నందుగాడి రంగుల కళ

  • 4473 Views
  • 50Likes
  • Like
  • Article Share

    గుర్రం ఆనంద్

  • కాపీరైటర్, రేడియో మిర్చి
  • హైదరాబాద్‌.
  • 9885483909
గుర్రం ఆనంద్

శనివారం పగటి పూట బల్లే రెండో బెల్లు కొట్టిండ్రు. నందుగాడు హింది చూసిరాత కాపీ తీసి టేబుల్‌ మీద పెట్టొచ్చి ఆడి జాగల ఆడు కూసున్నడు. హింది సారు రావల్నా... డ్రాయింగు సారొచ్చిండు. పిల్లగాండ్లందరు లేసి నిలవడి గుడ్‌ మార్నింగని, గుడ్‌ ఆఫ్టర్‌నోనని, గుడ్‌ ఈవినింగని ఎవడికి యాదికొచ్చింది ఆడు జెప్పిన్రు. ఇగ డ్రాయింగు సారేమో ‘‘సిడౌన్‌ సిడౌన్‌’’ అనుకుంట సేతులున్న నోటిస్‌బుక్కు తెరిసిండు. డ్రాయింగు సారు గీ మధ్యన్నే బల్లే జేరిండు. పిలగాండ్లకు వీజిగ బొమ్మల ఎట్ల దించుడో మంచిగ నేర్పిత్తుండు. నందుగాడికి గీ సారంటే బాగా ఇష్టమైంది. పిల్లిని ఎలక లెక్క, కాకిని కొంగల లెక్క దించటోడు గిప్పుడు నందుగాడు పిట్టని పిట్ట లెక్క, గుట్టని గుట్ట లెక్క దించుతుండు. అయిన గూడ ఐదో తర్గతల బొమ్మలు దించుడు రాంది ఎవల్కంటే నందుగాడి పేరే జెప్తరు అంతా.
డ్రాయింగు సారు ‘‘సైలెన్స్‌ సైలెన్స్‌’’ అనుకుంట పిలగాండ్ల నోర్లు మూసి నోటీస్‌ సదువుడు పెట్టిండు. ‘‘ఇందుమూలముగా విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జవహర్‌ బాల భవన్‌ వారు పిల్లలందరికి జిల్లా స్థాయి డ్రాయింగు పోటీలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల పిల్లలందరు ఈ పోటీలో పాల్గొనగలరు. ఇట్లు ప్రధానోపాధ్యాయులు’’ దీన్జెదివి ‘‘డ్రాయింగు పోటీలో పాల్గొనెటోళ్లు లేసి నిలవడుండ్రి.. పేర్లు రాసుకుంట’’ అని అన్నడు. బొమ్మలు మంచిగ దించెటోళ్లు పద్మ, విజయ, లక్ష్మి, ఇగ మగ పిలగాండ్లల్ల శీనుగాడు, రమేశ్‌గాడు లేసి నిలవడ్డరు. నందుగాడిగ్గూడ గీ డ్రాయింగు పోటీల పోవాలనుంది. సారు నన్దీసుకుంటడో లేడోనని, నిల్సొవాల్న అద్దా అని కింది మీదయితండు. ఎట్లయితాట్లాయని దేర్నంగా లేసి నిలవడ్డడు. నందుగాడ్ని సూసి పిల్లగాండ్లందరు నవ్వుడు వెట్టిండ్రు. ‘‘సార్‌... నందుగాడు సున్నా గూడ గుండ్రంగ దించడ’’ని సూరిగాడన్నడు. ఇగ శీనుగాడేమో ‘‘ఓరేయి... గిది మన బల్లే గాదు... ఆడికి అన్ని బల్లల నుండి పోటీకి అత్తరు’’ అని ఆడికే తెలిసినట్టు జెప్పిండు. నందుగాడు సప్పుడు జేయక చీట్లనే నిల్సున్నడు. డ్రాయింగు సారు సప్పుడు జేయక నందుగాడి పేరు గూడ రాసుకొని ‘‘రేపు ఆదివారం, పొద్దున తొమ్మిది గంటలకల్లా పేర్లిచ్చినోళ్లంతా పెన్సిల్లు, కలర్‌ పెన్సిల్లు పట్టుకొని బడికి రావలే, అందర్ని నేను బాలభవన్‌కు తీస్కవోతా’’ అన్జెప్పి ఆరో తరగత్లకు వోయిండు.
బడి చుట్టికాంగనే నందుగాడు ఇంటికివోయే తొవ్వలున్న అస్లం కిరాణం దుకాణ్ల ఆగి, ‘‘కలర్‌ పెన్సిల్ల డబ్బా ఉందా’’ అని అడిగిండు. పది నోటు ఇచ్చిన గిరాక్కి సిల్లరియ్యడానికి అస్లం భాయ్‌ పైసల్‌ లెక్కపెట్టుకుంట ఉందన్జెప్పిండు. ఎంత అనడిగిండు. ఆర్రూపాలన్జెప్పిండు. అండ్ల ఎన్ని కలర్‌ పెన్సిల్లుంటయ్‌? అస్లంభాయ్‌ పన్నెండన్నడు. ఏవేం కలర్లున్నయ్‌? అని నందుగాడు మళ్లా అడిగిండు. గింతల అస్లం భాయ్‌ లెక్క తప్పిండు.. ‘‘బద్మాష్‌! పైసలెక్కవెడ్తంటే అది ఎన్నీ, ఇది ఎంత అనీ పరేషాన్‌ జేత్తున్నవ్‌! ఛల్‌ పైసే లేకే ఆవ్‌.. బతావుంగా’’ అని నందుగాన్ని గదుమాయించిండు. గిప్పుడే పట్కత్తాని ఆణ్ణుంచి లగాయించిండు. తొవ్వల చింత చెట్టు కింద చందుగాడు గోఠిలాడుతుండు. ‘‘రేయ్‌... జెప్పన్రారా. ఇయ్యాల తొంటోడి గోఠిలన్నీ ఎట్లయిన దొబ్బాలే’’ అని చందుగాడు వెల్తె ‘‘కలర్‌ పెన్సిల్లు కొనుక్కోవాలే, బొమ్మలు దించాలే. ఈయ్యాల రాను పోరా’’ అనుకుంటూ నందుగాడు ఇంటికురికిండు. 
గల్మకాడ గూసోని లచ్చువమ్మ బీడీలు సుడ్తంది. ఓ పదారేండ్ల పొల్ల బీడీలు సుట్టుడు నేర్వాలని లచ్చువమ్మ పక్కగూసోని బీడీల తోకలకు దారం కడ్తంది. 
నందుగాడు ఎగపోసుకుంట ఉరికచ్చి లచ్చువమ్మ మొకంల మొకం పెట్టి ‘‘అమ్మా... ఆర్రూపాలియ్యే... కలర్‌ పెన్సిల్లు కొనుక్కోవాలే... బల్లే రేపు డ్రాయింగు పోటిలున్నయ్‌. అస్లంభాయ్‌ దుకాణ్లడిగచ్చిన. ఆర్రూపాలట. జల్దియ్యే కొనుకచ్చుకుంట’’ అని దమ్ముదీయకుండ పాఠం అప్పజెప్పినట్టు జెప్పిండు. 
‘‘బాపును పంపువని కారట్‌ రాద్దంగాని నువ్వోయి కాళ్జేతులు కడుక్కోని అన్నం తినుపో’’ అని లచ్చువమ్మ నందుగాడి మొకం గూడ సూడకుండా బీడీలెన్నయినయో లెక్కవెట్టమని పక్కగూసున్న పొల్లకు జెప్పింది.
‘‘బొంబాయి నుంచి బాపు పంపించేటల్లాకి ఆర్నెల్ల పరీక్చలత్తయ్‌. డ్రాయింగ్‌ పోటీ రేపే ఉందే... నాకియ్యాల్నే గావలే... జల్దియే’’ అని నందుగాడు ఎగిర్తవడ్తాంటే... 
‘‘ఆ... జల్దియ్యడానికి ఈడ ముళ్ళే గట్టివెట్టిన్నా?’’ అని బీడీల సాట పక్కకు వెట్టి గల్మకానుండి లేసింది లచ్చువమ్మ. ‘‘ఓ నాడు పెన్నుగావలంటవు, ఓనాడు పెన్సిలు, ఓనాడు లబ్బరు. రోజుకో యేశం గడ్తవ్‌’’ అనుకుంట బాయి దగ్గరికొచ్చి తంబాకు చేతుల్ని సబ్బుతో కడుక్కుంది. 
నందుగాడు ఆళ్ళమ్మ ఎనకనే అడుగలడుగేసుకుంట వోయి ‘‘గీది డ్రాయింగు పోటీయే. కలర్‌ పెన్సిల్లతోనే బొమ్మల్దించాలే. నీకేందెల్వదేందే. పైసలియ్, జల్దివోయి కొనుక్కచ్చుకుంట’’ అని నందుగాడు జబర్దస్తుగడిగిండు. 
‘‘కలర్‌ పెన్సిల్లేవ్‌ గిలర్‌ పెన్సిల్లేవ్‌! పైసల్‌ సెట్లగ్గాత్తన్నయ్‌ అనుకుంటున్నవా? సదువు సక్కగ సదువు సాలు’’ అని గదువాయిస్తు నందుగాడి మొకం కాల్జేతులు కడిగింది. 
నందుగాడు ఏడుపు మొకం పెట్టి ‘‘నీయమ్మ... నువ్వేదడిగిన గొనవ్‌’’ అని ఆడున్న బాల్జి తన్ని కోపంగా ఇంట్లకురికిండు.
పోరనికి ఈపు బాగా ములముల వెడ్తందనుకుంట లచ్చువమ్మ గూడ ఇంట్లకచ్చింది. అంటిట్లకోయి పళ్లెంల అన్నం బెట్టి ‘‘అన్నందిందురారా’’ అని విల్సింది. 
‘‘అన్నవద్దు, ఏవద్దు. ముందుగాల్నాకు కలర్‌ పెన్సిల్గొనియ్‌’’ అని నందుగాడు ఏడ్సుడు వెట్టిండు. 
‘‘అద్దయితే ఎండు... కడుపులగాల్తే రోగం తిరుగుద్ది’’ అని లచ్చువమ్మ మళ్ళా బీడీల సాట ముందట వెట్టుకోని కూసుంది. 
నందుగాడికి ఇర్గ కోపమచ్చి ‘‘గిప్పుడు నువ్‌ గొనియకపోతే.. ఏం జేత్తనో సూడు’’ అని బీడీలకు సుట్టే దారం బింగిరి అందుకోని బాయికాడికి ఉరికిండు. ‘‘కలర్‌ పెన్సిల్లు గొనిత్తవా... గీ బింగిరి బాయిలెయాల్నా’’ అని బాయిగోడ పక్కకు నిల్సొని దారం బింగిరిని ఓ సేత్తో బాయిలకిడిసి పట్టుకున్నడు. 
‘‘బింగిరి బాయిల వడాలే... గప్పుడు జెప్తా నీ సంగతి’’ అని బెదిరించుకుంట ఆడ్ని వట్టుకోనీకి బీడీల సాట పక్కకువెట్టి లేసింది లచ్చువమ్మ. 
‘‘నా దగ్గరికొత్తే... బింగిరి బాయిలవడేత్త.. నాగ్గొనిత్తవా గొనియవా జెప్పు’’ అని బాయి ఆ పక్కకోయి ఉల్టా బెదిరిచ్చుడు వెట్టిండు. 
ఈ మోర్దోపోడు అన్నంత పన్జేత్తడని ‘‘సరే కొనిత్తగని... ఆ బింగిరి ఇటియ్యిరా’’ అంది.
నందుగాడు నమ్మక ‘‘ముందుగాల ఆర్రూపాలు ఆడవెట్టు.. గప్పుడిత్తా’’ అననుకుంట బాయి సుట్టు సెక్కర్లు గొట్టుడు వెట్టిండు. 
‘‘నందుగాడు మంచోడు గదా... దుగూట్లున్న డబ్బల్నే పైసలున్నయ్‌... నువ్వే అచ్చి తీసుకుందురా’’ అని బుదుకరించింది. 
గిట్లజేత్తనే నాగ్గొనిత్తవన్నట్టు ఓ సూపు జూసి దారం బింగిరిని పెరట్లకిసిరికొట్టిండు. దారం బింగిరి కోసం లచ్చువమ్మ పెరట్లకోంగనే నందుగాడు ఇంట్లకురికి, దుగూట్లున్న  పైసల డబ్బకోసం స్టూలెసుకొని ఎక్కవోతుండు. 
గింతట్లనే లచ్చువమ్మచ్చి నందుగాడి ఈపుల నాలుగు సరిసి ‘‘నక్రాల్జేతున్నవారా గాడ్ది.. ఊకున్నకొద్ది సెప్తినకుంట తయారైనవ్‌.. మొండికెగవడ్డవ్‌ బాగా’’ అని ఇర్గమర్గ దంచింది. వాడకట్టంత ఇనచ్చటట్టు నందుగాడు మొత్తుకునుడు వెట్టిండు. ‘‘మళ్లా గిట్ల అదిగావలే, ఇదిగావల్నని మంకు జేత్తవా?’’ అని రెండు దవడలు వాయించింది. ‘‘సదువు సంక నాకి పోనిగని... బొమ్మల్దించుతడట బొమ్మలు.. సెప్పినట్టు ఇనకపోతే కాళ్లిరగ్గొట్టి మూలగ్గూసుండవెడ్త’’ అనుకుంట ఇంకో నాలుగు దెబ్బల్సర్సి మళ్లా బీడీల సాట ముంగల వెట్టుకొని సిక్కువడ్డ బింగిరి దారం ఇడదీసుడు వెట్టింది. నందుగాడు ఏడుసుకుంట మూలకు నక్కిండు. ఆడికి యాస్టకొచ్చేదాక ఏడ్సి ఏడ్సి అట్నే నిద్రవోయిండు.
రాత్రి ఎనిమిది గొట్టంగ లచ్చువమ్మ నందుగాడ్ని లేపింది. ఆడు లేసి సుట్టు సుత్తే చీకటి వడ్డదని తెల్సింది. కలర్‌ పెన్సిల్లు యాదికొచ్చి గుండెలదిరేటట్లు ఎక్కెక్కిపడి మళ్లా ఏడుసుడు వెట్టిండు. 
లచ్చువమ్మ దగ్గరికి తీసుకొని ‘‘బొమ్మలు కలర్లు ఎయ్యకుంట గూడ దించుతరు’’ అని బుదకరిచ్చుడు వెట్టింది. 
‘‘కలర్లు ఎయ్యకుంటే బొమ్మలు మంచిగెట్లుంటయ్‌’’ అని కడుపుల నుండి వచ్చే ఏడుపు ఆపుకుంట అడిగిండు. 
నందుగాడ్ని పొత్తిల్లకద్దుకొని ఆడి నుదురు ముద్దాడి ‘‘తిరుపతి మావోళ్ళింట్ల నువ్‌ టీవీ జూత్తవ్‌గదా. ఆండ్ల పాత సిన్మాల్లత్తయి... గా బొమ్మలు కలర్లుంటయా? నాగేశ్వరరావు బొమ్మ, ఎన్టీఆర్‌ బొమ్మ, సావిత్రి బొమ్మ ఎంత మంచిగుంటయ్‌. నువ్‌ గట్నే దించు’’ అని సముదాయించింది. నందుగాడికి కొంచెం రైటే గదా అనిపించింది. ‘‘అమ్మ ఆకలే’’ అన్నడు.
ఆ రాత్రి జోరువాన మొదలైంది. తెల్లారదాక ఎడతెరిపి లేకుండా కొట్టుడు వెట్టింది. నందుగాడు పొద్దుగాల్నే లేసి తానం జేసి తయారయిండు. పెన్సిలు కోసం ఆడి పుస్తకాల సంచిల ఎతుకుతాండు. పుస్తకాలన్నీ దీసి సంచి దులుప్తే రెండు ఇరిగిపోయిన మొండి పెన్సిల్లు దొరికినయ్‌. జంగుపట్టిన బ్లేడు తీసి పెన్సిల్‌ చెక్కుతుంటే పుసుకున్న ఏల్దెగింది. అమ్మా అమ్మా అని మొత్తుకుంటే అటంట్ల నుంచి లచ్చువమ్మ ఉరికచ్చింది. రక్తం జల జల కార్తంది. ‘‘పెన్సిలు నేను చెక్కపోదునా... ఆగనే ఆగవ్‌! బయట ముసురు వెడ్తంది. వానల ఏడవోతవ్‌. ఎల్దెగ్గొట్టుకున్నవ్‌ ఇగ బొమ్మలెట్ల దించుతవ్‌’’ అని మందలించుకుంట పసుపు రాసి గుడ్డ పేగ్గట్టింది. చెంపల మీద గార్తున్న కండ్ల నీళ్ళు తుడుసుకుంట ‘‘పెన్జిలెక్కీయ్‌’’ అని అన్నడు. ‘‘ఇంత మొండోనివి నా కడుపున ఎట్ల పుట్టినవ్‌రా’’ అనుకుంట పెన్సిల్జెక్కింది.
ఆ ముసుర్లనే నందుగాడు బడికివోయిండు. పెన్సిలు, అట్టప్యాడు తడువకుండా వరక్కాయిదాంల సుట్టిండు. బడికివొయేసరికి ఎవ్వల్లేరు. తాళం గూడ తీయలే. బడి వరండాల నిలవడి తల మీద తడవకుండేసుకున్న జమ్ముఖానా పక్కకు వెట్టిండు. 
డ్రాయింగు సారు చెత్తిరి పట్టుకొని మెల్లగ సైకిల్‌ మీదచ్చిండు. ‘‘ఏందిరా... ను ఒక్కవనివే అచ్చినవా ఇంకా ఎవ్వల్‌రాలే’’ అనుకుంట సైకిల్‌ స్టాండేసి బడి వరండాలకచ్చి చెత్తిరి ముడిసిండు. నందుగాడు ఎవ్వల్‌రాలే అన్నట్లు తలూపిండు.‘‘ఏలెట్ల తెగ్గొట్టుకున్నవ్‌.. బొమ్మెట్ల దించుతవురా అనడిగితే నందుగాడు సప్పుడు జేయక నిలవడ్డడు. ‘‘గీ ముసుర్ల పిలగాండ్లెవలచ్చెటట్టు లేదు, టైం అయితంది. నినొక్కనన్న తీసుకవోతే పెద్దసారు ముంగట నా పరువన్న నిలవడ్తది’’ అనుకుంట సైకిల్‌ మీద గూసుండ వెట్టుకొని చెత్తిరి పట్టుకోమన్నడు. 
బాలభవన్‌ల గూడ పిలగాండ్లెక్కో రాలే. పెద్ద తరగతి పిలగాండ్లే అచ్చిండ్రు. అందర్ని ఒకే రూంల గూసుండ వెట్టిండ్రు. ఆడ ఓ బల్ల మీద కూజా, కూజా పక్కన గ్లాసు వెట్టి అందర్నీ అదే దించుమన్నరు. నందుగాడు వాళ్ళిచ్చిన తెల్ల కాయితం అట్ట ప్యాడుకు వెట్టి పెన్సిల్‌తో బొమ్మ దించుడు వెట్టిండు. తెగిన ఏల్తో తంటాలు వడుకుంటా అద్దగంటల బొమ్మేసిండు. చుట్టుజూత్తే కలర్‌ పెన్సిల్లు, కలర్‌ సీసాలు, కలర్‌ బ్రష్షులు వట్టి పిలగాండ్లందరు బొమ్మలేత్తుండ్రు. రూం నిండా ఎటు జూసిన రంగులే. కిటికీ నుండి జూత్తే ముసురు గూడ ఇడిసింది. సూర్యుడు మబ్బుల సాటు నుండి నిక్కి నిక్కి జుత్తండు. గదేందో గని గప్పుడు నందుగాడికి ఆకాశంల గూడా రంగులు కన్పించినయి. ఆడేసిన బొమ్మ మాత్రం టీవీల పాత సిన్మ లెక్కుంది. 
నాల్రోజులైనంక నందుగాడు బల్లేకత్తుంటే సూరిగాడెదురొచ్చి ‘‘అరేయ్‌ నీ పేరు నోటీస్‌ బోర్డ్‌ల రాసిండ్రురా. డ్రాయింగ్‌ పోటీల నీకు సెంకడు ప్రైజ్‌ అచ్చిందిరా’’ అన్నడు. నందుగాడు పుస్తకాల సంచి ఆడికిచ్చి నోటీస్‌ బోర్డ్‌ దగ్గరికురికిండు. ‘‘జి.నందు జిల్లా స్థాయి డ్రాయింగు పోటీలో రెండవ బహుమతి’’ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది. గప్పుడే ఆడికొచ్చిన డ్రాయింగు సారు ‘‘నందుగా నువ్‌ నక్కన్‌ తొక్కినవ్‌రా. జూనియర్లల్ల ఇద్దరు పిల్లగాండ్లే పోటీలో పాల్గొన్నర్రా. శారదా స్కూలోడికి ఫస్ట్‌ ఫ్రైజ్, నీకు సెకండ్‌ ఫ్రైజ్‌. బడి పరువు నిలబెట్టినవ్‌రా వారి’’ అని నందుగాన్ని శభాష్‌ అన్నడు. గప్పుడు నందుగాడి మొకంలో వెలిగిన రంగులు డ్రాయింగు సారు బ్రష్‌ గూడ అందయ్‌. గదేందో బడి పక్కనున్న గుడి మైకుల నుంచి గప్పుడే  ఘంటసాల కుష్ణుడి గీత గురించి జెప్తుండు. ‘‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా’’!!.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam