విప్రయోగి

  • 138 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పి. వి. ఆర్. శివకుమార్

  • *
  • ముంబయి
  • 9594996990
పి. వి. ఆర్. శివకుమార్

కథా విజయం-2019, రూ.2000 బహుమతి కథ  
విషయంలో రాజారావుతో పోటీపడుతున్నాడు సుబ్బారావు. ప్రతీసారి ఓడిపోతూనే ఉన్నాడు. తన ఓటమి కన్నా ప్రత్యర్థి గెలుపు తనను ఇంకా బాధిస్తోంది. ఆ కడుపుమంటను చల్లార్చుకోవడానికి అతనేం చేశాడు?
      పిల్లిలాగా నెమ్మదిగా మేడ మెట్లు దిగాడు సుబ్బారావు. అడుగులో అడుగు వేసుకుంటూ, గేటు దాకా వెళ్లాడు. చప్పుడు కాకుండా గేటు బార్లా తెరిచాడు. తను వెళ్లి గేటుకి ఇటువైపు ఉన్న బోగన్‌ విల్లా పొద వెనక నక్కాడు.
      ‘గేటు తెరిచి ఉంటే, లోపలి మండువా అంతా స్పష్టంగా కనిపిస్తుంది. నేను మండువాలో కనిపించక ధీమాగా వెళ్లబోతాడు పద్మారావు. వాడు గేటు ముందుకు రాగానే చటుక్కున బయటపడి, ఎదురెళ్లి, వాణ్ని గబుక్కున పట్టుకోవచ్చు’
      అదీ ఇవాళ్టికి సుబ్బారావు పథకం. ఒక నిమిషం గడిచింది. కాలి మీద ఏదో పాకుతున్నట్లనిపించింది సుబ్బారావుకు. చూసుకోబోయాడు. దూరంగా వరండాలో ఇంటివారి ఇంతి వస్తూ, కనిపించింది.
      ‘‘ఏ వెధవో గేటు బార్లా తెరిచి పోయాడు’’ విసుక్కుంటూ, విసవిసా వచ్చి, దఢాలున గేటు మూసేసింది ఇంతి. బిక్కచచ్చి, పొద వెనుక కూర్చుండిపోయాడు సుబ్బారావు. ఇదే అదనుగా అతడి కాలి మీదికెక్కిన గండు చీమల మిథునం ముద్దాడుకోబోయి, అతడు కదలటంతో తడబడి, గురిచెడి, అతగాడి పిక్కని చెరోవైపు నుంచీ ముద్దాడాయి. కెవ్వుమనబోయిన సుబ్బారావు జేబు రుమాలు తీసి నోటినిండా కుక్కుకుని స్వరపేటికని సముదాయించాడు- ‘ఆనక అరుద్దువుగానివమ్మా! ఇప్పటికిలా సర్దుకో’ అంటూ.
      ఇంటివారి ఇంతి నిష్కమ్రించింది. కాళ్లు, చేతులు దులుపుకుంటూ లేచి నిలబడ్డ సుబ్బారావు, అప్పుడే మలుపు తిరిగిన పద్మారావుని చూసి హఠాత్తుగా ముందుకి దుమికాడు. తడబడ్డ పద్మారావు, మరో దారి లేక ఆగిపోయాడు. 
      ‘‘నాకేం లేవు కదూ’’ తీవ్రంగా చూస్తూ అడిగాడు సుబ్బారావు. 
      తల వూపాడు పద్మారావు.
      ‘‘రాజారావుకి ఉన్నాయి కదూ?’’
      ‘‘రెండు’’ తల రెండు సార్లు నిలువునా ఊపాడు పద్మారావు. 
      ‘‘సరిగ్గా చూశావా?’’ 
      ‘‘రిజిస్టర్లో రాసి తెస్తాం’’ రోషంగా అన్నాడు పద్మారావు.
      ‘‘నేనోసారి నీ సంచీ అంతా చూస్తాను’’ గదమాయించాడు సుబ్బారావు.
      ‘‘రూల్సు వొప్పవు. కంపెనీ వాళ్లు నన్ను పాతేస్తారు’’ జవాబు చెబుతూనే, గబుక్కున పక్కకు వంగి, తప్పించుకుని, రాజారావు ఇంటివైపు పారిపోయాడు, కొరియర్‌ బాయ్‌ పద్మారావు. 
      నిరాశగా నిట్టూర్చి, ఉక్రోషంగా రాజారావు ఇంటివైపు చూసి, నీరసంగా కాళ్లీడ్చుకుంటూ, గేటు లోపలికి నడిచాడు సుబ్బారావు. 
      ‘‘గేటు సరిగ్గా మూసి, గడియ తగలెయ్యి. ఇందాక ఎవడో దగుల్బాజీ గేటు బార్లాగా తెరిచిపెట్టి పోయాడు’’ అరిచింది హాల్లోంచి చూసిన ఇంతి. 
      కసిగా గేటు మూసి, గట్టిగా గడియ పెట్టి, గబగబా మెట్లెక్కిపోయి, విసురుగా మంచమ్మీద వాలబోయాడు- చటుక్కున పక్కకి జరిగింది దిండు, అతనెక్కడ మళ్లీ ఇన్ని కన్నీళ్లతో, తనని తడిపి తగలేస్తాడోనన్న శంకతో!
      ‘వొస్తున్నాయొస్తున్నాయ్‌- జగన్నాథ రథ చక్రాలు’ 
      పండగ దగ్గర పడటంతో, ఇరుగు పొరుగు తెలుగు రాష్ట్రాల పత్రికలు పెట్టిన కథల పోటీల ఫలితాలు వెలువడే రోజులు దగ్గర పడుతున్నాయి. 
      వెనుదిరిగిన వలస పక్షుల్లా, గుంపులు గుంపులుగా తిరిగొస్తున్నాయి తిరస్కరణకి గురైన కథలు. తెలుగు పండగల్లా అప్పుడప్పుడూ వస్తున్నాయి ప్రచురణకి నోచుకున్న కథల సమాచారాలు. కొండల వెనక సూరీడులా, మబ్బుల మాటు చందమామలా, వెలుగులు విరజిమ్మే సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాయి బహుమతుల వివరాలు! 
      ‘ఊరంత వెలుగూ- ఆనందం మనకూ- కనరాని దూరమురా...’ విషాదంగా పాడుకుంటూ, మంచమ్మీద స్థిరపడ్డాడు సుబ్బారావు. అతనికి కొరియర్‌ బాయ్‌ పద్మారావు మీదా, సాటి రచయిత రాజారావు మీదా తట్టుకోలేనంత కోపంగా ఉంది.
      అయితే, ఇది ఈ ఒక్క రోజు కథ కాదు. అవిరామంగా సాగుతున్న అంతులేని కథ!
      ‘ఎంత కోపమొచ్చి ఏం లాభం? పేరులేని రచయిత కోపం- పేపర్లకి చేటు’ అనుకున్నాడు సుబ్బారావు మనసులో, రీముల ఖర్చు తలచుకుని. ‘ఎన్నెన్ని రాస్తున్నాను! ఎన్ని రాసి ఏం లాభం? సిరా తడికి తప్ప, అచ్చు తడికి నోచుకొనే భాగ్యం లేదు నా కథలకి. ఏ కొర నోములు నోచానో!’ 
      నేరుగా వెళ్లి, సంపాదకులతోనే వేసుకుందామని అనుకున్నాడు. ఓ సంపాదక మీట్‌ పెట్టి, వాళ్ల దయారాహిత్యాన్ని చెరిగేద్దామనుకున్నాడు. కానీ, అలా చేస్తే ఏడాదికో, ఆర్నెల్లకో వేసుకుంటున్న ఆ ఒకటో అరో కథలు కూడా వేసుకోరేమో అని ఒక భయం. పైగా, రచయిత వెళ్లి సంపాదకుణ్ని చిన్నబుచ్చినా, సంపాదకుడు రచయితని చిన్నబుచ్చినా, మూలన పడేది రచయితేనన్న సాహితీ సామెత ఉండనే ఉంది. అది గుర్తొచ్చి ఊరుకున్నాడు. ‘ఆ రాజారావు నోచుకున్న నోములేంటో, చేసుకున్న వ్రతాలేంటో తెలిపే నారదుడెవరైనా ఎదురుపడి, వివరిస్తే బాగుణ్ను. నేనూ ఆ నోములూ, వ్రతాలూ చివరంటా శ్రద్ధగా చేసుకుని, ఉద్యాపన పూర్తయి ప్రసాదం తీసుకునే వరకూ మొబైలైనా ముట్టకుండా దీక్ష పట్టవచ్చు’ అనుకున్నాడు. 
      నారదుడు రాలేదు గానీ, రాజారావు వచ్చాడు. 
      తెరిచి ఉన్న తలుపుల మీదే, టకటక చప్పుడు కావటంతో, నిరాసక్తంగా అటు చూశాడు సుబ్బారావు. పుండు మీదకి దూకాలనుకునే పుల్లలా, రాజారావు అక్కడ నిలబడి ఉన్నాడు. ‘‘ఏం సుబ్బూ, కథ రాసుకుంటున్నావా?’’ ప్రశ్నించాడు. 
      సుబ్బారావుకి వళ్లు మండి పోయింది. ‘‘అవును. ఖాళీ చేతుల్తో, గాలిలో రాస్తున్నా!’’ అన్నాడు చేతులు తిప్పుతూ. 
      నవ్వాడు రాజారావు, ‘‘భలే కామెడీ. హాస్య కథ రాస్తున్నావా?’’ సుబ్బారావు భరించలేకపోయాడు, ‘‘వచ్చిన పని చెప్పు’’ సూటిగా అడిగాడు.
      రాజారావు పాయింటులోకి వచ్చినట్టు నటించాడు. ‘‘నీ దగ్గర పోస్టు స్టాంపులు ఉన్నాయా? అహా... నువ్వు ప్రతి కథకీ తిరుగు కవర్లు పెడుతూ ఉంటావుగా.. అందుకని, ఉంటాయనుకున్నాను. వెధవది, నేను ఎన్నాళ్లనించో, ఆ అలవాటు మానుకున్నానులే! కథలు తిరిగి రాకపోగా, స్టాంపుల ఖర్చొకటీ!’’ తన హాస్యానికి తనే మురుసుకుంటూ, గట్టిగా నవ్వేశాడు. 
      ఆ నవ్వుకి తన నెత్తిమీద పడ్డ నిప్పుల్ని తల గిరగిరా తిప్పుతూ దులిపేసుకుని జవాబిచ్చాడు సుబ్బారావు. ‘‘నే కవర్లు పెట్టను. నా దగ్గర స్టాంపులు లేవు. అయినా, నీకిప్పుడు స్టాంపులెందుకు? కొత్తగా రాసిన కథ మీద డౌటు గానీ వచ్చిందా?’’ బౌన్సర్‌ విసిరాననుకున్నాడు. బౌండరీ బాదాడు రాజారావు, 
      ‘‘అదేం లేదు. ఇవాళ ఒక పత్రికలో బహుమతీ, ఒక పత్రికలో సెలక్షనూ వచ్చాయి. సంపాదకులకి ధన్యవాదాలు రాయాలి. వాటిక్కూడా కొరియరెందుకూ, పోస్టులో పంపితే సరిపోతుంది కదా అనీ..’’ బహుమతి విషయం అన్యాపదేశంగా చెప్పేశాడు రాజారావు. సుబ్బారావు జవాబు చెప్పేలోగానే వెనక్కి పెట్టుకున్న చెయ్యి ముందుకు చాపి, నల్లపిల్లి బొమ్మ ఉన్న తెల్లకార్డు ఒకటి సుబ్బారావు చేతిలో పెట్టాడు. ‘‘పైకి వస్తుంటే, పోస్ట్‌మాన్‌ కనిపించి నీకివ్వమని నా చేతిలో పెట్టి పోయాడు’’ నవ్వు దాచుకుంటూ చెప్పాడు. 
      నల్లపిల్లి బొమ్మ అంటే, కథ నచ్చలేదని పత్రిక వారు పంపిన తపాలా సందేశం. అలాంటి కార్డులు సుబ్బారావు దగ్గర బోలెడు! 
      మాడు మొహంతో కార్డు అందుకుని, మంచమ్మీదికి విసిరేశాడు. 
      రాజారావు వచ్చిన పని పూర్తయింది. ‘‘వస్తాను సుబ్బూ, నెక్స్ట్‌ టైం బెటర్‌ లక్‌’’ అన్నాడు. 
      ‘‘వద్దులే రాజూ! ఎవ్రీ టైం నీకే లక్‌.’’ కసిగా అన్నాడు సుబ్బారావు.

* * *

      ఉద్ధృతంగా ఒడ్డుకి వచ్చే కెరటాలు, అంతే వేగంతో వెనక్కి వెళ్లినట్లు, విసుగులేకుండా, తిరిగొస్తున్న కథల తాకిడి తట్టుకోవటం ఒక కష్టం కాగా.. వదిలిందే తడవుగా ఆకాశంలోకి దూసుకుపోయి అక్కడే తిష్ఠ వేస్తున్న ఇస్రో వారి ఉపగ్రహాల్లాగా, పంపిందే తడవుగా పత్రికలలోకి దూసుకుపోయి వాటిలో తిష్ఠ వేసి, అతడి పేరు దశ దిశలా మోగేలా ప్రచారం చేస్తున్న రాజారావు కథలు పెట్టే మానసిక హింస తట్టుకోవటం మరీ కష్టంగా ఉంది సుబ్బారావుకి. ‘తన మొగుడు కొట్టినందుక్కాదు, పక్కింటావిడ మొగుడు ఆమెని పిక్చరుకి తీసుకుపోయినందుకు’ అన్నట్టుగా తయారైంది రాన్రానూ సుబ్బారావు పరిస్థితి. 
      ఈ హింసకి విరుగుడు కోసం తీవ్రంగా అహోరాత్రాలూ ఆలోచిస్తున్న సుబ్బారావుకు తరుణోపాయం, ఆ వేళ పేపర్‌తో పాటు వచ్చిన ఓ కరపత్రంలో దొరికింది.
      ఊరి చివరి గ్రంథాలయంలో వారం రోజులపాటు రచనానంద స్వాములవారు విడిది చేయనున్నారనీ, రచయిత/త్రుల క(వె)తలు సరిదిద్దగలరనీ ప్రకటించింది ఆ కాయితం. ‘తొలినే చేసిన పూజా ఫలమో’ అని పాడుకుంటూ అత్యంత ఆశావహుడై, తొలిరోజునే స్వామివారి సన్నిధిని చేరుకున్నాడు సుబ్బారావు. 
      అయిదొందలు రుసుం కట్టి స్వామివారి ఏకాంత సన్నిధి సాధించాడు. స్వామివారితో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
      స్వామివారికి సుబ్బారావు నచ్చాడు. అతడి వైఫల్యాల్లో స్వీయానుభవ జాడలు కనిపించాయి. ‘‘వత్సా! వర్రీ పడకు. ఇలాంటి అనుభవాలు నాకూ తప్పలేదు’’ ఓదార్చి, అతడిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని అన్నారు.
      గతుక్కుమన్నాడు సుబ్బారావు- స్వామివారికి చేదు అనుభవాలు ఉన్నందున కాదు, అలాంటి భూతాన్ని ధరించిన వాణ్ని అయిదొందలిచ్చి, తను ఆశ్రయించటం సమంజసమేనా అన్న అనుమానం కలిగి. అతడి ఉలికిపాటు గమనించి, స్వామివారు       సర్దుకున్నారు. ‘‘నువ్వు వినే ఉంటావు, అపజయాల వాకిటిముందు గెలుపు నిలిచి, ఎదురొస్తుంది. అదీ నా అనుభవం. నా సంగతి వదిలేయ్‌. నీ సమస్య టూకీగా చెప్పాలంటే, నీ పేరు పత్రికల్లో మోగిపోవాలి. ఆ రాజారావు నీకన్నా వెనకపడాలి అంతేనా?’’
      ‘‘వివరంగా చెప్పాలన్నా అంతే స్వామీ, అదేంటో, సాధారణ సంచికలకీ, ప్రత్యేక సంచికలకీ కూడా, ఆ రాజారావుని ప్రత్యేకంగా అడిగి మరీ రాయించుకుంటారు. నా కథలని గొంగళి పురుగు మీద పడ్డంత కంగారుగా విదిలించేసుకుంటారు’’ వాపోయాడు సుబ్బారావు. 
      ‘‘అవే ఆనక సీతాకోక చిలుకలవుతాయి నాయనా! అప్పుడు వాళ్లే, రంగురంగుల బొమ్మలేసి మరీ అచ్చొత్తుకుంటారు. అందాకా శ్రమయేవ కర్తవ్యం’’ ఉద్బోధించారు స్వామివారు. ‘‘ఓ పని చెయ్యి. నీ కథలలో నుంచి నీకు బాగా నచ్చిన ఆణిముత్యాలు అరడజను ఏరు. అలాగే, నీకు అంతగా నచ్చనివి కూడా ఆరు ఏరు. ఈ పన్నెండూ విడివిడిగా బొత్తులు పెట్టి రేపు ఉదయానికి మా కౌంటర్లో జమకట్టు. ఎల్లుండి సాయంత్రం, ఆఖరి విడత పన్నెండొందలూ కౌంటర్లో జమకట్టు. ఆ వెనక, నా దర్శనానికి క్యూ కట్టు. నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది’’ 
      ‘‘ఇంకా పన్నెండొందలా?’’ గుడ్లు వెళ్లబెట్టాడు సుబ్బారావు. 
      ‘‘అవును. పన్నెండు కథలు గనుక పన్నెండొందలు చాలు. రేపు నీకు బహుయోగాలు, సాప్రయోగాలు వచ్చినప్పుడల్లా వచ్చే వేలూ, లక్షలలో నాకు వాటా ఇయ్యవు కదా!’’ చిద్విలాసంగా నవ్వారు స్వామిజీ.
      ఆ యోగాలు, ప్రయోగాలూ అర్థం కాకపోయినా.. వేలూ, లక్షలూ అన్న ముక్కలు అయస్కాతంలా ఆకర్షించగా, ఆణిముత్యాలు ఏరే ఉత్సాహంతో బయటకు నడిచాడు సుబ్బారావు.
      సదరు ఎల్లుండి సాయంత్రం, స్వాములవారి ముందు బాసింపట్టు వేసుక్కూచున్నాడు సుబ్బారావు. రచనానంద స్వామి వారు ఆనందంగా లేరు. మానసికంగా ఎంతో నలిగినట్టు కనిపిస్తున్నారు. సుబ్బారావు వచ్చి, సుఖాసీనుడైన తర్వాత ఆయన అతడికేసి సూటిగానూ, ఒకింత దీనంగాను చూశారు. ఆ వెనుక, తను రెండు వైపులా పెట్టుకున్న కథల బొత్తుల వైపు చూశారు. వాటి మీద తలొక చేత్తోనూ నెమ్మదిగా తట్టారు. ‘‘చూడు సుబ్బారావూ, ఈ కుడి చేతివైపు ఉన్నవి నీ ఉత్తర కథలు- అనగా, నువ్వెంచుకున్న ఆణిముత్యాలు. ఇహ ఈ ఎడంవైపు ఉన్నవి- నీ దక్షిణ కథలు- అంటే, నీకు అంతగా నచ్చనివి. ఉదయం నుంచీ, ఈ పన్నెండు కథలూ శ్రద్ధగా చదివాను’’ ఈ మాట అంటుంటే, స్వామి వారి గొంతు దు:ఖంతో గురగురలాడింది. కార్యదక్షులు గనక బయటపడకుండా, సర్దుకున్నారు. 
      ‘‘నా అభిప్రాయంలో, ఈ రెండు బొత్తుల కథల్లోనూ పెద్ద తేడా ఏమీ లేదు’’ సుబ్బారావుకి, ఏమీ అర్థం కాలేదు. ‘స్వామివారు ఏం సెలవిస్తున్నారు? రెండు సెట్లూ సూపరా? రెండు సెట్లూ పాపరా?’
      స్వామివారు ఈసారి ఖంగున మాట్లాడారు. ‘‘సాధారణంగా అయితే, నీ సమస్యకి పరిష్కారం రెండంచెల్లో ఉండాలి. మొదటి మెట్టు, నువ్వు నీ రచనల ద్వారా, రచయితగా పత్రికల వారి గుర్తింపునకు నోచుకోవడం. రెండు- పాఠకులూ, పత్రికలూ రచయితగా నీ     స్థాయిని, రాజారావుతో సమం చేసి గౌరవించటం’’. ఒక నిమిషం శ్వాస తీసుకుని, ప్రారంభించారాయన, ‘‘మొదటి మెట్టు నీకు లేదు! విప్రయోగం తప్ప, సాప్రయోగం నీ కలంలో లేదు. కనుక, కథల ద్వారా నువ్వు పేరు మోయటం అసాధ్యం. అంత బరువు నువ్వు మోయలేవు. కనుక, ఎకాఎకీ రెండవ మెట్టు ఎక్కడమే నీ ముందున్న మార్గం!’’
      రష్యన్‌ భాషని జర్మన్‌ యాసలో వింటున్న వాడిలా మొహం పెట్టాడు సుబ్బారావు.
      ‘‘వివరిస్తాను. అర్థం చేసుకో. నువ్వు బరువు మోయలేవు గనుక, ఆ రాజారావు కీర్తి బరువునే, కిందికి దించే ప్రయత్నం చెయ్యి. బహు యోగిని విప్రయోగి కావించు!’’
      ఈసారి పేరు కూడా తెలియని భాషని, మతిలేని వాడు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది సుబ్బారావుకు. అయోమయంగా చూశాడు. ‘‘ఏ యోగి స్వామీ?’’ అడిగాడు. 
      ‘‘వెర్రివాడా! రచన చేయటమే కాదు, రచయితల పరిభాష కూడా నీకు కొంచమైనా పట్టుబడలేదు. వివరిస్తా, విను. రచయితల యోగాలు పలు రకాలు. ప్రస్తుతం వరకు నీకవసరమైన యోగాలు మాత్రం చెబుతాను. ప్రతి పోటీలోనూ బహుమతి పట్టే రచయిత బహు యోగిగా విలసిల్లుతాడు. సాప్ర యోగి అనబడే వాడు, తన రచనలు సాధారణ స్థాయినందుకున్న ప్రాజ్ఞుడు. సాధారణ ప్రచురణ సైతం వికటించిన బడుగు రచయిత విప్రయోగిగా విలాప యోగంలో ఉంటాడు. నీ కలంలో సాప్రయోగమే లుప్తంగా ఉంది. ఇక బహుయోగం బహుదూరం. దాన్ని గురించి తలచటమే పాపం. కనుక నీకు బాగా తెలిసిన విప్రయోగమే నీ కలలని సాకారం కావిస్తుంది’’ 
      రచనానంద స్వామి తన ఎడమ చేతిని దొప్పలాగా చేసి, సుబ్బారావు కుడి చెవి చుట్టూ దడి కట్టి మార్గోపదేశం చేశారు. సుబ్బారావు కళ్లు పత్తి కాయల్లాగా విచ్చుకుపోయాయి. అతడు మెదడువాపు వచ్చిన వాడిలాగా వణికిపోయాడు.
      ‘‘ఫరవాలేదంటారా?’’ ‘‘బోలెడు ఫరవాలేదు’’ సాహసం శాయరా డింభకా! అన్న పద్ధతిలో ధైర్యం చెబుతూ, స్వామివారు అభయ హస్తం ప్రదర్శించారు. 
      ‘‘మరొక్క, ఆఖరి సంశయం స్వామీ... మరి ఈ దక్షిణ కథలు?’’ 
      చిద్విలాసంగా నవ్వారు స్వామీజీ. ‘‘ఆ విషయంలో నువ్వు అదృష్టవంతుడివి. నీ కథల్లో ఉత్తర, దక్షిణాలకి తేడా లేదన్నానుగా! నీకావిషయంలో సందేహం లేదు. ఎడా పెడా, ఏ కథ చేతికొస్తే అది వాడేయొచ్చు’’
      చేతులు జోడించి, లేచాడు సుబ్బారావు.

* * *

      తలుపు చప్పుడవడంతో తెరిచిన రాజారావు ఎదురుగా పూలగుత్తితో నిలబ డున్న సుబ్బారావుని చూసి ఆశ్చర్య పోయాడు. ‘‘ఏంటి విషయం?’’ అడిగాడు అనుమానంగా. సుబ్బారావు ముందుకు వచ్చి, రాజారావు చేతిని అందుకున్నాడు. ‘‘ఇవాళ ప్రపంచ స్నేహితుల దినోత్సవం. నీతో స్నేహం కలుపుకుందామని వచ్చాను’’
      ‘‘అదేంటి కొత్తగా? మనం స్నేహితులమేగా!’’
      గొల్లుమని ఏడిచాడు సుబ్బారావు. ‘‘ఆ నీ నిష్కల్మషత్వమే నన్ను దహిస్తోంది. నన్ను క్షమించు రాజూ! నేను నీ స్నేహానికి తగను- నిన్నటి దాకా. ఎందుకంటే నిన్నటిదాకా నీతో స్నేహం నటిస్తూనే, నీ మీద అసూయ పెంచుకున్నాను. నీ ఉన్నతిని చూసి, ఓర్వలేక స్నేహ ధర్మాన్ని మరచి లోలోపల కుళ్లిపోయాను. ఇప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి. నా తాహతు నాకు తెలిసివచ్చింది. నాకు కథా రచనలో ఓనమాలు కూడా రావన్న నిజం అవగతమైంది. నక్కనైన నేను, నాకలోకం లాంటి నిన్ను చేరుకోవాలని అనుకోవటమే నేరం అని తెలిసింది. అందుకే ఇప్పటి నుంచీ స్వచ్ఛమైన మనసుతో నిర్మలంగా నీ స్నేహాన్ని కొనసాగించి, నీ సాహచర్యంలో ఇంగువ కట్టిన గుడ్డగానైనా గుబాళిద్దామని ఆశ పడుతున్నాను’’ కళ్లు తుడుచుకుంటూ అన్నాడు. 
      ‘‘అంతంత మాటలెందుకులే సుబ్బూ! నీ కథలన్నీ అచ్చయి, నావన్నీ తిరిగి వస్తుంటే నేనూ నీలాగే అనుకునేవాణ్నే మో!’’ ఉదారంగా అన్నాడు రాజారావు. 
      ‘‘అంత మాటనకు రాజూ! నేను భరించలేను. కలలో కూడా నీ కథలు తిరిగిరావటం అన్న మాట అనకు- పైన తథాస్తు దేవతలుంటారు’’ 
      కదిలిపోయాడు రాజారావు. అదను చూసుకున్నాడు సుబ్బారావు. ‘‘రేపటినుంచీ రోజూ నీ దగ్గరకు వస్తాను. సాహితీ శుశ్రూష చేస్తాను. నీ కథలు ఫెయిర్‌ చేసి పెడతాను. వాటిని కొరియర్‌కి చేరవేస్తాను. నీలాంటి సాహితీ ద్రష్ట సాహచర్యంలోనైనా నాక్కొంత సాహిత్య గంధం అబ్బుతుందేమో పరీక్షించుకుంటాను’’
      కాదనలేకపోయాడు రాజారావు. ఎంత చెడ్డా సాటి రచయిత. అంతకు మించి తన అహాన్ని గుర్తించి, పెంచి, అద్భుతంగా గౌరవిస్తున్నాడు! 
      సుబ్బారావు సాహితీ శుశ్రూష మొదలెట్టాడు.

      పట్టున పది వారాలపాటు సేవ కొనసాగిందో లేదో, సుబ్బారావుకి ఇంటి దగ్గర నించి(అనుకున్నట్టే) అత్యవసర పిలుపొచ్చింది. ‘చెల్లెలి పెళ్లి కుదిరిందనీ, వెంటనే వచ్చి నెలరోజుల పాటు తనకి చేదోడు వాదోడుగా ఉండి పెళ్లి పూర్తి చేసి, చెల్లెలిని కాపరానికి పంపి వెళ్లమనీ’ అతడి తండ్రి రాశాడు. 
      ‘‘తప్పనిసరై వెళ్తున్నాను. పెళ్లి కాగానే వచ్చేస్తా’’నని, రాజారావుతో చెప్పి, సెలవు తీసుకున్నాడు సుబ్బారావు.

* * * 

      శెలవు నించి వచ్చిన సాయంత్రం దాకా మనసు ఉగ్గబట్టుకుని, సాయంత్రం వెళ్లి రాజారావు ఇంటి తలుపు తట్టిన సుబ్బారావుకు ఎర్రబడున్న కళ్లతో, కళతప్పిన మొహంతో నయనానందకరంగా కనిపించాడు రాజారావు.
      ‘‘ఏమిటలా ఉన్నావ్‌ రాజూ?’’ అడిగాడు. 
      రాజారావు కన్నీళ్లు ఒక్కసారిగా అలుగు దాటేశాయి. ‘‘ఏం జరుగుతోందో తెలియటం లేదు సుబ్బూ! గత నెల రోజులుగా నా కథలు ఒకొక్కటీ తిరిగొస్తున్నాయి. ఈవేళ వచ్చిన రిగ్రెట్‌ కార్డ్‌ ఆరవది!...’’
      ‘‘ఒక్క నెలలో ఆరు తిరస్కరణలా! నీవే?’’ తన్నుకొస్తున్న ఆనందాన్ని తొక్కిపడుతూ ఆవేదన వెలిబుచ్చాడు సుబ్బారావు.
      ‘‘అవును. ఏమీ అర్థం కావట్లేదు. వీటి ప్రభావం మాత్రం దారుణంగా ఉంది. కోకిల మంత్లీ వాళ్లు దీపావళి సంచికకి ఆహ్వానం పంపటం మానుకున్నారు- వాళ్లవి ఈ మధ్య రెండు రిగ్రెట్లు మరి. జాబిలమ్మ వాళ్లు జన్మదిన సంచికకి అడిగి మరీ రాయించుకున్న కథ వేసుకోలేదు. సిగ్గువిడిచి ఫోన్‌ చేస్తే, ఆ ఎడిటరు, ‘చిన్న పత్రిక గనుక మేమింత చులకన అయిపోయామా? ఎలాంటి కథ పంపారు!! ఎన్ని చోట్లనించి తిరిగొచ్చిందో?’ అంటూ..వొద్దులే, ఇంకేమన్నాడో చెప్పలేను. ఎన్నడూ, ఆహ్వానాలేగానీ, తిరస్కరణలు ఎరగనే, ఇలా ఎందుకు జరుగుతోందో..’’ వాపోయాడు రాజారావు.
      కొరియర్ల దాకా అతని(కథల పేరుతో తన) కథలు ‘మోసుకు వెళ్లి, పత్రికలకి పంపిన’ తన శుశ్రూష ఫలించిందని అర్థమైంది సుబ్బారావుకి. రాజారావు భుజం తట్టాడు. ‘‘చూడు రాజూ! బంతి కింద పడితే మళ్లీ పైకి లేస్తుంది. బళ్లు ఓడలు కావు గానీ, ఓడలు ఊరికే బళ్లయిపోతాయి. బతుకు బొంగరం తిరిగీ.. తిరిగీ ఆగినంత మాత్రాన.. భూమి భ్రమణం ఆగదు...’’
      సంతోషం దాచుకోలేక, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న సుబ్బారావు మాటలు అర్థంకాక తెల్లబోయి చూశాడు రాజారావు.

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam