వివాహగ్రస్తుడు

  • 108 Views
  • 107Likes
  • Like
  • Article Share

    కుప్పిలి సుదర్శన్‌

  • పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
  • 9493290290
కుప్పిలి సుదర్శన్‌

వివాహకాలే విపరీత బుద్ధీ.. పెళ్లికిముందు పైత్యమూ పరధ్యానమూ పావుకిలో ఎక్కువవుతుందట! ఉత్త కాయితం మీద ఉత్తరాలు, తీగలంకెల్లో టెలీఫోన్లూ, చిట్టిసందేశాల చేతిఫోన్లూ దాటేసిన ఈ తరం అవస్థలు చెప్పడం, ఇక ఎవ్వరి తరమూ కాదు గాక కాదు..!
పొద్దున్నే
ఆరింటికి చొక్కా ఇస్త్రీ చేస్తుంటే, రెండు మూడు రోజులుగా నలిగిన బట్టలేసుకుని ఆఫీసులో కనిపిస్తున్న మురహరీ, గుణగాడూ గుర్తొచ్చారు. ఇంత పెద్ద ప్రకటనల కంపెనీలో పనిచేస్తూ అంత దరిద్రంగా ఎందుకొస్తున్నట్లూ అన్న అనుమానం ఇస్త్రీ పెట్టెతోపాటూ వేడెక్కడంతో ఇక ఆగలేక సెలైన్‌లా తగిలించిన ఛార్జర్‌ను తప్పించి ఫోన్‌ అందుకున్నాను.
      ఇద్దరి నంబర్లూ రింగవుతున్నా ఎవరూ తియ్యట్లేదు. ఆదివారం బ్రహ్మచారులకి ఏం పనులుంటాయబ్బా అనుకుంటూ వాళ్ల అద్దెగదికి ఏకాయెకీ బయలుదేరాను. మెట్టు దిగేసరికీ మా ఆవిడ ‘పనిసరీ పనిసరీ...’ అంటూ ఏదో ఆరోహణని అపశ్రుతిలో ఆలపిస్తూ ఎదురైంది. ఇహనేం ఏదో కచేరీ ఎదురవబోతోందని పెద్దల మాట ప్రకారం ఊహించేశాను.
      రూం తలుపు కాస్త తీసే ఉంది. నేను పూర్తిగా నెట్టేసరికి ‘దండెమీద పిండని తువ్వాలులాగ మురహరీ, సింకులోని కడగని కళాయిలాగ గుణగాడూ దేబిరి ముఖాలేసుకుని గదిలో ఉన్నారు. నన్ను చూడగానే పేస్టు బ్రష్షుమీద వేసిన సంగతి మురహరికీ, రేజరు గడ్డం మీద ఆనించిన విషయం గుణగాడికీ గుర్తొచ్చినట్లుంది. సగంలో ఆపినట్లు కనిపించిన ఆ పనులు రోడ్డురోలర్‌ టాప్‌గేర్‌ వేసినట్లు మళ్లీ మొదలెట్టారు.
      ‘‘ఏమైందిరా మీకు’’ అంటూ ట్యూబ్‌లైటేశాను.
      ‘‘బ్బమ్మంగాఉ ఎంఉవేఅ అవఅరంలో ఊమి అంఅం అవ్వాఉ.. ఉఉంఆ?’’ మురహరి నోట్లో ఉమ్మి సింకు దాకా వెళ్లి ఊయలేక, మింగలేక బ్రష్‌ నోట్లోనే ఉంచి మాట్లాడేసరికి, సగంలో సగం కూడా అర్థం కాక గుణగాడి వైపు ‘ఏంటీ సంగతి’ అన్నట్లు మొహం పెట్టాను. మురహరి బాధ వాడికీ అర్థమైనట్టు లేదు. ఇద్దరం మళ్లీ మురహరినే చూడ్డంతో వాడు, చిరాకుగా సింకులో ఊసి, ‘‘బ్రహ్మంగారు రెండువేల సంవత్సరంలో భూమి అంతం అన్నారు గుర్తుందా? అని అడుగుతున్నా’’ అన్నాడు.
      ‘‘ఆ వాక్కుకి బ్రహ్మంగారికి తెలీకుండా రెండువేల ఇరవైకి పొడిగించేశారుగా మనవాళ్లు’’ గడ్డం నుంచి మీసానికి వెళ్లే విరామంలో రేజర్‌ కడుక్కుంటూ అద్దంలోంచి మాట్లాడాడు గుణగాడు.
      ‘‘నీకు లోకజ్ఞానమే తక్కువ. కాలజ్ఞానాన్ని కూడా చదవాల్సినంత కొంపలేం మునిగి పోయాయనీ? అసలేం జరిగిందో చెప్పండ్రా బాబూ...’’ అని విసుక్కున్నాను నేను.
      ‘‘నేను సముద్రమని చెప్పాను, వాడు మామిడికాయ్‌ అన్నాడు, వీటితో ఊరగాయ తయారైందని ఊహించకపోతే అసలు నువ్వు పెళ్లయిన వాడివేనట్రా?’’ మురహరిగాడు లాజిక్కేదో లాగేడు.
      ‘‘నీ పేస్టులో ఉప్పున్నంత మాత్రాన ఊరగాయ డైలాగులు వెయ్యక్కర్లేదు. అసలేం జరిగిందో ఏడువు...’’ కసిరాను చిరాకుగా.
      ‘‘ముకుంద్‌ గాడికి పెళ్లి’’... మూడు ముక్కల్లో చెప్పాడు గుణగాడు.
      ‘‘అయిపోయిందా, అవుతూందా, అవ్వబోతోందా?’’ మూడు కాలాల్లో ప్రశ్నించాను నేను.
      ‘‘ఇల్లు అలికేడు’’ - మురహరి వ్యంగ్యంగా చెప్పాడు.
      ‘‘అంటే ఏంటి పెడర్థం?’’ - పజిల్‌ విప్పలేక అడిగాను.
      ‘‘పెళ్లి చూపులయ్యాయ్‌!’’ - గుణగాడు కనికరించాడు.
      ‘‘పుష్కరాలు కదా ముహూర్తాలు లేవు, ఇల్లలకడమే అయింది - పండగ కాదన్నా వినడం లేదు ముకుంద్‌గాడు’’ - సమస్యని సోఫాలో కూర్చుంటూ చెప్పాడు మురహరి.
      ‘‘హ్హ... అయితే నేను ఊళ్లోలేని నెలరోజుల్లో చాలా విషయాలు జరిగాయన్నమాట! ముకుంద్‌గాడికి ఫోన్‌ చేస్తుంటే ఎప్పుడూ ఎంగేజే...’’ అంటూ ఇంకొంత కూపీ లాగడానికి ప్రయత్నించాను.
      ‘‘అవును... ఒకోసారి స్విచ్ఛాఫ్‌ అని కూడా వస్తుంది. ఆ టైంలో బ్యాటరీ మారుస్తుంటాడేమో... వాడి దగ్గర ఇరవైకి పైగా బ్యాటరీలు ఉన్నాయి’’ మురహరి గాడి మొహంలో ఆశ్చర్యం అదేదో అద్భుతం అన్నట్లు.
      ‘‘అంటే రూమ్‌కి రావట్లేదా?’’
      ‘‘వస్తున్నాడుగానీ, పాపం వాడికి ఇదో బందిఖానాలా అనిపిస్తుందట ఒక్కోసారి’’ గుణగాడి మొహంలో జాలి, కరుణ.
      ‘‘సర్లెండ్రా... వాడికేదో పెళ్లికుదిరి అమ్మాయితో మాట్లాడితే మీకేంటీ మధ్యన బాధా?’’
      ‘‘బాధకాక బాదంగీరా?’’ రౌద్రాన్నీ బీభత్సాన్నీ ఒకేసారి చూపించాడు గుణగాడు.
      ‘‘పొద్దున్నే అయిదింటికి మమ్మల్ని లేపేవాడు, పాలప్యాకెట్‌ తెచ్చేవాడు. టీ పెట్టేవాడు, బకెట్లలో నీళ్లు పట్టేవాడు, ఇల్లు తుడిచేవాడు, అంట్లు తోమేవాడు, వంట చేసేవాడు, వార్తలు చదివేవాడు, సినిమాకి తీసుకెళ్లేవాడు...’’ శాంతంగా ఒకసారి ముకుంద్‌గాడిని తలచుకున్నాడు మురహరి.
      ‘‘ఒరే ఒరే... వాడేమైనా దశావతారంలో కమలహాసనేంట్రా? మీరే  పనులూ చెయ్యట్లేదా?’’ తట్టుకోలేక అడిగాను.
      ‘‘మిగతా పనులన్నీ మేమే చేస్తున్నాం బాబూ...’’ వీరుణ్నన్నట్టు పోజిచ్చాడు గుణగాడు.
      ‘‘మిగతా పనులా? మింగడం, ముసుగేయడం తప్ప ఇంకేమున్నాయనీ? అవి మీరు చేస్తున్నారా? ఆ పనులన్నీ చేస్తున్నందుకు ముకుందుగాణ్ని ఇలా అనడం తప్పురా’’ అంటూ ముకుంద్‌గాడి మీద జాలి చూపించాను.
      ‘‘నోర్ముయ్యెహే... వాడు పనులు చెయ్యడం మానేసినా బాగుండేది. అసలువాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడున్నాడో తెలుసా?’’ భయపెట్టేలా అరిచాడు మురహరి.
      ‘‘అవును... ఏడీ?’’ మెల్లగా అడిగాను.
      ‘‘వేకువన నాలుగింటికి ఫోనొచ్చింది. ఆ ఫోన్‌ పట్టుకుని మైమరిచిపోయి మాట్లాడుతూ ఏడయ్యేసరికి ఏడు కిలోమీటర్లు నడిచి దిల్‌సుఖ్‌నగర్‌దాకా వెళ్లిపోయాడట. జేబులో అయిదు రూపాయలుంటే టీ తాగడం మానుకుని సులభ్‌ కాంప్లెక్స్‌కి ఓటేశాడట. ఏడున్నరకి కంపెనీ బస్సు కనిపించిందట. అందులో ఎక్కి ఆఫీసుకి సరాసరి వెళ్లిపోయాడట. ప్యాంటు బాలేదట. అందుకని మమ్మల్ని ఓ బ్యాగులో ప్యాంటు వేసుకుని తెమ్మన్నాడు. గీత కొనిచ్చిన ప్యాంటట. నలిగిపోకుండా తెమ్మన్నాడు. వీడి ప్రేమా, వీడి శృంగారం చూడలేకపోతున్నాం నాయనో’’ అంటూ నిట్టూర్చాడు గుణగాడు.
      ‘‘గీత ఎవరూ?’’ చిన్న అనుమానంతో అడిగాను.
      ‘‘నీకు భగవద్గీతే అనుకున్నాను, ఏ గీతా అర్థం కాలేదన్నమాట! ఈ గీత ముకుంద్‌ గాడి తలరాత.’’
      ‘‘ఓహో... ఆ అమ్మాయేనా!’’
      ‘‘అవును బాబూ, ఈ మధ్య నువ్వు ఫేస్‌బుక్కూ, వాట్సప్పుల్లోకి వస్తున్నట్టు లేదు...’’ అన్నాడు మురహరిగాడు నిర్లిప్తంగా.
      ‘‘ఏం చేస్తాం... టైం కుదరట్లేదురా...’’
      ‘‘చేసుంటే తెలిసేది. ముద్ద ముద్దకీ నారాయణా అన్నట్లు అడుగడుక్కీ సెల్ఫీలు, చీమలు వరసగా వెళ్తుంటే చీమల‘గీత’ అని క్యాప్షన్‌తో సెల్ఫీ, కాకులు కరెంటు తీగమీద వరసగా కూర్చుంటే అది కాకుల‘గీత’ అంటూ మరో సెల్ఫీ, అడ్డంగా ఒక గీత గీసి ‘నా సంతకమే ఒక ‘గీత’ అంటూ దాంతో ఒక సెల్ఫీ - ఈ మధ్య ‘ప్రేమగీత’ పేరుతో పేజీ కూడా పెట్టాడు’’
      ‘‘పేజీ పెట్టాడా? ఏం రాస్తాడు అందులో?’’
      ‘‘పిచ్చి గీతలు గీస్తున్నాడు. వాటికి లైకులూ కామెంట్లూ పెట్టమని జనాలకి ఫోన్లు చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో ఉన్నోళ్లు వీడి బాధ తట్టుకోలేక అకౌంట్లు మూసేశారు. ఇంకా వాట్సప్‌లో వంటలు రుచి చూడ్డాలూ, స్కైప్‌లో డ్రింక్‌ షేరింగ్‌ చేసుకున్నట్టు తాగడాలూ... బాబోయ్‌ వాడిదొక భూగోళశాస్త్రం అయిపోయింది’’, అంటూ చతికిల పడ్డాడు గుణగాడు.
      ‘‘అంటే వాడు మీకు నవరసాలూ చూపిస్తున్నాడన్నమాట!’’
      ‘‘నవరసాలు చూపించడం కాదు - నీరసం తెప్పిస్తున్నాడు’’ నసిగాడు మురహరి.
      ‘‘పోతే పోనీ, అదంతా వాడి పర్సనల్‌ కదరా!’’
      ‘‘ఇక్కడ మా పర్స్‌ ‘నిల్‌’ అవుతోంది బాబూ.’’
      ‘‘అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగాను.
      ముకుందం గురించి చెప్పేందుకు లేని ఓపిక తెచ్చుకుంటూ ఇద్దరూ నా ముందుకొచ్చి కూర్చున్నారు. ముందు మురహరి మొదలెట్టాడు.
      ‘‘పాల ప్యాకెట్‌ కొనడానికెళ్లి కొబ్బరి బొండాం కొనుక్కొస్తున్నాడు. ఆ టైంలో గీత శివాలయంలో ఉందని రీజను.., టీలో మసాలా పొడి వేస్తున్నాడు - ఆ టైంలో గీత బిర్యానీ చేస్తుందని రీజను.., అక్కడామె చిల్లుగారె తింటే - ఇక్కడ ఇడ్లీలకి కన్నాలు పెట్టడం.., అక్కడామె ఫేషియల్‌ చేయించుకుంటుంటే - వీడు షేవింగు చేసుకోడం.., ఆమె గోరింటాకు పెట్టుకుంటే - వీడు గోంగూర కలుపుకోవడం.., అక్కడ వర్షం పడుతుందంటే ఇక్కడ డాబా ఎక్కి నీళ్లు వాకిట్లోకి చల్లడం.., మొన్నటికి మొన్న ఆ అమ్మాయి ఇంటికి తాళం వేసుకుని బజారెళితే - ఇక్కడ వీడూ గదికి తాళం వేసి       ఎటో పోయాడు. పోయినోడు పోక... ఆ అమ్మాయి తాళం పోగొట్టుకుందని, తాళం మూసీలో విసిరేశాడు నాయనా...’’
      గుణగాడు అందుకున్నాడు... ‘‘ఆమెకి కోపమొస్తే వీడు ఆసనాలెయ్యడం, అరటిపండు ఆరుగంటలు తినడం, నెయిల్‌ పాలిష్‌లు కొని బూట్‌పాలిష్‌లు చెయ్యడం, అర్ధరాత్రుల్లో నక్క ఊళలా ‘ఓ’మని నవ్వడం, ఇస్త్రీ పెట్టెమీద ఆమ్లెట్లేయడం, ఆ పెట్టెనే వాటర్‌హీటర్‌లా నీళ్లు మరిగించడం..       ఒకటా రెండా వెర్రి వెలక్కాయ సైజుకి చేరిపోయింది దేవుడో...’’
      నన్ను నీళ్లు కూడా తాగనివ్వలేదు... నా మొహాన్ని మురహరిగాడు వాడివైపు తిప్పుకుని కొనసాగించాడు.. ‘‘ఎర్రెర్ర కాయితాల మీద కవితలని ఏవేవో రాస్తున్నాడు. అద్దె అడగడానికొచ్చిన ఓనర్‌ అవి విని అట్నుంచి అటే ఎటోపోయి ఇంటికింకా రాలేదు. రేపటికి రాకపోతే పోలీస్‌ కేసేనని డాబా మీది నుంచి ఓనరమ్మ ఉత్తరం రాసి పోస్టు చేసింది’’
      చివరగా గుణగాడు లేచి నుంచుని ‘‘చెప్పుకుంటే సిగ్గుచేటు. ఒకటారెండా మా కష్టాలు. ఈ మధ్య హార్మొనిపెట్టె కొన్నాడు. యమభటులు ఆ పెట్టె మెట్ల మీద డిస్కోడాన్స్‌ చేస్తున్నట్లుంది మా ప్రాణాలకి...’’ ముక్కు చీదుతూ ముగించినట్లు మొహంపెట్టి బావురుమన్నాడు. నేనా బావురును మధ్యలోనే ఆపుతూ ‘‘ఏంటీ... హార్మొనీ పెట్టా? హమ్మా... హమ్మా... ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది నాకు. ముకుంద్‌గాడు వివాహగ్రస్తుడయ్యాడు... నోడౌట్‌... సందేహం లేదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి...’’ అంటూ సావ్‌ధాన్‌లోకి వచ్చి నుంచున్నాను.
      ‘‘వివాహగ్రస్తుడయ్యాడా!?... వ్యాధిగ్రస్తుడూ, శాపగ్రస్తుడూ తెలుసుగానీ ఈ పేరెక్కడా వినలేదే’’ గుణగాడు సందేహపడ్డాడు.
      ‘‘ఏదో నా నోరు అనేసిందిగానీ, వివాహగ్రస్తుడు అన్నపేరు వింటుంటే వాడి లక్షణాల నుంచి కనుగొనబడిన అంటే ఆవిర్భవించిన పేరులా అనిపిస్తోంది’’, అంటూ నాకు నేనే నిర్ధరించుకున్నాను... ఇద్దరూ ఒప్పుకున్నట్లే మొహాలు పెట్టారు.
      ‘‘సరే, మీరు జాగ్రత్తగా ఉండండి... అవసరమైతే ఫోన్‌ చెయ్యండి. వాడు హార్మొనిపెట్టె స్థాయికి చేరాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.. వస్తా... మళ్లీ కలుద్దాం...’’ అని చెప్పి ఇంటికి వచ్చేశాను.

* * *

      నేనూ, మురహరి, గుణ, ముకుందూ ఒకే సంస్థలో పనిచేస్తున్నా కలిసేది తక్కువే. నాది అవుట్‌డోర్‌ వర్క్‌ కావటాన ఆఫీసులో అంతగా ఉండను. ఒకే ఈడోళ్లమైనా నాకు పుష్కరం కిందటే పెళ్లవడం వల్ల పెద్దతరహాలో వీళ్ల గదికి అతిథి అయ్యానుగానీ లేకపోతే నలుగురమై నారాయణా అనే వాళ్లం!
      ఓ వారం గడిచాక, అజీర్తికి టాబ్లెట్‌ వేసుకుంటున్న టైంలో అమాయకంగా గుణగాడు ఫోన్‌ చేశాడు.
      ‘ముకుంద్‌గాడు జిమ్ము మొదలుపెట్టాడనీ, ‘ఆరు రోజుల్లో ఆరు పలకలు’ అన్న పుస్తకాన్ని రోజూ పారాయణం చేస్తున్నాడనీ, గీత వాళ్లింట్లో ఉన్న బొచ్చుకుక్క లాంటిదే ఒకటి కొన్నాడనీ, అది కరిచిన ప్రతిసారీ వాడికి గీత నవ్వినట్లు అనిపిస్తుందటనీ, రెండ్రోజులకోసారి వంట పేరు మీద తప్పాలా మాడుస్తున్నాడనీ, నాల్రోజులకోసారి తిండిపేర గీత పంపిన చాక్లెట్లతో కడుపు నింపుకుంటున్నాడనీ, హార్మొనీపెట్టెకి చీమలు పడితే గీత కోసం పాడిన తీయని పాట కోసమే అవి వచ్చాయని అన్నాడనీ - కాదురా బాబూ అందులో మేంగోజ్యూసు చుక్కలు పడ్డాయంటే ఒంగోబెట్టి చక్కగా తన్నాడనీ, చివరగా.. మురహరిగాడు రూమ్‌ వదిలి పారిపోయాడనీ..’ చెప్పి ఓదార్చమన్నట్టు మూల్గాడు. ఆఖర్లో ఏదో గేదె అరుపులాంటి శబ్దం వచ్చి ఫోన్‌ కట్‌ అయింది. గుణగాడి గొంతులో వణుకుబట్టి అది కచ్చితంగా హార్మొనీ శబ్దమని బల్లగుద్దుకున్నాను.
      ఆ తర్వాత చాలా రోజులపాటూ వీళ్ల ముగ్గురికీ ఎదురుపడే అపశకునాలే నాకు కనపడలేదు. పని ఒత్తిడిలో తలోదారిలో పుష్కర గోదారిలో మునిగి తేలాం.
      పప్పు మాడినప్పుడో, అందులో ఉప్పు ఎక్కువైనప్పుడో ఈ మూడు మర్కటాలూ గుర్తొచ్చేవి. ఒక్కోసారి విచిత్రంగా అనిపించేది. అసలు వివాహగ్రస్తుడంటే ముకుంద్‌గాడా లేక వాడి వాలానికీ, వాలకానికీ బలైపోతున్నట్టు కనిపించే మురహరీ, గుణగాళ్లా అని! అయితే ఇవన్నీ తీపి జ్ఞాపకాలైపోతాయనే నమ్మకం మాత్రం నాకుంది.
      విధి కొన్నాళ్లు హార్మొనీ వాయించింది. 
      అనుకోకుండా ఓరోజు గుణగాడు పరుగెత్తుకుంటూ మా ఇంటికొచ్చాడు. వాడి ఆయాసాన్ని అయిసునీళ్లలో పడేసి ఏమైందని అడిగితే... ‘వాళ్ల గదిలోకి రెండో హార్మొనీపెట్టె వచ్చిందని చెప్పి శుద్ధ రిషభంలో భోరుమనాలని నోరు తెరిచాడు.
      వాడి కచేరీకి ఒకటో క్షణంలో నాగినీ డ్యాన్సు చేస్తూ గదిలోకి మా బామ్మర్దొచ్చాడు.. రెండో క్షణంలో నిచ్చెన తన్నేసి వేలాడుతూనే అటక ఎక్కేశాడు.. మూడో క్షణంలో మూలనున్న హార్మొనీ పెట్టెను బాహుబలిలా భుజానేసుకుని దిగి, విపరీతంగా పులకరిస్తూ పెరట్లోకి పరుగుతీశాడు..! 
      గుణగాడు నన్నూ, మా బామ్మర్దినీ నమిలేసేలా కొరకొరా చూస్తుంటే - నాకు నవ్వాగలేదు! పాపం వాడికి గౌలీగూడలో హార్మొనీ పెట్టెలమ్మే శివమణి చిరునామా చెప్పడం తప్ప ఇంకేదారీ తోచలేదు!!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam