పదహారణాల బాల్యం

  • 996 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సింహప్రసాద్‌

  • హైదరాబాదు
  • 9849061668
సింహప్రసాద్‌

నగరం నుంచి పల్లెకు తాతయ్య ఇంటికి వస్తుంది శాన్వి. అక్కడ పూసే పువ్వు, పెరిగే చెట్టు, గెంతే ఉడత, పక్షుల కిలకిలలు అన్నీ తనను ఆశ్చర్యపరిచేవే. మరి తాతయ్యతో గడిపిన కాలంలో శాన్వి తెలుసుకున్న ప్రకృతితత్వం ఏంటో చదవండి...
‘వావ్‌!
ఎన్ని పూలో! ఎన్ని రంగుల పూలో! ఎన్నెన్ని రకాల పూలో! గులాబీలు మల్లెలు సన్నజాజులు మందారాలు చేమంతులు... ఓహ్‌ ఎన్ని ఉన్నాయో! తెలుపు, ఎరుపు, పసుపు, గులాబీ, ఊదా, నీలం... ఇంద్రధనుస్సును మరిపించే వర్ణాలే అన్నీ! అన్నీ అరవిచ్చి ఇంతింత కళ్లతో నన్నే చూస్తున్నాయ్‌. ‘హాయ్‌’ అని పలకరిస్తున్నాయ్‌. సువాసనలు వెదజల్లుతూ రారమ్మని పిలుస్తున్నాయ్‌. నా బుజ్జి తమ్ముడిలా ముచ్చటగా నవ్వుతున్నాయ్‌!
      ఆ నవ్వు ఎంత ముగ్ధంగా మనోహరంగా ఉందీ! మురిపాల పాల నురగలా ఎంత స్వచ్ఛంగా తీయగా హాయిగా ఉందీ! అమాంతం ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది! ఒక్కరోజులో నా చిన్నిపూల తోట పూలలోకమై గుబాళిస్తోంది. సన్నాయి రాగాలు ఆలపిస్తూ నన్ను గాలిలో తేలియాడిస్తూ మధుర సుందర సుకుమార పుష్ప ప్రపంచంలో విహరింపజేస్తోంది! ఆశ్చర్యం! ఆ పూల సుగంధంలోంచి నాలోకి లోలోకి ఏదో వినూత్న శక్తి వచ్చి చేరుతోంది.
నేను గబగబా పెద్దదాన్నయిపోయాను. కిలకిలా నవ్వాను. గలగలా నవ్వుతూ చూశాను. మెల్లగా గెంతుతూ పూలన్నింటినీ నిమురుతూ ముద్దాడుతూ సీతాకోక చిలుకలా తిరుగుతున్నాను. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. చిన్నిచిన్ని పూబాలలు చిట్టిపొట్టి అడుగులేస్తూ నా దగ్గరికి వచ్చాయి. నేను ఆశ్చర్యంగా చూస్తూండగానే నా వీపుకి పూలరెక్కలు అతికించాయి. బాపురే! నేనిప్పుడు ఎగరగలను. రెక్కలు చాచి చుక్కలతీరం దాకా వెళ్లిపోగలను! ప్రకృతి అందాలను ఆనందాలను కళ్లారా చూసి తనివి తీరా ఆనందిస్తాను! పూబాలలూ! మీకు వేలవేల కృతజ్ఞతలు!
      ఇంతలో ‘మేం తక్కువా’ అన్నట్లు రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగిరొచ్చాయి.
      ఇంతింత కళ్లతో అబ్బురంగా చూస్తోంటే అవొచ్చి నా తలమీద పూలకిరీటం పెట్టాయి. మైమరిచిపోయాను. వాటికి ధన్యవాదాలు చెబుదామనుకున్నానో లేదో అవి నా చేతులు పట్టుకుని పైకి... పైపైకి లేపాయి. వాటితోపాటు నేనూ ఎగురుతూ... అలా అలా కొండలు గుట్టలూ నదులూ దాటాం. మా వెనక పూబాలలూ దండులా వచ్చేస్తున్నాయ్‌!
      ‘రండి రండి...’ వాటి వంక చూస్తూ ఉత్సాహంగా అరిచాను. అడవి మధ్యలోకెళ్లాం. ఎన్ని జంతువులో! సింహం, పులి, ఏనుగు, తోడేలు, కుందేలు, లేడి... పుస్తకాల్లో ఉండేవన్నీ ఉన్నాయి. చిత్రం! అవన్నీ చిన్నగా, చక్కగా ఉన్నాయి. అందరం స్నేహితుల్లా చేయీ చేయీ పట్టుకున్నాం. ఆడాం. పాడాం. మా చుట్టూ ఆనందలోకం కొలువు తీరుతోంది... ఇంతలో ఆకాశంలో మెరుపు మెరిసింది. మేఘం గర్జించింది. నా గుండె ఝల్లుమంది...’

***

       భళ్లున కల పగిలింది. దిగ్గున లేచి కూర్చుంది ఆరేళ్ల శాన్వి. గుండెల మీద చేతులు ఉంచుకుని కళ్లు విప్పార్చి చుట్టూ భయం భయంగా చూసింది. మసక కాంతిలో గదిలో వస్తువులు, పక్కమీది నానమ్మ, పట్టెమంచం మీద తాతయ్య అన్నీ అంతా కన్పించారు. అంతే తనెక్కడున్నదీ గ్రహింపునకొచ్చింది. బడికి సెలవులివ్వడంతో పదిరోజులు గడుపుదామని మహానగరం నుంచి మూడురోజుల కిందే తాతయ్య ఇంటికి వచ్చింది. మెల్లగా లేచింది. చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లింది. తలుపు తీసి, దగ్గరికి చేరవేసి వీధిలోకెళ్లింది.
అప్పుడప్పుడే చీకటితెరలు మెల్లగా విచ్చుకుంటున్నాయి. చల్లగాలి మంద్రంగా వీస్తూ మనశ్శరీరాలను నిమురుతోంది. ప్రకృతి ప్రశాంత రాగాలాపన చేస్తోంది. చెట్లూ, పక్షులూ ఇంకా నిద్రలోనే ఉన్నాయి. వికసిత నేత్రాలతో చుట్టూ చూసి ఎన్నడూ చూడని అందాలు కొంగొత్త ఆనందాల్ని దోసిళ్లతో తెచ్చిపోస్తోంటే, అరచేతుల మధ్య చెంపల్ని బంధించి ‘బాపురే’ అనుకుంటూ చూసింది శాన్వి. అపురూపమైన అనుభూతిలో నిలువునా మునిగింది. తేలింది. ఇంటిముందు మామిడి, వేప, కొబ్బరి చెట్లు... కూరగాయల మొక్కలు, పాదులు, పూలమొక్కలు- అన్నీ తపస్సు చేస్తూ ఉన్నాయి.
      తల అటూయిటూ ఊపి, చిన్నగా నవ్వుతూ వాటిని పలకరించింది. ఇంతలో ఏదో గుర్తుకువచ్చి గబగబా ముందుకెళ్లింది. ముందురోజున తెచ్చి నాటిన పూలమొక్కలను ఆప్యాయంగా చూస్తూ వాటిని సమీపించింది.
      అంతకు ముందురోజు... పూలమొక్కలు తక్కువగా ఉన్నాయని గొడవచేసింది శాన్వి. దాంతో తనను నర్సరీకి తీసుకెళ్లి కావాల్సిన మొక్కలు తీసుకొచ్చి పాతించారు తాతయ్య. ఆకుల మీద ముత్యాల బిందువులు కదుల్తోంటే గొంతుక్కూర్చుని మైమరిచి చూసింది. ఆకుల్ని సున్నితంగా కదిపింది. నీటిబొట్లు జారిపడ్డాయి. కిలకిలా నవ్వింది. అప్పుడో అద్భుతం చూసింది. ఓ గులాబీ మొగ్గ అప్పుడప్పుడే కన్ను తెరిచి లోకాన్ని చూస్తోంది... కాదుకాదు శాన్వినే చూస్తోంది!
      ఆ మొగ్గని మహదానందంతో సున్నితంగా తాకి మురిసిపోయింది. తర్వాత అన్ని పూలమొక్కల దగ్గరికీ వెళ్లి వాటిని ఆప్యాయంగా నిమిరింది. మరో రెండు పూలు విచ్చుకున్నాయి. ఇంకొన్ని వికసించడానికి సిద్ధమవుతున్నాయి. పరమానందపడింది. ఏదో సాధించానన్న తృప్తితో పొంగిపోయింది. ఊగిపోయింది.
ఆపైన, ‘‘తాతయ్యా తాతయ్యా’’ అంటూ ఒక్కపరుగున ఇంట్లోకెళ్లి తాతయ్యని లేపేసింది.
      ‘‘ఏవిటి తల్లీ...’’
      ‘‘ఇలారా చెబుతా’’ అని చేయిపట్టుకుని లాగింది. ఆయన వస్తోంటే కళ్లజోడు అందించింది. తోటలోకి లాక్కొచ్చి కొత్త పూలమొక్కలకు పూసిన పూలను, అదంతా తన సృష్టే అన్నంత గొప్పగా చూపించింది.
      ‘‘మా శాన్వి చిట్టిపొట్టి చేతుల స్పర్శకి పులకించి పూశాయన్నమాట’’ అన్నాడాయన అభినందన పూర్వకంగా చూస్తూ. 
      ‘‘అవును తాతయ్యా. రేపింకా పూస్తాయి. ఆ తర్వాత ఇంకా బోలెడు పూస్తాయి. ఇదంతా రాత్రి కలలో నాకు కనిపించినట్లుగా పూలవనంగా మారిపోతుంది’’
      ‘‘అలాగా. ఇదంతా పూదోటలా మారిపోయి నీకు కలలో కన్పించిందా?’’ ఆశ్చర్యం నటించాడు తాతయ్య.
      ‘‘అవును! ఎన్ని పూలో ఎన్ని రంగులో ఎంత బాగుందో చెప్పలేను!’’
      ‘‘మరి నువ్వేం చేశావూ? అవన్నీ కోసేశావా?’’
      ‘‘ఉహుఁ. అప్పుడేమో నాకు రెక్కలొచ్చేశాయి. ఎంచక్కా ఎగిరి అన్ని పూలనూ ముద్దుపెట్టుకున్నాను. అవెంత మురిసిపోయాయో అచ్చం చిన్నితమ్ముడిలానే! మరేమో అప్పుడు సీతాకోక చిలుకలతో కలిసి ఎగిరాను తాతయ్యా. అడవిలో అన్ని జంతువుల్తో కలిసి ఆడుకున్నాను తెలుసా!’’
      ‘‘ఓహో అవన్నీ మహాలక్ష్మీదేవి వచ్చినట్లు సంబరపడ్డాయన్న మాట’’
      ‘‘ఆవిడెవరు?’’ 
      ‘‘నువ్వే. శాన్వి అంటే మహాలక్ష్మి కదా!’’
      పొంగిపోతూ ముసిముసిగా నవ్వింది.
      ‘‘మా తోటలో విరిసిన ఈ మొదటి గులాబీ మా శాన్వికి...’’ అంటూ కోయబోయాడు తాతయ్య. చటుక్కున వారించింది. ‘‘కోయకూడదు తాతయ్యా. కోస్తే ఏడుస్తాయి. మొక్కలకి కూడా ప్రాణం ఉంటుందట! మా పుస్తకంలో ఉంది’’
      చిన్నగా నవ్వి తల నిమురుతూ.. ‘‘బాగా చెప్పావు. పూల బాధ గురించి కరుణశ్రీ తాతయ్య చక్కని కవిత్వం రాశాడు తల్లీ’’ అంటూ వెళ్లి ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు తాతయ్య.
      ‘‘అదేదో నాకు చెప్పవూ!’’ తాతయ్య చేతులు పట్టుకుని అడిగింది.
      ‘‘పూల గొంతుల్ని గోళ్లతో గిల్లి మొక్క నుంచి వేరుచేస్తారట ఆడవాళ్లు. తర్వాత వాటిని సూదులతో గుచ్చి మాలలు కడతారట. తలలో ముడుచుకుని తిరుగుతారట. తెల్లారాక నలిగి వాడిన పూలని విసిరేసి చీపుళ్లతో తుడిచి ఆవల పారబోస్తారట. ఇలా చెప్పి బాధపడిపోతుంది పాపం ఓ పూబాల!’’
      ‘‘సూదుల్తో గుచ్చితే బాధెయ్యదూ. అలా చెయ్యకూడదు. అసలు కోయనే కూడదు కదా తాతయ్యా?’’
      అవునంటూ తలాడించాడు తాతయ్య.
      ‘‘పొద్దుటే కబుర్లలో పడ్డారేంటి తాతా మనవరాలూ!’’ అంటూ వచ్చింది నానమ్మ.
      చటుక్కున లేచెళ్లి నానమ్మ చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి గులాబీ పువ్వుని చూపించింది శాన్వి.
      ‘‘నిన్న పాతితే ఇవాళ పువ్వు పూసిందా! ఇక రోజూ శాన్వి కాసిని నీళ్లుపోస్తే ఏకంగా పూలవనం అయిపోతుందేమో!’’
      ‘‘అదీ అయ్యిందిట- తన కలలో!’’ అన్నాడు తాతయ్య నవ్వుతూ.
      అమాంతం శాన్విని ఎత్తుకుని, ‘‘మా అమ్మే! మా తల్లే!’’ అంటూ బుగ్గలు పుణికింది నానమ్మ.
      నానమ్మ ఇల్లూ వాకిలీ చిమ్మి కళ్లాపి జల్లుతోంటే అబ్బురంగా చూసింది శాన్వి. తనకిలాంటివి కొత్త. తర్వాత నానమ్మ స్నానం చేసి పెరట్లో తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తోంటే శాన్వి కూడా తిరిగింది. తులసి మొక్కకు పూజచేసి దణ్నం పెట్టుకున్నారు. రెండు ఆకులు తుంచి తీర్థపాత్రలో వేసి ఆ తీర్థాన్ని శాన్వికిచ్చింది. ఆకుల్నీ దోసిట్లో వేసి తినమంది.
      ‘‘ఈ ఆకుల్ని తింటారా నానమ్మా?’’ ఆశ్చర్యపోయింది.
      ‘‘వీటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. రోజూ పొద్దునే నాలుగు తులసాకులు నమిలితే నోరు, గొంతు రోగాలు మన దగ్గరికి రానేరావు. అదీగాక తులసి అంటే విష్ణుమూర్తికి ఇష్టం తెలుసా..!’’
      అలాగా అన్నట్టు తలాడించింది శాన్వి. అప్పుడు చూసింది దేవుళ్ల పటాల మీద ఉంచిన పూలని. 
      ‘‘నానమ్మా!’’ అనర్థమేదో జరిగిపోయినట్టు బిగ్గరగా అరిచింది.
      ‘‘ఏమయ్యిందే!’’
      ‘‘పూలు కోశావేంటి? కోయకూడదు. మొక్కలు బాధపడతాయని తాతయ్య కూడా చెప్పారు’’, ఎంతో బాధపడిపోతూ చెప్పింది ఆరిందాలా.
      ‘‘దేవుడి కోసం కోయొచ్చు...’’
      ‘‘దేవుడేం చేసుకుంటాడు? జడేసుకుని పూలు పెట్టుకుంటాడా?’’
      ‘‘తప్పు. అలా అనకూడదు. ప్రతి పువ్వూ దేవుడి పాదాలను చేరుకోవాలనుకుంటుంది తల్లీ’’
      నుదురు చిట్లించి అయోమయంగా చూసింది శాన్వి.
      ‘‘అవతల ఎసరు మరుగుతోంది... కబుర్లూ కాకరకాయలూ మీ తాతయ్య చెబుతారు, వెళ్లి అడుగు...’’ అంది నానమ్మ. వెంటనే అరుగు మీద కూర్చున్న తాతయ్య దగ్గరికెళ్లి, ఆయన చేతిలోని పత్రికని విసురుగా లాగేసింది.
      ‘‘ఏమైంది తల్లీ’’
      ‘‘చూడు తాతయ్యా. దేవుడి కోసం పూలు కోసెయ్యొచ్చు అంటోంది నానమ్మ’’ ఫిర్యాదు చేసింది.
      మందహాసం చేశాడాయన. ‘‘పూలు దేవుడి కోసమే తల్లీ...’’
      ‘‘పూలు కోస్తే అవి బాధపడతాయన్నారుగా!’’
      ‘‘పిచ్చితల్లీ’’ అంటూ శాన్విని ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు. ‘‘రోజూ ఎన్నో పూలు పూస్తూంటాయి. కొన్నింటిని దేవుడికి పెడతాం. కొన్ని ఆడవాళ్ల సిగలో కులుకుతాయి. మిగతావి ఒకట్రెండు రోజుల్లో వాడి నేలరాలతాయి. వాటి ఆయుష్షు కొంచెమే. బతికిన కొద్ది సమయంలోనే మంచిపనులు చేయాలనుకుంటుంది పువ్వు. మనుషులూ అలాగే అనుకోవాలి!’’
      ‘‘అంటే ఏం చేయాలి తాతయ్యా’’
      ‘‘తోటివాళ్లకు సాయం చేయాలి. ఆపదల్లో ఉన్నవాళ్లని ఆదుకోవాలి. ఆకలితో ఉన్నవాళ్లకి అన్నం పెట్టాలి.’’
      అర్థమైనట్టు తలాడించింది శాన్వి. కాసేపు ఇంటిముందు ఆటలాడింది. ఉడతల్ని చూసి సంబరపడి వాటి వెంట పరుగులు పెట్టింది.
      ‘‘ఇక్కడ ఎన్ని ఉడతలు ఉన్నాయో తాతయ్యా! నగరంలో అంతగా కనిపించవు.’’
      ‘‘ఉడతల్నే కాదు చెట్లనీ, పిచ్చుకల్నీ, కాకుల్నీ, అన్నింటినీ తరిమేస్తోంది నగరాల కాలుష్యం తల్లీ...’’
      ‘‘అవును తాతయ్యా! చెట్లని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని మా మాస్టారు చెప్పారు. కానీ మొక్కలు పాతడానికి నేల ఇంటి దగ్గరా లేదు బడిలోనూ లేదు!’’ చేతులు తిప్పుతూ చెప్పింది.
      ‘‘నువ్వు పెద్దయ్యే నాటికి ఈ చెట్లూ పుట్టలూ అన్నీ అంతరించిపోతాయేమో తల్లీ!’’ నిట్టూర్చారు తాతయ్య.
      ‘‘మరెలా?’’ దిగులుగా చూసింది శాన్వి. 
      ‘‘ఇప్పుడు స్వచ్ఛభారతదేశం కోసం నడుం కట్టినట్టే పచ్చని భారతదేశం కోసమూ అందరం సిద్ధం కావాలి. అన్నట్టు ఉడతంటే గుర్తుకొచ్చింది. ఉడతసాయం అన్నమాట విన్నావా తల్లీ!’’
      తల అడ్డంగా ఊపింది. 
      ‘‘శ్రీరాముడు లంకకెళ్లి సీతని తీసుకు రావడానికి సముద్రం మీద వంతెన నిర్మిస్తున్నాడు. అది చూసిన ఓ ఉడత తనవంతుగా తోకని ఇసుకలో దొర్లించి, కొంచెం ఇసుకని వంతెన కన్నంలో పోసిందట. ఆ సాయం చిన్నదే కానీ దాని స్థాయికి అది పెద్దపనే. అందుకే రాముడు ఉడత వీపుమీద ఆప్యాయంగా నిమిరాడు. వాటి వీపుమీద ఉండే మూడుచారలు రాముడి వేళ్లగుర్తులే. అందుకే ఎవరికైనా సాయం చేసినప్పుడు ఏదో ఉడతా భక్తిగా/సాయంగా అంటారు’’ అన్నాడు తాతయ్య. ఇంతలో పిచ్చుకల సవ్వడి శాన్విని ఆకర్షించింది. దాంతో తలపైకెత్తి చూసింది. ఇంటి చూరుకి వరి       కంకుల ‘కుప్ప’ వేలాడదీశారు. అయిదారు పిచ్చుకలు దానిలోని గింజల్ని పొడుచుకుతింటూ కిచకిచ శబ్దం చేస్తున్నాయి.
      ‘‘బోల్డన్ని గింజలు దొరికేసరికి ఆనందపడిపోతున్నాయి కదా తాతయ్యా.’’
      ‘‘అవునమ్మా. పల్లెల్లో వరిపంట చేతికి రాగానే వరికంకుల్ని ఇంటిచూరుకి వేలాడదీస్తారు. అలా పిచ్చుకలకు విందు చేస్తారు. సాటి జీవులపట్ల ప్రేమను చాటుకుంటారు.’’
      తాతయ్య వంక ఆరాధనా పూర్వకంగా చూసింది శాన్వి.
      ‘‘తాతయ్యా, మంచి కథ చెప్పు. అన్నీ జంతువులే ఉండాలి’’ రాత్రి పడుకోవడానికి పక్కలో చేరుతూ అడిగింది.
      ‘‘జంతువుల్లో క్రూర జంతువులూ సాధు జంతువులూ అని రెండు రకాలుంటాయి. సింహం, పులిలాంటివి క్రూర జంతువులు. అవి మంచివి కావు...’’
      ‘‘అవీ మంచివే తాతయ్యా’’ వెంటనే అడ్డుకుంది శాన్వి.
      ‘‘అవి మంచివా!’’
      ‘‘ఊఁ... అవీ పిల్లల్ని కంటాయి. పాలు ఇస్తాయి. వాటి పిల్లల్నెవరూ కొట్టకుండా కాపలా కాస్తాయి. ఇంకా...!’’
      మనవరాలి పరిశీలనా శక్తికి ఆశ్చర్యపోయాడు తాతయ్య. ‘‘బాగా చెప్పావు తల్లీ. అవి తమ ఆకలి తీర్చుకోవడానికి జంతువుల్ని వేటాడతాయే తప్ప అవీ మంచివే. ఆ మధ్య దిల్లీలో ఏం జరిగిందో తెలుసా?’’
      ‘‘జూలోనా? టీవీలో చూశాను తాతయ్యా’’ లేచి కూర్చుంటూ అంది.
      ‘‘...అంతా పెద్దపులి ఆ బాబుని చంపిందనుకున్నారు. కానీ అది నిజం కాదని తర్వాత తెలిసింది. అసలేం జరిగిందంటే... ఫొటోలు తీస్తూ పొరబాటున ఓ కుర్రాడు పులి బోనులో పడ్డాడు. పులి అతడి దగ్గరికొచ్చింది. ఇంతలో మిగతా జనం గోలచేశారు. పులి మీదికి రాళ్లు విసిరారు. వాళ్లు ఆ పిల్లాణ్ని రాళ్లతో కొడుతున్నారనుకుంది పులి. తన బిడ్డని పళ్ల మధ్య ఇరికించుకుని తీసుకెళ్లినట్టుగానే, ఆ బాబు పీక కరచిపట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి వదిలింది. అంతే తప్ప అతణ్ని తిందామనుకోలేదు. దాని పళ్లు గుచ్చుకోవడం వల్ల, భయంతో ఆ పిల్లాడు చనిపోయాడు. జనం సద్దు చేయకుండా ఉండి ఉంటే పులి ఆ పిల్లాణ్ని ఏమీ చేసేదే కాదు’’
      ‘‘అవును తాతయ్యా. చెట్లూ, పక్షులూ, జంతువులూ అన్నీ అంతా మంచివే, అన్నీ దేవుడే పుట్టించాడు...’’ అని చెబుతూనే ఏదేదో కలవరిస్తూ నిద్రలోకి జారుకుంది శాన్వి. మర్నాడు శాన్వి ఇంట్లో కనిపించకపోయేసరికి ఆమెని పిలుస్తూ వీధిలోకెళ్లాడు తాతయ్య! ఓ చెట్టు దగ్గర కనిపించింది. చప్పుడు చేయకుండా దగ్గరికి వెళ్లాడు. చిటికెన వేలంత ఉన్న ప్రాణి నేలమీద పడి కొట్టుకుంటోంది. ముదురు గులాబీరంగులో ఉంది. లోపలి అవయవాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిని అతి సున్నితంగా దీక్షగా ఆకు మీదికెక్కిస్తోంది శాన్వి.
      తలెత్తి చూశాడు తాతయ్య.
      కొమ్మ మీద ఒక ఉడత దేన్నో వెదుకుతూ ఆందోళనతో తిరుగుతూ కనిపించింది. అనుకోకుండా దాని పిల్ల కొమ్మ మీదినుంచి జారిపడిందని అర్థమైంది. అయినా ప్రాణాపాయం జరక్కపోవడం అదృష్టమే అనుకుని... తన మనవరాలు ఏం చేస్తుందోనని గమనిస్తున్నాడు. శాన్వి మెల్లగా బుల్లి ప్రాణి ఉన్న ఆకుని తీసుకెళ్లి కొమ్మమీద పెట్టింది.
      ఒక్కుదుటున ఉడత తన బిడ్డని సమీపించింది. భరోసా ఇస్తూ ఏదో చెబుతున్నట్లు ముద్దాడింది. అంతే... ఆనందంతో చప్పట్లు కొట్టింది శాన్వి. మనవరాలిని ముద్దుపెట్టుకున్నాడు తాతయ్య!

* * *

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam