ఒరేయ్‌ జగన్నాథం!

  • 942 Views
  • 9Likes
  • Like
  • Article Share

    వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు

  • హైద‌రాబాదు
  • 8374846248
వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు

ఆ వీధి వాళ్లే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల జనమూ జడిసిపోతున్నారు.. ‘జగన్నాథం’ అనే పేరు వినగానే! ‘రామనాథం’ కనపడగానే!! ఎందుకు? ఎవరు వీళ్లిద్దరు? అది తెలుసుకోవాలంటే ఆ బాల్యమిత్రుల కథలోకి వెళ్లాలి. 
ఆదివారం
వచ్చిందంటే చాలు, కూకట్పల్లిలోని పిచ్చయ్యనగర్‌ కాలనీ కూరగాయలు కొనుక్కునేవాళ్లతో కిటకిటలాడిపోతుంటుంది. ఆదివారాల్లో జరిగే కూరగాయల సంతకు ఆ కాలనీ అంత ప్రసిద్ధి. చుట్టుపక్కల ఉన్న వెర్రివెంగళప్పనగర్, అమాయకపల్లి, భభ్రాజమానపురం కాలనీలు ఈ కాలనీకన్నా బాగా పెద్దవైనా, సరైన మార్కెట్‌ సదుపాయాలు లేవు. దాంతో వీటికి కూడా పిచ్చయ్యనగర్‌ కాలనీయే పెద్ద దిక్కు. ఈ ఆదివారం సంత మరింత రద్దీగా ఉంది. 
      ‘‘ఒరేయ్‌! జగన్నాథం! ఎంత కాలమైందిరా నిన్ను చూసి! బాగున్నావా!’’ అంటూ ఎవరో వీపు మీద గట్టిగా చెయ్యి వేయడంతో, నిలదొక్కుకోలేక, అమ్మకానికి కిందపోసి ఉన్న టమాటాల మీద అమాంతం బోర్లాపడిపోయాడు సుబ్బా రావు. ఏదో ఆదివారం సెలవు రోజు కదా, ఓ నాలుక్కూరలు కొనుక్కుపోదాంలే అని సంతకు వచ్చాడు పాపం. ఇదిగో! ఇంతలో ఇలా జరిగింది. ఓ నలుగురు సాయంపట్టి లేపారు సుబ్బారావును. ఒళ్లంతా టమాటా రసం కారుతూ హత్యకు గురైనవాడిలా మారిపోయింది అతని రూపం.
      ‘‘అయ్యయ్యో! క్షమించండి! మిమ్మల్ని వెనకనుంచి చూసి నా బాల్యమిత్రుడు జగన్నాథమేమో అనుకున్నాను’’ అన్నారా పెద్దమనిషి. సుబ్బారావుకు ఒక్కసారిగా కోపం నషాళానికి ఎక్కేసింది. అయితే, ఒంటికంటుకున్న టమాటారసం శరీరాన్ని కాస్త చల్లబరచడంతో, ఆ అరవై ఏళ్ల పెద్దమనిషి వయసు మీద గౌరవం వల్ల కాస్త మెత్తబడ్డాడు. ‘‘ఎంత తెలిసినవాళ్లని అనిపిస్తే మాత్రం ఏదో మెల్లిగా తట్టాలి కాని తట్టు తేలేలా కొడతారటండీ!’’ చిరుకోపంతో అన్నాడు. 
      ‘‘అయ్యో! అంతలా కొట్టానా! ఏదీ చూడనివ్వండి అని సుబ్బారావు వీపును తడిమి, నిజమే! బొబ్బట్టు సైజులో బూరెలా ఉబ్బిపోయింది. మా ఇంటికి రండి, మందు పూయిస్తాను’’ పశ్చాత్తాపంతో పలికారా పెద్దమనిషి. చితికిపోయిన పళ్లకు డబ్బిస్తావా చస్తావా అంటూ కూరలమ్మి పేచీ ఓ పక్క, తన వీపు మీద తేలిన వాత పరిమాణం ఎంతో తెలియడం, ఆ పరిణామంతో ఏర్పడిన మంట మరోపక్క బాధిస్తుండటంతో, ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది సుబ్బారావుకు. ఆపకుండా ఏడుస్తున్న సుబ్బారావును కాస్త సముదాయించి, తన ఇంటికొస్తే మందు పూయిస్తానని, కాస్త మంట తగ్గుతుందని మరోసారి చెప్పారా పెద్దమనిషి. మొదట్లో ఉక్రోషంతో రానన్నప్పటికీ, ఆ పెద్దమనిషి బలవంతం మీద సరే అనక తప్పలేదు సుబ్బారావుకు. టమాటాలకు జరిగిన నష్టానికి పరిహారాన్ని చెల్లించి, ఆ పెద్దమనిషితో అక్కడనుంచి కదిలాడు. నడుస్తూ, మాటల్లో ఆయన పేరు రామనాథం అని, పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయులని తెలుసుకున్నాడు. తానో ప్రైవేటు ఉద్యోగినని, తనకు ఒకటి, రెండు తరగతులు చదువుతున్న ఇద్దరు పిల్లలున్నారని చెప్పుకొచ్చాడు. ఇంతలో రామనాథం ఇల్లొచ్చింది. చెప్పులు విప్పి, ముందు గదిలో కాలుపెట్టిన సుబ్బారావు అక్కడి దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. ఓ పదిమందిదాకా మగాళ్లు చొక్కాలు విప్పేసి తమ వీపుల్ని వీధివైపు చూపిస్తూ కింద పరచిన చాపలమీద కూర్చొనున్నారు. వాళ్లందరి వీపుల మీదా ఎర్రగా వాతలు తేలి ఉన్నాయి. ఓ పదేళ్ల కుర్రాడు వాటి మీద ఏదో మందు పూస్తున్నాడు. సుబ్బారావు అయోమయంగా చూస్తుంటే, ఆ గదిలో ఓ మూలగా కూర్చున్న ముసలావిడ, టిక్కుటిక్కు లాడిస్తూ అతని దగ్గరకొచ్చింది. 
      ‘‘ఏం నాయనా! ఒళ్లంతా ఈ రక్తమేంటి? ఎవరినైనా చంపేసి వస్తున్నావా? అసలు నువ్వెవరు? మీదే ఊరు? నీదే పేరు? పెళ్లయిందా? పిల్లలున్నారా?’’ అంటూ ఆపకుండా ప్రశ్నలు వేసింది. అసలే నిప్పులమూట కట్టినట్లు వీపు మండిపోతుంటే మధ్యలో ఈవిడ ప్రశ్నల గోలొకటి. ఒళ్లు మండిపోయింది సుబ్బారావుకు. కానీ, పెద్దావిడ కదా అని ఓపిగ్గా జవాబులివ్వడంతో, తలాడిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
      ‘‘తాయారూ! తాయారూ! ఇదిగో ఇతణ్ని జగన్నాథం అనుకుని పలకరించాను. కాస్త ఇతని సంగతి చూడు’’ భార్యను పిలిచారు రామనాథం.
      ‘‘తెచ్చారూ మరో గిరాకీని! బాగుందీ జగన్నాథం గోల’’ వంటింట్లోంచి విసుక్కుంటూ వచ్చిందావిడ. 
      ‘‘ఏమిటో! ఈ జగన్నాథంగాడు ఈ జన్మకి కనిపిస్తాడో లేదో!’’ గొణుక్కుంటూ అక్కడి నుంచి పక్కగదిలోకి వెళ్లి  తలుపేసుకున్నారు రామనాథం. 
      సుబ్బారావు వేషం చూడగానే పరిస్థితి అర్థమైపోయింది తాయారుకు. ‘‘అయ్యో! పాపం! నువ్వు మునక్కాడలా ఉండటంతో ఈయన వెనకనుంచి పలకరించగానే ముందుకు పడిపోయినట్లున్నావు బాబూ! శుభ్రంగా స్నానం చేసొస్తే లుంగీ ఇస్తాను. కట్టుకుని అదిగో! వాళ్ల పక్కన అలా చాపమీద కూర్చో. మా మనవడు నీకు మందు రాస్తాడు’’ చెప్పి లోపలికెళ్లింది.
      ‘‘అంకుల్‌! అంకుల్‌! తొందరగా స్నానంచేసి రండంకుల్‌! మీరొస్తే మీ వీపునకు మందు పూస్తానంకుల్‌! రండంకుల్‌!’’ చేయి పట్టుకుని ఆ కుర్రాడు లాగుతుంటే, ‘వీడికి వీడి ఈడువాళ్లతో ఆడుకోడంలో ఉన్న ఆనందం కంటే, వీపులకు మందు పూయడంలోనే ఆనందం ఎక్కువగా ఉన్నట్లుంది’ మనసులో తిట్టుకున్నాడు సుబ్బారావు. కొంపదీసి తానుగాని పిచ్చివాళ్ల కొంపకొచ్చానేమో అని కాసేపు బుర్రగోక్కున్నాడు. ఇక చేసేదేమీ లేక, స్నానం చేసి, లుంగీ కట్టుకుని ఆ మగాళ్ల పక్కన చాపమీద కూర్చున్నాడు. ‘వచ్చాడురా మరో బకరా’ అన్నట్లుగా వాళ్లు తనను చూస్తుంటే, చెప్పలేనంత సిగ్గేసింది సుబ్బారావుకు. కాసేపటి తర్వాత తాగడానికి తాయారు ఇచ్చిన చల్లని నిమ్మకాయ నీళ్లు గొంతు దిగుతుంటే, ఆ కుర్రాడి చేతిలోని మందు వీపునకు చల్లగా తగులుతుంటే కాస్త ప్రాణం లేచొచ్చింది. 
      ‘‘పిన్నీ! ఏంటండీ ఈ గోల!’’ ఉండబ ట్టలేక తాయారును అడిగాడు సుబ్బారావు.
      ‘‘ఏం చెప్పను నాయనా! మావారు, ఆ జగన్నాథం ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆయనంటే ఈయనకు పంచప్రాణాలు. అయితే, జగన్నాథం వాళ్ల నాన్న బదిలీ అవడంతో, వీరి స్నేహానికి తెరపడక తప్పలేదు. ప్రాణస్నేహితుడు వెళ్లిపోయాడన్న బెంగతో ఈయనలో విపరీతమైన నిరాశ, నిస్పృహలు ప్రవేశించి మతి కొద్దిగా అదుపు తప్పింది. అదిగో! ఇక అప్పటినుంచి మొదలైంది ఈ జగన్నాథం గోల. ఏ మగపురుగైనా కనిపిస్తే చాలు, వెనకగా వెళ్లి ‘ఒరేయ్‌! జగన్నాథం!’ అంటూ వీపు విమానం మోత మోగించేవారు. అందుకే, పెళ్లి వయసొ చ్చినా, ఈయన సంగతి తెలిసి పిల్లని వ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవ డంతో, నా మేనత్త కొడుకే కదా అని నేనే చేసుకోవాల్సివచ్చింది. మా పెళ్లిలో ‘ఒరేయ్‌! జగన్నాథం!’ అంటూ ఈయన ఎంతమంది వీపులు బాదేశారో లెక్కేలేదు. ఆ జగన్నాథం కనిపించక యాభై ఏళ్లయినా, ఈయన మాత్రం ఇప్పటికీ జగన్నాథ నామస్మరణ చేస్తూ, పసిపిల్లాడి నుంచి పండు ముసలాడివరకు ఎవరినీ వదలకుండా వెంటపడుతూనే ఉన్నారు. అందుకే, ఈయన్నుంచి తప్పించుకోడానికి ఇప్పుడు వీపునకు బ్యాక్‌ ప్యాకు కట్టుకుని తిరగని మగాడు లేడంటే నమ్ము, ఎవరో నీలాంటి అర్భకులు తప్ప. ఆఖరికి పక్క ఊళ్ల నుంచి మా వీధికొచ్చే మగాళ్లు కూడా ఎవ్వరూ సూటుకేసులు పట్టుకోకుండా బ్యాక్‌ప్యాకులే కట్టుకుంటున్నారు. అదృష్టమేమిటంటే బాబూ! ఈయన ఏ ఆడదాని వెనక పడరు. ఆ జగన్నాథం ఆడది కాదని, ఆ మాత్రం ఆలోచనాశక్తి ఈయనకుండటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం’’ చెప్పడం కాస్త ఆపి, ఓ గ్లాసుడు మంచినీళ్లు తాగింది తాయారు.
      ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు. ఓహో అదా సంగతి! ఎవరో ఒకరిద్దరు తనలాంటి అమాయకులు సంతకు చేతి సంచులతో వచ్చారు తప్ప, ప్రతివాడూ కూరగాయలు కొనుక్కోడానికి బ్యాక్‌ప్యాక్‌లతో ఎందుకొచ్చారో ఇప్పుడర్థమయ్యిందతనికి. ‘‘పిన్నిగారూ! మరి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు ఏ వైద్యుడికో చూపించాలి గాని ఇలా సమాజం మీదకు వదిలేస్తే ఎలా?’’ తన వీపు మీద వాతను తలచుకొని కోపాన్ని అణచుకోలేక అడిగాడు.
      ‘‘అయ్యో! చూపించకేం నాయనా! ఎన్నో ఏళ్ల కిందటే చూపించాం. ఈయనకు ఆ జగన్నాథం కనిపించేవరకు పరిస్థితి ఇంతేనని తేల్చి చెప్పేశాడు డాక్టరు. పైగా, రోజుకొకరిని ఇలా ఈయన పలకరించడమే ఉత్తమం అని కూడా చెప్పాడు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే, బయటికెళ్లకుండా ఈయన్ని బంధించినా, ఒకవేళ ఈయనతో ఎవరైనా తోడుగా వెళ్లినా, ఈయన ఎవరినైనా పలకరించేటప్పుడు వారించినా, ఈయన పూర్తిగా మతిస్థిమితం కోల్పోయి, ఇక మాకు దక్కకుండా పోతారని కూడా చెప్పాడు. పాపం ఆ వైద్యుడే, మావారి వల్ల వీపులు వాచిపోయినవారికి పూయమని ప్రత్యేకంగా ఓ లేపనాన్ని తయారుచేసి మాకిచ్చాడు. ఈ లేపనం తప్ప ప్రపంచంలో మరే మందూ మావారు సృష్టించే వాతలను తగ్గించలేదట. ఇంత శక్తిమంతమైన లేపనానికి కూడా వాతలను తగ్గించడానికి వారం రోజులు పడుతోంది. అందుకే, వీపులు వాచిపోయిన కొత్త, పాత ముఖాలతో మా ఇల్లు ఎప్పుడూ సందడే. బాబూ! గుడ్డిలో మెల్ల ఏంటో తెలుసా? మావారు వాతలు తేలేలా ఎవరినైనా పలకరించినా, వారి మానాన వారిని వదిలెయ్యక మందు పూయిస్తాను, రమ్మంటూ వారిని మా ఇంటికే తీసుకురావడం.. ఆ ప్రాయశ్చిత్తమే నా మాంగల్యాన్ని కాపాడుతోంది బాబూ! పాపం, ఈయన బాధను చూడలేక, ఆ జగన్నాథం ఉనికిని ఎలాగైనా తెలుసుకోవాలని మా కొడుకు, కోడలు వాళ్ల ఉద్యోగాలకు సెలవులు పెట్టి, ఇదిగో! ఈ బుజ్జిగాడిని మాకు వదిలిపెట్టి దేశమంతా తిరుగుతున్నారు. ఆ జగన్నాథం ఎప్పుడు కనిపిస్తాడో, ఈయన మామూలు మనిషి ఎప్పుడవుతారో!’’ చీర కొంగుతో కళ్లు తుడుచుకుంది తాయారు. 
      ‘‘అంతా బాగానే ఉందిగాని పిన్నిగారు! నాకో సందేహం! చిన్ననాటి స్నేహితుల ముఖాలను ఎవరైనా కొంతకాలమే గుర్తుపెట్టుకోగలం కదా! ఏళ్లు గడిచేకొద్దీ గుర్తుపట్టడం ఎవరికైనా కష్టమే. నిజానికి ఈ రోజు ఆ జగన్నాథం బాబాయి తారసపడ్డా పోల్చుకోగలరంటారా? మరి అలాంటప్పుడు చిన్నాపెద్దాలేకుండా ఎవరిని పడితే వారిని వెనకనుంచి చావగొడుతూ పలకరిస్తే ఏం లాభం?’’ సుబ్బారావు గొంతులో కోపం తగ్గలేదు. 
      ‘‘బాబూ! నీకు ఇందాకే చెప్పాను కదా! ఈయనకు చిన్నప్పుడే మతి కొద్దిగా అదుపు తప్పిందని. అందుకే వయోభేదం లేకుండా అందరినీ పలకరిస్తున్నారు. అయితే, వెనకగా వెళ్లి ఎవరినైనా పలకరించడంలో మాత్రం ఓ దేవరహస్యం ఉంది నాయనా! అదేంటంటే, ఒరేయ్‌! జగన్నాథం! అంటూ ఈయన ఆ జగన్నాథం వీపును వాయగొట్టిన మరుక్షణమే, ‘ఒరేయ్‌! రామనాథం!’ అంటూ ఆయన ఈయన చెంపను ఛెళ్లుమని పగలగొట్టేవాడట. వీళ్లు ఎప్పుడూ అలాగే పలకరించుకునేవారట. అదే వీళ్ల స్నేహానికి గుర్తట. అందుకే, ఈయన తన చెంప ఎప్పుడు పగులుతుందా అనే ఆశతో, అందరి వీపులు పగలగొడుతున్నారు. ఇప్పుడర్థమైందనుకుంటా బాబూ! నీకసలు విషయం’’ చెప్పడం ఆపింది తాయారు. 
      అంతా విన్న సుబ్బారావు వైరాగ్యంగా ఓ నవ్వు నవ్వాడు. ఆ క్షణంలో అతని బుర్రలో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. 
      ‘‘పిన్నిగారూ! మీరు చెప్పిందంతా విన్నాక, బాబాయిని మామూలు మనిషిని చేసే ఓ అద్భుతమైన ఉపాయం నాకు తట్టిందండీ’’ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు సుబ్బారావు. ‘‘అలాగా బాబూ! అయితే నువ్వే ఎలాగైనా ఈయన్ని కాపాడి పుణ్యం కట్టుకోవాలి’’ సుబ్బారావు చేతులు పట్టుకుని ప్రాధేయపడింది తాయారు. 
      ఆ గదిలో మూలన కూర్చొని వీరి సంభాషణంతా వింటున్న ముసలావిడ మెల్లగా నడుచుకుంటూ సుబ్బారావు దగ్గరికొచ్చి ‘‘మా ఇంటికి దేవుడిలా వచ్చావు. మావాణ్ని మనిషిని చేస్తే చచ్చి నీ కడుపున పుడతాను నాయనా’’ అని చెప్పి, వెళ్లి తన కుర్చీలో కూర్చుంది. 
      ‘మీకు ఆ అవకాశం లేదులెండి. నాకు కు.ని.శ. అయిపోయిందిగా’ మనసులో అనుకున్నాడు సుబ్బారావు. ‘‘పిన్నిగారూ! నా ఉపాయమేంటంటే, ఈ జగన్నాథం- రామనాథం- వీపులు, చెంపలు పగలగొట్టుకోవడాలు, వగైరాలన్నీ, నేను ఇంటికెళ్లి మా నాన్నగారికి వివరిస్తాను. రేపు బాబాయి ఇంట్లోంచి కాలు బయటికి పెట్టగానే, ఆయనకు అందుబాటు దూరంలో ముందుగా మా నాన్నగారు నడుస్తుంటారు. ఒరేయ్‌! జగన్నాథం! అంటూ మా నాన్నగారి వీపు మీద చేయిపడిన వెంటనే, మా నాన్నగారు ఒరేయ్‌! రామనాథం! అంటూ బాబాయి చెంపను ఛెళ్లుమనిపిస్తారు. అంతే, తన బాల్యమిత్రుడు తనకు దొరికాడన్న ఆనందంతో బాబాయి మామూలు మనిషయిపోతారు. ఇక బాబాయి ఆనందం, ఆరోగ్యం కోసం మా నాన్నగారు తానే జగన్నాథంలా రాబోయే రోజుల్లోనూ ఈ నాటకాన్ని కొనసాగిస్తారులెండి. మీరేమంటారు? ఎలా ఉంది నా ఉపాయం?’’ కాస్త గర్వంగా అడిగాడు సుబ్బారావు. 
      ‘‘అద్భుతంగా ఉంది. అలాగే కానిద్దాం. మా కొడుకు, కోడల్ని ఇక ఇంటికొచ్చెయ్య మని ఫోన్‌ చేసి, చెప్పేస్తాను’’ సుబ్బారావు తెలివికి తెగ సంతోషపడి మరో గ్లాసుడు చల్లని నిమ్మకాయ నీళ్లిచ్చి అతణ్ని సాగనంపింది తాయారు. 
      మర్నాడు అనుకున్న పథకం ప్రకారమే, సుబ్బారావు వాళ్ల నాన్న అప్పారావు వీపు పగిలిపోవడం, రామనాథం చెంప ఛెళ్లుమని పోవడం జరిగిపోయాయి. ఎన్నో ఏళ్ల తర్వాత బాల్యమిత్రుడు కనిపించడంతో, రామనాథం ఆనందానికి అవధుల్లేవు. తన వాళ్లకి పరిచయం చేస్తాను రమ్మంటూ జగన్నాథాన్ని.. అదేనండీ అప్పారావును ఇంటికి తీసుకెళ్లారు.
      ‘‘రండర్రా! అందరూ రండి! ఎవరొ చ్చారో చూడండి! నా బాల్యమిత్రుడు జగన్నాథం నాకు దొరికాడు’’ ఆనందంతో రామనాథం గంతులేస్తుంటే, ఆయన మామూలు మనిషి అయిపోయినందుకు సంతోషంతో ఇంట్లో వాళ్లందరూ ఆయనతో కాళ్లు కలిపారు. ఓ అరగంట తర్వాత, ‘‘తాయారూ! వీడికి టీ అంటే పరమపిచ్చి. టీ ఇస్తానంటే చాలు నాలుక కూడా కోసేసుకుంటాడు. తొందరగా వేడివేడిగా ఓ టీ పట్రా. అన్నట్లు.. టీ లో పోపు వేయడం మాత్రం మరచిపోకేం’’ భార్యకు చెప్పారు రామనాథం.
      ‘‘టీ లో పోపా!!!’’ కుర్చీలోంచి ఎగిరి కిందపడ్డారు అప్పారావు.
      ‘‘అదేంట్రా! పోపు వేసిన టీ అంటే నీకెంతిష్టం! చిన్నప్పుడు మా ఇంటికొచ్చి పోపు టీ కోసం మా అమ్మ కాళ్లావేళ్లా పడేవాడివిగా! మర్చిపోయావా!’’ అప్పారావును కుర్చీలో కూర్చోపెడుతూ అన్నారు రామనాథం.
      ‘‘అబ్బే! నాకిప్పుడు బీపీ, షుగరు రావడంతో మానేశాన్రా’’ అప్పారావులో ఏదో చెప్పలేని భయం.
      ‘‘ఊహూ! అదేం కుదరదు. ఈ ఒక్కరోజుకైనా నువ్వు నా మాట వినాల్సిందే’’ అంటూ వేడివేడి పోపు టీని అప్పారావు చేతిలో పెట్టారు రామనాథం.
      కడుపులో దేవుతున్నా, రామనాథం సంతోషం కోసం మొత్తం టీని తాగక తప్పలేదు అప్పారావుకి.
      ‘‘తాయారూ! మా వాడికి కాకరకాయ ఉప్మా, దానితో పాటు నంచుకోడానికి వేపాకు చట్నీ అంటే చెప్పలేనంతిష్టం. వెంటనే తీసుకురా’’ 
      ఈసారి కుర్చీతో సహా కిందపడి పోయారు అప్పారావు.
      ‘‘ఒరేయ్‌! ఇలా మాటిమాటికి కింద పడిపోతున్నావేంట్రా! ఏదైనా బలహీనతేమో! ఓసారి డాక్టరుకు చూపించుకో’’ కుర్చీని నిలబెట్టి, అప్పారావును కూర్చోబెట్టారు రామనాథం. 
      ‘‘ఒరేయ్‌! ఇప్పుడే టీ తాగాను కదా! మళ్ళీ ఈ ఉప్మా ఏంట్రా?’’ జీవితం మీద ఆశ సన్నగిల్లింది అప్పారావుకి. 
      ‘‘ఒరేయ్‌! ఒరేయ్‌! నువ్వన్నీ మర్చిపోయావురా! పోపు టీ తాగిన వెంటనే వేపాకు చట్నీ నంచుకుంటూ కాకరకాయ ఉప్మా తినడమంటే నీకు చచ్చేంత ఇష్టమని నాకు తెలీదూ!’’ అని రామనాథం అంటుండగానే, ‘‘కాకరకాయ ఉప్మా విత్‌ వేపాకు చెట్నీ రెడీ’’ అంటూ పళ్లాన్ని అప్పారావు చేతిలో పెట్టింది తాయారు. ఇక తినక తప్పదని గ్రహించి, ఒక చెంచాడు ఉప్మాను నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పడంతో, పరిగెత్తుకుంటూ బాత్రూంకెళ్లి భళ్లున వాంతి చేసుకున్నారు అప్పారావు. మరిక తినడం తనవల్ల కాదని, మొత్తం ఉప్మా తిని తీరాల్సిందేనని అప్పారావు, రామనాథంల మధ్య వాగ్వాదం మొదలైంది. అప్పారావుకి కోపం తారస్థాయికి చేరుకుంది.
      ‘‘ఒరేయ్‌! మనిషన్న వాడెవడైనా ఇలాంటివి తిని, తాగుతాడ్రా! చచ్చిపోతాడ్రా! నీ పిచ్చి తగలెయ్యా!’’ కోపంతో ఊగిపోయారు అప్పారావు. రామనాథం కూడా తోక తొక్కిన తాచులా మారిపోయారు.
      ‘‘ఒరేయ్‌! నువ్వు ముమ్మాటికీ నా జగన్నాథానివి కాదు. వాడెప్పుడూ నన్ను కోప్పడేవాడు కాదు. నువ్విది చెయ్యరా అని చెప్తే వెంటనే చేసేవాడు. నీకిదిష్టం తినరా అంటే మారుమాట్లాడకుండా తినేవాడు. అంతేకాని, నీలా వాంతులు చేసుకునేవాడు కాదు. అందుకే, నువ్వు కచ్చితంగా నా జగన్నాథానివి కాదు. నా జగన్నాథానివి కానేకాదు’’ అని పెద్దగా అరుస్తూ గదిలోకెళ్లి తలుపేసుకున్నారు రామనాథం.
      అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఎవరి ముఖాల్లోకీ చూసే సాహసం చేయలేదు అప్పారావు. అసలు ఈ రోజు తనను వీళ్లు ఇంట్లోంచి బయటికెళ్లనిస్తారా అని భయం పట్టుకుందాయనకి. ఓ అయిదు నిమిషాలు మౌనం తర్వాత నోరు విప్పింది తాయారు.
      ‘‘ఎంత పని చేశారు అన్నయ్య! ఈయనను మళ్లీ పూర్వపు మనిషిని చేసేశారు. సరే! జరిగిందేదో జరిగింది. దయచేసి రేపు మరోసారి ప్రయత్నించండి’’ ఆర్ద్రత నిండిన గొంతుతో చెప్పింది. 
      ‘‘మరోసారి ప్రయత్నమా!!! ఎందుకు ప్రయత్నించను తల్లీ! తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇలాంటి పోపు టీలు, కాకరకాయ ఉప్మాలే కాదు, కుంకుడు రసం కలిపిన బిర్యానీలు, ఎండుకారం చల్లిన ఐసుక్రీములు, నా శ్రాద్ధం, నా పిండాకూడు అన్నీ తినడం బాగా సాధన చేసి అప్పుడు ప్రయత్నిస్తాను. అంతవరకు నేను మీకు గానీ, నా కొడుకు ప్రబుద్ధుడికి గాని కనిపిస్తే ఒట్టు’’ అంటూ జారిపోతున్న పంచెను కూడా పట్టించుకోకుండా అక్కణ్నుంచి పరుగులంకించుకున్నాడు అప్పారావు. 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam