అసలు సంగతి

  • 1129 Views
  • 10Likes
  • Like
  • Article Share

    లేఖా గుమ్మడి

సోనియాకి ఎప్పట్లా శనివారం పూట బారెడు పొద్దెక్కేదాకా పడుకుని బద్ధకంగా పక్కమీద అటూఇటూ దొర్లే భాగ్యం లేకపోయింది. అలారం మోగకుండానే ఉలిక్కిపడి లేచింది. కళ్లు నులుముకుని గోడ గడియారం వంక చూసింది. అయిదవడానికి ఇంకో అయిదు నిమిషాలుంది. వెంటనే దిండు పక్కనున్న మొబైల్‌ చేతిలోకి తీసుకుని శరణ్యకి ఫోన్‌ చేసింది. ఉహూ ఎత్తలేదు. విసుక్కుంటూనే మళ్లీమళ్లీ చేసింది. చివరికి నిద్రమత్తులోనే ‘‘లో...’’ అంది.
      ‘‘ఏం తల్లీ చంద్రమండలంలో ఉన్నట్టు అంత లోగొంతుకేంటి? లేలే. గంటలో తయారై వచ్చేసెయ్‌’’ అని ఫోన్‌ పెట్టేసి గబగబా సిద్ధమైపోయి మైత్రీవనం వెళ్లి మినీ బస్సెక్కేసింది. అప్పటికే అంతా వచ్చేశారు. కాసేపటికి శరణ్యా ఎక్కింది. సరదా మాటలతో, సంతోషాల కూనిరాగాలతో గంటన్నర ఇట్టే గడిచిపోయి బస్సు గమ్యస్థానం చేరింది. 
      ‘‘మహర్షి సినిమా చూసి మనలాంటి ఐటీ పక్షులు చాలామంది వీకెండ్‌లో పొలం పనులు చేయడానికి వెళ్లారు తెలుసా? వాట్సప్‌లో వీడియోలు భలే వైరలయ్యాయి’’ అన్నాడు ఆదర్శ్‌.
      ‘‘కత్తి చేతిలోకి తీసుకున్నంతలో రైతులైపోతారా?’’ నవ్వాడు రాకేష్‌.
      ‘‘నాయినా అవి కత్తులు కావు, కొడవళ్లు.. పబ్బులకెళ్లి మందుకొట్టడం కంటే మంచి పనేగా’’ అన్నాడు ఆదర్శ్‌.
      ‘‘ఏదన్నా చేస్తే సెన్సేషన్‌ కోసం కాదు, ఫీలై చెయ్యాలి’’ అని, క్షణమాగి ‘‘అయిదురోజులు పీల్చి పిప్పి చేశాకొచ్చే వీకెండ్‌ కోసం ఆకలితో ఉన్న పులుల్లా ఎదురుచూస్తాం కదూ!’’ అన్నాడు రాకేష్‌.
      ‘‘కానీ ఇవాళ ఏ జింకలూ దుప్పులూ దొరకవు’’ అన్నాడు ఆదర్శ్‌.
      ‘‘మా అమ్మ ఇంట్లో పూజ ఉందన్నా వినకుండా వచ్చేశా’’ అంది అపర్ణ.
      ‘‘మనం చేస్తున్నది పూజ కంటే గొప్ప పని. రిగ్రెట్సేమీ అక్కర్లేదు’’ అంది సోనియా.
      ‘‘అవునుగానీ ఈ బిలిబిత్తిరిగాడు కూడా వచ్చాడేంటి?’’ అంది శరణ్య. 
      ‘‘అంటే మోహనా?’’ నవ్వింది అపర్ణ.
      హెచ్చార్‌ మేనేజర్‌ సంతానం ఆవాళ్టి కార్యక్రమమంతా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటుచేశాడు.
      ఆరుబయట కుర్చీల్లో వృద్ధులంతా కూర్చుని ఉన్నారు. వచ్చిన సాఫ్ట్‌వేర్‌ వాళ్లందరూ వాళ్లతో కలిసిపోయారు. పాత సినిమా పాటలు మెల్లగా వినిపిస్తున్నాయి. బాదంపాలు, తినుబండారాలు అందించారు. సోనియా, అపర్ణ, మహేష్‌లు సరదా స్కిట్లు చేశారు. ఆదర్శ్‌ మిమిక్రీ చేశాడు. శరణ్య మరికొందరితో కలిసి నృత్యం చేసింది. మధ్యాహ్నం అంతా కలిసి బ్రహ్మాండమైన భోజనం చేశారు. రాకేష్‌ కొన్ని చెణుకులు చెప్పాడు. మరో గంటకి టీలు తాగి సమోసాలూ పకోడీలూ తిన్నారు.
      సంతానం సంచిలోంచి కవర్లు తీసి పెద్దవాళ్లందరికీ తలా ఒకటి అందించి ‘‘ఈ కవర్లలో వెయ్యి రూపాయలున్నాయి. మీ ఇష్టమొచ్చింది కొనుక్కోండి! ఇది వీళ్లంతా ఇచ్చింది’’ అన్నాడు.
      సోనియా ‘‘ఇవాళ అంతర్జాతీయ కౌగిలింతల దినం అట. మొన్నటిదాకా ‘ఛ ఇదేం రోజు?!’ అనుకునేదాన్ని. కానీ దీన్ని కూడా ప్రయోజనాత్మకంగా జరుపుకోవచ్చు అనిపించింది. పిల్లలకు దూరంగా భారంగా గడుపుతున్న వాళ్లని దగ్గరకు తీసుకుని నేనున్నానన్న భరోసా ఇవ్వొచ్చనిపించింది. నా ఆలోచన చెప్పగానే వీళ్లంతా ఒప్పుకోవడం నా అదృష్టం. సంతానంగారు దగ్గరుండి అన్నీ చేశారు. ఇవాళ నాకెంతో సంతోషంగా ఉంది’’ అని, ప్రతి స్త్రీనీ హత్తుకుంటూ ‘ఒంటరిగా ఉన్నామని మీరెవరూ బాధపడకండి! మీకు మేమున్నాం, అప్పుడప్పుడూ వస్తుంటాం’ అని మాటిచ్చింది. తక్కిన అమ్మాయిలు అనుసరించారు. మగపిల్లలూ తాతగార్లను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడారు.
      వీళ్లంతా వెనుతిరుగుతుంటే పెద్దవాళ్లంతా బాధగా చూశారు. త్వరలోనే వస్తామని సముదాయించి అంతా బస్సెక్కారు.
      ‘‘ఈరోజెంత థ్రిల్లింగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇకనుంచీ ప్రతి వీకెండుకూ ఇలాంటిదేదో చేయాలనుంది’’ అంది సోనియా.
      ‘‘కానీ ఆ మోహన్‌ మొహం చూడు మాడిపోయిన బల్బులా ఎలా ఉందో!’’ అంది అపర్ణ.
      ‘‘రూపాయి కూడా సాయం చేయకపోయినా దుఃఖమేంటో’’ అంది సోనియా. 
      ‘‘అసలు సంగతి సరిగా తెలీక.. హగ్‌ డే అనగానే ఏ రిసార్ట్‌లోనో కలర్‌ఫుల్‌ సెలబ్రేషన్‌ అనుకుని ఎగేసుకుంటూ వచ్చాడట. వృద్ధాశ్రమం అని తెలిసి..’’ అంటూ నవ్వుతుంటే అంతా శ్రుతి కలిపారు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam