చివరికి మిగిలింది...

  • 971 Views
  • 59Likes
  • Like
  • Article Share

    జ్యోతి సుంకరణం

  • పెందుర్తి, విశాఖపట్నం
  • 9848407315
జ్యోతి సుంకరణం

కాలం... బాధ్యతల బరువులు మోపుతుంది. లక్ష్యాల వెంట పరుగులు పెట్టిస్తుంది. ఆ పందెంలో బంధాలు, అనుబంధాలు వెనక్కి వెళ్లిపోతాయి. తీరా చూస్తే ఆఖరి మజిలీలో మిగిలేది తీరని వేదనే! శ్యామల పరిస్థితీ అదే!
నిద్ర
పట్టక అసహనంగా పక్క మీద అటూ ఇటూ దొర్లి ఇక పడుకోలేక లేచి కూర్చున్నాను. చుట్టూ చూశాను. డిమ్‌లైటు వెలుగులో విశాలంగా ఉంది గది, భయంకరమైన నిశ్శబ్దాన్ని ఆవరించుకుని. గోడకున్న గడియారం వైపు చూశాను. టిక్‌.. టిక్‌.. టిక్‌మంటూ అది చేసే శబ్దం నిశ్శబ్దాన్ని మరింత పెంచేస్తోంది. పరిశుభ్రమైన గది, మెత్తటి పరుపు, ఏసీ చల్లదనం వీటన్నిటితో పాటూ వేడిపాలు, ఒక నిద్రమాత్ర.. ఇవేవీ నాకు ప్రశాంత నిద్రని ఇవ్వలేకపోతున్నాయి సరికదా మరింత ఇబ్బంది పెట్టేస్తున్నాయి.
      గొంతు పిడచకట్టుకుపోయినట్లై మంచినీళ్ల కోసం చూశాను. ఖాళీ వాటర్‌ బాటిల్‌ వెక్కిరించింది. ‘మైసమ్మా’! పిలవబోయి ఊరుకున్నాను. నాకు తెలుసు, పిలిచినా దండగే అని. నెమ్మదిగా లేచి హ్యాండ్‌స్టిక్‌ అందుకుని గది బయటికొచ్చాను. హాల్లో మైసమ్మ గుర్రుపెట్టి నిద్రపోతోంది. వేళకన్నీ అందిస్తూ ఒంటరిగా ఉన్న నన్ను కంటికి రెప్పలా చూసుకోవడం కోసం దూరాన ఉంటున్న నా పిల్లలు ఆమెని ఏర్పాటు చేశారు. పగలంతా నన్ను బాగానే చూసుకుంటుంది. రాత్రిళ్లు మాత్రం తనని నేను చూసుకోవాలి. నిద్రలోకి జారుకుందంటే భూకంపం వచ్చినా ఆమెకి తెలియదు. 
      నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి ఫ్రిజ్‌లో వాటర్‌ బాటిల్‌ తీసుకుని తాగి మళ్లీ నా గదిలోకి వచ్చేశాను. టైం పన్నెండు. అకస్మాత్తుగా గుర్తొచ్చింది, తేదీ అక్టోబర్‌ ఇరవై. ఆ రోజు చరణ్‌ పుట్టినరోజు. ఫోన్‌చేసి మాట్లాడితే బావుణ్ను అని ఫోన్‌ దాకా వెళ్లాయి చేతులు. కానీ, ఆగిపోయాను. వేళ కాని వేళలో చేస్తే గాభరా పడతారని. 
      బొద్దుగా బూరెల్లాంటి బుగ్గలతో చిన్నప్పుడు చరణ్‌ ఎంత ముద్దొచ్చేవాడో! పుట్టినరోజు జరుపుకోవడమంటే ఎంత సంబరపడేవాడో! చూడాలనిపిస్తోంది వాణ్ని. మళ్లీ మంచం మీద నుంచి లేచి లైటు వేశాను. షెల్ఫ్‌లో చీరల అడుగున దాచిన ఫొటో ఆల్బమ్‌ తీసి ఒక్కో ఫొటో చూస్తుంటే అప్పటి రోజులన్నీ కళ్లముందు మెదిలాడుతున్నాయి. 

* * *

      ‘‘శ్యామలా.. శ్యామలా.. రావాలి. లేటైపోతోంది’’ హాల్లోంచి అరిచాడు మోహన్‌. ‘‘ఆ ఇదిగో అయిపోవచ్చింది. వచ్చేస్తున్నా’’ బెడ్‌రూంలో బ్యాగులు సర్దుతూ సమాధానమిచ్చాను. 
      ‘‘ఇదిగో గీతా, ఈ ముందు అరలో నీక్కావాల్సిన ఇన్నర్స్‌ అవీ పెట్టాను. లోపల కొత్త నైట్‌ డ్రెస్సులుంచాను. ఇక నీ హెయిర్‌ బ్యాండ్లూ, రిబ్బన్లూ అవీ ఈ చిన్న బ్యాగులో సర్దుతున్నాను. ఇవిగోరా చరణ్, నీకోసం చాక్లెట్లు, వేఫర్లు బ్యాగులో పెట్టాను. ఇక మీ ఇద్దరికీ స్నాక్స్‌ వేరేగా సర్దాను. ఇంకా ఏదైనా అవసరమనిపిస్తే ఫోన్‌ చెయ్యండి. పదండి ఇక టైం అయిపోతోంది’’ అంటూ రెండు బ్యాగుల్నీ రెండు చేతులతో పట్టుకుని హాల్లోకి వస్తుంటే... 
      ‘‘అమ్మా.. ప్లీజ్‌ ఇంకో రెండు రోజుల్లో తమ్ముడి పుట్టినరోజు ఉంది కదా! దాన్ని ఇక్కడే జరుపుకుని తర్వాతి రోజు వెళ్లిపోతాం హాస్టల్‌కి. ప్లీజ్‌’’  బతిమాలుతూ అడిగింది పన్నెండేళ్ల మా అమ్మాయి గీత. 
      ‘‘అవునమ్మా. ప్లీజ్‌’’ పదేళ్ల చరణ్‌ కూడా అక్కకి వంతపాడాడు. 
      ‘‘లేదు లేదు. స్కూల్, హాస్టల్‌ తెరచి మూడు రోజులైనా వెళ్లకపోతే బోలెడన్ని సంజాయిషీలు ఇచ్చుకోవాలి. పదండి పదండి’’ అంటూ వాళ్లకి మరో అవకాశం ఇవ్వకుండా తొందర పెడుతూ హాల్లోకి నడిచాను. నేను వినేలా లేనని ఇద్దరూ వాళ్ల నాన్నకి చెరోవైపు చేరారు. ‘‘నాన్నా, తమ్ముడి పుట్టినరోజు అయ్యేదాకా ఇంట్లోనే ఉంటాం’’ బతిమాలింది అమ్మాయి.   
      ‘‘అవును నాన్నా. ఇంకో రెండు రోజులు ఇంట్లోనే ఎంజాయ్‌ చేస్తాం. ప్లీజ్‌’’ చరణ్‌ కూడా అన్నాడు. 
      ‘‘అయ్యో అలాగంటే ఎలా. ఈ వారం రోజుల సెలవలకే ఎంతో ఇబ్బంది అయ్యింది మాకు, మీరు ఇంట్లో ఉంటే. ఆరోజు అమ్మా నేనూ హాస్టల్‌కి వస్తాం. మీ ఇద్దరికీ బోలెడన్ని బహుమతులు పట్టుకొస్తాం. సరేనా! పదండి. మిమ్మల్ని వదిలిపెట్టి మేం ఆఫీసులకి వెళ్లేటప్పటికి చాలా లేటయిపోతుంది’’ మరో మాటకి అవకాశం లేకుండా బయటకి దారి తీశాడు మోహన్‌. 
      వాళ్లిద్దరినీ హాస్టల్లో దింపి ఆఫీసుకి వెళ్లేసరికి చాలా ఆలస్యం అయిపోయింది.
      ‘‘ఏంటి శ్యామలా.. ఈరోజింత లేటయ్యింది. బాస్‌ రెండుసార్లు వచ్చి వెళ్లారు’’ అంది పక్క సీట్లో పద్మ. 
      ‘‘ఈరోజు మా పిల్లల బడి తెరిచారు. హాస్టల్లో దింపి వచ్చేసరికి ఈ సమయం అయ్యింది’’ అన్నాను. 
      ‘‘ఓ. హాస్టల్లో దింపేశారా. అయితే నీకు కొంత తీరిక దొరుకుతుందన్నమాట. వారంగా చాలా పని మిగిలిపోయిందిగా. అదంతా పూర్తిచేసుకోవచ్చు’’ అంది పద్మ.  
      ‘‘ఆ, అవును. కానీ, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. హాస్టల్లో దింపి వచ్చేస్తుంటే వాళ్ల దిగులు మొహాలు చూసి కడుపు తరుక్కుపోతోందనుకో ప్రతిసారీ’’ అన్నాను కాస్త బాధగా. 
      ‘‘ఆ మాట నిజమే. హాస్టల్లో దింపిన ఒకటి రెండు రోజులు తప్పదు మనకా బాధ. కానీ ఏం చేస్తాం? లేచిన దగ్గరి నుంచి కాలంతో పోటీ పడాల్సినవాళ్లం. మనతో పాటు వాళ్లని కూడా ఇబ్బంది పెట్టడమెందుకు? అదే హాస్టల్లో ఉంటే వేళకి తిండి, చదువు’’ అంది పద్మ. 
      ‘‘అవును నిజమే. ఎందుకు పరిగెడుతున్నామో తెలీదుగానీ పరిగెడుతున్నాం యాంత్రికంగా. ‘కీ’ ఇచ్చి వదిలిన బొమ్మల్లా కాళ్లూ చేతులూ ఆడిస్తూ కొట్టుకుంటూనే ఉంటాం రోజంతా. ఏం చేస్తాం, తప్పదు మరి. అలసినా సొలసినా పరిగెత్తుకుంటూ పోవడమే. లేదంటే పక్కవాళ్లు మనల్ని దాటుకుపోతుంటారు. సర్లే నేనెళ్లి బాస్‌ని కలిసి మాట్లాడొస్తాను’’ అంటూ కుర్చీలోంచి లేచాను.     

* * *

      ‘‘అమ్మా.. అమ్మా.. అమ్మగారూ’’ అరుస్తోంది మైసమ్మ. 
      ‘‘అబ్బా ఎందుకలా అరుస్తావ్‌. ఏంటో చెప్పు?’’ గత స్మృతుల వల్ల చెమ్మగిల్లిన కళ్లని తుడుచుకుంటూ విసుక్కున్నాను. 
      ‘‘అమ్మా. మీరు హార్లిక్స్‌ తాగే టైం అయ్యింది. లేచి మొహం కడుక్కుంటారని’’ వినయంగా నసిగింది. 
      ‘‘కాసేపయ్యాక తాగుతాలే, ఇప్పుడు తాగాలనేం లేదు’’ అటుతిరిగి పడుకున్నా. 
      ‘‘అమ్మా హార్లిక్స్‌ తాగడం లేటయితే ఆనక మందులకు లేటు, తరవాత టిఫిన్‌కి, అన్నీ లేటయిపోతాయమ్మా’’ 
      నాకు తెలుసు తనిక నేను లేచేదాకా కదలదు. ఆమెకు అలా ‘కీ’ ఇచ్చి వదిలారు మా పిల్లలు.
      ఒక్క రెండు నిమిషాలు మంచం మీద అలాగే ఉండి లేచాను. ఇక మైసమ్మ ఇష్టం, ఏ సమయానికి ఏమిస్తే అది తాగడం, తినడం, కాసేపు టీవీ చూడటం, ఎక్కువసేపు అదిగో ఆ గోడకున్న గడియారాన్ని చూస్తూ కూర్చోవడం. ఎంత విచిత్రం, ఒకప్పుడు అదే కాలంతో పరిగెట్టలేకపోతున్నా, ఆగితే బావుణ్ను, కాసేపు ఊపిరి పీల్చుకోవచ్చు అనుకునేదాన్ని. అది కూడా ఇప్పుడు నాలాగే కాళ్లూ, కీళ్లూ అరిగి ముసలిదైందేమో. భారంగా ఒక్కో అడుగూ వేస్తోంది. 
      బెల్లం చుట్టూ చేరిన ఈగల్లా ముసిరేస్తున్నాయి ఆలోచనలు నా మెదడుని.

* * *

         ఉద్యోగాలొచ్చి, పెళ్లిళ్లై పిల్లలిద్దరూ మంచి స్థాయిలో ఉన్నారు. మా శ్రమకు ఫలితంగా మోహన్‌కి, నాకు బాధ్యతాయుతమైన పదవులు లభించాయి. ఈ బతుకు పరుగుపందెంలోనే పిల్లల పురుళ్లూ, పుణ్యాలూ కానిచ్చేశాం. 
ఒకరోజు ‘‘శ్యామలా నాకిక్కడేం బాగోలేదమ్మా. ఒకసారి మిమ్మల్నిద్దర్నీ చూడాలనిపిస్తోంది వస్తారా’’ వృద్ధాశ్రమం నుంచి అత్తగారి ఫోన్‌ రావడంతో వెళ్లాను, ఒక బ్యాగు నిండా పళ్లూ, బిస్కెట్లూ, మందులూ పట్టుకుని. కాసేపు కూర్చుని అత్తగారికి నాలుగు ధైర్యవచనాలు చెప్పాను. ఆవిడ ఇంటికి వస్తే కలిగే సాధక బాధకాలని వివరించి, తరచుగా వచ్చి చూసి వెళతానని మాటిచ్చాను. ఆవిడ దీనమైన చూపులు గుచ్చుతున్నా లెక్క చెయ్యకుండా వెనుదిరిగి వచ్చేశాను. 
      అవును మరి, ఇంకేం చేస్తాను? నాకూ నడివయసు. చిన్నా చితకా ఆరోగ్య సమస్యలున్నాయి. పైగా బాధ్యతగల ఉద్యోగం. ఎప్పుడు ఇంట్లో ఉంటానో, ఎప్పుడుండనో నాకే తెలియదు. నాకున్న తక్కువ సమయంలో ఆ మనిషిని, ఇంట్లో కన్నా అన్ని సదుపాయాలున్న ఆ వృద్ధాశ్రమంలో ఉంచడమే సబబుగా తోచింది. అలా కాలంతో పరుగులోనే రోజులన్నీ గడచిపోయాయి. నువ్వు పరిగెడతానన్నా మేం పరిగెట్టనివ్వం అని రిటైర్‌మెంట్‌ కాగితాలు చేతిలో పెట్టారు ఆఫీస్‌ వాళ్లు. రెక్కలొచ్చిన పిల్లలిద్దరూ చెరో గూటికి ఎగిరిపోయారు. రెక్కలొరిగిన పెద్దలంతా నన్ను ఒంటరిని చేసేసి కాలగమనంలో కలిసిపోయారు.  

* * *

      చెదపురుగుల్లా మెదడును తొలిచేసే ఆలోచనల నుంచి కాసేపు విరామం కోసం మా ఫ్లాట్‌ బాల్కనీలో పచార్లు చేస్తుంటాను రోజూ. ఒకరోజు ఎక్కడికో వెళ్లొచ్చిన మైసమ్మ ‘‘అమ్మా, మన వెనక అపార్టుమెంటులో ఉంటున్నారు కదా చరణ్‌బాబు గారి ఫ్రెండ్, వాళ్ల నాన్నగారికి బాగోలేదటమ్మా’’ అంది.
      ‘‘ఏమైందీ?’’
      ‘‘ఏదీ గుర్తుండదట. అన్నీ మర్చిపోతున్నారట. కూతుళ్లనీ, కొడుకుల్నీ కూడా గుర్తుపట్టడంలేదట. ఆఖరికి తిన్నదీ తాగిందీ కూడా తెలియడంలేదట. రోజు, వారం, సంవత్సరం, సమయం కూడా మర్చిపోతున్నారట’’ అని నాకు పండ్ల రసం ఇవ్వడానికి లోపలికి వెళ్లిపోయింది. 
      వెంటనే ఫోన్‌ చేసి విషయం కనుక్కున్నాను. ఆయనకి ‘అల్జీమర్స్‌’ వచ్చిందనీ, ఎవ్వరితో సంబంధం లేకుండా ఆయన ప్రపంచంలో ఆయన ఉంటున్నారనీ చెప్పారు. 
      ‘‘ఎంత అదృష్టం’’ నాకనిపించింది ఒక్కక్షణం! 
      ‘‘అమ్మా చాలాసేపటి నుంచీ తిరుగుతున్నారుగా. వచ్చి జూస్‌ తాగి విశ్రాంతి తీసుకోండమ్మా’’ లోపలి నుంచి మైసమ్మ పిలుపు.
      ‘విశ్రాంతి’ అన్న పదం వినగానే విసుగొచ్చింది. కానీ, తప్పదు. నాకున్న అనారోగ్య పరిస్థితులకి నేను విశ్రాంతి తీసుకోవాల్సిందే. ‘శరీరంలో అవయవాలన్నీ బాగుండి బుర్ర పనిచెయ్యకపోయినా ఫర్వాలేదుగానీ... శరీరావయవాలేవీ సహకరించకుండా బుర్ర మాత్రమే అద్భుతంగా పనిచెయ్యడమంత నరకయాతన ఇంకోటి ఉండదు’, లోపలికొచ్చి మంచంమీద వాలుతూ అనుకున్నాను.
      రోజులు భారంగా గడుస్తున్నాయి. నాలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోతోందీమధ్య. పిల్లలు ఫోన్‌ చేసినా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. ఏంటో పిచ్చిపిచ్చిగా ఉంటోంది. ఒకసారి పిల్లల మీద కోపం, మరోసారి మైసమ్మ మీద. ఒక్కోసారి నామీద నాకే విపరీతమైన చిరాకు. పిల్లలూ మనవలూ మనవరాళ్లూ అంతా ఉండి ఎవరూలేని, ఎవరికీ ఉపయోగంలేని జీవిగా మిగిలాను. వాళ్లు ఇక్కడికి రాలేని, నేను అక్కడికి వెళ్లి ఉండలేని పరిస్థితులని నిందించాలా? లేక జీవితంలో అన్ని మజిలీలనూ పరిగెట్టించి ఆఖరి మజిలీలో జవసత్వాలుడిగించి ఇలా నాలుగ్గోడల మధ్య బందీని చేసి క్షణమొక యుగంలా గడిపిస్తున్న ఆ దేవుడ్ని నిందించాలా? ఏమీ అర్థం కావడంలేదు.  
      ‘‘బాబూ, ఈ మధ్య అమ్మగారి పరిస్థితేమీ బావుండటంలేదు. తనలో తనే మాట్లాడుకుంటున్నారు. ఏంటని అడిగితే నా మీద చికాకు పడి అరుస్తున్నారు. సరిగా తినటం లేదు. నిద్రపోవటం లేదు. ఆ గోడకున్న గడియారం వైపు చూస్తూ గంటలు గంటలు గడిపేస్తుంటారు, మీరొకసారి వస్తే బావుంటుంది’’ ఫోన్లో మైసమ్మ చెబుతోంది.  
      అటు నుంచి ఏమన్నారో మరి - ‘రేపటికల్లా వచ్చేస్తామన్నారా..!’ నా మనసులో ఒక ఊహ!
      అంతే నాలో ఉత్సాహం పెల్లుబికింది. శరీరంలోకి గ్లూకోజ్‌ ఏదో వెళ్లిన శక్తి నన్ను మంచం మీద పడుకోనివ్వలేదు. మైసమ్మ వచ్చి చెప్పే శుభవార్త వినాలని లేచి కూర్చున్నాను.
      నా కళ్లలోని మెరుపుని చూసిన ఆమె ఒక్కక్షణం తటపటాయించి ‘‘అమ్మా అబ్బాయిగారు చాలా బిజీగా ఉన్నారటమ్మా. మిమ్మల్ని జాగ్రత్తగా మందులేసుకుని వేళకి తిని పడుకోమన్నారు. ఒక వారం పది రోజుల్లో వీలు చూసుకుని వస్తారట. మీరు ఫోన్లో సరిగా మాట్లాడటం లేదట కదా. అందుకే నన్ను చెప్పెయ్యమన్నారు. ఇవిగో, మాత్రలు వేసుకుని పడుకోండి’’ యాంత్రికంగా నా చేతిలో పెట్టిపోయింది.   
      నా ఉత్సాహం నీరుకారిపోయింది. శరీరమంతా నిస్సత్తువ ఆవహించి కళ్లు తేలిపోయి చెమటలు పట్టెయ్యడంతో అలా నెమ్మదిగా మంచం మీదకు ఒరిగిపోయాను.    
      గతంలో ఇలాంటి మాటలు నేనన్నట్లు గుర్తొచ్చి గుండె కలుక్కుమంది. నీరసం వల్లనో మరి నిరుత్సాహం వల్లనో తెలియదుగానీ నిద్రలాంటి మత్తేదో ఆవహించడంతో పొద్దస్తమానమూ అలాగే ఉండిపోయాను, తిండీతిప్పలూ లేకుండా. 
      సగం రాత్రివేళ తెలివొచ్చింది, దాంతోపాటే ఏవో ఆలోచనలు కూడా దాడి మొదలుపెట్టాయి. బుర్ర బద్దలు కొట్టుకోవాలనిపిస్తూంటే ఇక మంచం మీద పడుకోలేక లేచి కూర్చున్నాను. ఎదురుగా గోడ మీద గడియారం టిక్కూ.. టిక్కూ.. మంటూ పన్నెండు చూపిస్తోంది.  
      ఒక్కసారి కోపం, ఆవేశం ఉప్పెనలా వచ్చేశాయి. ఇప్పుడర్థమయ్యింది తప్పెవరిదో! అదిగో ముమ్మాటికీ ఆ కాలానిదే. డెబ్బై సంవత్సరాలుగా అది నాతో ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంది. బంధాలూ, బాంధవ్యాలూ ప్రేమపాశాలై కాళ్లనీ చేతులనీ చుట్టేస్తూంటే ఎక్కడ దీంతో పరిగెట్టలేనేమోననే కదా వాటిని ఎక్కడికక్కడ తెంచేసుకుని ముందుకు సాగాను. చూసిన కళ్లు ఎక్కడ మనసుకి చేరవేస్తాయేమోననే భయంతో, మనసు చుట్టూ గోడ కట్టేసి, కళ్లు మూసేసుకుని గుడ్డిదాన్నై బతికాను.
      మరిప్పుడు ఆ బంధాలూ బాంధవ్యాలూ అందనంత దూరం వెళ్లిపోయి, నాలో జవసత్వాలుడిగిపోయి, నేను ఒంటరినై మిగిలినప్పుడు - గతంలో నేను నిర్లక్ష్యంగా తెంచేసుకున్న ప్రేమపాశాలే శూలాల్లా మారి నా మనసు చుట్టూ కట్టిన గోడని కూల్చేస్తున్నాయి. మనసులోని ఒక్కో పొరనీ గుచ్చీ గుచ్చీ ఛిద్రం చేస్తున్నాయి. ఇలా నేపడే నరకయాతనను చూస్తూ కూడా ఎంతకీ కదలకుండా నా ఎదురుగా బాసిమఠం వేసుకుని నన్ను గేలిచేస్తూ నవ్వుతూ కూర్చున్న కాలానిది కాక తప్పు ఇంకెవరిది?   
      ‘అప్పుడు నువ్వు నా చేతుల్లో లేకే కదా జీవితంలో ఏదీ ఆస్వాదించలేదు. నీ మాయలో పడ్డ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే మధురానుభూతులు నాకేవీ మిగల్లేదు సరికదా నేను తృణప్రాయంగా వదిలేసిన బాంధవ్యపు విలువలు నన్నీనాడు నీలినీడలుగా మారి వెంటాడి కుళ్లబొడుస్తున్నాయి. దానికి కారణం ఎవరు? నువ్వే.. నువ్వే.. నువ్వే...!’ తెలియని ఆవేశంతో నాలో నేనే అరచుకుంటున్నాను. 
      నేనింత వేదన పడుతున్నానా, అయినా.. ఏమాత్రం పట్టించుకోకుండా టిక్కూ.. టిక్కూ.. మంటూ కొట్టుకుంటున్న గడియారాన్ని చూస్తే నాకు పట్టరాని కోపమొచ్చింది. చేతికందిన వస్తువేదో తీసి దాని వైపు విసిరాను ‘‘ఎందుకు నీకీ కక్ష, ఎవర్నీ సుఖపడనివ్వవు’’ అంటూ. 
      నేను విసిరిన వస్తువు తగిలి అది కొంచెం పక్కకు ఒరిగిందంతే. కానీ, టిక్కూ..టిక్కూ.. శబ్దం మాత్రం ఆగలేదు. అంతే!! నాలో సహనం నశించింది. విచక్షణ కోల్పోయాను. పిచ్చెక్కినట్టు జుట్టు పీక్కుని దొరికిన వస్తువులన్నిటినీ దాని మీదకి విసిరేయసాగాను. అది గోడ నుంచి కిందపడే వరకూ విసురుతూనే ఉన్నాను. చివరికి నా ప్రయత్నం ఫలించింది. అది కిందపడి ముక్కలైంది!! అప్పుడుగానీ నాలో ఉద్రేకం తగ్గలేదు. నెమ్మదిగా శాంతించాను. ఎందుకో ఏమో నా కళ్లు వర్షించడం మొదలెట్టాయి. నెమ్మదిగా ఆ కన్నీటి ఉద్ధృతి పెరుగుతూ పోయి పెల్లుబికే తుపానుగా మారింది. ఆ వరద గోదారికి తడిసిన నా మనసు క్రమేపీ చల్లబడింది. అంతలో కిందపడ్డ ఆ గడియారంలోంచి టిక్కూ.. టిక్కూ.. శబ్దం వినపడింది. దగ్గరికెళ్లి చూశాను.
      పగిలింది బైట అద్దమే. యథాప్రకారం తిరుగుతూనే ఉన్నాయి లోపలి ముళ్లు. ‘సిగ్గు లేనిదీ, మొండిదీ... ఇంత చేసినా దీనికి బుద్ధి లేదు’ అనుకున్నాను. దాన్ని చూశాక మళ్లీ ఆవేశం చెలరేగింది. ఆశ్చర్యంగా ఈ సారి ఏడుపు రాలేదు. దాని స్థానంలో నవ్వొచ్చింది. పగలబడి నవ్వాను హ...హ...హ...హ... నవ్వీ నవ్వీ దాని పక్కనే కూలబడిపోయాను. అయినా నవ్వాపలేదు. నవ్వుతూనే ఉన్నాను. విరగబడి పగలబడి నవ్వుతూనే ఉన్నాను. ఎంతలాగ నవ్వానంటే నా నీరసపు గుండె బద్దలై నా శ్వాస ఆగిపోయేంతగా...!! 

***

      ఆ వృద్ధురాలి నిర్జీవమైన గాజుకళ్లని చూస్తూ కాలం దాని మానాన అది సాగుతోంది. అవును మరి అది కాలం. ఎవరితోనూ దానికి పని ఉండదు. దాని వడివడి నడకలో ఎన్ని అర్థాలో! బహుశా అవి - ‘ఏవమ్మా ఇంత వయసూ అనుభవం ఉన్నదానివే నా మీద నిందలేస్తావేంటమ్మా? నాతో పరుగు పెట్టమనో పోటీ పడమనో నే చెప్పానా? గతంలో ఒకలాగ ఇప్పుడు మరోలాగ నేను తిరుగుతున్నానా? నాదెప్పుడూ ఒకే బాట! మారింది మీ మనుషులు. మార్చుకుంది మీ జీవనశైలులు. అదొదిలేసి నామీద అభాండాలు వెయ్యడమేమైనా బావుందా? నేను కాలాన్ని. ముందుకు సాగడమే కానీ ఆగి వెనక్కి తిరిగి చూసేది లేదు. ఈ జీవిత చక్రంలో మీ ప్రాథమ్యాలను తెలుసుకుని కృత్రిమమైన వాటికోసం పరుగులు పెట్టకుండా కొన్ని మధురానుభూతులనైనా పోగు చేసుకుని మనసులో పదిలపరచుకుంటే ఆఖరి మజిలీలో ఈ దుస్థితి వచ్చేది కాదుకదా! ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోకుండా నామీదో, ఆ దేవుడి మీదో నిందలేస్తూ బతుకు పోరాటం చేసి ఓడిపోతుంటారు... ఈ క్షణం నువ్వు, మరో క్షణంలో ఇంకెవరో....’

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam