ఒక ఐడియా

  • 514 Views
  • 2Likes
  • Like
  • Article Share

    సీహెచ్‌.శివ రామ ప్ర‌సాద్‌

  • కూక‌ట్‌ప‌ల్లి, హైద‌రాబాదు.
  • 9390085292
సీహెచ్‌.శివ రామ ప్ర‌సాద్‌

ప్రమోషన్‌ కావాలంటే... మేనేజర్‌ నరసింహానికి లంచం ఇవ్వాలి. కానీ ఫైసా ఖర్చులేకుండా ప్రమోషన్‌ పొందొచ్చనే మిత్రుడి సలహాను గణపతిరావు పాటించాడా! పాటిస్తే చివరికి ఏమైంది..?
‘‘అనంత్‌!
ఓ యాభై కావాలోయ్‌!’’ వచ్చీ రాగానే టెండర్‌ పెట్టాడు గణపతిరావు.
      అనంత్‌ కంగుతిన్నాడు.
      ‘‘యాభై ఏంటి మరీ ఛీప్‌గా!’’ బార్‌ అటెండర్‌ కూడా టిప్పుగా యాభై ఇస్తే, అదోలా వంకరచూపులు చూస్తున్నాడు.
      ‘‘యాభయా! ఎందుకు?...’’ అంటూ జేబులోనుంచి యాభైనోటు తీసి ఇవ్వబోయాడు.
      గణపతిరావు పకపక నవ్వాడు.
      ‘‘యాభై అంటే, ఈ యాభైకాదు. ఫిఫ్టీతౌజెండోయ్‌! యాభైవేలు!’’ ఇంగ్లీషు, తెలుగులో కూడా చెప్పాడు.
      ‘‘ఏంటీ యాభైవేలా?వెనకటికి ముళ్లపూడి రుణానందలహరిలో హీరో ‘ఓ ఐదు ఉందా? అని అడిగినట్టు అడిగావే...!’ అన్నాడు అనంత్‌.
      ‘‘రూపాయి విలువ పడిపోలా?నీకో సంగతి తెలుసా? 
      సినిమా, బిజినెస్‌వాళ్లు ఓ ఐదు ఉందా?అంటే ఐదు లక్షలు అని అర్థం. రూపాయి అంటే వాళ్ల లెక్కలో లక్ష ’’. చెప్పాడు గణపతిరావు.
      ‘‘బాగా చెప్పావు...’’ అని నవ్వి అనంత్‌ ఆలోచనలో పడిపోయాడు.
      గణపతిరావు అతని సహోద్యొగి. రోజూ మందుకొడతాడనీ, జల్సారాయుడనీ, అప్పులు చేస్తుంటాడనీ ఆఫీసులో అనుకోవడం విన్నాడు. యాభైవేలు ఇవ్వడం తనకు పెద్ద పనికాదు. కానీ, ఇస్తే మళ్లీ తిరిగొస్తాయా? అని సందేహం. ఇదుగో, అదుగో అని తిప్పుతాడేమో? ఆ డబ్బు తిరిగి రావడానికి వీడి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ వచ్చేవరకు ఆగాలేమో? అని అనుమానం కలిగింది. ఏదైనా ఆపదలో ఉన్నాడేమో? ఆసుపత్రి అవసరాలకేమో? వాస్తవమైతే ఇవ్వాలనుకున్నాడు.
      ‘‘ఇప్పుడెందుకు అంత డబ్బు?’’ ప్రశ్నించాడు అనంత్‌. 
      ‘‘ప్రమోషన్‌ కోసం.’’
      ‘‘ఏంటీ?’’
      ‘‘ఔనోయ్‌! యాభై కొడితేగాని ప్రమోషన్‌ ఇచ్చేట్టులేడు మేనేజర్‌.’’
      ‘‘ప్రమోషన్‌ కోసం లంచమా?’’
      ‘‘ఏం చేస్తాం?’’
      ‘‘నేనొక ఐడియా చెప్తాను. ఇరవైనాలుగు గంటల్లº నీకు ప్రమోషన్‌ ఇస్తాడు చచ్చినట్టు..’’
      ‘‘ఏం ఆలోచన?’’
      ‘‘నరసింహం సంగతి నాకు బాగా తెలుసు. వాడొట్టి పిరికిగొడ్డు. భయపెడితే హడలి చస్తాడు.’’
      ‘‘భయపెట్టడమా? ఆఫీసులో తంతే బాగుండదేమో? బాస్‌నే కొడతావా? అని మనోళ్లే తిడతారు.’’
      ‘‘అబ్బా! నీదొట్టి పీత బుర్రోయ్‌! భయపెట్టడం అంటే, తన్నడమే కాదు. రకరకాలున్నాయి.
      ‘‘సరే! అదేంటో చెప్పు. డబ్బు ఖర్చుకాకుండా పని అయితే, అంతకంటే ఏం కావాలి? పెగ్‌ అండ్‌ మగ్స్‌ బార్‌లో మంచి విందు ఇస్తాను.’’
      ‘‘జాగ్రత్తగా విను. సీసాలో ఒక లీటరు పెట్రోలు తెచ్చుకో. నరసింహం కారు దిగుతూ ఉంటాడు. అప్పుడు ఒక సీన్‌ సృష్టించెయ్యి. పెట్రోలు నెత్తిన పోసుకో. చెలరేగిపో. ప్రమోషన్‌ ఇవ్వవా. నేను చచ్చిన తర్వాత ఇస్తావా? అని డైలాగ్స్‌ వదులు. నా చావుకు నరసింహం కారణం. ప్రమోషన్‌ ఇవ్వకుండా సతాయిస్తున్నాడంటూ కేకలు పెట్టు. నరసింహం హడలిపోతాడు. ఎక్కడ పోలీసు కేస్‌ అవుతుందో? అని గజగజ వణికిపోతాడు. చావొద్దని నీ కాళ్లు పట్టుకుంటాడు. నీకు ప్రమోషన్‌ ఇచ్చేస్తాడు.
      అనంత్‌ చెప్తుంటే గణపతిరావు కళ్లు నక్షత్రాల్లా మెరిశాయి. గొప్ప ఆలోచన! సూపర్‌ ఐడియా!
        కళ్లముందు తను సృష్టించబోయే సన్నివేశం కనిపిస్తోంది. నరసింహం హడలిపోతున్నాడు. కారు దిగాడుగాని కదల్లేక గజగజ వణికిపోతున్నాడు సినిమాల్లో కమెడియన్‌లా. గురుడికి ఫ్యూజ్‌లు పోయాయి. ముఖం నల్లబడిపోయింది. ప్యాంట్‌లోనే పాస్‌ పోసుకుంటున్నాడు.
        ‘‘గణపతిరావు! ప్లీజ్‌... డోంట్‌ గో టూ సూసైడ్, బిలీవ్‌ మీ...! ఐ విల్‌ గివ్‌ ప్రమోషన్‌ టూ యు... ఇమీడియట్లీ ...’’
        నరసింహం దాదాపు ఏడుస్తూ చెప్తున్నాడు.
        గణపతిరావు పకపక నవ్వుతున్నాడు.
        ‘‘భలే... ఐడియా ఇచ్చావోయ్‌ అనంత్‌! చూడు రేపీపాటికి ఇరగదీస్తాను సీన్‌...’’ అంటూ అనంత్‌ చేతులు పట్టుకుని ఊపి ఊపి ఆఖరుకి హత్తుకుని వదిలాడు.
        హుషారుగా వెళ్లిపోతున్న గణపతిరావుని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు అనంత్‌.
   

*   *   *

      గణపతిరావు సూసైడ్‌ సీన్‌లో నటిస్తున్నాడని ఆఫీసులో అందరికీ తెలిసిపోయింది. టిక్కెట్‌ కొనకుండా ఉచితంగా దొరుకుతున్న వినోద ప్రదర్శన చూడ్డానికి అంతా ఆఫీసు ముందు గుమిగూడారు.
       కారు దిగుతూనే నరసింహం స్టాఫ్‌ అంతా ఆఫీసుముందు గుంపులుగా నిలబడి ఉండడం చూసి బిత్తరపోయాడు. ఏం జరిగిందో? ఏంటో? అనుకుంటున్నాడు.
       ఇంతలో ‘‘నరసింహం...’’ అనే పిలుపు సింహం గర్జించినట్టుగా వినపడి హడలిపోయాడు.
       అటువైపుకి చూసేసరికి గణపతిరావు చేతిలో పెట్రోలు సీసాతో కనిపించాడు.
       ‘‘నా ప్రమోషన్‌ పెండింగ్‌లో పెడతావా? ప్రమోషన్‌ ఇవ్వకుండా సతాయిస్తావా? లంచం ఇవ్వాలా? ఇదుగో ఇస్తున్నా...!’’ అని అరుస్తూ సీసాలోని పెట్రోలు ఒంటిమీద కుమ్మరించుకున్నాడు గణపతిరావు.
        ‘‘నేను సూసైడ్‌ చేసుకుంటున్నా! నా చావుకి నువ్వే కారణం. నువ్వు జైలుకి పోతావు..!’’
        గణపతిరావు చెలరేగిపోతున్నాడు. ఏకపాత్రాభినయం చేస్తున్నవాడిలా డైలాగులు వదుల్తున్నాడు.
       నరసింహం బిత్తరచూపులు చూస్తూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్టాఫ్‌ హడావుడిగా వచ్చి అతని కారులోనే ఎక్కించి ఆసుపత్రికి తీసుకుపోయారు.

  *   *   *

       గణపతిరావు పోలీస్‌ స్టేషన్‌లో సెల్‌లో ఉండి కటకటాలు లెక్కిస్తున్నాడు.
       ‘‘గణపతిరావు నన్ను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. సూసైడ్‌ చేసుకుంటా అని బెదిరించాడు. ఆందోళనతో నాకు గుండెపోటు వచ్చింది. సమయానికి ఆసుపత్రికి తీసుకురాబట్టి బతికిపోయాను. నన్ను ప్రమాదంలోకి నెట్టి బెదిరించిన గణపతిరావుపై తగిన చర్యలు తీసుకోవలసింది’’.
       ఆ విధంగా నరసింహం పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చాడు. ఒక ఐడియా బెడిసికొట్టింది. సీన్‌ రివర్సయింది పాపం.
        అనంత్‌ ఇచ్చిన ఐడియాని పాటించినందుకు పశ్చాత్తాపంలో మునిగిపోయిన గణపతిరావు ‘‘బ్రోచేవారెవరురా!’’ అని పాడుకుంటూ ఉన్నాడు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam