అనుకున్నదొక్కటీ...

  • 2215 Views
  • 115Likes
  • Like
  • Article Share

    వాత్సల్య గుడిమళ్ల

మేనకోడలు పెళ్లని అక్క  ఫోను చేస్తే సంబరపడిపోయాడు కృష్ణమూర్తి. పెళ్లిలో ఏదేదో చెయ్యాలని, బంధువుల సందడి చూడాలని, బావకి సాయంగా ఉండాలని పక్షం రోజుల ముందే అమెరికా నుంచి దిగబడ్డాడు. తీరా చూస్తే జరిగింది వేరు! అతని ఆశ ఎలా అడియాస అయ్యింది? 
ఆఫీసులో
పని చేసుకుంటున్న కృష్ణమూర్తి ఫోను మోగింది. అక్క ఇప్పుడు ఫోను చేస్తోందేమిటా అనుకుంటూ ఎత్తి ‘‘హలో’’ అన్నాడు. కుశల ప్రశ్నలయ్యాక, మేనకోడలు పెళ్లి కుదిరిందని అక్క వాసవి చెప్పగానే అతనికి ఎగిరి గంతెయ్యాలనిపించింది!
      వాసవి కూతురు మాధవి పుట్టినప్పుడు తనే మొదట ఎత్తుకున్నాడు. రాత్రిళ్లు పాప ఏడుస్తుంటే ఎత్తుకుని డాబా మీద పచార్లు చేసిన రోజులూ, చిట్టితల్లిని మొదటి రోజు స్కూల్లో దింపిరావడం... అన్నీ కళ్లముందు కదిలాడాయి కృష్ణమూర్తికి. అప్పుడే ఎంత పెద్దయిపోయింది అనుకున్నాడు.
      ‘‘ఏంట్రా.. నేను చెప్పేది వింటున్నావా, నీ పరధ్యానం నీదేనా?’’ అని అటు నుంచి అక్క గట్టిగా అరిచేసరికి మళ్లీ ఈ లోకంలోకొచ్చి పడ్డాడు. 
      ‘‘ఇదిగో... ఆర్నెల్ల ముందే చెబుతున్నాను. సెలవు లేదు, అర్జెంటు ప్రాజెక్టు పని లాంటి కబుర్లు చెప్తే ఊరుకోను. నువ్వు దాని పెళ్లికి రాకపోతే నాకసలు తమ్ముడే లేడనుకుంటాను. అర్థమవుతోందా?’’ గర్జించింది వాసవి.
      ‘‘ఆ... వింటున్నా, తప్పకుండా అందరం వస్తాం. ఏదో వీలు కుదరక మేనల్లుడు శ్రీకాంత్‌ పెళ్లికి రాలేదుగానీ, తన పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను’’ అన్నాడు.
      కృష్ణమూర్తి అమెరికా వచ్చాక మధ్య మధ్యలో ఇండియా వెళ్లొచ్చాడు. కానీ, పెళ్లిళ్లకి మాత్రం ఎప్పుడూ వెళ్లలేదు. పెళ్లిలో అయితే అందరితో సరదాగా నాలుగు రోజులు గడపవచ్చు. హాయిగా మాట్లాడుకోవచ్చు. అసలు పెళ్లింట్లో ఉండే సందడే వేరు అనుకుంటూ భార్య నడిగి స్వదేశానికి టిక్కెట్లు ఎప్పుడు బుక్‌ చేద్దామన్న ఆతృతతో ఇల్లు చేరాడు.
      ఇంట్లోకెళ్లి ‘‘మాధవి పెళ్లి కుదిరిందిట, అక్క ఫోను చేసింది...’’ అంటుండగానే...
      ‘‘వదిన నాక్కూడా ఫోను చేసింది. అందరం ఓ నాల్రోజుల ముందు వెళ్దాం. నేను మా బాస్‌కి కూడా అప్పుడే చెప్పాశాను’’ అంది అతని భార్య శిరీష. ఆ మాటకి అవాక్కయ్యాడు కృష్ణమూర్తి.
      ‘‘నా మొహంలా ఉంది నువ్వు చెప్పేది. మా అక్క కూతురి పెళ్లికి నేను ఉత్త నాల్రోజుల ముందు వెళ్తే ఏం సరిపోతుంది? పనులన్నీ రవి బావ ఒక్కడే ఎలా చేసుకుంటాడు’’ అనగానే ఫక్కున నవ్వింది శిరీష.
      ‘‘ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేయడం ఏముందండీ! కాసులుండాలేగానీ కొండ మీది కోతినయినా తెచ్చిస్తారు ఆ ఈవెంట్‌  వాళ్లు. మనం హాయిగా పట్టు బట్టలు నలగకుండా పెళ్లి చూసి రావడమే. మొన్న మా మేనత్త మనవరాలి పెళ్లిలో చూడలేదూ. అయినా మీరు పదేళ్లల్లో ఇండియాలో ఒక్క పెళ్లయినా చూశారా? మా వైపైనా, మీ వైపేనా ఎప్పుడూ నేనొక్కదాన్నేగదా పిల్లల్ని తీసుకుని పెళ్లిళ్లకి వెళ్తున్నాను. మీరేమో ఎప్పుడూ ఏదో పనుందని అంటారు. ‘ఏంటి, కృష్ణమూర్తి అసలు కనబడ్డమేలేదు’ అని అందరూ అడుగుతుంటే ఎంత చిన్నతనంగా అనిపిస్తుందో తెలుసా’’ ముక్కు చీదింది శిరీష.
      ‘‘అదికాదోయ్, సొంత అక్క కూతురి పెళ్లి కదా, కేవలం నాల్రోజుల ముందే అంటే...’’ నసిగాడు.
      ‘‘ఒక పని చెయ్యండి, మీరు పదిహేను రోజుల ముందు వెళ్లండి, నేను పిల్లల్ని తీసుకుని నాల్రోజుల ముందు వస్తాను’’ అని శిరీష అనడంతో ఔననక తప్పింది కాదు.
      ‘నేనే స్వయంగా కారు నడుపుతూ మాధవిని పెళ్లి మండపానికి తీసుకెళ్లాలి. ఈ మధ్య అక్కావాళ్ల ఊరు పక్కనున్న టౌనులో ఏవో మాల్స్‌ కూడా వచ్చాయట. అక్కడికి మాధవిని తీసుకెళ్లి పట్టుచీరలు అవీ కొనాలి’ లాంటి ప్రణాళికలు వేసుకుంటూ పదిహేను రోజుల ముందే ఇండియా వచ్చాడు కృష్ణమూర్తి.  
      తనని తీసుకెళ్లడానికొచ్చిన మేనమామ ‘‘ఏంటోయ్, ఇంట్లోంచే పని చేస్తావా, ఇన్ని రోజుల ముందే వచ్చావు?’’ అనగానే నోరెళ్లబెట్టాడు కృష్ణమూర్తి. 
      ‘‘అదేంటి మామయ్యా, మాధవి పెళ్లి కదా, పనులు చూసుకోవద్దూ’’ అంటున్న కృష్ణమూర్తిని వెర్రివాడిలా చూశాడు మేనమామ.
      మరునాడే బయలుదేరి అక్కయ్య వాళ్లూరెళ్లాడు కృష్ణమూర్తి. ఎక్కడా పెళ్లి హడావుడి లేదు.
      ‘‘ఏంటక్కయ్యా, మంచి రోజులు లేవా ఇంకా పనులు మొదలుపెట్టలేదు?’’ అంటే వాసవి పకపకా నవ్వింది. 
       ‘‘నీ కంగారూ నువ్వూ, ముందు లోపలకి రా, వివరాలు చెప్తాను’’ అంది.
      ‘‘పెళ్లి పనులు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వాళ్లకి అప్పగించాం. పెళ్లికూతుర్ని రెడీ చెయ్యడం దగ్గర్నుంచి అతిథులని ఆహ్వానించడం వరకు సర్వం వాళ్లే చూసుకుంటారు. మనకసలు పనేమీ ఉండదోయ్‌’’ వాసవి భర్త రవి తాపీగా చెప్పగానే నిర్ఘాంతపోయాడు కృష్ణమూర్తి. 
      ‘‘అది కాదు బావా, ఇంట్లో కనీసం పెళ్లికూతురినైనా చెయ్యాలి కదా! దానికి కావాల్సిన ఏర్పాట్లు..’’ అనగానే 
      ‘‘అన్నీ వాళ్లే చూసుకుంటార్రా. భోజనం ఏర్పాట్లు కూడా వాళ్లవే’’ అంది లోపల పనిచేసుకుంటున్న వాసవి.
      ‘‘ముందురోజు వాళ్లు పెడతారు సరే, మరి నాల్రోజుల ముందొచ్చే చుట్టాలకి భోజనం, వసతి...’’ అనగానే వాసవి మళ్లీ పెద్దగా నవ్వింది. 
      ‘‘అందుకేరా నిన్ను ఇండియాలో పెళ్లిళ్లకి వచ్చెళ్లమనేది. నాల్రోజుల ముందా! కనీసం నాలుగు గంటల ముందొచ్చినా గొప్పే ఈ రోజుల్లో. ఏదో అలా వచ్చి ముహూర్తం సమయానికి కనిపించి వెళ్లిపోతారంతే. ఒకవేళ ముందే రమ్మని పిలిచినా చుట్టాలు భయపడుతున్నార్రా, మనం కూడా అలా వాళ్లింటికి ముందుగానే వెళ్తామేమోనని’’ అంది.
      మేనకోడలు మాధవిని కృష్ణమూర్తి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ‘‘నీకు ఏ బట్టలు కావాలమ్మా, ఎక్కడ కొనిపెట్టను’’ అనగానే వింతగా చూసింది.
      ‘‘నీ పెళ్లిబట్టల గురించే నేను అడుగుతోంది. టౌనులో ఏవో మాల్స్‌ వచ్చాయంట కదా. అక్కడికెళ్దామా?’’ అనగానే మాధవి చిరునవ్వు రువ్వి ‘‘మామయ్యా, నా బట్టలు ఎప్పుడో ఆన్‌లైన్లో ఆర్డర్‌ ఇచ్చేశాను. ఈ మధ్య ఒక సినీ కథా నాయిక తన పెళ్లికి వేసుకున్న లెహంగా లాంటిదే సంగీత్‌ కోసం, రిసెప్షన్‌ కోసం మరొకటీ ఆర్డర్‌ ఇచ్చేశాను. ఆ డిజైనరే వీటిని కూడా చేస్తోంది. ఇక చీరలు కూడా ఆన్‌లైన్లోనే కొన్నాను. బ్లౌజుల కోసం సీరియళ్లలో నాయికలకి కుట్టే టైలర్ని హైదరాబాదు నుంచి పిలిపిస్తున్నాం. ఇప్పటి వరకూ మనూళ్లో అలా ఎవరూ కుట్టించుకోలేదు తెలుసా?’’ గర్వంగా చెప్పింది మాధవి.
      ‘‘సంగీత్‌ లాంటివన్నీ మన వైపు కూడా చేస్తున్నారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమూర్తి. 
      ‘‘అయ్యో మామయ్యా. ఇంకా ఏ కాలంలో ఉన్నావ్‌ నువ్వు? నా పెళ్లి సంగీత్‌ కోసం రిహార్సల్స్‌ కూడా పూర్తయ్యాయి. అమ్మానాన్నా కూడా డ్యాన్స్‌ చేస్తున్నారు’’ అనడంతో అతనికి నోట మాట రాలేదు. 
కృష్ణమూర్తికి ఇదంతా అయోమయంగా ఉంది. ఎప్పుడో దేశం విడిచి వెళ్లకముందు చూసిన పెళ్లిళ్లకీ, ఇప్పటికీ ఇంత మార్పా అనుకున్నాడు. పెళ్లింట్లో ఎలాంటి హడావుడీ లేకపోవడంతో దిగాలు చెందాడు. పెళ్లికి రెండ్రోజుల ముందు వరకూ అసలు ఆ ఇంట్లో శుభకార్యమే జరుగుతున్న భావన కలగలేదు కృష్ణమూర్తికి. 
      పెళ్లికి రెండ్రోజుల ముందు సంగీత్‌ కోసం మాధవిని తయారు చెయ్యడానికి ఓ డజను మంది వచ్చారు. మేకప్పు వేశాక ఫొటోషూట్‌ జరిగింది. మధ్యమధ్యలో మాధవి సోషల్‌ మీడియాలో వాటన్నింటి అప్‌డేట్లు పెడుతోంది. ఓ రెండున్నర గంటలయ్యాక, లెహంగా, దాని మీదకి పొట్టిగా ఉండే బ్లౌజులాంటిది వేసుకుని, జుట్టు విరబోసుకుని బయటకొచ్చిన మాధవిని చూడగానే కృష్ణమూర్తికి నోట మాట రాలేదు.
      మాధవే అనుకుంటే, అక్క కూడా అరవైల నాటి హీరోయిన్‌లాగ తయారైంది.  
      ‘‘ఇదేంటక్కా....?’’ అంటూ కృష్ణమూర్తి ఏదో అడగబోతుంటే ‘‘మనం కూడా ట్రెండుతోపాటూ వెళ్తుండాలిరా’’ అని హితోపదేశం చేసి, దేవానంద్‌లా తయారయిన భర్తతో కలిసి వేదిక ఎక్కేసింది.
      సంగీత్‌ పేరుతో సినిమా పాటలకి చేసిన హడావుడిలో సహజత్వం లోపించిందన్న భావన కలిగింది కృష్ణమూర్తికి. 
      పెళ్లి రేపనగా ముందురోజు సాయంత్రం ఓ నలుగురైదుగురు చుట్టాలు వచ్చారు.
      ఆరోజు రాత్రి పక్క గదిలో అక్క, బావ, మాధవి మాట్లాడుకుంటున్నారు. అకస్మాత్తుగా మాధవి వెక్కిళ్లు వినిపించాయి. 
      మరో అరగంటలో పెళ్లి ఉందనగా, ఎవరినో ప్రేమించానని కథానాయిక చెప్పడం, అమ్మానాన్నలు ససేమిరా అనడం, అమ్మాయి పారిపోయే ప్రయత్నం చెయ్యడం లాంటి సినిమా సన్నివేశాలు అతని కళ్లముందు తిరిగాయి.
      కంగారుగా వెళ్లి ‘‘ఏమైందక్కా’’ అనడిగాడు.
      ‘‘మనూరి టైలర్‌తో కుట్టించు కోమంటే నా మాట విందా ఇది? సీరియల్‌ హీరోయిన్‌ అని హైదరాబాదు నుంచి ఎవణ్నో పిలిపించేంత వరకూ ప్రాణం తీసింది. ఇప్పుడేమో వాడికి పనెక్కువయ్యిందట. దీని బట్టలు ఇవ్వలేనంటున్నాడు’’ అంది కోపంగా వాసవి.
      ‘‘సరే, ఆ టైలర్‌ నంబర్‌ నాకివ్వండి, నేను చూస్తాగా, కంగారు పడకుండా పడుకోండి’’ అన్నాడు కృష్ణమూర్తి.
      అతనికి ఫోను చేసి, కుట్టుకూలి మూడింతలిస్తానని బతిమాలితే తెల్లవారుఝామున వచ్చి గబగబా కుట్టిచ్చాడు.
      అర్ధరాత్రి ముహూర్తం కావడంతో ఆరోజు సాయంత్రమే రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడింటికి మొదలెట్టిన మాధవి మేకప్పు సాయంత్రం ఆరింటికి, అదీ వాళ్ల అమ్మ వెనక ఉండి తరిమితే పూర్తయ్యింది.
      పెళ్లి మండపానికి స్వయంగా తను తీసుకెళ్దామనుకున్నాడు. కానీ, నాన్న డొక్కు కారులో నేను రాను అందట మాధవి. అందుకే ఆమె నాన్న పెద్ద పడవంత కారు అద్దెకి మాట్లాడాడు! ఈ విషయం తెలిసి బిక్కముఖం వేసిన కృష్ణమూర్తిని చూసి నవ్వుకుంది అతని భార్య శిరీష. 
      ఫంక్షన్‌ హాల్‌ దగ్గర ఒకేలాంటి చీరలు కట్టుకుని, కృతకంగా నవ్వుతూ, వచ్చిన అతిథులందరికీ సెంటు పూసి, చేతిలో గిప్టు ప్యాకెట్టు పెడుతున్నారు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ తరఫు ఆడపిల్లలు. సూటూ బూటూ వేసుకున్న కుర్రాళ్లు కొంతమంది కూల్‌డ్రింకుల ట్రేలతో అతిథుల కడుపులు నింపేస్తున్నారు బలవంతంగా. రిసెప్షన్లో కొత్త జంట రకరకాల భంగిమల్లో ఫొటోలు తీయించుకోవడంలో మునిగి ఆశీర్వదించడానికొస్తున్న పెద్దవారినెవరినీ పట్టించునే స్థితిలో లేదు. ఒకరిద్దరు పెద్దవారు నొచ్చుకుని స్టేజీ దిగిపోవడం చూసి కృష్ణమూర్తి నిస్సహాయంగా ఉండిపోయాడు.
రిసెప్షన్‌కి వచ్చిన అతిథులు ఎవరి స్థాయిని బట్టి వారు తలోచోటా కూర్చున్నారు. సమాన స్థాయి లేకపోతే సొంత తోబుట్టువులయినా విడిగా కూర్చున్నారని గమనించాడు కృష్ణమూర్తి. ఆప్యాయంగా పలకరించుకోవడం, కుశల ప్రశ్నలు వేసుకోవడం కంటే స్థాయీ ప్రదర్శనే ఎక్కువగా కనిపించింది. మా వాడు ఫలానా దేశంలో ఉన్నాడని ఒకాయనంటే, ఇంకొకాయన మా కూతురు ఫలానా దేశంలో గొప్ప కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉందని, తాము అక్కడి నుంచి నిన్ననే వచ్చామని గొప్పలు పోతున్నారు. చాలా మంది మాటల్లో ‘చూశావా, నేను నీ కంటే గొప్ప’ అన్న భేషజం తొంగి చూస్తోంది. వీటిలో ఇమడలేని కొంతమంది పెద్దవారు మాత్రం దూరంగా కూర్చుని నోరారా మాట్లాడుకుంటున్నారు.
      మండపంలో పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేసి మాధవి, ఆమెకి కాబోయే భర్తా తీయించుకున్న ప్రీ వెడ్డింగ్‌ ఫొటోలూ, వీడియోలూ అదే పనిగా చూపిస్తున్నారు. వాటిలో ఆ ముద్దులు, కౌగిలింతలు, తాళి కట్టక ముందే జంట మధ్య దగ్గరితనం బహిరంగంగా చూపిస్తుంటే ఇబ్బందిగా కదిలాడు కృష్ణమూర్తి.
      భోజనాల దగ్గర ఓ రెండు డజన్ల ఛాట్లు, స్టార్టర్లు, ఇరవై రకాల వంటలతో ఉన్న టేబుళ్లని చూస్తే చిన్నప్పుడు చందమామ కథల్లో యుద్ధ సన్నాహమప్పుడు సైన్యం చేసుకునే వంటల వర్ణన గుర్తొచ్చింది. వాటిలో ఒక్క సంప్రదాయ వంటకమూ లేదు.
      వచ్చిన అతిథులు కొత్త జంటని ఆశీర్వదించి, హడావుడిగా భోజనాల దగ్గరికి చేరుకున్నారు. రెండు మూడు రకాలు తినేసరికే సగం కడుపు నిండిపోయింది అందరికీ. తిన్నంత తినేసి, మిగిలింది పారేసి వచ్చిన దారినే చక్కా వెళ్లిపోయారందరూ. భోజనాలయ్యేసరికి కనీసం ఒక అర క్వింటా ప్లాస్టిక్‌ చెత్త పేరుకుపోయిందక్కడ. 
      పెళ్లి మండపానికి కావాల్సిన పూలని పక్క రాష్ట్రం నుండి తెప్పించామని గొప్పగా చెప్పాడు బావ. కానీ ఎంత ఖరీదైన పూలు వాడినా, పచ్చదనం లేని పెళ్లిపందిరి కళావిహీనంగా తోచింది కృష్ణమూర్తికి. ముహూర్తం సమయానికి గట్టిగా ఇరవై మంది కూడా లేరు! పెళ్లికొడుకూ, పెళ్లికూతురూ కునికిపాట్లు పడుతూ పీటల మీద కూర్చున్నారు. మొత్తానికీ పెళ్లి ఒక తంతులాగ పూర్తయ్యింది. 
      ‘‘ముహూర్తం మించిపోతోంది’’ అని పంతులుగారు అరచి గీ పెట్టినా పట్టించుకునేదెవరూ! పెళ్లి మొత్తం ఫొటోగ్రాఫర్లు చెప్పినట్లే నడిచింది. ఇంకా అప్పగింతలు పూర్తి కానే లేదు, ఆ తర్వాత జరగబోయే పెళ్లి అలంకరణ మొదలయ్యింది మండపంలో. ఏదైతేనేం, పెళ్లి పూర్తయ్యింది. మాధవి అత్తారింటికి వెళ్లిపోయింది. 
      బావ కారులో కొంటికొస్తుంటే ‘‘అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటీ బోల్తా పడ్డావులే...’’ పాట వస్తోంది. అది విని సందర్భానికి సరిగ్గా సరిపోయే పాట వచ్చిందనుకున్నాడు కృష్ణమూర్తి. ఆ పాట వింటూ, భర్తని చూస్తూ కిలకిలా నవ్వుతోంది శిరీష. కృష్ణమూర్తి ముఖం కందగడ్డలా అయ్యింది. 
ముహూర్తం నిశ్చయమవ్వగానే అయినవాళ్లంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ పెట్టే పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, పెళ్లిలో గాడి పొయ్యిల నుంచి వచ్చే ఎసరు సువాసనలూ, పక్కనే పాకంలో మునిగిన లడ్డూల గుబాళింపులు, వారం ముందు నుంచే ఇంట్లో సంబరంగా దిగే చుట్టాలు, మామిడాకుల తోరణాలు, తాటాకు పందిళ్లు, విస్తర్లలో వడ్డనలతో ఉండే అచ్చమైన తెలుగు పెళ్లిళ్లు ఇక చూడలేనేమో అన్న బెంగతో అమెరికా విమానం ఎక్కాడు కృష్ణమూర్తి. 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam