చిట్టితల్లి

  • 1916 Views
  • 80Likes
  • Like
  • Article Share

    భాను ప్రకాష్ కర్నాటి

  • మక్కపేట, కృష్ణా జిల్లా
  • 9533657132
భాను ప్రకాష్ కర్నాటి

పన్నెండేళ్లుగా ఒక చేదు గతం హాసినిని దహించేస్తోంది. బిడ్డ వేదన చూసి అమ్మానాన్నలు నిస్సహాయులుగా రోదించారు. తమ కూతురు ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి వస్తుందనుకుంటున్న సమయంలో మరో గాయం! హాసినికొచ్చిన కష్టమేంటి? 
‘‘అక్కడేమైనా
కనిపించిందా?’’ 
      ‘‘లేదు. చిన్నూవాళ్లకేమైనా కనిపించిందేమో అడిగావా?’’
      ‘‘లేదట. హుస్సేన్‌సాగర్‌ వైపేమైనా వెళ్లిందేమో చూసొస్తామని ఫోన్‌ కట్‌ చేశారు’’ కంగారులో రేఖ గొంతు వణుకుతోంది.  
      ‘‘సరే. నువ్వేం కంగారుపడకు. లక్ష్మి వాళ్లింటికేమైనా వెళ్లిందేమో చూసొస్తాను’’ గాభరాగా ఫోన్‌ కట్‌ చేసి స్కూటీ స్టార్ట్‌ చేశాడు అమర్‌. అయితే అతని ఎడమ చేయి ఎంత ప్రయత్నించినా యాగ్జిలిరేటర్‌ పెంచడానికి మొరాయించింది. 
      బండి ఆపేసి, పక్కనే ఉన్న సిమెంటు దిమ్మెను ఆనుకుని కూర్చున్నాడు. తన బంగారుతల్లి హాసినిని తల్చుకోగానే తెలీకుండానే చెంపల మీద కన్నీళ్లు ధార కడుతున్నాయి.  
      దూరం నుంచి ఏదో వాహనం వస్తున్న శబ్దం. అది దగ్గరికి రాగానే అర్థమైంది, వస్తోంది తన భార్య రేఖ అని.
      కన్నీళ్లు తుడుచుకుని అతి కష్టం మీద మామూలు మనిషిలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు అమర్‌.
      ‘‘హాసిని నెక్లెస్‌రోడ్‌ దగ్గర కూర్చుని ఉందట. చిన్నూ చెప్పాడు. తనని తీసుకొస్తానన్నాడు. మనం ఇంటికెళ్దామా?’’
      ఆ మాటలతో కొంత స్థిమితపడిన అమర్, తన స్కూటీ దగ్గరకు వచ్చాడు.
      ‘‘దాన్నక్కడే వదిలెయ్‌. చిన్నూ స్నేహితుడి ఇల్లు ఈ పక్కనే. వాడు పొద్దున్నే తీసుకొస్తాడులే’’ అంది.
      సరేనని రేఖ వెనక కూర్చున్నాడు. ఇంటివైపు స్కూటీ పోనిచ్చింది.
      ‘‘అయిదారు నెలలుగా బానే ఉంటోంది. ఫర్లేదులే అనుకున్నాను...’’ రేఖ మాటలు పూర్తి కాకుండానే 
      ‘‘నా చిట్టితల్లిని ఇంకా ఎన్నాళ్లీ నరకాలు వెంటాడతాయో! చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతున్నామనే బాధ గుండెను కోసేస్తోంది’’ అమర్‌ మాటలకు రేఖ చెక్కిళ్లు తడవుతున్నాయి. 
      ఇద్దరూ ఇంటికెళ్లి సోఫాలో కూలబడ్డారు. చూపులు మాత్రం గుమ్మంవైపే ఉన్నాయి. 
      అంతలో వాట్సప్‌ సందేశం, అమర్‌ ఫోన్‌కి.
      ‘‘నాన్నా.. అక్క నిన్నిక్కడికి రమ్మంటోంది. రాగలవా?’’
      ‘‘సరే..’’ అని మెసేజ్‌ పెట్టి, రేఖకు విషయం చెప్పాడు. పది నిమిషాల్లో ఇద్దరూ బయల్దేరారు. 
      రేఖ స్కూటీ నడుపుతోంది. అమర్‌ వెనక కూర్చుని తన ఫోన్‌లో హాసిని ఫొటో చూస్తున్నాడు. తన కూతురి పన్నెండేళ్ల వయసప్పటి ఫొటో అది. ఎంత చక్కగా నవ్వుతోందో! పన్నెండేళ్లవుతోంది ఆ నవ్వు కనిపించి. ఆ ఘటనకు తానే కారణమేమోననే అపరాధభావంతో చిత్రవధ అనుభవిస్తున్నాడు అమర్‌. 
      హాసిని ఆ చేదు గతాన్ని మర్చిపోయేలా చేయమని ఎన్ని లక్షల సార్లు మొరపెట్టుకున్నాడో దేవుడికి. ఆ దేవుడనేవాడే ఉంటే నా బిడ్డకి అలాంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తాడు? అని అనుకుంటుంటాడు. 
      స్కూటీ అద్దంలోంచి అమర్‌ను గమనిస్తోంది రేఖ. ఎప్పుడూ సరదా మాటలతో ఇంటిల్లిపాదినీ హుషారెత్తించే అమర్‌ ముఖం మీద చిరునవ్వు మాయమై ఏళ్లు గడుస్తున్నాయి. భర్త ఆలోచనలను మార్చాలని స్కూటీ పక్కకు ఆపింది రేఖ.
      ‘‘నా చేతులు వణుకుతున్నాయ్‌. మీరు నడుపుతారా?’’ అమర్‌ను అడిగింది.
      ‘‘నావల్ల కాదు. ఆటోలో వెళ్దాం’’ అని అటువైపు వెళ్తున్న ఆటోను ఆపి, నెక్లెస్‌రోడ్డు వైపు పోనిమ్మన్నాడు.  
      అమర్‌ కళ్లుమూసుకున్నాడు.  జ్ఞాపకాల్లోకి లాక్కెళుతున్నాయి ఆలోచనలు.. 

* * *

      సికింద్రాబాద్‌ స్టేషన్‌
      సమయం రాత్రి 09.35
      పుణే-భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌
      ‘‘ఆ... అమ్మా, ఇప్పుడే ట్రైన్‌ ఎక్కాం. నాన్న టీసీతో మాట్లాడుతున్నాడు. వచ్చాక చెప్తాలే’’
      ‘‘సరే.. జాగ్రత్త. చలి తగలకుండా దుప్పటి కప్పుకో చిట్టితల్లీ. నాన్నదగ్గరే పడుకో..’’
      ‘‘సరే అమ్మా. బై’’
      హాసినికి ఇష్టమైన స్నాక్స్‌ తీసుకున్నాడు అమర్‌. పని ఒత్తిడి వల్ల కాస్త నలతగా ఉన్నాడు. చెల్లెలు డెలివరీకి రేఖ రెండ్రోజుల ముందే వెళ్లింది. తానూ, కూతురూ ఇప్పుడు బయల్దేరారు. రాత్రి కావడం వల్ల రైలు ప్రయాణాన్ని హాసిని ఆస్వాదించలేకపోతోందని నిట్టూర్చాడు.
      ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే నిద్రపోయింది హాసిని. కూతుర్ని ఒళ్లో పడుకోబెట్టుకుని తానూ నిద్రలోకి జారుకున్నాడు. 
      సుమారు గంట తర్వాత ‘‘నాన్నా.. మంచినీళ్లు’’ అంటూ లేపింది. అప్పటికిగానీ, గుర్తురాలేదు, మంచినీళ్ల బాటిల్‌ తీసుకోలేదని.
      నల్గొండలో తీసుకుంటానని చెప్పాడు. 
      నల్గొండ స్టేషన్‌ రాగానే కూతురిని లేపుదామనుకున్నాడు. కానీ, హాయిగా నిద్రపోతోంది. హాసినికి మెలకువ రాకుండా జాగ్రత్తగా బెర్త్‌మీద పడుకోబెట్టి చకచకా బయటికి వచ్చాడు. బాటిల్‌ కొనుక్కొని మళ్లీ రైలెక్కాడు. బెర్త్‌ మీద చూస్తే కూతురు లేదు! టాయిలెట్‌కి వెళ్లుంటుందనుకుని, తలుపు దగ్గర నుంచుందామని రెండడుగులు వేశాడు. కాస్త దూరంలో రైలు పట్టాలపై ఎరుపు రంగు చెప్పులు... మరికొద్ది దూరంలో చున్నీ.. అవును తన కూతురివే!
      అతని గుండె ఒక్కక్షణం ఆగినట్లయ్యింది. కిందికి దిగి పరిగెత్తాడు. అతని హృదయంలో ఏవో ప్రకంపనలు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ దగ్గరికి పరిగెత్తాడు. అమర్‌ ఆదుర్దాను గమనించిన అతను తానే ముందుకు వచ్చి ఏమైందని అడిగాడు.
      ‘‘నా కూతు...రు. అ...క్క...డ. ఎవరైనా ఎత్తుకె..ళ్లి పోతున్నారేమో?’’
      ‘‘అమ్మాయి వయసెంత?’’ అడిగాడు కానిస్టేబుల్‌
      ‘‘పన్నెండు..’’ చెబుతూనే దూరంలో ఎవరో కనిపించినట్లు రైలు పట్టాల వెంబడి పరిగెత్తాడు అమర్, పడుతూ లేస్తూ. 
      అమర్‌ను పిలుస్తూ కానిస్టేబుల్‌ కూడా అతణ్ని అనుసరించాడు.  
      ‘నాన్నా..నాన్నా...’ తన కూతురి అరుపులు వినిపిస్తున్నట్టే ఉన్నాయి.
      కొద్ది దూరంలో ఎర్రటి వాచ్‌. తన కూతురిదే. ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది. ఏ రాక్షసులు ఈ పాపానికి ఒడిగట్టారో. 
      ‘‘చిట్టితల్లీ.. చిట్టితల్లీ’’ అరుస్తూ, చుట్టూ చూస్తూ పరిగెడుతున్నాడు. వెనకే కానిస్టేబుల్‌ టార్చి పట్టుకుని వస్తున్నాడు. అతను అప్రమత్తం చేయడంతో ఇతర సిబ్బందీ వెనకాలే వస్తున్నారు. 
      ఓ ఫర్లాంగు దూరం పరిగెత్తగానే దారి తప్పానేమోనని మనసు హెచ్చరిస్తోంది. ఏమీ అర్థం కావడంలేదు. అంతా చీకటి. అమర్‌ కంట నీరు పెల్లుబికింది. ‘నా చిట్టితల్లిని రక్షించుకోలేనా?’ 
      ‘‘ఎంతో దూరం వెళ్లుండరు. అదిగో, ఎదురుగా వంతెన. అక్కడి నుంచి కిందకి దారుంది’’ కానిస్టేబుల్‌ మాటలు పూర్తికాక ముందే అటువైపు పరిగెత్తాడు అమర్‌.
      వంతెన దగ్గరికి చేరుకోగానే హాసిని మూలుగులు వినిపిస్తున్నాయ్‌.  
      నలుగురైదుగురు తన కూతురి దగ్గర నుంచొని ఉన్నారు. ఎవడో హాసినిని కొడుతున్నాడు. 
      అమర్‌ కోపం కట్టలు తెంచుకుంది. దగ్గరలో ఉన్న రాయి తీసుకుని వాడి మీదకు విసిరాడు. నేరుగా తలకి తగలడంతో ‘‘అబ్బా’’ అని కేకపెట్టాడు.  
      ఇద్దరు అమర్‌ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకడు హాసినిని లాక్కుపోవాలని చూస్తున్నాడు. ఆలోగా కానిస్టేబుల్‌ విజిల్‌ వేసుకుంటూ అక్కడికి రావడంతో అమర్, హాసినిలను వదిలేసి అందరూ తలోదిక్కూ పరిగెత్తారు.
      ఒంటినిండా దెబ్బలు, కాళ్లు, చేతులు, మొఖంపై పంటిగాట్లతో ఏడుస్తున్న హాసినిని చూసి అమర్‌ ప్రాణం విలవిల్లాడింది. పోలీసుల సాయంతో కూతురిని దగ్గరిలోని ఆసుపత్రిలో చేర్చాడు. ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోవడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. బెడ్‌ మీద పడుకున్న హాసినిని చూసేం దుకు ధైర్యం చాలడంలేదు అమర్‌కి. కొన్ని గంటల ముందు తన ఒడిలో హాయిగా పడుకున్న చిట్టితల్లిని ఇప్పుడీ స్థితిలో తలచుకుంటేనే శరీరంలో వణుకు పుడుతోంది. అయినా, గుండె నిబ్బరం చేసుకుని హాసిని దగ్గరకెళ్లాడు. ముఖం నిండా గాట్లు. కళ్లలో పెట్టుకు పెంచుకున్న కూతురిని అలా చూడలేక పక్కకి వెళ్లిపోయాడు. 
      ‘‘నాన్నా, ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయ్‌ నాన్నా..’’ అంటున్న కూతురు ఏడుపు విని, కొట్టుకులాడింది ప్రాణం. దగ్గరికెళ్లి తల నిమురుతూ ధైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా గొంతు పెగలడంలేదు. 
      ‘‘నాన్న నీదగ్గరే ఉన్నాడు తల్లీ. నీకేం కాదు. దెబ్బలకి మందులు తెస్తోంది నర్సు. అమ్మ కూడా వచ్చేస్తోంది. ప్రశాంతంగా పడుకోమ్మా..’’ అక్షరం అక్షరం కూడబలుక్కుని చెప్పాడు. 
      కొంతసేపటికి రేఖ పరిగెత్తుకుంటూ వచ్చింది. వెనకే బంధువులూ వచ్చారు. కన్నబిడ్డని అలా చూసి ఆ తల్లికి దుఃఖం తన్నుకొచ్చింది. ఆ గది దద్దరిల్లేలా ఏడుపు అందుకుంది. అమర్‌ వెంటనే రేఖను బయటికి తీసుకొచ్చాడు.
      ‘‘మనం ఏడిస్తే తనింకా భయపడిపోతుంది. ధైర్యం తెచ్చుకో’’ భార్యని సముదాయించాడు. 
      కూతురి ముందు నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ మౌనంగా రోదిస్తున్నారిద్దరూ. రెండురోజుల తర్వాత తమ బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు. ఆ భయంకర సంఘటన తాలూకూ గాయాలు మానిపోయినా, ఆ చేదు జ్ఞాపకాలు మాత్రం హాసినిని వెంటాడటం మొదలెట్టాయి. రాత్రిళ్లు భయంతో నిద్రలో కేకలేసేది. అకస్మాత్తుగా రోడ్ల మీదకి పరిగెత్తేది. ఎవరో వెంటాడుతున్నారని ఏడ్చేది. తమ బిడ్డని ఎలా మామూలు మనిషిని చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయేవారు. గదిలో గడియ పెట్టుకుని హాసిని ఏడుస్తుంటే బయటి నుంచి ‘‘చిట్టితల్లీ.. చిట్టితల్లీ’’ అంటూ గంటల       తరబడి సర్దిచెప్పే ప్రయత్నం చేసేవారు. హాసిని ఎదుగుతున్నా ఆనాటి సంఘటన నుంచి మాత్రం బయటపడలేకపోయింది.  
      రానురాను హాసిని యాంత్రికంగా మారిపోయింది. తన కూతురి స్వచ్ఛమైన నవ్వుకు గుర్తుగా హాసిని అని పేరుపెట్టుకున్నాడు అమర్‌. అయితే, ఆ నవ్వు ఆమె నుంచి మాయమైపోయింది. భార్యాభర్తలిద్దరూ కంటికి రెప్పలా కూతురిని కనిపెట్టుకుని ఉంటూ, ధైర్యం చెబుతున్నారు. 
      కాలమూ గతాన్ని మెల్లమెల్లగా మరపిస్తోంది. అమర్‌ ప్రయత్నాలు హాసినిలో మార్పు తెస్తున్నాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరింది. పక్కింటి చిత్రతో కలిసి రోజూ ఆఫీసుకు వెళ్తోంది. కొత్త బాధ్యతలు, నూతన స్నేహితుల పరిచయాలతో ఇప్పుడిప్పుడే మామూలు స్థితికొస్తోంది.. అయితే అంతలోనే!

* * *

      ‘‘అమర్‌..అమర్‌..’’ తట్టిలేపింది రేఖ. ఆలోచనల నుంచి బయటికొచ్చి, చుట్టూ చూశాడు అమర్‌. ఆటో నెక్లెస్‌రోడ్డులో ఆగింది. ఇద్దరూ కిందకి దిగారు. వాళ్లని చూసి దగ్గరికొచ్చాడు చిన్నూ. 
      ‘‘నాన్నా, అక్క అక్కడ కూర్చుంది’’ అంటూ పార్కు వైపు చూపించాడు.
      పార్కులో బెంచీ మీద కూర్చుని బుద్ధుడివైపు చూస్తోంది హాసిని. అమర్‌ మౌనంగా అలాగే నుంచుండిపోయాడు. హాసినికి ఫోన్‌ చేశాడు చిన్నూ. రింగ్‌ అవ్వగానే హాసిని అమర్‌వైపు చూసి మళ్లీ బుద్ధుడికేసి తలతిప్పింది. ఆమె చేతికి, తలకు ఉన్న కట్లు మరో రాక్షస క్రీడకి నిదర్శనంగా ఉన్నాయి. 
      ‘‘అమర్‌.. నువ్వు వెళ్లి మాట్లాడు...’’ భుజం మీద చెయ్యి వేసి చెప్పింది రేఖ. 
      ‘‘ఏం మాట్లాడను రేఖా? ఒకసారి కాదు.. రెండు సార్లు నా చిట్టితల్లి కామాంధుల నుంచి రెప్పపాటులో తప్పించుకున్నందుకు సంతోషపడాలో, ఆ భయంకర ఘటనల్ని తలచుకుని ఇంకెంత కుమిలిపోతుందో అని బాధపడాలో అర్థం కావడంలేదు’’ బావురుమన్నాడు అమర్‌. 
అయిదు రోజుల క్రితం చిత్ర, హాసిని ఆఫీసు నుంచి ఇంటికొస్తుంటే, ఆరుగురు మగాళ్లు అటకాయించారు. అత్యాచారానికి విఫల యత్నం చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు చిత్ర తీవ్రంగా ప్రతిఘటించింది. వాళ్లలో ఒకడు కోపంతో ఊగిపోతూ చిత్రని కత్తితో పొడిచేశాడు. అక్కడే కుప్పకూలిపోయింది. హాసిని గావుకేక పెట్టింది. భయంతో వాళ్లంతా పరారయ్యారు. చిత్ర చనిపోయింది. మొన్నటి వరకూ కలిసి తిరిగిన స్నేహితురాలి మరణాన్ని తలచుకుంటే హాసిని గుండెని మెలిపెట్టినట్లుంది. 
      మెల్లగా కూతురి దగ్గరికెళ్లి పక్కనే కూర్చున్నాడు అమర్‌. తలని తండ్రి భుజం మీద వాల్చింది.
      ‘‘చిట్టితల్లీ, గతాన్ని తలచుకుని నీలో నువ్వు కుమిలిపోవద్దు. గుండె నిబ్బరం చేసుకో!’’ భారంగా వస్తున్నాయ్‌ మాటలు.
      ‘‘లేదు నాన్నా. ఆరోజు నువ్వు చేసిన సాహసం నేను చేయలేకపోయాను. ఒంటరి పోరాటంలో చిత్ర బలైంది..’’ బిగ్గరగానే ఏడుస్తోంది హాసిని.
      ‘‘చిట్టితల్లీ.. చిట్టితల్లీ’’ అంటూ ఛిద్రమైపోయిన తన మనసులోంచి ఓదార్పు మాటలను వెతుక్కోసాగాడు ఆ తండ్రి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam