కరోనా... కేరింగ్ రావు

  • 1396 Views
  • 466Likes
  • Like
  • Article Share

    భాను ప్రకాష్ కర్నాటి

  • మక్కపేట, కృష్ణా
  • 9533657132
భాను ప్రకాష్ కర్నాటి

కేరింగ్‌ రావు ఇంటి దగ్గర చాలా హడావుడిగా ఉంది. ఓ అంబులెన్స్‌ వచ్చి ఆగింది... ఇద్దరు పూర్తిగా హెల్త్‌ సూట్లు వేసుకున్న వాళ్లు అంబులెన్స్‌ దిగి చకచకా కేరింగ్‌ రావు ఇంట్లోకి వెళ్లారు. ఊళ్లోవాళ్లందరూ ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. కేరింగ్‌ రావు బయటకి వచ్చి రెండ్రోజులు అవుతోంది. కారణం తెలీలేదు మరి! అసలేం జరిగిందంటే.. ఉన్నట్టుండి క్రితంరోజు రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు కేరింగ్‌ రావు. ‘తనకి కరోనా లక్షణాలు తెలుస్తున్నాయని, కరోనా వైరస్‌ను ఎవరికీ అంటనివ్వనని, దేశపౌరుడిగా ఇది తన బాధ్యత’ అంటూ పోస్ట్‌ పెట్టాడు. ‘సెల్స్‌ ఐసోలేషన్‌’ అంటూ గదిలోకి వెళ్లి గడిపెట్టుకున్నానని, అందరూ తనకి దూరంగా ఉండాలని ఊరివాళ్లకి, స్నేహితులకు అభ్యర్థన కూడా చేసేశాడు. ‘అదృష్టవశాత్తూ నా కుటుంబం మొత్తం తిరుపతికి వెళ్లింది. లేదంటే నావల్ల వాళ్లకి కూడా ఈ కరోనా సోకేది’ అంటూ ఇంకో పోస్ట్‌. ఇంకేముంది... అసలే కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తమైన ఆరోగ్యశాఖ చురుగ్గా పనిచేస్తోంది. మీడియా ఇంకా చురుగ్గా పనిచేస్తోంది. 
      ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఫలానా జిల్లాలో, ఫలానా ఊరిలో వ్యక్తికి కరోనా లక్షణాలు. బాధ్యతగల యువకుడు సెల్స్‌ ఐసోలేషన్‌ నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలిచాడు’’ అంటూ కేరింగ్‌ రావు ఇంటిని పదే పదే చూపిస్తోంది. ఏ గదిలో ఉన్నాడో తెలుసుకునేందుకు డ్రోన్‌కు మాస్క్‌ కట్టి మరీ సెర్చింగ్‌ చేస్తూ, లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తోంది. రిపోర్టర్లు మరింత సాహసం చేసి మొఖాలకి అమెరికా నుంచి తెప్పించిన మాస్క్లు వేసుకుని మరీ, అతడి గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జనాలందరూ టీవీలకు అతుక్కొని మరీ కేరింగ్‌ రావును చూడాలని ఆరాటపడుతున్నారు. సమాచారం అందుకున్న ఆరోగ్యశాఖ సిబ్బంది అంబులెన్స్‌ వేసుకుని ఆగమేఘాల మీద అక్కడికి వచ్చేశారు. లోపలికి వెళ్లి కేరింగ్‌ రావు గది తలుపు తట్టారు. లోపల్నించి కేరింగ్‌ రావు తుమ్ములు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది కోవిడ్‌ వైరస్‌ లక్షణం కాదని సూలో ఉన్న వ్యక్తి అరిచాడు. 
      డాక్టర్‌ నాకు జలుబు కూడా ఉంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందిగా అనిపిస్తోంది. రెండు రోజుల క్రితం గన్నవరం విమానాశ్రయంలో ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తితో సెల్ఫీ దిగాను. ఆ సమయంలో అతడు తుమ్మాడు డాక్టర్‌. అప్పటి నుంచి నాకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి’’ ఇక వైద్య బృంద సభ్యులు ఏం మాట్లాడలేదు. ‘‘తలుపులు తెరవండి. మిమ్మల్ని జాగ్రత్తగా ఐసోలేషన్‌ వార్డుకి తీసుకెళ్లి చికిత్స అందజేస్తాం’’
      ‘‘వద్దు డాక్టర్‌’’ 
      ‘‘ఏం’’
      ‘‘నాకు వైద్యం చేసినందుకు మీక్కూడా ఆ వైరస్‌ సోకుతుంది. తెలిసి తెలిసి ఇంతటి పాపానికి పూనుకోలేను. నన్నిక్కడే ఉండనివ్వండి. నాతోనే ఈ వైరస్‌ అంతమైపోవాలి’’
      మళ్లీ దగ్గు... వాళ్లు మళ్లీ మళ్లీ పిలిచినా కేరింగ్‌ రావు స్పందించలేదు. విషయం పై అధికారులకు చేరింది. పోలీసులకు సమాచారం అందింది. బలవంతంగానైనా అతడ్ని ఆసుపత్రిలో చేర్చమని! ఈలోపు మీడియాకు తెలిసిపోయింది కేరింగ్‌ రావు సాహసోపేతమైన నిర్ణయంతో ఓ హీరో అయ్యాడని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఏకంగా ఓ వీడియో రూపొందించింది. ఓ స్పెషల్‌ టీం రంగంలోకి దిగి కేరింగ్‌ రావు లైఫ్‌ స్టోరీని ప్రజలకు తెలియజేస్తామని లైవ్‌లోనే ప్రతిజ్ఞ చేసింది. యూట్యూబ్‌లో ఆ ప్రోమో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. పోలీసులు స్పెషల్‌ సూట్‌ వేసుకుని కేరింగ్‌ రావు ఇంటికి వచ్చేశారు. తలుపులు పగులగొట్టి మరీ, ‘జై భారత్‌’ అంటూ నినాదాలు చేస్తున్న కేరింగ్‌ రావుని పట్టుకొని అంబులెన్స్‌లోకి నెట్టారు. డ్రోన్‌ ద్వారా ఆ దృశ్యాల్ని పదేపదే టెలికాస్ట్‌ చేస్తున్న న్యూస్‌ ఛానెల్‌ రేటింగ్స్‌ ఆకాశాన్నంటాయి. 
      కేరింగ్‌ రావు ఐసోలేషన్‌ వార్డులో ఉన్నాడు. పరీక్షల ఫలితాలు పుణె నుంచి రావాల్సి ఉంది. అందుకు నాలుగు గంటలు సమయం పడుతుందని ఆసుపత్రి వైద్యబృందం ప్రకటన విడుదల చేసింది. కేరింగ్‌ రావుకు తాను చనిపోతున్నట్లు తెలుస్తోందని వైద్యులకు చెప్పాడు. చివరి కోరికలూ చెప్పేశాడు. పక్కింటి లక్ష్మిని ప్రేమిస్తున్న సంగతి ఆమెకు తెలియజేయమన్నాడు. చివరిసారిగా చెట్టినాడ్‌ చికెన్‌ తినాలనుందని, పబ్‌కి వెళ్లి డ్యాన్స్‌ చేస్తూ చచ్చిపోవాలనుందనీ చెప్పాడు. అతడికన ఏమనాలో తెలీక వైద్యబృందం అయోమయంలో పడ్డారు. కేరింగ్‌ రావు లైఫ్‌ స్టోరీ కవరేజ్‌ కోసం ఊళ్లో తిరుగుతున్న యూట్యూబ్‌ ఛానెల్‌ బృందానికి బోలెడన్ని విషయాలు తెలుస్తున్నాయి. రిపోర్టర్‌ నిజానందం కేరింగ్‌ రావు త్యాగాన్ని దేశప్రజలు గుర్తుంచుకునేలా చేయాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు. కేరింగ్‌ రావు ప్రేమిస్తున్న లక్ష్మి కాళ్లు పట్టుకుని మరీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి ఏమవుతుందా అని లైవ్‌ చూస్తున్నా వాళ్లంతా గుటకలు వేస్తూ ఆ ఛానెలకు అతుక్కుపోయారు.

* * *

      దర్శనం పూర్తిచేసుకుని అప్పుడే గదికి వచ్చారు పద్మనాభం కుటుంబసభ్యులంతా. ఏటా ఉమ్మడి కుటుంబం మొత్తం వేంకటేశుడి దర్శనానికి తిరుపతి వెళ్లివస్తుంటారు. ఈసారి ఎప్పట్లాగే రిజర్వేషన్లు, బుకింగ్లు పూర్తిచేశారు. కానీ కొడుకు మాత్రం మిస్సయ్యాడు. పాస్పోర్ట్‌ వెరిఫికేషన్‌ కోసం తప్పనిసరిగా ఇంటిదగ్గర ఎవరో ఒకరు ఉండాల్సిరావడంతో అయిష్టంగానే అతడ్ని వదిలేసి వచ్చారు. గదికి వచ్చిన కాంతం కొడుకు ఎలా ఉన్నాడో తెలుసుకుందామని ఫోన్‌ చేసేలోగానే ఎదురుగా టీవీలో వస్తున్న కొడుకు ఫొటో చూసి కెవ్వుమంది. నడుంవాల్చిన పద్మనాభం ఉలిక్కిపడి కాంతం వైపు చూశాడు. ఆ మొఖం టీవీ వైపు చూస్తూ ఏడుస్తూ ఉండటంతో తల అటువైపు తిప్పాడు. కంగారుగా కాంతం చేతిలోని ఫోన్‌ లాక్కొని కొడుక్కి ఫోన్‌ చేశాడు. అవతలి నుంచి ఎవరో మాట్లాడారు.

 

* * *

లక్ష్మి తనకిష్టమైన చెట్టినాడ్‌ చికెన్‌ ముక్కలు పెడుతుంటే గొంతుకు ముక్క అడ్డంపడి శ్వాస ఆడక కేరింగ్‌ రావు కళ్లు మూతలు పడుతున్నాయి. పూర్తిగా మూసేలోపలే ఎవరో చేయిపట్టిలాగినట్లు అనిపించింది. కళ్లు తెరచి చూసే సరికే కేరింగ్‌ రావును వీల్‌ చైర్‌లో తీసుకెళ్తున్నారు కంపౌండర్లు. పైగా ఎవరికీ మాస్కులు కూడా లేవు. వెంటనే కేరింగ్‌ రావు బాధ్యతగా రెండు చేతులతో తన ముఖాన్ని కప్పుకుని, ‘‘యూ ఇర్రెస్పాన్సిబుల్‌ ఫెలోస్‌’’ అంటూ అరుస్తున్నాడు. అవేం పట్టనట్టు వాళ్లు అతడ్ని  తీసుకుపోయి అవుట్‌ పేషంట్లు వేచివుండే కుర్చీలోకి తోసేసి తిట్టుకుంటూ వెళ్లారు. ఆ వెంటనే పోలీసులు వేగంగా వచ్చి కేరింగ్‌ రావుని పట్టుకొని జీపులో, ఓ పది నిమిషాల తర్వాత ఇంట్లో పడేసి వెళ్లిపోయారు. విచిత్రంగా ఇంటిచుట్టూ ఒక్కళ్లు కూడా లేరు. ఏం జరిగిందో అర్థం కాలేదు కేరింగ్‌ రావుకి. ఈలోపు పోలీసు వెనక్కి వచ్చి మొబైల్‌ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. ఫోన్లో అరుపులు విని, ‘‘హలో’’ అన్నాడు కేరింగ్‌ రావు. 
      ‘‘ఒరే అడ్డగాడిద.. కొంపలో నుంచి బయటకే కదలవు నువ్వు! నీకు కరోనా వైరస్‌ ఏంట్రా. బుద్ది లేకుండా అందరినీ ఉరుకులు పెట్టించావ్‌. పాపం అందరికీ ఎన్ని తిప్పలు! ఒక్కరోజు ఆగు, నీ సంగతి చెప్తా’’ 
      ‘‘నాన్నా బావకి సెండాఫ్‌ ఇవ్వడానికి నేను ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్లాకదా.. అప్పుడు నోర్మూయ్‌ రా అంట్ల వెధవ.. నువ్‌ కలిసిన వ్యక్తి ఇక్కడతనే!’’
      ‘‘మరి దగ్గు, జలుబూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..’’
      ‘‘అరేయ్, నువ్వు ఏ గదిలో ఉన్నావ్‌?’’
      ‘‘వైరస్‌ స్ప్రెడ్‌ అవ్వకూడదని, కిచెన్‌ పక్కగదిలో ఉన్నా నాన్నా’’
      ‘‘ఓహో, బాధ్యతగల పౌరుడివి నాన్న నువ్వు!’’
      ‘‘థ్యాంక్స్‌ నాన్నా’’
      ‘‘ఒంట్లో ఎముకలు కూడా లేకుండా నలగొడతా! మిర్చి, తవుడు, వడ్ల బస్తాలు ఉన్న ఇరుకు గదిలో రాత్రంతా కూర్చుంటే గాలెక్కడి నుంచి వస్తుందిరా...! నీ అతితెలివి, అతి జాగ్రత్తలు మా కొంప ముంచుతున్నాయి. మేం వచ్చేదాక నోరుమూసుకుని ఇంట్లో కూర్చో, బయటకి వచ్చినట్లు తెలిస్తే కాళ్లు విరగొడతా’’ అంటూ పద్మనాభం తిట్ల అష్టోత్తరం పూర్తిచేశాడు. కేరింగ్‌ రావు ఇంటిమీదకు రాళ్లు విసురుతున్నాడు రిపోర్టర్‌ నిజానందం. 
      ‘‘అరేయ్‌ బయటికి రారా నీ సంగతి చూస్తా, నీవల్ల నెటిజన్లు నన్ను బండబూతులు తిడుతున్నారు’’ అంటూ అరుస్తున్నాడు. ‘‘రేయ్‌ కేరింగ్‌ రావు, నువ్వు ఎప్పుడో అప్పుడు బయటకి రాకతప్పదురా... నిన్ను నరికి జైలుకి పోకపోతే నేను పరశురామ్‌ నే కాదు’’ అంటూ శపథం చేస్తున్నాడు పక్కింటి లక్ష్మి మొగుడు పరశురామ్‌. 
      అప్పుడప్పుడూ చెట్టుకు కట్టేసిన లైఫ్‌ స్టోరీ కవరేజ్‌ టీంకు కూడా తన్నులు తగులుతున్నాయి మరి!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam