తెలుగు కథకు మంచి వేదిక

  • 147 Views
  • 6Likes
  • Like
  • Article Share

    ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • అనంతపురం
  • 9440222117
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

రామోజీ ఫౌండేషన్‌ ఇటీవల ‘కథావిజయం’ పేరిట కథారచన పోటీ నిర్వహించింది. ఆ పోటీకోసం వచ్చిన కథల్లోంచి మంచికథల్ని ఎన్నిక చేయడంకోసం నాతో సహా అయిదుగురిని ఆహ్వానించారు. పోటీకి వచ్చిన కథల్ని నిర్వాహకులు ముందుగానే వడపోతపట్టి మాకు 130 కథలు ఇచ్చారు. వాటిల్లోంచి మేము వాళ్లు ప్రకటించిన విభాగాలకు కథల్ని ఎన్నిక చేయాలి. ప్రతి కథనూ అయిదుగు రమూ చదివి ఎవరి అభిప్రాయాలను వాళ్లు రాసిపెట్టుకున్నాం. ఈ పనిచేయడానికి ఆరు రోజులు పట్టింది. ఒక్కొక్కరం ఆరు రోజుల్లో 130 కథలు చదివాం. అవి దాదాపు 1300 పుటలు ఉంటాయి. ఒక్కసారిగా ఇన్ని కథలు చదవడం గొప్ప అనుభూతి అనిపించింది.
      ఆ కథల్లో వర్తమాన భారతీయ సామాజికత అంతా మాకు కనిపించింది. సామాజిక వాస్తవికత సాహిత్య వస్తువు. సామాజిక వాస్తవికత అంటే ఒక సమాజంలో నివసించే మనుషుల మధ్యగల సంబంధాల సారమే. అంటే ఇప్పుడు జీవితం గడుపుతున్న మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? అవి అలా ఎందుకు ఉన్నాయి? అవి ఇంకోలా ఉంటే మన జీవితాలు ఇంకా బాగా ఉంటాయి? ఆ మానవ సంబంధాలు ఎలా నిర్మితమవుతాయి? ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానమే. ఇదే సామాజిక వాస్తవికత. మేము చదివిన కథలలో ఈ వాస్తవికతే కనిపించింది. మొత్తం మీద తెలుగు కథా రచయితలందరూ వర్తమాన సమాజం తీరుతెన్నుల మీద అసంతృప్తినే వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సమాజం ఆరోగ్యంగా, ప్రజాస్వామికంగా లేదని మన కథకుల అభిప్రాయం. ఈ అపసవ్యాకర ధోరణిని ఎత్తిచూపి, మన సమాజం ఇంకా ఆరోగ్యకరంగా, ఇంకా ప్రజాస్వామికంగా ఉండాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. అట్లని మన కథారచయిత లంతా వ్యతిరేక ఆలోచన ఉన్నవాళ్లని, నిరాశావాదులని అనుకోవాల్సిన అవసరం లేదు. మనుషుల్లో ఇంకా మిగిలి ఉన్న మానవత్వాన్ని, న్యాయాన్ని గుర్తిస్తూనే మన సమాజం ఇంకా మారాల్సిన అవసరం ఉందని కథకులు సూచించారు.
      ఈ కథకులు మన సమాజాన్ని, అందులో వస్తున్న పరిణామాలను, వాటి మూలాలను పసిగడుతున్నారు. వాటిపట్ల తమ తృప్తినో, అసంతృప్తినో వ్యక్తం చేస్తున్నారు. విమర్శనాత్మక వాస్తవికతా దృక్పథంతో మనవాళ్లు బాగా కథలు రాయగలుగుతున్నారు. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలో మాత్రం మన సమాజం లోని వైవిధ్యమంతా కనిపిస్తుంది. మన కథకుల్లో సంప్రదాయ వాదులున్నారు. ఆధునికులూ ఉన్నారు. అయితే ఆధుని కులే ఎక్కువ. మధ్యతరగతి లక్షణాలను ఒంటబట్టించుకున్నవాళ్లే ఎక్కువ. రచయి తలు మధ్యతరగతి వాళ్లయినా, కింది తరగతి గురించి రాయడానికి ప్రయత్నించ డం మనకు మొదటి నుంచీ అలవాటు. అది నిబద్ధతకూడా. ‘కథావిజయం’ కోసం కథలు రాసిన రచయితల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారు.
      ‘‘సాధించినదానితో సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే సరిపోదోయి’’ అన్నారు శ్రీశ్రీ ‘వెలుగునీడలు’ సినిమాలో. మన కథారచయితలు కూడా మనదేశం అనేక రంగాల్లో సాధిస్తున్న విజయాలను గుర్తిస్తూనే మన సమాజంలో ఇంకా మారకుండా మిగిలిపోయిన.. మన ప్రజాస్వామ్యాన్ని పలచన చేస్తున్న అంశాలను ఎత్తిచూపారు.
      ఇప్పడు మనం ప్రపంచీకరణ యుగంలో జీవిస్తున్నాం. దాని ఫలితాల్లోని వెలుగు చీకట్లను అనుభవిస్తున్నాం. మన కథకులు ప్రపంచీకరణ మన జీవితం మీద చూపుతున్న ప్రభావాన్ని బలంగా గుర్తించే ప్రయత్నం చేశారు. ఇప్పటి ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అనే సత్యంపట్ల చాలామందికి అవగాహన లేకున్నా, అది మన జీవితాన్ని నాశనం చేస్తోందనే ఆవేదన మన కథకుల్లో బలంగా ఉంది. ముఖ్యంగా మనుషుల మధ్య డబ్బు ఆధిపత్య పాత్ర నిర్వహించడం పట్ల మన కథకులు కోపంగా ఉన్నారు. అలాగే పర్యావరణ విధ్వంసం పట్ల కూడా విమర్శనాత్మక దృష్టి కలిగి ఉన్నారు. తెలుగునేల నాలుగు చెరగుల నుంచీ వచ్చిన కథలు ప్రపంచీకరణతో తెలుగు సమాజం ఎలా నలిగిపోతోందో అక్షరీకరించాయి. విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులను కొందరు గుర్తించారు. పిల్లల విద్యలోని అమానుషత్వాన్ని ఎత్తిచూపారు. కుటుంబ సంబంధాల్లో ముఖ్యంగా స్త్రీపురుష సంబంధాల్లో వస్తున్న విపరీతమైన మార్పులను కథకులు ఎరుకతో గుర్తించారు. ఒంటరి వాళ్లవుతున్న తల్లిదండ్రుల జీవనదృశ్యాలను కొందరు ఆవిష్కరించారు. అస్తిత్వవాదం ప్రభావం నేటి కథకుల మీద బలంగా ఉందని చాలా కథలు రుజువు చేస్తున్నాయి.
      ఈ కథల్లో వస్తుబలమున్నా, శిల్పశక్తి బలంగా కనిపించకపోవడం మా అందరికీ ఒక వెలితిగా అనిపించింది. లభించిన వస్తువును కథగా మలచడానికి అవసరమైన శిల్పజ్ఞానం తోడైతే కథ కళగా మారుతుంది. ఈ కథకులకు ఒక కార్యశాల నిర్వహించి, కథారచన మీద శిక్షణ ఇవ్వగలిగితే వాళ్లు గొప్ప కథకులు కాగలరనిపించింది. వాళ్లకు తెలుగు కథానిక 1879 నుంచి నేటి దాకా అనేక సామాజిక ఉద్యమాలకు సామాజిక భావజాలాలకు, సామాజిక సందర్భాలకు ఎలా స్పందిస్తూ వచ్చిందో నేర్పాలి. తెలుగు కథా రచయితల్లో కనిపించే దృక్పథాపరమైన వైవిధ్యాన్ని పరిచయం చేయాలి. తెలుగు కథానిక శిల్పపరంగా సాధించిన వైవిధ్యాన్ని, ఒక్కో రకమైన కథాశిల్పానికి మంచి ఉదాహరణలైన కథానికల్ని పరిచయం చేయాలి. వస్తువును బట్టి, దృక్పథాన్ని బట్టి కథానిక ఎలా రూపుదిద్దుకుంటుందో చెప్పాలి. వర్తమాన కథారచయితల అనుభవాలను ప్రత్యక్షంగా చెప్పించాలి.
      ‘కథావిజయం’ మంచి ప్రయత్నం. ఇది నిరంతర కొనసాగింపుగా సాగితే తెలుగు కథానిక భవిష్యత్తు బాగా ఉంటుంది. నన్ను ఈ కథల పఠనంలో, పరిశీలనలో భాగస్వామిని చేసినందుకు రామోజీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు. 

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam