అనగనగా ఓ రాజు కథ

  • 916 Views
  • 16Likes
  • Like
  • Article Share

    రమ ఇరగవరపు

  • హైదరాబాదు ivramadevi@gmail.com
రమ ఇరగవరపు

ప్రపంచీకరణ ఎన్నో జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. బంధాల్ని, అనుబంధాల్ని విచ్ఛిన్నం చేస్తోంది. రాజు కూడా దాని కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న ఒక సామాన్యుడే. ఇలాంటి వారికి మనం అందించాల్సిన భరోసా ఏంటి?
తల
గట్టిగా విదిలించా, ఆలోచనల్లోంచి రాజుని తరిమేద్దామని! సాధ్యం కాలేదు. ఉదయం నుంచి ఏ పని చేస్తున్నా రాజు, అతని కుటుంబం నా ఆలోచనల్లో తిష్ఠ వేసుక్కూర్చుంది. హాల్లోని సోఫాలో కూర్చున్న అత్తగారి వైపు చూశాను, వంటింట్లోంచి. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకుని ఉన్నారు. ఆమె కూడా నాలాగే ఆలోచనలతో సతమతం అవుతున్నారన్నమాట. ఆరోజు ఉదయం రాజు వచ్చి వెళ్లిన దగ్గర నుంచి మా పరిస్థితి అంతే. మా అత్తగారు రోజు మొత్తంలో ఓ నాలుగు సార్లన్నా రాజు చరిత్రని మొదటి నుంచి నాకు చెప్పుకొచ్చేవారు. అలా చెబుతున్నప్పుడు ఒక్కోసారి మధ్యమధ్యలో ఏదైనా మర్చిపోతే, అది గుర్తొచ్చాక, మళ్లీ నా దగ్గరికొచ్చి ఒకసారి ఏమయ్యిందో తెలుసా... అంటూ రాజు గురించి మొదలుపెడతారు. నేను ఊ కొడుతూ వింటాను. మధ్యలో ఈ ఇంటికొచ్చిన నన్నే రాజు మాటలు ఇంతగా కదిలించాయంటే, మరిక ఆమెను ఆ మాటలు ఎంత ఆవేదనకు గురి చేసుంటాయో పాపం! 
      రాజుకి మా కుటుంబానికి దగ్గర దగ్గర పాతికేళ్లకి పైగానే అనుబంధం. కుటుంబం అంటే నేను, మావారు మాత్రమే కాదు, మా బావగార్లు, ఆడపడుచులు కూడా. అందరం ఇంచుమించు పక్కపక్క ఇళ్లల్లో ఉంటాం. ఒక రకంగా ఉమ్మడి కుటుంబం అనే చెప్పొచ్చు. ఆడా మగా అందరం ఉద్యోగస్థులం. వేర్వేరు ఇళ్లల్లో ఉన్నా సాయంత్రం అయ్యేసరికి ఒక చోట చేరతాం. అయిదు కుటుంబాలు ఒక చోటచేరితే పిల్లా పాపా అల్లరి, పెద్దల కబుర్లతో సాయంత్రాలు ఇట్టే గడచిపోతాయి. కబుర్లతో సేద తీరి అందరం ఎవరిళ్లకి వాళ్లం చేరతాం. పండగలొచ్చినా, పేరంటాలొచ్చినా అందరం ఒకే ఇంట్లో గడపటం, అనారోగ్యాలు, అవసరాల్లో ఒకరికొకరుగా నిలబడటం.. ఒక్క మాటలో చెప్పాలంటే అనుబంధాల్లోని ఆనందాన్ని ప్రతి క్షణం రుచి చూస్తుంటాం. ఉమ్మడి కుటుంబం ఇచ్చే భరోసాని, ఆత్మవిశ్వాసాన్ని రుచి చూడాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. ఉమ్మడి కుటుంబం ఉంటే ఉద్యోగంలో అయినా జీవితంలో అయినా ఏవీ సవాళ్లుగా కనిపించవు, ఎందుకంటే వాటిని ఎదుర్కోవటానికి మన కుటుంబం తోడుగా ఉంది కదా అన్న ధైర్యం. 
      రాజు గతంలో మేమూ ఉన్నాం, ఆ మేము ఇప్పటికి మేముగానే ఉంటే రాజు మాత్రం నేనులోకి వచ్చేశాడు. అదే మా బాధ.
      నేను ఇరవై మూడేళ్ల క్రితం కొత్త పెళ్లికూతురుగా అడుగుపెట్టగానే మొదట పెద్దబావగారి ఇంట్లో గృహప్రవేశం చేయించి, ఓ వారంలో ఆ ఇంటి కిందనే చిన్న పోర్షన్‌లో పాలు పొంగించమన్నారు. కొత్త సంసారానికి సామాన్లు కొనాలనుకునే లోపు అందరూ కలిసి కొనేసి ఇల్లు సర్దిపెట్టి ఇచ్చారు. మా అత్తగారు ఒక చిన్న చీటీలో సరుకుల లిస్టు రాసి ‘‘రాజు వస్తాడు. ఈ చీటీ ఇవ్వు. అన్నీ తెచ్చిపెడతాడు. ప్రస్తుతం ఒక నెలకి సరిపడా సరుకులు డబ్బాల్లో పోసి పెట్టాను. అయిపోతే రాజుకి చెప్పు, తెస్తాడు’’ అన్నారు. అదిగో అప్పుడు మొదటిసారి విన్నా రాజు పేరు.
      మా వీధి చివర అతని కొట్టు. ఏ వస్తువు లేకపోయినా రాజు కొట్టుకెళ్లి తెచ్చుకోవటం, అతను ఒక పుస్తకంలో రాసుకోవటం, జీతాలు రాగానే అతనికి డబ్బులివ్వటం మా అయిదుగురి ఇళ్లలోనే కాదు చుట్టుపక్కల అందరికీ అలవాటు. చిన్న కొట్టే అయినా దొరకని వస్తువంటూ ఉండదు. ఒకవేళ తన దగ్గర లేకపోయినా లేదని చెప్పడు. ఒక గంటలో తెచ్చిస్తా అంటాడు. ఉప్పు నుంచి కూరగాయలదాకా రాజే ఆధారం మాకు. ఆవకాయ సీజన్‌ వస్తే మా అత్తగారు ఆవపిండి, ఉప్పు, కారం అంటూ రాజుని పరుగులు పెట్టించేవారు. దంచిన ఉప్పు, కారం, ఘాటైన ఇంగువ అంటూ రాజు కూడా నాణ్యమైన సరుకులు ఇచ్చేవాడు.
      ఇక మా మరిది పెళ్లిలో మాతో పాటు రాజు కూడా హడావుడి పడిపోయాడు. విస్తరాకుల నుంచి తమలపాకుల దాకా దేనికీ బయటికి వెళ్లే అవసరం లేకుండా చేశాడు. ఆ పెళ్లి పది రోజులూ ఇంట్లో నిత్యం రాజు నామస్మరణే. కారం లేదు... రాజు కొట్టుకెళ్లండి. కరివేపాకు కావాలి... రాజుకి చెప్పండి. అన్నిటికి ఒకటే మాట, రాజు.. రాజు. చుట్టాలతో పాటు రాజు కుటుంబం కూడా భోజనాలు చేసేది. ఆఖరున రాజుకి, వాళ్ల అమ్మానాన్నలకి కూడా బట్టలు పెట్టేవాళ్లం.
      మా ఇంట్లోనే కాదు ఆ వీధిలో ఉన్న అందరిళ్లలో రాజు స్థానం ఇంచుమించు అదే. అందరికీ తల్లో నాలుకలా మెలిగేవాడు. సరుకులు ఇవ్వటానికి వస్తే ఓ బంధువులా నట్టింట్లో కూర్చుని కబుర్లు చెప్పేవాడు. మా అత్తగారితో కుటుంబ విషయాలు, మా వారితో దేశ రాజకీయాలు చర్చించేవాడు. వాళ్లింట్లో జరిగిన, జరుగుతున్న విశేషాలని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చేవాడు. 
      ఇంతకీ రాజు కుటుంబం అంటే... అప్పటికి అతనికి పెళ్లి కాలేదు. వాళ్ల అమ్మానాన్న, ఇద్దరన్నయ్యలు, వాళ్ల భార్యలు, పిల్లలు. చిన్న ఇంట్లో ముందర ఒక కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇద్దరు వదినలు, అమ్మా నాన్న అతనికి సాయంగా కొట్లో ఉండేవారు, ఒకరి తర్వాత ఒకరుగా. అన్నయ్యలిద్దరూ కొంచెం అమాయకులు. వాళ్లకి రాజు ఎంత చెబితే అంత. ఆఖరివాడు అయినా కుటుంబ భారాన్ని భుజాన వేసుకుని అన్న పిల్లల బారసాలలు, అక్క పిల్లల అన్నప్రాసనలు అంటూ హడావుడి పడేవాడు. ఎప్పుడూ మా ఇంట్లోలా వాళ్ల ఇంట్లో కూడా ఏదో ఒక వేడుక ఉంటుండేది.
      వాళ్ల అనుబంధాలు కూడా ముచ్చటగా ఉండేవి. ఎవరిని ఏమడిగినా మా రాజుని అడిగి చెబుతాం అంటూ ఒకటే సమాధానం. చిన్నవాడు అయినా కుటుంబ భారాన్ని మోసేవాడికి ఇచ్చే గౌరవం కనిపించేది ఆ మాటల్లో. అయితే రాజు ఆ భేషజాలు ఏమీ లేకుండా మా పెద్దన్నయ్యతో ఒక మాట చెప్పి చేస్తాను అంటుండేవాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి రాజు పెళ్లి, పిల్లలు... మొత్తానికీ మా జీవితాలు రాజు కుటుంబంతో ముడిపడి సాగిపోతుండేవి.
      కొన్నాళ్లకి మా అవసరాల ప్రాధాన్యత మారటం మొదలైంది. ఆఫీస్‌ నుంచి వస్తూ కొత్తగా వచ్చిన మాల్స్‌ దగ్గర సరదాకి ఆగటం, ఏదో ఒకటి కొందామని వెళ్లి పప్పులు, బియ్యాలు కూడా కొని తెచ్చుకోవటం మొదలుపెట్టాం. నెమ్మదిగా ప్రతి చిన్నదానికీ రాజు కొట్టుకి పరిగెత్తడం తగ్గింది. తాజాగా ఉంటాయంటూ ముందు కొన్ని, ఆ తర్వాత అన్నిటినీ ఆ మాల్స్‌లో కొనటం మొదలుపెట్టాం. 
      పిల్లలూ మేమూ కలిసి సరదాగా ఆ మాల్స్‌కి వెళ్లటం, ట్రాలీ తోసుకుంటూ కంటికి కనిపించినవన్నీ అందులో వేస్తూ వేలల్లో బిల్లు కడుతూ నెమ్మదిగా రాజు కొట్టుకు దూరమయిపోయాం. రాజు వచ్చి ‘‘సరుకుల లిస్ట్‌ ఇస్తారా?’’ అంటే ‘‘ఇప్పుడేమీ లేవులే రాజూ, ఉన్నప్పుడు ఫోన్‌ చేస్తాంలే’’ అనటం మొదలుపెట్టాం. ఎప్పుడో ఒకసారి రాజు కొట్టుకి వెళ్లేవాళ్లం, ఏ ఉప్పు కోసమో, కరివేపాకు కోసమో. 
      దీనికి తోడు మా వీధికి ఆ చివర మెరిసిపోతూ మరో పెద్ద మాల్‌ వచ్చాక రాజు కొట్టు మరీ వెలవెలబోయింది. చుట్టుపక్కల అందరూ పెద్ద సరుకులకి ఆ మాల్‌కి వెళ్లటం మొదలుపెట్టారు. ఏవో చిన్న చిన్న అవసరాలకి రాజు కొట్టుకు వెళ్లేవారు. నెమ్మదిగా మా జీవితాల్లోంచి రాజు వెళ్లిపోయాడు. ఎప్పుడో రోడ్ల మీద కనిపిస్తే పలకరింపులు, యోగక్షేమ విచారణలు ఉండేవంతే. 
      కానీ, మధ్య మధ్యలో రాజు వచ్చి ‘‘మా అక్క కూతురు పెళ్లి’’ అంటూ, ‘‘మా అన్న కొడుకు పంచెల ఫంక్షన్‌’’ అంటూ ఓ కార్డు ఇచ్చేవాడు. మేము ‘‘సంతోషం’’ అనేవాళ్లం. కానీ, ఆ రోజు వెళ్లటం మర్చిపోయేవాళ్లం. రాజుకి మా జీవితాల్లో ఇప్పుడు అంత ప్రాధాన్యత లేదు కదా! 
      మళ్లీ ఇన్నేళ్లకు రాజు ఈ ఆదివారం వచ్చి తలుపుకొట్టాడు. ఆశ్చర్యపోయినా ఆనందంగానే పలకరించాం మావారూ, నేనూ, మా అత్తగారూ. 
ఆ కబుర్లూ ఈ కబుర్లూ అయ్యాక ‘‘సార్‌ కొన్ని సామాన్లయినా లిస్ట్‌ రాసి ఇవ్వండి. తెచ్చిస్తాను’’ అన్నాడు. 
      మా వారు నా వైపు చూశారు. నేను ఇబ్బందిగా నవ్వాను. 
      ‘‘ఇప్పుడన్నీ వున్నాయి రాజూ, అవసరమైతే ఫోన్‌ చేస్తాం. నెంబర్‌ ఇవ్వు’’ అన్నాను పేలవంగా ఓ నవ్వు నవ్వి.
      ‘‘చిన్న చిన్నవి అవసరం వున్నా చెప్పండి మేడం. తెస్తాను’’ అన్నాడు. 
      నా ఇబ్బందిని గమనించిన మా అత్తగారు మాట మారుస్తూ ‘‘అవునూ, మీ పెద్దన్నయ్యకి మనవడా మనవరాలా?’’ అన్నారు. 
      ‘‘మనవడే అమ్మా! వాడికి రేపు వారం అక్షరాభ్యాసం. మేం వెళ్లాలి’’ అన్నాడు. 
      ‘‘అదేంటి!’’ అన్నారు అత్తగారు.
      ‘‘మా అన్నలు ఇప్పుడు మాతో కలిసి లేరమ్మా. నాలుగేళ్లవుతోంది వారంతా వేరు కాపురాలు పెట్టి. ఇప్పుడు పెద్దాయన విజయవాడలో అత్తగారింటికి దగ్గరలో ఓ మాల్‌లో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. చిన్నాయన ఇక్కడే బాలానగర్‌లో కాంట్రాక్టర్‌ దగ్గర పనికి కుదిరాడు. అందరం తలో దారి అయిపోయాం’’ అన్నాడు. 
      ‘‘ఆస్తి తగాదాలా? తోటి కోడళ్ల గొడవలా?’’ మా అత్తగారి ప్రశ్న. 
      ‘‘కాదమ్మా. ఇల్లు గడవక పొట్ట చేత పట్టుకుని బతకడం కోసం విడిపోయాం’’ అన్నాడు. 
      ఒక్కసారిగా ముగ్గురం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. ఆ తరువాత రాజు చెప్పిన విషయాలే ఇప్పుడు మా ఆలోచనలకి కారణం. 
      మాలాగే అందరూ మాల్స్‌లో కొనడానికి అలవాటుపడి రాజు కొట్టుకి వెళ్లటం తగ్గించారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వచ్చాక అప్పుడప్పుడూ అయినా వచ్చే వాళ్లు కూడా రావటం మానేశారట. దాంతో నెమ్మదిగా కొట్టు మీద సంపాదన తగ్గిపోయింది. తప్పనిసరై ఆర్థిక భారాన్ని తగ్గించుకోటానికి అన్నదమ్ములు వేరే పని వెతుక్కుంటూ ఎవరి కుటుంబంతో వాళ్లు వెళ్లాల్సి వచ్చిందట.
      ‘‘ఉమ్మడి కుటుంబం విడిపోయింది. ముసలి తల్లితండ్రులు అప్పుడప్పుడూ వచ్చే పిల్లలు, మనవల కోసం ఎదురు చూస్తూంటారు. ప్రాణాలు దూరం అయిపోయాయి సర్‌. ఉదయం లేచిన దగ్గరి నుంచి ఒరేయ్‌ రాజు, ఏమయ్యా రాజు అంటూ మా అన్నలు, వదినలు, ఒకటికి పదిసార్లు పిలిచేవాళ్లు. ఆ పిలుపులు చెవిన పడక ప్రాణం అల్లాడిపోతోంది. ఇప్పుడు మా ఆవిడకి సుస్తీ చేసినా, ఇంట్లో ఇంత ముద్ద ఉడికించే దిక్కులేక హోటల్‌కి పరిగెత్తుతున్నాం. రాత్రి భోజనాల దగ్గర నాలుగు కంచాలు పెడుతుంటే కళ్లలో నీరు చిమ్ముతోంది. ఇప్పుడు నాకర్థం అవుతోంది సర్, మేము తినే భోజనం కాదు... అప్పుడు మేం పంచుకున్న ప్రేమలే మాకు ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చాయని. కానీ ఏం చేస్తాం. బతకలేక విడిపోయాం. కడుపు నింపుకోటానికి మా గుండెల్ని ఖాళీ చేసుకున్నాం. వస్తా సార్‌. ఈ మధ్య సుగర్‌ వచ్చింది. టైంకి ఇంత తినాలి’’ అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు రాజు. 
      ఆ మాటలు విన్నాక నాకైతే ఏదో, నేరం చేసినట్టు అనిపించింది. ఆ కుటుంబం విడిపోవటానికి పరోక్షంగా నేను కూడా ఓ కారణం కదూ! మన సౌకర్యాలు ముఖ్యమనుకుంటూ, ముందడుగేస్తున్నామని అనుకున్నాం. కానీ, ఆ అడుగు ఓ ఉమ్మడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటానికి కారణమయ్యింది. పెద్ద పెద్ద మాళ్ల ఆకర్షణలో, ఆన్‌లైన్‌ షాపింగ్‌ మాయలో పడి మన చుట్టు పక్కల వున్న రాజు కొట్టు లాంటి వాటిని మర్చిపోతున్నాం. కూరలు, సరుకుల నుంచి బట్టల దాకా అన్నింటికీ మాళ్లకే వెళ్తున్నాం. ఒకప్పుడు దర్జాగా సొంత కొట్లో యజమానులుగా వున్న రాజు అన్నలు ఇప్పుడు కూలీలుగా మారారు. నెమ్మదినెమ్మదిగా మన సమాజంలో ఇలాంటి చిన్న జీవులు వాళ్ల స్వాతంత్య్రాన్ని, జీవనాధారాన్ని కోల్పోతున్నారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందుకు అందరం బాధ్యులమే. మన రూపాయి ఒక కుటుంబం ఆకలి తీర్చటానికి కాకుండా ఒక పెద్ద వ్యాపారవేత్త బ్యాంకు బ్యాలన్స్‌ పెరగటానికి ఉపయోగపడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఒకరోజు అది మనల్ని కూడా మింగేస్తుంది., ఎందుకంటే మనం కూడా ఆర్థిక చట్రంలో ఎక్కడో అక్కడ నిలబడ్డ వాళ్లమే. ఈ రోజు వాళ్లు, రేపు మనం. 
      వ్యాపారంలో ఆప్యాయత కలిపి మాలో ఒకడిగా ఉన్న రాజు గురించి మేం ఆలోచించకపోతే ఎలా? 
      గబ గబా సరుకుల లిస్టు రాసి మా అత్తగారి చేతిలో పెట్టా. కళ్లు విప్పి చూశారు. ఆమె మనసులో కోరిక కూడా అదే అని అర్థమయింది. చేతుల్లోకి ఫోన్‌ తీసుకున్నా, నా ఆలోచనల్ని మా తోడికోడళ్లతో చెప్పటానికి. ఇది రాజు కుటుంబానికి ఎంత వరకు సాయపడుతుందో తెలియదు కానీ, నాకైతే తృప్తిగా వుంది. మళ్లీ మా జీవితాల్లోకి రాజు వస్తాడు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam