ఆలోచనలకి స్పందన. వాటన్నిటి కన్నా, ఆయన ఇంకొక విషయం చెప్పారు. ఆనాడు తను పిల్లవాడుగా ఉన్నప్పుడు మామూలు కబుర్లలా కనిపించిన ఆ విషయం, పెద్దయ్యాక ఆలోచిస్తే ఎంతో అర్థవంతంగా కనపడింది.
      నీరు మనిషికి దాహం తీర్చి ప్రాణం పోస్తుంది. అదే నీరు వరదలా వచ్చి కొంపలు ముంచుతుంది. నిప్పు ఆహారాన్ని వండుకోవడానికి, చలికి శరీరాన్ని కాపాడుకోవడానికి ఎంతో అవసరం. అదే నిప్పు మన ఇళ్లు తగలబెట్టేస్తుంది. మనకి ప్రాణవాయువు నిచ్చే గాలి, తుపానులా మారి ప్రాణాలను తీస్తుంది. ప్రకృతిలో ఉండే విడ్డూరాలు కావు అవి. అది ప్రకృతి అందించే సందేశం. ప్రతి చోటా మంచీ చెడూ కలిసి ఉంటాయి. కత్తితో కూరలు తరుక్కోవచ్చు, ప్రాణాలూ తీయొచ్చు. మంచిని దగ్గరకు చేర్చి, చెడుని దూరంగా ఉంచేదే వివేకం. ఆ వివేకం ఉంటేనే మనిషి మానవుడవుతాడు. అప్పుడే మానవత్వం వికసిస్తుంది.
      వాన తగ్గేసరికి, సాగర్‌ లేచి ఇంటి వేపు నడక సాగించాడు. వైజాగ్‌ పోయిన సంవత్సరానికి, ఇప్పటికి కూడా ఎంతో మారిపోయింది. అక్కడ పుట్టి పెరిగిన తను ఎన్నో రోడ్లు గుర్తుపట్టలేకపోతున్నాడు. అది వయసు వల్ల వచ్చే మతిమరుపు కాదు. ఏమిటి? వయసు వల్ల వచ్చే మతిమరుపా.. ఒక డాక్టర్‌గా తనామాట అనకూడదు. అనుకోకుండా అతని మనసులో ఏదో తళుక్కుమంది... గబగబా ఇంటికేసి అడుగులు వేశాడు.
      ‘‘నాన్న ఈ మధ్య చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా మరిచిపోతున్నాడా?’’ అడిగాడు వర్షని. ‘‘ఎప్పుడూ కాదు అప్పుడప్పుడూ. ఏమాలోచిస్తాడో ఏమో భాస్కర్ని, అప్పుడప్పుడూ సాగర్‌ అని పిలుస్తాడు. అలాగే నన్ను వదిన పేరుతో కవితా అని పిలుస్తాడు. మొన్న రాజ్యం అత్తయ్య వచ్చినప్పుడు అవిడని అసలు గుర్తు పట్టలేదు. రోజు నడక పూర్తయాక, నాన్న ఈమధ్య ఇంటి దాకా ప్రకాశరావు గారితోనే వస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గిందనే అనిపిస్తుంది’’ అంది వర్ష.
      సాగర్‌ సాలోచనగా అన్నాడు, ‘‘ఆయనకి డిమెన్షియా ఉందేమో అని అనుమానంగా ఉంది. ఇంకా మొదట్లోనే ఉంటే పరవాలేదు. కొంచెం సీరియస్‌ అయితే అల్జీమర్స్‌ వ్యాధిలోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఆయనకి అన్నీ గుర్తు ఉంటే ఈసరికి మనకి కనీసం ఫోన్‌ చేసైనా ఉండాలి. అది కూడా చేయలేదంటే...’’ ఆలోచిస్తున్నాడు.
      వర్ష అడిగింది ‘‘మరి అది తగ్గే వ్యాధేనా?’’
      ‘‘కొన్ని పరీక్షలు చేసి, ఇంకా తొలి దశలోనే ఉంటే తగ్గించటం సులభం. మిగతా ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది. కొన్ని బాగా గుర్తుంటాయి. కొన్ని అసలు గుర్తుండవు. మధ్య మధ్యలో తెరలు తెరలుగా మరిచిపోయిన కొన్ని విషయాలు గుర్తుకొస్తుంటాయి కూడా. అమెరికాలో అయితే కారు తీసుకుని హైవే ఎక్కేసి వెళ్లిపోతుంటారు. వాళ్లకి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. తిరిగి ఇంటికి వెళ్లటానికి అడ్రస్, వాళ్ల పిల్లల పేర్లూ ఏవీ గుర్తుండవు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఆయనకి నిజంగా ఈ వ్యాధి ఉంటే, మన గురించి ఆయన ఎవరికీ చెప్పలేరు. మనమే ఆయన్ని వెతికి పట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తూ, ఇండియాలో దాన్ని వయసుతో ముడిపెట్టి, పెద్దవాడైపోయాడు, మరిచిపోతున్నాడు అంటారు. ఈ వ్యాధిని ముందే కనుక్కుంటే నివారణ చాలా సులభం’’
      ‘‘మరి అమెరికాలో ఇలా తప్పిపోయిన వాళ్లని ఎలా పట్టుకుంటారు?’’ అడిగాడు భాస్కర్‌.
      ‘‘టీవీలో ఫొటోలు చూపించి...’’ అంటూనే చటుక్కున ఏదో స్ఫురించి ‘‘మనమూ అదే చేద్దాం’’ అన్నాడు సాగర్‌ ఉత్సాహంగా.
      భాస్కర్‌ స్థానిక టీవీలో ప్రతి గంటకీ ప్రకటనలు వేయించాడు. తమ అడ్రసూ, ఫోన్‌ నెంబరూ, సెల్‌ నెంబరూ ఇచ్చాడు.
      వర్ష రోజంతా ఫోన్‌ దగ్గరే  కూర్చుంది. ఫోన్‌ మోగినప్పుడల్లా చటుక్కున తీస్తోంది. చివరికి అనుకున్న ఫోన్‌కాల్‌ రానే వచ్చింది. భీమునిపట్నం నుంచి. ఎవరో ఒకాయన, పేరు అప్పారావు, మీరు టీవీలో చూపించిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడని చెప్పి, అన్ని వివరాలూ ఇచ్చాడు.
      ‘‘ఆయనతో మాట్లాడవచ్చా?’’ అని అడిగింది వర్ష.
      ‘‘లేదమ్మా... నేను మా ఇంటినించీ మాట్లాడుతున్నాను. ఆయన వేరే చోట ఉన్నారు’’ అన్నాడాయన. ‘‘అయితే ఇప్పుడే బయల్దేరి వస్తున్నాం’’ అని ఆయనతో చెప్పి, ‘‘అన్నయ్యా! నాన్న దొరికాడు’’... పెద్దగా  అరిచింది వర్ష ఉద్వేగంగా.
      వెంటనే వర్ష, భాస్కర్, సాగర్‌ ఆయన రమ్మన్న చోటుకి బయల్దేరారు. ‘‘నాన్న అన్నం తిని ఎన్నాళ్లయిందో’’ అని వర్ష ఒక బాక్సులో కొన్ని ఇడ్లీలు, కనపడ్డ కొన్ని తినుబండారాలూ సర్ది తీసుకువచ్చింది.
      కారు భీమునిపట్నం వేపు వెళ్తుండగా, భాస్కర్‌ సెల్‌ ఫోన్‌ మోగింది.
      ‘‘మీ ఇంటికి ఫోన్‌ చేస్తే ఎవరూ పలకలేదు సార్‌. అందుకే సెల్‌ఫోన్‌కి చేస్తున్నాను. నేను వైజాగ్‌ నుంచి. భీమునిపట్నం వెళ్లే దారిలో ఉంది కదా శిథిలమైన బౌద్ధారామం, అక్కడ టూరిస్ట్‌ గైడుగా పని చేస్తున్నాను. మీరు టీవీలో చూపించినాయన్ని రెండు మూడుసార్లు ఇక్కడ చూశాను సార్‌. రోజుకోసారి కనపడేవారు. పేరు అడిగితే చెప్పలేదు. చిరునవ్వు నవ్వేవారు. ఈ ఆరామం గురించి నాకన్నా ఆయనకే బాగా తెలుసు. మూడ్రోజులయిందేమో చివరిసారిగా చూసి. మళ్లీ కనపడలేదు. ఆయన ఇంటికి  వచ్చారా సార్‌’’ అని అడిగాడు.
      భాస్కర్‌ అన్నాడు, ‘‘ఆయన భీమునిపట్నంలో ఉన్నారు. అక్కడికే వెళ్తున్నాం’’ అని.
      ‘‘ఎంత మంచి మనిషి. తిరిగి వెళ్లేటప్పుడు దారిలో ఆగి, అతనికి థాంక్స్‌ చెబుదాం’’ సాగర్‌ అన్నాడు వర్షతో.
      భీమిలిలో అప్పారావు చెప్పిన చోటుకి వెళ్లారు. ఆయన్ని కూడా ఎక్కించుకుని జాలరులు ఉండే గూడేనికి వెళ్లారు.
      వీళ్లని చూడగానే ఎదురొచ్చాడు సూరీడు ‘‘అయ్యగారు మా గుడిసెలో ఉన్నారయ్యా’’ అంటూ. నులక మంచం మీద కూర్చున్న తండ్రిని చూడగానే వర్ష ఒక్కసారిగా వెళ్లి కావలించుకుంది. తన పేరు చెబితే కానీ ఆయన గుర్తుపట్టలేదు. కానీ సాగర్‌ కనపడగానే, ‘‘నువ్వెప్పుడు వచ్చావురా’’ అని అడిగాడు. సాగర్‌ ఆయన పక్కనే దగ్గరగా కూర్చుని, ఆయన చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
      ఆయనకి ఎప్పుడు వెళ్లిందీ, ఎక్కడెక్కడికి వెళ్లిందీ ఏమీ గుర్తున్నట్టు లేదు. వర్ష పెట్టిన ఇడ్లీలు తింటున్నాడు. 
      ‘‘నిన్న పొద్దుటే సముద్రం మీదకెల్లి సేపలు పట్టి ఒడ్డుకొచ్చామయ్యా... ఈయన ఒడ్డునే ఇసుకలో పడిపోయున్నాడు. పేరు సెప్పడు, ఊరు సెప్పడు. ఆకలేస్తందా అంటే తలూపాడు. అసలే ఎండ మండిపోతావుంది, పెద్దాయనకదా అని మా ఇంటికి తీసుకెళ్లామయ్యా. ఏదో ఇంట్లో ఉన్నదే కొంచెం పెడితె ఆబగా తిన్నారండయ్యా. ఆకలి మీదున్నట్టున్నారు. తర్వాత ఏంచేయాలో తెలవలేదయ్యా. మాకు రోజు దొరికే చేపల్ని కొని ఎగస్పోర్టు చేసే అప్పారావుగోరికి చెప్పామయ్యా. ఆయనే గుర్తుపట్టారు, టీవీలో సూపించారట గదయ్యా అయ్యగోరి పొటోని. మీరొచ్చేదాకా అయ్యగోర్ని మా ఇంటికాడే ఉంచమన్నారయ్యా. అయ్యగోరిప్పుడు కొంచెం తేరుకున్నారయ్యా, రాత్తిరి మా పిల్లలకి సానాసేపు సదువు కూడా సెప్పారయ్యా’’ అన్నాడు సూరీడు.
      సాగర్‌ రెండు చేతులూ ఎత్తి, సూరీడుకి నమస్కారం చేశాడు. దగ్గరికి వెళ్లి కావలించుకున్నాడు. సాగర్‌ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ‘‘నీ సాయం ఈ జన్మలో మరచిపోలేం, సూరీడు’’ అన్నాడు. సాగర్‌ సూరీడుకి డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు. ‘‘ఇదేంటయ్యా... నీనేం చేసేను... అయ్యగోరికే.. పెద్దింటాయన.. మాలాంటోల్ల గుడిసెలో ఉండాల్సొచ్చింది..’’ అన్నాడు కొంచెం నొచ్చుకుంటూ.
      సాగర్‌ అతని చేతిలో కొన్ని నోట్లు పెట్టి ‘‘పిల్లలకి పుస్తకాలు, బట్టలూ కొను సూరీడూ. పండుగ వస్తోంది కదా’’ అన్నాడు. పక్కనే ఉన్న అప్పారావుకి ధన్యవాదాలు చెప్పాడు. అందరూ కారు ఎక్కుతున్నప్పుడు, ‘‘వర్షం వచ్చేటట్టుంది’’ అన్నాడు భాస్కర్‌. సాగర్‌ మనసులో మళ్లీ మెదిలింది. 
      వర్షం కురిసిన సముద్రం!
      సూరీడుతో అన్నాడు, ‘‘సముద్రం మీద వాన పడితే, మీకు సముద్రం మీదకి వెళ్లటం కష్టం కదూ’’ అని. 
సూరీడు నవ్వాడు, ‘‘లేదు బాబయ్యా! వాన పడితేనే మాకు బాగుంటాది. ఆ తేమకీ, సల్లదనానికీ ఎన్నో సేపలు బైటికి వస్తాయి... అప్పుడే మాకు బాగా సేపలు దొరికేది...’’ అన్నాడు.
      తనకేదో జవాబు దొరికినట్టు, చటుక్కున తల పైకెత్తాడు సాగర్‌. సముద్రం మీద వర్షం ఎక్కువయింది.

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam