పునరపి హరితం

  • 319 Views
  • 171Likes
  • Like
  • Article Share

    కుప్పిలి సుదర్శన్‌

  • పాలకొండ, శ్రీకాకుళం జిల్లా
  • 9493290290
కుప్పిలి సుదర్శన్‌

మిథ్యాపరిచయ భావనలు నిజంగా ఎదురైతే..? వాటిని తర్జుమా చేయడం చాలా కష్టం.. ప్రకృతికి చాలా రోజులు దూరమైన ఓ బాల్యానికి తన అంతర్నేత్రం చిత్రించి చూపిన ఓ ఘటన ఇది...
వర్షం
శివతాండవానికి ఉపమానం అయ్యేలా ఉంది రెండ్రోజుల్నించీ..
      హోరున గాలేసినప్పుడల్లా అడివితల్లి పాపిడి చెదిరినట్టు చెట్లన్నీ ఎటుబడితే అటు వొంగిపోయి మెతకబడ్డ నేలమీద ఒకదానికొకటి ఆసరా చేసుకుంటున్నాయి.
      చినుకు వెనక చినుకు ఇంకా పాశహస్త ముద్రలు వేసుకుంటూనే ఉన్నాయి.
      అడివంతా లుమ్మజుట్టుకు పోయినట్లుంది. వొరగని చెట్లమీదికి పోవాలని పిట్టాపామూ కలవరపడుతున్నాయి.
      ఇలాంటి సమయంలో ఇంట్లో ప్రసవ వేదనతో నా మాధురి.
      నాట్యం చేసేవాళ్లకు ప్రసవం సులువుగా అవుతుందట.. కంగారేం అక్కర్లేదంటాడు మా డాక్టరుగాడు. తనని చూసుకోడానికి ముందుగా ఒకామెను పంపాడు. తర్వాత నిన్న రాత్రి వాడొచ్చాడు. మరో ఇద్దరు ముసలాళ్లను చెయ్యి జరగడానికిగానూ మా రాజారాం పిలుచుకొచ్చాడు. అందుకే నాకు కాస్త ప్రశాంతత ఉందనిపిస్తోంది.
      మూడు రోజులుగా టౌనుకు వెళ్లలేదు. ఇంట్లో తినడానికి అన్నీ నిండుకున్నట్లుంది. ఎలా లేదన్నా కనీసం రెండు కిలోమీటర్లు నడవాలి. వర్షం తెచ్చిన బద్ధకం. వర్షం కాదేమో.. వార్తల్లో తుపాన్‌ అని చెప్పుంటారు.
      వరుణుడు శివుడి కాలికి గజ్జె కట్టేంత సమయం వర్షానికి తెరిపినిస్తే.. డాబామీదికి వెళ్లడం, అటూ ఇటూ చూడ్డం, మూడురోజుల్లో ఆరేడుసార్లు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు మళ్లీ కాస్త తెరిపినిచ్చింది. హుషారుగా డాబా ఎక్కి చుట్టూ చూస్తున్నాను. కానీ నాకు తెలియకుండానే నా కళ్లు మాత్రం 
అచేతనంలో ఓ కుర్రాడి కోసం
      వెతుకుతున్నట్లుగా అనిపిస్తోంది.
      కనిపించాడు..!
      వాడే..!!
      ఎదురుగా చింత జంతి నుంచి ఏదోపాట వింటున్నట్లు కుడికీ ఎడమకూ ఊగుతూ నడుస్తూ వస్తున్నాడు... నా కళ్లు చిట్లించాను. వాణ్ని పరీక్షగా చూశాను.
      పాదాల నిండా బురదే.
      అదిగో.. మళ్లీ ఆ రెండు ఉడతలూ వాడి పాదం మీదికి ఎక్కుతున్నాయి.
      అరె.. ఇదెలా..? వాడు అదిలిస్తున్నా వాడి చుట్టూ.. కిచకిచమంటూ..
      నిన్న కూడా ఇలాగే..
      ఉడతలూ తొండలూ వాడిని అలా అటకాయించడమేంటీ?
      వర్షం ఆగిన ప్రతి విరామంలోనూ వాణ్ని అస్పష్టంగా ఇలాంటి సన్నివేశాల్లోనే చూస్తున్నా..
      ఈసారి పెరటిగోడదాకా వచ్చాడు. తొంగి పరకాయించి చూసి కళ్లు పెద్దవి చేస్తున్నాడు. దొంగతనానికి వచ్చినట్లు అనిపించట్లేదు. చాటుగా నించుని చూస్తున్నా.. వాడేం చేస్తాడా అని. నా చూపు దాపులకొచ్చాడు. ఇప్పుడింకా స్పష్టంగా కనిపిస్తున్నాడు.
      పచ్చని పసిడి ఛాయ మొహం. చొక్కాలేదు. నిక్కరు వొంటికి అతుక్కుపోయింది వానతడికి. అబ్బా జుట్టూ.. తడిసిన పొడవాటి లేత చిగురాకుల్లా..
      గోడ దూకాడు. 
      ఎత్తు కాస్త తక్కువే.. అయినా.. ఎంత ధైర్యం! పదేళ్లయినా ఉండవు వాడికి.. దూకినచోటే గచ్చు పైకి లేచి పొడుచుకొస్తున్నట్లుంది. ఈ వానలకేనేమో. 
      ఇంతకీ వీడెవడూ? రాజారాం తాలూకా? లేక ఇంటికొచ్చిన ముసలాళ్ల తాలూకానా? అలా అయితే తచ్చాటెందుకు? ముందరి గేటు తీసుకునే రావచ్చు. పోనీ కొండమీద ఉండే సవర్ల పిల్లాడా అంటే.. మొహం అలా లేదు. 
      అసలు ఇప్పుడేం చేస్తాడూ?
      రెండడుగులు ముందుకేసి వెనక్కి చూశాడు. వీపున అరచెయ్యంత మచ్చ.. అలాంటిదెక్కడో చూసినట్లనిపిస్తుంది... పిలవాలనుకున్నా. నా నోరు తెరిచేలోగా మూడు పావురాలు వాడి నెత్తిమీద వాలాయి. ఒకటి రెట్టవేసింది. ఈలోగా మరో రెండు రామచిలుకలొచ్చాయి గొరగొరలాడుతూ. చెరో భుజంమీద కూర్చుని మొహంమీద గుచ్చుతున్నాయి!
      హేఁ.. పొండి పొండి.. వెళ్లండి.. అంటున్నాడు. గొంతు కాస్త వినపడుతోంది.
      వాడి గురించి నాలో ఆశ్చర్యం వ్యక్తమయ్యే ప్రతిసారీ ప్రశ్నార్థకాలు ఆలోచనలకు సంకెళ్లు వేస్తున్నాయి.
      ‘‘ఇదిగో అబ్బాయ్‌.. ఓసారి ఇలారా’’ నా పిలుపుపైన ఈసారి చినుకొక చెరువై పడటంతో ఫలితం కనిపించలేదు...
      కుర్రాడు ఆకాశంకేసి చూసి నవ్వుతూ గబగబా మళ్లీ ప్రహరీ గోడ గెంతి చింత జంతి దాటుకుంటూ పోయాడు..
      నేను తడుస్తూ వాణ్నే చూస్తూ నించున్నాను. గుడ్లగూబలాంటిదేదో వాడి వీపు మచ్చ మీదికి పోతున్నట్లుంది...
      దృశ్యం అస్పష్టమైంది.....
      పిల్లాడు గోడ దూకాడంటే ఏ జాంపండు కోసమో మామిడిపండు కోసమో అవ్వాలి. కానీ మా ప్రహరీ లోపల ఏవీ లేవే.. ఈ అడివిలో ఉన్న చెట్లు చాలవా అని ప్రహరీ లోపల ఉన్న చెట్టూ కంపా కొట్టి పారేసి రాయి దిమిశీ కొట్టించి నున్నగా చేయించేశాం. 
      నా చిన్నప్పుడు ప్రహరీ లోపల చెట్టు నీడనే ఆటాపాటా- ఒక్కణ్నీ- పొద్దుగూకే దాకా. ఆ చెట్టే నా నేస్తం. తర్వాత హాస్టల్‌ జీవినైపోయా. యాంత్రిక జీవనం అయిపోయింది. అమ్మానాన్నా ఈ ఇంట్లో ఉన్నన్నాళ్లూ నేను లేను.. నేనొచ్చాక వాళ్లుండట్లేదు.
      నా ఆలోచనలు వర్షంలో తడుస్తున్నానన్న స్పృహ లేకుండా చేశాయి. వాడెందుకొచ్చాడూ? ఆడుకోడానికా? ఇక్కడ పిల్లలూ లేరు, ఆటవస్తువులూ లేవు. అసలు ఇది ఆడుకునే సమయమే కాదు..!
      మెల్లగా డాబా దిగి వరండాలో వాలుకుర్చీలో కూలబడ్డాను.

* * *

      ‘‘ఒరే డాక్టరూ.. పరిస్థితేంటీ?’’ లోపలికి కేక వేశాను.
      ‘‘ఇంకా ఏంలేదు. ముందు భోజనాల సంగతి చూడు. ముసలాళ్లు కూడా ఉన్నారుగా పాపం..’’ జవాబిచ్చాడు.
      సరేనని చెప్పి లేచాను. డాక్టరు తలాడించి అక్కడే చేరబడ్డాడు గొడుగు తీసుకుని బయటికి నడిచా.
      వర్షం ఉధృతి తగ్గేలా లేదు.. హోరుగాలి నేలను ఢీకొట్టి పైకి లేస్తుంటే గొడుగు కమాన్లు పెడరెక్కలు విరిచినట్లు వెనక్కి పోతున్నాయి. మళ్లీ పైనుంచి ఒక్క గాడ్పు కొడితే గొడుగు యథాస్థితికి వస్తోంది. ఈ జడికి గొడుగుంటే ఎంత, లేకపోతే ఎంత? 
      గేటు తెరవకముందే తలంతా తడిచిపోయింది. కంకర రోడ్డు ఎక్కగానే గాలిజోరు కొంచెం తగ్గింది. ఎర్రటి బురద.. బూట్లలోకి కూరుకుపోయి జొళజొళమని శబ్దం చేస్తోంది నడుస్తుంటే. పాదాలు ఒరిసిపోయాయి, నింపాదిగా నడవాలన్నా కష్టంగానే ఉంది.
      మా నాన్నగారి అమాయకత్వంలో చాదస్తం కాకపోతే, ఎవడో ఈ అడివిని మింగేసి స్థలాలు అమ్మడమేంటీ? ఈయన కొనడమేంటి? వెర్రికి దిగదుడుపులా మరో పదుగురు కలిసి ఇళ్లు కట్టుకోవడమేంటి? తక్కువ ధరకి దొరికిందని- విశాలంగా- భూత్‌బంగ్లాల్లా..

* * *

      టౌనంటే ఇక్కడికి దాదాపు దోనుబాయి. పచారీ వరకూ ఏవో దొరుకుతాయి. ఓ రెండు కిలోమీటర్లు నడవాలి. కానీ ఈ నడక పది కిలోమీటర్లకు సమానం. అంతా ఎత్తుపల్లాలూ మలుపులూ. తీరని అవసరాలకు మాత్రం పాలకొండకు పరుగెత్తాలి. ఇప్పుడు నేనుంటున్న ప్రాంతం మరో పదేళ్లకుగానీ అభివృద్ధి చెందదని అంటుంటారు.
      సగం దూరం కూడా దాటలేదు. టైం మూడవుతోంది. ఇక్కడ త్వరగా చీకటిపడుతుంది. తిరిగి రాగలనా అన్న సందేహం ఒకవైపు, పాములూ బంట్లూ ఎదురైతే పరిస్థితేంటీ అన్న గగుర్పాటు మరోవైపు... మనసులో ఇన్ని అనుకుంటున్నా, ఈ ఆలోచనలకు సమాంతరంగా ఆ కుర్రాడి మీద కూడా ఆలోచనలు రంగులు పులుముకుంటున్నాయి.
      వాడినెక్కడో చూశాను..ఇలాంటి వర్షాల్లోనా..?.వాడు నాకు తెలుసు... కచ్చితంగా నమ్మాలన్నట్లు అనిపిస్తోందేంటోమరి..!
      కొంపదీసి ఈ అడివిలో పడి మనుషుల్ని సరిగా గుర్తించ లేకపోతున్నానా? లేక ముసలితనం రాకుండానే ఆమ్నీషియా ఆవహిస్తోందా?
      చిన్న గోతిలో కాలు దబుక్కున కూరుకుపోవడంతో- చెట్టును కుదిపినపుడు ఆకుల చివర విశ్రమిస్తున్న నీటి చుక్కలు కిందికి జల్లుల్లా పడినట్లు నా ఆలోచనలు రాలిపోయాయి.
      కాలు పైకి లాక్కున్నా, కానీ బూటు మాత్రం గోతిలో ఉండిపోయింది. కాలితోనే మెల్లగా తీసే ప్రయత్నం చేస్తున్నా..
      ‘‘నమస్కారమండీ..’’ గోరువెచ్చని పలకరింపులా గొంతు.
      వెనక్కితిరిగి చూశా..
      ఆ కుర్రాడే..!!!
      నాకు మాట రాలేదు.
      ‘‘ఓఁ.. బూటు బురదలో కూరుకుపోయిందాండీ.. ఉండండి తీస్తా’’ అంటూ దగ్గరికొచ్చాడు. అమాంతం బురదగోతిలో చెయ్యి పెట్టి బూటును బలంగా లాగాడు. దాన్ని నాకు అందిస్తూ ‘‘బూట్లు చేత్తో పట్టుకుపోండి. వాటితో ఇక్కడ నడవడం కష్టం’’ అన్నాడు మెరుస్తున్న కళ్లతో.
      నాకు లోలోపల తీవ్రమైన అలజడి మొదలైంది...! అది హాయిగొలిపేలా ఉండటం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది...!!
      అలజడి.. హాయిగొలిపే అలజడి- భరించడం కష్టమనిపిస్తోంది...!!!
      వాడి చెయ్యి పట్టుకున్నాను. నా కళ్లు వాణ్ని పరిశీలిస్తూ ప్రశ్నలు తయారు చేస్తున్నాయ్‌...
      ‘‘నీ పేరేంటి?’’
      ‘‘స్వామి అంటారండీ’’
      ‘‘ఎక్కడ మీ ఇల్లు? ఈ చుట్టుపక్కల ఎప్పుడూ కనిపించలేదే నువ్వూ?’’
      ‘‘కొండ అవతల ఉంటామండీ.. అపుడపుడూ ఇటువైపు వస్తుంటా’’
      ‘‘ఓహో.. అయితే నన్ను ఇంతకు ముందు చూసే ఉంటావు’’
      ‘‘ఓఁ.. ఈ మధ్యనే వచ్చారుగా. మీ నాన్నగారు కూడా బాగా తెలుసండీ’’
      ‘‘ అయితే నువ్వు ఆయనకి దోస్తువన్నమాట’’
      ‘‘కాదండీ... ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడలేదు’’
      ‘‘సరేగానీ, మా ప్రహరీ దాటి లోపలికి ఎందుకొచ్చావ్‌?’’ సూటిగా అడిగాను.
      తల దించుకున్నాడు.
      ‘‘చెప్పొచ్చుగా..’’ వాణ్ని మచ్చిక చేసుకోవాలని స్వరంలో లాలన తీసుకొచ్చాను. కొంచెం నవ్వాను..
      వాడికి కాస్త నమ్మకమొచ్చినట్లు నావైపు చూశాడు.
      ‘‘అదీ.. మరేంలేదండీ.. అక్కడికొచ్చి ఆడుకోవాలని అనిపిస్తుంది. మీరు లేనప్పుడు నా నేస్తాలతో వచ్చి ఆడుకునే వాణ్ని. వర్షాలు పడితే నాకు మరీ పిచ్చి ఆనందం..’’
      నిశ్శబ్దమైపోయాడు.
      గాలి వీయడం ఆగిపోయినట్లుంది.
      ‘‘మీరు కోయలా, జాతాలా, సవర్లా?’’
      ప్రశ్న అర్థం కానట్టు మొహం పెట్టాడు సమాధానం ఇవ్వకుండా.
      ‘‘నీ మీద పావురాలూ, రామచిలుకలూ వాలుతున్నాయ్‌.. ఉడతలూ, తొండలూ ఏవేవో కాళ్లమీదికి ఎక్కుతున్నాయ్‌.. నేను చూశాను.. చెప్పు.. ఎవరు నువ్వూ?’’
      ఈసారి దించిన తల మెల్లగా వెనక్కు తిప్పుకున్నాడు.
      ‘‘ఇదిగో.. నేను లేకపోతే ఆపక్క సిరిసినచెట్టు మీదినుంచి పాలగువ్వలు నీ మీద వాలడానికే సిద్ధంగా ఉన్నట్లున్నాయి.. కావాలంటే అటు చూడు..’’ నెమ్మదిగా వాడి గడ్డం పట్టుకుని తల పైకి లేపాను. తల ఎత్తినా కళ్లు దించుకునే ఉన్నాడు.
      ‘‘అవన్నీ మాలాంటోళ్లతో అలాగే ఆట్లాడతాయిలెండి. మాకు మన్నే తల్లి- ఆకాశమే అయ్య. అందుకే నా వెనక అలా వస్తాయి...’’ గువ్వలను చూస్తూ చెప్పాడు.
      ‘‘మరి నేనూ?’’
      ‘‘...’’
      ‘‘నేనెందుకు ఇప్పుడు నీ వెనకాలే వస్తున్నానూ? కొంపదీసి చేతబడిగానీ చేస్తున్నావా?’’ గంభీరంగా అడిగా.
      చురుక్కున చూశాడు.
      ‘‘ఆ బూట్లిలా ఇవ్వండి.. కాలువలో కడుక్కొస్తా..’’ నా ప్రశ్నని దాటాలని ప్రయత్నించాడు.
      ‘‘ఊహూఁ.. ముందు జవాబివ్వు’’
      ‘‘మీరు కూడా నాకు ముందే తెలుసు...’’ అన్నాడు. నాకు వింతగా అనిపించలేదు.
      ‘‘నేనూనా? నీకెలా తెలుసూ?- నిజానికి నాక్కూడా నిన్ను చూస్తే అలాగే అనిపిస్తోంది. కానీ ఏమీ అర్థం కావట్లేదు’’ అన్నాను.
      ఇద్దరం ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయాం. నేను వాడికి తెలుసన్న సమాధానానికి నేనెలా లొంగిపోతున్నానో నాకే తెలియట్లేదు. వాడి చేతిని వదలకుండా కాలువ వరకూ తీసుకెళ్లి బూట్లు కడుక్కున్నా.
      కాలువలో నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తోంది. ఇద్దరం కాళ్లు కడుక్కున్నాం. వాడి కుడి కాలి బొటనవేలుకు పక్కన రెండు వేళ్లు మాత్రమే ఉన్నాయి. ఎడమ కాలికి ఏవో రెండు వేళ్లే.
      ‘‘ఏమైంది నీ కాలి వేళ్లకి? ఏదైనా కోసుకుపోయిందా?’’
      ‘‘లేదండీ.. అమ్మ కడుపులోనే ఉండిపోయాయంట’’ అదోరకం వేదాంత ధోరణితో చెప్పాడు. 
      అసలు వీడికి మన్నే తల్లి, ఆకాశమే అయ్య అనేంత తత్వం ఎలా అబ్బిందో.. 
      ఇంకా వాడినేదో అడగాలని ఉంది. మాటలు వెతుక్కుంటున్నాను. వాడు మాటలు దాచుకుంటున్నాడు. వాడు దాచేసుకుంటున్న మాటల్నేనా నేను వెతుక్కుంటున్నానూ?
      ఇంతలో కాలవగట్టు పక్కన కనిపించిన పింజిరిని ఏమాత్రం తొట్రుపాటు లేకుండా కాలితో పక్కకి విసిరేశాడు.
      ‘‘ఏఁ.. ఏంటా పని.. కరిస్తే చచ్చిపోతాం..’’ వాణ్ని నావైపు లాక్కున్నా.
      ‘‘ఊరుకోండీ.. రేపటికి ఉంటామో పోతామో ఎవరు చూశారూ?’’ చేతులూపుకుంటూ చెప్పాడు. వాడిలో బెరుకు పోయింది. నాకలా అనిపించింది.
      ‘‘ముసలాడిలా మాట్లాడుతున్నావ్‌లే.. పదపద.. ఇక నేను ముందుకు వెళ్లలేను. ఇప్పుడే చీకటైపోతోంది. నువ్వూ మా ఇంటికి రా. మళ్లీ గాలి పెరిగేలా ఉంది’’ అంటూ వాడి సమాధానంతో పనిలేకుండా నడిపించాను.
      వాడి భుజంమీద స్వేచ్ఛగా నా చేతులు- చేతులకు కళ్లొచ్చాయేమో- ఈ స్పర్శ మేము చూశాం.. నీకు తెలీదా.. అంటూ గుర్తుకు తెచ్చుకొమ్మంటున్నాయ్‌..!
      నాలో సందిగ్ధత.. ఇంకేమీ మాట్లాడలేకపోయాను. అలౌకిక స్థితిలో ఇంటికి చేరుకున్నా స్వామితో.

* * *

      గేటు తీస్తుండగా ‘‘తమ్ముడు పుడతాడండీ ఈ రాత్రికి ..’’ అన్నాడు..
      ‘‘నీకెలా తెలుసూ?’’ నవ్వుతూ అడిగా.
      ‘‘తర్వాత చెల్లి కూడా పుడుతుంది లెండి..’’ అని కళ్లు పెద్దవి చేశాడు. ఈసారి నవ్వలేకపోయాను.
      వర్షం కాస్త వెలిసింది. గాలి హోరు కూడా కాస్త తగ్గి ప్రశాంతంగా ఉంది. ఇంకా చిన్న వెలుగుంది ఆకాశంలో. 
      ‘‘రాజారాం.. కాస్త టీ పెడతావా?- పాలున్నాయా..’’ వరండాలోంచే అడిగాను.
      ‘‘ఈ ఉరుములకీ పిడుగులకీ పాలెక్కడివి బాబూ.. వరాలు తన్నింది కూడానూ..’’తువ్వాలు అందిస్తూ చెప్పాడు.
      ‘‘ఏదీ.. చెంబిలా ఇయ్యి.. నే తీస్తా..’’
      ‘‘వద్దు బాబూ...’’
      ‘‘ఏం ఫర్లే.. నువ్వెళ్లి ప్రభాకర్‌గారి ఇంట్లో పళ్లేమైనా కోసుకురా.. ఈ వర్షం వల్ల ఏమీ కొనలేకపోయాను. తొందరగా..’’
      రాజారాం చెంబు అందించేలోగా స్వామి పెరట్లోకి వెళ్లిపోయాడు.
      వరాలు వాడి చెయ్యి నాకుతోంది. వాడు నవ్వుతూ మరో చేత్తో గడ్డి అందిస్తున్నాడు.
      ‘‘ఊఁ.. ఇప్పుడు పితకండి..’’ అని హుషారుగా అన్నాడు నన్ను చూసి. నేను పాలు పితుకుతున్నంతసేపూ దాని చెవిలో ఏవో ఊసులు చెబుతూనే ఉన్నాడు. దానికేమనిపిస్తోందో....
      ‘‘టీ తాగుతావా..?’’. తలాడించాడు.
      ‘‘మీ అమ్మానాన్నా కొండ దిగువకి వచ్చేదాకా ఇక్కడే ఉండు’’ ఒక రకంగా ఆజ్ఞాపించినట్లే చెప్పాను. మళ్లీ తలాడించాడు.
      తడిచిన జుట్టు వాడి మొహం మీద చాలా అందంగా పడుతోంది.
      ‘‘జుట్టు కత్తెరేయించవా? ఎందుకింత పొడుగ్గా..?’’ అన్నాను వాడి మెత్తని జుట్టును నా చేత్తో పైకెత్తుతూ..
      ‘‘ఏడాదికోసారే కత్తెరండీ’’ అన్నాడు వరాల్ని కన్నెకి కడుతూ.
      స్వామి మాటల్లో ఏదైనా ఆంతర్యం వెతుక్కుంటే బాగుంటుందనిపించించి.

* * *

      రాజారాం తెచ్చిన పళ్లూ, ఇంట్లో రొట్టె ముక్కలూ, కాసిని పాలూ.. మొత్తానికి రాత్రికి ఎలాగో సర్దుకోవచ్చనుకున్నాం.
      పన్నెండు పన్నెండున్నర వరకూ మాధురి చుట్టూ తిరిగాం. స్వామి వరండాలో ఉయ్యాలబల్ల మీద ఏదో మెల్లగా పాడుకుంటూ ఊగుతున్నాడు. 
      డాక్టరుగాడు రాజారాంతో ఓ పక్క మాట్లాడుతున్నాడు. చిన్నగా కునుకూ చినుకూ పడుతున్నాయ్‌.. టైం మూడున్నర. బలవంతంగా ఏదో కల రెప్పల వెనక...
      ‘‘రేయ్‌.. ఇప్పుడు కునుకుతావేంట్రా.. కొడుకు పుట్టాడు... కానీ..’’ డాక్టరుగాడి మాట పూర్తి కాకుండానే లోనికి పరుగెత్తాను. స్వామి మాటలు గుర్తొస్తున్నాయ్‌.. తమ్ముడు పుడతాడండీ.. తర్వాత చెల్లి కూడా పుడుతుందండీ...
      మాధురి పక్కన మెత్తని గుడ్డల్లో బాబు. మిలమిల్లాడుతూ కళ్లు.. ముందెపుడో ఈ కళ్లను చూశానన్నట్లు...
      చూచూ.. చూచూ... బుగ్గలు నిమిరాను. ముందెపుడో ఈ స్పర్శ తెలుసన్నట్లుంది...
      పాదాలు-
      ‘‘ఒలిగొడాక్టల్‌ ఛైల్డ్‌రా.. వెరీ రేర్‌ కండిషన్‌.. ఇలా తక్కువ వేళ్లతో పుట్టడం. బట్‌ మరీ అంత ప్రాబ్లమేమీ ఉండదులే.. డోన్ట్‌ వర్రీ.. ఓకే..’’ భుజం తట్టాడు.
      నాలో ఉక్కిరిబిక్కిరి ప్రశ్నలు- నిండా మునిగిపోతున్నాను.
      ‘‘థాంక్యూరా..’’
      ‘‘అంత మత్తు నిద్రేంట్రా? ఉలకవూ, పలకవూ. నీ కన్నా ఆ కుర్రాడే నయం. వేణ్నీళ్లకు గ్యాస్‌ లేకపోతే కట్టెలు తెచ్చి మంట వేశాడు... ఇంత వానలో ఎక్కడ దొరికాయంటావ్‌? బయట కనిపించట్లేదు. ఎక్కడికెళ్లాడో..’’ డాక్టర్‌ కాస్త ఉద్వేగంగా చెప్తున్నాడు. వాడికేమనిపించిందో...
      ‘‘ఆ కొండ అవతల ఉంటారంట. వాళ్ల అమ్మానాన్నా కనిపిస్తే వెళిపోయాడేమో..’’ డాక్టర్‌ విన్నాడో లేదో పట్టించుకోలేదు. టైం నాలుగున్నర.
      రాజారాం నా మాటలు విన్నాడేమో..‘‘రాత్రంతా ఆ పెరట్లోనే తిరిగాడు బాబూ. బాగా చలిగా ఉంది కదా.. చుట్ట కావాలా తాతా అని అడిగి మరీ ఒకటిచ్చాడు. ఎక్కడో దొరికిందట. నేను కునుకుతుంటే దుప్పటి ఆ పిల్లడే కప్పినట్టుంది..’’ అంటూ మెట్టు మీద కూర్చుండిపోయాడు. రాజారాంకి ఏమనిపిస్తోందో..
      ‘‘ఇక్కడే తిరుగుతున్నాడేమో చూడూ’’ ప్రశ్న నా గొంతు దాటలేదు.
      ప్రశ్నలు.. ఎవరు? ఎవరు? ఎవరికి ఎవరు?
      వర్షపు నీరు పాయలుగా ప్రవహించీ ప్రవహించీ అలసీ సొలసీ వెలసీ మట్టి దుప్పట్లో దాగి విశ్రమించాలని ప్రయత్నిస్తోంది...
      ఆదిత్యుని రథానికి దారిస్తూ వరుణుడు తన మేఘసేనను దారి మళ్లిస్తున్నాడు..
      డాబా మెట్లెక్కుతుంటే, ప్రహరీగోడ నా చూపులను తనవైపు లాక్కుంటోంది. అక్కడే.. అక్కడే.. అప్పుడెప్పుడో మేం నరికేసిన చెట్టు ఉండేచోటనే.. నేలను చీలుస్తూ... సూర్యప్రభకు వినయంగా కాస్త వంగి నమస్కరిస్తూ మళ్లీ ఇన్నాళ్లకు చిగురు...!
      గుర్తొస్తున్నాయ్‌ మిత్రమా.. నీ నీడన నేను ఆడుకున్న ఆటలూ.. పాడుకున్న పాటలూ..
      నాకు సమాధానం దొరికింది...!

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam