రాతి గుండెలో నీళ్లు

  • 986 Views
  • 80Likes
  • Like
  • Article Share

    దొండపాటి కృష్ణ

  • కొత్త రేమల్లె, కృష్ణా జిల్లా,
  • 9052326864
దొండపాటి కృష్ణ

కథా విజయం-2019, రూ.2000 బహుమతి కథ
మనిషి గుండె,  రాతి బండ... రెండిట్లో ఏది కఠినం? సమాధానం అందరికీ తెలిసిందే. కానీ, సాటి వ్యక్తి కష్టాన్ని చూసి చలించని మానవ జన్మ ఎందుకు? మానవత్వం కరవైన బతుకెందుకు? రంజనిలో కూడా ఇదే పరివర్తన మొదలయ్యింది!     
‘‘హలో..
మేడం.. గుడ్‌మార్నింగ్‌. బాపులపాడులో యాక్సిడెంట్‌ అయ్యి ఒకరు చనిపోయారు. మీరెళ్లి వివరాలు సేకరించండి’’ మండలాఫీసు నుంచి రంజనికి ఫోనొచ్చింది. మరణించడమనేది కాలం చేతుల్లోని పని. దానికి సమయం సందర్భాలంటూ ఏమీ ఉండవు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా కాలం చేయడం ప్రకృతి ధర్మం అని రంజని ఓ నిర్లిప్త భావనలోకి వెళ్లిపోయింది. అందుకే, ఇలాంటి సమాచారం అందినప్పుడు వెంటనే స్పందించేది కాదు. తాపీగా వెళ్లేది. ఆమె వెళ్లి వివరాలు రాసుకునేవరకూ విగతజీవిని కదిలించే వారు కాదు. ఆమె రావడం ఆలస్యమైతే కొంతమంది ఫోన్లు చేసి కోప్పడేవాళ్లు కూడా. చనిపోయిన వాళ్ల వివరాలను రంజని రాసుకుని, ప్రభుత్వానికి పంపిస్తేనే అర్హతను బట్టి పరిహారం అందుతుంది. 
      ‘ఉద్యోగం వచ్చిందని సంబరపడి పోయానుగానీ, వేళగాని వేళల్లో ఊళ్లుపట్టుకు తిరగాల్సొస్తోంది’ అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది రంజని. కానీ, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి దాన్ని వదులుకోవడం ఇష్టంలేదు. ఎవరైనా అకస్మాత్తుగా కాలం చేస్తే, వారం పది రోజులు ఆ పని మీదే తిరగాల్సొచ్చేది. సమయానికి వెళ్లకపోతే ‘కఠినాత్మురాలు’ అని తిట్టుకుంటారు, ఫోన్లు చేసి విసిగిస్తారు. ఏవో కాస్త డబ్బులొస్తాయని వెళ్లడమే కానీ మనస్ఫూర్తిగా ఏనాడూ ఆమె వెళ్లింది లేదు. కొత్తరేమల్లె నుంచి వేలేరు, హనుమాన్‌ జంక్షన్‌ మీదగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపులపాడుకు చేరుకుంది రంజని. అలా వెళ్తున్న ప్రతిసారీ ఆ ఉద్యోగం వచ్చిన తీరు ఆమెకు గుర్తొస్తూనే ఉంటుంది. 

* * *

      కొత్తరేమల్లె గ్రామం కొత్త కోడలిగా రంజని అడుగుపెట్టింది. ఆమె దూకుడు స్వభావం చూసిన వాళ్లందరూ ‘మగరాయుడు’ అనేవారు. ఆమెకి స్వార్థం ఎక్కువని, మానవత్వం లేదని మరికొందరు అనుకునేవారు. ఎవరి మాటా వినదని, తన పంతమే నెగ్గించుకుంటుందని, తనకి కావాల్సింది దక్కితీరాల్సిందేనని, సెంటిమెంట్లు లేవని చాలామంది విమర్శించేవారు. డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యింది రంజని. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కారణంగా ఆమె పై చదువులకి ఆస్కారం లేక పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. 
      ‘‘రంజని భర్తను లొంగదీసుకుంది. అత్తామామల్ని అదుపులో పెట్టుకుంది. తనదే రాజ్యం’’ అంటూ గ్రామంలో గుసగుసలు. రంజని ‘ఘనత’ తెలిసిన పొదుపు సంఘాల వాళ్లు, ఆమెని అందులోకి చేర్చుకుని ఆమెనే నాయకురాలిగా ఎన్నుకున్నారు. డ్వాక్రా సంఘం నాయకురాలిగా, చదువుకున్న మహిళగా కొత్తరేమల్లెలో పనులన్నీ చక్కబెడుతున్న తీరును చూసి అధికారులు ఆ ఊళ్లోని పన్నెండు పొదుపు సంఘాలకు ఇన్‌ఛార్జ్‌గా రంజనిని నియమించారు. ఒక్కో పొదుపు సంఘంలో ఎనిమిది నుంచి పది మంది మహిళలు భాగస్వాములు. 
      ప్రభుత్వం కొత్తగా బీమా మిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. మండలంలో ఎవరైనా డ్వాక్రా సభ్యులు అకస్మాత్తుగా చనిపోతే, వారికి ఆర్థికసాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశం. దీనికోసం ప్రభుత్వం ఏజెంట్లను నియమించి, వారికి బ్యాంకు అకౌంట్‌ ఇచ్చి, అందులో పదివేల రూపాయలు వేస్తుంది. అలాగే అయిదు వేల రూపాయల జీతంతో పాటు ఒక్కో కాల్‌కి బోనస్‌ కూడా ఇస్తుంది.
      చనిపోయిన వారి మరణ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందించిన వారికి ఆకర్షణీయ బోనస్‌లతో తీర్చిదిద్దిన ఈ ఉద్యోగానికి డిగ్రీ చదివిన డ్వాక్రా సభ్యులు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. చదువుల్లో ముందుండే రంజనీనే బాపులపాడు మండలంలో బీమా మిత్ర ఏజెంటుగా నియమితురాలైంది. ఏజెంట్ల మీటింగుల పుణ్యమా అని కొన్నాళ్లకు మిగతా ఏజెంట్లతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. బీమా మిత్ర ద్వారా ఎంతలా సంపాదించుకోవచ్చో తెలుసుకుందక్కడ.
      ఒకప్పుడు నచ్చినప్పుడు- పదీ పదిహేను రోజులకి వివరాలు అందించే రంజని, బోనస్‌ల గురించి తెలుసుకున్నాక వాటి వెంట పరిగెట్టడం మొదలెట్టింది. వారం రోజుల్లోపే మరణ ధ్రువీకరణపత్రం అందించి, పెద్దకర్మ కల్లా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం రాబట్టుకొచ్చేది. అయితే, బాధితులకొచ్చే ఆ సొమ్ములో పది శాతం వాటా తీసుకోవడమూ మొదలెట్టింది రంజని. ఇప్పుడా వాటా కోసమే బయల్దేరదీసింది. చనిపోయిన వ్యక్తి డ్వాక్రా సభ్యురాలైతే.. వాళ్ల కుటుంబానికి డబ్బులిప్పించి, వాటిలో పది శాతం దండుకోవచ్చు. లేకపోతే వివరాలు అందించినందుకు బోనస్‌ అయినా వస్తుంది. చనిపోయినవారు డ్వాక్రా సభ్యులా కాదా అని వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయడం ఆమె బాధ్యత.

* * *

      హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నూజివీడు వెళ్లే ప్రధాన రహదారి అది. నిత్యం రద్దీగా ఉంటుంది. మండల కార్యకలాపాలన్నీ అక్కణ్నుంచే జరగడం, పెద్ద మార్కెట్‌ యార్డు ఉండటంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అయితే చెప్పనవసరం లేదు. లారీలు లోళ్లు వేసుకుని తిరుగుతూనే ఉంటాయి.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొహం గుర్తుపట్టలేకపోయారు. ఒక మహిళగా మాత్రం గుర్తించారు. మధ్యాహ్నం అవుతున్నా ఆమె కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో పోస్టుమార్టం చేయించాలని పోలీసులు నిర్ణయించారు.
      పోస్ట్‌మార్టం నివేదిక చూసిన పోలీసులతో పాటు రంజని కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే చనిపోయింది ఓ హిజ్రా!
      పోలీసులు ఆమె కుటుంబం గురించి విచారించారు. అమ్మానాన్నలు లేరని తెలిసింది. దగ్గరి బంధువులకు కబురు చేసినా ఎవరూ రాలేదు. హిజ్రా కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు భావించారు. ముందు శవాన్ని తరలించి బంధువులకు నచ్చజెప్పాలని పోలీసులు అనుకున్నారు. తన పని తాను చేయడానికి డ్వాక్రా ఇన్‌ఛార్జ్‌ రంగమ్మను కలిసింది రంజని. చనిపోయిన ఆమె నెల కిందటే డ్వాక్రా గ్రూపులో చేరిందని, ఆ విషయం తమిద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియదని చెప్పుకొచ్చింది రంగమ్మ. 
      ‘తల్లిదండ్రులు లేరు. ఈమధ్యనే డ్వాక్రా గ్రూపులో చేరింది. ఆ విషయం మిగిలిన సభ్యులకు కూడా తెలియదు’ ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆ రాత్రి రంజనికి నిద్రపట్టలేదు. బ్రాహ్మీ ముహూర్తంలో మెరుపులాంటి ఆలోచనొకటి వచ్చిందామెకి. ‘చనిపోయిన హిజ్రా డ్వాక్రా సభ్యురాలని ఎవరికీ తెలియదు కాబట్టి ఆ వచ్చే అరవై వేల రూపాయల్ని నేనూ, రంగమ్మా చెరిసగం తీసేసుకోవచ్చు. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏదో ఒకటి చేయొచ్చు. కానీ, రంగమ్మ ఒప్పుకుంటుందో లేదో’ ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని ఆలోచించింది రంజని.
      రంగమ్మ ఈ మధ్యనే కూతురికి పెళ్లి చేసి పంపించింది. పుట్టింటి నుంచి మంచంతో పాటు సామాను, వంట సామగ్రిని ఇంకా పంపించలేదని వియ్యపురాలు గొడవచేస్తోంది. కూతురు మొహం కళ్లలో మెదలగానే రంగమ్మ ఏమీ మాట్లాడలేదు. కూతురి కోసం ఆ పనికి ఒప్పుకోక తప్పలేదు. హిజ్రాకి సంబంధించిన వివరాలను మండలాఫీసులో అందించి ఇంటికెళ్తుంటే రంజనికి రంగమ్మ నుంచి ఫోనొచ్చింది. 
      రంజని అక్కడికెళ్లేసరికి పెద్ద గొడవ జరుగుతోంది. శవాన్ని ఆ ఊరి శ్మశానంలో పాతిపెట్టడానికి వీల్లేదని గ్రామ పెద్దలు తీర్మానించారు. ప్రమాదం జరిగి రెండో రోజు కూడా పూర్తవుతున్నా ‘మిగతా’ కార్యక్రమాలు ఓ కొలిక్కి రాలేదు. ఒక హిజ్రాను ఊరి శ్మశానంలో పాతిపెడితే ఊరికి అరిష్టమని గ్రామ పెద్దలు పోలీసులతో వాదిస్తున్నారు.
      రాత్రిళ్లు అంత్యక్రియలు చేయకూడదని అక్కడి నియమం. అప్పటికే అంధకారం అలముకుంటోంది. శవాన్ని కదిలించడానికి బంధువులెవ్వరూ ముందుకు రావడంలేదు. మా పరువు తీశాడని నోటికొచ్చినట్లు తిడుతున్నారు. వాడు చచ్చిపోవడం మంచిదైందని, పీడ వదిలిందని అరుస్తున్నారు. వాడిని ముట్టుకుంటేనే పాపమని దగ్గరికెవ్వరూ వెళ్లడంలేదు. పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పి చూస్తున్నా ఎవ్వరూ మాట వినడం లేదు. ఊరి సంప్రదాయాల్లో తలదూర్చవద్దని పోలీసులకు చెబుతున్నారు గ్రామ పెద్దలు. ఏం జరగబోతుందోనని ఆత్రంగా జనం గుమిగూడి చూస్తున్నారు. 
      పోస్టుమార్టం చేశాక సరిగ్గా మూటగా కట్టకపోవడంతో అక్కడక్కడా రక్తం బొట్లు కారి ఈగలు ముసురుతున్నాయి. అయినా ఎవ్వరికీ పట్టడంలేదు. పెద్దల గొడవ ఓ పట్టాన తేలేలా కనపడ్డంలేదు. ఇదంతా చూస్తున్న రంజనీకి హిజ్రా పుట్టుపూర్వో త్తరాలు తెలుసుకోవాలనిపించింది. రంగమ్మను వివరాలడిగింది.

* * *

      ‘‘ఈ ఊర్లోనే, ఈ ఇంట్లోనే రామారావు అన్నయ్య, జ్యోతి వదిన ఉండేవాళ్లమ్మా! వాళ్ల మొదటి కొడుకు రాజేష్‌. స్నేహితులతో ఆకతాయిగా బైక్‌ మీద వెళ్తూ ప్రమాదానికి గురై చచ్చిపోయాడు. చాలా చిన్న వయసే. కొడుకు మరణంతో వాళ్లు బాగా కుంగిపోయారు. అప్పట్లో ఇంకా పిల్లలు కావాలని వదిన ఆపరేషన్‌ చేయించుకోలేదంట. పిల్లల కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెళ్లయిన ఇరవై ఏళ్లకు పిల్లలు ఎలా కలుగుతారని ఊరంతా అనుకునేదమ్మా. వదిన కడుపుతో ఉందని తెలిసి ఓ రోజు ఊరంతా ఆశ్చర్యపోయింది. ఎందరు దేవుళ్లకి మొక్కిందో, ఎన్ని పూజలు చేసిందోగానీ, వదిన కడుపునో కాయ కాసింది. మళ్లీ మగ పిల్లాడే. చనిపోయినవాడే మళ్లీ పుట్టాడనుకున్నారు.
      ‘‘కొడుక్కి ‘రమణ’ అని పేరుపెట్టారు. పెద్దకొడుకు మరణాన్ని మర్చిపోలేని వాళ్లు చిన్నప్పటి నుంచి రమణను చాలా జాగ్రత్తగా పెంచారు. కొడుకుని బయటికెక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. వాడు పెద్దవాడవుతున్న కొద్దీ జాగ్రత్త పేరుతో కట్టేశారనుకో! మగవాళ్లతో స్నేహం చేస్తే పెద్ద కొడుకులా గాలి తిరుగుళ్లు తిరిగి ఎక్కడ ప్రాణం మీదకు తెచ్చుకుంటాడోనని ఎంతవరకూ ఆడపిల్లలతోనే తిప్పేది వదిన. రమణగాడు రాను రాను మగాళ్లను పట్టించుకోవడమే మానేశాడు. ఆడాళ్లు చేసే పనులు చేయడం, వాళ్ల దుస్తులు వేసుకోవడం, ఆడవారిలాగే మాట్లాడటం మొదలుపెట్టాడు. 
      ‘‘పదేళ్లు దాటేసరికి వాడు మగపిల్లాడా, ఆడపిల్లా అనే సందేహం వచ్చేసిందనుకో. భయపడిన అన్నయ్య, వదిన్ని తిట్టి, రమణగాణ్ని బయట తిరిగి రమ్మని పంపించేవాడు. వాడు వెంటనే ఇంటికొస్తే ఒప్పుకునేవాడు కాదు. రమణ మగాళ్లతోనే ఉండాలని హాస్టల్లో కూడా వేశాడు. అక్కడ అబ్బాయిలతో ఉండలేకపోయాడు రమణ. వాళ్లూ వీడి చేష్టలు తట్టుకోలేక గొడవ చేసి మరీ పంపించేశారు. బయటికెళ్లినా అమ్మలక్కలతోనే ముచ్చట్లు పెట్టేవాడు. వాడి చదువూ చట్టుబండలయ్యింది.
      ‘‘పాతికేళ్లు వచ్చేసరికి రమణలో చాలా మార్పులొచ్చేశాయి. ఆడాళ్లతో ముచ్చట్ల కోసం ఎవరింటికి బడితే వాళ్లింటికి వెళ్లేవాడు. ఒకసారి నాకు చెల్లి వరసయ్యే కాంచన స్నానం చేస్తుండగా దాని ఇంట్లోకి చొరబడ్డాడు. మనలో మనమాటమ్మాయ్‌- ‘నీకు అవి ఉన్నట్లు నాకెందుకు లేవ’ని దాన్ని అడిగాడంట. అప్పుడే దాని భర్త వచ్చి ఇద్దరినీ చూశాడు. కోపం కట్టలు తెంచుకుని పెళ్లాన్ని పిచ్చి కొట్టుడు కొట్టాడు. ‘పేరుకి వాడు మగాడేగానీ, అన్నీ ఆడ లక్షణాలే’ అని కాంచన ఎంత చెప్పినా అతను వినలేదు. పంచాయితీ కూడా పెట్టించి, అన్నయ్యా వదినలను దోషులుగా నిలబెట్టాడు. పెద్దలు వాళ్లను హెచ్చరించారు. రమణను ఎవరింటికీ పంపొద్దని హుకుం జారీ చేశారు. అతణ్ని ఎవరూ తమ ఇళ్లకి రానివ్వొద్దని చెప్పారు. ఒక రకంగా వెలేశారనుకో! అప్పట్నుంచి మగాళ్లు కూడా రమణని చూసి భయపడి తప్పించుకు తిరిగేవారు. ఒక కొడుకు చచ్చిపోయి క్షోభ పెడుతుంటే, వీడు ఇలా అయిపోయి నరకం చూపిస్తున్నాడని రమణను ఇంట్లోంచి తరిమేశాడు అన్నయ్య. మళ్లీ ఇంటికి, ఊరికి రావొద్దని గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత రోజూ ఏడుస్తూనే ఉండేవాళ్లమ్మా అన్నావదినలు!
      ‘‘విచిత్రమేంటంటే ఒక సంవత్సరం తర్వాత రమణ తిరిగొచ్చాడు. ఈ సారి అచ్చం అమ్మాయిలాగే మారిపోయాడు. పేరు ‘రమణి’గా మార్చుకున్నాడు. ఇంట్లోంచి తరిమేశాక హైదరాబాదు వెళ్లాడంట. అక్కడున్న హిజ్రాలు వాణ్ని ముంబాయి తీసుకుపోయి అమ్మాయిలా మార్చేశారంటమ్మా. అలా మారిపోయాక మళ్లీ హైదరాబాదు వచ్చేసి హిజ్రాలతో కలిసి షాపులవెంట భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేవాడట. అమ్మానాన్నల మీద బాగా బెంగపట్టేసి వచ్చేశాడు.
      ‘‘కన్న కొడుకుని అలా చూసేసరికి అన్నయ్య, వదినలకు తల తిరిగిపోయింది. ఊరు ఊరంతా పెద్ద దుమారం లేచింది. ఊరి పెద్దలు వాళ్లింటిని చుట్టుముట్టారు. తనుంటే ఊరి పరువు పోతుందని, వెంటనే వెళ్లిపొమ్మని బెదిరించారు. అన్నయ్యావాళ్లని అనరాని మాటలన్నారు. వాళ్లా అవమానాన్ని తట్టుకోలేక ఇంట్లోకెళ్లి గడియ పెట్టుకుని నిప్పంటించుకున్నారమ్మా.! నేనప్పుడు అక్కడే ఉన్నా! కేసు అవుతుందని అందరూ పారిపోయారు. శవాల్ని పాతిపెట్టడానికి ఊళ్లో ఎవ్వరూ రాకపోతే రమణగాడే తీసుకెళ్లడం చూసి మా ఆయన సాయంచేశాడు. ఆయన్ని చూసి ఇంకొందరు వచ్చారు. అదంతా తలచుకుంటే కన్నీరాగదు. రమణగాడైతే గుండెలవిసేలా ఏడ్చాడు!
      ‘‘ఆ సంఘటన తర్వాత ఊరి పెద్దలు రమణగాడి గురించి పట్టించుకోవడం మానేశారు. మేం కూడా వాణ్ని ఒక మగాడిలా కాకుండా అమ్మాయిలాగే చూడటం మొదలెట్టాం. ‘మా అమ్మానాన్నలు చనిపోయిన చోటే నేనుంటా, నేనూ ఇక్కడే చచ్చిపోతా’ అని ‘రమణి’ ఇక్కడే ఉండిపోయింది. ఇక్కడే షాపుల్లో భిక్షాటన చేసేది. హైదరాబాదులో హిజ్రాలు చెప్పారేమో, డ్వాక్రాలో చేరింది. హిజ్రాలకు డ్వాక్రాలో చేరే హక్కు ఉంది. ఆ రమణి డ్వాక్రాలో చేరినట్లు మనూర్లో ఎవరికీ తెలియదు. ఊళ్లో పెద్దలకి భయపడి మొదట్లో నేను చేర్చుకోనంటే, ‘ఫిర్యాదు’ ఇస్తానని బెదిరించింది. ఎందుకొచ్చిన గొడవని తక్కువ మంది ఉన్న గ్రూపులో చేర్చుకున్నా. ఆ విషయం అప్పుడే ఎవరితో చెప్పొద్దని అన్నాను. నేనూ దాని గురించి ఎక్కడా, ఎవరితో అనలేదు. పాపం బిడ్డ, ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియదుగానీ, ఇలా ప్రమాదంలో చచ్చిపోయింది’’ కళ్లనీళ్లు పెట్టుకుంది రంగమ్మ.

* * *

      మొత్తం విన్న రంజని మనసులో ఏదో అలజడి. శవం చుట్టూ మూగుతున్న ఈగల్ని చూస్తుంటే తనకీ కన్నీళ్లు తన్నుకొచ్చాయి. రమణి గతం ఆమెను తొలిచేస్తోంది. ఆడదాని జీవితం నిప్పుల కొలిమి మీద వేగుతున్నట్లు ఉంటుంది. అలాంటిది మగాడిగా పుట్టి ఆడదానిలా మారిన రమణి జీవితం ఇంకెన్ని కష్టాలతో సాగి ఉంటుందో అని తలచుకుంటే గుండె పిండినట్లయింది. ‘కఠినాత్మురాలు’ అని జనం అంటుండటంతో నిజంగానే తను రాతి మనిషినన్న నిర్ధరణకు వచ్చిన రంజని మనసుని ఈ సంఘటన తొలిచేస్తోంది. ఏదన్నా ఆకస్మిక మరణం సంభవిస్తే వెళ్లి వివరాలు తీసుకొని వచ్చెయ్యడమే తప్ప మిగతా విషయాల గురించి ఆమె ఎన్నడూ పట్టించుకున్నది లేదు. కానీ, ఇలా వెనక్కి తిరిగి చూస్తే చనిపోయిన వారి జీవితాల వెనుక ఎన్ని కన్నీటి వ్యథలు ఉంటాయో కదా అనిపించిందామెకి. అంతే, తను ఓ నిర్ధరణకొచ్చి పని మొదలుపెట్టింది. తమ కళ్లముందు జరుగుతున్నది చూసి పోలీసులు, గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. రంజని తన సొంత ఖర్చులతో నలుగురు మనుషుల్ని, అంబులెన్సుని పిలిపించింది. అందులోకి శవాన్ని ఎక్కించి విజయవాడలోని విద్యుత్‌ దహన వాటికకు పంపించింది. ‘మధ్యలో నువ్వెవరు? నీకేంటి దీంతో సంబంధం’ అని గ్రామ పెద్దలు మొదట అడ్డంపడ్డారు. అప్పుడు రంజని చూసిన చూపుని వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరేమో!
      ‘‘మీ పంతాలతో శవాన్నలా కుళ్లబెడుతుంటే తప్పులేదుగానీ, ఆవిడ బాధ్యత తీసుకుంటే కోపం తన్నుకొస్తోందే!’’ ఊళ్లో మహిళలు గళమెత్తారు. దాంతో పెద్దలు కిమ్మనకుండా పక్కకి తప్పుకున్నారు. పోలీసులు కూడా రంజనికి సహకరించారు. అలా రమణి శవం పంచభూతాల్లో కలిసిపోయింది. 
      ‘‘ఇంత జరిగాక ఆ డబ్బు నాకస్సలొద్దమ్మా! ఖర్చులన్నీ నువ్వే భరించావ్‌. ఆ డబ్బు నువ్వే తీసుకో. నేను ఎవ్వరికీ చెప్పను’’ రంజనితో అంది రంగమ్మ. 
      ‘‘నీ కూతురుకి సామాను కొనివ్వాలిగా. ఆ డబ్బు వాడుకో. రమణి తల్లిదండ్రుల్ని ఖననం చేయడంలో మీ ఆయన సాయపడ్డాడు. తనని డ్వాక్రా గ్రూపులో చేర్చుకుని ఆదరువు అందించావు. అందుకే ఆ లోకం నుంచి రమణే ఇలా నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటోందనుకో. మెట్టినింట్లో ఒక అమ్మాయి జీవితం సాఫీగా సాగిపోడానికి తన డబ్బు ఉపయోగపడుతున్నందుకు రమణి తప్పకుండా ఆనందిస్తుంది. ఆ డబ్బు గురించి పంచాయతీ వాళ్లు ఏదైనా అడ్డుచెబితే నేను నచ్చజెబుతాను’’ అంటూ అక్కణ్నుంచి బయలుదేరింది రంజని. అయితే, తనిప్పుడు పాత పాషాణ హృదయురాలైన రంజని కాదు. ఆమె ఇప్పుడు నిలువెల్లా మానవత్వం మూర్తీభవించిన మనిషి. ఇక నుంచి బాధితులకి అందే పరిహారంలోంచి ఒక్క పైసా కూడా తీసుకోకూడదని, అలా ఎవరైనా తీసుకుంటున్నట్లు తనకి తెలిస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గట్టిగా నిశ్చయించుకుందామె.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నిజాముద్దీన్‌లో ఓ సాయంకాలం

నిజాముద్దీన్‌లో ఓ సాయంకాలం

సకలాభక్తుల కృష్ణమూర్తి


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌bal bharatam