ఒకానొక దేవత - ఇప్పుడు లేదు!

  • 1310 Views
  • 46Likes
  • Like
  • Article Share

    పసుపులేటి తాతారావు

  • ఆంధ్రాబ్యాంకు, మేనేజ‌ర్‌
  • హైదరాబాదు
  • 8919364322
పసుపులేటి తాతారావు

అతని వయసు దాదాపు ఎనభై. కానీ, అతని తల్లికి 288 ఏళ్లట! పైగా మూడేళ్ల కిందట డెబ్బై ఒకటో పుట్టిన రోజు జరుపుకుందట! ఆమెని ఎవరో హత్యచేశారట! అతని మాటలు న్యాయమూర్తికి ఆగ్రహం తెప్పించాయి! ఇంతకీ ఎవరతను? అతని తల్లికేమైంది?
నేనీ
ప్రాంతానికి జిల్లా జడ్జిగా ఈ మధ్యనే వచ్చాను. మొదటి రోజే ఒక దొంగతనం కేసులో అతడు కోర్టు బోనులో కనిపించాడు. అతణ్ని ఇదివరకు ఎక్కడో చూసిన జ్ఞాపకం. కానీ ఎక్కడన్నది గుర్తురాలేదు. వయసు చూస్తే ఎనభయ్యేళ్లు ఉంటాయేమో. గడ్డం మాసిపోయి, తెల్లబడిన జుట్టు చెదిరిపోయి ఉంది. ముందూ వెనకా ఎవరూ లేనట్టుంది. 
      ‘‘ఈ వయసులో నీకు దొంగతనం చేయడం, కోర్టుకు రావడం, జైలుకెళ్లడం అవసరమంటావా?’’ అడిగాను మందలింపుగా.
      ‘‘ఏం చేయమంటారు బాబయ్యా. నన్ను తల్లిలా సాకిన దేవతని నిలువునా చంపేశారు. నాకు పెద్దదిక్కు లేకుండా చేసేశారు. చిన్నతనం నుంచీ తలదాచుకోడానికి నీడనిచ్చిన తల్లి. జబ్బు చేస్తే మందులిచ్చి నయం చేసిన తల్లి. చక్కగా నిద్రబుచ్చిన తల్లి. కన్నతల్లి కన్నా ఎక్కువే చేసింది బాబయ్యా. ఆయమ్మ లేని చోట నేనుండలేకపోయాను. అందుకే ఇలా వలసొచ్చి తాడూబొంగరం లేని బతుకు వెళ్లదీస్తున్నాను. దొంగ అనుకుని ఇక్కడికి పట్టుకొచ్చారు’’ అన్నాడు.
      అతను చివరగా అన్న మాట సరిగ్గా వినిపించలేదు. మొదట చెప్పిన మాట దగ్గరే నా ఆలోచనలు ఆగిపోయాయి. 
      ‘‘చంపేశారా? ఎవరు? ఎవరిని?’’ విస్మయంగా అడిగాను.
      ‘‘ఇప్పుడయ్యన్నీ ఎందుకులే బాబయ్యా. ఆ శిక్షేదో వేసేయండి’’ 
      పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీవ్రమైన స్వరంతో కసిరాడు, ‘‘అడుగుతున్నది జడ్జిగారు. ఏంటా తలతిక్క సమాధానం? సరిగ్గా చెప్పు’’
      ‘‘చెప్తాను బాబయ్యా, చెప్తాను. మూడేళ్ల కిందట డెబ్బయి ఒకటో పుట్టినరోజు జరుపుకుంది నా దేవత. నెల రోజుల కిందట నా కళ్లముందే నిలువునా కుప్పకూలిపోయిందయ్యా. చంపేశారు. రంపంతో కడుపుమీద కోసి మరీ చంపేశారు. ఆ తల్లి ఇంకెప్పటికీ నాకు కనిపించదు. మీరెవరూ ఏమీ చెయ్యలేరు. వదిలేయండి బాబయ్యా’’ అన్నాడు నిస్సత్తువగా. అతని గొంతు పూడుకుపోయినట్టు మాట ముద్ద ముద్దగా వచ్చింది.
      ‘‘మూడేళ్ల కిందట పుట్టిన రోజు జరుపుకుందా? ఇంతకీ ఎవరా దేవత? నీకేమవుతుంది?’’ ఓపికగా అడిగాను.
      ‘‘నా తల్లి’’ అన్నాడతను కనుకొలకుల్లో చేరిన తడిని తుడుచుకుంటూ.
      ‘‘తల్లి...!? నీ వయసు చూస్తే ఎనభై ఉంటాయి. ఆమె మూడేళ్ల కిందటే డెబ్బై ఒకటో పుట్టిన రోజు జరుపుకుందంటున్నావు? నీకు తల్లెలా అవుతుంది? సరిగా అర్థమయ్యేలా చెప్పు. ఎవరా దేవత? ఎవరు చంపేశారు? ఎందుకు చంపేశారు?’’ గట్టిగా అడిగాను ఎలాగైనా విషయం రాబట్టాలని.
      ‘‘పోనీండి బాబయ్యా. అదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడేం చేయాలో చూడండి. రావి లేని ఊరిలో, వేపలేని వీధిలో ఉండకూడదంటారు. అందుకే ఇటు వలసొచ్చేశాను’’ అన్నాడు. ఒకదానికొకటి పొంతన లేని మాటలతో నాలో అసహనం ఎక్కువవుతోంది.
      ‘‘ఎవరు చంపారు? పోనీ అదైనా చెప్పు’’ పట్టు వదలకుండా అడిగాను.
      ‘‘ఒక దుర్మార్గుడు, రాక్షసుడు, కిరాతకుడు...’’ అన్నాడతను బోనులో నుంచే ఆవేశంతో ఊగిపోతూ.
      తలపట్టుకోవడం నా వంతయ్యింది. ఏంటితని వాలకం? దేవత అంటాడు, రాక్షసుడంటాడు. మూడేళ్ల కిందట పుట్టినరోజు జరుపుకుందంటాడు. వివరంగా చెప్పమంటే చెప్పడు. అతను ఏం మాట్లాడుతున్నాడో, ఎవరి గురించి చెబుతున్నాడో అతనికయినా అర్థమవుతోందా లేదా అన్న అనుమానం కలిగింది. మామూలుగా అయితే ఎవడో పిచ్చివాడులే అని వదిలేసేవాణ్ని. కానీ అతణ్ని ఎక్కడో చూసిన జ్ఞాపకం.
      చూస్తోంటే ఏదో విశిష్ట వ్యక్తిలాగే లీలగా గుర్తొస్తున్నాడు. అందుకే మరింత పట్టుదలగా వివరాలు రాబట్టాలనిపించింది.
      ‘‘ఆమె పేరు చెప్పగలవా?’’ ఓపికగా అడిగాను.
      ‘‘ఆయ్‌... రావమ్మండి. అహ... కాదు కాదు. అమృతాదేవండి’’ మళ్లీ నిలకడ లేని మాట!
      ‘‘ఎంత వయసుండొచ్చు సుమారుగా?’’
      ‘‘సుమారుగా ఎందుకు బాబయ్యా? నిక్కచ్చిగానే తెలుసు. 288 సంవత్సరాలు’’ అన్నాడు. 
      దాంతో ఒక నిశ్చయానికి వచ్చేశాను, అతనికి మతిస్థిమితం సరిగా లేదని. ఆమె పేరు అప్పటికప్పుడే రెండు రకాలుగా చెప్పాడు. పైగా ఆ వయసు.. ఒక మాటకి మరోమాటకి పొంతన లేదు.
      ‘‘కేసుని వచ్చే నెల పదహారో తేదీకి వాయిదా వేస్తున్నాను. ఈలోగా అతని మానసిక స్థితిని పరీక్షించడానికి పంపాల్సిందిగా ఆదేశిస్తున్నాను’’ అని చెప్పాను. ఆ వృద్ధుడు బోను దిగి వెళ్లిపోయాడు.

*  *  *

      కోర్టు అయిపోయాక కారులో ఇంటికొస్తూంటే స్టీరియోలోంచి పాట మంద్రస్థాయిలో వినిపిస్తోంది. ‘వటపత్ర శాయికీ వరహాల లాలి... రాజీవ నేత్రునికి రతనాల లాలీ...’ నా ఆలోచనలు మాత్రం ఆ వృద్ధుని చుట్టే తిరుగుతున్నాయి. ఎక్కడ చూశాను? ఎప్పుడు చూశాను? ఎవరా వ్యక్తి? మస్తిష్కాన్ని గిలకొట్టాను. అప్పుడు గుర్తొచ్చింది. అవును. అతను రమణయ్య...! కచ్చితంగా రమణయ్యే..! అతణ్ని చూసింది ఒకే ఒక్కసారి. అదీ చాన్నాళ్ల కిందట. అందుకే వెంటనే గుర్తుకు రాలేదు.
      పదేళ్ల కిందట రాజమహేంద్రవరంలో సీనియర్‌ లాయర్‌గా ఉన్నప్పుడు మొదటిసారి రమణయ్యని చూశాను. అదీ చాలా చిత్రంగా!
      ఒకరోజు ఆఫీసులో కేసులు చూసుకుంటుండగా ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. వయసు డెబ్బయికి దగ్గరగా ఉంటుంది. సాధారణంగా నన్ను కలవడానికి వచ్చే వాళ్లంతా హైఫైగా ఉంటుంటారు. నాకున్న పేరుప్రఖ్యాతులు అలాంటివి. ఏమాత్రం చదువుకోనట్టు కనిపిస్తూన్న ఒక సాదాసీదా వ్యక్తి, సాధారణ వేషధారణతో రావడం నన్ను ఆశ్చర్యపరచింది. ఏం అన్యాయం జరిగిందని మొరపెట్టుకోడానికి వచ్చాడో అనుకుంటూ ‘‘ఊ... చెప్పు. ఏంటి కేసు?’’ అని అడిగాను.
      ‘‘నా సందేహం తీర్చగలరేమో కనుక్కోడానికి వచ్చాను’’ అన్నాడు. 
      అతని మాటలు చిత్రంగా అనిపించాయి. 
      ‘‘సందేహమా? ఏంటది?’’
      ‘‘మనం మున్సిపాలిటీ అధికారుల మీద కేసు వేయగలమా?’’ అని అడిగాడు. నేను ఫైల్‌ మూసేసి అతని ముఖంలోకి చూశాను.
      ‘‘ఎందుకని? వాళ్లేం అన్యాయం చేశారు నీకు?’’ 
      ‘‘నాకేం అన్యాయం జరగలేదు. జనానికే అన్యాయం జరుగుతోంది’’
      ‘‘వివరంగా చెప్పు’’
      ‘‘అది చెప్పేముందు మున్సిపాలిటీ ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో మీరొకసారి కళ్లారా చూడాలి. నాతో వస్తారా?’’ అడిగాడు.
      మున్సిపల్‌ కమిషనర్‌ నా స్నేహితుడే. అతను బాధ్యతలు తీసుకున్నాక మున్సిపాలిటీ అద్భుతంగా పనిచేస్తోందని అందరూ అనుకోవడం నాకు తెలుసు. పనిలో నిర్లక్ష్యాన్ని సహించడని తెలిసి ఉద్యోగులందరూ అప్పగించిన పనిని నిబద్ధతతో చేస్తున్నారని చాలామంది ప్రశంసించడం కూడా నాకు తెలుసు. అందుకే అతని ఫిర్యాదు మీద నాకు నమ్మకం కలగలేదు.
      ‘‘చెప్పు. అర్థం చేసుకోగలను. చూడ్డం ఎందుకులే?’’ అన్నాను.
      ‘‘అలా కాదు. చూడాల్సిందే’’ అని పట్టుబట్టాడు. 
      ఒక సీనియర్‌ లాయర్‌ దగ్గర అతనలా పట్టుబట్టడం సరి కాదు. అతనేం చూపించబోతున్నాడో ఊహకి అందడం లేదు. అయినా ఒకసారి చూసొస్తే పోయేదేముందిలే అనిపించింది.
      మర్నాడు ఉదయం ఆరు గంటల నుంచి రోడ్డు పక్కన నేను, రమణయ్య ఒక చెట్టుచాటున నిలబడి చూస్తున్నాం. కాసేపటికి రోడ్డుకిరువైపులా నాటించిన మొక్కలకి నీళ్లు పోసే మున్సిపల్‌ వ్యాన్‌ అటుగా వచ్చింది.
      ‘‘అదిగో వస్తోంది చూడండి. అదెందుకు ఉదయాన్నే వస్తోందో తెలుసుగా మీకు? మొక్కలకి నీళ్లు పోసి అవి బతికుండేలా చేయడానికేగా?’’ అని అడిగాడు. నేనేం మాట్లాడలేదు. ఆ వ్యాన్‌ వైపే చూస్తున్నాను. రెండువైపులా ట్యూబ్‌లు ఏర్పాటు చేసి వాటిలోంచి నీళ్లు మొక్కలకి పోస్తూ వేగంగా పోతోంది ఆ వ్యాన్‌.
      చూస్తున్న నా కళ్లు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. అతనెందుకు నన్ను కళ్లారా చూడమన్నాడో అప్పుడర్థమయింది. నీళ్లు చిమ్మిన వేగానికి మొక్కల వేర్లు బయటపడి నేలకి ఆనుకుంటున్నాయి. 
      ‘‘చూశారుగా అదీ వాళ్లు చేసే పని. వాళ్లు వెళ్లిపోయాక మళ్లీ ఆ మొక్కల మొదట్లో మట్టి కప్పి వాటిని సరిగా చేయడం నా వంతు. వొలకబోసి ఎత్తుకోవడం అంటారే అలా ఉంది ఈ మొక్కల పెంపకం. ఇలా అయితే మొక్కలెలా పెరుగుతాయి? ఎప్పుడు చెట్లవుతాయి? భూమికి మంచెప్పుడు జరుగుతుంది?’’ అన్నాడతను. 
      అతని మనస్తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ తక్కువ అంచనా వేసినందుకు చాలా సిగ్గనిపించింది.
      ‘‘ఇలా జరగకుండా నేను మాట్లాడతాలే. ఈ మాత్రం దానికి కేసెందుకు?’’ అని సర్ది చెప్పాక అతను వెళ్లిపోయాడు.

* * *

      మళ్లీ ఇన్నాళ్లకి కోర్టులో ముద్దాయిలా కనిపించాడు. మర్నాడు కోర్టుకి వెళ్లగానే నేను చేసిన పని... ఆ వృద్ధుడు ఇదివరకు ఎక్కడెక్కడ ఉండేవాడు? ఏమేం చేసేవాడు? హత్య చేశారని చెబుతున్న ఆ స్త్రీ ఎవరు? చంపిన వ్యక్తి ఎవరు? లాంటి వివరాలు తెలుసుకోడానికి పురమాయించడం.
రెండు రోజుల్లో నివేదిక వచ్చింది. అది చదువుతుంటే రమణయ్య గురించి ఆసక్తికర వివరాలు తెలియవచ్చాయి. మొక్కలంటే అతనికి ప్రాణం. ఇప్పటికి చుట్టుపక్కల ఊళ్లలో కొన్ని వేల మొక్కలు నాటుంటాడు. 
      దాని గురించి ఎవరైనా మెచ్చుకుంటే ‘‘ఊరుకోండి సార్‌. ‘జాదవ్‌ పయేంగ్‌’ అంత గొప్పవాణ్ని కాదుగా?’’ అంటుంటాడు.
      అతనికి తల్లిదండ్రులు లేరు. ఎనభయ్యేళ్ల కిందట ఎవరో కని చెట్టు మొదట్లో పడేసి పోయారని చెప్పుకుంటుంటారు. అతను అనాథలాగే పెరిగాడు. ఎవరైనా పెడితే తినడం లేకపోతే పస్తు అతనికి అలవాటు. పట్టణానికి దూరంగా ఉండే జంబాజీ పేటలో ఒక చెట్టు మొదట్లో అతని నివాసం.       జబ్బు చేస్తే ఆ చెట్టు ఆకులు, కాయలు తిని ఆరోగ్యాన్ని కుదుటపరచుకుంటూ ఉంటాడట. ఆ చెట్టు మొదట్లోనే నిద్రపోతుంటాడట.
      అతనికో చిత్రమైన అలవాటు కూడా ఉంది. నాలుగేళ్లకోసారి తానుంటున్న చెట్టు చుట్టుపక్కల చక్కగా శుభ్రం చేసి, నీళ్లు చల్లి, కొబ్బరాకులు పరచి, ఊళ్లో పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి మిఠాయిలు పంచి పెడుతూ ఉంటాడు.  
      ‘‘ఇంతకీ హత్యకు గురైన అమృతాదేవి ఎవరో, ఎందుకు చంపారో, ఆ వివరాలేమైనా తెలిశాయా?’’ అని అడిగాను నివేదికలో వాటి ప్రసక్తి లేకపోవడంతో.
      ‘‘ఊరంతా అడిగినా అమృతాదేవి అంటే ఎవరో తెలీదనే చెప్పారు. అసలా పేరే ఎప్పుడూ వినలేదట. పైగా ఈ మధ్య కాలంలో అక్కడ ఎలాంటి హత్యలూ జరగలేదు’’ అన్నాడు నివేదిక తెచ్చిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.
      దీర్ఘంగా నిట్టూర్చాను. అసలు వివరాలు తెలీలేదు. అక్కర్లేని విషయాలన్నీ తెలిశాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని పంపించేశాను.
      ఏదైనా ఒక విషయం మనసుని తాకిందంటే దాని గురించి పూర్తిగా తెలుసుకునే వరకూ నాకు నిద్ర పట్టదు. రమణయ్యలో ఏదో ప్రత్యేకత ఉంది. అతను పిచ్చివాడనుకోడానికి మనసొప్పడం లేదు. అతను చెప్పేదాంట్లో ఏదో గూఢార్థం ఉండే ఉంటుందని నా అంతరాత్మ పదేపదే చెబుతోంది. ఆ రాత్రి నివేదికలోని విషయాల్ని మళ్లీ ఒకసారి మననం చేసుకున్నాను. ఒక చిత్రమైన పేరు అందులో కనిపించింది. ‘జాదవ్‌ పయేంగ్‌...!’
      వెంటనే లేచి కంప్యూటర్‌ ఆన్‌ చేసి ‘జాదవ్‌ పయేంగ్‌’ అన్న పేరుని గూగుల్‌లో వెదికాను. ఈశాన్య భారతంలోని బ్రహ్మపుత్ర నది ‘మజులీ’ ద్వీపపు తీరాన్ని విపరీతంగా కోసేస్తుంటే అక్కడి లక్షా యాభై వేలమంది ఆవాసాన్ని కాపాడ్డం కోసం ‘జాదవ్‌ పయేంగ్‌’ అనే వ్యక్తి ఒక్కడే వేల మొక్కల్ని నాటి తీరపు కోతని అరికట్టాడు. ఆ ద్వీపాన్ని కాపాడాడు. అతనొక్కడి కృషి వల్ల ‘మజులీ’ ద్వీపంలోని అడవి న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌ కన్నా పెద్దదిగా తయారైందట.
      ఆశ్చర్యం! ఎక్కడో ఈశాన్య భారతంలోని ‘జాదవ్‌ పయేంగ్‌’ పేరు అనాథలా పెరిగిన ఈ రమణయ్యకెలా తెలుసు? ఇతనికి కూడా మొక్కల్ని పెంచడం అలవాటు కాబట్టి ఎవరి ద్వారానో ఆ పేరు తెలుసుకుని ఉండొచ్చులే అనుకున్నాను.
      అతను బోనులో ఉన్నప్పుడు హత్యకు గురైన స్త్రీ పేరు రెండు రకాలుగా చెప్పడం గుర్తొచ్చింది. రావమ్మ... అమృతాదేవి. ఎవరీ రావమ్మ ఉరఫ్‌ అమృతాదేవి? ఒకసారి గూగుల్‌నే అడిగేస్తే పోలా? అనుకుంటూ ఆ పేర్లు టైప్‌ చేశాను. ‘రావమ్మ’ అనే పేరుకి ఎలాంటి ఫలితాలూ రాలేదు. కానీ ‘అమృతాదేవి’ అని టైప్‌ చేయగానే చాలా ఫలితాలొచ్చాయి.
      మరింత ఆశ్చర్యం! కొత్త కొత్త విషయాలు తెలిశాయి. వాయవ్య భారతంలో... రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రారంభమైన బిష్ణోయి మతం, దాన్ని ప్రారంభించిన గురు మహరాజ్‌ జంబాజీ గురించి తెలిసింది. ఇక్కడ కాసేపు నా ఆలోచనలకు అడ్డుకట్ట పడింది. జంబాజీ అన్న పదం ఎక్కడో విన్నట్టుంది. ఆలోచిస్తే గుర్తొచ్చింది, రమణయ్య జంబాజీపేటలోని ఒక చెట్టు మొదట్లో నివాసం ఉండేవాడని నివేదికలో రాసుంది. దానికీ దీనికీ ఏమైనా సంబంధం ఉందా?
      మరింత శ్రద్ధగా చదవసాగాను. మొక్కలకీ, జంతువులకీ హాని కలిగించకూడదన్నదే బిష్ణోయి మతంలోని ప్రధానాంశం. అన్నిటికన్నా ఎక్కువగా కదిలించిన అంశం బిష్ణోయిల ప్రాణ త్యాగం. 1730లో జోధ్‌పూర్‌ మహారాజు తన రాజ్యంలో ఒక కొత్త భవనాన్ని నిర్మించాలని కేజర్లి గ్రామంలోని చెట్లను నరకాలని సైనికులను ఆదేశించాడు. అక్కడ కేజ్రి చెట్లు ఎక్కువ. వాటి పేరు మీదగానే గ్రామానికి ఆ నామం వచ్చింది. గురు మహరాజ్‌ జంబాజీ బోధనలతో ప్రభావితమైన బిష్ణోయిలు చెట్లను నరకకుండా సైనికులకు అడ్డుపడ్డారు. సైనికులు మొండిగా రాజాజ్ఞని అమలుపరుస్తుంటే అమృతాదేవి అనే మహిళ ఒక చెట్టుని కౌగిలించుకుని ఉండిపోయింది. మరో మూడొందల అరవైరెండు మందిని కూడా అలా చేయమని కోరింది. ‘తెగిపోయే తల... కూలిపోయే చెట్టుకన్నా గొప్పది కాదు...!’ అన్న నినాదంతో అక్కడ దిక్కులు పిక్కటిల్లాయి. అయితే, సైనికులు రాజాజ్ఞని జవదాటలేకపోయారు. అమృతాదేవితో సహా ఆ మూడొందల అరవైమూడు మంది బిష్ణోయిలు చెట్లను కాపాడ్డంలో బలైపోయారు. చరిత్రలో చోటు చేసుకున్న విషాదకర చీకటి ఘట్టం అది!
      తప్పు తెలుసుకున్న మహారాజు తిరిగి మరెన్నో కేజ్రి చెట్లను ఆ ప్రాంతంలో నాటించి వాటిని ఎవరూ పాడుచేయకుండా రక్షిత ప్రాంతంగా ప్రకటించాడు. 1970లో ప్రారంభమై నేటికీ విజయవంతంగా నడుస్తున్న ‘చిప్కో’ ఉద్యమానికి ఈ సంఘటనే స్ఫూర్తి అంటుంటారు.
      ఏదో చప్పుడైతే తలతిప్పి చూశాను. నా భార్య. 
      ‘‘ఏంటి, అర్ధరాత్రి కంప్యూటర్‌ చూస్తున్నారు?’’ అనడిగింది దగ్గరికొచ్చి కూర్చుంటూ.
      ‘‘ఏం లేదు. నీకు బిష్ణోయి మతం గురించి, కేజర్లి గ్రామం గురించి తెలుసా?’’ 
      ‘‘చూచాయగా తెలుసు’’ అందామె. 
      గూగుల్‌లో చదివిన విశేషాలన్నీ ఆమెకి తెలియజెప్పాను. చెట్లను కాపాడటానికి ప్రాణాలర్పించిన వాళ్ల త్యాగాన్ని వివరించాను. ఆమె ఆవులించి వొళ్లు విరుచుకుంది. ‘‘బాగుంది. ఎప్పుడో 289 ఏళ్ల కిందట జరిగిన దాన్ని ఇప్పుడు తెలుసుకుని ఏంటి ప్రయోజనం?’’ అనడిగింది.
      ఆ మాటతో ఉలిక్కిపడ్డాను. మస్తిష్కంలో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి.
      ‘‘ఏమన్నావు?’’ అనడిగాను. మళ్లీ అదే చెప్పింది. 
      289 ఏళ్లు..! రమణయ్య చెబుతున్న దేవత వయసు 288 ఏళ్లు. ఆ సంఘటన జరిగి 289 ఏళ్లు. జంబాజీపేట..! 288 ఏళ్లు....! ఈ రెండింటికీ ఏదో సంబంధం ఉందనిపించింది.
      ‘‘సరేగానీ, ఇంకో మూడు రోజుల్లో వినాయక చవితి. బయట దొరికే పత్రిలో అన్ని ఆకులూ ఉంటున్నాయి, రావి ఆకులు తప్ప. రేపు ఎలాగైనా సంపాదించమని మీ బంట్రోతుకి చెప్పండి’’ బతిమాలుతున్నట్టు అడిగింది.
      ‘‘సరే. కానీ రావి ఆకుల్నే ఎందుకంత ప్రత్యేకంగా అడుగుతుంటావు ప్రతి సంవత్సరం? అవి లేకుండా మిగతా పత్రితో పూజ చేయకూడదా?’’
      ‘‘ఊహూ. కూడదు. రోజూ కోర్టులో ముద్దాయిలచేత ప్రమాణం చేయించడానికి మీరు ఉపయోగించే భగవద్గీత ఎప్పుడూ చదవలేదా? ‘వృక్షాల్లోకెల్లా ప్రశస్తమైన అశ్వత్థ వృక్షాన్ని నేను’ అని శ్రీకృష్ణుడు చెబుతాడు కదా? ఆరోగ్యకరమైన గాలిని ఇస్తుందది. రావి పళ్లు, రావి మండలు, రావి ఆకులు చాలా వ్యాధుల్ని నయం చేస్తాయి. ఏ చెట్టుకీ లేని ప్రత్యేకత రావికి ఉంది. దాని ఆకుల గలగలలు అమ్మ జోలపాటలా మనసుకి హాయినిస్తా యంటారు. ఎంతో పవిత్రమైన ఆ ఆకుతో కూడా పూజ చేస్తేనే వినాయకుడికి ప్రీతి’’ అంది నా భార్య.
      ఆ మాటలు విని శిలాప్రతిమలా అయిపోయాను. రమణయ్య చెప్పిన మాటలకి, వీటికి దగ్గరి పోలికలున్నాయి. ‘తలదాచుకోడానికి నీడనిచ్చిన తల్లి. జబ్బు చేస్తే మందులిచ్చి నయం చేసిన తల్లి. చక్కగా జోలపాడి నిద్రబుచ్చిన తల్లి!’
      ‘‘ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు?’’ ఆత్రుతగా అడిగాను.
      ‘‘మనం రాజమహేంద్రవరంలో ఉండే వాళ్లంకదా? అప్పుడు జంబాజీపేట అనే చోట ఒక పురాతన రావి చెట్టు ఉండేది. ఒకసారి అక్కడికి ఎవరో వెళుతుంటే నేనూ వెళ్లి చూసొచ్చాను. కేజర్లీ గ్రామంలో జరిగిన సంఘటనకి గుర్తుగా ఆ మరుసటి ఏడాది అంటే 1731లో అప్పటి సంస్థానాధీశుడెవరో ఆ ప్రాంతంలో రావి మొక్కని నాటించి దానికి ‘అమృతాదేవి’ అని పేరు పెట్టాడట. ఆ ప్రాంతానికి గురు మహరాజ్‌ జంబాజీ పేరే పెట్టారట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఒక పెద్దాయన ఆ చెట్టుకి పుట్టినరోజు వేడుక కూడా చేస్తాడట’’ అంది.
      వింటున్న నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ‘‘నువ్వు చెప్పేది నిజమా?’’ అని అడిగాను.
      ‘‘నాకు తెలిసిందేదో చెప్పాను. నిజమో కాదో నాకేం తెలుసు?’’ అని నిద్రపోవడానికి వెళ్లిపోయింది.
      రమణయ్య చెప్పిన ‘రావమ్మ’ అంటే రావి చెట్టు అని అప్పుడర్థమైంది. 1731లో నాటిన చెట్టు కాబట్టి ఇప్పటికి దాని వయసు 288 సంవత్సరాలు! ఫిబ్రవరి 29 నాలుగేళ్లకొకసారి వస్తుంది కాబట్టి ఆ చెట్టు డెబ్బయ్‌ ఒక్క పుట్టిన రోజులే చేసుకుంది ఇప్పటి వరకూ. ‘మై గాడ్‌’ అనుకోకుండా ఉండలేకపోయాను. 
      వెంటనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కి ఫోన్‌ చేశాను. ‘‘మీరు అర్జంటుగా మళ్లీ ఆ ఊరికి వెళ్లాలి. అక్కడికెళ్లి నాకు ఫోన్‌ చేయండి’’ అని చెప్పాను.
      మర్నాడు అతని దగ్గర నుంచి ఫోనొచ్చింది. ‘‘మీరు చెప్పినట్టే ఇక్కడ ఊరవతల జంబాజీపేట అనే ప్రాంతానికి వచ్చాను సార్‌’’ అన్నాడు.
      ‘‘అక్కడెక్కడైనా పెద్ద చెట్టు ఉందా?’’
      ‘‘ఊహూ. లేదు సార్‌. ఇక్కడంతా ఎడారిలా ఒక్క చెట్టూ లేదు’’
      ‘‘మరోసారి జాగ్రత్తగా చూసి చెప్పండి’’
      ‘‘అంతా చూశాను సార్‌. అయినా... సార్‌... సార్‌... ఒక్క నిమిషం. ఇక్కడేదో చెట్టు మొదలు మాత్రం భూమిలో ఉంది. కాండం చాలా పెద్దదిగా ఉంది. ఈ మధ్యనే ఎవరో నరికేసినట్టున్నారు’’ అన్నాడు.
      ఊపిరి తీసుకోవడం కూడా మరచిపోయి అలాగే నిలబడిపోయాను. 
      ‘‘ఆ భూమి ఎవరిదో కనుక్కోండి?’’ అని చెప్పాను.
      కాసేపటి తర్వాత మళ్లీ ఫోను చేసి ‘‘కనుక్కున్నాను సార్‌. ఇది ప్రభుత్వ భూమి. స్థానికంగా ఎవరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బినామీ పేరుతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమిని కబ్జా చేశాడు. నెలరోజుల కిందట చెట్టుని కొట్టించేశాడు’’ అన్నాడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.
నాకు విషయం మొత్తం అర్థమైంది. 288 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక మహత్తరమైన చెట్టు.. ప్రకృతి మనకిచ్చిన వరం.. ఒకానొక దేవత..! ఒకడి ధన దాహానికి కొన్ని గంటల్లోనే నేలకొరిగింది. అలాంటి చెట్టు మళ్లీ కావాలంటే మరో 288 సంవత్సరాలు ఆగాల్సిందే కదా? ఇలాంటి దుర్మార్గుల వల్లే లోకంలోని ప్రజలందరి జీవితాలు అల్లకల్లోలం అయ్యేది? ఇదిలాగే కొనసాగితే అప్పుడీ ప్రాంతం మరో ‘మజూలీ’ కాదని ఏముంది? అప్పుడు ఏ ‘జాదవ్‌ పయేంగ్‌’ వచ్చి మనల్ని కాపాడగలడు?
      మూడు రోజులు గడచిపోయాయి.
      ‘‘ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి...’’అని చదువుతూ కళ్లతోనే సైగ చేసింది నా భార్య పూజ చేస్తూ. 
      పళ్లెంలోని ఒక ఆకు తీసి వినాయక ప్రతిమ మీద వేయబోయాను. ఆమె కాదన్నట్టు కళ్లతోనే వారించింది. 
      ‘‘అశ్వత్థ పత్రం అన్నప్పుడు రావి ఆకు వేయాలి. మొన్నే చెప్పానుగా అదెంత పవిత్రమైందో’’ అంటూ చిన్నగా గొణిగి మళ్లీ మంత్రం చదవడం కొనసాగించింది. నేను చిన్నగా నవ్వుకున్నాను. నా ధ్యాస వినాయక చవితి పూజ మీద లేదు. అక్కడ జరిగిన అన్యాయం మీదే ఉంది.
      వందమంది నేరస్థులు తప్పించుకున్నా ఫర్వాలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. అది న్యాయశాస్త్ర నియమం. ఇక్కడ నేరస్థుడు ఒక్కడే. కానీ శిక్ష పడేది తరతరాల ప్రజలకి. కోటానుకోట్ల మంది జనాలకి. అందుకే ఒక నిశ్చయానికి వచ్చాను. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్లలో కదలిక తేవాలి. అవసరమైతే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకునేలా చూడాలి! భవిష్యత్‌ తరాల క్షేమం కోసం పర్యావరణ పరిరక్షణలో నా వంతు కృషి నేను చేయాలి. అలా అనుకున్నాక ఆ రాత్రి కొంత ప్రశాంతంగా నిద్రపోగలిగాను.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam