నుదుటి దోషాలు

  • 888 Views
  • 1618Likes
  • Like
  • Article Share

    బి.మదన్‌ మోహన్‌రెడ్డి

  • 9989894308

అనంతపురం రైల్వే స్టేషనులో... ఒక గరీబోడు పొద్దస్తమానూ యాచించిన చిల్లరంతా అక్కడున్న పదిమంది చేతుల్లోకి పోసేసి... వాళ్లకి ఎడంగానే కూర్చుని తృప్తిగా నవ్వుకున్నాడు. ఇంతకీ! అతడు దాత? యాచకుడా? ఆ దాతృత్వం వెనుక దాగిన వ్యధ ఏంటీ? అతని జీవితంలో తారాడిన వెలుగునీడల కథేంటీ? అతని చిరునవ్వు  చాటున పొటమరించిన జీవన సత్యం ఏమైఉంటుందీ?
కాచిగూడలో ‘
యశ్వంత్‌పుర’ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి అనంతపురంలో దిగాను. వచ్చే దారిలో సరిగా సిగ్నల్‌ అందకపోవడంతో ముందుగా స్టేషన్‌కి కారు తీసుకురమ్మని అబ్బాయికి చెప్పలేకపోయా. దిగ్గానే ఫోన్‌ చేశా. స్టేషన్‌ బయటికొచ్చి వాడికోసం ఎదురుచూస్తున్నా. ఒకవైపు పుట్పాత్‌ సిగ్నల్‌ పడినట్లుగా అందరూ వేగంగా వెళ్తున్నారు. మరోవైపు సీఎం కాన్వాయ్‌ కార్లలా లైన్లలో ఉన్న ఆటోలు. ప్రయాణికులని చూడగానే ఆటో డ్రైవర్లు దగ్గరికొచ్చి ‘రండి సార్, ఎక్కడికి వెళ్లాలి? రండి మేడం...’ అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వదలట్లేదు. అలాగే నా దగ్గరికి వచ్చారు. ‘కారోస్తుంది’ అన్నాను. అయినా వినకుండా ‘రండి సార్‌ ఎక్కడికెల్లాలి. మీరే జెప్పండి ఎంతకి రమ్మంటారో?’ అంటూ విడివిడిగా వచ్చి విసుగిస్తున్నారు. పాపం వాళ్లదేమి తప్పులేదు. నేనున్న చోటు వాళ్లతో అలా అడిగిపిస్తుందని నేనే కొద్దిగా దూరంగా వచ్చి నుంచున్న.
      సాయంత్రం అయ్యింది సూర్యుడు అస్తమించినా మసక వెలుగు ఉండనే ఉంది. దీన్ని మా ఊళ్లో ‘ధూళి ధూళి మొబ్బు’ అంటారు. ఏదో ఆహ్లాదంగా అనిపిస్తే అలా అక్కడక్కడే పచ్చార్లు కొడుతున్న.
నాకు కొద్ది దూరంలో నేలపై ఓ పదిమంది కూర్చోనున్నారు. వాళ్లు ఒక చేతిలోని చిల్లరని మరొక చేతిలోకి తీసుకొని లెక్కపెడుతున్నారు. వాళ్లని చూడగానే అడుక్కుతినేవాళ్లని నా కళ్లు నిర్ధారించేశాయి. ఇంతలో వాళ్లందరిలో నుంచి ఒకాయన లేచి నిలబడ్డాడు. ఇందాక తాను లెక్కపెట్టిన చిల్లరనంతటిని అక్కడున్న వాళ్లందరికి సమానంగా పంచడం ప్రారంభించాడు. నా కళ్లకి ఆ దృశ్యం ఆశ్చర్యంగా అనిపించింది. అలా పంచడం అయినా తర్వాత తన ఖాళీ గిన్నె తీసుకొని వారందరికి ఎడమంగా కూర్చోన్నాడు.
      పొద్దున్నుంచి వాళ్లతోపాటు యాచించిందంతా తిరిగి వాళ్లకే ఇచ్చేశాడు. ఇంతకి తను యాచకుడా? దాతనా? అన్నది నా బుద్ధికి అంతుచిక్కడం లేదు. సరే కారు వచ్చేదాకా మాటలు కలిపితే క్లారిటీనూ, కాలక్షేపం అవుతుందని ఆయన దగ్గరికెళ్లి పక్కనే కూర్చున్నా. డబ్బులు లెక్కపెడుతున్న వాళ్లంతా వింతగాను, అనుమానంగాను చూస్తున్నారు. వాళ్ల డ్యూటీ అయ్యిపోయిందేమో! నన్ను ఏమి అడగలేదు. నేను ఇవ్వనూలేదు. ఆయన మాత్రం ఒక చిరునవ్వు వదిలాడు.
      ‘ఏం పెద్దాయనా! రోజంతా సంపాదించింది తిరిగి వాళ్లకే ఎందుకిచ్చేసావ్‌?’
      ‘ఏమో సామీ! ఈ దుడ్లను నే మోయలేను’ అంటూ ముక్తసరిగా బదులిచ్చాడు.
      ‘ఎందుకలా?’
      ‘దాండ్లని తీసుకొని నేనేమి సేసుకొవల్లప్పా. సామి సేవ దొరికితే సాలనుకో’
      ‘మరి అలాంటప్పుడు ఆ చిల్లర ఎందుకు ఇప్పించుకోన్నావ్‌?’
      ‘నేనెవర్ని అడగలే. గుళ్లో దేవున్ని సుసేందుకిపోతే నా ఏసం సూసి, లోపలికి రానిలే. ఇడున్నాడు, ఆడున్నాడని అనుకోనేకి దేవుడేమన్నా మొనిశా? కాదుగదా. అన్నితావుల ఆయప్పేలే అని ఆ మెటికిల దగ్గరేకుకోనేస్తి. వచ్చీ, పోయేవోళ్లు వీళ్లందరకట్లే నాకి రూపాయి, రెండ్రుపాయులు యేశారు. అయినా ఒగినికి ఇచ్చేదెవరు? ఇప్పిసుకోనేదెవరు? అంతా పైనాయప్పే. దునియా సారి భికారి ఏక్‌ దాత్‌ రామ్‌ హై. వాల్ల అభిమానం యాల కాదనల్లా అని ఇప్పిచ్చుకొంటా. తిరిగి పొద్దుబోడికి ఈల్లకే ఇచ్చేస్తా’ అంటూ ఇందాకా నేను చూసిన దృశ్యానికి వివరణిచ్చాడు.
      చూడబోతే పాండిత్యమూ ఉంది. లోకజ్ఞానమూ ఉంది. ఆధ్యాత్మిక వైరాగ్యాలున్నాయి. కానీ నాకు ఈయన జీవిత దృక్కోణం అర్థం కాలేదు. దానికై పూర్తి జీవితం తెలుసుకోవాలనిపించింది.
      ‘నీకు ఇల్లు, భార్య పిల్లలు ఎవరులేరా?’ అని తొలి భాణం సంధించా.
      ‘అబ్బో! అది పెద్ద కతలే సామి’ అంటని జారవిడుపు సమాధానం అడ్డుపెట్టుకొన్నాడు.
      ‘పర్లేదు చెప్పొచ్చు కదా’ అంటని సరదాగా బలవంతపెట్టా. ఏదో గతాన్ని పరిశీలించేవాడిలా కొద్దిసేపు ఆగి మొదలుపెట్టాడు.
      ‘అంతా ఉండేవొళ్లు సామి. నా పెండ్లాం తిరగతూరి కానుపులో కాలం సేసింది. తిరగ పెండ్లిగిండ్లి ఎమనుకోకుండా పిల్లోలిద్దరిని పెద్దోల్లని జేసి, పెద్దోనికి పెండ్లి గూడా జేస్తి. సిన్నోడు సేదువుకొనే తావ యవరో పిలకాయి కోసం రైలు కింద పడిపోయాడు. అవటినుంచి పెద్దోని తావనే ఉండిపోయా. క్వాల్లి(కోడలు) సేదువుకోనింది గాని యలో నన్ని సూస్తే ఒర్సేటట్లు ఉండదు. అన్ని నాకి సేప్పల్లా, అన్ని నాకి సూపియ్యల్లా అని యపుడు నిస్టురుము సేసేది. ఇంగా వోపిక నశించిపోయి ఇంట్లో నుంచి ఎల్లోస్తి’ అంటని గొంతులోకి వస్తున్నా ఆవేదనని తిరిగి లోనికే దించుకొన్నాడు.
      ‘ఆ చిన్న విషయానికి ఇలా వచ్చేసావా? నీ కొడుక్కి చెబితే సరిపోయేదిగా’
      ‘సెబితేగాని ఎమిసేత్తాడు. వానికేమి తెలీదేమి. ఇలా ఉందిరా పరిస్థితి అని అంటే పెండ్లాం లేనవుడ నాయానా అంటని సేతులు పోట్టుకొంటాడు. ఉన్నవుడా బెల్లం గొట్టిన గుండ్రాయి ఉన్నట్లు ఉంటాడు. పాపం వాడుగాని యేమి సేసేతట్లుంది. నన్ని పట్టుకోనేకిపోతే పెండ్లాం పిల్లోల్లని జారిడిసుకొనే పరిస్థితి. అంతదాక యాల్లేప్పా అని నేనే ఎల్లోస్తి. అయినా దేసం మీంద అందరికి కొడుకులుండారా? ఉన్నోళ్లందరూ వాళ్లతోనే ఉండారేమి?’ అంటని తనని తాను ఓదార్చుకొన్నాడు. ఆ మాటలకి నాలో కూడా ఒకింత ఆర్ద్రత కలిగింది.
      ‘మరి నువ్‌ వచ్చేస్తుంటే నీ కొడుకు ఎక్కడికి అని అడగలేదా?’
      స్రీసెలము, తిరుపతి అంటనే ఎల్లోస్తి. వానీకి తెలుసు, మా నాయన ఇంగా రాడని’ చిన్నగా నిట్టూర్పు వదిలి, తిరిగి ఆయనే ‘ఇదిగో ఇడున్నోల్లందరూ యేమీలేకనే అడుక్కు తింటాండారు అనుకోంతాండావా, వీళ్లందరికి భూములు, ఇండ్లూ, కొడుకులు అందరూ ఉండారు. సివరికి ఈ గుడితావ సిక్కే సిల్లరే శాస్వితము అని అవన్నీ మొరిసిపోయి బతుకుతాండారు. నాకేమో అదిగుడా శాస్వితము కాదనిపిత్తుంది. దానికే వాల్లకే ఇచ్చేత్తాంతటా’ అని ముగించాడు.
      నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయన అన్ని వదిలేసి వచ్చాడా? వద్దనుకొని వచ్చాడా?. ఇంతలో కారొచ్చింది. పెద్దాయనతో శెలవు తీసుకొని ఎక్కి సీట్లో కూర్చున్నాను.
      కొడుకులు ఎదగాలని వాళ్ల తలరాతను తల్లిదండ్రులు రాస్తుంటారు. అది ప్రకృతి. ఎదిగి పెళ్లయ్యాకా, వీళ్లా తలరాతను వాళ్లు రాస్తుంటారు. అనుభవం లేకనో ఏమో అక్షరదోషాలు దొర్లుతున్నాయి.
      ఎందుకు ప్రూఫ్‌ రీడింగ్‌ దిద్దుకోలేకపోతున్నారు. ఇదే ఇక్కడ వికృతి అవుతుంది.
      ఎందుకో అసంకల్పితంగా అద్దంలో నా ముఖాన్ని, కారు నడుపుతున్న అబ్బాయి మొఖాన్ని......

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam