సహస్ర శిరచ్ఛేద అపూర్వ ఆంగ్లమణి

  • 370 Views
  • 80Likes
  • Like
  • Article Share

    కుప్పిలి సుదర్శన్‌

  • పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
  • 9493290290
కుప్పిలి సుదర్శన్‌

అమ్మ నోటి మాట ఆయువిచ్చిన చోట
ఊడబెరకనేల ఊరుకోక
కోరిదెచ్చి మాకు కొరివిబెట్టగ బోకు
వింత మాట కొరకు పంతమేల
నాదగ్గరికి
నువ్వొచ్చి అడిగితే నేను ఈ కథ చెబుతానన్నమాట. విను..
      పరమానందయ్య వాంతి చేసుకున్నాడు పరమ సౌందర్యంగా. అప్పుడే మింగిన నాలుగు ఇంగ్లీషు అక్షరాలు ఇమడలేక హాహాకారాలు చేస్తూ నేల మీద పడ్డాయి.
      అతనికిది ఒకటోసారి కాదు. ఏ వందోసారో! ఇంగ్లీషు స్టేషనులో చెప్పిందేదీ ఆయనకు జీర్ణం కావట్లేదు. టన్నులకొద్దీ గ్రామరు గుళికలు నూరి పట్టిస్తున్నా ఉపయోగం లేకపోయింది. అప్పటికీ పరమానందయ్య పద్యాలు వల్లించకుండా పథ్యం పడుతూనే ఉన్నాడు. బహుశా కడుపులో స్థిరావాసం ఏర్పాటు చేసుకున్న వాతాపికి కూడా ఆంగ్లం వచ్చేసే ఉంటుంది. సమస్యేంటో అర్థం కావట్లేదు పాపం! ఎలిమెంటరీ టీచరు అన్న పేరు కాస్తా ఎలిమెంటల్‌ టీచరుగా ముద్ర పడుతుందేమో అని బెంగతో వంగి కుంగి కృశించిపోతున్నాడు.
      వాంతికి ఓదార్పు ముగిశాక చిన్ననాటి స్నేహితుడు గ్రామర్‌దాసుతో తన బాధ పంచుకోవాలని బయల్దేరాడు. 
      గ్రామర్‌ దాసు అసలు పేరు జి.రామదాసు. వాళ్ల నాన్నగారు ఇంగ్లీషు మాధ్యమంలోకి మార్పించినప్పుడు రిజిస్టరులో పొరపాటున జి పక్కన చుక్క చెగిరిపోయింది. అక్కడి హాజరుపట్టీ ప్రకారం అంతా గ్రామదాసు అనేవారు. పెద్దయ్యాక అంకెల శాస్త్రవేత్తలు ఎమ్‌ పక్కన ఎమ్‌ అనే మరో అక్షరం కలిపితే మంచిదన్నారు. అది కలిపాక ఎక్కడన్నా మరో ఆర్‌ పెట్టుకోమన్నారు. కానీ అది ఎక్కువ ఒత్తి పలకవద్దని, మూకాక్షరంగా ఉంచమనీ చెప్పారు. ఇంగ్లీషులో కార్‌ను ‘కాఁ’ అని కాకిలా అరిచి చెబితే చాలని చెప్పి, తన పేరునూ అలాగే పిలిపించుకోమని చెబుతూ తల ఊపమన్నారట. అలా చివరికి ఆ పేరు గ్రామ(ర్‌) దాసు అయింది. అందరూ గ్రామర్‌దాసు అని పిలుస్తుండటంతో ఆయన మొహమాటానికి ఇంగ్లీషులో ఎమ్మే, ఎమ్‌ఫిల్, పీహెచ్‌డీ చదవాల్సివచ్చింది. ఎవరైనా ఏదైనా అడిగితే ఇంత పేరున్నందుకు ఇంగ్లీషులో చెప్పకపోతే ఎలా మరి. పైగా ఆయన చేస్తున్న వ్యవసాయానికి చెడ్డపేరు రాదా?
      అలాంటి గ్రామరుదాసు ముందు నాలుగు మూలుగులు మూలిగిన తర్వాత అయిదో మూలుగును ఏడుపుగా మలిచే ప్రయత్నం మొదలుపెట్టాడు పరమానందయ్య. గ్రామరుదాసు అతని దృష్టిలో విష్ణుశర్మలాంటివాడు. అన్నింటికీ హితబోధ చేయగల సమర్థుడని అనుకుంటూ ఉంటాడు. అయితే ఈసారి గ్రామరుదాసు వికారంగా మొహం పెట్టుకుని ‘నీకీ శాస్తి జరగాల్సిందే..’ అంటూ దెప్పిపొడిచాడు.
      ‘నేనేం చేశానూ?’ అన్నట్టు ప్రెజెంటెన్సులో మొహం పెట్టి ప్రశ్నార్థకాన్ని భూతకాలంలోకి అనుమానంగా విసిరేశాడు పరమానందయ్య. ఏం చేశాడో ఏమో.. ఏమీ గుర్తుకురాలేదు.
      ‘ఇంగ్లీషులో చదూకోరా అని పేరెట్‌కి చెప్పినట్టు చెప్పానా లేదా? నువ్వు పేడ చెవిన పెట్టావ్‌..’ అన్నాడు గ్రామర్‌.
      ‘పెడచెవిన అనాల్రా గ్రామరూ..’ అన్నాడు పరమానందయ్య అంత బాధలోనూ వాక్యాన్ని సరి చేస్తూ.
      ‘అదిగో మళ్లీ.. గ్రామరూ ఏంటీ? ఆ చివర ‘రూ’ని అలా ఈడ్చేవంటే రోట్లో నీ టంగు పడేసి చితక్కొడతా. నాది ఇంగ్లీషు పేరు. నీలాగ ఆవకాయ పేరేమీ కాదు.. ఆ చివర ఆర్‌ను పుండు మీద ఆయింట్‌మెంట్‌ పూసినట్లు సుతారంగా పలకాలి.. నాలిక కొంచెం అదుపులో పెట్టుకో.. కుదరదూ అనుకుంటే దాని అంచులు కత్తిరించుకో..’ అంటూ రంకెలేశాడు 
      ‘అబ్బా.. నీ పేరు సంగతి సరే. నా ప్రారబ్ధం సంగతి చూడరా నాయనా..’ అంటూ తల లిప్కో నిఘంటువు మీద వాల్చేడు పరమానందయ్య.
      ఒక్క క్షణం మౌనం పాటించి, ‘ఊహూ.. కుదరదు..’ అన్నాడు గ్రామర్‌.
      ‘ఏఁ..ం?’ ప్రశ్నించాడు ఒక్క మార్కులో పరీక్ష తప్పిన మొహంతో.
      ‘నీకు ఆంగ్ల గ్రంథులు లేవు..’ జవాబిచ్చాడు నివాళిలాగ.
      పరమానందయ్యకి కన్నీరు కార్చిచ్చు కింకరులు కీడు వంటి క గుణింతంతో మొదలయ్యే పదాలన్నీ కళ్లముందు తిరిగాయి. గ్రామర్‌ చెప్పిన హేమర్‌లాంటి మాట నిశ్చేష్టుణ్ని చేసింది.
      ‘నాకీ జన్మకి ఇంగ్లీషు రాదన్నమాట.. ఇక నాకు ఆత్మహత్యే శరణ్యం..’ అనుకుంటూ బయటికి నడిచాడు పరమానందయ్య. అతనికి దారిలో మరో పరమానందయ్య ఎదురయ్యాడు. ఇతని లాగే ఉన్నాడు. అచ్చం ఇతనిలాంటి అవస్థే అన్నట్టు ఉందాయన మొహం కూడా. ఏంటీ కథా అని మాత్రం ఒకరినొకరు అడుక్కోలేకపోయారు. 

* * *

      మర్నాడు వేమన పాఠం చెప్పాలి. ఇంగ్లీషు మీడియం పిల్లలకి. దానికోసం ఆంగ్ల వ్యాకరణం పుస్తకాలు ముందేసుకుని ఎలా మాట్లాడాలో సాధన చేశాడు.
      ‘టుడే ఐ టీచ్‌ వేమన పోయెం. కాదు.. నో... నో పోయెం. ఇట్‌ ఈజ్‌ పద్యం. ఫోర్‌ లైన్స్‌. లిజన్‌.. ఉప్పు కప్పురంబు ఒక్కపోలికనుండు...’
      ‘ఎక్స్‌క్యూజ్‌ మీ సార్‌.. వై యు ఆర్‌ సేయింగ్‌ ఉప్పు? డోన్ట్‌ యూ నో వాట్‌ ఇట్‌ ఈజ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌?’ ఓ పిల్లాడు శల్యుణ్ని గుర్తుచేశాడు. ప్రతిసారీ వాడే పాఠానికి అడ్డు తగుల్తాడు. పీకల్దాకా కోపం వచ్చేసింది. సుద్దముక్క మాత్రమే విరవగలిగాడు.
      పాఠ్యబోధన మునుపటిలా సాగట్లేదు. సీసీ కెమేరాల పర్యవేక్షణ ఉంది. దానికి ఎమ్‌ఈవో కార్యాలయంతో అనుసంధానమూ ఉంది. ఇప్పుడీ తప్పు ఎంతటి ముప్పును తెస్తుందో అని గడగడలాడిపోయాడు పరమానందయ్య. 
      ఇంతకుముందు ఓసారి ఎవరో కుర్రాడు.. తెలుగు పద్యం వల్ల తన నాలుక తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని, ఇది మానసిక హింస అనీ ఫిర్యాదు చేస్తే.. పద్యాలు ట్రాన్స్‌లేట్‌ చేసి ఇంగ్లీషులో చెప్పాలని నిబంధన చేశారు. 2050వ సంవత్సరంలో అదో సంచలనం అయింది.
      పరమానందయ్య ఆలోచనల్లో ఉండగా అతని ఫోనూ, బడి గంటా ఒకేసారి మోగాయి.
      ఫోన్లో అటువైపు ఎమ్‌ఈవో! భయంకరమైన వెర్బ్‌ ఏదో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు.
      ‘నమస్కారం.. చెప్పండయ్యా..’ అన్నాడు పరమానందయ్య.
      ‘వరస్ట్‌ ఫెలో.. వాట్‌ ఆర్యూ టీచింగ్‌?’ అన్నాడు దరిద్రానికి సూపర్‌లేటివ్‌ ఫామ్‌ వాడుతూ.
      ‘హ్హు.. ఒక ఉపాధ్యాయుడితో ఎలా మాట్టాడాలో వీడికెలా తెలుస్తుంది? తెలుగులో వీడు చదువుకుని ఏడిస్తేగా.. ఏం చెప్తాను వీడి వాక్యం.. వీడి వ్యాకరణం.. వీడి కర్తరీ వాక్యాలూ నా కర్మణీ వాక్యాలూ..’ అని మనసులో అనుకుంటూ ‘ఐ విల్‌ ఇంప్రూవ్‌ సార్‌..’ అన్నాడు నెమ్మదిగా పరమానందయ్య. ఆయనే ఫోన్‌ కట్‌ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఎదురుగ్గా మళ్లీ పరమానందయ్యలాంటోడే ఎవడో.. ఎమ్‌ఈవో ఫోన్‌ చేసినప్పుడల్లా కనిపిస్తుంటాడు. అతన్ని పిలుద్దామనుకున్నా నిరాసక్తత.. ఎందుకో!
      నిజానికి పరమానందయ్యకి దిస్‌ మచ్చో దట్‌ మచ్చో ఇంగ్లీషు వచ్చు. కానీ తెలుగు పాఠాన్ని ఇంగ్లీషులో బోధించడంలోనే అతని ఇబ్బందంతా. పెనం మీద ఉప్మా చెయ్యమన్నట్టూ, కుండలో పెసరట్టు వెయ్యమన్నట్టు ఉంటుందని బాధపడతాడు. తెలుగు భాషంటే అతనికి అపారమైన ప్రేమ. అమర ప్రేమ. ప్రేమ కథలు విషాదాంతాలైతేనే రక్తి కడతాయంటారు. పరమానందయ్యకి తెలుగుమీద ఉన్న ప్రేమ కూడా విషాదాంతం అయిపోయింది. ఇప్పుడు తెలుగు పుస్తకాలు గ్రంథాలయాల్లో మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడూ వెళ్లి చూసి వస్తుంటాడు. తెలుగు పాఠాలు కూడా ఇంగ్లీషు అక్షరాల్లోకే మార్చేయడంతో వర్ణమాలను బండరాయితో మోది చంపేసినట్టు అనిపించింది అతనికి. అయినా ఉపాధ్యాయుడిగా ఉన్నాడంటే అది అతని చిన్నప్పటి చదువువల్ల అబ్బిన సంస్కారం అనే చెప్పాలి. ఇరవై రెండో శతాబ్దంలో దీనికి టెల్మోఫీలియా అనే మానసిక రుగ్మతగా పేరు పెట్టారు. తెలుగు మాధ్యమం మీద వెర్రి మమకారాన్ని పెంచుకుని తెలుగులో మాట్లాడుతుండటం ఈ జబ్బు లక్షణం అని చెబుతుంటారు.
      ఇంగ్లీషు నేర్వనిదే సంసారం చెయ్యలేని పరిస్థితుల్లో పరమానందయ్య ఇంగ్లీషు స్టేషన్‌లో చేరాడు. భార్య కూడా విడాకులు ఇస్తానంది, అస్తమానూ తెలుగులో వాగుతున్నాడని! అటు ఉద్యోగమూ పీకేస్తామని అన్నారు, ఇంగ్లీషులో వాగలేకపోతున్నాడని!!
      మాస్టారికి ఇంగ్లీషు రాదని మూడు టెన్సుల్లోనూ పిల్లలు కూడా గుసగుసలాడుకోవడం మొదలెట్టారు. మనో వేదనకి మూడు నాలుగు ఏడ్జెక్టివ్‌లు తగిలించుకోవడం తప్ప పరమానందయ్య ఏమీ చేయలేకపోయాడు. ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా.. ఆంధ్రమ్ము కాదు.. ఆంగ్లమ్ము అని మార్చారు కదరా.. అనుకుని గత శతాబ్దిని నెమరువేసుకోవడం అలవాటైంది.
      ఓరోజు గ్రామర్‌దాసు అనుకోకుండా టెలుగు మాట్లాడుతూ పరమానందయ్యను పరమాంగ్లయ్య అని ఉచ్చరించాడు.
      ‘ఏమన్నావూ..’ అన్నాడు జలదరింపుతో పరమానందయ్య. 
      గ్రామర్‌దాసు పెదవి మీద చిరునవ్వు.. ‘ఆంగ్ల యోగిలాంటి నా నోట నీ నౌను ఇలా వచ్చిందంటే నీకు ఏదో శుభం జరగబోతోంది.. అవును. నువ్వు పరమానందయ్యవి కాదు.. పరమాంగ్లయ్యవి. ఏదీ.. అను.. మై నేమీజ్‌ పరమాంగ్లయ్య.. సే ఇట్‌..’ అన్నాడు నేస్తం భుజాలు ఊపుతూ.
      ‘ఎలా అనగలిగేవ్‌ ఆ మాట.. నా నాలుక చచ్చినా ఒప్పుకోదు. నా పేరు మార్చడానికి వీల్లేదు.. అన్నాడు పరమం.
      ‘నాలుక చావక్కర్లేదు. మాట్లాడేటప్పుడు నాలుక కదపకుండా ఉంచు. తెలుగు మాట్లాడినట్లు పదేపదే దాన్ని ఊపకు. అదే ఆంగ్లోచ్చారణకు ఆదిమంత్రం. అన్నాడు గ్రామరు.
      ఒకసారి పలికాడు. పరమాంగ్లయ్య అని. జీవితం దుర్భరమనిపించింది. నాలుకకు బాండ్రుకప్ప కరిచి పట్టుకున్నట్టు తుళ్లిపడ్డాడు. దండం పెట్టి ఇంటికి వచ్చేశాడు. 

***

      రోజులు టెన్సులు మార్చుకుంటూ దొర్లుతున్నాయి. పరమానందయ్య అటు ఇంగ్లీషు స్టేషన్‌లో ఏదీ అప్పజెప్పలేక హీనమైన హెల్పింగ్‌వెర్బులతో తిట్లు తింటున్నాడు,. ఇటు ఇంట్లో పెళ్లాం ప్రతి వాక్యంలోనూ ఏడ్‌వెర్బులు వేసి వేధించడాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. 
      ఒకోసారి అనిపించేది.. ‘తెలుగు వల్లే ఇంత నీచమైన బతుకు అయిపోయిందా అని’. వెంటనే, ‘కాదు.. విద్యావ్యవస్థలో తెలుగును అప్పటివాళ్లు నిర్లక్ష్యం చేయబట్టే ఇలా జనం తయారయ్యార’ని జవాబిచ్చుకునేవాడు. సంస్కృతాన్ని శాన్స్‌క్రిట్‌ అనీ బొంబాయిని బాంబే అనీ గోదావరిని గొడేవ్రీ అనీ అన్నప్పుడు...  చెప్పుచ్చుకుని మూతి మీద కొట్టేవాడు లేకపోవడం వల్ల ఇప్పుడు నాలుకలమీద ఇంగ్లీషు కప్పలు వేలాడుతున్నాయని ఎన్నిసార్లు అనుకున్నాడో. అలా అనుకున్న ప్రతిసారీ తనలాంటివాడే తనకి ఎదురయ్యేవాడు. ఈసారీ ఎదురవుతూనే ‘ఎవరు నువ్వు’ అని పరమానందయ్యనే అడిగాడు. 
      పరమానందయ్య ఆశ్చర్యపోయాడు. ‘నేనూ.. పరమానందయ్యని.. పాఠాలు చెబుతుంటా..’ అన్నాడు.
      ‘నీక్కూడా ఇంగ్లీషు రాదా..’ అన్నాడు వేరే పరమానందం.
      ‘అంతగా రాదు.. అయినా చిన్న పిల్లలకి పాఠాలు తెలుగులో చెప్పకుండా ఇంగ్లీషులో చెప్పడం ఏంటి? సుబ్బరంగా ఏ పాఠాన్నైనా వివరించాలంటే మాతృభాషే సరైందని ఎంత మంది గగ్గోలు పెట్టారూ? తెలుసుగా..’ అన్నాడు.
      ‘తెలుసు. కానీ ఇప్పుడేం చేస్తాం. అప్పుడే ఎవడో సరి చేసి ఉండాల్సింది..’ 
      ‘అప్పుడు ఫోన్లలో తెలుగు అక్షరాలు ఒత్తుకునేవారట. ఇప్పుడు ఆ భాషా సౌకర్యం లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే కసితీరా తిట్టడానికి, మనస్ఫూర్తిగా ఏడవడానికి తప్ప తెలుగు పనికిరావట్లేదు..’ వాపోయాడు పరమం. 
      ‘నువ్వూ నాలాంటి వాడివే.. నువ్వో జోగీ నేనో జోగీ.. రాసుకుంటే అ ఆ లు రాలతాయి. ఎవడికీ పనికిరావు..’ అన్నాడు వేరే పరమానందయ్య.
      ‘అప్పటి కాలంలో నేనుంటే.. పచ్చడి చేద్దును..’ ముక్కు పుటాలెగరేశాడు.
      ‘ఉంటావా?’
      ‘ఏంటి నువ్వనేది?’
      ‘ఉంటానంటే చెప్పు.. మనలాంటివాళ్లు ఇంకా తొమ్మిదివందల తొంబై ఎనిమిదిమంది సిద్ధంగా ఉన్నారు. చెప్పు.. ఏమంటావ్‌..’
      ‘నవ్వులాటగా ఉందా? ఏం మాట్లాడుతున్నావ్‌?’
      ‘పిల్లలకి ఇంగ్లీషులో అక్షరాభ్యాసాలు నవ్వులాట కాదు.. నువ్వెప్పుడొస్తావా అని మనవాళ్లంతా ఎదురు చూస్తున్నారు. ఇదంతా నిజం కావచ్చు.. కాకపోవచ్చు.. తెలుగు భాష కోసం నువ్వు వెనక్కి వస్తావా..?’ స్వరం పెంచాడు.
      ‘వస్తా.. ఏం చేయాలి..’
      ‘అందరం వచ్చి చెబుతాం.. పడుకో...’ అంటూ వెళ్లిపోయాడు.
      తనలో తాను ఏం ప్రశ్నించుకోవాలో తెలీక అవ్యాకరణుడై నిలబడిపోయాడు పరమానందయ్య. అతనిలో ప్రశ్న.. నా వయసెంత? నాకేమైంది? అని కాదు.. తెలుగు ఇంత దయనీయంగా మారిపోయిందేంటి? అని మాత్రమే.

***

      నిద్రలో నిద్ర పట్టనట్టుగా నలత. కలత.. వ్యాకులత.
      అర్ధనిద్రలో వారందరూ వచ్చారు. వారిలో గ్రామర్‌దాసు, ఎమ్‌ఈవో, ఇంకా తెలిసినవాళ్లూ.. పిల్లలూ.. అందరూ!
      పరమానందయ్యకి ఏమీ అర్థం కాలేదు.
      ఎవరైనా విషయం చెబుతారా అని అందరివైపు అయోమయంగా చూస్తూ తప్పుడు ప్రిపోజిషన్స్‌ వాడిన వాక్యంలా నిలబడ్డాడు.
      కాసేపటికి ఉప్పు కప్పురంబు ఇంగ్లీషులో చెప్పమన్న పిల్లాడి ముందు మోకరిల్లాడు. 
      వాడి గడ్డం ఎత్తి ‘ఎవరునువ్వు?’ అనడిగాడు.
      ‘పిల్లల్ని మమ్మీడాడీ అనమన్నావ్‌.. అదొక గొప్ప సంస్కృతి అనుకున్నావ్‌. గుర్తుందా.. ఉఁఫ్ఫ్‌... నేను ఆ రోజు చచ్చిన నీ ఆత్మ..’ అన్నాడు.
      బిత్తరపోయాడు బలమైన ఇంటర్‌జెక్షన్‌ దెబ్బకి. అదే తడబాటులో ఎమ్‌ఈవో వైపు చూశాడు. 
      ‘తెలుగువాడికి కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీషులో రాశావు. ఆఖరికి ఫుడ్డనీ వాటరనీ ప్లేటనీ పెన్ననీ పేపరనీ బుక్కనీ బర్తనీ డెత్తనీ నాలుకంతా పచ్చపొడిపించుకున్నావే.. అప్పుడు చచ్చిన నీ ఆత్మ నేనే..’ అన్నాడాయన.
      ఇంతలో గ్రామర్‌దాసు నిదానంగా భుజం మీద చెయ్యేశాడు. ‘నేనెవరో గుర్తులేనా.. ప్లీజ్‌ వెయిట్‌రా.. వన్‌ మినిట్‌రా.. ఓ షిట్‌రా.. ఓకేరా.. వాట్‌నెక్స్ట్‌రా.. ఇలా ఎన్నెన్నిసార్లో నీలో జరిగిన ఆత్మహత్యల్లో ఆత్మ నేనేరా..’ అన్నాడు.
       పరమానందయ్యకి మాట రాలేదు. కంటి నుంచి ప్రెజెంట్‌ కంటిన్యూస్‌ టెన్సులో కన్నీరు.
      ‘మేమంతా ఎవరో కాదు.. నీ మాటల్లో, వంటల్లో, రాతల్లో, కోతల్లో, ఆటల్లో పాటల్లో, ఆచారాల్లో వ్యవహారాల్లో, ఉద్యోగంలో, ఉపాధుల్లో, పెంపకాల్లో, చదువుసంధ్యల్లో చచ్చిపోయిన నీ తెలుగుదనపు ఆత్మ తునకలం..’ ఒకడి మాటల్లో అనంత శూన్యం. 
      ఏం ఆలోచించాలో తెలియలేదు పరమానందయ్యకి. తనేం చేశాడో గుర్తుకు రావట్లేదు.
      ‘నేను నా భాషకు అంత అన్యాయం చేశానా?’ నిర్లిప్తంగా అడిగాడు.
      ‘వెయ్యి ముక్కలైన నీ ఆత్మభాష అందుకు సాక్ష్యం కాదా?’ అన్నాడొకడు.
      ‘అయినా ఇలా ఒక్కసారిగా ఎలా జరిగింది? అంచెలంచెలుగా నేనూ నా భాషా చచ్చిపోయామా.. మళ్లీ ఇలా కలవడం ఎలా సాధ్యం?’
      ‘అంతా నువ్వు తెచ్చిపెట్టుకున్నదే..’
      ‘నేనా.. ఏంటది?’ అన్నాడు గుటకపడక.
      ‘నువ్వు నెత్తిన పెట్టుకున్నది సహస్ర శిరచ్ఛేద అపూర్వ ఆంగ్లమణి! దాన్ని అవసరానికి వాడాలి. నువ్వు అడుగడుక్కీ వాడావు. ఇలా జరిగింది. అందుకే ఈ దురవస్థ’ అన్నాడు మరొకడు.
      ‘ఆంగ్లమణి’ పేరు వినగానే తన జీవితం కళ్లముందు కదలాడింది. 
      మాతృభాష మరిచిపోయిన అవస్థకు తన మీద తనకే జుగుప్స కలిగింది. తెలుగు భాషతో ప్రగతి లేదని అనుకున్న మూర్ఖపు సిద్ధాంతాన్ని తనపై తానే రుద్దుకున్న తీరుకు ఏమనుకోవాలో తెలియట్లేదు.
      ‘ఆంగ్లమణి.. అంతా మాయ.. లక్షల్లో తలకాయలు ఎగరగొట్టే ఉంటుంది. ఇది వ్యవస్థలో ముసలం. తెలుసుకోలేకపోయా’ అన్నాడు నిట్టూరుస్తూ పరమానందయ్య.
      ‘అయితే రా.. కలిసి నినదిద్దాం..’ ఆత్మ సంగమం.. ఆత్మీయ సంగమం.. అందరూ పిడికిళ్లు బిగించారు. 
      ‘నా జాతి కోసం.. నా భాష కోసం పోరాడతాను... నా జాతి.. నా భాషా.. నా జాతి.. నా భాషా..’
      పరమానందయ్య నిద్రలో కలవరింతలు.
      విస్తుపోతూ ఆయన భార్యామణి వనజాక్షి కాఫీగ్లాసుతో చురక అంటించింది.
      దబ్బున నిద్రలేచాడు ప్రిన్సిపాల్‌ పరమానందయ్య. కళ్లు పులుముకుంటూ.. ‘ఐ హేడ్‌ ఎ వరస్ట్‌ డ్రీమ్‌.. వనం. జస్ట్‌ లైక్‌ దిస్‌ కాఫీ’ అంటూ రుచిలో ఎగటును మొహంలో చూపించాడు.
      దూరంగా ఆయన స్థాపించిన ఇంగ్లీషు మాధ్యమ పాఠశాల నుంచి పాట వినిపిస్తోంది.. ‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండా.. మా కన్న తల్లికీ మంగళారతులూ..’ 
      ఇదీ కథ.
      నువ్వెలాగూ నాలాంటి అనామకుల్ని కలవవు. కాబట్టి నేను నీకు ఈ కథ చెప్పే ప్రసక్తే లేదు. ఒక వేళ కలిస్తే తెలుగు భాషలో తీయదనం గురించి ఏదన్నా కాకమ్మకథ చెబుతాలే.

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam