చేదు మామిడి!

  • 904 Views
  • 246Likes
  • Like
  • Article Share

    సీహెచ్‌.శివ రామ ప్ర‌సాద్‌

  • కూక‌ట్‌ప‌ల్లి, హైద‌రాబాదు.
  • 9390085292
సీహెచ్‌.శివ రామ ప్ర‌సాద్‌

సత్యవతి వాళ్లింట్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఎప్పుడూ లేనిది ఈ సారి అది చేదు మామిడికాయలు కాసింది.  మామిడి చేదుగా ఉండటమేంటనే విషయమై బోటనీ శాస్త్రవేత్తలు శోధించడటం మొదలెట్టారు. ఇంతకా చేదుమామిడి రహస్యం తెలిసిందా?   
పెరట్లో
ఉన్న మామిడి చెట్టు విరగ్గాసింది. ఆ రోజు పప్పులో వేద్దామని రెండు కాయలు కోసింది సత్యవతి. చెక్కు తీసి ముక్కలు చేసింది. ఒక ముక్క నోట్లో వేసుకుంది. అంతే! పెద్దషాక్‌ తగిలినట్టు అదిరిపడింది. మామిడి ముక్క చేదుగా ఉంది. దోసకాయ, బీరకాయల్లో అప్పుడప్పుడు చేదు తగులుతుంది. అది సహజం. ఇదేం విడ్డూరం? మామిడికాయ చేదు కావడం ఏంటి?
       సత్యవతి ప్రహరీ గోడ దగ్గరికి పరిగెత్తి ‘‘పిన్నీ! పిన్నీ...’’ అని పక్కింట్లో ఉన్న ముసలమ్మను పిలిచింది.
       రంగమ్మ వచ్చి, ‘‘ఏంటి సత్యవతీ?’’ అని అడిగింది.
       ‘‘పిన్నీ! మా చిన్నోడు హైబ్రీడ్‌ మామిడి మొక్కని పెరట్లో నాటాడు చూశావుగా! పోయినేడు పుల్లటి కాయలు కాసింది. ఆవకాయ, మాగాయ కూడా పెట్టాం వాటితోనే. మీక్కూడా కొన్ని కాయలు ఇచ్చాను.’’ అన్నది.
        ‘‘ఔనౌను...’’ అన్నది రంగమ్మ.
       ‘‘ఈ ఏడు విరగ్గాసింది. పప్పుల్లో వేద్దామని కాయ కోస్తే చేదుగా ఉంది పిన్నీ...’’ అన్నది సత్యవతి.
       రంగమ్మ విస్మయంగా చూసింది. మామిడికాయ చేదెక్కడం ఏంటనే విషయం మీద ఇద్దరి మధ్యా అరగంటసేపు చర్చ నడిచింది. ఎందుకో తేల్చుకోలేకపోయారు. ఇంతలో గురునాథం ఇంటికొచ్చాడు. కూరగాయల సంచీ భార్యకు అందించాడు.
       ‘‘ఈ విడ్డూరం చూశారా?’’ అన్నది సత్యవతి.
       ‘‘నీకన్నీ విడ్డూరాలే! ఏం జరిగిందేం?’’ అన్నాడు. మామిడికాయ చేదెక్కడం గురించి చెప్పింది.
       ‘‘నిజంగా విడ్డూరమే. దోసకాయో, బీరకాయో చేదెక్కుతుంది. మామిడికాయ చేదెక్కడం ఏంటబ్బా?’’ అని బుర్ర గోక్కున్నాడు గురునాథం.
       ‘‘ఇంకా నయం. ముక్కలు కోసినప్పుడు రుచి చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే పప్పు చేదెక్కిపోయి పారేయాల్సి వచ్చేది’’ అన్నది సత్యవతి.
       ‘‘మంచి పనిచేశావు. నా స్నేహితుడు బోటనీ లెక్చెరర్‌ ఉన్నాడు. వాడిని అడుగుతాను. వాడికి తెలుస్తుంది’’ అన్నాడు గురునాథం.
       ‘‘అమ్మా! వంటయిందా? తొందరగా వెళ్లాలి’’ అంటూ హడావుడిగా వచ్చాడు రవి.
       ‘‘ఎక్కడ రా? మామిడికాయ పప్పు చేద్దామని మన చెట్టు కాయలు కోశాను. అవి చేదయ్యాయి. అంతా విడ్డూరంగా ఉంది. మామిడి కాయలు చేదెక్కడం నా జీవితంలో వినలేదు’’ అన్నది సత్యవతి.
       ‘‘అమ్మా! మామిడి కాయలు ఎందుకు చేదెక్కాయో నాకు తెలుసు.’’ అన్నాడు రవి.
       ‘‘ఎందుకు రా?’’
       ‘‘నాన్న వాకింగ్‌కి వెళ్లొచ్చిన తర్వాత వెళ్లి మామిడిచెట్టు నీడలో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు పేపరు చదువుతూ. మళ్లీ సాయంకాలం కూడా అక్కడే కూర్చుంటున్నాడు. నాన్నకు షుగర్‌ వచ్చిందని నువ్వు పెద్ద గ్లాసు నిండా కాకరకాయ రసం తీసిస్తున్నావు. నాన్న నువ్వు చూడకుండా చెట్టు మొదట్లో పారబోస్తున్నాడు. సంవత్సరం నుంచి జరుగుతోంది. నీకు తెలీదు. కాకరకాయల రసం పీల్చి మామిడికాయలు చేదెక్కిపోయాయి’’ చెప్పాడు రవి.
       ‘‘నిజమేనంట్రా?’’ అన్నది సత్యవతి ఆశ్చర్యపోతూ.
       ‘‘నీ మొహం కదూ! లేనిపోని చాడీలు చెప్తున్నావే నా మీద. ఎప్పుడన్నా ఒకసారి పారబోసి ఉంటా! అంతమాత్రాన మామిడికాయలు చేదెక్కిపోతాయా?’’ కొడుకు మీద విరుచుకుపడ్డాడు గురునాథం.
       ‘‘మరి! ఇంకెందుకు చేదెక్కాయో చెప్పు?’’ అని తండ్రిని నిలదీశాడు రవి.
       ‘‘నాకేం తెలుసుద్దిరా! బోటనీ వాళ్లని అడగాలి...’’ అంటూ జారుకున్నాడు గురునాథం.
       తర్వాతి గురునాథం బోటనీవాళ్ల చుట్టూ తిరుగుతున్నాడు చేదు మామిడి కాయలు పట్టుకుని.
       ఇంకా ఏం తేలలేదు.
       ఆ వీధిలో వాళ్లంతా మామిడికాయలు చేదెక్కడం కనివినీ ఎరగం అంటూ తలా ఒక కాయ కోసుకుని పోతున్నారు చేదు రుచి చూడ్డం కోసం.
       ఒక జర్నలిస్ట్‌ మామిడిచెట్టు ఫొటో తీసి పేపర్లో వార్త రాశాడు. చేదు మామిడి చెట్టుకి బాగా ప్రచారం జరిగింది. ఊళ్లో వాళ్లంతా చెట్టుని చూడ్డానికి ఎగబడి వస్తున్నారు. బోటనీలో పరిశోధనలు చేసి డాక్టరేట్లు పుచ్చుకున్న సైంటిస్ట్‌లు ఎక్కడెక్కడివాళ్లు గురునాథం ఇంటికి వస్తున్నారు. మామిడిచెట్టు కాయలతోపాటు, ఆకులు తెంపేవాళ్లూ.. మొదలు దగ్గర తవ్వి వేళ్లు పీకేవాళ్లు కొందరు, మామిడి కాయలు చేదెక్కడం గురించి పరిశోధనలు చేస్తున్నారు. అంత గొప్పవాళ్లు ఇంటికి కార్లలో రావడం గురునాథానికి సంతోషంగా ఉంది. వచ్చిన వాళ్లకు టీ, కాఫీలు, ఫలహారాలు ఇచ్చి మర్యాదలు చెయ్యలేక సత్యవతి నీరసపడిపోతోంది. ఆ పరిశోధనలు ఎప్పటికి పూర్తవుతాయో? సత్యవతికి ఎప్పటికి విశ్రాంతి కలుగుతుందో తెలీదు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam