బాబు

  • 100 Views
  • 0Likes
  • Like
  • Article Share

    అరుణ పప్పు

  • విశాఖపట్నం
  • 8008504128
అరుణ పప్పు

వేళ్లు మూసి పిడికిలి చూపిస్తే పిడిగుద్దులే గుర్తొస్తాయ్‌.. తెరిచి ఉంచితేనే, ఆ చేయి పట్టుకుని భయంలేకుండా నడుస్తారు. కుటుంబాల నుంచి సమాజాల వరకూ నీలి పరదాలను వేలాడదీసేవాళ్లను నిలదీస్తారు... పిల్లలు...!
‘‘ప్రియమైన
అమ్మా...
నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దు. నేను నువ్వు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోను. 
      నేను అవనిని ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కాని అది నిజం కాదు. మేము ప్రేమికులం కాదు. కేవలం స్నేహితులం. అంతే.
      ఇక ఇప్పుడు నీకు అంతా తెలియాలి. నేను చెబుతాను.
నువ్వు దీన్ని ఎలా తీసుకుంటావో నాకు తెలియడం లేదు. కాని నేను నీకీ విషయం చెప్పాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను.
      అమ్మా, నేను మరీ పసిపిల్లాడిగా ఉన్నప్పుడు నాన్న నన్ను గాల్లో ఎగరేసి పట్టుకునేవాడు కదా. అప్పుడు నువ్వు తీసిన ఫొటో ఇప్పటికీ మనింట్లో టీవీ పక్కన ఉంది చూడు. నాన్న చేతుల్లో కాకుండా గాల్లో ఉన్నా నేను నవ్వుతూనే ఉంటాను. ఆ ఫొటో.
      చిన్నప్పుడు కొన్నిరోజులు ఏమనుకునేవాణ్నంటే మా నాన్న పెద్ద హీరో అని. ఎందుకంటే అంత చిన్నపిల్లాణ్ని గాల్లోకి ఎగరెయ్యడం అంటే ఎంత ధైర్యం కావాలి? మళ్లీ పడిపోకుండా పట్టుకోవడం అంటే ఎంత గొప్ప పని? తర్వాత కొన్ని రోజులు ఏమనుకునేవాణ్నంటే - నేను పెద్ద హీరోనని. ఎందుకంటే గాల్లోకి ఎగరేసినా ఏ ఆధారమూ లేకపోయినా, కిందకు పడుతున్నా బోసినవ్వులు నవ్వుతున్నానంటే నేను హీరోనే కదమ్మా? నేనిలా ఆలోచించే వాణ్నని నీకు తెలియదు కదా. ఇప్పుడు నవ్వొస్తోంది కదా. నవ్వమ్మా. నవ్వితే నువ్వు బావుంటావు.
      కాని ఇప్పుడు ముప్ఫయ్యేళ్ల వయసు వచ్చాక ఆ ఫొటో చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నా నవ్వులోనూ, నాన్న నవ్వులోనూ, ఆ ఫొటో తీస్తున్న నీలోనూ ఉన్నదొకటే. అది ధైర్యం. నమ్మకం. కింద పడిపోకుండా పట్టుకుంటాడులే అన్న ధైర్యం నాలోనూ, నాన్నలోనూ. నమ్మకం. పడనివ్వడు అనేది. అంతేనా, మన ముగ్గురం ఒక జట్టు అని.
      ఆ ధైర్యం, ఆ నమ్మకం పోయి నాలో ఎప్పుడు అధైర్యం, అపనమ్మకం చోటు చేసుకున్నాయో తెలియలేదమ్మా. అంటే నిజంగా నాకు తెలియలేదని కాదు. నాకు భయం కలిగిన మొదటిరోజు నీ దగ్గరకే వచ్చానమ్మా... మొదటిసారి...
      మన చిన్న మామయ్య ఉన్నాడే... అదే మన చిన్ని పిన్ని వాళ్ల తమ్ముడు... అతనికి చిన్నపిల్లలంటే ముద్దు అనేవాళ్లు. మనమంతా కలిసి ఉన్నప్పుడు నాకు అయిదేళ్లుంటాయేమో... చెల్లి పనులతో నువ్వు తీరికలేకుండా ఉంటే, నన్ను అతనితో స్నానానికి పంపించేవాళ్లు.
      అప్పుడు అతనేం చేసేవాడో తెలుసా అమ్మా?
      ఎంతో చెడ్డగా నా శరీరాన్ని ముట్టుకునేవాడమ్మా. అక్కడా ఇక్కడా చేతులేసి నలిపేసేవాడు. బాత్రూమ్‌లో బట్టలన్నీ విప్పేసి అతని శరీరాన్ని చూడమనేవాడు. ఏదేదో గొణుక్కుంటూ నన్ను పిసికేసేవాడు. నేను ఎర్రగా కందిపోయేవాణ్ని.
      బయటికొచ్చి, ‘చూడక్కా నీ కొడుకు... వేణ్నీళ్లకే ఎర్రగా కందిపోతున్నాడు... ఆడపిల్లలాగా... ఆడపిల్లయితే లక్స్‌పాపల్లా సినిమా హీరోయినయ్యేవాడేమో...’ అనేవాడు. నువ్వేమనేదానివో నీకు గుర్తుందామ్మా? ‘తమ్ముడూ, నా కొడుకు వెన్నపూస. పట్టుకుంటే జారిపోతాడు. వాణ్ని జాగ్రత్తగా చూసుకోవాలి...’ అని నవ్వేదానివి.
      నీ కొడుకు ఒళ్లే కాదు, అంత పసిమనసూ వెన్నముద్దేనని, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నీకెందుకు తెలియలేదమ్మా?
      అప్పుడే నేన్నీకు చెప్పాను. ‘అమ్మా, నన్ను మావయ్య నలిపేస్తున్నాడు... నాకు ఇష్టం లేదు...’ అని. నువ్వేమన్నావు?
      ‘ఒరే పండూ, నువ్వేదో అల్లరి చేస్తున్నావని మామయ్య నీ బుగ్గలు పిండాడనుకో... దానికే ఇంత ఫిర్యాదా?’ అని నవ్వేశావు. నవ్వినప్పుడు నీ మొహం చూడటం నాకిష్టం అమ్మా.
      మళ్లీ ఒకసారి చెప్పాను. అప్పుడు మామయ్య కూడా అక్కడే ఉన్నాడు.
      ‘అవునక్కా, ఊరికే పిర్రల మీద ఇలా ఒక్కటేశాను... అంతే. అయినా ఇంత గారాబం అయితే స్కూల్లో ఎలా నెగ్గుకొస్తాడు నీ కొడుకు...’ అన్నాడు.
      నువ్వు నవ్వేశావు. మామయ్య కూడా నవ్వాడమ్మా. కాని మామయ్య అలా నవ్వితే బాగుండడమ్మా. నాకు భయమేసేది. నువ్వు లేనప్పుడు, ఇంకా ఎవ్వరూ లేనప్పుడు మామయ్య ఇంకా నవ్వేవాడమ్మా. అప్పుడు నాకు బోల్డంత భయం వేసేది.
      నేను అయిదో క్లాసుకు వచ్చాను కదా. అప్పుడు స్కూలు టీచరు నీకు ఫిర్యాదు చేశారు.
      ‘ఏంటండీ, మీవాడికి అస్సలు కుదురే లేదు. పట్టుమని అరగంట కూర్చోలేడు. చీటికీ మాటికీ నిలుచుంటాడు... అదేంటంటే కళ్లెర్రగా చేసుకుని ఏడుస్తాడు తప్ప ఏమీ చెప్పడు. కుదురులేని ఏడుపుగొట్టు పిల్లాడు... పాఠం చెబుతున్నప్పుడూ నిల్చుంటాడు, పరీక్ష రాసేటప్పుడు కూడా నిల్చుని రాస్తానంటాడు... ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు... ఇలాగైతే పైతరగతిలో కష్టం...’ అన్నారావిడ. తల్లిదండ్రుల సమావేశంలో నువ్వు తల దించుకున్నావు.
      ఇంటికొచ్చాకైనా ‘తరగతిలో మాటిమాటికీ అలా ఎందుకు నిలబడతావు’ అని అడుగుతావని అనుకున్నానమ్మా. అడిగితే అంతా చెప్పేద్దామనుకున్నాను. కానీ నువ్వడగలేదు. ఎంతసేపూ ‘నువ్వు బాగా చదవకపోతే హాస్టల్లో వేస్తాం, నీ ప్రోగ్రెస్‌ రిపోర్టు మీద సంతకం చెయ్యం’ అని బెదిరించారే తప్ప ఎందుకు చదవడం లేదు అని అడగలేదు కదమ్మా.
      హాస్టల్లో పెట్టేస్తేనైనా బాగుండేదేమోనమ్మా. అలా బాగుంటుందనే నేను ఇంకా ఇంకా చదవకుండా ఉండేవాడిని.
      ఇంతకీ నేను ఎందుకు నిలబడేవాణ్నో తెలుసా అమ్మా...? అప్పుడు చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు చెప్పగలను.
      మన చిన్న మామయ్య తన అంగాన్ని నా ముడ్డిలో పెట్టేవాడమ్మా. నొప్పితో చచ్చిపోతానేమో అనుకునేవాణ్నమ్మా చాలాసార్లు. అరవకుండా తన చేతుల్తో నా నోరు మూసేసేవాడమ్మా. విపరీతమైన రక్తం. ఆ నొప్పి తగ్గడానికి వారం రోజులు పట్టేదమ్మా. ఒక్కోసారి ఆలోపే మళ్లీ అలా చేసేవాడాయన. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో క్లాసులో కూర్చోలేకపోయే వాణ్నమ్మా. అందుకే తరచూ నిల్చునేవాణ్ని.
      ఎవరైనా ఎందుకని అడిగితే ఆ హింస అంతా గుర్తొచ్చేదమ్మా. భయంతో ఒళ్లు జలదరించేది. అందుకే ఏడుపొచ్చేసేది.
      ఒకసారి నీ దగ్గరికొచ్చాను... ‘అమ్మా నా ముడ్డిలో...’ అని చెప్పబోతూ ఉంటే నువ్వు చెంప మీద ఒక్కటేశావు. ‘ఏంటా చెత్తమాటలు... ముడ్డీ ముకురూ అని... అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పానా...’ అన్నావు. అమ్మా, ఏడాది దాటిన పిల్లలకు ‘నీ నోరేది, నీ ముక్కేది, నీ కళ్లేవి, నీ చెవులేవి, నీ కాళ్లేవి...’ అని సరదాగా ఆడుతూ నేర్పిస్తారు కదమ్మా... అంతా మన శరీరమే కదా. అందులోని ప్రతి భాగానికీ ఒక పేరుంది. మరి ముడ్డిని, అంగాన్ని చూపించి వాటిని సరిగ్గా ఏమంటారో, మంచి భాషలో ఎందుకు చెప్పరమ్మా? అవేవో చెప్పరాని మాటలన్నట్లు ఎందుకమ్మా దాచేస్తారు?
      తల్లిదండ్రులు దాచేసిన విషయాలను పిల్లలు స్నేహితుల దగ్గర తెలిసీతెలియని బూతుల్లాగా నేర్చుకుంటారు. నేనేమీ నీకు పాఠం చెప్పడం లేదమ్మా. జరిగిందంతా నీతో పంచుకుంటున్నాను అంతే. పోనీలే... నువ్వు కూడా అప్పుడు చిన్నదానివే కదా. ఇప్పటి తల్లులకున్నంత అవగాహన       అప్పట్లో మీకుండేది కాదు. కానీ అమ్మా, ఒకసారి నువ్వు నా నిక్కరు నిండా రక్తపు మరకలుండటం చూశావు.
      ‘వెధవా, మామిడిపళ్లు ఉన్నాయని తినెయ్యడమేనా? అవి తింటే వేడి చేసి రక్తం పడుతుందని చెప్పానా లేదా’ అని మామిడిపళ్ల బుట్టను దాచేశావు.
      నాకు చాలా ఏడుపొచ్చేసిందమ్మా. ఎలాగూ నువ్వు చూశావు కదాని చెప్పబోతూ ఉంటే ‘రేపటిన్నుంచి నీకు మామిడి పళ్లు ఉండవని ఏడుస్తున్నావా... ఎంత ఏడ్చినా ఇవ్వనుగానీ, నువ్వు పోయి మామయ్య దగ్గర పడుకో...’ అన్నావేగాని విషయం చెప్పనిచ్చావా?
      దాచాల్సింది మామిడిపళ్ల బుట్టను కాదమ్మా, బుసకొడుతున్న మామయ్య బుర్రని అని నీకెలా చెప్పనమ్మా?
      వద్దమ్మా... ఇప్పుడు కళ్లనీళ్లు పెట్టుకోకు. ఏడిస్తే నువ్వు బాగుండవని కాదు. నేను చూడలేను. నేనేమీ నిన్ను నిలదీయడం లేదు. ఎంతో భద్రమైన జీవితాల్లో చాప కింద నీరులా భయం ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియదమ్మా. దాన్ని ఎవరికీ చెప్పుకోలేం.
      అమ్మా, ఆ హింస ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్నేళ్లు సాగిందో లెక్కే లేదమ్మా.
      నేను పదోక్లాసు దాటేసరికి మామయ్య స్నేహితులు మరో ఇద్దరు కూడా వచ్చేవారు. వాళ్లంతా నాతో ఏం చేసేవారో... ఆ చెండాలాన్ని భరించిన నా దరిద్రపు నోటితో నీకు చెప్పలేను.
      ‘ఒరే పండూ, నా జాంపండూ, దీన్ని నువ్వు ఎవరికీ చెప్పలేవు. ఒకవేళ చెప్పినా నిన్నే తంతారు. ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు తప్ప నన్నేమీ అనరు. ఒకవేళ నన్ను అన్నారనుకో, నాకేం భయం? నేను బయటికెళ్లిపోతాను. కానీ నువ్వో? నీకు కనీసం డిగ్రీ కూడా లేదు. నువ్వు బయటికెళితే రోడ్లమీద అడుక్కు తినాలి. లేదా హోటళ్లలో ఎంగిలి ప్లేట్లు కడుక్కుంటూ బతకాలి. కానీ నువ్వు ఎక్కడికెళ్లినా నా ఫ్రెండ్స్‌ ఉంటారు. వాళ్లకు చెప్పాననుకో, నిన్ను మజా చేసుకుంటారు. అంతేకాదొరే... నాలాంటి వాళ్లు ఎక్కడికెళ్లినా ఉంటారని మర్చిపోకురోయ్‌...’ అని బెదిరించేవాడమ్మా మామయ్య.
      ఎప్పుడైనా చెబుతానని అతనికి అనిపిస్తే ఆ హింస ఇంకా ఎక్కువయ్యేది. చెప్పమ్మా, నన్నేం చెయ్యమంటావు?
      ఏమీ చెయ్యలేకపోయాను.
      మన కుక్క ఉండేది కదా, లక్కీ, దానికి చెప్పుకొని ఏడ్చేవాణ్ని. అది నేను మాట్లాడేదంతా జాగ్రత్తగా వినేది. నాతో చాలా ప్రేమగా ఉండేది. ఇంకా ఒక్కోసారి నేను మేఘాలతో మాట్లాడేవాణ్ని. మన కిటికీ దాకా వచ్చిన చెట్టుకొమ్మతో మాట్లాడేవాణ్ని.
      ‘ఏంట్రా ఎప్పుడూ పిచ్చివాడిలా నీలో నువ్వే గొణుక్కుంటావు...’ అనేవారు నువ్వూ నాన్నా.
      లోపల మనసు నెత్తురోడుతుంటే మాట గలగలా బయటకెలా వస్తుంది, నువ్వే చెప్పు పోనీ?
      మీరు నన్ను ఇంజినీరింగ్‌లో చేర్పించారు. అప్పుడే మామయ్య వేరే ఊరికి బదిలీమీద వెళ్లిపోయాడు. నేనెంత సంతోషపడ్డానో...
      చిన్నప్పట్నుంచి బళ్లో నాతో పదో తరగతి దాకా చదివిన రఘుగాడు ఇంజినీరింగ్‌ కాలేజీలో కనిపించాడమ్మా. చిన్నప్పటి స్నేహితుడు మళ్లీ కలవడంతో గొప్ప సంతోషంగా అనిపించింది. క్లాసులో నా పక్కనే కూర్చునేవాడు.
      ఒకరోజు నా మనసులోని బాధంతా వాడికి చెప్పేశానమ్మా. అప్పటిదాకా నాలో నేనే అనుభవించిన వేదన అంతా వాడి ముందు పరిచేశాక... మనసు చాలా తేలిగ్గా అనిపించింది.
      మరో ప్రమాదం నా కోసం ఎదురు చూస్తోందని నాకేం తెలుసు?
      తర్వాత సోమవారం నేను కాలేజీకి వెళ్లేటప్పటికి అందరూ నన్ను చూసి వెకిలిగా నవ్వడం మొదలుపెట్టారమ్మా. అది నా అనుమానమేమో అనుకుని నేను క్లాసుకు వెళ్లాను. వెనుక నుంచి ‘హాయ్‌రే హాయ్‌... జాంపండురోయ్‌... చూడగానే నోరూరురోయ్‌...’ అని పాట వినిపించింది. చూస్తే నవ్వుతున్నారు.
      ఆ రోజే రఘుగాడు సీటు మారిపోయాడు. నా పక్కన ఇంకెప్పుడూ కూర్చోలేదు.
      బాత్రూమ్‌కెళితే అక్కడ తెలిసిందమ్మా విషయం... ‘ప్లీజ్‌ కాంటాక్ట్‌... ఫర్‌ గే సెక్స్‌ - అబ్బాయిలకు మాత్రమే... ఆనందానికి ఒక అబ్బాయి కావాలా పండుగాణ్ని పిండుకోండి...’ అని గోడల నిండా నా పేరు అసహ్యంగా రాశారమ్మా. బూతు బొమ్మలు వేశారమ్మా.
      అప్పటికి నాకు ‘గే’ అంటే ఏంటో తెలియదమ్మా.
      ఏం చెయ్యాలో తెలియలేదు. పరుగెత్తుకుంటూ బస్సెక్కి ఇంటికొచ్చేశాను. కాలేజీకి వెళ్లలేను, ఇంట్లో ఉండలేను. ప్రపంచమంతా నరకంగా కనిపించింది. చచ్చిపోదామని ఒకటిరెండు సార్లు ప్రయత్నించానమ్మా... కానీ ఎందుకో చావలేదు.
      చిన్నప్పట్నుంచీ నాకు మగవాళ్లంటే భయంగా ఉండేది. అందుకే నేను నాన్నతో కూడా సరిగ్గా మాట్లాడేవాణ్ని కాదు. రఘుగాడు చేసిన పనికి ఆ భయం ఇంకా ఎక్కువైపోయింది.
      అప్పుడే నాకు అవని పరిచయమైంది.
      అవని చాలా మంచిదమ్మా. చాలా తెలివైంది. నువ్వు మా స్నేహాన్ని అవమానించావు, ఆ అమ్మాయితో మాట్లాడొద్దన్నావు. కాని అవని స్నేహాన్ని నేను వదులుకోలేదు. అవని నాకు చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్పింది. ఇంటర్నెట్‌ సాయంతో ఎంతోమందిని పరిచయం చేసింది. వాళ్ల జీవితాలేమిటో తెలిసేలా చేసింది. నా గురించి నేను మాట్లాడేలా చేసింది.
      ఇప్పుడు నేను అన్నిచోట్లా మాట్లాడుతున్నానమ్మా.
      అమ్మా, ఇంకొంత మంది అబ్బాయిల బాల్యం బండలైపోకుండా ఉండాలని నేను మాట్లాడుతున్నాను. అమ్మాయిల విషయంలో మాత్రమే కాదు, అబ్బాయిల భద్రత గురించి కూడా జాగ్రత్తపడాలని అందరికీ చెబుతున్నానమ్మా.
      అనకూడని మాటలేవో, చెయ్యకూడని పనులేవో, ఇతరులు ముట్టుకోకూడని శరీర భాగాలేవో - ధైర్యంగా అందరికీ చెబుతున్నానమ్మా. ఈ పనిలో నాకు అవని తోడుంది. ఇంకా ఎంతోమంది తోడున్నారు. నువ్వనుకున్నట్లు అవనీ నేను ప్రేమికులం కాము, పెళ్లీ చేసుకోం. అసలే అమ్మాయినీ పెళ్లి చేసుకోను.
      నువ్వు నన్ను ‘గే’ అనుకోవచ్చు. కాని నేను ‘గే’ని కాదు. కనీసం నువ్వయినా నన్ను నమ్మమ్మా. నేను మగాణ్ని కాదని మన బంధువులు, స్నేహితులు అనుకోవచ్చు. నేను మగాణ్ని కాదు, గేని కాదు, ఆడదాన్ని కాదు. నేను మనిషిని. నన్ను మనిషిగా ఎవరు గుర్తిస్తే వాళ్లతో స్నేహంగా ఉంటాను. అంతే.
      నేను అందమైన బాల్యాన్ని కోల్పోయాను.
      నువ్వు చెప్పమ్మా, ఏం చేస్తే నా పసితనం నాకు తిరిగొస్తుంది?
      నాన్న చేతుల్లోంచి గాల్లోకి ఎగిరిన ఆ ధైర్యం, ఆ స్వచ్ఛమైన నవ్వు నాకు మళ్లీ వస్తుందా?
      చిన్నప్పుడు నేను అనుభవించిన హింస మాటల్లో చెప్పలేనిది. అయినా సరే, మరే పిల్లాడు అలాంటి బాధ బారిన పడకూడదనే నేనిప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకుని మరీ మాట్లాడుతున్నాను. అమ్మా, ఇప్పుడు నాకే దిగులూ లేదు. నేను బాగానే ఉన్నాను. ఈ ఆదివారం సాయంత్రం టీవీలో నా ఇంటర్వ్యూ వస్తుంది. అది చూడు. కళ్లు తుడుచుకుని నవ్వమ్మా. నవ్వితే నువ్వు బాగుంటావు.
      ఎప్పటికీ నీ
      పండు’’

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam