ఆస్తి కోసం

  • 79 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చిత్తూరి సాయిప్రసాద్ రెడ్డి

  • చింతలగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.
  • 6302684064

ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన సూరయ్య కుటుంబానికి రామ్మూర్తి ఆసరాగా నిలిచాడు. తన పొలంలో రెండెకరాలను సాగుచేసుకుని బతకమన్నాడు. అనుకోకుండా రామ్మూర్తి చనిపోయాడు.  ఇచ్చిన రెండెకరాల స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని ఆశ పుట్టింది. పథక రూపకల్పన జరిగిపోయింది.. ఇంతకీ ఆ పథకం ఫలించిందా?
రామ్మూర్తి,
రాధమ్మ దంపతులు. వారిది వ్యవసాయ కుటుంబం. ఇరవై ఎకరాల పొలం. ఇద్దరు బిడ్డలు. చీకూచింతా లేని సంసారం. రామ్మూర్తి మంచి మనిషి. ఇతరులకు సాయపడే సంస్కారి. పెద్దగా చదువులేదు. చక్కగా వ్యవసాయం చేసుకుంటూ, గ్రామంలో గౌరవంగా జీవిస్తున్నాడు. రాధమ్మ చదువుకున్నది, ఎంతో అణుకువ అయిన ఇల్లాలు. చదువుకున్నానన్న గర్వంలేదు. రామ్మూర్తి భార్యగా రాధమ్మ అంటే గ్రామస్తులందరికీ గౌరవం... ఇలా ఉండగా ఒకరోజు రామ్మూర్తి దగ్గరకు ఒక మనిషి వచ్చాడు. మనిషి నిండుగా ఉన్నా, అవతారం బీదరికాన్ని తెలియజేస్తున్నది. నమస్కారం చేసి, తన పేరు సూరయ్య అని, తనది పక్క జిల్లా అని, బతుకుదెరువు కోసం ఈ ఊరు వచ్చానని చెప్పాడు. నిలువ నీడకోసం వెదుకుతుంటే, ఊళ్లోవాళ్లు తమ పేరు చెప్పారని భార్య, ఇద్దరు పిల్లలు, రెండు గేదెలు తన ఆస్తి అని విన్నవించుకున్నాడు. ఊరునానుకుని  ఉన్న రామ్మూర్తి పొలంలో చావిడి ఖాళీగా ఉందని విన్నానని, అనుమతిస్తే, అక్కడ తలదాచుకుంటానన్నాడు. ఊరునానుకుని ఉన్న రెండెకరాల స్థలంలో చావిడి ఖాళీగానే ఉంది. సూరయ్య అందులో ఉంటే వచ్చే నష్టం ఏమీలేదు. ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది కదా అనుకుని, సూరయ్యను అందులో ఉండటానికి అనుమతించాడు రామ్మూర్తి. చావిడి ఇంటి తాళాలు సూరయ్యకు ఇచ్చాడు. అక్కడే మోటారు ఉంది. నీళ్లకు ఇబ్బందిలేదు. గేదెలు కట్టేసుకోడానికి, తిరగడానికి ఖాళీ స్థలం ఉంది. మేతకు కరువు లేదు. నీవక్కడ ఉన్నన్ని రోజులు ఉండు. నాకభ్యంతరం లేదు. నువ్వు వేరేచోటు చూసుకునేవరకు, నిన్ను ఇబ్బందిపెట్టను అన్నాడు. సూరయ్య సరేనన్నాడు. అతనికి ఆ ఇల్లు, స్థలం బాగా నచ్చింది... గేదెల పాలు పితికి ఊర్లో అమ్ముకుంటూ, పని దొరికినప్పుడల్లా కూలికి వెళ్తూ, రామ్మూర్తికి కూడా సహాయంగా ఉండసాగాడు... 
కాలం గడచిపోతున్నది... సంవత్సరాలు దొర్లాయి. సూరయ్య దశ తిరిగింది. రెండు గేదెలు ఇప్పుడు ఇరవై గేదెలు అయినాయి. పాల వ్యాపారం చక్కగా ఉంది.. రామ్మూర్తి కూడా, సూరయ్య అన్ని పనులకు అండగా ఉండటంతో చావిడి దగ్గరున్న రెండెకరాల పొలాన్ని, సూరయ్య గేదెలకు గడ్డీగాదం వేసుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి ఉచితంగా ఇచ్చాడు.. ఇలా ఉంటే ఒకరోజు అనుకోకుండా రామ్మూర్తి నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశాడు. రామ్మూర్తి కన్ను మూయడంతో, గ్రామస్తులంతా బాధపడ్డారు. రాధమ్మ దుఃఖాన్ని చూడలేకపోయారు. ఎదిగివచ్చిన పిల్లలు, పెళ్లిళ్ల వేడుకయినా చూడకుండా పోయాడేనని మథనపడ్డారు... కాలం మరొక్క ఏడాది గడిచింది... ఒకరోజు గ్రామపెద్దలు, సర్పంచ్‌ అందరూ రాధమ్మ ఇంటికి వచ్చారు. రాధమ్మ వారినందరినీ గౌరవంగా ఆహ్వానించి, మంచినీళ్లు, ఫలహారాలు పెట్టింది. రాధమ్మ మంచిచెడ్డలు విచారిస్తూ సర్పంచ్‌ తాము వచ్చిన పనిని బయటపెట్టాడు. ప్రభుత్వంవారు గ్రామానికి హైస్కూలు మంజూరు చేశారని, స్థలం సేకరిస్తే సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామన్న విషయం వివరించాడు. ఇక స్థలం విషయానికొస్తే, గ్రామాన్ని ఆనుకుని ఉన్న రామ్మూర్తి రెండెకరాల స్థలం బావుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారని తెలిపాడు. రాధమ్మ, మీరు హైస్కూలుకు రామ్మూర్తిగారి పేరు పెడతామంటే, ఆ స్థలం ఉచితంగా ఇవ్వడానికి, సిద్ధమేనని, కాకపోతే, ఎన్నో ఏళ్లుగా ఆ స్థలంలో ఉంటున్న సూరయ్యను ఉన్నఫళంగా ఖాళీచేయమంటే అతను ఇబ్బంది పడతాడని అంది. తమకు ఆప్తుడు కాకపోయినా, అన్నింటా సహాయకారిగా ఉంటున్నాడని అతనిని కూడా ఓ మాట అడిగి, మరలా మీకు ఏ విషయం తెలియజేస్తానంది. పెద్దలు సరేనని సెలవు తీసుకున్నారు. విషయం సూరయ్య వరకూ చేరింది. సూరయ్య లబోదిబోమంటూ, రాధమ్మ దగ్గరకు వచ్చాడు... ‘‘అమ్మా... నా పొట్ట కొట్టకండి. మీరిపుడు ఖాళీ చేయమంటే, నా గతి అధోగతి అవుతుంది... అయినా, రామ్మూర్తి అయ్యగారు, నాకు ఆ స్థలాన్ని 99 సం।।రాలు లీజుకు రాసి ఇచ్చారమ్మా... సమయం వచ్చినపుడు మీకు చెబుతామనుకున్నాను. ఇంతలోనే ఇలా ముంచుకొస్తుందనుకోలేదు...’’ అంటూ దీనంగా ముఖం పెట్టాడు. 
      రాధమ్మ ఆశ్చర్యపోయింది. ‘‘ఆ స్థలాన్ని నీకు లీజుగా రాసి ఇచ్చారా... నాకు తెలియకుండా, చిన్న పని కూడా చేయరే... ఇదెలా సాధ్యం...!’’ అంది.
      ‘‘మీరిలా అంటారనే, అయ్యగారు, నాకు రాసి ఇచ్చిన కాగితాన్ని కూడా తెచ్చానమ్మా’’ అంటూ, తన వెంట తెచ్చిన కాగితాన్ని రాధమ్మకిచ్చాడు. రాధమ్మ కాగితాన్ని తీసుకుని పరిశీలించింది. నూరు రూపాయల స్టాంపు పేపరుపై, ఆ రెండెకరాల స్థలాన్ని, సూరయ్యకు, 99 సం।।రాల నామమాత్రపు లీజుకు ఇస్తున్నట్లు స్పష్టంగా రాసి ఉంది. కింద రామ్మూర్తి వ్రాలు అని చేవ్రాలు కూడా ఉంది. రాధమ్మ ఆ కాగితాన్ని అలానే కాసేపు చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత, ‘‘సూరయ్యా...నేను పెద్దలకు మాటిచ్చాను, నీతో మాట్లాడిన తర్వాత చెబుతానని. రేపు పంచాయితీ భవనం దగ్గర గ్రామస్తులను, పెద్దలనూ, సర్పంచ్‌నూ, అందరినీ చేర్చు. నేను వస్తాను. జరిగినదేమిటో, అందరికీ అక్కడే తెలియజేద్దాము’’ అంది. 
      సూరయ్య ‘‘సరేనమ్మా..’’ అంటూ కాగితాన్ని పట్టుకుని వెళ్లిపోయాడు. 
      మర్నాడు ఉదయం రాధమ్మ పంచాయితీ భవనం దగ్గరకు చేరుకుంది.. ఊరంతా అక్కడే ఉన్నారు. రాధమ్మను గౌరవంగా ఆహ్వానిస్తూ, సర్పంచ్‌ కూర్చోడానికి కుర్చీ చూపెట్టారు. రాధమ్మ అందరినీ ఒకసారి చూచిన తర్వాత, సూరయ్యను చూస్తూ, ‘‘సూరయ్యా... జరిగినదేమిటో అందరికీ చెప్పి, నీ దగ్గరున్న లీజుపత్రాన్ని సర్పంచ్‌గారికి చూపెట్టు’’ అంది. సూరయ్య... ‘‘అలాగేనమ్మా..’’ అంటూ, రామ్మూర్తిగారు ఆ స్థలాన్ని తనకు లీజుకు రాసిచ్చిన వైనాన్ని వివరిస్తూ, లీజుపత్రాన్ని సర్పంచ్‌కు ఇచ్చాడు. సర్పంచ్‌ ఆ కాగితాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఊరినానుకుని ఉన్న అంత ఖరీదైన స్థలాన్ని, నామమాత్రపు లీజుకు, అన్ని సం।।రాలు రాసి ఇచ్చాడంటే నమ్మలేకపోయాడు. కాకపోతే పత్రంలో స్పష్టంగా రాసి ఉంది. రామ్మూర్తి సంతకం, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉన్నాయి. 
      సర్పంచ్, రాధమ్మకేసి చూస్తూ, ‘‘అమ్మా నమ్మలేకపోతున్నాను. మీకు తెలియకుండా, రామ్మూర్తిగారు, ఇలా చేశారంటే, ఇదేదో మాయలా ఉంది. ఏంచేద్దాం?’’ అన్నారు.
      ‘‘మీరన్నది నిజమే సర్పంచ్‌గారు...! మా ఆయనా, నేనూ, సూరయ్యను సొంత మనిషిలా అభిమానించాము. అతనూ కపటం లేకుండా నడుచుకున్నాడు. కానీ, మనిషి బుద్ధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సూరయ్య విషయంలోనూ అదే జరిగింది. మా ఆయన చనిపోయాక ఆ స్థలం కాజేయాలనే దుర్భుద్ధి సూరయ్యకు పుట్టినట్లుంది. అందుకనే స్టాంపు పేపరుపై రామ్మూర్తిగారి సంతకం సృష్టించి, ఇద్దరి సాక్షి సంతకాలు చేయించారు. సాక్షి సంతకాలు చేసిన ఇద్దరూ ఇపుడు లేరు. కాలం చేశారు. ఇదంతా సూరయ్య పక్కా ప్రణాళిక ప్రకారమే చేశాడు. కానీ ఇక్కడ సూరయ్యకు తెలియని విషయం ఒకటుంది. అది నిన్న నేను గమనించే ఈ పంచాయితీ ఏర్పాటు చేయించాను. అందరిలో సూరయ్య నిజ స్వరూపం బయట పెట్టాలనుకున్నాను. సూరయ్య స్టాంపు పేపరుపై, వాడుకలో ఉన్న, మా ఆయన పేరు రామ్మూర్తి వ్రాలు అని అనుకరించాడు కానీ, ఆయన పూర్తిపేరు శ్రీరామమూర్తి అని, ఆయన శ్రీరామమూర్తి అని సంతకం చేస్తారని తెలియదు. ఇదుగో నా దగ్గరున్న ఈ ముఖ్యమైన పత్రాలు చూడండి, నిజం తెలుస్తుంది. సూరయ్య ఇక్కడే తప్పులో కాలేశాడు. దొరికిపోయాడు’’ అంది.
సూరయ్య ముఖం వాలిపోయింది. నోటమాట రాలేదు. మనిషి వణుకుతున్నాడు. చతికిలపడిపోయాడు. సర్పంచ్‌ అతని పరిస్థితి గమనించి, ‘‘సూరయ్యా... చేయరాని తప్పుచేశావు. నీకు ఆసరా ఇచ్చిన చేయినే నమిలి మింగేయాలనుకున్నావు. గ్రామంలో ఇంతవరకూ నీపై ఉన్న మంచి అభిప్రాయాన్ని, గౌరవాన్ని తుడిచేసుకున్నావు. ఇపుడు రాధమ్మ దయ’’ అన్నాడు.
      సూరయ్య రాధమ్మ కేసి దీనంగా చూస్తూ తలదించుకున్నాడు. రాధమ్మ సూరయ్యను చూస్తూ, ‘‘సూరయ్యా, నేను నీ తప్పును క్షమించేటంత గొప్పదానిని కాదు. నీవు వెంటనే ఆ స్థలాన్ని ఖాళీచేసి, వేరేచోటు చూసుకో!’’ అంది. పెద్దలు తలాడించారు. పంచాయతీ ముగిసిపోయింది. మర్నాడు సూరయ్య గొడ్డూ, గోదాతో సహా తన పాత ఊరికి వెళ్లడానికి ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయాడు. 

* * * 

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam