ఆఖరి కోరిక

  • 1221 Views
  • 12Likes
  • Like
  • Article Share

    డా।। సిద్దెంకి యాదగిరి

  • గోనెపల్లి, సిద్ధిపేట జిల్లా
  • 9441244773
డా।। సిద్దెంకి యాదగిరి

ఊరంటే కేవలం నివాస ప్రాంతమేనా? కాదు.. అనేకానేక అనుబంధాల కలయిక. ఒక్కసారిగా పుట్టిన గడ్డను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే మనిషి ఒంటరైపోడూ! అలాంటి భయంతోనే కన్నీరుమున్నీరవుతోంది ఆ పెద్దావిడ..!!
ఆరో
తరగతి విద్యార్థి నవీన బడికి రాకపోతే ఆరా తీద్దామని వెంకటయ్య సారు మరో విద్యార్థి నితిన్‌ను వెంట బెట్టుకుని ఊళ్లోకి వెళ్లిండు. సారు నడుచు కుంటూ వెళ్తుంటే తొవ్వలో ఎదురవుతున్న పూర్వపు విద్యార్థులు భక్తితో నమస్కా రాలు తెలుపుతున్నరు. సిమెంట్‌ రోడ్డు మీద మేకల గొతికెలు.. సాకవోసి పిలిచినట్లు మేక మూత్ర ధారలున్నయి. వాకిళ్ల నిండా రొచ్చు. గొర్లు మేకల తుమ్ములు, దగ్గులు. చిత్తుతున్న గొర్ల సీముడు. మేక, గొర్రె పిల్లల అరుపులు వినిపిస్తున్నయి. ఎటు చూసినా మంద వాసనకొట్టే వాడకట్టుకు సారు చేరిండు.
      సారు కంటే ముందు నితిన్‌ నవీన ఇంటి పరిసరాల్లోకి ఒక్క అంగలో దూకి ‘‘ఓ అమ్మ! సారొత్తండు. సారొత్తండు’’ అని సునామి హెచ్చరిక జారిచేసినట్లు చెప్పగానే అప్పట్దాక గొర్ల దొడ్డి ఊడిసే పనిలో ఉన్న మల్లవ్వ సీపురుకట్ట దొడ్లో వదిలి వాకిట్లోకి వచ్చింది.
      సారు వత్తుండని నవీన అన్న నాగరాజు కుర్చీ తెచ్చి వేస్తూ నమస్తే పెట్టిండు. చెయ్యెత్తి నమస్తే పెట్టిన సార్‌ ‘‘ఏం బాబు! మీ నవీన ఏది? బడికి ఎందుకు పంపిస్తలేరు?’’ అని అడిగిండు.
      ఇంకా కొందరివి మంద లేసిపోలేదు. గుజిలోని మేకపిల్లలు పాలకోసం, దొడ్డిలోని గొర్లు మేకలు ఒకటే తీరుగ బే.. బే అని అరుస్తున్నయి. ‘‘సారూ! ఊరు ఉండెటట్లు లేదు. ఇగ బడి ఉంటదో? ఉండదో?’’ అని మల్లవ్వ సంశయిస్తూ అన్నది.
      ‘‘ఊరు పోయిన్నాడు ఎట్లాగో అందరం పోతం. మేం ఈన్నే ఉంటమా? ఉన్నన్ని రోజులయితే బడికి పంపాలె గదామ్మ! ఉషారున్న ఆమె చదువులో వెనకవడదా? ఎక్కన్నో ఒక చోట చదివించాలి’’ అని సారన్నడు.
      ‘‘ఏమో సార్‌! ఎక్కడ సదివిస్తమో ఏమో? నడుమంత్రాన ఊరు వోతదన వట్టిరి. సదువు ఆగంకాదా? ఒగసారి మా తల్లిగారింటి కాడ సదివిత్తమనుకున్నం. ఆకరికి గజివెల్లి పంపిత్తమని అనుకున్నం. వాళ్ల నాయిన ఓ నాలుగు రోజులు మండలం తిరిగి సత్పికేట్లు చేయించుకొచ్చిండు. ఆస్టర్లకు అప్లయి జేసిండు. మునిగిపోయే ఊర్లకు ఎట్ల యిన సీటు దొరుకుతదని చెప్పిండ్రట. పోయే నాడు పోదురుగని అప్పట్దాక ఊళ్లే బడికి పొమ్మంటే వత్తలేదు సార్‌. అటే వోతమని ఆమెనే బడికి వొత్తలేదు. గంతే సారూ!’’ నవీన తల్లి జవాబు.
      ‘‘సీటొస్తే మేం టీసీ ఇచ్చి పంపిస్తం. అటుపోక ఇటురాక ఇంటికాడుంటెట్ల?’’ అంటున్నపుడు నవీన ఇంట్లకేలి ‘‘నమస్తే సార్‌’’ అనుకుంట వినయంతో వచ్చి నిల్చుంది. ‘‘నవీనా! బడికి రాకపోయినవ్‌ బిడ్డా!’’ అని సారన్నడు. ‘‘సార్‌ కూసోండి’’ అని మరోసారి పూర్వపు విద్యార్థి మహేష్‌ గుర్తు జేసిండు. పొవాలె అనుకుంటూ కుర్చీ జరుపుకొని సార్‌ కూచున్నడు. సమాధానమేమాయె అన్నట్లు నవీన దిక్కు చూసిండు.
      ‘‘హాస్టల్‌ పోయేటోల్లం గీత, నందిని గిట్ల ఎవలు వత్తలేరని నేను వొత్తలేను 
      సార్‌’’ నవీన అన్నది.
      ‘‘టీసీ తీసుక పోయే దాక రావాలి. ఇపుడు వొయి వాళ్లకి ఇదే ముచ్చట చెప్పుత’’ సార్‌ చెప్పిండు.
      గునుకపువ్వసొంటి నెరిసిన తల. ముడుతలు పడ్డ దేహం. రెండు గెంటీలు పట్టే సందులో ఒక్క గెంటీ ఉయ్యాలలా ఊగుతున్న అందం. అన్నింటికి మించి వార్ధక్యం అడ్డొస్తున్నా ఎల్త కట్టె వట్టుకొని బలహీనతల్ని వెనకకు నెడుతూ బద్ది పోశవ్వ వచ్చి వెంకటయ్య సారుకు దండం బెట్టింది. సార్‌ ప్రతి నమస్కారం చేసిండు. 
      ‘‘మా పిల్లలు ఎవ్వలు సదువుతలేరు. టీవి సూస్తనే ఉంటరు. పోను, లేకుంటే ఆటలే. వొయి వట్టి సదువుదామన్నోల్లే లేరు. కలంపట్టి రాయరు. బయం పెట్టాలే సార్‌’’ అని చెప్పుతుంటే తన రహస్యం బట్టబయలు చేస్తోందని పోశవ్వ మీదికి ఉరిమి చూస్తోంది నవీన.
      ‘‘గీత, నందిని వద్దకు ఇప్పుడు వెళ్త. వాళ్లమ్మ నాన్నలతో మాట్లాడి బడికి పంపెటట్లు చేస్త. హాస్టల్‌లో సీటొస్తే పోదురుగని. అప్పట్దాక బడికి రాండ్రి. హాస్టల్‌కి పోయినా సరే. ఇక్కడ చదివినా సరే. అందరం పోయినప్పుడు ఎక్కడంటే అక్కడ జాయిన్‌ చేసుకుంటరు. జాయిన్‌ చేసే బాధ్యత మాదే. అప్పట్దాక రాండ్రి’’ అని సార్‌ లేవవోయిండు. 
      ఏదో అడుగుదామనుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్న బద్ది పోశవ్వ ‘‘సారూ! ఒక్క ముచ్చటడుగుత. అడుగన్నా వొద్దా? నువ్వేమనుకుంటవో తప్పుపట్టుకోకు మరి’’ అని అన్నది. 
      ‘లేంది లేరా గూనిది అన్నట్లు ఈ ముసల్ది మాట్లాడితే పొందది. పొసగది. పోలుల ఊదే మాటలు మాట్లాడుతది’ అని నవీన అన్న నాగరాజు అనుకుని తన పెద్ద నాయినమ్మతో ‘‘ఓ అవ్వా! నువ్వేం మాట్లాడుతవే? ఊకో. కాని పోని ముచ్చట్లు మాట్లాడుతవు?’’ అన్నడు.
      ‘ఆగాగు’ అన్నట్టు నాగరాజు వైపు చేయి సైగ చేసి ‘‘మా తల్లిలాంటి దానివి అడుగమ్మా!’’ అని వెంకటయ్య సారన్నడు.
      ‘‘ఇగో సారూ! గీ పక్కపొంటి లొద్దిల్లు మాదే. నా పెండ్లైనప్పుడు మాది కమ్మల గుడిసె. ఈ గుడిసెల నాకు తొల్సూరి కొడుకు బీరయ్య. మల్సూరి కానుపుల బిడ్డ బూదవ్వ పుట్టింది. కొన్నొద్దులకు ఇల్లు కట్టుకొంటిమి. ఇంట్లోని వాసానికొక్క అనుమం ఉంది. దూలానికొక చరిత్రుంది. మట్టి పిసికి పెట్టిన గోడలకు మమతలున్నాయి. ఇంట్లకొచ్చినంక ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు పుట్టిండ్రు. వాళ్లకు బొడ్డుగోసిన మంగలి మల్లన్న, ఆమె కోడలు.. మల్లెపువ్వుల తరీక బట్టలుతికిన సాకలి సాయవ్వ ఆమె సంతటి చేసిన సేవలు మనివున్నంత వరకు మరుత్తాను సారూ! మరువ’’ అని చెప్పుతుంటే ఏదో బతుకు మర్మం చెప్పుతుందని సారుకు అనిపించింది. 
       ‘‘నా పిల్లలు ఆరుగురికి ఒక్కటే దూలం. ఒక్కటే తొట్టెల. ఆల్లకే కాదు. నా ఎనమండుగురు పిల్లల పిల్లలకు కూడా అదే తొట్టెల. వాళ్ల మాయిముంతలు, కొల్లుగుంటలు ఇక్కన్నే. ఇదే ఇంట్ల నాది నా పిల్లల సంసారం మంద ఎచ్చినట్లు ఎచ్చింది. నా వొంశం తీగ పారి పందిరి ఎక్కింది. ఒక్కిల్లుకు నాలుగిండ్లయినయి’’ ఇపుడు ఈ శాట బారతం ఎందుకే అని నాగరాజు అడ్డుపడుతున్నా వింటలేదు పోశవ్వ.
       ‘‘నాకు ఎనిమిదేండ్లుండగ పెండ్లి చేసిండ్రు. నా పిల్లలతో పాటు మా అత్త మామల అవుననంగా సాదుకున్నం. మా పెద్దకొడుకు డెబ్భై ఏండ్లుంటడు. కరువు సూసిన. కట్టం సుకం అన్ని సూసిన. ఊరంటే గుంపు. అందరి బతుకు. తాళ్లు, తలుగులు చేసిన మాయితనం చెప్పులు చేసిన మాదిగొల్లు లేకుంటే పీనుగు లేవది. పీరి లేవది. ఈ ఊరి కోమటి చెరువు మీద నీరడితనం జేసి పంటలు పండించిన మాలోల్లు.. ఎవుసానికి కర్రు నాగలి పెట్టిన వడ్ల కమ్మరోల్లు.. అద్దుమ రాతిరి ఆపతికైన ఆదుకునే కోమటోల్లు.. నీరగల్లు, వడగల్లుతో దూప దీర్సిన గవుండ్లోల్లు.. సల్లనీ కుండల్తో రోని ఎండల్ల దూప తీర్సిన కుమ్మరోల్లు.. మానాన్ని కాపాడే సూడముచ్చట గొలిపే నేతకాల్లు.. ఈ వూరి దొరలు పటేండ్ల బూముల్ల సెల్కల్ల జీవాలు సాదుకుంట బతికినం. తుర్క దూదేకులోల్ల తోటి, నిన్నీయాల్ల కిరాస్తన కూడా వొచ్చింది. సబ్బండ కులాల తోటి అన్నదమ్ములోలే బతికినం. ఒగల ఆపతికి ఒగలం నిల్సినం’’ ఆమెలోంచి ఓ తొంభై ఏండ్ల జ్ఞాపకాల ఎతల చెరువుకట్ట తెగి దుంకుతుంటే సార్‌ పత్తా లేకుంట కొట్టుకపోతండు.
       ‘‘మా ఊల్లె లోకమ్మెచ్చిన పండగలు జరుగుతయి. బీరప్ప పండగ, మైసమ్మ పండుగ ఊరంత గనంగ జేస్తరు. కిల్ల గుట్టమీది తీర్థానికి సుట్టూ పదూల్లోల్లు వొత్తరు. దసర, బతుకమ్మ, గణపతులు, పీరీల పండగలు తుర్కోల్లు మనం కల్సి చేసుకుంటం. క్రిస్‌మస్‌ కూడా అంతే’’
      ‘‘ఔను! ఊరంటె కల్సి బతుకుడాయే’’
      ‘‘నాయినమ్మ జెర బంజెయ్యే అంటే ఇనలేదు. డిల్లెకుల మాట్లాడుతూ నీ అయ్యను చెప్పుతున్న ఇనే. ఓ సారూ! ఈ బుడ్డి వొద్దనంగ పుట్టింది. ఇకమాతులెక్కువ. ఇసార ఎక్కువ. తలుప్పెట్టి చెప్పితే కొలుప్పెట్టి ఇంటది. ఎనుకట మా తాతను ఎంత గోసపుచ్చుకున్నదో? నేను జెప్పలేదా సార్‌? ముచ్చట ఒడువనియ్యది. దంగనియ్యది. సార్‌కి ఇంకేం పనిలేదే? నీ వోలే పనికి పాసి ఉన్నాడే? నీ ముచ్చట ఇనుకుంట ఉంటాడే’’ అని నాగరాజు బతిమిలాడు తుంటే ఏందిరో అన్నట్లు చూపుల్ని చుర కత్తులు చేసిచూస్తుంది పోశవ్వ.
      పోశవ్వ ఎప్పుడన్నట్లే ముక్కిరిసి మూతి తిప్పింది. ‘‘ఆపతి సంపతి తెలువని ఔలా! నా అయ్య కాలిగోటికి కూడా సాల వురా! ఉన్క మీది రోకలోలే ఉరుకులాడ కురా! జర సైసురా బాడకావు’’ అని గద్దించింది. ‘‘సారూ! కట్టం సుకం దెల్వ నోడు కల్లంల గంతులేసిండట వీనసం టోడు. పందిరిమీది గుండు పడ్డట్టు మమ్ముల ముంచే ఇంత పెద్ద చెరువెం దుకు?’’ అని ప్రశ్నల్ని ఎప్పుడో రజాకార్ల మీద వడిసెల ఇసిరినట్లు ఇసిరింది.
      ‘‘ఏదున్న ముందుగాలుండాలే. పైసలు దీసుకున్నంక కొత్త ముచ్చటుంటదా? ఊము ఉంచినంక అద్దుక తింటమా? చెరువుతో చెరువెడు నీళ్లు చెరువెనుక పడ్డయి. ఏం జెయ్యొత్తది. మన సేతుల ఏంలేదు. నేను పోవాలమ్మా. రొండు ముచ్చట్ల ఒడగొట్టు’’ సారన్నడు.
      ‘‘సారూ! గీయింత ముచ్చటిను. నాకు ఎనిమిదేండ్లుండగ పెండ్లి చేసిండ్రు. సాదుకునే జీవాలకు రోగమొస్తే తిండి సయించది. సచ్చిపోతే వొల్షన్ని దినాలు మనాదివోదు. మనసు కుతకుత ఉడుకు తది. మనుషుల్ల కలవం. అనుకోని ఆపతికి ఇత్తునం పోడేలును అమ్మితే కరువు దుక్కం ఏరులై పారుతది. దేన్ని ఉట్టిగ మరువం. అసొంటిది బొడ్డూడని పిల్లలని సాదుకున్న జాగ. జీవాలను మనుషులోలే బతికిచ్చుకున్న బతుకు మాది. ఇపుడెటో పొమ్మనవట్టిరి సారు’’ నడుమ నడుమ ‘ఇంటన్నవా సార్‌’ అని వినేటట్లు చెబుతోంది. మల్లవ్వ అట్లే వింటుంది. 
      ‘‘ఊల్లె ఎవలు సచ్చినా ఆకరిసూపుకు పోతం. వాడకట్టుకు పోతున్నపుడు మనసు కలికలి అయితది. మంచితనం, మర్యాదని కుంబరుష్టిలా కురుస్తది. ఏడుపుల్ని కొనగొంగుతో తూడుసుకుంటు మీదపడి ఏడుస్తుంటం. దీర చెప్పుకుంటం. వాల్ల గ్యాపకాలతో బతుకుమనీ, వాల్ల పేరు నిలుపాలని చెప్పుకుంటం. పలానోని పిల్లలని, కీర్తి తేవాలని దైర్నం చెప్పుతం. ఆటపాటలతోటి కాటిదాక, బొందదాక పోతం. కట్టెపుల్లో ఇంత పిడికెడు మట్టో ఏస్తం. దానం చేసేదాక ఉంటం.. మా అత్త మామలు బవుగ బతికిండ్రు. సావు జాలకు వాల్ల అత్తమామల కాళ్లకట్టుకు బొందపెట్టుండ్రి అనేటోల్లు. వాళ్లు చెప్పిన తరీక చేసినం. మేం సత్తె మా అత్త మామల కాళ్లకట్టుకు పెడితే బాగుండు అనే కోరిక ఉన్నది. ఊరువోతే మమ్ముల ఏడ కాలవెడ్తరు? ఏడ బొంద వెడ్తరు? మిన్ను ఇరిగి మీదపడ్డట్టు ఊరిడిసి పొమ్మంటెట్ల? పైసలు ఇత్తండ్రేమో? పైసలు బూమికి సమానమైతయా సార్‌? పైస పగ లేపుతదిగని ప్రేమ పెంచది కద సారూ’’ అని నిత్యసత్యాలతో నిప్పులు చెరుగుతోంది పోశవ్వ.
      ‘‘మునుపటి రోజులు కావు. ఏడికి వోతే ఆడ బతకాలే. పైసలు మన సేతుల ఉంచుకోవాలే. మనం పైసల సేతులకు పోవొద్దు’’ ఆర్థికవేత్తలాగా చెప్పుతుండు సారు. పోశవ్వ కన్నీళ్లు తూడుసుకుంటూ ‘‘పుట్టి పెరిగింది ఇడిసి ఎటువొమ్మంటవ్‌ సారూ? నా పెదకొడుకు కొడుకు మనుమనంతా వయిసే నీది. ఊరు వోతాంది బిడ్డా! ఈ ఊరితో బతికిన బతుకు వోతుంది. పండుగలు వోతన్నయి. పైసలు వచ్చినయి కాబట్టి కొత్త మురిపాన ఇత్తడి పోగు మంచిగనే ఉంటది. తర్వాత తెలుస్తది తండ్లాట’’ అని చెప్పింది.
      ‘‘ఇగ అయిపోయింది సారూ! ప్రాజెక్ట్‌ల మునుగుతుందని ఉంకో ఊరుకు పోతం. చెట్టుకొగలం. పుట్టకొగలం ఊరు బతుకు ఎరమంద్రమైతది. ఎటోపోతం. ఆ తావున బతుకంగా నా అసొంటి ముస లోల్లు ఊరికి దూరం.. కాటికి దగ్గరైతం బిడ్డా! రేపు నేను సత్తె ఆకరిసూపుకు ఊరోల్లు ఎవలొస్తరు? నా కొడుకులకు, కోడండ్లకు ఎవలు దీర చెప్పుతరు. నా సావు గురించి కొడిదెడు కన్నీళ్లు ఎవలు కారుస్తరు? నా కాట్లో ఓ పుల్ల ఎవలే స్తరు? నా బొందమీద పిడికెడు మట్టి ఎవలేస్తరు? ఊరుతో ఉన్న సంవందం మాయం చేస్తుండ్రనే బాదుంది కొడుకా? 
      ‘‘బిడ్డా! నా ఆకరి కోరిక ఏందంటే నేను ఏడ సచ్చినా ఈన్నే పాతి పెట్టుమంటున్న. నాది తప్పంటవా?’’ అని పుల్కాషితనంగా అడుగుతున్న ముచ్చట్లల్ల కొట్టుకపోతున్న వెంకటయ్య సారు నీళ్లు నిండిన కండ్లతో బద్ది పోశవ్వ బుద్ధికి దండం పెట్టిండు. ఉండలేక పోయాడు. సావు తర్వాత ఏం కనపడది. సావు ఎట్లయితదో తెలువది. ఊరి ఆత్మీయత కలబోత కోసం ఉరివడ్డట్టు పోశవ్వ కొట్టుకాడుతుంది. ఎన్ని కోట్లు పెట్టినా దొరుకది ఊరి కుతి. బతికినన్ని తురితిగ బతుకాలే, గంతే.
      ‘‘తల్లికి కొడుకు బుద్ధి చెప్పుతాడమ్మా! నీకు జవాబు చెప్పలేక పోతున్న. నవీనను బడికి పంపుండ్రి. ఒక్క తీరుగ చెప్పుకుంట’’ బతుకు బడికి తొవ్వదీసిండు వెంకటయ్య సారు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam