‘థు’భాయ్‌

  • 349 Views
  • 42Likes
  • Like
  • Article Share

    సంపత్‌ కుమార్‌

  • నిర్మల్
  • 9810402895
సంపత్‌ కుమార్‌

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికెందరికో ఆశల గమ్యం దుబాయి. నాలుగు రాళ్లు సంపాదించి సంసారాన్ని బాగు చేసుకుందామని దుబాయి విమానం ఎక్కుతున్న వాళ్ల జీవితాలు ఎలా ఆగమవుతున్నాయి? వాళ్ల కుటుంబాలు ఇక్కడ ఎలాంటి ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి?
శంషాబాదు
విమానాశ్రయం కళకళలాడుతోంది, ఎప్పటిలాగే. రంగురంగుల విద్యుద్దీపాలు, ఇతర అలంకరణలతో ఎప్పుడు చూసినా సింగారించుకునే ఉంటుందది. అంతర్జాతీయ ప్రయాణం చేసి అలసిన మొహాలతో ట్రాలీలని తోసుకుంటూ అన్నిరకాల హావభావాలతో చీమల్లా బయటికొస్తున్నారు ప్రయాణికులు. ఒకప్పటి ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు జిల్లాల నుంచి పుట్టుకొచ్చిన పది జిల్లాల నుంచి వచ్చిన వందకు పైబడిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ముప్పై మంది యువకులని దుబాయికి సాగనంపుతున్నారు. వారిలో కొందరు వీడ్కోలు పలకడానికొస్తే, మరికొందరు విమానాశ్రయాన్ని చూడటానికి వచ్చారు. 
      దుబాయికి వెళ్తున్న వారిలో గుబులు. వారు బాగా చదువుకోలేదు. డ్రైవింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్‌ కోర్సులు చేశారు. గతంలో దుబాయి వెళ్లి ఏజెంట్ల మోసాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన తమ ఊరివారి కథలు వారికి గుర్తొస్తున్నాయి. తమకి ఏ గతి పడుతుందో? అని ప్రతి ఒక్కరిలో గుబులు. అన్నింటికీ సిద్ధపడే ఇక్కడివరకు వచ్చారు. అది వారికి తొలి విమాన ప్రయాణం.
      ‘‘పదిలం బిడ్డా. మంచిగ పనిచేసుకో. చేతిల పైసలుంటయని ఆగం కాకు. చెల్లె లగ్గంకున్నది. మా ఆశలన్ని నీమీదనే’’ బాధ్యతలు గుర్తుచేస్తున్నాడు ఓ తండ్రి. ‘‘టైముకు తిను బిడ్డా. ఇంటి గురించి ఫికరు పెట్టుకోకు. పదో తరగతి కాంగనే చెల్లి సదువు ఆపేస్తం. నువ్వచ్చేసరికల్లా పిల్లాణ్ని చూసిపెడ్తాం. నువ్వు పంపే పైసల్ని దాని లగ్గం కర్సుకే ఉంచుతం’’ కొడుకు చెంపలపై చేతులేసి ఆప్యాయంగా నిమురుతూ తల్లి. కొడుకు వాళ్లిద్దరి కాళ్లకి మొక్కాడు. ముగ్గురి కళ్లు తడయ్యాయి.
      ‘‘చేరంగనే ఫోన్‌ చెయ్యి బిడ్డా’’
      ‘‘ఒక్కల్లమే జేస్తం. మనూర్లే అందరికీ క్షేమంగా చేరినట్టు తెల్సిపోతది. కొంచెం జమాయించినంక మీకు చేసుడు మొదలుపెడతా. ఫోన్‌ రాలేదని పరేషాన్‌ గాకుండ్రి. అక్కడి తరీకలు ఎట్లుంటయో ఏమో?’’ కొడుకు గొంతు వణుకుతోంది. 
అదే టైముకి కాస్త అటు ఇటుగా అంతర్జాతీయ విమానాలు ఎన్నో బయలుదేరతాయి. మెల్లమెల్లగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సూట్లు, బూట్లు, టైలతో కొందరు, నిక్కర్లు టీషర్టులతో మరికొందరు. తరచూ ప్రయాణాలు చేసే వారి కదలికలు దూకుడుగా, మొదటిసారి వెళ్లేవారి కదలికలు బింకంగా ఉన్నాయి. 
      లేబర్‌ పనికి దుబాయి వెళ్లేవారి లగేజీని తేలిగ్గా గుర్తుపట్టవచ్చు. టేపుతో బాగా చుట్టించడమో లేదంటే ప్లాస్టిక్‌ తాడుతో కట్టడమో... ప్రయాణికుల శరీరపు రంగుల్లో కూడా వైవిధ్యం. చేతుల్లో ఉన్న పాస్‌పోర్టు రంగుల్లో వైవిధ్యం. గుంపు నుంచి ఎక్కడ విడిపోతామోనన్న బెరుకుతో ఒకరికొకరు అతుక్కుని లోపలికి అడుగులేశారు. 

* * *

      అన్ని బంధాలూ ఇంకా అక్కడే, విమానాశ్రయం ఆవరణలోనే ఉన్నాయి. కొత్త లోకాన్ని వింతగా చూస్తున్నాయి. కన్న బంధాలు, కట్టుకున్న బంధాలు, కట్టుకున్న బంధాలతో అతుక్కున్న, అల్లుకున్న మరికొన్ని బంధాలు, తోడబుట్టిన బంధాలు, స్నేహ బంధాలు, వీధి బంధాలు, ఊరి బంధాలు అన్నీ కలిసి బీరకాయ పీచులా పెనవేసుకున్న బంధాలు. ఆ పీచులోని ఒక్క యువ నారని సాగనంపడానికి ఎన్నో బంధాలతో ముడిపడ్డ ఈ పీచు ఉండ విమానాశ్రయం వెలుతురులో చిత్రవిచిత్రంగా తిరుగుతోంది.  
      ‘‘ఎన్ని గంటలు గాలిలుంటరు?’’ ఓ తల్లి ప్రశ్న.
      ‘‘మూడు గంటలే! ఒక సీనిమ సూసినంతసేపు’’ ఒకరి జవాబు.
      ‘‘గంతేనా! మనం ఆర్మూర్‌ చేరేలోపల ఆల్లు దుబాయి చేర్తరు’’ ఓ కోడలి జవాబు. పెళ్లయి అయిదునెల్లయ్యింది. లోపలికి పోయేటప్పుడు మొగుడి కళ్లల్లో నీటితడి చూసింది. తనకూ దుఃఖం వచ్చింది. 
      ఎన్నేండ్లకు కలుసుడో మల్ల అని మనసులో అనుకుంది. ఐదు నెల్లు సంతోషంగా గడిచిన దాంపత్య జీవితం కళ్లముందు తిరిగింది. ‘‘మల్ల పోరాదు’’ అని చెప్పినా వినకుండా పోతుండు అని మనసులోనే గులిగింది. విమానం ఆకాశంలోకి, వచ్చినవారు తమతమ వాహనాలవైపు నడిచారు. వారంతా చిన్న కారు, పెద్ద కారు, బస్సుల్లో వచ్చారు. భూమి మీద, ఆకాశంలో ప్రయాణాలు మొదలయ్యాయి. 

* * *

      చిన్నకార్లో ఏడుగురు కూర్చున్నారు. గాల్లో ప్రయాణం చేస్తున్న లక్ష్మీకాంతం స్నేహితులు. అందరూ కలిసి ఒక కారుని సంపాదించి పెట్రోల్‌ పోయించుకుని వారే నడుపుకుంటూ మిత్రుణ్ని సాగనంపడానికి వచ్చారు. 
      ‘‘రెండేండ్లయ్యింది. కాంతంగాడు పోతున్నా పోతున్నా అనవట్టి. ఇయ్యల్లటికి అయిపోయిందిరా’’ డ్రైవింగ్‌ చేస్తున్నతను. 
      ‘‘నయమేగదరా. జల్ది వోయినట్టే. కామారెడ్డిల ఉన్న మా మామ కొడుకు మూడేండ్ల సంది ఇగ వోత అగ వోత అంటడుగని వోవుడే లేదు. ఏజెంటుకి ఇచ్చేందుకు అప్పు చేసి కూసున్నడు. మిత్తి కడుతుండు. నిరుడు లగ్గం చేసుకొన్నడు’’ వెనక కూచున్న అయిదుగురిలో సరిగ్గా మధ్యలో సీటు అంచుపై కూచున్న దోస్తు అన్నాడు. 
      ‘‘కాంతంగాడింట్ల పైసలకు మస్తు కష్టం ఉన్నదిరా. ఆడు లగ్గం చేసుకోనని అన్నడ్రా. దుబాయి పొయి నాలుగు పైసలు సంపాదించుకున్నాక చేసుకుంటా అన్నడు. ఆని అవ్వ ఇనలే. కట్నం ఆశలవడి చేసిండ్రురా’’ దగ్గరి మిత్రుడి వివరణ. 
      ‘‘ఈ ఏజెంట్లు ఏదీ సరిగా జెప్పర్రా. చూసిండు చూసిండు. లగ్గం చేసుకొన్నడు. ఇంకో యేడు గిట్లనే అయిపోతదని అనుకున్నడు. లగ్గం కాంగనే కాంతం గాడికి కిస్మత్‌ కలిసొచ్చింది. అందరూ ఆడి పెండ్లాం అదృష్టం తెచ్చిందంటున్నరు’’ వెనకసీట్లో ఎడమ డోర్‌ పక్కన చేయి బయటకి పెట్టుకున్న గంగాధర్‌ చెప్పాడు. 
      ‘‘రామాయంపేట అచ్చినట్టుంది. ఛాయ తాగుదంరా. ఎయిర్‌ పోర్ట్‌ల ఏం ధరలున్నయిరా’’
      ‘‘దుబాయ్‌కి మన నంబర్‌ ఎప్పుడు తలుగుతదో. జల్ది పోవాల్రా. నాలుగైదేండ్ల సంది ఎంత మందిని పంపిచ్చినంరా. మొదటి ఏజెంట్‌ మోసం జేసే. ఇప్పుడున్నోడు మంచోనిలెక్కనే అనిపిస్తుండు. కొన్నినెల్లు ఓపికవట్టు. మంచిదిప్పిస్తా అంటున్నడు’’ వేడి ఛాయ్‌ తాగుతూ కారు నడిపినతను అంటున్నాడు. 
      ‘‘ఓ యాభై మందిని సాగనంపినమేమో ఇప్పటిదాకా. ఇద్దరు దుబాయ్‌లనే సచ్చిపోయిరి. పోయినోడెవ్వడు ఖుషీగా ఉన్నట్టు మాట్లాడడ్రా. ఎప్పుడూ కష్టాలే చెబుతరు. నిన్న భీముడు ఫోన్‌జేసిండు. అన్నీ మంచిగ నేర్సుకొని ఉషారైపోతే, ఆనికి ఒంటెలు, గొర్రెల్ని మేపే పనిచ్చిండట. పన్నెండు గంటలు పని చెయ్యాలనట్రా. మోసమయిందిర తమ్మి అంటా కండ్లల్ల నీళ్లు తెచ్చుకున్నడ్రా’’ కారు నడిపినతని పక్కన కూర్చున్నతను దిగాలుగా చెప్పాడు. 
       ‘‘అన్నా. తర్వాత నీ నంబరే. రెన్నెల్లల్లా నువ్వుగూడ ఎగిరిపోతవ్‌ సూడు. గిట్లనే నిన్ను పంపిచ్చి, వాపస్‌ల నిన్ను యాజ్జేసుకుంటా చాయలు తాగుతం’’ డ్రైవర్‌ సీటు వెనకాలే కూచున్నతను. 
      ‘‘నీ మాట నిజమైతే స్పెషల్‌ దావత్‌ ఇస్తర నీకు’’ అందరూ నవ్వుకుని కారెక్కారు.  
      ‘‘ఎనకున్నోళ్లు బేఫికర్‌గా నిద్రవోండ్రి. అరేయ్, నువ్వు మాత్రం నాతో మాట్లాడుతానే ఉండురా. సిస్టమ్‌ పనిజేస్తలేదు. పాటల్లేవ్‌. నన్ను కురకనియ్యకు’’ పక్కన కూచున్నతనికి కారు నడిపే అతను హుకుం జారీచేశాడు. 
      ‘‘అన్నా’’ అంటూ తన దగ్గరున్న చిన్న బాటిల్ని రహస్యంగా చూపాడు. 
      ఇద్దరూ నవ్వుకున్నారు. సీట్‌ బెల్టులు పనిలేకుండా ముడుచుకుని ఉన్నాయి.     

* * *

      సాగనంపడానికి వచ్చినవారు కొందరు విమానాశ్రయం నుంచి పలు జిల్లాలకు వెళ్లే బస్సుల్లోకి చేరుకున్నారు. బస్సు ప్రయాణం సాగుతోంది. కొందరు కురుకుతుంటే, మరికొందరు నిద్రలోకి జారిపోయారు. ముచ్చట్లలో పడ్డారు మరికొందరు. దీపాలు మసకయ్యాయి. బస్సు హెడ్‌లైట్లు కాంతుల్ని పుంజాల కట్టలతో దూరంగా విసురుతున్నాయి. హైవే 44 సొగసుల్ని తాకుతూ కాంతి కిరణాలు మరింత సంతోషంతో వెలిగిపోతున్నాయి. 
      ‘‘మనోళ్లు దుబాయ్‌ చేరుకునుంటరా?’’ పక్కనే కూచున్న భర్తని కాంతం తల్లి అడిగింది. జవాబు రాలేదు. నిద్రపోతున్నాడో, మెలకువగా ఉన్నాడో ఆ మసక వెలుతురులో తెలియలేదు. 
      ‘‘చిన్నోడా, టైమ్‌ ఎంతయి తుందిరా?’’ ముందటి సీట్లో ఉన్న కొడుకుతో అంది. వాడూ నిద్రలోనే ఉన్నట్టున్నాడు. తొమ్మిది నెలలు కడుపులో మోసిన ప్రేమ. కొడుకు దుబాయి చేరేంతవరకు తల్లికి నిద్ర రాదు. 
      ‘‘మనం కామారెడ్డి పోయేసరికి మనోళ్లు దుబాయ్‌ల వడ్తరు అత్తా’’ ఆమె ఆత్రుతని గమనించిన ఊరతని జవాబు.
      ‘‘నిద్ర పోలేదురా శంకరి’’ 
      ‘‘నాక్కూడా మనసు కొట్టుకుంటున్నది అత్తా. చిన్నాన కొడుకు, బామ్మర్ది కూడా గండ్లనే ఉన్నరు. ఆర్టీసీ బస్సులచ్చేసరికి మనోళ్లు లోపల్కి పోయిండ్రు. మాట్లాడుడు కాలేదు. చూసుడు కాలేదు. ఎదిరి చూసిండచ్చు నాకోసం. బస్సు మీద మన్నువడ. పట్నంల తిప్పి తిప్పి తెచ్చేసరికి లేటైంది. ఏమనుకున్నరో ఏమో’’ తప్పైందన్న భావనతో. 
      ‘‘అవు. బాగాసేపు ఎదిరి చూసిండ్రు. నీకు ఫోను కూడా చేస్తుండ్రి. పోనీ బిడ్డా. ఫికర్‌ చేయకు. కామారెడ్డి రాంగనే చెప్పు’’
      ‘‘మంచిదత్తా. నువ్‌ నిద్రవో. నేను చెప్తా’’ 
      ‘‘నిద్రేమస్తది కొడుకా. కాంతం ఇల్లిడిసి ఎప్పుడు వోలె. ఎట్లుంటడో ఏమో? ఏమున్నా ఈని మీదనే ఆశ. పొల్ల లగ్గంజెయ్యాలె. అప్పు చేసి పోయిండు. తీరుస్తా అంటడు. లగ్గంకు పంపుతా అన్నడు. ఇవన్నీ ఒక్కడితోటి ఐతయా? ఎసుంటి పని దొరుకుతదో ఏమో? ఎవుసాయం చేసుకోరా అంటే ఇనకపాయె. లాభంలేదంటడు. ఎక్కడెక్కడోల్లో అచ్చి మన దగ్గర బతుకుతున్నరు. ఇక్కన్నే పాతుకుపోయిండ్రు’’ 
      ‘‘నిజమే అత్తా. మా నిర్మల్ల చూడు. గోరఖ్‌పూరోల్లు నూటయాభై మంది ఎనిమిదేండ్ల సంది ఉంటున్నరు. వడ్లపని జేస్తరు. మస్తుగా కమాయించి ఇండ్లకు పంపుతరు. బెంగాలోళ్లు ఇటుండుడే షురూజేసిండ్రు. గుజరాత్‌ రాజస్థానోళ్లయితే ఇరవైఏండ్ల పై నుంచి ఇటే ఉంటున్నరు. పెద్దపెద్ద ఇండ్లు మంచిగ కట్టుకున్నరు. ప్లాట్లు, తోటలు, పొలాలు కొనుక్కున్నరు. శ్రీమంతులయ్యిండ్రు. మధ్యప్రదేశోల్లు గుళ్లల్ల పూజారులుగా పనిచేస్తున్నరు. మహారాష్ట్ర నుంచి, నీకు తెలందిగాదు, మస్తుగా మన దగ్గరే పనిజేస్తరు. ఆంద్రోల్లు ఇండ్లు కడుతున్నరు. లేబర్‌ కూడా అక్కడికెల్లే తెచ్చుకుంటున్నరు. మన పైసా ఎంత వోతున్నది చూడు వేరే రాష్ట్రాల్లోకి. గిట్లుండంగా మనోళ్లు అప్పులు చేసి, అష్టకష్టాలు వడి దుబాయ్‌ వోవుడు ఇచిత్రంగా లేదా అత్తా’’
      ‘‘ఈల్లకు చెప్పేటోల్లులేక బిడ్డా. ఇప్పుడు సూడు, లగ్గం చేసినం. ఐదు నెల్లు అయ్యిందోలేదో కాంతం పాయే. కోడలొక్కతి ఇక్కడుండాలె. కాళ్లగొళ్లు జేస్తిమి. ఇడిసుండుడు మస్తు గోస’’
      వెనక సీట్లో కూర్చున్న కోడలు ఆ మాటలు వింటూనే ఉంది. అప్పటికే కాంతం చేష్టలు, మాటలు గుర్తుకు తెచ్చుకుని మురిసిపోతోంది. ఈ రెండుమూడేండ్లు ఎట్లా గడుస్తాయోనని కొత్త రుచులు చూసిన శరీరాన్ని ఓసారి మసక దీపాల్లో తడుముకుంది.   

* * *

      ఏడుసీట్ల పెద్ద కార్లో ఆరుగురు సౌకర్యంగా కూచున్నారు. స్థానికంగా పలుకుబడి ఉన్నవారు. ఛోటా మోటా నాయకులు. ఆర్థికంగా చిక్కబడ్డవారు. తమ ఊళ్ల నుంచి యువకులు దుబాయి వెళ్లినప్పుడల్లా శంషాబాద్‌ విమానాశ్రయానికి శ్రేయోభిలాషులుగా వచ్చి సాగనంపే సంస్కృతిని చాకచక్యంగా అలవాటు చేసుకున్నారు. వీరంతా దుబాయి వెళ్లేవారికి అప్పులిచ్చి దీర్ఘకాలికంగా తమతమ వలల్లో చిక్కించుకుంటారు. తీసుకున్నవారు దుబాయి వెళ్లేవరకు ఓపిగ్గా ఉంటారు. నగదు రూపంలో వచ్చే వడ్డీతో పాటు ఇతర రూపాల్లో కనబడే సామాజిక, శారీరక సుఖాలు కూడా వీరి ఆలోచనల్లో బుసకొడుతుంటాయి. స్టార్టప్‌ మొనగాళ్లు. 
      ‘‘ఇయ్యాల్ల డ్రైవర్‌కి మందు బంద్‌’’ సీసా మూత తీస్తూ డ్రైవర్‌ వైపు కొంటెగా చూసి అన్నాడు వెనక సీట్లో కూచున్నతను. 
      ‘‘అవురా. ఇయ్యాల్ల ఈనికి అస్సలియ్యకుండ్రి. మొన్న మనందర్ని సంపినంత పనిజేసిండు’’ మధ్యసీట్లో ఉన్నతను తాళం కలిపాడు. 
      ఇంకో ఇద్దరు మరో రకంగా ఉడికించారు. సీసా మూత వీడింది. గ్లాసులు, చికెన్‌ బకెట్‌ బయటికొచ్చాయి.
      ‘‘పెట్రోల్‌ లేకుండా ఈ బండి నడుస్తాదిరా? చెప్పండ్రి బే’’ డ్రైవింగ్‌ సీట్లో ఉన్నతను. ‘‘నడదన్నా’’ కొందరి గొంతులు.
      ‘‘గట్లనే ఈ మందు లేంది ఈ బండి నడదిరా’’ 
      ‘‘కొంచెం లిమిట్ల ఉండన్నా. మొన్న సచ్చి బతికినం. ఇంకా మస్తుమందిని సాగదోలాలె. నువ్వు మంచిగుంటే అందరం మంచిగుంటం. అరేయ్, ఒక్క పెగ్గే ఇయ్యుర. అంతకంటే ఎక్కువియ్యకు’’
      ‘‘నువ్వు నాకు లిమిట్లు వెడుతున్నావు బే. సంపినంత చేసినగని సంపలేదుగదరా. బేఫికర్‌గా ఉండుండ్రి’’
      సీసాలో ద్రావణం తగ్గుతోంది. హల్దీరామ్‌ ఖాళీ ప్యాకెట్లు, బోడి అయిన చికెన్‌ బొక్కలూ కిటికీలోంచి బయటపడుతున్నాయి.    
      ‘‘కాంతం గాడి కథ గోసనేరా. లగ్గం జేసుకున్న అయిదు నెల్లకే పడుసు పెండ్లాన్ని ఇక్కడుంచి దుబాయి పొయిండు’’ మధ్య సీట్లో ఎడమ వైపు కూచున్నతను. 
      ‘‘ఆడి పెండ్లాం జబర్దస్తున్నదన్నా. ఎట్లుంటదో ఏమో’’ మరొకడు. 
      ‘‘అచ్చేదాక తల్లిగారింట్ల ఉంటది. లేకుంటే అత్తగారింటికి వోతది’’ ఇంకో వేదాంతి.
      ‘‘రెండిండ్లు గాకుంటే నీ ఇల్లు కూడా ఉన్నదిగదరా...’’ మరొకరు. 
      ‘‘గట్ల మాట్లాడకురా. మా ఊరి పిల్లరా..’’
      ‘‘గందుకే అంటున్నా’’ పెద్దకారు చిన్న ఆలోచనలవారితో దూసుకుపోతోంది. మందు రక్తంలో కలిసిపోయింది. మూడో సీసా కిటికీలోంచి ఎగిరిపోయింది. హైవే మీద ఎనభై ఎనిమిది ముక్కలయ్యి ఉంటుంది. 
      మరికొన్ని కిలోమీటర్ల ప్రయాణం. హెడ్‌లైట్లు ప్రకాశవంతంగా దారిని చూపుతున్నాయి. చక్రం తిప్పుతున్న మనిషి కళ్లు మూతలు పడుతున్నాయి. వెనుక ఇద్దరు నిద్రలోకి జారిపోయారు. ఒకతను కలవరిస్తున్నాడు. ‘‘ఈ నెల పైసలింకా పంపలేదురా. జల్ది పంపురా’’ మరొకతనికి ఎయిర్‌పోర్ట్‌ హంగులు, రంగులు సొగసుగా కలలో కనబడుతున్నాయి.
      రోడ్డు విభాగిని మీద చెట్లు అందంగా పెరిగాయి. వాటికి మరింత అందం కోసం కత్తిరింపులు. మనుషుల వెంట్రుకల కత్తిరింపులు. గొర్లకి కత్తిరింపులు. క్షణంలో మూడు శరీరాలు బయటికి ఎగిరిపడ్డాయి. మిగిలినవి కార్లోనే....

* * *

      మొదటిసారి గాలిలో ప్రయాణం. సంతోషంగా ఉన్నా ఏదో బెరుకుతనం. ఎయిర్‌హోస్టెస్‌లని చూడటం మొదటిసారి. కొందరు పాస్‌పోర్ట్‌ పేజీల మధ్యలో బోర్డింగ్‌ పాస్‌ ముక్క ఇంకా చేతుల్లోనే పట్టుకుని ఉన్నారు. కిటికీ పక్క సీట్లు వచ్చినవారు ఆసక్తిగా బయటికి చూస్తున్నారు. బెల్టులు పెట్టుకోవడానికి కొంచెం అటూ ఇటూ కుస్తీపడి చివరికి ఎయిర్‌హోస్టెస్‌ సహాయంతో బిగించుకున్నారు. కుర్చీలని నిటారుగా చేసుకున్నారు. 
      విమానం నెమ్మదిగా రన్‌వేపై పాకుతూ ఊపందుకుని భూమి నుంచి మూడుగంటల సెలవు తీసుకొని ముప్పై అయిదు వేల అడుగుల ఎత్తులో గగనతలంలో స్థిరపడి దుబాయి వైపు చేపలా ఈదుతూ పోతోంది. 
      ‘‘మొత్తానికి మనం దుబాయ్‌లో పడ్డట్టేరా. ఎన్నేండ్ల సంది ఎదిరి చూసినమ్రా, ఈ ఘడియ కోసం’’ పక్కనే కూచున్న సాయన్నతో భూమయ్య. 
      ‘‘నిజమే కదరా భూమా? హవాయ్‌ జాజ్‌లనే కూసున్నం కదా. ఒకసారి గిచ్చురా’’ నమ్మశక్యంకాని సాయన్న.
      ‘‘మనోళ్లు ఈపాటికి ఇండ్లల్లకు చేరుకునుంటరా? రాత్రిపూట పోవుడు’’ చింతతో భూమయ్య.
      ‘‘మనం లోపలికి రాంగనే వెంటనే పోరురా. కొంతసేపు అటుఇటు తిరుగతర్రా. ఛాయ తిండి దుకాణాలని, ఏర్‌పోర్ట్‌ని, అచ్చేవారిని, పోయేవారిని చూసిపోతార్రా. గివన్ని సూసెతందుకే మనెంబడి బలగం అస్తర్రా. మనం గిట్లవోతెనే ఆల్లకు అచ్చే మోఖా దొరుకుతది? అందరు కలిసొచ్చిండ్రు. కలిసే వోతరు. ఇంటికి చేరుకున్నంకనే వాళ్లకు అస్సలు పరేషాండ్లురా’’ సాయన్న.
      ‘‘ఎట్లుంటరో ఏమో? అన్ని పనులు ఆల్లే చేసుకోవాల. మనమేమో వేరొల్లకు పనిచేసేందుకు దుబాయ్‌ పోతుంటిమి. నాకు పిల్లలసదువుది పరేషాన్‌ ఉన్నదిరా. తల్లికి ఇనర్రా. ఆగమైపోతరేమో అని భయంగా ఉన్నదిరా. మా అవ్వనానల గారబం ఎక్కువరా. సార్లేమో మా పిల్లలు మంచిగా సదువుతరని మెచ్చుకుంటరు’’ భూమన్న.
      ‘‘మంచిగా సదుకుంటరంటున్నవ్‌. ఇంకేం పరేషాన్‌ రా?’’ సాయన్న. 
      ‘‘బిడ్డ మూడో తరగతిరా. దానిది ఏ లొల్లి లేదు. పొల్లడు ఏడో తరగతికచ్చిండు. షోకులు బాగర. విరాట్‌ కోలి కటింగ్‌. ఎవ్వల్ల మాటినడు. మొండి. అచ్చేముందు హెడ్‌ మాస్టర్ని కలిసిన, మావోని మీద ఓ కన్ను ఉంచుమని. అయితే ఒక మాటన్నడుర నాతోని. గదే పీకుతుంది’’ 
      ‘‘ఏం మాటరా...?’’ సాయన్న. 
      ‘‘తండ్రులు దుబాయ్‌ వోయిన ఇండ్లల్ల పోరగాండ్ల ఆగమెక్కువ’’ అన్నడురా. ‘‘తల్లులకి సదులేకపాయే. మీరు దుబాయ్‌ వోయి మస్తుగా కమాయిస్తరనుకుంటరు. పిల్లలు మాట ఇనకుంట అయిపోతరు’’ గీ మాటలిన్నప్పటి సంది దుబాయ్‌ ఎందుకు వోతున్నమనిపిస్తుందిరా. ఆల్లు సదుకోకుంటే మన సంపాదన ఎందుకు? మనలెక్క కూలీలైపోతర్రా’’ భూమన్న. 
      ‘‘కొడుక్కి బుదిరికిచ్చి చెప్పిండ్రా మీరు మరి?’’
      ‘‘చెప్పినం. నేను నా పెండ్లాం కొడుకుతో కూసోని బాగసేపు చెప్పినం. నాకు అది తీస్కరా, ఇది తే అంటడుగాని సదు మాటెత్తడు. పెండ్లాంకు పెద్ద పరేషాన్‌. నేనెటన్న వోంగనే బండి (మోటర్‌ సైకిల్‌) తీస్తడట. ఇప్పుడు పొల్లన్ని ఆపుడు నాతోని గాదంటది. ఎవుసాయం పని ముట్టడు. తోటదిక్కు వోడు. ‘అచ్చినంక పొల్లగాన్ని గిట్లచేసినవని నన్ననకు’ అన్నదిరా నా పెండ్లాం’’ భూమన్న.  
      ‘‘హెడ్‌మాస్టర్‌కు బయపడ్తడు. ఆయన్నే బతిమాలిన. మంచిగా సదుకొని బుద్ధిగా ఉండేటట్టు సూడు సార్‌ అన్న. నెలకోసారి ఫోన్‌ చేస్తా సార్‌ అని చెప్పిన. నా పెండ్లాం నంబర్‌ ఇచ్చిన. పొల్లడు ఏమన్న గడ్‌బడ్‌ చేస్తే తల్లికి ఫోన్‌ చెయ్యుండ్రి అని చెప్పిన’’ భూమన్న కొనసాగించాడు. 
      ‘‘ఫికర్‌ వడకు. నేను సూసుకుంటా పో. అచ్చేటప్పుడు ఒక మంచి బాటిల్‌ పట్టుకరా అని ఆశగా అడిగిండు’’ 
      ‘‘మంచిది సార్‌. మర్సిపోను. పోరన్ని ఆగం కానియ్యకుండ్రి’’ నాతోని అయినకాడికి చేసినరా సాయన్న.  
      ఎయిర్‌హోస్టెస్‌ సేవలనారంభించింది. చేప ఆకాశంలో ఈదుతూనే ఉంది.
      ఇంకోచోట రాజలింగం, చిన్నయ్యల సంభాషణ సాగుతోంది. మరో చోట మరో ఇద్దరు. ఎప్పటికీ కనుమరుగవ్వని కష్టాలు, నిత్యం ఊటలా పుట్టుకొచ్చే కొత్త సవాళ్లు. తల్లిదండ్రుల గురించి, వయసులో ఉన్న భార్య గురించి, కడుపులో పెరుగుతున్న శిశువు గురించి, పిల్లల చదువుల గురించి, అప్పుల గురించి, పెరిగే వడ్డీల గురించి, వ్యవసాయం గురించి, మోటార్‌ పంపుల గురించి, ఎడ్ల గురించి, బర్రెల గురించి, మేకల గురించి... ఎన్నో... మరెన్నో ఆలోచనలు. మాతృదేశంలోని అన్ని నిరాశలకి ఆశాకిరణం దుబాయ్‌. బాయ్‌ బాయ్‌ ఇండియా. వెల్‌ కం టు దుబాయ్‌.

* * *

      గుప్పెడు మనసు. కనపడని సొగసరి. అదిచేయించే పనులు అన్నీ ఇన్నీ కావు. మంచి పనులు. చెడ్డ పనులు. క్రూరమైన పనులు. అంతుచిక్కని రహస్య లోకమది. ఆలోచనల భాండాగారం. మానవాళిని మాయచేస్తూ నియంత్రిస్తూనే ఉంటుంది. మనసుల్లోకి తొంగి చూడలేం. మాయామర్మాలని కనిపెట్టలేం. తియ్యగా మాట్లాడే నోటికి పూర్తి వ్యతిరేక రీతిలో ఆలోచనలు మనసులో గూడుకట్టుకుని ఉండే చిత్రమైన మనిషి దేహం.  
      కాంతం భార్యపై కన్ను వేశాడొకడు. వాడెవడో ఆమెకు తెలియదు. ఆమెకి మాత్రం తెలుసు తనకి ఒంటరితనం, దీర్ఘకాల విరహం సవాలుగా నిలుస్తుందని. కాంతాన్ని బతిమిలాడింది, ఏడాది తర్వాత దుబాయ్‌ వెళ్లమని. ఒంటరిగా ఉండలేనంది. కుదరదన్నాడు. ఇప్పటికే ఆలస్యమయ్యింది, వెళ్లాల్సిందే అన్నాడు. 
      భూమన్న భార్య నంబర్ని హెడ్‌ మాస్టర్‌ తన సెల్‌ఫోన్లో సేవ్‌ చేసుకున్నాడు. పిల్లాడి చదువు వంకతో ఆమెతో మాట్లాడ్డానికి పన్నాగం పన్నుతున్నాడు.  
      అప్పులిచ్చేవారు దుబాయ్‌ పోవడానికి కలలుకంటున్న వారి కొత్త జాబితా తయారు చేసుకుంటున్నారు. 
      కాంతం తల్లి తన కొడుకు ఉద్యోగంలో చేరి ప్రతినెలా డబ్బులు పంపుతున్నట్లు కలలు కనడం మొదలుపెట్టింది. కూతురు పెళ్లి కోసం దుబాయి నుంచి బంగారం తెమ్మన్న విషయాన్ని కూడా మర్చిపోలేదు. 
      హెడ్‌ మాస్టర్‌కి ఎలాగైనా మంచి బాటిల్‌ తీసుకుపోవాలని భూమన్న. కొడుకు చదువు కోసం తానిచ్చే చిన్న కానుక అది.   
      చిన్న కార్లో మనసున్న మనుషులు... పెద్ద కార్లోనూ మనసున్న మనుషులే... ఆర్టీసీ బస్సుల్లోని వారికీ మనసులున్నాయి... వేరే వేరే ఆలోచనలు.

* * *

      ఆర్నెల్ల తర్వాత కూలి పనివాడిగా వెళ్లిన సాయన్న బిల్డింగ్‌ నిర్మాణంలో పనిచేస్తున్నపుడు ప్రమాదం జరిగిందని తెలిసింది. ప్రాణానికి అపాయం లేదట. ఆ విషయం తెలిసి అందరూ కుదుటపడ్డారు. తర్వాతి సమాచారంలో కాలు విరిగిందని తోటివారు ఫోన్లో చెప్పారు. వాట్సప్‌లో కాలి ఫొటో పంపారు. సాయన్న భార్య గుండెలు బాదుకుంటూ శోకాలు మొదలుపెట్టింది. వచ్చే కష్టాల లిస్టుని ఏడుపులో కలిపింది. సంసారం ముందుకెట్లపోతుందో తనకు స్పష్టంగా కనబడుతోంది. 
      లక్ష్మీ కాంతంకి గొర్రెలని మేపేపని ఇచ్చారు. జీతం తక్కువ. ఆర్నెల్ల తర్వాత అసలు పని ఇస్తాం అన్నారు. చేసేది లేక రోజూ ఉదయం వెళ్లి పన్నెండు గంటలు పనిచేసి ఎనిమిది మంది ఉండే ఓ గదిలోకి చేరుకుంటున్నాడు. ఇంటికి ఫోన్‌ చేయాలన్నా భయమే. ఇంటి నుంచి కాల్‌ వస్తే కూడా భయమే. తల్లికి నిజాలు చెప్పకున్నా వేరే వాళ్ల ద్వారా తెలిసిపోయాయి. గుండె పిండినట్టయింది. 
      ఓరోజు తల్లితో అన్నీ చెప్పి బాగా ఏడ్చాడు. తల్లి మనసు కొట్టుకుంది. ఓదార్చింది. ధైర్యం నింపింది. ‘‘పరేషాన్‌ గాకురా. ఉండబుద్ధి గాకుంటే వాపస్‌ రారా’’ అని చెప్పింది. ఫోన్లో కొడుకుతో మాట్లాడి ఇంటి బయటికొచ్చింది. ‘‘థు..’’ అని కాండ్రించి ఉమ్మింది. మరోసారి గట్టిగా దీర్ఘంగా కాండ్రించింది. నాలుగడుగులేసి ‘‘థు..థు..’’ అంటూ ‘థు’బాయ్‌ మీద మన్నువడ అని పదేపదే అనుకుంటూ పేడ తీయడానికి కొట్టంవైపు అడుగులేసింది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam