వలస బతుకులు

  • 413 Views
  • 7Likes
  • Like
  • Article Share

    ఎల్‌.వెంకటరావు

  • బాపట్ల,
  • 7207408407
ఎల్‌.వెంకటరావు

పొట్ట చేతబట్టుకుని వచ్చిన వలస కార్మికుల జీవితాల్లో ఎన్ని విధ్వంసాలు. ఎన్ని అన్యాయాలు. అక్రమార్కులందరికీ వారో దోపిడీ వస్తువులు. వారికి కనీస హక్కులూ ఉండవు. అలా వలసొచ్చిన కొందరి బతుకులు ఎలా ఛిద్రమయ్యాయి? 
మహిష
వాహనుని మహా విధ్వంసానికి సాక్ష్యంగా మిగిలిన క్వారీ పేలుళ్లు చూసేవారికి హృదయవిదారకంగా వున్నాయి. కాలి బొగ్గుగా మారిన శరీరాలు, తెగిపడిన అవయవ భాగాలు, జీవచ్ఛవాలైన కార్మికులు, కంటికీ మింటికీ ఏకధాటిగా ఏడుస్తున్న బంధువుల ఆర్తనాదాలతో అక్కడొక బీభత్స వాతావరణం నెలకొంది. మరోవైపు ఛోటా మోటా రాజకీయ నాయకుల కల్లబొల్లి ఓదార్పులు, మీడియా కవరేజీ కోసం పడే పాట్లు రోత పుట్టిస్తున్నాయి. పేలుళ్ల సమయంలో భయంకర శబ్దాలు రావటం, జరిగిన వినాశనం గురించి సమీప గ్రామస్థులు మీడియాకి వివరిస్తున్నారు. ఇలాంటి పేలుళ్లు క్వారీలో కొత్త కాకపోయినా ఈసారి మరింత మంది ఉసురుతీశాయి. 
      పాలకపక్ష నాయకులు ఆ ప్రాంతానికి వచ్చి తమ సానుభూతి, సంతాపాలను తెలియజేశారు. ప్రతిపక్షం వాళ్లు అధికార పక్షం ఉదాసీనత, అవినీతి మీద విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి తన అమూల్య సమయాన్ని వెచ్చించి మరీ అక్కడికొచ్చి చనిపోయిన వారికి అయిదు లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల సాయం ఉదారంగా ప్రకటించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారు ఎంత పెద్దవారైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భజనపరులైన ఇతర అమాత్యులు సీఎం విశాలహృదయాన్ని పొగుడుతూ ఇలాంటివి గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ జరిగాయని, అప్పటి ప్రభుత్వం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించినందువల్లే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని తమ అసమర్థతను గత ప్రభుత్వంపై రుద్దటానికి విపరీత ప్రయత్నం చేశారు. 
      తర్వాతి రంగం క్షతగాత్రులున్న ప్రభుత్వ ఆస్పత్రికి మారింది. పేలుళ్లు సంభవించిన వెంటనే సమీప గ్రామం వారు వచ్చి 108కి ఫోను చేశారు. అది ఎంతకీ రాకపోవడంతో గ్రామంలోని ఆటోవాళ్ల సాయంతో క్షతగాత్రులను ఆ ఆస్పత్రికి చేర్చారు. అయితే అక్కడ డాక్టరు, సిబ్బంది, మందులు లేక వారిని అలాగే ఆస్పత్రి వరండాలో పడుకోబెట్టారు. హాస్పిటల్‌కి సెలవు పెట్టకుండా అత్తగారి వూళ్లో ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టరు, సొంత పనుల్లో బిజీగా ఉన్న సిబ్బంది టీవీలో ఆ పేలుళ్ల వార్త చూసి ఇదెక్కడి గొడవరా అనుకుంటూ పోలోమంటూ ఆస్పత్రికి వచ్చారు. మంచాలు, పరుపులు, మందులు వెంటనే అక్కడికి తరలివెళ్లాయి. ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారో అన్నట్లు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో నాయకులు వచ్చి గాయపడిన వారిని, బంధువుల్ని వోదారుస్తున్నారు. నష్టపరిహారం గురించి తెలియజేస్తున్నారు. 
      క్వారీలో పనిచేసే వారంతా ఛత్తీస్‌గడ్‌లోని ఓ గూడెం నుంచి వచ్చిన వలస కార్మికులు. ఈ ప్రమాదంలో గాయపడి దిక్కులు చూస్తోంది సుకుమా. తన వాళ్లు ఏమైపోయారో, అసలు బతికున్నారో లేదో తెలియక ఆమె గుండె కొట్టుకులాడుతోంది. అంతలో నర్సు వచ్చి ఆమె గాయాలకు మందు రాసి నొప్పులు తెలియకుండా మత్తు ఇంజక్షన్‌ ఇచ్చింది. మందు కొంచెం కొంచెం పనిచేస్తుంటే, మగతలోకి జారుకుంటుండగా తన చిన్ననాటి జీవితం, కుటుంబం వలస రావటం ఆమె కళ్లముందు కదలాడాయి.
      లేకలేక పుట్టడం వల్ల అడవి దేవతే అమ్మాయిగా పుట్టిందని అమ్మానాన్నలు సుకుమాని అల్లారు ముద్దుగా పెంచారు. ఆటపాటల్తో అయిదేళ్లు గడిచాయి. గూడెంలో సర్కారు బడి వుంది. కానీ, టీచరు రోజూ వచ్చేవాడు కాదు. పిల్లలకి చదువు చెప్పాలని ఆయనకి వున్నా పిల్లలు చదువుకుంటే తెలివిమీరి తమను లెక్కచెయ్యరనే భావంతో గూడెం పెద్దలు పంతులుగారిని జీతం తీసుకుని బడికి అప్పుడప్పుడు మాత్రమే రమ్మని సలహా ఇచ్చారు. ఆయన గూడేనికి దూరంగా వున్న పట్నంలో వ్యాపారం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో స్కూలుకు వచ్చిపోతూ ఉండేవాడు. సుకుమా అయిదేళ్ల వయసులో కొత్త టీచరు ఆ స్కూలుకి వచ్చింది. ఆవిడకి అదే మొదటి పోస్టింగు.
      శ్రద్ధగా చదువుకుని తోటి అడవి బిడ్డలకు కాస్త అక్షరజ్ఞానం కలిగించాలనే సదుద్దేశంతో టీచరు ట్రైనింగ్‌ తీసుకుందామె. గూడెం పెద్దలు ఆవిణ్ని కూడా తమ మార్గానికి తెచ్చుకుందామనుకున్నారు. కానీ ఆవిడ నవ్వుతూ తాను చెయ్యాలనుకున్నది చెప్పింది. సొంత డబ్బుతో బడిలో చిన్న చిన్న మరమ్మతులు చేయించింది. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిసి చదువు విలువ చెప్పింది. తమ పిల్లల్ని బడికి పంపించమని కోరింది. కొరకరాని కొయ్యలా మారిన టీచర్ని ఏమీ చెయ్యలేక గూడెం పెద్దలు మిన్నకుండిపోయారు. 
      కొత్త టీచరొచ్చాక సుకుమాతో పాటు ఇరవై మంది ఆడా మగా పిల్లలు బడికి వెళ్లటం మొదలుపెట్టారు. టీచరు చెప్పేది శ్రద్ధగా వినటం, చెప్పిన పని చెయ్యటం అలవాటు చేసుకున్నారు. టీచరు పిల్లలకు కావాల్సిన పుస్తకాలు తన సొంత డబ్బుతో కొనిచ్చేది. పుస్తకాల్లోని పాఠాలనే కాకుండా, నీతి కథల్ని బోధించేది. అలా నాలుగేళ్లు గడిచాయి. పిల్లలు చక్కగా చదవటం, రాయటం నేర్చుకున్నారు. ఉపాధ్యాయురాలు గూడెంలోనే వుంటూ అందరికీ తల్లో నాలుకలా మెలగడాన్ని పెద్దలు సహించలేకపోయారు. మొదటిసారి గూడేనికి వచ్చిన ఎంఎల్‌ఏకి టీచరు నక్సలైటు భావాలు కలిగిన వ్యక్తని, ఆమె శిక్షణలో పిల్లలు చెడిపోతారని కట్టుకథలు చెప్పి అక్కడి నుంచి ఆమెను మార్పించారు.
      తర్వాత వచ్చిన ఉపాధ్యాయుడికి ఆ ఉద్యోగం మీద గౌరవమే ఉండేది కాదు. గత్యంతరం లేక ఆ మారుమూల గూడేనికి రావాల్సి వచ్చిందని, తనకున్న తెలివితేటలకు కనీసం ఎంఆర్‌వో అయి వుండాల్సిందనే భావనలో ఉండేవాడు. అసలీ గిరిజనులకు చదువులు దండగ అనుకుంటూ పిల్లలకు పాఠాలు చెప్పకుండా, విపరీతంగా విసుక్కుంటూ కొట్టేవాడు. క్రమంగా బడికొచ్చే పిల్లలు తగ్గిపోయారు. సుకుమా కూడా బడి మానేయాల్సి వచ్చింది. ఆడుతూ పాడుతూ, ఇంట్లో పనులు చేస్తూ మూడేళ్లు గడిచేసరికి సుకుమా పెద్దమనిషి అయ్యింది. ఎంత చిన్న వయసులో పెళ్లి చేస్తే అంత మంచిదనే గూడెం సంప్రదాయంలో భాగంగా పెళ్లంటే అర్థం తెలియని వయసులోనే సుకుమా వైవాహిక జీవితంలోకి ప్రవేశించింది. అయిదేళ్లలో ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. తన భర్త, అత్త, మామ కష్టపడి అడవిలో చెట్లు నరికి, ఎగుడుదిగుడు నేలను చదునుచేసి కొంత భూమిని పంటకు సిద్ధం చేశారు. ఏదో పంట సాగు చేసుకుని జీవితం గడపవచ్చులే అనుకునే సమయంలో అనుకోని ఉపద్రవం.
      ఏదో ప్రాజెక్టు కోసం ఆ ప్రాంతాన్ని ఓ విదేశీ కంపెనీకి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆ గూడేన్ని ఖాళీ చేయమని హుకుం జారీ చేసింది. ప్రాజెక్టు విషయం తెల్సిన మైదాన ప్రాంత భూస్వాములు గద్దల్లా అక్కడ వచ్చి వాలారు. గూడెంలోని రైతుల భూములకు పట్టాలు లేనందువల్ల ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదని, కోర్టుకెళ్లినా ప్రయోజనం శూన్యమని భయపెట్టారు. వాళ్ల భూముల్ని తమకు అమ్మినట్లు రాసిస్తే ఎకరాకి పదివేలు ఇస్తామని చెప్పారు. తర్వాత తాము తిప్పలుపడి ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకుంటామని అన్నారు. డబ్బుకు ఆశపడి గూడెం పెద్దలు వాళ్లకు వంత పాడటంతో రైతులందరూ కాగితాల మీద వేలిముద్రలేసి, వాళ్లు ఇచ్చినంతా పుచ్చుకుని గూడేన్ని ఖాళీ చేశారు. 
      పనీపాటా లేకుండా కూర్చుని తింటే ఆ డబ్బులు ఎంతకాలం వస్తాయి. అందరూ పుట్టి పెరిగిన గూడెం వదిలి వలస జీవులుగా ప్రయాణమయ్యారు. అత్త ఆ మధ్యనే కాలం చెయ్యటంతో భర్త, పిల్లలు, మామతో కలిసి సుకుమా బయలుదేరింది. దొరికిన పని చేసుకుంటూ, తర్వాత మరో చోటుకి మారిపోతూ వాళ్లంతా సంచార జీవులయ్యారు. పాత గూడెంలో వాళ్లకి ఓట్లు ఉన్నాయి. వలస జీవులయ్యాక వారికి ఆధార్, రేషన్‌ కార్డులు లేకుండా పోయాయి. తాము పనిచేసుకునే చోట అధికారులని అడిగితే, వాళ్లు ఆ ప్రాంతం వారు కాదని, సొంత ఊళ్లోనే రేషన్‌ కార్డు తీసుకోవాలని చెప్పేవారు. వారికి ప్రభుత్వ పథకాలు ఏవీ దక్కేవి కాదు. అలా దొరికిన చోట పని చేసుకుంటూ నాలుగేళ్ల క్రితం వారు ఆ క్వారీ దగ్గరికి చేరుకున్నారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం కాబట్టి స్థానికులెవరూ అక్కడ పనిచెయ్యరు. ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేతబట్టుకొని వచ్చినవారే తెగించి అక్కడ పనికి వొప్పుకుంటారు.
      అక్కడికి రాక ముందు చెరువు తవ్వే పని చేశారు. అక్కడ మట్టిపెళ్లలు విరిగిపడి సుకుమా మామ శవమయ్యాడు. కంట్రాక్టరు పదివేలు చేతిలో పెట్టి ముసలాడి ప్రాణానికి ఇదే ఎక్కువ అన్నాడు. మీ అజాగ్రత్తకు నేనా బాధ్యుణ్ని? అంటూ పెద్దగా కేకలేశాడు కూడా. ఎక్కడో గూడెంలో పుట్టి పెరిగిన పెద్దాయన పరాయి ప్రాంతంలో దిక్కులేని వాడిలా మట్టిలో కలిసిపోయాడు. 
      క్వారీ కంట్రాక్టరు ఇచ్చే డబ్బు కూడా మొత్తం కూలీలకు చేరదు. పెద్ద మేస్త్రీ, చిన్న మేస్త్రీ వాటాలు పంచుకున్న తర్వాత మిగిలిందే వీళ్లకు ప్రాప్తం. వలస కూలీల్ని అందరూ యథేచ్ఛగా దోపిడీ చేసేవాళ్లే. స్థానికులైతే పని గంటలు, జీతాలు, ఇతర హక్కుల గురించి అడుగుతారు. వలస కూలీలకి ఏ హక్కులూ ఉండవు. అందుకే, చాలా మంది వలస వచ్చిన వారినే పనిలో పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతారు. 
      దారిద్య్రం మగవాళ్ల కంటే ఆడవాళ్లకు మరింత భయంకరం. కాస్త రంగు, అవయవ పుష్టి ఉన్న మనిషైతే ఆమె బతుకు నరకం. ప్రతివాడూ ఆమె వంక ఆశగా చూస్తాడు. వాళ్ల పంజాకి చిక్కకుండా, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ బతకడం ఎంత కష్టం! ఒక్కోసారి ఎదుటి వాడి కోరికని కాదంటే, కుటుంబం మొత్తానికీ పనుండదు. పిల్లలతో సహా అందరూ పస్తులుండాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేయగలరు? సుకుమా లాంటి చాలా మందికి ఆ నరకాలు అనుభవమే. కానీ, ఒకరినొకరు వోదార్చుకుంటూ ఆడదానిగా పుట్టటం కంటే అడవిలో మానుగా పుట్టటం నయమనుకుని కన్నీళ్లని రెప్పలచాటున దాచుకుని, కడుపున పుట్టిన బిడ్డల కోసం బతుకు బండిని నడిపిస్తుంటారు. 
      సుకుమా ఆ క్వారీకి వచ్చిన నాలుగేళ్లలో అలాంటి ప్రమాదాలు కొన్ని జరిగాయి. అధికారులు రావడం, పది మందినీ విచారించడం, ఆ తర్వాత కాంట్రాక్టర్‌ కారులో గెస్ట్‌హౌస్‌కు వెళ్లటం ఆమెకు తెలుసు. మనుషులు చనిపోయినప్పుడు వారి నిజమైన బంధువుల్ని కాకుండా తమకు తెల్సిన స్థానికుల్ని తీసుకొచ్చి ప్రభుత్వ సాయం వాళ్లకు ఇప్పించి, పదివేలో ఇరవై వేలో చనిపోయిన వారి సంబంధీకుల చేతిలో పెట్టి మిగిలిన మొత్తాన్ని మేస్త్రీలు, ఉద్యోగులు కాజేయడం ఆమెకు ఎరుకే. పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో వచ్చి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తమ మీద ఎవరికీ కనీస జాలి కూడా ఎందుకు లేదో, మనుషులు ఇంత క్రూరంగా ఎందుకుంటారో సుకుమాకి అర్థమయ్యేది కాదు. ఒక్కోసారి వాస్తవ ప్రపంచంలోని దారుణాల్ని తలచుకుని ఆమె నిలువెల్లా వణికిపోయేది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కాకుండా ధనికుల చుట్టూ తిరుగుతోందనే వాస్తవం సుకుమా లాంటి అమాయకులకు తెలియదు పాపం.
      రాత్రి పేలుళ్ల శబ్దాలు ఎంత భయంకరంగా వున్నాయో సుకుమాకు గుర్తుకొచ్చి తన భర్త, పిల్లలు ఏమయ్యారో అని తల్లడిల్లింది. ఎంత మంది చనిపోయారో, మరెంత మంది ఆస్పత్రిలో ఉన్నారో తెలియక మూగగా రోదించింది. పేలుళ్ల సమయంలో తన గూడెం వాళ్లు పిల్లలూ పెద్దలూ కనీసం ముప్పై మంది ఉన్నారు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అందరినీ ప్రేమగా చూస్తున్న నర్సులు, కాంపౌండర్లు వాళ్లు వెళ్లిపోగానే ప్రతి విషయానికీ కసురుకుంటున్నారు.
      కొండల్ని పేల్చటానికి వాడే మందుగుండు సామగ్రిని ఇనుపపెట్టెల్లో దూరంగా ఎక్కడో దాయాల్సింది పోయి, కూలీలు ఉంటున్న గుడిసెలకు సమీపంలో నిల్వ చేస్తున్నారు. అందుకే గతంలో ఇలాంటి పేలుళ్లు కొన్ని జరిగాయి. అయినా యజమానుల్లో మార్పు లేదు. ఎలా జరిగిందో గానీ మందు గుండు సామగ్రి అంటుకుని పగలల్లా పనిచేసి పాకల్లో ఆదమరచి నిద్రపోతున్న వారి మీద విరుచుకుపడింది. ఆ భయంకర శబ్దాలకు సుకుమా, ఆమె భర్త ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో తెలియక పిల్లలు ఏడుపు అందుకున్నారు. అందరూ కలిసి గుడిసె బయటికి పరిగెత్తారు. ఒకటే రోదనలు, చుట్టూ మంటలు, ఎరిగి పడుతున్న దుమ్ము, ధూళి, రాళ్లు. నాలుగడుగులు వేశాక సుకుమా కుటుంబం తలోదిక్కూ అయ్యింది. ఆప్పటికే ఆమె కుడిచెయ్యి కాలటంతో గుడిసెలకు దూరంగా పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయింది. తెలివి వచ్చేసరికి ఆస్పత్రిలో ఉంది.
      పేలుళ్ల వ్యవహారం అసెంబ్లీలో కూడా అలజడి సృష్టించింది. దానికి కారణమైన కాంట్రాక్టరు మీద కఠినచర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. అయితే పాలక పక్షం మంది బలం ముందు వాళ్ల నోళ్లు గెలవలేకపోయాయి. కానీ, కంటి తుడుపు చర్యగా ఘటన మీద విచారణ జరిపేందుకు కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలి. గాయపడిన వారిని, స్థానికుల్ని ఆ కమిటీ కలిసి వివరాలు అడిగి తెలుసుకుంది. 
      ఆ ప్రమాదంలో తన భర్తా బిడ్డల్ని కోల్పోయి సుకుమా అనాథగా మారింది. ఎక్కడికి వెళ్లాలో, ఏం చెయ్యాలో తెలియక పిచ్చిపట్టినట్టు పెద్దపెట్టున కేకలు పెట్టింది. ఆమెకు నిజంగానే పిచ్చి పట్టిందనుకుని మానసిక వైద్యశాలకు తరలించారు. 
      క్వారీ కంట్రాక్టరు ఓ మంత్రివర్యుని వియ్యంకుడికి బినామీ. అతని మీద ఈగ వాలడానికి కూడా వీల్లేదని, నివేదిక అలాగే తయారు చెయ్యాలని అధికారుల మీద ఒత్తిడి వచ్చింది. మసిపూసి మారేడుకాయ చేసిన రిపోర్టులో సంతకం చేస్తున్నప్పుడు నిజాయతీ కలిగిన ఓ అధికారి కంట నీరు సుళ్లు తిరిగింది.  
      ఏతావాతా నివేదిక తేల్చిందేంటంటే... మందుగుండు సామగ్రిని దూరంగానే గిడ్డంగిలో జాగ్రత్తగా నిల్వ చేశారు. కొంత మంది కూలీలు దాన్ని దొంగిలించి బయట అమ్ముకోవడానికి తమ గుడిసెల్లో దాచుకున్నారు. వంట చేసే సమయంలో నిప్పురవ్వలు ఎగిరిపడి ఈ ప్రమాదం జరిగింది. పేలుళ్లకు క్వారీ కాంట్రాక్టరు బాధ్యుడు కాదు. గట్టిగా మాట్లాడితే ప్రభుత్వ సహాయానికి కూడా వారు అనర్హులు! 
      ఈ నివేదిక అసెంబ్లీలో చర్చకు వచ్చింది. కొత్తగా పార్టీ మారి కొద్దిలో మంత్రి అవకాశం కోల్పోయిన ఓ ఎమ్మెల్యే ఈసారైనా అదృష్టం వరించాలని ఆరాటపడుతూ... ‘‘తమకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా మన మంత్రిగారిని, ఆయన బావమరిదిని ఈ పేలుళ్లలోకి లాగాలని ప్రతిపక్షాలు చూశాయి. కానీ, అసలు నిజం బయటపడింది. నిజం ఎప్పుడూ నిప్పులాంటిది. దాన్ని ఎవ్వరూ దాచిపెట్టలేరు. మందుగుండు సామగ్రిని దొంగిలించి అమ్ముకుందామనుకున్న విశ్వాస ఘాతకులకు భగవంతుడు సరైన శిక్ష విధించాడు’’ అని గొంతు చించుకుని మాట్లాడాడు. అసెంబ్లీ బల్లలు దడదడ మని పెద్దపెట్టున మోగాయి.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావుbal bharatam