నిశ్శబ్ద శబ్దం

  • 770 Views
  • 52Likes
  • Like
  • Article Share

    నరేష్‌ కుమార్‌

  • బొబ్బిలి, విజయనగరం
  • 9014199622
నరేష్‌ కుమార్‌

లోకం ఏమనుకున్నా, ఏది ఏమైనా జీవితాన్ని ఆస్వాదించాలని ఆ అమ్మాయి ఆరాటం! మనుషుల మీద ఆమెకున్న నమ్మకాన్ని చూసి అతనికి అబ్బురం కలిగింది.  ఆమె మీద గౌరవం పెరిగింది. కానీ, ఆమె తీసుకున్న నిర్ణయం అతనిలో తీరని ఆవేదన నింపింది! అదేంటి? 
అడగకపోయినా
అందరికీ ప్రేమను పంచే పెద్దమ్మలాగా ఊరికి వచ్చే దారిలో సెలయేరు, వీధిలో అక్కడక్కడా పాతకాలపు ఇళ్లు, కొన్నిచోట్ల పురాతన కట్టడాలు మిగిల్చిన ఆనవాళ్లు; కొంచెం తెలియనితనం, మరికొంత మూర్ఖత్వం, కాస్త పొగరు కలగలిసిన జనాలు... ఈ ఊరికొచ్చిన కొత్తలో దానిమీద నాకున్న అభిప్రాయాలివి. అయితే, నెమ్మది నెమ్మదిగా ఇదే నా ఊరు అనే భావన వచ్చేసింది! సాపేక్ష సిద్ధాంతం మన జీవితాలకి బాగా సరిపోతుందనుకుంటా! ఎందుకంటే మన ఆలోచనలకి, అవసరాలకి అనుగుణంగా మనం ఒక సిద్ధాంతం మీద గానీ, మనుషుల మీదగానీ అభిమానాన్ని పెంచుకుంటాం తప్ప సంఘం కట్టుబాట్ల ఆధారంగా కాదని నా నమ్మకం. ఇప్పుడు మేము ఉంటున్నది మా సొంత ఊరు కాదు. కానీ నా బాల్యం, చదువు అన్నీ ఈ ఊరితోనే ముడిపడి ఉండటంతో ఇదే నా ఊరు అనే భావన బలంగా నాటుకుపోయింది. పదో తరగతి ఫలితాలు వచ్చాయి. అదే సమయంలో మా కొత్త ఇంటి పనులు పూర్తయ్యాయి. నేను కళాశాలకు వెళ్లడం, మేము వేరే వీధిలోని మా సొంతింటికి మారడం ఒకేసారి జరిగిపోయాయి.
      జూనియర్‌ కళాశాలలో చేరిన మొదట్లో ఎందుకో చాలా భయం వేసింది. ఎందుకంటే అప్పటి వరకు నాతో ఉన్నవారు ఎప్పుడైనా నా నుంచి వెళ్లిపోతారనే ఆలోచన ఒక్కసారి కూడా రాలేదు. వస్తుందని నా ఊహకి కూడా అందలేదు. ఒక్కసారిగా అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవటాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా నెలలు పట్టింది.
      తరగతిలో కొంతమంది స్నేహితులయ్యారు. కానీ మేముంటున్న వీధిలో ఇంకా ఎవరూ స్నేహితులు కాలేదు. కారణం కూడా ఉందనుకోండీ, మేము ఉండే ఇంటికి అటు రెండు ఇళ్లలో ఇటు రెండు ఇళ్లలో ప్రతి గడపకు ఒకరు లేదా ఇద్దరమ్మాయిలున్నారు. దాంతో వీధిలో ఎవరితోనూ పెద్దగా స్నేహం ఏర్పడలేదు. కానీ, ఎదురుపడిన ప్రతిసారి స్నేహంగానే పలకరిస్తారు అందరూ. అయితే, కలిసి తిరిగే స్నేహం కానీ, ఆలోచనలు, ఆశలు పంచుకునే చనువు కానీ ఎవరితోనూ ఏర్పడలేదు.
      మా అమ్మ మాత్రం ఎదురిల్లు, పక్కింటి వాళ్లతో వరుసలు కలిపి బాగానే నెట్టుకొస్తోంది రోజుల్ని. నాన్నకైతే వీధితో పెద్దగా పనిలేదు కాబట్టి, ఆయనకు ఇలాంటి సమస్యలేమీలేవు. మా వీధి మలుపులో చెన్నైవాళ్లు ఉండేవారు. నేను రోజూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చే సమయంలో ఆ ఇంటావిడ రాగాలు తీస్తూ పప్పు పోపు పెడుతూ ఉండేది. ఆవిడ గాత్రం వింటూ, పోపు వాసనను ఆస్వాదిస్తూ ఇంట్లోకి వెళ్లేవాణ్ని. ఆ కొన్ని క్షణాలు నాకు భలే ఇష్టం. కొన్నిసార్లు వాటిని అందుకోలేక చాలా బాధపడేవాణ్ని. అలా కొన్ని నెలలు గడిచాక వాళ్లు ఇల్లు మారిపోవడం చూశాను. ఏదో తెలియని బెంగ ఆవరించింది. 
      ఒక రోజు ఎప్పట్లాగే కళాశాల నుంచి ఇంటికి వస్తున్నప్పుడు మా ఎదురింటి వాళ్లకు ఏదో సమస్య వచ్చినట్లు అనిపించింది. వాతావరణం కూడా అలాగే ఉంది. వీధిలో అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ, ఎవరూ పూర్తిగా దాని గురించి పట్టించుకోవట్లేదు. బహుశా ఆ ఇంటివాళ్లతో ఆ సమస్య గురించి ఎలా ప్రస్తావించాలో తెలియకనో లేదా వాళ్లకి దాని గురించి పట్టించుకోవడం అవసరం లేకనో... నాకైతే తెలియలేదు. అయితే, మనం సాటి మనిషితో చెప్పుకోలేని, పక్కవాళ్లు కలగజేసుకోలేని విషయాలు చాలానే ఉంటాయని అప్పుడే తెలిసింది నాకు. మన కుటుంబాల్లో, సామాజిక వ్యవస్థలో అర్థంలేని ఆంక్షలు, పద్ధతులు చాలానే ఉన్నాయని మొదటిసారి అనిపించింది.  
      విషయం ఏంటా అని ఆరా తీశాక తెలిసింది, ఎదురుగా ఉన్న రెండో ఇంటివాళ్ల చిన్నమ్మాయి కొన్ని రోజుల కిందట కనిపించకుండా పోయి (ప్రేమించిన వాడితో పారిపోయి) మళ్లీ ఇంటికి తిరిగొచ్చిందని.

* * *

      ఆ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడు, వయసుతో వచ్చే ఉద్రేకాలను దాచుకునే అలవాటు బొత్తిగా ఆమెలో లేనట్లు అనిపించింది. కొంచెం దూకుడు స్వభావం. అలాంటి అమ్మాయిని మన మందబుద్ధి సమాజం ఎన్ని రకాలుగా హేళన చేస్తుందో, ఎన్ని కుళ్లు మాటలు అంటుందో అవన్నీ అయ్యాయి. కానీ, ఎవరు ఎలా చూసినా, ఏమన్నా, తన చుట్టూ ఏం జరుగుతున్నా ఆమె కళ్లలో మాత్రం జీవితాన్ని ఆస్వాదించాలనే ఉద్వేగం ఎప్పుడూ కనిపించేది.
      ఓ చలికాలపు ఉదయం ఆ అమ్మాయి తల స్నానం చేసి జుట్టును ఆరబెట్టుకోవడానికి మేడపైకి వచ్చింది. సూర్యుడి వైపు తిరిగి జుట్టు సవరించుకుంటూ ఆ నులివెచ్చని వేడిని ఆస్వాదిస్తూ తన ప్రపంచంలో తానుంది. ఆమె ఆనందాన్ని చూడలేని చుట్టూ ఉన్న జనాలు, పెదవి విరుపులు విసిరారు. గాలిలో ఛీత్కార శరాలు సంధించారు.  
      ఆ అమ్మాయి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, తన ప్రపంచంలో తనుండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ స్వేచ్ఛా విహంగానికి అడ్డుకట్ట వేయగలిగేవాడు ఆమె తండ్రి మాత్రమే అని తర్వాత నాకు తెలిసింది. అయితే, ఆమె ఇష్టపడే మనుషుల్లో అతను ఉండడని కూడా అర్థమయ్యింది. నాకు తెలిసినంత వరకు ఆమెతో ఏనాడూ తన ఇంట్లో వాళ్లు ప్రేమగా మాట్లాడింది లేదు.
      ఎప్పుడూ ఆ అమ్మాయే అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ, ఎదుటి వాళ్లు మాత్రం వెకిలి నవ్వులు విసురుతూ ఆమెని బాధించాలని చూస్తుంటారు. వాటిని గమనించి కూడా ఆ అమ్మాయి హుందాగా వ్యవహరించేది. వాళ్ల నాన్న మొదటి భార్య దగ్గర ఉండి అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చిపోతుంటాడు. వాళ్ల అమ్మ ఎక్కువ సమయం ఊళ్లోని విషయాల సేకరణలో నిమగ్నమై ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడూ నాకొక ఇల్లులా అనిపించేది కాదు!
      ఒకరోజు మధ్యాహ్నం సైకిల్‌ మీద కళాశాలకు వెళ్తుంటే వీధిలో ఎదురుపడి స్నేహపూర్వకంగా నవ్వి వెళ్లిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి పక్కన ఎవరో అబ్బాయి ఉన్నాడు! కొన్నిరోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంటి మేడ మీద అతను, ఆమె కూర్చొని ముచ్చట్లాడుతూ కనిపించారు.  
      అంతలోనే వాళ్ల స్నేహం గురించి ఆమె తండ్రికి తెలిసిపోయింది. ఒక రోజు రాత్రి ఆ అమ్మాయిని నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. తను రెండో పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా వచ్చిందని, తన చేతకాని పెంపకాన్ని ఆ అమ్మాయి తల్లి మీదకి నెట్టి అరుస్తున్నాడు.  
      కింద అంత రాద్ధాంతం జరుగుతుంటే ఆ అమ్మాయి మాత్రం మేడపైకి వచ్చి ముభావంగా చుక్కలు లేని ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత వెళ్తూ నా వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో నాకు లెక్కతేలని, తేలాల్సిన ప్రశ్నలు చాలా కనిపించాయి. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి నాకు కనిపించలేదు. నేను కూడా పెద్దగా తన గురించి ఆలోచించలేదు.

* * *

      మళ్లీ పది రోజుల తర్వాత నేను మేడపైకి వెళ్లి కిందకి వస్తుంటే, తెల్లని వస్త్రంలో చుట్టిన ఒక మృతదేహాన్ని బయటికి తీసుకురావడం కనిపించింది. జీవంలేని ఆ శరీరం కొన్ని వేల ప్రశ్నల మూటగా కనిపించింది నాకు. చావంటే... ముసలితనం వల్లనో, జబ్బు వల్లనో, నిర్లక్ష్యం వల్లనో, మనిషి మృగంగా మారినప్పుడు జరిగే సంఘటనల వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో జరిగేదని అనుకున్నా అప్పటివరకూ. మొదటిసారి ఆత్మహత్య అంటే ఏంటో తెలిసింది! 
      బంధువులు, దగ్గరివాళ్లు, చుట్టుపక్కల వాళ్లు వెళ్లి ఆ అమ్మాయి మృతదేహాన్ని చూశారు. అయితే వాళ్ల ముఖాల్లో ఎలాంటి బాధా లేదు. ఏదో మనిషిగా మన ధర్మం, ఇది ఒక తంతు అన్నట్లు నడచుకున్నారు.
      నేను చూసిన మొదటి నిశ్శబ్ద శవయాత్ర అదే. ఆ అమ్మాయి అమ్మ, అన్న ఆ తంతును త్వరగా జరిపించేయాలని ఆరాటపడుతున్నట్లు అనిపించింది. ఆ అమ్మాయి తండ్రి మాత్రం దిక్కుతోచని వాడిలా అందరినీ పిచ్చిగా చూస్తూ గోడకి చేరబడి నిల్చున్నాడు. కొందరు బలవంతంగా ఏడుపు ముఖాలు పెట్టారు. వాళ్లని చూసి నాకు వెర్రి కోపం వచ్చింది. ఆ అమ్మాయి మోసపోయి, తిరిగి ఇంటికి వచ్చి.. ఇక్కడా ఆదరణ లభించక ఆత్మహత్య చేసుకుందనే బాధ ఒక్కరిలోనూ కనిపించలేదు.
      మన పెద్దవాళ్లు అంటారు... ‘ఒకసారి నమ్మి మోసపోతే అది మోసం చేసినవాడి తప్పు. కానీ రెండోసారి మోసపోతే అది మన తప్పు’ అని- అయితే ఆ అమ్మాయి ఆ మాటకు అతీతంగా సాటిమనిషి మీద మనకు కనీస నమ్మకం లేకపోతే బతకటం కష్టమని ఇలా మోసపోతూ వచ్చిందేమో ప్రతిసారీ. 
      కూతురిని మనిషిగా పెంచడం చేతకాని తల్లిదండ్రులు; పెంపకం అనే మాటని సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న మనుషులు; మనిషిగా బతకడం చేతకాక అవకాశవాదులు చేస్తున్న అకృత్యాలు... ఇలా అందరూ కలిసి ఒక తనువుని పాతిపెట్టారు. పూర్తిగా పరిచయంలేని నా స్నేహితురాలు నాతో మాట్లాడితే ఒక్కమాట చెప్పాలనిపించింది.... ‘నీ జీవితంలో ఆనందం వెతుకు, కానీ అందులో నువ్వు కోరుకున్న నీ జీవితం ఎంత ఉందో తెలుసుకో’ అని...! 
నరేష్‌ కుమార్‌

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam